Wednesday, 4 December 2024

ధ్వజస్తంభం, బలిపీఠాలు, విమానం

 

ధ్వజస్తంభం, బలిపీఠాలు, విమానం


 ప్రతిదేవాలయంలో మనం ధ్వజస్తంభం చూస్తూవుంటాం. ఈధ్వజస్తంభం గురించి సవిస్తరంగా తెలుసునేముందు దీనికి సంబంధించిన ఒక పురాణగాథను తెలుసుకొని తీరాలి. అదేమంటే, కురుక్షేత్రం యుద్ధంలోనెగ్గి ధర్మరాజు రాజయ్యాడు. అశ్వమేధయాగదీక్షబూని, అశ్వాన్ని వదిలారు. అశ్వాన్ని బంధించిన వారిని ఓడించి అశ్వాన్ని విడిపిస్తూవస్తున్నాడు, ఆశ్వరక్షకుడైన అర్జునుడు. మణిపురం రాకుమారుడు తామ్రధ్వజుడు యాగాస్వాన్ని బంధించాడు. అర్జునుడు, భీముడు, నకులసహదేవులు తామ్రధ్వజునితోపోరి గుఱ్ఱాన్ని విడిపించలేకపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు ఇద్దరూ బ్రాహ్మణరూపంలో మణిపురం ప్రవేశించి, రాజైన మయూరధ్వజుని దర్శించారు. రాజు బ్రాహ్మణులను సత్కరించి యేంకావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కృష్ణుడు, రాజా! నాపేరు కృష్ణశాస్త్రి. ఇతడు నాశిష్యుడు. మేము నా కుమారునితో గలసి, నాకుమారునికొఱకు సలక్షణమైనకన్య యీ నగరులో కలదని సంబంధము మాట్లాడుకొనుటకు వచ్చుచుంటిమి. దారిలోని అడవిప్రదేశమున ఒకసింహము నాకుమారుని పట్టుకున్నది. దానిబారినుండి నాకుమారుని విడిపించుకొనలేకపోతిమి. నన్ను ఆహరముగాగొని పుత్రుని విడువుమని వేడుకొంటిని. నీబక్కచిక్కినదేహము వలదన్నది సింహము. నాపుణ్యఫలమంతయూ ధారపోయుదునంటిని, నాకవసరములేదన్నది. మరేమి కావలయునంటిని, అప్పుడా సింహము, యీదేశాధీశుడు మయూరధ్వజుని శరీరములో కుడిసగభాగము దెచ్చియిచ్చిన నీకుమారుని వదిలెదనన్నది. మహారాజా! మేమేమి చేయగలము. ఈదానము మిమ్మడుగలేముగదా! యని విప్రులిద్దరు యేడుపుమొగము బెట్టుకొనిరి. రాజు, భయపడకుడు ఒక బ్రాహ్మణయుకుని రక్షించుటకు నాసగదేహము నిచ్చెదనని, తగుయెర్పాట్లు చేయుటకు, మంత్రుల నాజ్ఞాపించెను. విషయముదెలిసి రాజుభార్య కుమారుడువచ్చి, తమదేహములర్పింతుమనిరి. కానీ కృష్ణశాస్త్రి అలకాదు, ఆసింహము భార్యపుత్రుడు కలిసి త్రెంచియిచ్చిన రాజు కుడిశరీరభాగమే కావలెనని కోరుచున్నదనెను. ఇక చేయునదిలేక రంపపురెండుకొసలను భార్యపుత్రుడు బట్టి రాజును రెండుగాకోయుటకు బూనుకొనిరి. అప్పుడు రాజు యెడమకంట కన్నీరొలికెను. వెంటనే కృశ్ణశాస్త్రి, రాజా! యేడుస్తూయిచ్చే దానం మాకు వద్దనెను. రాజు అయ్యా! నాకుడిభాగమే సద్వినియోగమగుచున్నది, యెడమభాగము వృధాయయ్యెగదా! యని యెడమకంట కన్నీరొలికినది, అంతేగానీ యితరముగాదని పల్కెను. మయూరధ్వజుని త్యాగనిరతికి ఆశ్చర్యపోయి, ధర్మజకృష్ణులు నిజరూపమున రాజుకు దర్శనమిచ్చిరి. శ్రీకృష్ణుడు రాజా! నీ ధర్మనిరతికి కడుంగడు సంతసించితిని. వరముకోరుకొమ్మనెను.   పరమాత్మా! మీదర్శనభాగ్యమున ధన్యుడనైతిని. దేవా! యీదేహమనిత్యము. నాత్మ ఎల్లవేళల నీసన్నిధిననే వుండి, నిన్ను దర్శించుభాగ్యము ననుగ్రహింపుమని మయురధ్వజుడు వేడుకొనెను. కృష్ణపరమాత్మ సమ్మతించి, ప్రతిదేవతామూర్తి నాస్వరూపమేయైయున్నది. కనుక ప్రతిదేవాలయముందుభాగమున, నీవు ధ్వజస్తంభరూపమున, నాకెదురుగానిలచి యెళ్ళవేళల నన్ను దర్శించుచుందువు. దేవాలయమునందలి మూలవిరాట్టుకుజరుగు కైంకర్యములన్నీ నీకూ జరుగును గాక! యని వరమిచ్చెను. రాజు వెంటనే యాగాశ్వమునువిడువుమని కుమారునికానతిచ్చి, నాకుమారుడు తెలియక జేసినతప్పును మన్నించమని ధర్మజకృష్ణులను వేడుకొనెను. ఇదీ ధ్వజస్తంభముయొక్క పురాణకథగా పెద్దలు చెప్పుదురు.

 ఈమణిపుర రాజైన మయూరధ్వజుని పుణ్యకథ జైమినీభారతముననున్నది. అందులో ధర్మజునికిబదులు అర్జునుడు బ్రహ్మణుని రూపమున శ్రీకృష్ణుని వెంటవెళ్ళినట్లున్నది. అదియు మయూరధ్వజుని త్యాగనిరతిని అర్జునుని కెరిగించుట కట్లు శ్రీకృష్ణపరమాత్మ నాటకమునడిపెను. ధ్వజస్తంభప్రసక్తి అక్కడలేదు. అయినా అంతటిత్యాగపురుషుడైన మయూర ధ్వజుడు కోరరాని వరమేమి కోరలేదు. శ్రీకృష్ణపరమాత్మ యివ్వకూడని వరమేమి యివ్వలేదు. కనుక కథ సమంజసము గనే యున్నది.

 దేవాలయాల్లో ధ్వజస్తంభం తర్వాతే దైవదర్శనం. ధ్వజస్తంభం దగ్గరకొట్టే గంటను బలిగంటగా పిలుస్తారు. ఆగంట మ్రోగించి మనలోని అరిష్డ్వర్గాలను బలివెట్టి స్వచ్ఛతతో దైవదర్శననికి వెళ్ళుటను ఇది సూచిస్తుంది. ఆలయం దేహంగా, గర్భాలయం ముఖంగా, ఆలయప్రాకారలు హస్తాలుగా, ధ్వజస్తంభం హృదయంగా పెద్దలు భావించాలంటారు. దీన్నిబట్టి మూలవిరాట్టు యెంతముఖ్యమో ధ్వజస్తంభం కుడా అంతే ముఖ్యమని తెలుస్తున్నది. గర్భగుడిలోని మూలవిరాట్టు ప్రతిష్ఠకుముందు జలాధివాసం, ధాన్యాధివాసం చేయించినట్లే ధ్వజస్తంభానికికూడా జల ధాన్యాధివాసాలు చేయిస్తారు. మూలవిరాట్టు దృష్టికోణానికి యెదురుగా ధ్వజస్తంభం వుండటంవల్ల దైవశక్తి స్తంభంలో నిక్షిప్తమైవుంటుంది. అందుకే బలిహరణలు, అర్చనలు ధ్వజస్తంభానికిగూడా జరుపుతారు. చేవగలిగిన పలాస (మోదుగ) అశ్వత్థ (రావి) మారేడు (బిళ్వం) బంధూకం (వేగిస) పనస, వకుళ (బొగడ) అర్జున (మద్ది) నారవేప, సోమిద వృక్షలలో ఒకదానిని ధ్వజస్తంభంగా అమరుస్తారు. రాతిస్తంభాలనుగూడా కొన్నిదేవాలయాలో ధ్వజస్తంభాలుగా అమర్చారు. ధ్వజస్తంభం గోపురకలశంకంటే యెత్తుగావుండటం ఉత్తమం. సమంగావుంటే మధ్యమం. అంతకంటే తక్కువైతే అధమంగభావిస్తారు. స్థాపనకుముందు స్తంభంక్రింద కూర్మయంత్రం స్థాపిస్తారు. స్తంభంపైన మూడువరుసల్లో జండాయెగురుతున్నట్లు పైచెట్ల కలపతోనే నిర్మిస్తారు. వీటిని మేఖల అంటారు. మేఖలక్రింద వైష్ణవలయమైతే సుదర్శనచక్రం, శివాలయమైతే నంది, దేవ్యాలయమైతే సింహం అమరుస్తారు. మేఖల క్రింద చిరుగంటలు కూడా అమరుస్తారు. ఇవి గాలికి హృద్యంగా మ్రోగుతుంటాయి. స్తంభం, మేఖల మొత్తం ఇత్తడి, వెండి, బంగారు రేకుతో ఆలయఆర్థికస్థాయినిబట్టి తపడంచేస్తారు. ఉత్సవసమయాలలో ప్రారంభసూచకంగా ధ్వజస్తంభంపై కాషాయంజండా యెగురరేస్తారు. ముగింపుసూచకంగా జండాదించేస్తారు. జండాపై గరుత్మంతుడు, నంది, లేదా సింహము గుర్తు మూలవిరాట్టు కనుగుణంగా వుంటుంది. ఈజండానుబట్టే ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయని, జరుగుతున్నాయని, లేదా ముగిశాయనే విషయం దూరస్తులకు సహితం తెలుస్తుంది. ధ్వజస్తంభపీఠం నాలుగువైపుల దేవతావిగ్రహాలనూ ప్రక్కనే బలిపీఠం స్థాపిస్తారు. మూలవిరాట్టుకు యెదురుగా రామాలయమైతే హనుమంతుని విగ్రహం, వేరే వైష్ణవాలయాలలో గరుత్మంతునివిగ్రహం, శివాలయమైతే వీరభద్రునివిగ్రహం ధ్వజస్తంభానికానుకొని స్థాపిస్తారు. ధ్వాజస్తంభంపై దీపముంచినవారి జన్మలు ధన్యమౌతాయని విశ్వసిస్తారు. పూర్వమీదీపాలే బాటసారులకు మార్గదర్శకాలుగా ఉపయోగపడేవి. ప్రస్తుతం కార్తీకమాసంలో మాత్రం వెలిగిస్తున్నారు. ధ్వజస్తంబం వెన్నుబామును సూచిస్తున్నదని పెద్దలు చెబుతున్నారు. వెన్నులో 32 స్పయిరల్ యెముకలున్నట్లే, ధ్వజస్తంభానికి తాపిన రేకుపై 32 కణుపులు కనబడేట్లు చేస్తారు. ఇదీ ధ్వజస్తంభ మహత్తరచరిత్ర. ఇక దేవాలయంలో గల బలిపీఠం, విమానం గురించికూడా తెలుసుకుందాం.

 బలిపీఠాలు: గర్భగుడి, విమానం, విగ్రహం, బలిపీఠం యీనాలుగు దేవాలయానికి ముఖ్యంగా వుండితీరాలి. ఆలయంముందు తూర్పున ఒక పెద్దబలిపీఠం వుంటుంది. ఇదికాక యెనిమిదిదిక్కులా చిన్నచిన్న బలిపీఠాలు వుంటాయి. విరిసినపద్మంవలె బలిపీఠం నిర్మిస్తారు. ఇక్కడ ఇంద్రాదిదిగ్దేవతలకు బలివేస్తారు. గర్భగుడిలో శాంతిమంత్రాలతో ప్రత్యేకంగా నైవేద్యం సమర్పిస్తారు. ఆరుబయట బహిరంగంగావున్న బలిపీఠాలకు సమర్పించేది బలి. దీనివల్ల దేవతలకు పుష్టికలుగుతుంది. బలివేసిన అన్నం భక్తులు భుజింపరు. బలిభుక్కులవల్ల భైరవ (కుక్క) కాకి, ఇతరపక్షులు, చీమలు, పురుగులు మరియు కనిపించని సూక్ష్మజీవులకు ఆహారం లభిస్తుంది. అవి తృప్తిపడతాయి. తప్పనిసరిగా బలిభుక్కులు సమర్పించాలని శాస్త్రనియమం. విష్ణుతిలకసంహితప్రకారం బలిపీఠాలను శిల, మట్టి, కొయ్య దేనితోనైనా చేయించి స్థాపించవచ్చును.  గోపురంబయట, లేక మొదటిప్రాకారం బయటనైనా బలిపీఠాలను స్థాపించుకొనవచ్చును. గర్భగుడి పైనున్న విమానం, గుడిముందున్న పెద్దబలిపీఠం రెండూ సమానశక్తిమంతములని నారాయణసంహిత చెబుతున్నది. బలిపీఠంనుండి శక్తి అడ్డంగా ప్రవహించి, ఆలయపరిసరాలను పవిత్రీకరిస్తుంది. శివాలయాల్లో బలిపీఠాన్ని భద్ర లింగమని పిలుస్తారు. దీన్ని దర్శించినా శివదర్శనమైనట్లే. ప్రదక్షణసమయంలో యీబలిపీఠాన్నికూడా కలుపుకొని ప్రదక్షణలుచేయాలి. అలా వీలుండని దేవాలయలలో, బలిపీఠాలను తాకినమస్కరించుకుంటారు. అందువల్ల ఆయా దిక్కుల అధిదేవతలు సంతోషించి మేలుచేస్తారు. బలిపీఠంవద్ద భక్తులు తమదుర్గుణాలను బలివెట్టి, ఆలయంలోనికి పవిత్రులై ప్రవేశించాలనీ, అందుకే ముఖ్యంగా బలిపీఠముందని పండితులు చెబుతున్నారు.

 విమానం: గర్భగుడిపై నిర్మితమైన గోపురాన్ని విమానం (కేంద్రదేవతా వాసం) అంటారు. " విమానం భవనం హర్మ్యం/ సౌధం దామ నికేతనం// ప్రసాద సదనం పద్మ/ గేహమావాసకం గృహమ్//" అన్నది ఆర్యోక్తి. విమానం ముకుళిత పద్మాకారంలో నిర్మింపబడుతుంది. కేంద్రీకృతమైన శక్తిచైతన్యం విమానంద్వారా ఆలయపైభాగమంతా ఆవరించి, పవిత్రతను వెదజల్లుతూ వుంటుంది. ఈవిమానాన్ని ప్రత్యేకంగా తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంపై ప్రస్ఫుటంగా దర్శింపవచ్చును. ఈవిమాన వెంకటేశ్వరుని గురించి అనేక కథలు వ్యాప్తిలోనున్నవి. వాటిలో ముఖ్యమైన వాటిని గూర్చి తెలుసుకుందాం.


 ఆనందనిలయంగా పిలువబడే గోపురంమీద ఉత్తరదిశగా మొదటిఅంతస్థులో యీ విమానవెంకతేశ్వరుని భక్తులు దర్శించుకుంటున్నారు. సులువుగా గుర్తించడానికి వీలుగా బంగారుతాపడంచేసిన ఆలయగోపురంమీద తెల్లనివెండి మకరతోరణం విమానవెంకటేశ్వరునికి యేర్పటుచేసియున్నారు.

 విజయనగర చక్రవర్తి నరసింహరాయల కాలంలో వైఖానసపారంపర్య అర్చకుడి స్థానం ఖాలీకాగా, ఆపద్ధర్మంగా శ్రీవారిఅర్చకత్వాన్ని మధ్వసాధువు గురువునైన వ్యాసరాయలు12 సంవత్సరాలు నిర్వహించారు. ఆయనకాలంలోనే విమానవెంకటేశ్వరుని ప్రాణప్రతిష్ఠ జరిగింది. మూలవిరట్టుకు నివేదించిన నైవేద్యాలే యీస్వామికీ నివేదిస్తారు. అసలు తిరుమలలో భూవరాహస్వామికితప్ప మిగిలినదేవతామూర్తులకు మూలవిరాట్టుకు సమర్పించిన నైవేద్యాలే సమర్పిస్తారు. భూవరాహస్వామికిమాత్రం వేరుగా నైవేద్యం సమర్పిస్తారు. మూలవిరాట్టుదర్శనం యెకారణంచేతనైనా చేయలేని భక్తులు, విమానవెంకటేశ్వరుని దర్శించుకొని వెళ్ళేవారు.

 మరొకకథనం ప్రకారం, విజయనగరప్రభుఒకరు స్వామినిదర్శించుకోవటానికి వచ్చినపుడు, తొమ్మిదిమంది అర్చకులు స్వామిఆభరణాలను ధరించి కనిపించారట. రాజుకోపంతో వారిని అక్కడికక్కడే చంపేశారట. ఆపాపపరిహారంకోసం ఆలయాన్ని మూసివేసి, 12 సంవత్సరాలు వ్యాసరాయలు కఠోరదీక్షతో స్వామిని అర్చించారట. భక్తులకొఱకు ఆయనే విమానవెంకటేశ్వరుని స్థాపనచేశారట. 

 మరోకథనం ప్రకారం ముస్లింల దాడులకు గురికాకుండా వుండటంకోసం ఆలయాన్నిముసియుంచి, పూజారులు మాత్రం లోపలికివెళ్ళి, పూజలుచేసి, మళ్ళీతలుపులు మూసేసేవారట. ఆసమయంలో భక్తులు యీవిమానవెంకటేశ్వరునే కొలిచేవారట.

 ఇంకా మరిన్ని కథలు వ్యాప్తిలోవుండటం గమనార్హం. ఏదియేమైనా విమానవిగ్రహం గర్భగుడిలోని మూలవిరాట్టుతో సమానమని పండితులు నిర్ధారించి చెబుతున్నారు.   

  


             

  

 

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...