అక్షతలు
అక్షతలు అంటే అక్షింతలు. అక్షింతలు తెలియని హిందువులుండరు.
పండుగలలో, శుభకార్యాల్లో, దేవాలయాల్లో, పూజల్లో, వ్రతాల్లో
ఆశీర్వాదంతీసుకునే పిన్నల తలపై పెద్దలు అక్షింతలువేసి దీవిస్తారు. పూజాసమయంలో యేలోటులేకుండా పూజచేయడానికి అక్షతలను సమర్పిస్తారు. అంటే, లభ్యంకాని పూజావస్తువులకుబదులు అక్షతలువేస్తే
సరిపోతుందని పెద్దలుచెబుతారు. ఉదాహరణకు బంగారు దేవునికి
సమర్పించలేనివారు, బంగారంసమర్పిస్తున్నామని అక్షతలు దైవంపై
వేస్తారు. అదే,"హిరణ్యం సమర్పయామి" అని అక్షతలు వేస్తారు, సరిపోతుంది.
అంతేగాదు, అన్నంనుండే జీవులు ఉత్పన్నమౌతాయని
భగవత్గీత చెబుతున్నది. కనుక మనకుఉత్పన్న మూలమైన అన్నము బియ్యమే. అబియ్యమే భగవంతునకు సమర్పించడమంటే మమ్మల్నిమేము నీకు
సమర్పించికుంటున్నాం, శరణాగతిపొందుతున్నాం, అన్న అర్థం వస్తున్నది. ఇదే గొప్పసమర్పణ. ఇంత ఆర్థం భగవంతునివైపు అక్షతలువేయడంలోవుంది.
క్షతముకానటువంటి బియ్యమే అక్షతలు. అంటే విరగనిబియ్యపుగింజలనే
అక్షతలుగా వాడాలి. వాటికి పసుపు లేక కుంకుమను
కొద్దిపాటినీళ్ళుగానీ ఆవునెయ్యిలేక నువ్వులనూనెవేసికలిపి అక్షతలు తయారుచేసుకుంటాము.
వాటిని శుభకార్యాలలో పెద్దలు పెద్దలు, పిన్నల తల(బ్రహ్మరంధ్రం)పై వేసి సుమంగళీభవ! ఆయుష్మాన్‍భవ! శుభమస్తు! అని
దీవిస్తారు. అక్షింతలలో పసుపుకలిసి వుండటంతో దీవించేవారి
జబ్బులు, ముఖ్యంగా చర్మవ్యాధులు అవీ చేతికుండే
చర్మవ్యాధుదులను పసుపు అడ్డుకుని దీవెనలుపొందే వారికి ప్రాకకుండా చేస్తుంది.
బియ్యం వాడటానికి యింకోగొప్ప కారణమున్నది. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహశాంతికి
ఒక్కోధాన్యం, దానంగా జ్యోతిషశాస్త్రజ్ఞులు చెప్పారు. ఆక్రమంలో చంద్రునికి బియ్యం చెప్పబడింది. "మనఃకారకో ఇతి చంద్రః" చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. మనస్సు,
బుద్ధి, వ్యసనములకు కారకుడు. కనుక బియ్యం తలపైని బ్రహ్మరంద్రంపై వేయడంద్వారా మనోధర్మాలు క్రమబద్ధమై
నియంత్రణలోవుంటాయి. విరగని బియ్యం వేస్తారుగనుక దీవెనలు
సంపూర్ణంగా నిండునూరేళ్ళు యేలోటులేకుండా హాయిగావుండాలన్న సందేశం
అక్షతల్లోదాగివుంది. ఇక పసుపు బృహస్పతికిప్రతీక గనుక అది
విద్యాబుద్ధిప్రదాయిని.
అక్షతలువేసి దీవించడంలో మరోరహస్యం కూడా దాగివుంది. మనదేహంలో ఒకవిధమైన
విద్యుత్కేంద్రాలు యిరువదినాలుగున్నాయి. వాటిలో శిరస్సులోని
బ్రహ్మరంధ్రస్థానం అతిముఖ్యమైనది. అదిశక్తి ఉత్పత్తికి
ప్రసారానికి ప్రధానకేంద్రం. అక్షింతలు వేసేవారు పెద్దలు
శ్రేష్ఠులు, గనుక వారిలో యెక్కువగా, సాత్వికశక్తి
వుంటుంది. ఒకవేళ తామస రజోశక్తులుంటే, పసుపుదాన్ని
అడ్డుకుంటుంది. అందువల్ల
సాత్వికవిద్యుచ్ఛక్తి అక్షింతలువేయించుకునే పిన్నలలలోకి ప్రవహించి వారిలో
ముందున్నశక్తిని ఉత్తేజితంచేసి, వారుజీవితంలో సక్రమంగా
అభివృద్ధిచెందటానికి తోడ్పడుతుంది.
పెద్దలు
అక్షింతలువేసి దీవించే సమయంలో పిన్నలు వంగి పెద్దల పాదములకు తలనుఆనించి మ్రొక్కడం మరింతశ్రేయోదాయకం. ఎందుకంటే
మనిషిలో అయస్కాంతశక్తికూడావుంది. దానికి ఉత్తరధ్రువం తల.
దక్షిణద్రువం పాదాలు. పిన్నవారి ఉత్తరద్రువమైన
తల, పెద్దల దక్షిణద్రువమైన పాదాలకు సోకినపుడు, ఆకర్షణప్రక్రియద్వారా పిన్నలలోనికి పెద్దల సాత్వికశక్తి ధారాళంగా ప్రసారమై
క్షేమకారకమౌతుంది.
ఇక
వివాహసందర్భంలో అక్షతలదీవెనలతోపాటు తలంబ్రాలు(తలప్రాలు)అంటే తలలపై వధూవరులు బియ్యంపోసుకునే, తప్పనిసరి
ఆచారం హిందువులలో వుంది. ప్రాలు అంటే బియ్యంగనుక యివీ
ఒకరకంగా అక్షతలే, లేదంటే యివి బియ్యంమాత్రమే. వధువుచేతిని దర్భలతోతుడిచి
దోసిలిలో రెండుమార్లుగా బియ్యంపోసి పైన కొద్దిగా పాలనుచల్లి, తలంబ్రాలను పోయిస్తారు. అదేవిధంగా వరునిచేతకూడా
తలంబ్రాలు పోయిస్తారు. ఇందులో కన్య, వరునివంశాన్నివృద్ధిచేయాలని,
తద్వారా యిరువంశాలు తరించాలని, తలబ్రాలవలెనే,
సమృద్ధిగా ధనధాన్యాలతో తులతూగాలనీ, శాంతి,
పుష్ఠి, సంతోషాలతో యేవిఘ్నాలు లేకుండా
సహజీవనంచేయాలన్న సందేశం యిందులో యిమిడివుందని విబుధులు చెబుతున్నారు.
అక్షింతలు
అనేమాట,
మరోవిధంగా విపరీతార్థంలో కూడా తరచుగా వాడటం తెలుగువారికి పరిపాటి.
ఎవరి తప్పునైనా ఎత్తిచూపి దండించడం, లేదా
మందలించడాన్ని అక్షింతలువేయడం అని అంటుంటారు. అంతగా
అక్షింతలనేమాట తెలుగువారి నోళ్ళలో మెదలుతూవుంటుంది మరి.