Showing posts with label Pasupukumkumalu. Show all posts
Showing posts with label Pasupukumkumalu. Show all posts

Sunday, 17 July 2022

పసుపు కుంకుమలు-గాజులు మెట్టెలు

 

పసుపుకుంకుమలు-గాజులు మెట్టెలు


పసుపుకుంకుమలలేని శుభకార్యాలు హిందువులకసలేవుండవు. ముత్తైదువకు(సుమంగళికి)గుర్తు  యీపసుపుకుంకుమలు. ఆహ్వానం పలకాలంటే బొట్టుపెట్టి పిలవడఅనేది ఒకసామెతగా నిలచి పోయింది. మహిళలలకు కుంకుమబొట్టుపెట్టి శుభకార్యాలకు పిలవడం సత్సాంప్రదాయం. పెళ్ళిపత్రికలమూలలకు పసుపుకుంకుమలురాసి భగవంతునికి సమర్పించినతర్వాతే వాటిని పిలువవలసినవారికిస్తారు. అలా పిలవడంవల్ల ఆపిలుపు సాక్షాత్తు లక్ష్మీదేవిపిలిచినట్లుగా భావిస్తారు. సామాన్యంగా వ్రతాలకు పిలిచిన ముత్తైదువులకు (పేరంటాళ్ళకు) తొలుత కుంకుమబొట్టుపెట్టి కాళ్ళకు పసుపురాస్తారు. ఇంట్లో స్త్రీలుకూడా తొలుత కుంకుమబొట్టు పెట్టుకొని తర్వాతే కాళ్ళకు పసుపు రాసుకుంటారు. పండుగనాటి పూజల్లో మగవారుసైతం కుంకుమబొట్టు పెట్టుకుంటారు. పెండ్లిండ్లలో వధువుకు పసుపురాసి మంగళస్నానం చేయిస్తారు. చాలాకుటుంబాలు పసుపునీళలోతడిపి ఆరేసిన నూతన ధవళవస్త్రాలే వధూవరులు ధరించి పెళ్ళిపీటలమీద కూర్చుంటారు. మిగిలిన క్రొత్తబట్టలకు సైతం కొసలలో పసుపురాసి వాడుకుంటారు. అత్తవారింటికి బిడ్డనుసాగనంపేటప్పుడు చీరసారెలు పెడతారు. వాటితోపాటే పసుపుకుంకుమలు యివ్వడం తప్పనిసరి,  పూజల్లో తొలిపూజ పసుపుగణపతికిచేసి తర్వాత ఇష్టదైవాన్ని పూజిస్తారు. పసుపునీళ్ళుచల్లితే యేవస్తువైనా అపవిత్రతనువదలి పవిత్రతను సంతరించుకుంటుందన్నది పెద్దలమాట. పెళ్ళిసంబరాల ప్రారంభంలో రోలురోకలికి పసుపుకుంకుమలతో పూజచేసి, మిగతా కార్యాలకు కావలసిన పసిపుకోసం పసుపుకొమ్ములు దంచుతారు. కొందరు పెళ్ళివేడుకలకు నాందిగా ఒకకొయ్యకు పసుపుకుంకుమలురాసి, పూజచేసి ఆకొయ్యను  నాటుకుంటారు. తొలుత పసుపుతాడు కమర్చిన తాళినే వరుడు వధువుకు కడతాడు. తర్వాతే బంగారుగొలుసుకో నల్లపూసలహారానికో మార్చు కుంటారు. అంతెందుకూ, ఏకారణంగా నైనా బంగారుతాళి సమయానికి లభ్యంకాకపోతే, పసుపుకొమ్ము తాళిబొట్టుకుమారుగా ఉపయోగించుకుంటారు. అంటే పసుపుకొమ్ము బంగారుతో సమానమన్నమాట. పెండ్లిలో తల్లిదండ్రులు కుమార్తెకు కానుకగా యిచ్చే భూమి, నగలు, పైకం మొదలైనవి పసుపుకుంకుమలకిచ్చినవిగా చెప్పుకుంటారు. 

హైందవుల ఇళ్ళలో సింహద్వారానికి తప్పక గడపవుంటుంది. (లోపలిగదులకు ఇప్పుడు గడపలుపెట్టడం మానేశారు) సింహద్వారపుగడప భూమ్యాకాశాలకు మధ్యరేఖగా భావించి పసుపురాసి,  కుంకుమబొట్లు పెడతారు. "గడపలేనిగృహం కడుపులేనిదేహం” అన్నసామెత వుండనేవున్నది.రోజూ చేయకపోయినా  పండుగపూట గడపపూజ హిందువులు తప్పకచేస్తారు.  ఇంటిముందుచల్లే కళ్ళాపిలోగూడా గోమయంతోపాటు పసుపూ కలుపుతారు.

గడపను స్మార్తులు గౌరీదేవిగానూ, వైష్ణవులు లక్ష్మీదేవిగానూ భావిస్తారు. గడపను పసుపూకుంకుమలతో పూజించడంవల్ల, కన్యలకు త్వరగా వివాహమై మంచి మంచిభర్త లభిస్తాడని నమ్ముతారు.  ఇల్లాలు గడపకు పసుపుకుంకుమలతో పూజచేస్తే, పిల్లలు బుద్ధిమంతులై చెప్పినమాటవింటారని, కూతుళ్ళలాంటికోడళ్ళు , కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారని నమ్ముతారు. పసుపు గురువుకు ప్రతీక, కుంకుమ శుక్రునికి ప్రతీక.

గడపను పసుపుకుంకుమలతో పూజిస్తారుగనుక గురుశుక్రులు ప్రసన్నులై శుభాలు సమకూరుస్తారు. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా అడ్డుకుంటారు. గడప యీవిధంగా పూజార్హత కలిగియున్నందున గడపను కాలితోతొక్కకుండా దాటుకుంటారు.

 సుషుమ్ననాడి శరీరంలోని నాడులన్నింటినీ కలుపుకుంటూ, నొసటిని కేంద్రంగాచేసుకొని సంకేతాలను మెదడుకుచేరవేస్తూ, నిరంతరం చైతన్యవంతంగావుంటుంది. ఈసుషుమ్ననాడీకేంద్రమైన లలాటంపై కుకుమబొట్టు పెట్టుకోవడంద్వారా ఇతరులదృష్టి (దిష్టి) దోషాలని  కుంకుంబొట్టు అడ్డుకుంటుంది. అంతేగాకుండా సూర్యతాపంనుండికూడా యీబొట్టు రక్షిస్తుంది. లలాటంలో  పీనియల్ గ్రంథివుంటుంది. ఇది ఆరోగ్యకారకమైన హార్మోన్లనుత్పత్తి చేస్తుంది. దానిపై ఒత్తిడిని యీ లలాటకుంకుమబొట్టు తగ్గిస్తుంది. షట్చక్రాలలో ఆజ్ఞాచక్రం కనుబొమలమధ్య (భ్రూమధ్యము) న వుంటుంది. ఈచక్రంపై అధికారం సాధిస్తే, సాధకునికి అద్భుతశక్తులు లభిస్తాయి. ఈప్రాంతంలో కుంకుమబొట్టుపెట్టుకుంటే ఆజ్ఞాచక్రం ఉత్ప్రేరితమై సాధకునికి సహకరిస్తుంది. నుదుటిబొట్టు ప్రస్తావన పద్మ, ఆగ్నేయపురాణాలలోనూ, పరమేశ్వర సంహిత లోనూ వున్నది.

 పసుపుకుంకుమలు చేజారి క్రిందపడితే అశుభంగా పరిగణించవలసినపనిలేదు. అది భూదేవికి పసుపు కుంకుమ సమర్పించినట్లు భావించాలి. అలా క్రిందపడిన పసుపు కుంకుమలు తిరిగి వాడుకోకుండా చెట్లపై చల్లేయాలి. దేవాలయమెట్లకు పసుపురాసి కుంకుమబొట్లుపెట్టి మ్రొక్కితే , అదికూడా భూదేవిపూజగానే పరిగణిస్తారు.

 ఇవన్నీ హైందవుల మతవిశ్వాసాలైతే పసుపు క్రిమినాశినిగా వైద్యులు గుర్తించారు. పసుపునీళ్ళు కళ్ళాపిచల్లడం గడపకు పసుపురాయడంవల్ల క్రిములు, పురుగులు యింట్లోకి ప్రవేసించలేవు. దెబ్బలుతగిలినప్పుడు పసుపుపెట్టడానికి కారణం కూడా పసుపుకున్న క్రిమినాశకగుణమే. ఈకారణంగానే స్త్రీలు ముఖానికి వేసుకునే ముఖపట్టీ (ఫేస్ ప్యాక్)లలో పసుపువాడతారు. పసుపుతో నారింజపండు   తొక్కలపొడిగానీ, మంచిగంధంపొడిగానీ, పెసరపిండితోగానీ, వెన్నతోగానీ కలిపి, ముఖపట్టీ (ఫేస్ ప్యాక్) వేసుకుంటారు. ఇందువల్ల ముఖనికికాంతి వస్తుంది.  ఇక ఆయుర్వేదవైద్యంలో పసుపు ఉపయోగం చాలాయెక్కువే. మూగదెబ్బలుతగిలి విపరీతమైననొప్పి వాపువుంటే, పసుపు ఉడకబెట్టి గోరువెచ్చగా వుండగానే పైనపట్టిస్తే, తొందరగా నయమౌతుంది. పసుపు త్రిఫలచూర్ణం కలిపి సేవిస్తే రక్తహీనత నయమౌతుంది. నూతనవధువుకు గర్భాదానసమయంలో కలిగే రక్తస్రావానికి పసుపుకషాయం మంచిమందు. అడ్డసరంఆకులు పసుపు కలిపినూరి సేవిస్తే దగ్గు నయమౌతుంది. ఇవి మచ్చునకొకటిరెండు మాత్రమే. ఆయుర్వేద పసుపు యోగాలు వ్రాయాలంటే, అది మరో ఉద్గ్రంథమే ఔతుంది.

 ఆఖరుగామరోమాట. భర్తచనిపోతే భార్యతన ఐదోతనం (పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు పువ్వులు) కోల్పోవాలనడం సరికాదు. ఇది యేశాస్త్రంలోనూ చెప్పబడలేదు. కనుక పసుపుకుంకుమలు ఉంచుకోవడమా  తీసివేయడమా అన్నది ఆస్త్రీకే వదిలివేయాలిగానీ బలవంతంచేయరాదు. పంచకన్యలు లేక పంచమహాపతీవ్రతల గురించి చెప్పిన యీశ్లోకం చూడండండి

 

శ్లో: అహల్యా ద్రౌపది కుంతీ

       తారామండోదరీ తథా

        పంచకన్యా స్మరే నిత్యం

     మహాపాతక నాశినః


 అన్నారు. ఇందులో కుంతి, మండోదరి, తార వీళ్ళంతా భర్తనుపోగొట్టుకున్నవారే. అయినా పూజనీయులు. వీరి స్మరణవల్ల పాపాలన్నీ హరించుకపోపోతాయన్నారు. కనుక స్త్రీని యెప్పుడూ అపవిత్రగానూ, ఆమె దర్శనం అపశకునంగానూ భావించడం ముమ్మాటికీ తప్పే.  

 ఇక మెట్టెలు గాజులను గురించి కూడా తెలుసుకుందాం. పెళ్ళయిన మహిళకు తప్పనిసరిగా తాళి, పసుపుకుంకుమలతోపాటుగా మెట్టెలు, మట్టిగాజులు ధరింపజేసి అత్తింటివారు మాఇంటిమహలక్ష్మి అని ముచ్చటపడి పిలుచుకుంటారు. కాలిబొటనవ్రేలి ప్రక్కవ్రేలికి వెండితోచేసిన మెట్టెలు ధరింపజేస్తారు. పెళ్ళిలో ఒక ముఖ్యఘట్టంగా వధువుకు మెట్టెలు పెడతారు. వాళ్ళవాళ్ళ ఆచారం ప్రకారం కొందరిండ్లలో పుట్టింటివారు, ఇంకొందరియిళ్ళలో మేనమామ, మరికొందరి యిళ్ళలో వరుడే ధరింపజేస్తాడు. ఎవరు ధరింపజేసినా మెట్టెలవల్ల మేలేజరుగుతుందన్న విషయం గమనింపదగ్గది. పెండ్లిలో వరునికిగూడా మెట్టెలువేస్తారు, గానీ ఆతరువాత వాటిని తీసివేస్తున్నారు. మెట్టెలు వెండితో తయారుజేస్తారు గనుక, సకారాత్మక (పాజిటివ్) ఎనర్జీని అవి భూమినుండి గ్రహించి శరీరానికందిస్తాయి. మెట్టెలువేసిన వ్రేలు భాగంలో నరాల చివరలుంటాయిగనుక, అక్కడ ఒత్తిడిగలుగుతుంది. అందునా వ్రేలు నడిమిభాగం కూడా మెట్టెలవల్ల భూమికి అనుసంధింపబడి వుంటుందిగనుక, వ్రేలుమొత్తనికి ఒత్తిడి (ప్రెజర్) కలిగి, ఆక్యుప్రెజర్ వైద్యవిధానం ప్రకారం,  మెట్టెలవ్రేలినరం గర్భాశయానికి, గుండెకు సంబంధింపబడివుండటం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగేట్లుచేస్తుంది. అందువల్ల ఋతుక్రమం క్రమబద్దీకరింపబడుతుంది. గర్భాశయాన్ని దృఢంగావుండేట్ల్లు చేస్తుంది. సుఖప్రసవానికి, సంతానాభివృద్దికి తోడ్పడుతుంది. గర్భంధరించిన తర్వాత వచ్చే సమస్యలను నివారిస్తుంది. స్త్రీలకు వుండే అధిక కామవాంచ్ఛలను అదుపుజేస్తుంది. వెండివల్ల చర్మవ్యాధులు కూడా అరికట్టబడతాయి.  

 ఇకగాజుల విషయానికొస్తే, గాజుల రాపిడివల్ల చర్మానికి కొంత విద్యుత్ఛక్తి అంది రక్తపోటు క్రమబద్దీకరింపబడుతుంది. మణికట్టుపై గాజుల సున్నితమైన రాపిడివల్ల అక్కడి నరములు ఉత్తేజితమై ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. మట్టిగాజులు వేసుకోవడంవల్ల ఋతుసమయంలో స్త్రీశరీరంలో యేర్పడె నకారాత్మక శక్తి (నెగెటివ్ ఎనర్జి) ప్రక్కవారికి ప్రాకకుండావుంటుంది. గాజులుధరించడంవల్ల స్త్రీలలోని అధికవేడిని తగ్గిస్తుంది. స్త్రీలు గర్భముధరిచివుండగా  సీమంతంచేస్తారు. ఆ సందర్భంగా మట్టిగాజులు ప్రత్యేకంగా వేస్తారు. అందువల్ల గర్భము సురక్షితమౌతుంది. సీమంతంలో  ఒకచేతికి ఇరవైఒకటి మరోచేతికి ఇరవైరెండు గాజులు వేస్తారు. మిగతాసమయాలలో చేతులకు సరిసంఖ్యలో గాజులు వేసుకోవాలంటారు. చేతికున్న గాజులు ఆస్త్రీ సంతానవృద్దిని సూచిస్తాయంటారు. ఇవన్నీ వారివారి మతాచారవిశ్వాసాలుగా మనం భావించవచ్చు. ఏదియేమైనా చేతికివేసుకున్నగాజులు స్త్రీకి అందాన్నిస్తాయి. మెట్టెలసవ్వడి, గాజులరవళి హృద్యంగా వుంటాయన్నది నిర్వివాదాంశం.                                         

       

 

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...