Showing posts with label కలశం. Show all posts
Showing posts with label కలశం. Show all posts

Tuesday, 20 December 2022

కలశం

 


కలశం

 


కలశం హిందువులకొక శుభచిహ్నం. ఆంధ్రప్రదేశ్ చిహ్నం కూడా కలశమే. రాగి వెండి లేక మట్టికుండను కలశంగావాడుతారు. కలశం ఒకపూజావస్తువు. అది దేవతల ఆవాసం.

 కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |

కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |

ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |

 అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |

ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |

 అనగా కలశముఖంలో విష్ణువు కంఠభాగంలో శివుడు, మూలంలో బ్రహ్మ, మధ్యభాగంలో మాతృగణాలు ఆశీనమై యున్న్రు. కలశంలోని జలాల్లో సముద్రాలు.  సప్తద్వీపసహిత భూమి, చతుర్వేదాలు, వేదాంగాలతోసహా సమస్తదేవాతాగణాలు ఆసీనులై వున్నారు. సకలపాపాలనూ నిర్మూలించడానికి సిద్ధంగావున్నారని భావనచేసి పూజకుపక్రమిస్తారు. ఋగ్వేదంప్రకారం సమృద్ధి మరియు జీవితమూలాన్ని సూచిస్తుంది కలశం.

 కలశంలో శుద్ధజలంపోసి చుట్టూ మామిడాకులు లేక తమలపాకులూ పెట్టాలి. ఆకులతొడిమలు కలశంలోని నీటిని తాకుతూ వుండాలి. అందువల్ల ఆకులు వాడిపోవు. కలశజలాలలో అక్షింతలు పుష్పాలు నాణాలు వుంటే రత్నాలు బంగారు నగలూ వేయవచ్చు. తర్వాత పైన కొబ్బరికాయనుంచాలి.కొబ్బరికాయపై ఎఱ్ఱటి క్రొత్తరవికగుడ్డను పొట్లంవలెచుట్టి టోపీగా వుంచాలి. కలశానికి దారాలుకూడా కొందరు చుట్టుకుంటారు. కలశానికి గంధం పసుపుకుంకుమలు పూలమాల

 ధరింపజేసి  పీటపై బియ్యం పరచి బియ్యంపై కలశాన్ని స్థాపిస్తారు. కలశం లోహమునదైనా మట్టిదైనా అదిభూతత్త్వానికి సంకేతం. అందులోనినీరు జలతత్త్వానికి సంకేతం. నీటికీ కొబ్బరికాయకూ మధ్యనున్న ఖాళీస్థలం ఆకాశతత్త్వానికి సంకేతం. చదివే మంత్రం వాయుజనితం. అది వాయుతత్త్వానికి ప్రతీక. కలశంముందు వెలిగించే దీపం  అగ్నితత్త్వానికి ప్రతీక. అందువలన కలశపూజ పంచభూతములకూ ఒకేసారి చేసే పూజగా భావిస్తారు.

 మరోవిశేషమేమంటే కలశం చేతులలోధరించి వేదమంత్రాలు పఠిస్తూ స్వాములకూ పెద్దవారికి స్వాగతంపలుకుతారు. వేదికవరకు వారి ముందునడుస్తారు. అలాచేస్తే వారిని గొప్పగా గౌరవించినట్లౌతుంది.

 మానవజీవితం నీటిఘటమంటారు. అందుకే కలశాన్ని మానవజీవితంతో పోలుస్తారు. ఆకులు ప్రకృతికి ప్రతీక. కొబ్బరికాయ సమస్తవిశ్వానికి మరోరూపం. కలశానికి చుట్టినదారాలు ప్రేమతో ఏర్పడ్డ  సత్సంబంధాలు. అందుకే వ్రత, పర్వ, గృహప్రవేశాదిశుభసందర్భాలలో కలశపూజచేస్తారు. ముఖ్యంగా శ్రావణమాసం పున్నమికిముందువచ్చే శుక్రవారం లక్ష్మీపూజలో కలశపూజచేయడం ఆనవాయితీ. అట్లని వేరేరోజులలో చేయరాదనికాదు. గురు శుక్రవారాలలో జరుపుకోవచ్చు. శ్రావణమాసంలోచేసే కలశసహిత లక్ష్మీపూజ అధికఫలదాయకమని చెబుతారు. ఈదినాలలో లక్ష్మీదేవిని

 ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:

ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ:

  అనే మంత్రాలతో పూజిస్తే లక్ష్మీకటాక్షం మిక్కుటంగాకలిగి శుభాలుచేకూరుతాయని నమ్ముతారు.

 శ్రీహరి క్షీరసముద్రంలో శేషశాయియై ఉంటాడు. ఆయననాభికమలమునుండి బ్రహ్మజనించి సృష్టిప్రారంభిస్తాడు. అప్పుడున్నది కేవలం జలంమ్మాత్రమే. ఆ జలంతో సమానం కలశజలమని విశ్వసిస్తారు. అంటే సృష్ట్యాదిననున్న మహత్తరప్రశాంతస్థితి కలశపూజవల్ల కలుగుతుందని పురోహితభావన. సురాసురుల సముద్రమథనంలో అంతిమంగా ధన్వంతరి అమృతకలశంతో ఉద్భవిస్తాడు. ఆ అమృతకలశమే మనం స్థాపించుకున్న యీకలశమని భావిస్తే "యద్భావం తద్భవతి" అన్న సూత్రానుసారం కలశజలం తీర్థంగాసేవించడంవల్ల మనకూ అమృతత్వం సిద్ధిస్తుంది. అనగా దీర్ఘాయువు సంప్రాప్తమౌతుంది.

 కలశపూజానంతరం వచ్చే శనివారంనాడు కలశజలాన్ని తీత్థంగాసేవించి మిగిలినజలాన్నీ యితర పూజావస్తువులైన పూలు పసుపుకుంకుమలు అక్షతలు పారేనదీజలాలలో నిమజ్జనంచేయాలి. కొబ్బరికాయను దానంగాయివ్వచ్చు. లేదా కొబ్బరిని ప్రసాదంగా స్వీకరించవచ్చు.   నదిలో నిమజ్జనమైనా చేయవచ్చు.

ఈదీ కలశ ప్రాశస్త్యం

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...