Showing posts with label వీరబ్రహ్మం. Show all posts
Showing posts with label వీరబ్రహ్మం. Show all posts

Monday, 24 August 2020

వేమన, వీరబ్రహ్మం, అన్నమయ్యల తాత్త్విక చింతన

 వేమనవీరబ్రహ్మంఅన్నమయ్యల తాత్త్విక చింతన

 

తత్త్వముఅన్నపదం తత్- తమ్  పదముల కలయికతో ఏర్పడింది తత్ అంటే     అది. అదిబ్రహ్మముఈవిశాల విశ్వానికి మూలమైన సత్పదార్థముమరి తమ్ అంటే మానవుని వైయక్తిక సత్పదార్ఠముఅంటే ఒకటి అపరిమితమైనది రెండవది పరిమితమైనదిపరిమితమైన వైయక్తికసత్యము అపరిమితమైన   బ్రహ్మపదార్థముతో అనుసంధింపబడటమే "తత్త్వము". మొత్తముమీద చెప్పా లంటే బాహ్యప్రపంచ వస్తుదృష్టినుండి మరలి బంధరహితమై సచ్చిదానంద పరబ్రహ్మను సాక్షాత్కరింప జేసుకోవడమే తత్త్వఙ్ఞాన సముపార్జనమని అర్థము చేసుకోవలసియున్నది ప్రయత్నము సఫలీకృతము చేయునదే బ్రహ్మవిద్య లేక ఆధ్యాత్మికత అనబడుతూవుంది పథంలో తామనుస రించిన  విధివిధానాలను బహుళముగా జనసామాన్యములో ప్రచారము చేసినారుకడపజిల్లా (నేటి వై.ఎస్.ఆర్ జిల్లాతాత్వికవేత్తలైన వేమనవీరబ్రహ్మం మరియు అన్నమాచార్యులువారితాత్త్విక బోధలు వారి మాటల్లోనే విందాం. 

 

వేమన యీ తాత్త్వికఙ్ఞానం గురించి చెబుతూ...

 

         :వె    గాజు కుప్పెలోనికడగుచు దీపంబు

                      నెట్టులుండు ఙ్ఞాన మట్టులుండు

                      తెలిసినట్టివారి దేహంబులందును

                      విశ్వదాభిరామ వినురవేమ

 

అని తనలోనేఅంటే యీ తనువులోనే అంతరాంతరాళాల్లో వెలుగుతూ వుందన్నారుదాన్ని తెలుసుకోవడానికి కేవలం వినిచదివి వల్లించడం తోనే సరిపోదు...

 

:వె:   మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు

         తెలుపవచ్చు తన్ను దెలియరాదు

         సురియ బట్టవచ్చు శూరుండు కాలేడు

         విశ్వదాభిరామ వినురవేమ

 

మాటలెన్ని మాట్లాడినాయితరులకు యెనెన్ని చెప్పినా నీ యెఱుకలోలేని విషయాలు  నీకు తెలిసినట్లు కాదుకేవలం చురకత్తి చేతబట్టినంత మాత్రాన శూరుడైపోడుఅందుకే సాధన కావలంటాడు.

 

  ఆ:వె:    స్వానుభూతిలేక శాస్త్రవాసనలచే

              సంశయంబు చెడదు సాధకునకు

              జిత్రదీపమునను చీకటి చెడనట్లు

              విశ్వదాభిరామ వినురవేమ

 

సాధన ద్వారా స్వానుభవపూర్వకంగా తెలుసుకోవలసిన విద్యయిదికేవలం గోడపైన దీపం బొమ్మ గీస్తే చీకటి తొలగదుకనుక సాధనలేని శుష్క వాదన నిరర్థకందానికోసం అన్వేషణ తప్పనిసరి.

 

         :వె:    వెదుక వెదుక దొరుకు వేదాంతవేద్యుండు

                    వెదుకువాని దాను వెదుకుచుండు

                    వెదకనేర్చు నట్టి వెరవరుల్ గలరకో

                   విశ్వదాభిరామ వినురవేమ

 

 ఎప్పుడైతే నీవు దానికై తపనపడి వెదుకుతావోఅప్పుడే నిన్నుతరింపజేయడంకోసంనీకుదారిచూపడంకోసం వేదాంతవేద్యుడైన గురువు నీకొసం వెతుకుతూవస్తాడుకనుక నీవు అక్కరతో వెదకడం అవసరంకానీ  వెతికేవారే అరుదంటాడు వేమన.

 

         :వె   అల్పసుఖము లెల్ల నాశించి మనుజుడు

                    బహుళదుఃఖములను బాధ పడును

                    పరసుఖంబునొంది బ్రతుకంగనేరడు

                    విశ్వదాభిరామ వినురవేమ

 

ఇలా పరతత్త్వాన్ని బొంది మనిషి జీవించలేక పోతున్నాడుఐతే

 

         :వె:    తేనెతెరల జాడ తేనెటీగ యెఱుంగు

                 సుమరసంబు జాడ భ్రమర మెఱుగు

                 పరమయోగిజాడ భక్తుడెఱుంగును

                 విశ్వదాభిరామ వినురవేమ

 

అంటే నిజమైన అన్వేషకుడు తన మార్గదర్శకునితేనెటీగ తేనెలజాడనుభ్రమరం సుమరసం తెరువును కనుగొన్నట్లు కనుగొని తీరుతాడుఅలా కనుగొని

 

 

:వె    కాకిగూటి లోన కోకిలమున్నట్లు

            భ్రమరమగుచు పురుగు బ్రతికినట్లు

           గురుని గొల్చు వెనుక గురువుతానౌనయా

           విశ్వదాభిరామ వినురవేమ

 

అంటే గురుని కొలిచి ప్రత్యక్షజ్ఞానం పొంది తాను పరిపూర్ణుడై(గురువైవెలుగొందుతాడుకనుక

 

:వె:   విన్నవానికన్న గన్నవాడధికుండు

          కన్నవనికన్న కలియువాడు

          ఉన్నతోన్నతుడయి యుర్విలోపల నుండు

          విశ్వదాభిరామ వినురవేమ

 

కేవలం విన్నవాడికంటే  కనుగొన్నవాడు గొప్పవాని కంటే  దాన్ని పొందినవాడుదానిలో ఐక్యమై పోయినవాడు గొప్పయని తేల్చి చెప్పినాడు వేమనఅలా ఆస్తికుడైనవాడు...

 

:వె:  మంటికుండ వంటి మాయశరీరంబు

         చచ్చునెన్నడైన చావడాత్మ

        ఘటములెన్నియైన గగనంబదేకమే

        విశ్వదాభిరామ వినురవేమ

 

 

అని తెలుసుకొని భేదభావరహితుడై

 

:వె:    దేవుడనగ వేఱు దేశమందున్నాడె

           దేహితోడ నెపుడు దేహమందే

           వాహనములనెక్కి వడిదోలుచున్నాడు

           విశ్వదాభిరామ వినురవేమ  

 

అని తెలుసుకొని  మెలుగుతాడుఅట్టివాడు

 

:వె  పలుగు రాళ్ళు దెచ్చి పరగ గుడులుగట్టి

          చెలగి శిలలసేవ జేయనేల

          శిలలసేవజేయ ఫలమేమి గల్గురా

          విశ్వదాభిరామ వినురవేమ

 

అని స్థౌల్యత విడనాడి సూక్ష్మబుద్ధి గలిగి

 

:వె  హృదయమందునున్న ఈశుని దెలియక

         శిలలనెల్ల మ్రొక్కు జీవులార

         శిలలనేమి యుండు జీవులందెగాక

         విశ్వదాభిరామ వినురవేమ

 

అని తెలిసి లోకములోని తనసాటి జీవులగు..

 

:వె:    బడుగు నెఱుగలేని ప్రాభవంబదియేల

          ప్రోదియిడని బంధుభూతియేల

          వ్యాధిదెలియలేని వైద్యుండు మరియేల

          విశ్వదాభిరామ వినురవేమ

 

 అని సముడై జీవించి తరిస్తాడన్నాడు వేమనఇలా వేమన చెప్పిన తాత్త్విక భావసంపద గల పద్యాలు మనకనేకం లభిస్తున్నాయి.

 

ఇక బ్రహ్మంగారి బోధలు గమనిస్తే ఆయన సామాన్యజనాన్ని తాత్త్విక పథంవైపు  మరలించటానికి దూర్తవర్తనము  నుండి దూర

 మొనరించేటందుకు  అనేక మహిమలు  జూపారుఆనాటి ముస్లింపాలకులనూఅధికారులనూ తన బోధనలవైపు మరల్చటానికి జరగబోయే సంఘటనలను కాలఙ్ఞానతత్త్వాల ద్వారా తెలియజేసి దారిలోపెట్టే పనికి పూనుకొన్నారుమతఛాందసులను నేరుగా యెదుర్కొన్నారు.

 

చెప్పలేదంటనకపొయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యము

తప్పుద్రోవల బోవువారల చప్పరించి మింగు శక్తులు

 

అంటూ హెచ్చరించారుఅర్థంపర్థం లేని అనేకారాలనుమూఢ

నమ్మకాలనూ విడిచిపెడితేనేగాని ఆత్మకు స్వేచ్ఛ కలగదని బోధించారు.

మనిషిని కులమత పరిధిని దాటించి

 

:వె:    గాఢతమములైన మూఢవిశ్వాసాల

           జలధిలోన మునుగు జనులకెల్ల

           స్వేచ్ఛ గోరు వాడె సిద్ధుండు బుద్ధుండు

           కాళికాంబ హంస కాళికాంబ

 

అన్నారుమూఢవిశ్వాసాలు స్థౌల్యములుఅట్టి స్థౌల్యత నుండి విడివడితేనే జీవికి స్వేచ్ఛస్వేచ్ఛపొందిన వాడే సిద్ధుడుబుద్ధుడఅట్లే మతం మనుషులను విడదీసి  పగలురగులుస్తున్నది మనిషి మతాన్ని దాటి యెదిగి ఆధ్యాత్మికజీవనానికి మారాలన్నారు.

 

:వె: మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు

        హితము గూర్పవలయు నెల్లరకును

        హితము గూర్పలేని మతము మానగవలె 

        కాళికాంబ హంస కాళికాంబ                 --- --మరియు

 

:వెసర్వమతములందు సారమ్ము గ్రహియించి

        ఐకమత్యమార్గమనుసరుంచి

        క్రించుదనము మాని ప్రేమించుకొనమేలు

       కాళికాంబ హంస కాళికాంబ            ------అని హితవు పలికారు

 

కులాలు కుల్లు పెంచడానికికాదుఅవి కేవలం ప్రజల బతుకుదెరువు కోసం చేపట్టిన పనివారి సంఘాలే నంటూ..

 

  వర్ణ విభజన మన్నది ప్రజలొనర్చు

  పలురకంబుల పనుల పంపకమెగాని

  ప్రజలలో హెచ్చుతగ్గుల సృజనకాదు........అంటూ తెలియజెప్పినాడు.

 

:వె:   బ్రహ్మమనగ వేరె పరదేశమునలేదు

         బ్రహ్మమనగ జూడు బట్టబయలు

         తనకుతానె బ్రహ్మ తారకమగునయా

         కాళికాంబ హంస కాళికాంబ.

 

అంటూ బ్రహ్మము యెక్కడోలేదుఅది శూన్యానికే శూన్యం (బట్ట బయలుతనకుతనే బ్రహ్మముతరించటానికి నీకైనీవే ప్రయత్నించాలికానీ అందుకు సంసారం త్యజించనవసరం లేదు.

 

 

 కం:   సంసారమునందుండియు

         సంసారము మిథ్యజేసి సర్వము తానై

         సంసారంబును గెలిచిన

         సంసారే రాజయోగి సత్యము సిద్ధా!

 

సంసారజీవితం గడుపుతూనే సంసారం తనకంటకుండా జీవించి తాత్త్విక విజయం సాధించాలన్నారుఅందుకోసం  సంసారము త్యజించి తీర్థయాత్రలపేరుతో దేశాలుతిరగవలసిన పనిలేదన్నారు.

 

కాశికిపోవలెనా మోసుకరావలెనా

కాశీతీర్థము కన్నుల నున్నది బేసికన్ను శివకాశిగనున్నది.

 

అంటూ భ్రుకుటి మధ్యంలో దృష్టి నిలిపి ధ్యానం చేయడం నేర్పారుఇదే భక్తులకుమోక్షసాధకులకూ గల ఏకైక మార్గమన్నారుఆత్మసాక్షాత్కారమే పరబ్రహ్మసాక్షాత్కారమన్నారు.

:వె  భక్తజనులకెల్ల పరమశరణ్యమ్ము

         మోక్షసాధనము ముముక్షువులకు

         ఆత్మతత్త్వ మెరుగనగుమార్గమొక్కటే

         కాళికాంబ హంస కాళికాంబ

 

అని వివరించి చెబుతూ తన దారికి వచ్చిన శిష్యులకు ఆయన కుండలినీ విద్యను నేర్పిశక్తిని మేల్కొల్పి శరీరంలోని మూలాధారస్వాధిష్టానమణిపూరకఅనాహతఆఙ్ఞాచక్రములుమరియు సహస్రారాన్ని వికశింపజేసిఆచక్రాల అధిదేవతలను స్థూలరూపంలో గాక సూక్ష్మాతిసూక్ష్మరూపంలో దర్శింపజేశారుఈవిద్యనభ్యసించడానికి ఆయన కులమతాలకతీతంగా శిష్యులనెన్నుకున్నారువారిలో దూదేకులసిద్ధయ్యపంచముడైన కక్కయ్య బ్రాహ్మణుడైన అన్నాజయ్యా వున్నారువారిని పరమగురువుల స్థానానికి జేర్చివారిచే తన బోధలను కొనసాగించారుప్రజలు బ్రహ్మంగారంతటి గురువు సిద్ధయ్యంతటి శిష్యుడూ లోకంలో లేడన్నారు.

 

ఇక అన్నమయ్య విషయానికొస్తేయీ ఆచార్యుడు పుట్టుకతో అద్యైతియైనా వైష్ణవం(విశిష్టాద్వైతంస్వీకరించితానాచరించి తనపదకవితలతో గొప్పప్రచారం చేసినాడురోజుకో కీర్తనచొప్పున ముప్పదిరెండువేల కీర్తనలు రచించినాడుఅందులో అన్నిస్థాయిలవారి

 నుగుణంగా మధురభక్తికి తార్కా ణమైన శృంగార కీర్తనలుభక్తిపదాలుతాత్త్వికాధ్యాత్మిక గీతాలూ వున్నాయిప్రముఖంగా భగవంతుని చేరడానికి భక్తిమార్గంగా శణాగతి ప్రపత్తికి పట్టముగట్టినాడుతాత్త్వికచింతనాపరులైన ఉత్తమవర్గాలను దృష్టిలోపెట్టుకొని అనేక తత్త్వపదాలను రచించినారువైష్ణవభక్తికి మూల విరాట్టులైనకృష్ణనరసింహహనుమంతులను కీర్తించినా వారంతా తన ప్రియమైన వేంకటేశ్వరునిలో ఇమిడిపోయి దర్శనమిచ్చారుఆవిధంగా భిన్నత్వాన్ని పోనాడినాడు. "ఎంతమాత్రము ఎవ్వరు దలచిన అంతమాత్రమే నీవుఅని "నీవలన కొఱతేలేదు నీరు కొలదితామెర"యని పలికిదేవానీవు నీదయచూపడములో యే కొఱతాలేదునీవు వైషమ్యరహితుడవులోప మేదైనా వుంటే  అది

మాయందేయున్నదిఎవరుచేసుకొన్నంత వారికి లభ్యమౌతున్నదికదాయని భక్తిని ప్రోత్సహించినాడు.

 

కొలుతురుమిము వైష్ణవులు కూర్మితో విష్ణుడని

పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహం బనుచు

తలతురుమిము శైవులు తగిన భక్తులను శివుడనుచు

అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుడనుచు

సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు.

 

ఎవరి యిష్టము వచ్చినట్లు వారు కొలిచినా అన్నీ నీవేగనుక వారు నీదయకు పాత్రులగుచున్నారుఅంటూ భిన్నంగా కనిపించినా అది ఏకేశ్వరోపాసనే యన్నారు అన్నమయ్య బ్రతుకు సత్యమూనిత్యమూ కానేకాదు..

 

నానాటి బ్రతుకూ నాటకమూ కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము

నట్టనడిమిపని నాటకమూ

యెట్టయెదుట గల దీ ప్రపంచమూ

కట్టకడపటిది కైవల్యమూ

 

అని కైవల్యమే జీవుని గమ్యం ప్రపంచం కేవలం నాటకం సుమీయని హెచ్చరించి వైరాగ్యమార్గం పట్టించాడు... కైవల్యమునకు దారి చూపుతూ...

భావములోనా బాహ్యమునందును

గోవిందగోవింద యని కొలువో మనసా

 

యని బాహ్యాంతరముల రెండింటా  గోవిందుడే నిండియున్నాడనీకనుక రెండింటా  భగవంతుని తలంపు మానకుమని బోధించాడుమొత్తముమీద...

 

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే-పర

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే

 

కందువగు హీనాధికము లిందులేవు

అందరికీ శ్రీహరే అంతరాత్మ

ఇందులో జంతుకులమంతాఒకటే

అందరికీ శ్రీహరే అంతరాత్మ

 

నిండారా రాజూ నిద్రించు నిద్రయునొకటే

అండనే బంటునిద్ర అదియూ నొకటే

మెండైన బ్రాహ్మణుడూ మెట్టుభూమి యొకటే

చండాలుడుండేటి సరిభూమి యొకటే

 

కడగి యెనుగు మీదా కాయు యెండొకటే

పుడమీ శునకము మీద బొలయునెండొకటే

కడుపుణ్యులనుబాపకర్ములనూ సరిగావ

జడియు శ్రీవేంకటేశ్వరు నామ మొకటే.

 

నంటూ బ్రహ్మమునకు యెక్కువతక్కువ భావము లేదనీపుణ్యాత్ములను కాపాడిపాపాత్ములను సరిదిద్దేవాడు  పరబ్రహ్మమేననిఆపరబ్రహ్మను చేరుటకుఅనగా కైవల్యపథమునందుకొనుటకు జాతిమతకులములుఆఖరకు పశుపక్షాది జన్మలు కూడా అడ్డురావనిఅందరియెడల దైవము ప్రసన్నుడేయని సమతను చాటినాడు.

 

నేనొకడలేకుండితే నీకృపకు పాత్రమేది

పూని నావల్లనే కీర్తి బొందేవునీవు.

 

అంటూ భగవంతుని భక్తపరాధీనుని గావించినాడునీవు దయచూపటానికి నేనంటూ(భక్తుడంటూఒకడుండాలిగదాఅప్పుడేగదా స్వామీలోకములో నీకు గుర్తింపుకీర్తి యని భగవంతుడు ఆపన్నరక్షకుడు గాకుండా వుండలేని పరిస్థితి కలిగించాడుభగవంతున్ని వివశుణ్నిజేసిభక్తియొక్క గరిమను చాటినాడు అన్నమయ్య.

 

ఇలా  ముగ్గురు కడప (వై.ఎస్.ఆర్ జిల్లా దేసికోత్తములువారివారి తాత్త్వికచింతనా పద్దతులలో ప్రజలను ఉత్తేజపరచిసమతనుచాటి మార్గదర్శకులైనారు.

 

                                   ***

SEARCH :  VEMANA, VEERA BRAHMAM, ANNAMAYYA TAATVIKA CHINTANA 


పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...