Saturday, 22 August 2020

తెలుగు పలుకు

 తెలుగు పలుకు                                            


    మందార మకరంద మాధుర్యమొలుకు నా తెలుగు పలుకు

    కర్పూరపరాగ పాండు రుచి పూరితము నా తెలుగు పలుకు

    స్ఫురదరుణాంశు రాగ రంజితము నా తెలుగు పలుకు

    భారతీదేవి కెంజేతి చిలుక పలుకు నా తెలుగు పలుకు

 

    పదబంధ సద్గుణాస్పద బుధశబ్ధభ్రాజి నా తెలుగు పలుకు

    అలతి అలతి హృద్యపదలలిత నా తెలుగు పలుకు

    లలిత శిరీషపుష్ప మృదువునకు సాటి నా తెలుగు పలుకు

    ఆటవెలదుల తోడ గుద్ది బుద్ధులుచెప్పు నా తెలుగు పలుకు

 

    అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫురిత నా తెలుగు పలుకు

    ఆకులందున అణగి కూయు కోయిలకూత నా తెలుగు పలుకు

    తుంగభద్రా సముతుంగ రావము తోడ శ్రుతిగల్పు నా తెలుగు పలుకు

    కోనేటిరాయని పొడగన్న పద ప్రతిభ నా తెలుగు పలుకు

 

    మైలమభీముని ఖడ్గమునకు పదును నా తెలుగు పలుకు

    కోటిరతనాల మృదు వీణారవము నా తెలుగు పలుకు

    చిక్కనిపాలపై మిసిమి మీగడ తరక నా తెలుగు పలుకు

    తేటవేలుపులేటి పన్నీటిబొట్టు నా తెలుగు పలుకు

 

    కందువ మాటల పొందు వీనులకు విందు నా తెలుగు పలుకు

    విరిపొట్లమును విప్ప గుప్పుమనియెడు తావి నా తెలుగు పలుకు 

    కులుకులొలికే ఎంకి  కలికితనముల తళుకు నా తెలుగు పలుకు

    కదిలి కదిలించి మున్ముందునకు నడుపు నా తెలుగు పలుకు

 

    కృష్ణరాయలకీర్తి కమృతత్వము నొసగె నా తెలుగు పలుకు

    రాణ్మహేoద్రపురిన్ రాణకెక్కగజేసె నా తెలుగు పలుకు

    మనుమసిద్ధి గద్దె  కదలనీయక నిల్పె నా తెలుగు పలుకు

    మల్కిభరామునిపేరు చరిత పుటలను నిల్పె నా తెలుగు పలుకు

     

    తెలుగు వెలుగుకవితలెల్ల - వినుచు నానందించు

    శ్రోతలకు నివియె మా - వందనములుఅభివందనములు.


                ***

                    

                                    Telugu Paluku


No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...