Friday, 11 October 2024

ఒక తిక్కన భారత సన్నివేశం



ఒక తిక్కన భారత సన్నివేశం
ధృతరాష్ట్రునిరాయబారి సజయునితో శ్రీకృష్ణపరమాత్మ యిలా అంటున్నారు.

 

ఉ:  ఎందును నెవ్వరుం బడని యెంతయుఁ గష్టముపాటు వచ్చినం
     గొందల మంది పాండువిభుకోడలు దవ్వుల నున్న నన్ను ‘గో
            విందుఁడ ! కావు’ మంచుఁ బలవించుట యీఁగఁగరాని యప్పుఁ బో
            లెం దలపోయ వ్రేఁగయి చలింపకయున్నది యెప్పుడున్‌ మదిన్‌.    129


            తే:  ఇట్టి యేఁ దేరు గడపంగ, నెందు నుతికి
                 నెక్కు గాండీవ మేడ్తెఱ నెక్కు వెట్టి
                 రెండు దొనలను బూని కిరీటి యనికి

                 వచ్చు నేఁ డెల్లి; యెందుఁ బోవచ్చు మీకు?   130

(మహాభారతం ఉద్యోగపర్వం ద్వితీయాశ్వాసం 129 & 130 పద్యాలు )


సంజయా! ఎప్పుడూ ఎవ్వరూకూడా పడనటువంటి కష్టానెదుర్కోవలసి వచ్చింది ద్రౌపదికి. నిండుసభకు వెండ్రుకలుబట్టి యీడ్చుకరాబడింది. వస్త్రాపహరణకు గురికానున్న సమయంలో, ఆసభలోని వారినెవరినీ రక్షింపమని అర్థించలేదు. నేను వాస్తవానికక్కడ లేను. చాలాదూరంగా ద్వారకలో వున్నాను. ఎవరైనా నేనామెను ఆదుకోగల  నను కుంటారా? ఆదుకోలేననే అనుకుంటారు. అయితే ద్రౌపది గోవిందా! కాపాడుమని విల పించింది. ఆమె కాపాడబడింది. ఆమెకు నాపై యెంతవిశ్వాసమో చెప్పనలవికాని విషయమది. ఆనాటినుండి నాపరిస్థితి యెట్లున్నదంటే, దారుణంగా అప్పులలో కూరుకపోయి, తీర్చేమార్గంగానక యేవిధంగా మనిషి ఊపిరిసలపని విధంగా వ్యధకు లోనౌతాడో ఆవిధంగా నామనస్సు తీవ్రమైన వ్యధకు లోనై వున్నది. కనుక సజయా! నేనేదోఒకటి చేసి నావ్యధకు ఉపశమనం కనుగొనాలి. అందుకు మార్గం నేను అర్జునరథసారధినై ముందుకు నడిపించుచుండగా, అర్జునుడు తనరెండు భుజాలవెనుక అక్షయతూణీరములు దాల్చి, పేరెన్నికగన్న గాండీవ చాపము ధరించి త్వరలో రణరంగ ప్రవేశంచేసి శశత్రువులనుచీల్చి చెండాడుతాడు, అప్పటికీగానీ నాపరితాప మారదు. అప్పుడు మీకౌరవులెక్కడికి పారిపోతారు? ఆపద ముంచుకొస్తున్నది సుమా! అన్న శ్రీకృష్ణునిమాటలు సభాముఖంగా ధృతరాష్రునకు యదాతథంగా సంజయుడు వినిపించాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అదివేరు విషయం.  

 ఈపద్యాలు చూడటానికి సామాన్యసంగా కనబడినా, ఒకగొప్ప ఆధ్యాత్మికానుభవ రహస్య మిందులో యిమిడివుంది. మనం దైవసన్నిధికెళతాం. దర్శనంచేసుకుంటాం. ప్రార్థిస్తాం. మంచిదే, యిది సర్వసామాన్యం. కానీ మహాత్ముల ప్రవచనమేమంటే, మనంచూడ్డం సరే! కానీ దైవం మనలను చూడాలి. దైవందృష్టి మనపైబడాలి. అందులకేదో మనం చేయాలి, తత్ఫలితంగా దైవందృష్టి మనవైపునకు మరలాలి. ఆపనిచేసేసింది ద్రౌపది. ఏమాత్రం సంశయంలేని విశ్వాసం కృష్ణపరమాత్మపై వుంచింది. కేవలం మాటవరుసకుగాక "నీవేతప్ప యితఃపరంబెరుగ" అని సంపూర్ణ శరణాగతినొంది, పరమాత్మ యేదో ఒకచోటుకు పరిమిత మైయున్నాడనిగాక, పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని పూర్తిగా నమ్మి వేడుకొంది. అంతటితో ఆమెపని పూర్తిచేసేసింది. ఇక పరమాత్మకు ఆమెరక్షణ తప్పనిసరైపోయింది. ఆమెభారం పూర్తిగా పరమాత్మకు బదలాయించేసింది. అదీ భగవంతుని విషయంలో నిజమైనభక్తులు చేయవలసినపని. యిదీ యీపద్యాలద్వారా మనకందుతున్న  సందేశం.

 

భగవంతుడు తనవాడైపోవడానికి యెన్నోమార్గాలున్నాయ్. ఈవిషయంలో యెవరి ఉపాయం వారిది.చక్రధారి సినిమాలో ఒకగీతమున్నది. "నీవెవరయ్యా నేనెవరయ్యా నీవునేను ఒకటేనయ్యా " అదెలాగంటె "నేను కుండలుచేసే కుమ్మరినయ్యా నీవు బ్రహ్మను చేసిన కుమ్మరివయ్యా నువవునేను ఒకటేనయ్యా " అని ఒకకుమ్మరిభక్తుడైన గోరాకుంబర్ త్రికరణశుద్ధిగా నమ్మి భగవంతుని తనవానిగా చేసుకున్నాడు. అంతే, కృష్ణపరమాత్మ భక్తపోషణకై గోరాకుంబరునియింట మట్టిద్రొక్కి కుండలుజేయాల్సి వచ్చింది. భక్తపరాధీనత భగవంతుని లక్షణం. నమ్మండి. "నమ్మినవానికి ఫలముంది, నమ్మనివానికి యేముంది? (యేమీలేదు) నమ్మీనమ్మని మూఢజనానికి స్వర్గం (సద్గతి) దూరంగా వుంది"  ఆలోచించండి. నమ్మి ఫలితంపొందండి.

                                                                            ఓం తత్ సత్   


Thursday, 10 October 2024

కణికుడు

 

కణికుడు



మహాభారరములోని ఒక పాత్ర కణికుడు. తెలుగుభారతం ప్రకారం ఇతడు శకునికి ఆప్తుడైన మంత్రి. చాలాతెలివైనవాడు.రాజధర్మాలను కూలంకుశంగా నెరిగినవాడు. సంస్కృతభారతంలో యితడు ధృతరాష్ట్రునకు ముఖ్యసలహాదారులలో ఒకడు. ధృతరాష్ట్రునకు 90 శ్లోకాలలో రాజనీతిని తెలిపాడు. పాండవుల ఉన్నతికి క్రుంగి, తనకుమారులకు రాజ్యాధికారం దక్కదనే చింతతో యీ కణికుని పిలిపించుకొని రాజనీతిలోని రహస్యాలను తెలిసికొన్నాడు ధృతరాష్ట్రుడు. అధికారం యెలా హస్తగతం చేసుకోవాలి, తన అధీనంలోనికి వచ్చిన అధికారాన్ని యెలా నిలుపుకోవాలి, శత్రునిర్మూన కనుసరించాల్సిన వ్యూహాలెలావుండాలి, ప్రజలతో యెలా వ్యవహరించాలి, ప్రభుత్వవ్యవ స్థలనెలా రాజ రక్షణకుపయోగించులోవాలి అన్న అంశాలెన్నో యీ కణికుడు ధృతరాష్ట్రుని కెరింగించాడు. ధృతరాష్ట్రుడు ధర్మాత్ములైన తన తమ్మునికొడుకులను అడ్డుతొలగించుకొనుటకీ కణికనీతి నుపయోగించి భంగపడ్డాడు. ప్రజాశ్రేయస్సుకొఱకు, తనరక్షణకొఱకు గాక అయోగ్యులైనాసరే తనకొడుకులకే రాజ్యాధికారం దక్కాలని, తనకేమాత్రం హాని తలపెట్టని పాండవుల సంహారం కొఱకు యీ కణికనీతి నుపయోగించి, రాజలోక విపత్తుకు కారణమైనాడు. శత్రువులపై ఉపయోగించాల్సిన మంత్రాంగాన్ని, హితులపై ప్రయోగించి, వినాశానికి హేతువైనాడు. కణికనీతి పదునైన కత్తిలాంటిది. మంచీచెడులు ఆకత్తిని వాడుకునే తీరులో వుంటుందని అర్థమౌతున్నది.

సంస్కృతభారతంలో కణికుడు, తన రాజనీతిలో భాగంగా పంచతంత్రంలోవలె మాట్లాడే జంతువులతో ఒక కథను 24 శ్లోకాలలో చెప్పాడు. ఒక‍అడవిలో బాగా బలసిన జింక ఒకటి, తిరుగుతూవుంది. అది బలంగా వుండటంవల్ల యితర కౄరజంతువులకు చిక్కేదికాదు. ఒకనక్క దాన్ని తినాలని ఆశపడి ఉపాయం పన్నింది. పులి, తోడేలు, ముంగిస, ఎలుకతో స్నేహంచేసి, మనం ఆజింకను తిందాం. అది బలిసి వేగంగా పరుగిడుతూంది. కనుక మనమెవ్వరం దాన్ని ఒంటిగా పట్టలేం. నేనొక ఉపాయంచెబుతాను, ఆప్రకారంచేస్తే, దాని రుచికరమైన మాంసం మనంతినొచ్చు అన్నది నక్క. సరే చెపమన్నాయి స్నేహితులు. జింక పచ్చిక కడుపునిండామేసి నిద్రపోతుంది. అప్పుడు ఎలుకపోయి దానికాళ్ళు కొరకాలి. ఆగాయాలకి అది వేగంగా పరుగిడలేదు. ఆసమయంలో పులి దాడిచేసి చంపేయాలి. అంతే, జింకమాంసం మనకాహారమైపోతుందన్నది. ఉపాయంనచ్చి, నక్కచెప్పినట్లు చేసి జింకను చంపేశాయి జంతువులు. నక్క, యితరజంతువులతో, మీరు దుమ్ముధూళి పట్టి అలసట తోవున్నారు. వెళ్ళి నదీస్నానంచేసి రండి. హాయిగా జింకనుతిందాం, అప్పటిదాకా నేను యిక్కడే కావలిగావుంటాను, వెళ్ళి రండి అన్నది. అలాగేనంటూ అవి స్నానానికి వెళ్ళిపోయాయి.

తొలుత నదినుండి పులివచ్చింది. పులినిచూసి నక్క యేడుస్తూ, మిత్రమా! ఆ ఎలుక యింతకుముందే వచ్చి నిన్ను అనరానిమాటలన్నది. ఆపులి నాసహాయంలేకుండా జింకను చంపలేకపోయింది. తినడానికిమాత్రం ఆత్రపడుతున్నది, అంటూ నిన్ను ఎగతాళిచేసింది, అన్నది. పులి, నిజమే నాకు బుద్ధివచ్చింది. నేను సొంతంగా వేటాడిన జంతువులనే తింటాను, అంటూ అక్కడనుండి వెళ్ళిపోయింది. తర్వాత ఎలుకవ చ్చింది. ఎలుకతో నక్క, ఎలుకబావా! యింతకుముందే, ముంగిసవచ్చి, జింకనుచూసి, యిది పులికరవడంవల్ల విషపూరితమైపోయింది, కనుక నేనుతినను. ఆకలిగావుంది ఎలుకను తినేస్తా నని నీకోసం వెతుకుతున్నట్లుంది అన్నది. ఎలుక భయపడి పరుగుపరుగున వెళ్ళి యెక్కడో కలుగులోనికివెళ్ళి దాక్కుంది. ఆతర్వాత వచ్చింది తోడేలు. తోడేలునుచూడగానే నక్క, అన్నా! నీమీద పులి యెందుకో చాలాకోపంగావుంది. వెళ్ళి నాభార్యను పిలుచుకొనివస్తా, యిద్దరం తోడేలు పనిపడతాం అంటూ వెళ్ళింది. జాగ్రత్త! అన్నది నక్క. అంతే, మాటముగియకముందే అక్కడనుండి పారిపోయింది తోడేలు. ఆఖరుగా ముంగిస వచ్చింది, నక్క ధైర్యంగా యెదురునిలిచి, ముంగిసా! రా! ఇప్పుడే పులి తోడేలు ఎలుకతో పోరాడి ఓడించా, నాదెబ్బకవి పారిపోయాయి. ఇక నీవంతు రా! అంటూ గద్ధించింది. అమ్మో! పులీ తోడేలే యీనక్కముందు ఆగలేకపోయాయంటే యిక నేనెంత అనుకుంటూ ముంగిసా పారిపోయింది. నక్క హాయిగా తానొక్కటే, జింకను సొతంజేసుకొంది.

ఇలాంటి కూటనీతితో యెంతటి వారినైనా అడ్డుతొలగించుకొని రాజరికం నిరాటంకంగా నిలుపుకొని, హయిగా అనిభవించవచ్చునని సోదాహరణంగా కణికుడు ధృతరాష్ట్రమహారాజుకు వివరించాడు.

 తెలుగుభారతంలోని ఆదిపర్వం షష్ఠమాశ్వాసంలో యీ కణికనీతి ధృతరాష్త్రునికి గాక దుర్యోధనునికి చెప్పినట్లున్నది. రణవిద్యలలో ఆరితేరినారు పాండవులు. వారికా విద్యాప్రదర్శన శ్రమతో గూడినది కాదు. వారు నిరంతర ఉత్సాహం కనబరుస్తున్నారు. దానికితోడిపుడు ధర్మరాజు యువరాజయ్యాడు. మాతండ్రిగారతనిని యువరాజుగా చేయకతప్పలేదు. ఈపరిస్థితులలో నేనేమి చేయాలి. రాజనీతి యేమని చెబుతున్నది, నాకు వివరంగా చెప్పమన్నాడు దుర్యోధనుడు. ఈసందర్భంలో నన్నయ కణికనీతి అన్నమకుటంతో ఓ 19 పద్యాలు ఒక వచనంతో ముగించాడు. ఈనన్నయ కణికనీతిని వివరంగా తెలుసుకుందాం.

కణికనీతి

(ఆంధ్ర మహాభారతం - ఆదిపర్వం - షష్ఠాశ్వాసము)

సీ : ‘ఆయుధవిద్యలయందు జితశ్రము
                   లనియును రణశూరు లనియు సంత
      తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును
                  భయమందుచుండుదుఁ బాండవులకు;
    దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుఁ
                   జేసె రా; జే నేమి సేయువాఁడ?
    నృపనీతి యెయ్యది? నిరతంబుగా మీర
                   నా కెఱిఁగింపుఁడు నయముతోడ’


ఆ:  ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు, సౌబలు
                     నాప్తమంత్రి, నీతులందుఁ గరము
                     కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు
                    నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె. 101

ఈపద్య తాత్పర్యం పైపేరాలో వివరంగా యివ్వబడింది.

తరువోజ: ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచిత దండవిధానంబుఁ దప్పక ధర్మ
            చరితులఁగా మహీజనుల రక్షించి సద్వృత్తుఁ డగునది; సర్వవర్ణములు
            వరుసన తమతమ వర్ణధర్మముల వర్తిల్లుదురు గడవక దండభీతి
            నరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి యగు మహీవల్లభు ననుశాసనమున.      102

 రాజుచేతిలోని రాజదండం అత్యంతముఖ్యమైనది. దండనీతి విస్మరింప రానిది. తద్వారానే రాజు తన ప్రజలను ధర్మమార్గంలో నడిపింప గలుగు తాడు. అందుకు రాజుకూడా ధర్మాత్ముడై వుండాలి. దండించేటప్పుదు స్వపరభేదము లస్సలుండరాదు. అలావుంటే, రాజ్యంలోని అన్నివర్ణముల వారు అన్నిజాతులవారు రాజాజ్ఞలను ధిక్కరించక, తమతమ జాతి ధర్మాలను సక్రమంగా పాటిస్తూ ప్రభువునెడ భయభక్తులతో మెలగుతారు. రాజ్యం శాంతిసౌభాగ్యాలకు నెలవౌతుంది.

క:  గుఱుకొని కార్యాకార్యము
     లెఱుఁగక దుశ్చరితుఁ డై యహితుఁ డగు నేనిన్‌
     మఱవక గురు నైనను జను
     లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుద్ధిన్‌. 103

 రాజు వివేకంతో మెలగాలి అందరికితెలిసేటట్లు మంచిచెడులను విచక్షణతో గ్రహించి చెడుమార్గంలో నడిచేవారిని వదలకుండా దండించితీరాలి.

 

క:  ధీరమతియుతులతోడ
     విచారము సేయునది మును, విచారితపూర్వ
     ప్రారబ్ధమైన కార్యము
     పారముఁ బొందును విఘాతపదదూరం బై. 104

 చేయదలచుకొన్న పనిని ముందుగా బుద్ధిమంతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అటువంటప్పుడాపని నిర్విఘ్నంగ నెరవేరుతుంది.

క:  జనపాలుఁడు మృదుకర్మం
    బున నైనను గ్రూరకర్మమున నైనను నే
   ర్పున నుద్ధరించునది త
   న్ననపాయతఁ బొంది చేయునది ధర్మంబుల్‌. 105

రాజు ధరమార్గపాలకుడుగా  వుండాల్సిందే, గాని ముందు తనరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. అది తప్పనిసరి. ఆకార్యనిర్వహణ మృదువగు పద్ధతిలోనా లేక కఠినమైన దండనద్వారానా అన్నది కాదు ముఖ్యం  పద్ధతేదైనా, ప్రభువుకు తన రక్షణ ముఖ్యం. తన్నుమాలిన ధర్మం పనికిరాదు

క:  అమలినమతి నాత్మచ్ఛి
    ద్రము లన్యు లెఱుఁగకుండఁ దా నన్య చ్ఛి
    ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే
            శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై.    106

నిర్మలమైన బుద్ధితో రాజు మెలగాలి. తనలోగల లోటుపాట్లను బయటికి కనబడనీయరాదు. కానీ యితరుల లోపాలను మాత్రం పసిగట్టగలగాలి. అలా చాకచక్యంగా మెలగుతూ మిత్రబలంతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగ వ్యవహరించాలి.

క:  బలహీను లైనచో శ
    త్రులఁ జెఱచుట నీతి, యధిక దోర్వీర్య సుహృ
    ద్బలు లైన వారిఁ జెఱుపఁగ
    నలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీఁదన్‌. 107

శత్రువులు భుజబల సంపన్నులు,గుండెధైర్యం గలవారైతే వారినియేమీ చేయలేము. వారు బలహీనులైతే చంపడం సులభం. అంటే శత్రువులు బహీనులుగా వుండగానే దెబ్బతీయాలి. వారిని తక్కువ అంచనా వేసి బలపడనీయ్యరాదు.

క:  అలయక పరాత్మ కృత్యం
    బులఁ బతి యెఱుఁగునది దూతముఖమునఁ, బరభూ
    ముల వృత్తాంతము లెఱుఁగఁగఁ
            బలుమఱుఁ బుచ్చునది వివిధ పాషండ తతిన్‌. 108

శతువులకార్యకలాపాలు, తనపాలనపై ప్రజల అభిప్రాయాలు రాజు నిర్లక్ష్యముచేయక దూతలద్వారా యెప్పటికప్పుడు తెలుసుకుంటూ వుండాలి. శత్రువుల విషయాలు తెలుసుకోవడానికి కఠినులు నిర్మొగమాటస్తులైన గూడచారులను నియమించుకోవాలి.

క:  నానావిహార శైలో
    ద్యాన సభా తీర్థ దేవతాగృహ మృగయా
    స్థానముల కరుగునెడ మును
    మానుగ శోధింపవలయు మానవపతికిన్‌. 109

జనులు గుమిగూడే విహారస్థలాలైన పర్వతాలు, ఉద్యానవనాలు, సభలు సమావేశాలు జరిగే చోట్లు, తీత్థస్థలాలు, గుడులు వేటాడే ప్రదేశాలు, రాజుచూడాలనుకుంటే, తాను బయలుదేరకముందే ఆస్థలాలు సురక్షితమో కాదో ముందే గూఢచారులద్వారా తెలుసుకొని జాగ్రత్తవహించాలి.

తే:  వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ
     దగరు నాకు నా వలవదు; తత్త్వబుద్ధి
     నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు
     నాత్మరక్షాపరుం డగు నది విభుండు. 110

 

వీరిని నమ్మవచ్చు, వీరిని నమ్మరాదనే నిర్ణయానికి రాకుండా, అందరినీ నమ్మరానివారిగానే గమనిస్తూ, తన రక్షణ విషయంలో రాజు సదా జాగరూకుడై వుండాలి.

ఉ:  ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య
     త్నమ్మునఁ జేయఁగావలయుఁ; దత్పరిరక్షణశక్తి నెల్ల కా
     ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము; మంత్రవిభేద మైనఁ గా
     ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికైనను నేరఁబోలునే.      111

తననుతాను రక్షించుకొనుటలో చూపే శ్రద్ధనే, తనఆలోచనా విధానాన్ని రహస్యంగా వుంచుకొనుటలోకూడా చూపాలి. రహస్యాలోచన బయటికిపొక్కకుండా జాగ్రత్తవహించేరాజు కృతకృత్యుడౌతాడు. లేకుంటే బృహస్పతివంటి మేఋధావియైనా కార్యసాఫల్యత పొందలేడు.

క:  పలుమఱు శపథంబులు నం
    జలియును నభివాదనమును సామప్రియభా
    షలు మిథ్యావినయంబులుఁ
    గలయవి దుష్టస్వభావకాపురుషులకున్‌. 112

అవసరమున్నా లేకున్నా మాటిమాటికి శపథాలుచెయ్యడం, అధికంగా వంగివంగి దండాలుపెట్టడం, అతివినయం కనబరచి, యింపైన మోసపూరిత మాటలతో యెదుటివారిని బురిడీ కొట్టించడం, యివన్నీ దూర్తుని స్వభావాలు. వీరియెడ అప్రమత్తత అవసరం.

క:  తన కిమ్మగు నంతకు దు
    ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
    దన కిమ్మగుడును గఱచును
    ఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రములన్‌.   113

దుర్మార్గుడు తనపని సానుకూలమయ్యేదాకా ప్రియమైనవాడుగా నటిస్తాడు. సమయం అనుకూలించగానే భయంకర విషసర్పమై కాటువేఋస్తాడు. కనుక తస్మాత్ జాగ్రత్త. 

క:  కడునలుకయుఁ గూర్మియు నే
    ర్పడ నెఱిఁగించునది వాని ఫలకాలమునన్‌
    బిడుగును గాడ్పును జనులకుఁ
    బడుటయు వీచుటయు నెఱుకపడియెడుభంగిన్‌. 114

అధికమైన కోపంగానీ ప్రేమగానీ తగినసమయంలోనే బహిర్గతం చేయాలి. అది పిడుగుపడటం, సుడిగాలిరేగటంవలె ఊహ కందనివిధంగా చటుక్కున రావాలి. అంటే రాజుమనస్సులోని అనుకూల ప్రతికూల భావాలు ముందుగా వ్యక్తముకారాదు.

క:  తఱియగునంతకు రిపుఁ దన
    యఱకటఁ బెట్టికొనియుండునది; దఱియగుడుం
    జెఱచునది ఱాతిమీదను
    వఱలఁగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్‌. 115

సమయం అనుకూలించేవరకు శత్రువునకు తెలియనిరీతిలో వారిని సమాదరించాలి. ఆతర్వాత అంతవరకు భుజానమోసిన కుండను రాతిపై విసరికొట్టినట్లు శత్రువును నాశనంచేయాలి.

క:  తన కపకారము మునుఁ జే
    సిన జనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
    జన; దొకయించుక ముల్లయి
    నను బాదతలమున నున్న నడవఁగ నగునే. 116

తనకపకారము చేసినవాడు అల్పుడు, వాడేమిచేయగలడని అనుకోకూడదు. ముల్లు చిన్నదైనా సరే కాలిలోదిగబడివుంటే, నడవలేము. అది అపకారే! శత్రువు అల్పుడని వదలక అంతం  చేసితీరాలి.

క:  బాలుఁ డని తలఁచి రిపుతో
    నేలిదమునఁ గలిసియునికి యిది కార్యమె? యు
    త్కీలానలకణ మించుక
   చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్‌. 117

పిల్లకుంక వాడెంత, వాడేమిచేయగలడని యేమరరాదు. శత్రువును నాశనంచేసితీరాలి. అగ్నికణం చిన్నదేయైనా నిర్లక్ష్యంచేస్తే దావానలమై అడవిమొతన్ని దహించివేస్తుంది.

క:  మొనసి యపకారిఁ గడ నిడి
    కొనియుండెడు కుమతి దీర్ఘకుజశాఖాగ్రం
    బున నుండి నిద్రవోయెడు
    మనుజునకు సమాన మగుఁ బ్రమత్తత్వమునన్‌.   118

తనకపకారము చేసినవాడిని నిర్భయంగా చెంతనుంచుకోవడం ప్రమాదం.చెట్టుకొమ్మచివర యెత్తైనచోట బుద్ధిహీనుడు శయనించినదానితో అది సమానం.

చ: తడయక సామభేదముల దానములన్‌ దయతోడ నమ్మఁగా
    నొడివియు సత్యమిచ్చియుఁ జనున్‌ జననాథ! కృతాపకారులం
    గడఁగి వధింపఁగాఁ గనుట కావ్యుమతం బిది; గాన యెట్టులుం
    గడుకొని శత్రులం జెఱుపఁగాంచుట కార్యము రాజనీతిమైన్‌.   119

సామదానభేదములను ఉపాయములచేతగాని లేదా దయచూపి నమ్మకంకలిగించి గానీ, తనతీరు సత్యమని నమ్మింపజేయాలి. తదనంతరం సమయంచూసి దెబ్బతీయాలి. చంపేయాలి. ఇది శుక్రాచార్యుల రాజనీతి. ప్రతిరాజు పాటించదగ్గది.

 

వ: ‘కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది’ యనినఁ గణికుమతంబు విని దుర్యోధనుండు చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కేకాంతంబున ని ట్లనియె."

అందుచేత రాజున కపకారముచేసినవారు శత్రువేకానక్కరలేదు, బంధువులలోకూడా అపకారులుండవచ్చును. వారినికూడ వదలిపెట్టకూడదు. యెవరినైనాసరే ఆత్మరక్షణకై వధించితీరాలి. అంటూ కణికుడు చెప్పిన రాజనీతిని శ్రద్ధగా విన్నాడుదుర్యోధనుడు . ఒకదినం చింతాక్రాంతుడైన దుర్యోధనుడు తండ్రిధృతరాష్ట్రుని యేకంతంగాకలుసుకొని తను శత్రువులుగా భావిస్తున్న పాండవులను తనదారికడ్డుతొలగించుకొను ఉపాయముల గురించి చర్చించాడు.

2013 వ సంవస్తరంలొ ఏక్తాకపూర్ బాలాజీ ఫిలిమ్స్  పతాకంక్రింద హిందీలో "కహానీ హమారా భారత్‌కీ" అనేపేరుతో మహాభారత్ ధారావాహికం నిర్మించారు. అది 75 ఎపిసోడ్స్ తరువాత ఆగిపోయింది. ఆకథలో కణికుడు అడవిలో ఒంటరిగా ఒకకుటీరంలో వుంటున్న బ్రహ్మణమేధావి. అతనివద్దకు రహస్యంగా శకునితోకలసి ధృతరాష్ట్రుడు వెళ్ళికలుస్తాడు. అతని కూటనీతిబోధతోనే ధర్మజుని యువరాజుగా ప్రకటించాడు ధృతరాష్ట్రుడు. అందువల్ల పాండవులు సంతోషంతో సబరారు చేసుకుంటూవుంటారు. పెద్దలెవరికీ కౌరవులపై అనుమానంరాదు. కనుక నిఘావుంచరనుకుంటాడు ధృతరాష్ట్రుడు. కుట్రలుపన్నడానికి బాగాసమయందొరికిందనుకొని ఒకకుట్రపన్నారు. పాడవులను కుంతితోసహా వారణావతం పంపి, అక్కడ లక్కయింటిలో దహించేసే వ్యూహంసిద్ధంచేసుకున్నారు, కానీ అలా జరుగలేదు. విదురమహాశయుని అప్రమత్తతతో పాడవులు గండంగడచి బ్రతికిపోయారు. అది తరువాతి కథ. నన్నయవలెగాక యిక్కడ కణికుని పూర్తి కూటనీతజ్ఞునిగా చూపించారు.

కనుక పరిశీలనగాచూస్తే కణికనీతి ఆనాటికేగాదు, ఈనాటికిగూడా రాజకీయధురంధరులచే, కణికునికథ తెలిసియో తెలియకనో, యేమైననేమి అమలౌతున్నట్లే గనపడుచున్నది.

 

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...