Showing posts with label kaatuka kallu. Show all posts
Showing posts with label kaatuka kallu. Show all posts

Monday, 17 October 2022

కాటుక కళ్ళు, kaatuka kallu


 

కాటుక కళ్ళు

 
"సర్వేంద్రియానాం నయనంప్రధానం" అన్నారు పెద్దలు. అట్టి నయనము (కన్ను)నకు చక్కటి అందాన్నిచ్చి సంరక్షించేదికాటుక. కులమతాలకతీతంగా అందరూ కాటుక పెట్టుకుంటారు. శారదాదేవికి విన్నవించుకుంటూ "కాటుక కంటినీరు..."అన్న పద్యం లిఖించారు పోతన తన భాగవతంలో . అంటే సరస్వతీదేవి కాటుకధరించిందనేగదా! కనుక హిందువులు అతిపురాతన కాలమునుండి కాటుక ధరిస్తున్నారని అర్థమౌతున్నది. 12 వేలసంవత్సరాలకు పూర్వమునుండి ఈజిప్టు, మెసపుటేమియా ప్రజలు కంటికికాటుక పెట్టుకొనేవారని చరిత్రకారులు తేల్చిచెప్పారు. మంగళద్రవ్యాలలో ఒకటిగా కాటుకను హిందువులు భావిస్తారు. శ్రావణమంగళవారవ్రతగాథలో దీని మహాత్మ్యం గొప్పగాచెప్పబడింది. గౌరీదేవిని యీవ్రతంలో పూజిస్తారు. పూజాద్రవ్యాలలో కాటుక చాలా ముఖ్యమైనది. ఈవ్రతంలో వాయనంగా పొందినకాటుకధరించడంవల్ల ఒక ఇల్లాలు అల్పాయుస్కుడైన భర్తను దీర్ఘాయుస్కునిగా మార్చుకొని నిత్యసుమంగళిగా జీవిస్తుంది. కాటుక దిష్టిదోష  నివారిణి. అందుకే చంటిబిడ్డలకు బుగ్గపైనా అరికాలికి కాటుకచుక్కను దిష్టిచుక్కగ పెడతారు. పెండ్లిలో వధూవరులకు తప్పనిసరిగా చెక్కిలిపై కాటుకచుక్కపెడతారు. కంటికాటుకవల్ల కుజగ్రహదోషం తొలగిపోతుంది. వివాహం ఆలస్యమవ్వడం, వైవాహికసమస్యలవంటి చిక్కులు కూడా తొలగిపోయి శుభములు చేకూరుతాయి.
 
ఒక్కమనిషికి మాత్రమే నల్లటికనిగ్రుడ్డు చుట్టూ తెల్లటిభాగముంటుంది. అందువల్ల కాటుకధరిస్తే కళ్ళు విశాలంగా కనిపిస్తాయి. అంతేగాదు భరతనాట్యం కథాకళి నృత్యాలలో కళ్ళు కలువల్లామెరుస్తూ భావప్రకటనకు అనుకూలమై ప్రదర్శన రక్తిగట్టడానికి యీ కంటికాటుక ఉపకరిస్తుంది.
 
మహమ్మదీయులు"సుర్మా"అనే కాటుకను ధరిస్తారు. ఈజిప్టు సిరియాదేశాల సరిహద్దులోగల కోహితూర్ (సైనాయి) పర్వతాల్లో లభించే నల్లనిరాయిని మెత్తగాచూర్ణించి రోజ్‌వాటర్‌తోకలిపి కళ్ళకుసుర్మా(కాటుకగా) పెట్టుకుంటారు. రంజాన్‌నెల ఉపవాసదినాల్లో ప్రార్థనకుముందు కాళ్ళూచేతులు,మొగం శుభ్రంచేసుకున్న(వజూ)తర్వాత సుర్మా వేసుకోవడం పరిపాటి. మహమ్మదుప్రవక్త సహితం సుర్మా వేసుకునేవారట. అందుకే యింటికివచ్చిన అతిథులకు ముస్లింలు సుర్మా, సెంటు యిచ్చి గౌరవిస్తారు. రంజాన్‌మాసంలో ఆడమగ అందరూ సుర్మా ధరిస్తారు. ఈసుర్మారాళ్ళు నల్లగావుండటానికికారణం, మూసా ఎ ఇస్లాం (మోషే) ప్రవక్తవారికి సైనాయిపర్వత ప్రాంతంలో దైవీయకాంతి కనిపించింది. ఆవెలుగు అగ్నియై పర్వతాన్ని దహించింది. అక్కడిరాళ్ళు కాలి నల్లగామారిపోయాయి. అవే సుర్మారాళ్ళు. హైదరాబాద్,పాతబస్తీ, చార్మినార్‌ప్రాంతంలో యీరాతిముక్కలను అరేబియానుండి తెప్పించి సుర్మాచేసి విక్రయిస్తున్నారు. సుర్మా చలువచేస్తుంది. క్రైస్తవులు కాటుకవద్దంటారు. బైబిలు ప్రకారం దేవుడిచ్చిన అందంచాలు. కాటుకతో దైవనిర్మితమైన అందం సరిజేసుకోవడం. హెచ్చించుకోవడం అవివేక మని భావిస్తారు. దైవనిర్మితాన్ని యథాతథంగా వుంచుకోవడం ధర్మమని వారనుకుంటారు. ఎవరినమ్మకం, యెవరియిష్టం వారిది. తప్పుపట్ట నవసరంలేదు.  
 
కాటుక కంటినరాలకు బలంచేకూరుస్తుంది. ప్రారంభంలోవున్న కంటివ్యాధులను నయంచేస్తుంది. కళ్ళు చల్లబడతాయి. దుమ్ముధూళి పొగనుండి రక్షణ నిస్తుంది. కళ్ళలోని ఎర్రచారలను తొలగిస్తుంది. తదేకంగా కంప్యూటర్‌చూడ్డంవల్ల కలిగే శ్రమనుతగ్గిస్తుంది. సూర్యునికిరణాలవేడిమివల్ల కలిగే కళ్ళమంటలు తగ్గిస్తుంది. దృష్టిదోషాలను పోగొడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. కనురెప్పల వెంట్రుకలు పెరిగి కంటికి అందం రక్షణ కాటుక కలుగజేస్తుంది.
 
అనేకరకాల కాటుకలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఘాడమైన నలుపుకోసం కొన్నింటిలో సీసం మరియు లెడ్‌సల్ఫయిడ్(గలీనా)వడుతారు. ఇది కంటికి మంచితిదికాదు. అలర్జీ కలుగవచ్చు. రాగి, ఆంటిమొనీ వంటి లోహాలపొడితో చేసిన కాటుకలు ఐలైనర్స్ పేరుతో లభిస్తాయి. ఇవి కంటికి మంచిదే. వీటన్నిటికంటే ఇంట్లో తయారుచేసుకొనే కాటుకలు శ్రేష్ఠం. వీటిలోకూడా నాలుగైదు రకాలున్నాయి. అందులో నేత్రసంజీవని ఒకటి. ఆవుపేడతో తయారుచేసిన పిడకను ఆవునెయ్యి 15చంచాలు, ఆముదం 15చంచాలు కలిపి పిడకను తడిపిపెట్టుకోవాలి. ఇటుకలతో 2,3 అంగుళాల ఎత్తుగల పొయ్యిని తయారుచేసుకోవాలి పిడకను పొయ్యిలోవుంచి అగ్గిపెట్టాలి. పొగప్రక్కకు పోకుండా ఇటుకలపైన రాగిలేక ఇత్తడిపళ్ళెంపెట్టి పళ్ళెరంపై కొన్నిచల్లని నీళ్ళుపోయాలి. పిడకనుండి వచ్చినపొగ పళ్ళెరానికి మసిగా అంటుకుంటుంది. పిడక బాకాకాలి చల్లారినతర్వాత పళ్ళెరంలో నీరుమిగిలివుంటే తుడివేయాలి. పళ్ళెరానికి అంటిన మసితుడిచి ఒకరాగి బరిణలో వేసుకొని అందులో అరగ్రాము పచ్చకర్పూరం, కాస్తా ఆవునెయ్యి కలిపితే నేత్రసంజీవనికాటుక తయారౌతుంది. దీనికికొద్ది మార్పుతో చందనకాటుక తయారుచేసుకోవచ్చు. ఇందులో పిడకకుబదులు ఆముదపుదీపం ఉపయోగించుకోవాలి. పళ్ళెరానికి లోపలివైపున చందనంపేస్టును పట్టించాలి.ఆచందనానికే సెగ పొగబాగతగిలి మసి తయారౌతుంది. మిగిలినదంతా నేత్రసంజీవని వలెనే చేసుకోవాలి. దీపానికి బదులు బాదంపప్పులు ప్రమిదలోపెట్టి అగ్గి అంటించాలి. వాటిపొగతో ఏర్పడిన మసితో కూడా కాటుక తయారుచేసుకోవచ్చు. ఇవికాకుండా బజారులో చార్కోల్(బొగ్గు)క్యాప్సూల్స్ దొరుకుతాయి. వాటిలోని బొగ్గుపొడిని అముదంతో తడిపి కాటుకగా వాడుకోవచ్చు.
 

ఆఖరుగా మరొక్కమాట. కొందరు కాటుక సరిగ్గా అంటడంలేదని ఎక్కువసేపు వుండటంలేదని చీకాకుపడి కాటుకజోలికి పోరు. అలా విసుగుపడాల్సిన పనిలేదు. తొలుత ఐస్క్యూబ్(మంచుగడ్డ)తో కంటిరెప్పలురుద్ది, శుభ్రంచేసుకొని కాటుక పెట్టుకోవాలి. తర్వాత ఇయర్‌బడ్స్ తో కనురెప్పలకు టాల్కంపౌడరు అద్ది పైపైన తుడుచుకుంటే కాటుకబాగుంటుంది. తొందరగా చెదిరిపోదు.                           


 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...