Friday, 3 September 2021

 

 

భార్యాబాధితుడు - ఉద్దాలకుడు


 Who was Uddalaka Aruni? – Part Three | sreenivasarao's blogs

 ప్రపంచంలో పురుషాహంకారం మిక్కుటంగానేవుంది. ఒప్పుకుంటాం. భర్తలచే పీడింపబడే భార్యలు, అత్యాచారాలకు బలౌతున్న స్త్రీలు, అందునా బాలికలగురించి కూడా ఎక్కువగానే వింటున్నాం. ఇది నిజంగా విచారించదగ్గ విషయమే. అట్లని భార్యలచేత బాధింపబడే భర్తలే లేరని మాత్రం అనలేము. ఈ విషయం మన టీవీసీరియళ్ళు చూస్తే బాగా అర్థమైపోతుంది. అప్పట్లో సీనీనటి సూర్యకాంతంగారి నటనను చూచిన వాళ్ళకు ఇక వేరుగా చెప్పవలసిన అవసరమేలేదు. ఈవిషయాన్నే యోగివేమన తనజీవితానుభవాన్ని రంగరించి--

 

//వె// చెప్పులోనిఱాయి చెవిలోనిజోరీగ

                  కంటిలోనినలుసు కాలిముల్లు

                  ఇంటిలోనిపోరు ఇంతింతగాదయా

                 విశ్వదభిరామ వినుర వేమ .               ---   అన్నారు.

 

"ఇంటిలోనిపోరు" అంటే భార్యా కలహమే! అంతేగదామరి! ఈ విషయాన్ని తెలియజేసే ఒకకథ పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి రచించిన "జైమినీభారతం" లో వుంది. ఆయన "శిలామోక్షణఘట్టం" అన్న మకుటంబెట్టి కథవ్రాశారు. పురాణకథ గదా! అందుకే ఒకసారి చూద్దాం-

 

అది వింధ్యాటవీ ప్రాంతం. కౌండిన్యమహర్షి శిష్యులలో ఉద్దలకుడనే ముని వుండేవాడు. అతడు వివాహముజేసుకొని గృహస్థాశ్రమ జీవితం గడపాలనుకున్నాడు. గురువుకూడా దానికనుమతిస్తూ, శిష్యా! గృహస్థుగా తరించినవారెందరో వున్నారు. గృహస్థే అందరికీ ఆధారం. అన్నదాత. సాంసారికజీవనంలోని ఒడిదుడుకులను ప్రశాంతంగా భరిస్తూ, నిజాయితీగా జీవించడం గొప్పతపస్సు. గృహస్థజీవనంలో పతనానికిచేర్చే జారుడుమెట్లు ఎక్కువ, కనుక జాగ్రత్తగా మెలుగు. శుభం. అనిదీవించి పంపాడు. ఉద్దలకుడు ఒకశుభముహూర్తాన చండిక అనే కన్యను పెండ్లాడి సాంసారికజీవనం ప్రారంభించాడు. అంతే! అంతటితో అతని సుఖసంతోషాలు హరించుకపోయాయి. భార్య, యితడేదిచెప్పినా కాదనటం అలవాటుగా మార్చుకొంది. అరి అంటే తిరి అనసాగింది. ఉద్దాలకుని సహనానికి ఒక పరీక్షగా మారిపోయింది. ఇక అతడు భరించలేక గురువునాశ్రయించాడు. ఆయన ఉద్దాలకుని కష్టమంతావిని, శిష్యా! నీ భార్యసహచర్యంలో ఇప్పటికే నీవు చాలా సహనాన్ని అలవరచుకున్నావు. అదినీకు కలిగినమేలు, మరచిపోవద్దు. అయినా నీవు చాలా అలసిపోయవు. ప్రస్తుతం నీకు కొంతస్వాంతశ్శాంతి కలగటానికి ఒక సులువైన మార్గం చెబుతాను విను, నీకేది ఇష్టమో అది నాకవసరంలేదనీ, నీవు చెయ్యాలనుకున్నది చేయననీ, నీ భార్యతో చెప్పు. ఆమె నీకెలగూ విరుద్ధంగా మాట్లాడుతుంది గాబట్టి, నీపనులు నీవనుకున్నట్లు చేసుకోవచ్చు. ఇక నీకేయిబ్బంది వుండదు. ఈదినంనుండే నేనుచెప్పినట్లు చెయ్యి. పదిదినాల తర్వాత నేనే మీయింటికొస్తాను. పరిస్థితులు గమనించి, ఇంకా యేమైనా చేయాల్సివస్తే, అప్పుడాలోచిద్దాం. ఇకనీవు వెళ్ళిరా! అన్నాడు.

 

గురువుచెప్పిన కిటుకు ఫలించింది. భార్య తనపనులకు అడ్డుపడని రీతిలో దినాలు దడుస్తున్నాయి. ఇక గురువు రేపటిదినమే తనయిల్లు సందర్శిస్తారు. గురువుగారిని ఘనంగా సన్మానించి గౌరవప్రదంగా చూసుకోవాలనుకున్నాడు. భార్యను పిలిచి ప్రియసఖీ చండికా! రేపు మాగురువు మనయింటికొస్తామన్నారు. వారికి ప్రత్యేకంగా గౌరవమర్యాదలేమీ నేను చేయదలచుకోలేదు. వస్తూనే యెదోఒకటి చెప్పి పంపించేస్తాను. నువ్వుకూడా ముబావంగా వుండిపో అన్నాడు. వెంటనే చండిక అదేంమాట రాకరాక మీగురువు అదేపనిగా మనింటికొస్తే గౌరవించకుండావుండాలా? కుదరదు. ఆయన్ను గొప్పగా గౌరవించాల్సిందే, విందుభోజనం పెట్టాల్సిందే నన్నది. నీయిష్టం నేను చెప్పాల్సింది చెప్పానని ఊరకుండిపోయాడు ఉద్దాలకుదు. గురువు రావదమూ సకలమర్యాదలూ సజావుగా సాగిపోవడమూ ఉద్దాలకుడు లోలోపల ఆనందపడిపోవడమూ జరిగిపోయాయి. గురువును ఆశ్రమానికి సాగనంపుతూ మంచి ఉపాయం చెప్పినందుకు ఉద్దాలకుడు దారిలో గురువుగారికి మరీమరీ ధన్యవాదాలు తెలిపాడు.

 

కాలం సజావుగా గడవసాగింది. ఉద్దాలకుడు తన పితరులకు శ్రాద్ధకర్మ జరుపవలసిన తద్దినం తిధి వచ్చింది. సరే! భార్యనుపిలిచి రేపు మాతండ్రి తద్ధినం. ఆ కార్యక్రమాలేవీ నేనుచెయ్యను. బ్రాహ్మణులకు భోజనాలూగీజనాలూ పెట్టదలచుకోలేదు. అంతా దండుగ అన్నాడు. అలా అనడంతగదు. రేపు శ్రాద్ధకర్మ సక్రమంగా జరపాల్సిందే. సద్బ్రాహ్మణులనే పిలవండి. దక్షిణమిగులుతుందని ఎవరినంటేవారిని పిలవకండి. గొప్ప పండితప్రకాండులనే పిలవండి. పిండివంటలుకూడా కాస్తా ఎక్కువేచేద్దాం. వెళ్ళి సంబారాలు సమకూర్చండి. అంటూ తొందరపెట్టింది. ఉద్దాలకుడు సంతోషంతో తలమునకలైపోయాడు. తనమనసులో యేమనుకున్నాడో అదంతా సక్రమంగా జరిపించేశాడు. ఇక పారణచేసి పార్వణాన్ని(పిండాలను) జలధిలో కలపాలి. సంతోషంలోమునిగిపోయివున్న ఉద్దాలకుడు. కాస్తా ఆదమరచి, భార్యతో చండికా! శ్రాద్ధకర్మ నీసహకారంతో చాలా చక్కగా జరిగింది, ఇక పార్వణాన్ని పవిత్రజలాలో నిమజ్జనం చేసివస్తే కార్యక్రమం సంపూర్ణమౌతుంది అన్నాడు. అంతే! అన్నదేతడవుగా చండిక పిండాలను తీసుకొనిపోయి పెంటకుప్పలో పడేసింది. ఇంత చక్కగా జరిగిన శ్రాద్ధకర్మ కడకు పెంటకుప్పపాలైనందుకు ఉద్దాలకుడు అగ్రహోదగ్రుడయ్యాడు. చండికా! నీవెంత కఠినురాలవే. నీవేమాత్రమూ క్షమార్హురాలవుకావు. బండరాయివై పోదువుగాక! అని శపించేశాడు.  తనుచేసిన దుష్కృత్యాలేమిటో అప్పటికిగానీ అర్థముకాలేదు చండికకు. వెంటనే భర్తకాళ్ళపైబడి శాపవిముక్తికై ప్రాధేయపడింది. ఉద్దాలకుడు శాంతించి, ఆనందములో తనభార్య మనస్తత్వాన్ని మరచి వక్రమముగాగాక సక్రమముగా భార్యతో మాట్లాడినందుననే యింత అనర్థము జరిగినదని గ్రహించి, భార్యను క్షమించి, చండికా! నరనారాయణులు భూమిపై అర్జునకృష్ణులుగా అవతరిస్తారు. వారిలో అర్జునుని స్పర్శతో నీకు శాపవిముక్తి గలిగి తిరిగీ నన్ను చేరుకుంటావని శాపవిముక్తి తెలిపి, తపమాచరించటానికి వెళ్ళిపోయాడు.

 

మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు అశ్వమేధయాగం తలపెట్టాడు. అశ్వరక్షకునిగా అర్జునుడు వెళ్ళాడు. ఆసమయంలో ఒకచోట అశ్వం శిలకు అతుక్కపోయింది. సైనికులు ఎంతప్రయత్నించినా ఆరాతి నుండి అశ్వాన్ని విడదీయలేకపోయారు. అర్జునుడు దిగులుజెంది దగ్గరలోనున్న సౌబరిమహర్షి ఆశ్రమంచేరుకొని, మహర్షికి నమస్కరించి, యాగాశ్వం రాతికి అతుక్కున్న విషయం వివరించి, అశ్వంవిడివచ్చే ఉపాయం తెలుపవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడా మహర్షి తనదివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, అర్జునునకు ఉద్దాలకచండికల వృత్తాంతం వినిపించి, ఆశిల శాపగ్రస్తురాలయిన చండికయని తెలిపి, వెళ్ళి అర్జునా ఆశిలను నీచేతులతో తాకు. శుభం జరుగుతుందన్నాడు. ఆర్జునుని స్పర్శతో శిల అశ్వాన్ని వదిలేసి చండికగా మారిపోయింది. ఉద్దాలకుడుకుడా వెంటనే అక్కడకు వచ్చిచేరాడు. అర్జునుడు వారికి నమస్కరించి ఆశీర్వాదములుపొంది, ఆశ్వంతోపాటు దానిరక్షణకై ముందుకు కదిలాడు. ఉద్దాలకచండికలు తదనంతరం జీవితం సుఖమయంగా గడిపి, పుణ్యకార్యాలాచరించి, తరించారు.          

       

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...