Showing posts with label corona. Show all posts
Showing posts with label corona. Show all posts

Saturday, 22 August 2020

కరోనా కష్టకాలం

కరోనా కష్టకాలం

(శతకము)


      శ్రీకరుడు మహాత్మ శ్రీరామచంద్రజీ

  ప్రేరణనొసగి కడుప్రేమమీర

  పలుకుమనియె పద్యకలకండ పలుకులు

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                   1


  గాలి, పరిసరములు కలుషితంబైపోయె

  మంచినీటి నదులు మలినమయ్యె

  నడతమార్చుకొనగ నరులొప్పకొనరైరి

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                    2


   రోతబట్టిపోయి రోదించుచున్నది

   విశ్వమనుచుజెప్ప వినడు నరుడు

   అవని నిట్లు విషము అల్లుకపోయెను

    సుమతివౌచు వినర సుబ్బరాయ.                    3


   శాస్త్రవేత్తలెల్ల చాల సూచనలిచ్చి

  వలదు నిలుపుమనిరి కలుషితముల

  మంచిదనుచు పలికి మరచిరి నాయకుల్

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                        4


  మారు మనుజుడనుచు మర్యాదపాటించి

  ఊరకున్న ప్రకృతి తీరుమార్చి

  ఆగ్రహమున జనుల హతమార్చబూనెను

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                         5


  అయ్యలుక కరోనయై భీతిగొలిపె న

  టన్న నిజమొ యేమొ? నరయ మకట?

  ఇయ్య దెట్లుబోయి యేగట్టుజేర్చునో?

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                         6

 

 జననమై కరోన, చైనాకిశోరమై

  వ్యాప్తమై సమస్త వసుధ నిండి

  మందులేని వింత మాయరోగంబయ్యె

  సుమతివౌచు వినర సుబ్బరాయ                        7


  ఎంత భయము గొల్పె! నింటిగడప దాటి

  కాలు బయటబెట్టు వీలులేక

  కిక్కురుమనకుండ నొక్కిపట్టె కరోన

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                          8


   ఉనికి యేర్పడినది ఊహాన్ నగరమందు

   ఈ కరోన చైన ఈప్సితముల

   కనుగుణముగ పుట్టెననికొందరందురు

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                           9


   గొంతునొప్పి జలుబు కొంతజ్యరంబును

  ఊపిరాడకుండు టున్నయెడల

  వడిగ వెళ్ళ వలయు వైద్యశాల కపుడు

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                          10


  చేయిచేయి కలిపి చేరవద్దు దరికి

  కేలుమోడ్చి తొలగ మేలు సుమ్ము

  దాల్చకుండ మాస్కు దారిలో దిరుగకు

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                          11


  వచ్చినారు వారు వలసకూలీలుగా

  సాగుచున్న పనులు ఆగిపోయె

  ఊళ్ళకేగలేవు రైళ్ళు బస్సు లసలె

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                          12


  సొంతవూరు జేర సుంతమేలనుకొని

  నడచివెళ్ళ, దారినడుమ వారు 

  చెప్పలేని ముప్పతిప్పలు బడినారు

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                           13 


  తెలియనేరరైరి తిననేమి దొరకునో

  యేడ రాత్రినిద్రొ యెఱుగరైరి

  దైవమున్నయెడల దయచూపడేలకో

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                           14


  కలడు దేవుడనగ కదలి దాతలు వచ్చి

  వారికన్నమిడగ ప్రభుతగూడ

  వారికొఱకె నడిపె ప్రత్యేకరైళ్ళను

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                           15


  వేరు రాష్ట్రములకు వెళ్ళి చిక్కువడిన

  వారుకూడ తిరిగి వచ్చుకొరకు

  స్టేటుగౌర్నమెంట్లు చేయూత నొసగెను

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                          16  


  ఆర్థికముగ కష్ట మదియెంత యున్నను

  పస్తులుండరాదు ప్రజలటంచు

  పప్పు బియ్యమిచ్చె పైకమిచ్చె ప్రభుత

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                          17


  భరతభూమి నుండి పరదేశములకేగి

  చిక్కువడినవారి చింతదీర్చి

  మరలివచ్చుటకు విమానముల్ గూర్చిరి

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                           18


   తగ్గునిక కరోన ధాటి యనుకొనంగ

   నట్టి యాశలన్ని వట్టివయ్యె

   రోజురోజుపెరిగె రోదనల్ దానితో

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                         19


  ఎండలెక్కువైన వుండలేదు కరోన

  ననుచు తలచినారు ఆశపడుచు

  అట్టి ఆశలన్ని యడియాసలయ్యెను

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                        20    


   చిక్కులందు బడెను సినిమాపరిశ్రమ

   టీవి సీరియళ్ళ ఠీవిదప్పె

   చలనచిత్ర శకట చలనమాగెను గదా!

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     21   


   గుళ్ళు మూతవడియె పెళ్ళిళ్ళు లేవాయె

   అయ్యవార్ల పనులు ఆగిపోయె

   వారికష్ట మెటుల దీరునో దెలియదు

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                       22


   మంగలిపని నిలిచె  మంగళవాద్యాలు

   మ్రోగలేనివయ్యె మూగవోయె

   పెళ్ళిమంటపాలు వెలవెలబోయెను

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                       23


   చేతలుడిగినారు చేనేతపనివారు

   మగ్గమాగిపోవ మగ్గిపోయి

   బ్రతుకుబండి లాగ బరువాయె వారికి

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                       24


   పనులు తగ్గిపోయె పనివారికెట్టుల

   యివ్వవలయు జీత మేదిదారి

   యనుచు యాజమాన్యమున కయ్యెలే చింత

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                      25


    మందులేవిలేవు ముందుజాగ్రత్తలే

   శరణమనిరి వైద్యశాస్త్రవిదులు

   రక్షసేయు టీక రాదు యిప్పుడనిరి

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                       26


    కావలసినవారు కాలమై పోయిన

   వెళ్ళిచూచివచ్చు వీలులేదు

   ఎరుగరైరి జనులు ఇంతకష్టమెపుడు

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                      27


   అమెరికా భయపడె అల్లాడెయూరోపు

   దేశమేదియైన దిగులుజెందె

   కానరాని క్రిమికి కంపించె విశ్వము

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    28


   చాలు లాకుడౌను సడలించవలెనని

   స్వేచ్ఛనొసగ దలచి వెసులుబాటు

   కలుగజేసినారు కట్టుబాట్లుజెప్పి

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    29


   కట్లువిప్పబడిన కరిగణములభంగి

   తిరిగినారు జనులు వెఱపుదప్పి

   అదను దొరికెననుచు అధికమయ్యె కరోన

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    30


   ఆల్కహాలు, కల్లు అమ్ము దుకానాలు

   తెరవగానె జనులు పరుగులిడుచు

   విరుచకపడి త్రాగి మరచిరి మాస్కులు

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     31         


   ఇదియె చాలదనుచు వదిలె కార్ఖానాలు

   విషరసాయనాల వీచికలను

   మరణమందినారు మనుషులు గాలికి

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    32


   ఫ్యాక్టరీల భయము వైజాగు నంద్యాల

   వరకె పరిమితమన వలను పడదు

   యెప్పుడేమి యగునొ యెవ్వడెరుంగడు

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     33


   ఇది తినుడు కరోన యిట్టెబాగైపోవు

   కలదు మందు రండు వలదు చింత

   యనుచు పలుకువారి కడ్డుయదుపు లేదు

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     34


    మానవత్వమున్న మారాజులున్నారు

   వద్దు రెండునెలల అద్దె యనుచు

   చిన్నవర్తకులకు చేయూతనిచ్చిరి

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    35


   కష్టకాలమనక  కయ్యానికొచ్చెను

   చీనదేశ మౌర సిగ్గువిడచి

   పగను విడక పంపె పాక్‍తీవ్రవాదులను

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     36


   ఆరిపోనిరీతి ఆంధ్రప్రదేశాన

   రాజకీయ నెగడు రగులుచుండె

   వలదిపుడు కరోన కలదన్న విడువరు

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    37


   వద్దులేపరీక్ష పదిపాస్ పదమనిరి

   తిరిగి బడులు యెపుడు తెరుచుకొనునొ?

   చదువులను కరోన సాగనిచ్చునోలేదొ?

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    38


   విద్య నేర్చుకొనెడు విధివిధానము మారె

   స్మార్టుఫోనుతోనె చదువులాయె

   ఇల్లుదాటకుండ ఇంటర్నెటు బడాయె

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    39


   అందరి కెటులబ్బు ఆన్- లైనుచదువులు

   ఉన్నవారు సిటిలొ ఉన్నవారె

   చదువుకర్హు లగుట చాల అన్యాయమౌ

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     40


   అంటరానితనమె యావస్యకంబని

   మున్నె చెప్పితిమనె మూర్ఖుడొకడు.

   తొలగకుండె నౌర కులగజ్జి నేటికిన్.

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                      41


   గొప్పరోగములను చప్పున తగ్గించు

   దైవజనము లెచట దాగినారు?

   వచ్చి యీ కరోన వదలిపోజేయరే?

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     42


   మాయమాటలాడి మనుజుల వంచించి

   మతముపేర కల్లకతలు జెప్ప

   వింటి మిన్నినాళ్ళు వెర్రివారమగుచు

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     43


   మతముమారు డనుచు మాయలెన్నియొజేసి

   తొలగిపోవు రోగములని జెప్పు

   వారిమాట నమ్మవలదిప్పటికినైన

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    44


   మతమువలన మాకు మంచిజరిగెగాన

   నమ్ముచుంటిమన్న నమ్మనిమ్ము

   పరుల మోసగించు పనులేల జెప్పుమా?

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    45


   వస్తువులను కొనెడివారిసంఖ్యతరిగె

   ఉన్నడబ్బు తగ్గ నొదిగియుండి

   జనులు బిక్కుబిక్కు మనుచు చిక్కుబడిరి.

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    46


   కొట్టుమూతబడియె  కూర్చొని తినుటాయె

   వెతలబడుచు నిట్లు బ్రతుకుటెట్లు

   అద్దెకట్టుటెట్లు యని వర్తకుండుండె

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    47   


   పనులులేక భాగ్యనగరమందుండెడి

   వారు సొంతపల్లెబాట పట్ట

   టులెటు బోర్డ్లు చాల వెలిసె నగరమంత.

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    48


   భయము గల్గుటయ్యె బసచేయ లాడ్జిలొ

   వెళ్ళి యెచట తినిన వెఱపు గలుగు

   నగరమేగుటన్న నగచాట్లు బడుటాయె.

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     49


    పెద్దపెద్ద సాఫ్టు‍వేర్‍కంపెనీలలో

   కోవిడుశగ తగిలి కొలువులూడె

   చెప్పనేల నింక చిన్నవాటి గతిని

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    50


   ఈకరోన వలన యింతకష్టం బయ్యె

   వచ్చు మరొక చైన వైరసనగ

   వణుకుపుట్టే నిట్టె వార్తవిన్నంతనే

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                   51


   చైననుండి వచ్చు చావుకబురులతో

   విశ్వజనుల కెల్ల వెఱపుగలిగె

   గండములకు చైన గనియౌచు మారెరా!

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                   52           


   వర్షము పడజొచ్చె వడగాడ్పు లణగెను

   గాలిలోన తేమ కలిసి వీవ

   అడ్డు అదుపులేక నలుముకొనె కరోన

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    53


   ముఖ్యమంత్రిగారె  మొహమాటమేలేక

   విడువవిక కరోన వేదనలనె

   చేతికందినట్టి చిట్కాలె గతియాయె

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     54


   కల్మషమ్ము బాసి గంగలోని జలము

   స్వచ్ఛమగుచు పారె చక్కగాను

   పరిసరమ్ములెల్ల వడిగ తేరుకొనియె

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     55    


   వదలిపోయె నగర వాయుకాలుష్యమ్ము

   పండెపంటలెల్ల మెండుగాను

   ఇతర రోగచయము యెటుబోయెనో యేమొ?

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    56   


  రోతబట్టి నట్టి వాతావరణమున

  కొంత శుభ్రపడియె కోవిడునను

  కీడుతోడ మేలు కూడియుండునుగదా!

  సుమతివౌచు వినర సుబ్బరాయ.                    57                  


   ముస్లిములు కరోన మోసుకొచ్చిరనుచు

   నిందచేయదగదు యెందుకనగ

   ప్రార్థనలకు ఢిల్లి వచ్చుట నేరమా?

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                   58


   మతసభలకు వచ్చి యితరదేశస్తులు

   తెలియకయె కరోన దెచ్చినారు

   అంతెగాని కుటిల ఆలోచనలు లేవు

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                   59


   మతఛాందసముల సుతరాము నమ్మంగ

   వలదటంచు మనకు దెలిసిపోయె

   శుష్కబోధనలకు చోటివ్వరాదింక

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     60


   మనముజేసినట్టి మనకర్మ ఫలములే

   అనుభవించుచుంటి మనుచు బలుకు

   ఘనులు పాపమెటుల కడిగివేతురొ యేమొ?

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                       61


   కులము మతముజూచి కోవిడంటుకొనదు

   అంటుకొన్నవాడు అల్పుడవడు

   చొచ్చుకొని కరోన వచ్చు సుభ్రతవీడ

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                      62


   ఒక్కతీరుగాక ఒప్పుతప్పులు టెస్ట్లు

   చెప్పుచున్న వనుచు చెప్పుచుండ

   ఇట్లి టెస్ట్ల వలన యిక్కట్లు హెచ్చయె

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                      63


   అంటుకొనె కరోన యనగనే మనిషిని

   చీదరించుకొనగ రాదు మనము

   సాయపడుట సబబు జాగ్రత్తలు వహించి

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     64


   మందువచ్చె నొకటి మార్కెటుకనగానె

   దొరకకుండజేసి ధరనుబెంచి

   అమ్ముకొనగజూచి రనుమాట విననయ్యె

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                   65


   మందులేమొగాని ముందున్నదొక ఆశ

   అదియె టీకమందు అందుకొఱకు

   చాల ఫార్మశీలు శ్రమపడు చున్నవి

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    66


 కోవిడంటిపోయి కోలుకొనినవారు

   గండము గడచె ననుచుండగానె

   తిప్పలొచ్చెనంట తీవ్రౌషదములచే

   సుమతివౌచు వినర సుబ్బరాయ                      67


   ఆక్సుఫర్డు ఫార్మ ఆశలు కలిగింప

   జాప్యమవక సూది జనముకియ్య

   పద్ధతులను గూర్చు పనిలోబడె ప్రభుత

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     68


   ఆసుపత్రినుండి అడ్రసులేకుండ

   రోగి పారిపోయి దాగికొనియె

   జనము లిట్టులుండ జచ్చు నెట్లు కరోన

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    69


   టెస్టు జేసినపుడు టెలిఫోను నంబరు

   మరియు ఇంటిసంఖ్య మార్చిజెప్పి

   తగిలినను కరోన తప్పించుకొనిరట

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                    70


   అతని కొక్కనికి కరోన యంటుకొనిన

   ఇతరులకును యంటు నతని వలన

   పరుల బాధపెట్ట పాపంబుగాదొకో?

   సుమతివౌచు వినర సుబ్బరాయ.                     71


   తనకు మేలుగలుగు తనవల్ల యితరులు

   బాధ పడరు గనుక పారిపోక

   వైద్యశాల నున్న వదలిపోవు కరోన

   సుమతివౌచు వినర సుబ్బరాయ                      72


   గడ్డుకాల మకట బిడ్డనమ్మెను తండ్రి

   కొందరమ్ముకొనిరి కుందనమును

   మధ్యతరదతికిది మౌనరోదన మయ్యె

   సుమతివౌచు వినర సుబ్బరాయ                       73


   వైరసు మరియొకటి వచ్చు చైనానుండి

   యనెడి వార్తరాగ మనసునందు

   దిగులుజెంది జనులు మిగుల చింతించిరి

   సుమతివౌచు వినర సుబ్బరాయ                      74


   సకలజంతువులను సంహరించి తినెడు

   చైనజాతివారి పైన నలిగి

   ప్రకృతి వైరసులను పంపించునో యేమొ

   సుమతివౌచు వినర సుబ్బరాయ                      75


   చైనవారి వికృత చర్యల ఫలితమ్ము

   విశ్వమేల యనుభవింప వలయు?

   మర్మమేమొగాని మనిషి మారవలయు

   సుమతివౌచు వినర సుబ్బరాయ                     76


   పంటలేమొ బాగ పండినవి మరియు

   పాలు కూడ బాగ పశువులిచ్చె

   కాని గిట్టుబాటు కావయ్యె రైతుకు

   సుమతివౌచు వినర సుబ్బరాయ                     77


   అమ్మబోవ రైతు కడవియయ్యె మరియు

   కొనగజూడ నవియె కొఱివియయ్యె

   దీనికంతకును కరోనాయె సాకయ్యె

   సుమతివౌచు వినర సుబ్బరాయ                     78


   దయ కరోనరోగులయెడ జూపి యిడిన

   ధనముకూడ దోచుకొనెడి వారు

   ధర్మపరుల వేషధారులై యున్నారు

   సుమతివౌచు వినర సుబ్బరాయ                     79


   ధనము చేతలేక దానమీలేనట్టి

   సజ్జనులు కరోన సమయమరసి

   బిక్షచేసి తెచ్చి పేదకన్నమిడిరి

   సుమతివౌచు వినర సుబ్బరాయ                   80

   మనిషిలోపలున్న మంచిచెడులనెల్ల

   గాంచు దైవ మనుచు కరుణ గలిగి

   చేయగలిగినంత చేయుడు సాయంబు

   సుమతివౌచు వినర సుబ్బరాయ                      81


   వచ్చి యీకరోన చచ్చిపోవ మనిషి

   బంధుజనము కూడ భయముచేత

   అంత్యక్రియలు చేయ ఆఛాయలకెరారు

  సుమతివౌచు వినర సుబ్బరాయ                    82


   తాయెతలనుగట్టి తరిమెదము కరోన

   ననుచు మోసగించి ధనము గుంజు

   మంత్రగాళ్ళ మాయమాటలు వినవద్దు

   సుమతివౌచు వినర సుబ్బరాయ                          83


   గో కరోన యనుచు వూకదంపుడుకేక

   లిడగ పోదు రోగమెన్నటికిని

   అట్టివారి సోదె నసలు నమ్మగరాదు

   సుమతివౌచు వినర సుబ్బరాయ                    84


   రష్యవారి టీక రానుంది ముందుగా

   ననెడి వార్త మనకు వినగవచ్చె

   ఎవరు కనుగొనినను భువిజనానందమే

   సుమతివౌచు వినర సుబ్బరాయ                    85    


   టీక రాక మనుపె వీకసెడి కరోన

   బలములుడిగిపోవ భయముదీర

   టీక యవసరమ్ము లేకపోవునొ యేమొ?

   సుమతివౌచు వినర సుబ్బరాయ                    86


   తీవ్రతర కరోన తీరుమారి మనిషి

   ప్రాణములను తీయు పటిమ తగ్గి

   వచ్చి పోవునంతె వగజెంద పనిలేదు

   సుమతివౌచు వినర సుబ్బరాయ                     87

   టీక వచ్చుగాని మాకిత్తురోలేదొ?

   యని బడుగులలో నిరాశ గలిగె

   కనిమికున్న బలిమి తెలియని వారమే?

   సుమతివౌచు వినర సుబ్బరాయ                    88


   టీక యవసరమ్ము లేకుండుటే మేలు

   రచ్చలేవి కూడ రకయుండు

   కలుగకుండు టీకకలిగించు దీషముల్

   సుమతివౌచు వినర సుబ్బరాయ                    89


   శానిటైజరందు సారయి కలదని

   విరివిగ దొరుకునిది నిరతమనుచు

   త్రాగుబోతులకట త్రాగిచచ్చిరి గదా!

   సుమతివౌచు వినర సుబ్బరాయ                   90


   చచ్చిపోయినారు శానిటైజరు త్రాగి

   యనెడు మాట వినియు కనియు గూడ

   మరలత్రాగి యేల మరణింతురో యేమొ?

   సుమతివౌచు వినర సుబ్బరాయ                  91


   చచ్చిపోరు కొద్ది శానిటైజరు త్రాగ

   సార ధరలు పెంచి మీరెమాకు

   దారిచూపిరనిరి దూరి ప్రభుత్వమున్

   సుమతివౌచు వినర సుబ్బరాయ                  92


   వద్దు సార యనిన వచ్చె నాటుసరకు

   దారికొత్తురనుచు ధరలుబెంచ

   శానిటైజరుంది సర్దుకొందు మనిరి

   సుమతివౌచు వినర సుబ్బరాయ                  93


   గౌర్నమెంటువారు కట్టడి జేసిరా?

   శనిటైజరసలె కానరాదు

   ఈ కరోన కాల మెవ్విధి గడచునో?

   సుమతివౌచు వినర సుబ్బరాయ                  94

   కొన్నివూర్ల వారు కోవిడు శవముల

   కాటికి గొనిరాగ కఠినులగుచు

   పూడ్చిపెట్టనీము పొమ్మనుచున్నారు

   సుమతివౌచు వినర సుబ్బరాయ                   95


   కష్టమగు కరోన కాలమున జనుల

   భయమువలన మానవత్వము చెడె

   ఇప్పుడిట్టులుండె యినేమి జరుగునో?

   సుమతివౌచు వినర సుబ్బరాయ                   96


   చేయగూడనియు చేయదగినవియు

   తెలిసినవి కరోన దినములందు

   అమలుజరుపవలయు నవి జీవితమ్మున

   సుమతివౌచు వినర సుబ్బరాయ                  97


   నిజమొ కాదొగాని నీళ్ళబాటిలుకన్న

   తక్కువధర బెట్ట మిక్కుటముగ

   జనుల జేరుటీక యనువార్త వింటిమి

   సుమతివౌచు వినర సుబ్బరాయ                  98


   ఫార్మశీలవారు పరహితమునుగోరి

   చౌకగానె టీక జనులకిడగ

   వారికీర్తి నిలచు వసుధపై స్థిరముగా

   సుమతివౌచు వినర సుబ్బరాయ                  99


   ప్లాస్మ థెరపిచూపె ప్రస్తుతమున మేలు

   కోవిడు నెదిరించి కోలుకున్న

   వారలివ్వ వలయు పరులకై ప్లాస్మాను

   సుమతివౌచు వినర సుబ్బరాయ                100            


   ఎట్టి హనిలేదు యిచ్చినచో ప్లాస్మ

   చాటిరిదియె వైద్యశాస్త్ర విదులు

   ప్లాస్మ రక్తమందు వలసినంతగ ఊరు

   సుమతివౌచు వినర సుబ్బరాయ                 101


   ఈ కరోనకాల మిట్లె చరిత్రలో

   నిలచి కాలగతిని తెలియపఱచు

   కోవిడునకు ముందు కోవిడు వెనుకని

   సుమతివౌచు వినర సుబ్బరాయ                  102



v     

Corona


పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...