Tuesday, 3 September 2024

శఠకోపం

 

శఠకోపం

                            

 శఠకోపమును శఠగోప్యము శఠారి అనికూడా పిలుస్తారు. ముఖ్యంగా వైష్ణవాలయాలలో తీర్థమిచ్చినతర్వాత శఠకోపం తలకు తగిలిస్తారు పూజారి. అందుకే తీర్థసేవనం తర్వాత చేతిని తలకు రుద్దుకోగూడదంటారు. ఎందుకంటే, యెంగిలియైన తీర్థం  పవిత్రమైన శఠకోపానికి తగలరాదు. శఠకోపం పైభాగాన భగవంతుని పాదుకలుంటాయి. కనుక వాటిని మైలపరచడం పాపం. అందుకే అలాచెబుతారు.


  ఈశఠకోపం వెనుక ఒకమహనీయుని జీవితచరిత్ర వున్నది. అదేమిటో తెలుసుకుందాం. శివమహాభక్తులను నయనార్లంటారు. అలాగే విష్ణుమహాభక్తులను ఆళ్వార్లంటారు. వారు పన్న్రెండుగురున్నారు. వారిలో నమ్మాళ్వారొకరు. నమ్మాళ్వారంటే మనఆళ్వారు. మనకు సన్నిహితుడైన విష్ణుభక్తుడని అర్థం. ఆయన్ను హరిసేనానాయకుడైన విష్వక్సేనుని అవతారమని నమ్ముతారు. ఆయన మొదటిపేరు "మారన్". శఠగోపన్ అనికూడా ఆయన్ను పిలిచేవారు. ఈయన పేరుమీదనే శఠకోపం వచ్చింది. నమ్మాళ్వార్ తలపైదాల్చిన విష్ణుపాదుకలే శఠకోపమని వైష్ణవులు భావిస్తారు. మరికొందరు ఆళ్వార్లందరూ శ్రీవారి పాదుకల వంటివారేనని విశ్వసిస్తారు. నమ్మాళ్వార్ నాలుగు రచనలు, పాశురాలన్న పేరున గ్రంథస్థం చేశారు. వాటిని తమిళవేదాలుగా శ్రీవైష్ణవులు గుర్తిస్తారు. నల్లాని వేంకట రాఘవాచార్యులు "శఠకోప గీతామృతము" అన్న పేరుతో ద్రవిడ (తమిళ) వేదాలను పద్యగ్రంథంగా తెనిగించారు.

 శఠకోపమన్న పదానికి ఒకమంచి అర్థమున్నది. "శఠానాం బుద్ధిదూషణం" అన్న సంస్కృతవాక్యాన్ని బట్టిచూస్తే, శఠులు అంటే వంచకులు. వంచకుల మాటలను తనవాక్కులతో ఖండించువారు శఠకోపులని అర్థం. వీరే స్వామిపాదుకలకు ప్రతీకలైన ఆళ్వార్లు. ఆస్వామి పాదుకలే శఠకోపంపై ముద్రించి యున్నవి. శఠకోపం తలకు పూజారి తగిలించగానే భక్తుడు దేవా! అరిషడ్వర్గాలకు నన్ను దూరంగా వుంచుమని ప్రార్థించాలి. అప్పుడు ఒక తెలియని ఆత్మానుభూతి గలిగి, చెడుగుణాలు తొలగి స్వచ్ఛమైన జీవితం గడపగలిగే శక్తి లభిస్తుంది. ఇది ఉత్తమమైన ప్రార్థన. సామాన్యంగా జనులు వారి కోరికలు భగవంతునికి విన్నవించి, తీర్చమని వేడుకుంటారు. అట్టివారి కోరికలూ నెరవేరుతాయని నమ్ముతారు. "యద్భావం తద్భవతి" అన్న సూక్తి వుండనేవున్నదిగదా!

 శఠకోపం ముఖ్యంగా వెండితో చేయిస్తారు. రాగి, కంచుతోకూడా చేసినవి, కొన్ని దేవాలయలయాలో కనిపిస్తాయి. శఠకోపలోహం తలపై తగలగానే, మనిషిలోని విద్యుత్తులో, ఒకవిధమైన విద్యుదావేశం జరిగి అవసరంలేని అధికవిద్యుత్తు బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా మనిషిలోని ఆందోళన, ఆవేశం తగ్గి, శాంతినెలకుంటుం దని శాస్త్రంతెలిసిన పెద్దలు తెలియజేస్తున్నారు.

 నెత్తిన శఠకోపం పెట్టినాడంటే నమ్మించి మోసగించాడని, వ్యంగార్థప్రయోగం లోకంలోవుంది. ఇది వ్యంగమే. నిజార్థంలో శఠకోపం దేవాలయంలో పెట్టించుకోవడం యెంతో శుభకరం. 

 ❤❤❤ 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...