Showing posts with label Molatradu. Show all posts
Showing posts with label Molatradu. Show all posts

Monday, 31 October 2022

మొలత్రాడు,Molatradu

 

మొలత్రాడు




 హిందూసాంప్రదాయంలో మొలత్రాడుకట్టుకోవడం ఒకమంచి ఆచారం. "మొలత్రాడు లేదంటే మగాడేకాడు. వడ్డాణం పెట్టంది ఆడదేకాదు" అనే సామెత వుండనేఉంది. పిల్లలకుమాత్రం ఆడమగ అన్నతేడాలేకుండా అందరికి మొలత్రాడుకడతారు. ఆడపిల్లలకు మునుపు సిగ్గుబిళ్ళలు కట్టేవారు. వాటికాధారంగా మొలత్రాదు ఉపయోగపడేది. పెద్దలలో మగవారు తప్పక మొలత్రాడు కడతారు. వారివారి స్తోమతనుబట్టి. బంగారు,వెండి, ప్లాటినం, దారంతో తయారుచేసిన సన్ననిత్రాడును నడుముకు మొలత్రాడుగా కడతారు. దారంతోచెసినవిమాత్రం నల్లని లేక ఎఱ్ఱని మొలత్రాడును ఉపయోగిస్తారు. బాలకృష్ణుని వర్ణిస్తూ..

         ఆ:వె: చేత వెన్నముద్ద  చెంగల్వపూదండ
                    బంగరు మొలతాడు పట్టుదట్టి
                   సందెతాయెతులును సరిమువ్వగజ్జెలు
                  చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు
---------- అన్నారు.

 కలవారు కాబట్టి కృష్ణునకు పసిడిమొలత్రాదు కట్టారు. సర్వసామాన్యంగా సంపన్నులు చలువజేస్తుందిగాబట్టి వెండిమొలత్రాడు కడతారు. మొలత్రాడు మార్చవలసివస్తే ముందుగా క్రొత్తదిగట్టి తర్వాత పాతది తీసేస్తారు. అయితే ధర్మసింధువు ..

                శ్లో: మౌంజీం యజ్ఞోపవీతంచ  నవదండంచ ధారయేత్

                      అజినం కటిసూత్రంచ నవవస్త్రం  తదైవచ: -- అంటున్నది

  అంటే దర్భత్రాడును, జంధ్యాన్ని, ఊతగావాడే మోదుగకఱ్ఱను, జింకచర్మాన్ని,మొలత్రాడును, వస్త్రాన్ని ఏటా విధిగా క్రొత్తవి ధరించాలి. అని ధర్మసింధువులో ఉన్నది.  మగవారు మొలత్రాడును భార్య చనిపోయినప్పుడు తీసేస్తారు. లేదా మగమనిషి చనిపోయినతర్వాత మొలత్రాడు త్రెంచేసి కాల్పోబూడ్పో చేస్తారు. చనిపోయినవ్యక్తి బంధరహితంగా వెళ్ళిపోవాలని దీనర్థం. హిందూసాంప్రదాయంప్రకారం సచేలస్నానమే చేయాలి. కనీసం గోచిమాత్రమైనా లేకుండా స్నానం చేయరాదు. ఎప్పుడైనా గుడ్డలులేకుండా స్నానం చేయవలసివస్తే మొలత్రాడు వుండటంవల్ల దోషమంటదు. అది సచేలస్నానమే ఔతుంది. మొలత్రాడు ధరించటానికి, బుధ, ఆదివారాలు మంచివి. మంగళ శుక్రవారాలు ధరింపరాదు.

బొడ్డుతాడు (stem cell) చికిత్స అన్నదొకటున్నది. శిషువు జన్మించినపుడు బొడ్డుకోసి తల్లిని బిడ్డను వేరుచేస్తారు. అప్పుడు బొడ్డుతాడు తుంటను లేదా దాని రక్తబిందువును పసరుమందుతో కలిపి వెండితాయత్తులోవుంచి బిడ్డమొలత్రాడుకు కడతారు. అది బయటకుతీసి ఆబిడ్డకు భవిషత్తులో వచ్చు కాలేయవ్యాధులు, క్యాన్సరువ్యాధుల వంటి భయంకరవ్యాధులు నయంచేయటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడైతే stem cell Banks ఉన్నాయి. నైట్రస్ఆక్సయిడ్ వాయువు నుపయోగించి అతిసీతల వాతావరణంలో బొడ్డుతాడుతుంటను భద్రపరచి అవసరమైనపుడు యీ stem cells తో వైద్యంచేస్తున్నారు. ఇది చాలా ఖర్చుతోకూడుకున్నపని. మొలతాడు తాయెత్తుతోనే పూర్వీకులు యీపనిని అతిసులువుగా నెరవేర్చేవారు.

 

మొలత్రాడు దేహాన్ని రెండుభాగాలుగా విభజిస్తున్నది. పైభాగం దేవతాస్థానం. క్రిందిది రాక్షసస్థానం. పైభాగం దైవకైంకర్యాలకు, క్రిందిభాగం సంతానోత్పత్తికి, ప్రాపంచికకార్యనిర్వహనకు ఉపయోగపడాలన్నారు పెద్దలు. అందుకే పైభాగాలను బంగారుతో మొలభాగాన్ని (క్రిందిభాగాన్ని) వెండితో అలంకరించుకుంటారు. వెండిమొలత్రాడు అందుకేశ్రేష్టం.

మొలత్రాడు ధరించకపోవడం వల్ల నష్టమున్నదో లేదో తెలియదుగానీ ధరిస్తే మాత్రం చాలాలాభాలే వున్నాయి. కనుక ధరించడం ధరించకపోవడం ఎవరియిష్టం వారిది.

 పాముకరచినా, తేలుకుట్టినా విషం రక్తంద్వార గుండెకు తలకు ఎక్కకుండా, కరచిన లేక కుట్టిచోటికి పైభాగాన కట్టివేయడానికి వెంటనే అందుబాటులోవుండేతాడు మొలత్రాడే. పంచగానీ లుంగీగానీ జారిపోకుండా మొలత్రాడుక్రిందికి దోపుకోవచ్చు. ఇంట్లోవున్నప్పుడు బెల్టుపని మొలతాడు చేస్తుంది. భోజనప్రియులు మితిమీరితినకుండా అదుపుచేస్తుంది. తద్వారా జీర్ణప్రక్రియకు తోడ్పడుతుంది. ఆడవారిలో వడ్డాణం యిందుకు ఉపయోగపడుతుంది. అంతేగాదు బరువుపెరగడాన్ని తెలియజేసి జాగ్రత్తపడమని హెచ్చరిస్తుంది. బానపొట్ట రాకుండ అడ్డుకుంటుంది. నల్లమొలత్రాడు చెడుదృష్టి తగలనీదు. అందుకే పిల్లల మొలత్రాడుకు రంగురంగుపూసలు యెక్కిస్తారు. జాతకరీత్యా గ్రహదోష నివారణకు తాయెత్తులుకట్టడానికి ఆధారంగా కూడా మొలత్రాడు ఉపయోగపడుతుంది. అధికవేడిని గ్రహించి మొలత్రాడు దేహతాపాన్ని శాంతింపజేస్తుంది. అందుకే ఆడపిల్లల మెడిమ పైభాగాన నల్లదారం కడతారు. మొలత్రాడు మగవారిలోనైతే వృషణాలు వేడెక్కకుండాజేసి వీర్యకణాలసంఖ్య తగ్గకుండాచూసి సంతానోత్పత్తిసమస్యలు రాకుడా కాపాడుతుంది. వెన్నెముకకు support గా  వుంటుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరుస్తుంది. ఎముకలకు, కండరాలకు పటుత్వాన్నిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. హెర్నియా వంటివాటిని రానివ్వదు. పురుషాంగాన్ని సమతుల్యంగా వృద్ధిచెందేట్లు చేస్తుంది. నకారాత్మక శక్తి(negative energy)ని అడ్డుకుంటుంది. సకారాత్మకశక్తి (positive energy)ని ఆహ్వానిస్తుంది. మొలత్రాడువల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయంటే ఆశ్చర్యమేస్తుందికధా! వీటిని శాస్త్రజ్ఞులు కూడా ఆమోదిస్తున్నారు. కనుక నమ్మాలి.                                

   

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...