భార్గవ రాముడు
అవతారము
అవతారమెత్తెననగా దిగివచ్చినాడని అర్థము. భగవంతుడు భులోకము
నకు దిగివచ్చినాడు గనుక అది భగవదవతారమైనది. భగవంతుడు సర్వవ్యాపి. ఇక దిగివచ్చుటేమిటి? అర్థరహితముగదా? అనిపించును. భగవంతుడు నామ రూప గుణరహితుడు. నిరామయ స్వచ్ఛస్థితే భగవంతుడు. అట్టి మహత్తర స్థితి నుండి రూప నామ గుణములు, కాలస్థలములకు లోబడిన వాడుగా మారడమే దిగిరావడమౌతుంది.
సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడు. తనుచేసిన సృష్టి సక్రమముగా నుండవలయును గదా? కనుక క్రమము తప్పిన దానిని సరిచేయవలసి యుండును. అందుకే భగవంతుడవతరించును. తాను నిర్వహించ వలసిన పనికి తగిన శక్తితో అవతారము సంభవించును. నిజమునకు భగవంతుడు సర్వశక్తిమంతుడు. శక్తి ప్రయోగవిషయముననూ ఒక నియమమున్నది. మార్పుదెచ్చుటకు బోధ జరుగును, తప్పు సరిదిద్దు
కొనుటకు అవకాశముపై అవకాశమివ్వబడును. అది దుర్వినియోగ పరచుకొన్నచో దండన తప్పదు.
రాజలోకము రజోగుణ తమోగుణోదృతితో మితిమీరి పోయినది.
దాని నదుపుచేయుట అత్యంతావశ్యకమైనది. అది కారణమై పరశురామావతారము సంభవించినది.
పూర్వ కథ
ఋచీకుడు ఒకఋషి. భృగువంశమున బుట్టినవాడు. ఇతడు గాధియను రాజు కుమార్తె సత్యవతిని వివహమాడ దలచెను. రాజు నీలవర్ణపు చెవిగల తెల్లటిగుఱ్ఱములు ఒకవేయి ఓలిగా అడిగెను. (అట్టి గుఱ్ఱములు యజ్ఞములకు శ్రేష్టములు) ముని వరుణుని అనుగ్రహమున వాటిని సాధించి రాజునకిచ్చి సత్యవతిని వివాహమాడెను. సత్యవతి అత్యంతశ్రద్ధతో భర్తను సేవించెను. ఋచీకుడు ప్రసన్నుడై భార్యను వరము కోరుకొమ్మనెను. ఆమె యోచించి పుత్రహీనయైన తన తల్లికి ఒకకొడుకు, తనకొకకొడుకు కావలెనని వరము కోరుకొనెను. సరియని ఋచీకుడు యజ్ఞముచేసి చరువు (యజ్ఞప్రసాదము) రెండుగిన్నెలలో వేరువేరుగా నింపి యిది అత్తగారికి యిదితనభార్యకని నియమించి మంత్రపూత జలమునుకూడా సిద్ధముచేసి, యెవరిది వారే సేవించి జలములు త్రాగుడని భార్యకు జాగ్రత్త చెప్పి యిచ్చి, అత్తగారు రావిచెట్టును, భార్య మేడి చెట్టును కౌగిలించు కొనవలెనను నియమముకూడా విధించెను. కానీ భార్య పొరబాటున అంతయూ తారుమారు చేసెను. అది గ్రహించిన ఋచీకుడు భార్యనుపిలిచి నీవు నేను చెప్పినదానికి భిన్నముగా చేసితివి కనుకనీకు క్షత్రియస్వభావుడు, నీ తల్లికి బ్రాహ్మణ స్వభావుడైన పుత్రులు గల్గెదరని చెప్పెను. అందుకు సత్యవతి బహుదాచింతించి తనబిడ్డడు రజోగుణప్రథానుడు గాకుండా మనుమడు అట్టి రాజసము గలవాడగునట్లు చేయుడని భర్తను ప్రార్థించెను. ఋచీకుడు తన తపశ్శక్తితో అట్లుగావించెను. కనుక ఋచీకపుత్రుడైన జమదగ్ని గాక మనుమడగు రాముడు రాజసగుణ
పూర్ణుడయ్యెను. గాధి కుమారుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి యయ్యెను. ఇదీ భార్గవరాముడు రజోగుణోద్ధతు డగుటకు గల పూర్వగాథ.
అవతారము యొక్క అవసరము
కృతవీర్యుని వంశజులగు రాజులు దూర్తులు, మత్తులు. గర్వాతిరేకులై, జనులను పీడింపజొచ్చిరి. ధనమునకై భృగువంశజులైన భార్గవులను సైతము బాధించిరి. మునిపత్నులను గూడా విడువరైరి. వీరి ఆగడము
లకు వెరచి చ్యవనపత్ని తన గర్భస్థశిశువును ఊరు (తొడ) ప్రదేశము
నకు మార్చుకొని రక్షించుకొన్నది. కనుకనే ఆబిడ్డ ఔర్వుడను పేరున ప్రసిద్ధుడాయెను. ఆ ఔర్యుని పుత్రుడే ఋచీకుడు.
రాజుల అత్యాచారములు మితిమీరిపోయెను. గర్వితులై గురుపదము ననున్న భార్గవుల బోధలను పెడచెవినబెట్టిరి. ఇచ్చిన ప్రతిఅవకాశము ను వారు దుర్వియోగ పరచిరి. అంతేగాక సాత్వికులైన బ్రాహ్మణులను హింసించిరి. స్త్రీలను సైతం వదలక వేధించుటతో వారి పాపము పరాకాష్టకుచేరినది. ఇక వారిని తెగటార్చుటతప్ప వేరు గత్యంతరము లేకపోయినది. బ్రాహ్మణులైన భార్గవులను చెనకుటచేత అదేవంశము నందే అజేయమైన బ్రహ్మతేజము రూపుదాల్చెనాయన రాముడవతరించి, బ్రహ్మగర్జనచేసి రాజుల మస్తకముల ఖండించెను.
పితృవాక్య పాలన
జమదగ్ని భార్య రేణుక. ఆమె నీళ్ళుతెచ్చుటకు గంగకు వెళ్ళినది. అక్కడ చిత్రరథుడనే గంధర్వుడు తన ప్రియురాండ్రతో జలక్రీడలాడుతున్నాడు. ఆదృశ్యా న్ని చూసిన రేణుకకు మతిచెలించింది. కొంతసేపటికి తేరుకొని నీళ్ళు తేవటానికి యిసుకతో కుండను తేయబూనినది. అది ఆమె ప్రతి
దినమూ చేసే పనేయైనా యీనాడు వీలుపడలేదు. చిత్రతథుని ప్రేమ
కలాపాలు చూసిచూసి ఆమె మనసు మలినమైంది. కనుక యిసుకతో కుండ చేయలేకపోయింది. చేసేదిలేక ఉత్తచేతులతో ఆశ్రమం చేరింది. పరిస్థితి జమదగ్ని గ్రహించాడు. అగ్రహోదగ్రుడయ్యాడు. కొడుకులైన రమణ్వతుడు, సుసేనుడు, వసువు, విశ్వావసులను పిలిచి రేణుకను నరికేయమన్నాడు. వారు మాతృ హత్యకు సాహసించలేక పోయారు. వెంటనే చిన్నకొడుకైన రాముని పిలిచి నీ తల్లిని అన్నలనూ నరికేయమన్నాడు. రాముడు తక్షణం ఆపనిచేసి తండ్రియెదుట చేతులు జోడించి నిలబడ్డాడు. ఈ సందర్భమున పోతన (భాగవతంలో) యిలాఅంటాడు.
శా: తల్లిన్ భ్రాతలనెల్ల జంపుమనుచో దా జంపిరాకున్న బెం
పెల్లన్బోవ శపించు తండ్రి తనపంపేజేయుడున్ మెచ్చి నా
తల్లిన్భ్రాతల నిచ్చు నిక్కము తపోధన్యాత్మకుండంచు వే
తల్లిన్భ్రాతల జంపె భార్గవుడు లేదా చంప జేయాడునే.
భాగ-9-472
అంటే తండ్రి ఆగ్రహానుగ్రహ సంపన్నుడు గనుక అట్లు చేసినాడు. లేకుంటే రాముడట్లు చేసి వుండడని ఆయన భావము. అంతేగాదు అది అందరూ చేయదగ్గపని కాదు. అది రామునకెచెల్లునని పోతన మనలను హెచ్చరిస్తాడు. గమనించండి.
ఆ;వె. పడినవారి మరల బ్రతికింప నోపును
జనకుడనుచు జంపెజామదగ్న్యుఁ;
అతడు జంపెననుచు నన్నల తల్లిని
జనకునాజ్ఞనైన జంప దగదు.
భాగ-9-476
అలా తండ్రిఆజ్ఞనమలుజరిపిన రామునిజూచి. జమదగ్ని కోరుకొమ్ము అడిగిన వరమిచ్చెద నన్నాడు. వెంటనే రాముడు తల్లిని అన్నలను బ్రతికించి యిమ్మన్నాడు. జమదగ్నివారిని బ్రతికించక తప్పలేదు. దీనివలన తల్లికిగల్గిన అన్యపురుషచింతనాఘము, అన్నలకుగల్గిన పితృవాక్యధిక్కార పాపమూ అనుభవమునకువచ్చి సమసిపోయినట్లయినది . భగవంతుని కార్యములిట్లుండును. అంతేకాదు, రాబోవు దూర్తక్షత్రియసంహా ర కార్యమున దయాదాక్షిణ్యములు వీడి క్రౌర్యము బూనుట కిది శిక్షణ యయ్యెను.
అస్త్రసముపార్జనము
రాముడు తండ్రి యనుమతి వడసి తన పితామహ, ప్రపితామహులైన ఋచీక ఔర్వ భృగు ఆశ్రమముల దర్శించి. వారి ఆశీర్వాదములు పొంది. వారి ఆజ్ఞమేరకు శివునిగూర్చి ఘోరతపముచే సె ను. శివుడు రామునిదీక్షను కిరాతుని రూపమున వచ్చి పరీక్షించి నిగ్గుదేల్చి నిజదర్శనమిచ్చి మరింత శక్తిమంతుడగుటకు తీర్థయాత్రలుచేసి రమ్మనెను. శివునాజ్ఞ తలదాల్చి తీర్థముల సేవించి తిరిగి తపమాచరించి పరిపూర్ణుడాయెను. అప్పుడు శివుడు మహోదరుని ద్వారా రాముని తన సన్నిధికి రప్పించుకొని శివశక్తితోపాటు ఒకపరశువును ఆయుధముగా ప్రసాదించి అమరావతిపై దండెత్తిన రాక్షసుల దండించమని పంపెను. రాముడు ఆపని పూర్తిచేసి తిరిగీ తపమాచరించదొడగెను. శివుడు రాముని ప్రవర్తన కార్యదీక్షా దక్షతలు మరియూ భక్తినీ గుర్తించి శిష్యునిగా అంగీకరించి కవచము, భార్గవాస్త్రము మరియూ రౌద్రాస్త్రము ప్రసాదించెను. దానితో రాముడు అవతారనిర్వహణ కవసరమగు సమర్థతను సంతరించుకొనెను. ఈ విధంగా హరియవతారమైన భార్గవరాముడు శివశిష్యుడై శైవ వైష్ణవ భావములకొక సామరస్యమయ్యెను.
అవతారకార్య నిర్వహణము
హైహయవంశపు రాజులలో కార్తవీర్యార్జునుడు ప్రసిద్ధుదు. దత్తాత్రేయు నారాధించి వేయిచేతులు అణిమాదివిద్యలూ, ఓజస్సూ, తేజస్సూ యింద్రియపటుత్వమూ పొంది యశస్సు గడించినాడు. బలవంతుడైన రావణుని ఓడించి బంధించినాడు. బ్రహ్మకోరిక మేరకు రావణుని మందలించి విడిచిపుచ్చినాడు. కార్తవీర్యుడు వరగర్వితుడై హద్దుమీరి ప్రవర్తించసాగాడు. ఒకనాడు వేటకువెళ్ళి అడవిలో అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి సైన్యసమేతుడై వెళ్ళాడు. అక్కడ కామధేనువు సహాయంతో రాజుకు సకలసదుపాయాలూ సమకూర్చాడు జమదగ్నిమహర్షి. కానీ కార్తవీర్యుడు వెళుతూవెళుతూ యీధేనువు నీకంటే నాకే యెక్కువ అవసరం అంటూ బలవంతంగా లాక్కొని పోయాడు. పరశురాముడు ఆశ్రమానికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని కోపోద్రిక్తుడై రాజుకు బుద్ధిచెప్పడానికి ఆయుధాలు ధరించి బయలుదేరాడు. ఈసందర్భంలో పోతన రామున్ని యిలా మన యెదుట సాక్షాత్కరింపజేసినాడు.
మ: ప్రళయాగ్నిచ్ఛటభంగి గుంభి విదళింపన్ బారు సింహాకృతిన్
బెలుచన్ రాముడిలేశువెంట నడచెన్ బృధ్వీతలంబెల్ల నా
కులమై గ్రుంగ గుఠారియై కవచియై కోదండియై కాండియై
ఛలియై సాహసియై మృగాజిన మనోజ్ఞ శ్రోణియై తూణియై.
భాగ-9-444
ఆవిధంగా వెళ్ళిన పరశురాముని రాజు నిరాదరించి దండించ సాహసించినాడు. అయితే రాముడు విజృంభించి సైన్యాన్ని చిందరవందర గావించి కార్తవీర్యుని ధిక్కరించి యుద్ధమున ఓడించి వాని వేయిచేతులను ఖండించి మస్తకము నేలబడ నరికివేసినాడు. అదిచూచి రాకుమారులు భయపడి పారిపోయారు. గోవును విడిపించుకొని రాముడు ఆశ్రమం చేరుకున్నాడు. విషయం తెలిసి జమదగ్నిమహర్షి చింతించాడు. నవిష్ణుఃప్ర జాపతిః. రాజు హరియంశ గలిగినవాడు,గనుక యతనిని ధర్మమార్గమునకు త్రిప్పవలెనేగానీ చంపరాదు. ఈ పాపప్రక్షాళనకోసం తీర్థయత్రలు చేయ మని కొడుకునాదేశించినాడు.
పోతనభాగవతంలో యిలాచెప్పబడింది.
కం: పట్టపురాజును జంపుట
గట్టలుకన్ విప్రుజంపుకంటెను పాపం
బట్టిట్టనకుము నీవీ
చెట్టసెడన్ దీర్థసేవ సేయుము తనయా-
భాగ.-9-464
రాముడలా తిరిగి తీర్థయాత్రలుచేసి తిరిగివచ్చాడు. లోకాచారము నిర్వర్తింపవలెనను నియమమునకు ఆదర్శముగా భార్గవరాముడు తీర్థముల సేవి0చెనేగాని అవతారపురుషున కిట్టి అవసరమేమున్నది? కాలము గడచిపోవు చున్నది.కార్తవీర్యార్జుని కొడుకులు పురంజేరి బలాలను తిరిగీ సమకూర్చుకొని పరశురాముడు లేని సమయంజూచి ఆశ్రమంపై దాడిచేసి జమదగ్నిమహర్షిని ధ్యానంలోవున్నా వదలక తలదరిగి వెళ్ళిపోయారు. రాముడు ఆశ్రమమునకు వచ్చుసరికి తండ్రి శవముపైబడి తల్లి రాముడు చూచుచుండగా యిరువదియొక్కమారు గుండెలు బాదుకొన్నది. కుఠారియై రాముడు రాజలోకముపై విరుచుక
బడ్డాడు. ఇరువదియొక్కమారు భూమండలమంతా తిరిగితిరిగి వెదికి
వెదికి రాజులను హతమార్చినాడు. అలా అదుపుతప్పిన రాజలోకాన్ని వధించి భూభారాన్ని అదుపుచేశాడు పరశురాముడు. అది పరశు
రాముడు అవతారపురుషుడైనందుననే సాధ్యమైనది. ఇట్లు రాజును జంపిన బ్రాహ్మణుల కథ భాగవతమున మరొకటున్నది. వేనుడు నేనే దేవుడనని ప్రకటించుకొన్న రాజు. ఆ వేనుని ఆగడములు మితిమీరి
నపుడు మునులే అతనిని వధించి అతని మృతశరీరహస్తముల మధించి పృధుచక్రవర్తిని పుట్టించి రాజుగా నియమించుకొనిరి. ఇది వారి బాధ్యతగా నాడు భావించిరి.
అలా రాజుల తలలుదరిగి శమంతపంచకము (కురుక్షేత్రం) లోని తొమ్మిది
మడుగులలో రక్తతర్పణం జేసి తండ్రికి అంత్యక్రియలు పూర్తిగావించి, యజ్ఞముజేసినాడు. రాజులజంపి గ్రహించిన భూమి నంతయూ
కశ్యపునకు దానంచేసి మహేంద్రగిరి జేరి తపస్సులో నిమగ్న
మయ్యాడు. ఈ అవతారపురుషుడు సూర్యసావర్ణి మనుకాలంలో సప్తర్షులలో ఒకడౌతాడని బ్రహ్మ నిర్ణయించాడు. అలా అవతారకార్యం నెరవేరింది.
ఇతర పురాణాలలో పరశురాముడు
అకృతవ్రణుడు, శాంతుడుఅనే మునియొక్క కుమారుడు. అతడు చిన్నతనముననే తీర్థయాత్రలుచేయు అభిలాష గలిగి తీర్థములు సేవించుకుంటూ ఒక అరణ్యమార్గమున చిక్కువడి పులివాతబడెను. ఆసమయములో పరశురాముడు తన అస్త్రముచేత పులిని కూలనేసి మునిబాలుని రక్షించెను. చచ్చినపులి గంధర్వుని రూపుదాల్చి తనపాపములు రాముశరాఘాతమున దగ్ధమై శాపవిమోచనమైనదని నమస్కరించి అంతర్ధానమయ్యెను. అప్పటినుండి అకృతవ్రణుడు పరశురామునకు ప్రియశిష్యుడై యెడబాయక సేవలు చేయుచుండెను. అవతార కార్యములతోపాటు యిట్టి పరోపకార కార్యములుకూడా అవతారపురుషుని జీవితమున జరుగును.-- బ్రహ్మండపురాణం
విఘ్నేశ్వరుడు శివమందిర ద్వారముకడ కావలియుండెను. ఆ సమయమున పరశురముడు శివదర్శనార్థము వచ్చెను. వినాయకుడడ్డగించెను. యిద్దరిమధ్య ఘర్షణ మొదలాయెను. గణపతి తనతొండముతో రాముని పైకెత్తెను. రామునకు ఊర్ధ్వలోకములన్నియు కనిపించెను. రాముడు కోపించి పరశువుతో కొట్టెను. గణపతి ఒకదంతము విరిగిపోయెను. (గణపతి తనే దంతమును విరచుకొని విరిగిన గంటమునకు బదులుగా దానిని వాడుకొని మహభారతము నిరాటంకముగా వ్రాసెనని శివపురాణమున గలదు.) పరశురామ గణపతుల వివాదము జరుగుచుండగా శివపార్వతులు ప్రత్యక్షమైరి. పార్వతి గణపతివైపు నిలచి పరశురాముని నిందించెను. శివుడు చేయునదిలేక ఊరకుండెను. గోలోకవాసీ, విశ్వేశ్వరుడు నైన శ్రీకృష్ణుడు వచ్చి పార్వతిని గణపతిని శాంతపరచెను. పరశురామునకు శివదర్శనము కోరిన సమయమున లభించునట్లు వరమియ్యబడెను. ఆ తర్వత పరశురాముడు అగస్త్యాశ్రమమునకేగి కృష్ణామృతశ్లోకములు విని శ్రీకృష్ణ (గోలోక కృష్ణ) కవచమును బొంది అజేయుడాయెను
.- బ్రహ్మవైవర్త పురాణము.
సీతారాముల కల్యాణానంతరం పరశురాముడు వచ్చి దశరథరాముని ధిక్కరించి శివధనుర్భంగమును తప్పుబట్టి, వైష్ణవచాపమునందించి తనతో తలపడరమ్మని గర్జించెను. రఘురాముడుకూడా హరియవతారము గనుక పరశురాముని మహత్తరశక్తిని విల్లందుకొను నెపమున లాగివైచుకొని తనశక్తిని పరశురామునకెరిగించెను. పరశురాముడు రామావతారమును గుర్తించి రామునాశీర్వదించి వెడలిపోయెను
.- రామాయణము
పరశురాముడు క్షత్రియవధాసంప్రాపిత పాపపరిహారార్థం యాగంచేయు
చున్నప్పుడు మునులు వచ్చి గోకర్ణం మునిగి పోయింది, సముద్రుని దండించి ఆశ్రమాలను రక్షించమని కోరుకొన్నారు. తాను యజ్ఞ దీక్షలో
నున్ననానని ధనువు ధరించడానికి వీలులేదని చెప్పాడు పరశురాముడు. శుశ్కుడను ముని బోధించిన ధర్మములను తలదాల్చి పరశురాముడు ఆగ్నేయాస్త్రము వేయసంసిద్ధుడైనాడు. సముద్రుడు భయపడి మన్నింపుడని ప్రార్థించి గోకర్ణమునుండి వెనుకకు మరలెను. పరశురాముడు స్రువము (యజ్ఞపాత్రవిశేషము) రెండుయోజనముల దూరమునకు విసరివైచి అది హద్దుగా సముద్రుని నిలువుమనెను. అది మొదలు సముద్రజలములు ఆహద్దుదాటి గోకర్ణమున ప్రవేశింపలేదు. రాజులవధించి గైకొన్న భూమిని పరశురాముడు కశ్యపునకు దానమిచ్చెను. అందుకేభూమి కాశ్యపి అయ్యింది. కశ్యపుడు దానమిచ్చితివిగదా? ఇక ఈ భూమిని తమరు వదలవలయుననెను. భార్గవరాముడు దక్షిణాబ్ధి వైపు మరలగా ఆయనకు సముద్రుడు రెండుగాచీలి దారినొసగినాడు.
-బ్రహ్మాండపురాణం.
గంగ తనపుత్రుడైన దేవవ్రతుని (భీష్ముని) పరశురామునివద్ద విద్యాభ్యాసమునకై వదిలింది. దేవవ్రతుడు పరశురాముని సేవించి సకలవిద్యా పారంగతుడైనాడు. భీష్ముడు కాశీరాజును ధిక్కరించి సాల్వుని ఓడించి కాశీరాజకన్యలైన అంబ అంబిక అంబాలికలను తన తమ్ముడు విచిత్రవీర్యుడు వివాహమాడుటకై నిర్బంధించి తెచ్చినాడు. అందులో అంబ తాను సాల్వుని ప్రేమించితినని చెప్పుటతో ఆమెను సగౌరవముగా భీష్ముడు సాల్వుని వద్దకు పంపివేసినాడు. కానీ అంబ భీష్మునిచేత జయింపబడినదగుటచే సాల్వుడు అంబను తిరస్కరించినాడు. ఆమె తిరిగివచ్చి భీష్ముని వివాహమాడుమని వేడుకొన్నది. భీష్ముడు తన ప్రతిజ్ఞకారణంగా వివాహమాడలేనన్నాడు. అంబ అడవులకు వెళ్ళినది. అక్కడ తనతండ్రియైన హోత్రవాహనుని కలిసుకొని, వెళ్ళి పరశురాముని శరణువేడి తనకు న్యాయము చేయుమని ప్రార్థించినది. పరశురాముడు భీష్ముని పిలిపించి అంబను వివాహమాడుమనెను. భీష్ముడు గురువు మాట వినలేదు. గురువు యుద్ధము తప్పదనెను. శిష్యుడు కానిమ్మనెను. ఇద్దరిమధ్య ఇరువదినాల్గుదినములు ఘోరయుద్ధము జరిగెను కానీ ఫలితము తేలలేదు. మునులూ దేవతలూ కలుగజేసుకొని యుద్ధము మాన్పించిరి. అంబ పగతీర్చుకొనుటకు వేరు గత్యంతరములేక శివునిగూర్చి తపముజేయుటకు వెళ్ళిపోయెను
- మహాభారతం
కర్ణుడు మహేంద్రగిరిపైనున్న పరశురామునివద్దకు వెళ్ళి బ్రాహ్మణుడనని అబద్ధముచెప్పి బ్రహ్మాస్త్రాదిరణవిద్యలు నేర్చుకొనెను. ఒకనాడు కర్ణుని తొడపై తలనిడి పరశురాముడు విశ్రమిస్తూ నిదురించెను. అంతలో ఇంద్రుడు కర్ణుని గుట్టు రట్టుచేయదలచి వజ్రతుండిపురుగై కర్ణుని తొడక్రిందచేరి తొలిచివేయదొడగెను. రక్తము ధారాపాతముగా కారజోచ్చెను. గురువుకు నిద్రాభంగమగునగునని తలచి కర్ణుడు బాధకోర్చుకొనుచూ కదలకుండెను. కానీ రక్తము పరశురామునిసైతం తడిపి నిద్రాభంగము కలిగించెను. పరశురామునకు కర్ణునిపై అనుమానము కలిగెను. ఇతడు బ్రాహ్మణుడేయైన యింతబాధ నోర్చు
కొనునాయని కర్ణుని నిలదీసి వాస్తవము రాబట్టెను. తనను మోసముచేసి నందులకు కోపోద్రిక్తుడై తనవద్ద నేర్చిన విద్యలు సమయమునకు గుర్తుకు రాకుండుగాక! యని శాపమిచ్చెను. తదనంతరము కొంత శాంతించి కర్ణుని వాస్తవ దీనగాథను గుర్తించి యీ శాపము నీ జీవిత చరమాం
కమున మాత్రమే తగులుననియు, మిగిలిన జీవిత కాలమున శాపప్రభావ
ముండదనీ సర్దుబాటుచేసి మన్నించి పంపెను. విప్రుని కోపమ
క్షణకాలమేనన్న నానుడి నిజమయ్యెను - మహాభారతం.
కౌరవసభలో జోక్యముచేసుకొని దుర్యోధనునికి హితబోధచేయుచూ పరశురాముడు దంభోద్భవుని వృ త్తాంతము చెప్పెను. ఈ దంభోద్భవుడు
గర్వించి తనశక్తి అల్పమని గ్రహించక గంధమాదన పర్వతములలో తపమాచరించుకొంటున్న నరనారాయణులతో వాదమునకు దిగి
యుద్ధమున కాహ్వానించి వారితోపోరలేక ఓడి అవమానము పాలయ్యెను. దుర్యోధనా జాగ్రత్త! కృష్ణార్జునులతో యుద్ధము నీ శక్తికి మించినపని యని హెచ్చరించెను
- మహాభారతం.
ఉపసంహారం
తపనకు లోనై ప్రపంచమాతురతతో యెదురుచూస్తున్న సమయంలో భగవంతుడవతరిస్తాడు. ఆ అవతారము యొక్క రూపము, తీరుతెన్నులూ, స్వభావమూ, వంశమూ యివన్నీ అవసరమే నిర్ణయిస్తుంది. కార్య
నిర్వహణకు అవసరమైన రూపమున అవసరమైన శక్తితో భగవంతు
డవతరిస్తాడు.. అలా పరశురామావతారముసంభవించింది. గొడ్డలి భుజమున ధరించుటకు కారణంకూడా అవసరమే యనుట తథ్యం. బ్రహ్మతేజమమోఘం, అజేయం, అంతియేకాదు అది విచక్షణాసహితం, ఆగ్రహానుగ్రహ సమర్థం. కావుననే అధమక్షత్రియుల నణచివైచి మరల ధర్మమును భూమిపై నిలుపుటకు హరి భార్గవరాముడై బ్రహ్మగర్జన మొనర్చినాడు.
శుభం భూయాత్
***
Search: Bhargava Ramudu / Parusharamudu
No comments:
Post a Comment