Monday, 3 July 2023

రాగిపాత్రలోనీరు

 

రాగిపాత్రలోనీరు


రాగిపాత్రలోని నీరుత్రాగడం, పూజగదిలో రాగిచెంబులో నీరు వుంచడం మంచిదంటారు. బజారులో కూడా రకరకాలైన రాగిపాత్రలు లభ్యమౌతున్నాయి.  ఇంతకూ తామ్రకలశజలం యొక్క ఉపయోగాలేమిటో తెలుసికుందాం. వాస్తుప్రకారం గృహనిర్మాణం, ఎంత ముఖ్యమో, పూజగదిలో రాగికలశంలో నీరువుంచడం కూడా అంతే ముఖ్యమని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దేవునిఎదుట రాగికలశంలో పరిశుద్ధజలం వుంచడంవలన సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయనీ, అన్నిపనుల్లో సానుకూలత సమకూరుతుందనీ, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విబుధులు చెబుతున్నారు. భక్తితోచేసిన పూజయొక్కశక్తి యీ కలశంలోని నీటిలో నిక్షిప్తంకాబడి వుంటుంది. ఆనీటిని తీర్థంగా స్వీకరిస్తే భగవదనుగ్రహం లభిస్తుందని హిందువుల ప్రగాడవిశ్వాసం.

 

 దేవతలకు జలం ఇష్టమ్మైన ఆవాసస్థలం. కనుక రాగిపాత్రలోని నీటిలో దేవతలుంటారు. అందుకే పూజగదిని శుభ్రంచేయడానికి, విగ్రహాలను శుద్ధిచేయడానికి కూడా రాగిపాత్రలోని నీటిని వాడటం శ్రేయస్కరం. ప్రతిరోజు రాగిపాత్రలోని నీటిని మార్చుకోవాలి. ముందురోజు నీటిని తులసికోటలో పోయడం మంచిది.

 

రాగిపాత్రకు సంబంధించిన పురాణగాథ ఒకటున్నది. గుడాకేశుడనే రాక్షసుడు సత్వగుణసంపన్నుడు. అతడు హరినిగూర్చి 16 వేల సంవత్సరాలు తపస్సుచేసి, ప్రతిజన్మలోను తాను హరిభక్తుడుగనే వుండాలనీ, తుదకు హరిసుదర్శనచక్రముచేతనే మరణం సంప్రాప్తం కావాలనీ, అలా మరణించిన తర్వాత తనశరీరం రాగిలోహమైపోవాలనీ  వరాలుపొందాడు. వైశాఖశుద్ధద్వాదశి మట్టమధ్యాహ్నపువేళ హరి అతనికి కైవల్యమియ్యదలచి చక్రముతో శిరస్సును ఖండించాడు. వెంటనే అతనిమాంసం రాగిలోహంగా మరిపోయింది. ఎముకలు వెండిగా మరిపోయాయి. మలినాలు కంచుగా మారాయి. గుడాకేశుని మాంసం రాగిలోహమైనతర్వత, ఆరాగితోనే చేసిన పాత్రలో  ప్రసాదముంచి హరికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అప్పటినుండి హరికి రాగిపాత్రలోపెట్టిన నైవేద్యం,రాగిపాత్రలోని తీర్థం  ఇష్టమైనాయి. నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటే అన్నివేలసంవత్సరాలు హరికి నైవేద్యం పెట్టినభక్తుడు వైకుంఠంలో నివసిస్తాడని హరి సెలవిచ్చాడు.
 
                 ఇక ఆరోగ్యపరంగా చూస్తే రాగిపాత్రలోని నీటిని సరైనపద్ధతిలో త్రాగాలని పొషకహారనిపుణులు కిరణ్‌కుక్రేజాగారు యివిధంగా తెలియజేశారు. రోజంతా యిదేనీరు త్రాగకూడదు. పడగడుపున యీనీళ్ళలో తేనే నిమ్మరసం కలిపి త్రాగరాదు. అలాత్రాగితే నిమ్మరసంలోని ఆసిడ్ రాగితో రియాక్ట్ ఔతుంది. నీరువిషతుల్యమై  కడుపునొప్పి, పైత్యవాంతులు కలగవచ్చు. అంతేగాదు రాగిపాత్రను ప్రతిరోజూ రుద్ది కడుగకూడదు. అలాచేస్తే రాగివలన మనకుకలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయి. 15 రోజులకొకసారి ఉప్పు నిమ్మరసంతో శుభ్రంచేసుకుంటే సరిపోతుంది. రక్తస్రావ సమస్యలున్నవారు యీ రాగిపాత్రలోనినీరు త్రాగకూడదు. అలా త్రాగితే రక్తస్రావాలు పెరగవచ్చు. అంతేగాకుండా రాగిపాత్రలో అన్నం కూరలు వండుకొనరాదు. పాలు కాచుకొనరాదు. ఊరగాయలువంటి పదార్థములు రాగిపాత్రలలో నిలువచేయరాదు. ఇందువల్ల అవి విషపూరితమౌతాయి. ఈమెలకువలు పాటించి రాగిపాత్రలోనినీరు ప్రతిదినం ఉదయంత్రాగితే చలా ప్రయోజనాలున్నాయి. చలికాలంలో యీనీరు త్రాగడం మంచిదికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు కానీ, ఆయుర్వేద నిపుణురాలైన దీక్షాభావ్‌సర్ మాత్రం మంచిదేనంటున్నారు. చలికాలం ఉదయాన్నే ఒకగ్లాసు రాగిచెంబులోని నీళ్లుత్రాగితే, శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. హుషారుగావుంటారు. శక్తిసమకూరి, తొందరగా అలసిపోరని తెలియజేశారు. రాగిపాత్రలోని నీటిని ప్రతిరోజూ ఉదయం త్రాగడంవల్ల అధికబరువు నుండి విముక్తులౌతారు. జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. గుండెకు బలాన్నిస్తుంది. కీళ్ళనొప్పులు వాపులు తగ్గుతాయి. రక్తహీనత యేర్పడదు. గాయాలు తొందరగా మానిపోతాయి. కాలేయం మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో పెరుకపోయిన చెడుక్రొవ్వు తొలగిపోతుంది. రక్తపోటు గుండెదడ అదుపులో వుంటుంది. చర్మరక్షణ సమకూరుతుంది. శరిరంలోని వ్యర్థపదార్తాలు బయటికి వెళ్ళిపోతాయి. వాత పిత్త కఫ (త్రి) దోషాలు, అంటువ్యాధులు నయమౌతాయని, రోగనిరోధకశక్తి పెంపొందుతుందని, వృద్ధాప్యం తొందరగారాదని, క్యాన్సర్‌ వ్రణములను మానుపుతుందని, థైరాయిద్ సమస్యలను నివారిస్తుందని కడుపులోని పుండ్లను మానుపుతుందని మెదడుకు చురుకుదనాన్నిస్తుందని ఎముకలకు ధృడత్వం లభిస్తుందని చిన్నతనంలోనే వెంట్రుకలు తెల్లబడడాన్ని నివారిస్తుందని ఆయుర్వేదవైద్యులు చెబుతున్నారు.
 

 రాత్రికి రాగిపాత్రలో నీరుపోసి ఉదయాన్నే పడగడుపున ఒకగ్లాసు ఆనీరు త్రాగడం సర్వదా శ్రేయస్కరం, ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. రాగికడియం చేతికిధరించడం కూడా ఆనవాయితీగ వస్తున్నది. ఇందువల్ల శరీరములోని అధికవేడి తగ్గుతుందని, రక్తపోటు అదుపులో వుంటుందని, చెడుక్రొవ్వు శరీరంలో చేరదని నమ్మి రాగికడియాలు ధరిస్తున్నారు. 


 

                       

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...