శ్రీకృష్ణదేవరాయలు
(రాయలు పట్టభిషిక్తుడై 500 సంవత్సరములైన సందర్భందా జరిపిన కవిసమ్మేలనంలో చదివిన పద్యాలు)
తే:గీ. గడచి గండముల్ ధీరత గద్దెనెక్కి
ఐదువందల యేండ్లయ్యె నని గణించి
యెరిగి ఈ గడ్డ పౌరుషం బీవటంచు
రహి జరుపరె పండువ కృష్ణరాయభూప.
సీ. కన్నబిడ్డలవోలె కాపాడి నీ ప్రజన్
మేటిరాజుగ ధర మెలగినావు
రణవిద్యలందున రాటుదేలిన ఘన
వీరావతారమై వెలసినావు
రత్నాలనంగళ్ళ రాసులుగాబోసి
అమ్మగా సిరులతో యలరినావు
అని పరాజితులైన అన్యరాజసతుల
పరువును గాపాడి పంపినావు
తే:గీ. అష్టదిగ్గజ కవుల నిష్టతోడ
నిలిపి సాహిత్య శారదన్ గొలిచినావు
శిలల శిల్పాలు జెక్కించి నిలిపినావు
కృష్నదేవరాయా! నీకు కేలుమోడ్తు.
ఉ. రాజులు రాజ్యముల్ గలుగ రాజసమేర్పడ యేలవచ్చు నా
రాజులవల్ల భూప్రజలు రంజనమై సుఖియించి యుండవ
చ్చా జనమే యెఱుంగు, నదియంతటితోసరి, కృష్ణరాణ్డృపా
రాజిత సుప్రబంధముల రవ్వలు రువ్విన మీర లక్షరుల్
కం. బహుభాషల కవియయ్యును
అహహా తెలుగే తగునని యల్లితివి గదా!
మహిమాన్విత కావ్యంబును
సుహృజ్జనస్తుత! తెలుగు సూరివనంగన్
కం. మను వసుచరిత్రముల చెం
తన మీ ఆముక్తమాల్యద వెలుంగన్ మీ
ఘనకీర్తియు ప్రాభవమున్
మనును గదా! కృష్ణరాయ! మహి యక్షమై.
***
Search: Sree Krishnadevarayalu / Rayalu