Tuesday, 10 May 2022

రుద్రాక్ష

 

రుద్రాక్ష



రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః
                                                                     ఫాలాంతరాలధృతభస్మసితత్రిపుండ్రః
                                                                     పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం
                                                                     ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః

 రుద్రాక్షను హిందువులు అత్యంతపవిత్రంగా భావిస్తారు. శైవమతానుయాయులు దీన్ని సాక్షత్తూశివస్వరూపంగా పూజిస్తారు. పదునొకండువందల రుద్రాక్షలు ధరించిన జంగమదేవరను శివపరమాత్మగా భావించి పూజిస్తారు. "రుద్రాక్ష ధారణాత్ రుద్రోభవత్యేవ నసంశయః" అని దేవీభాగవతం చెబుతున్నది. రుద్రాక్షవృక్షాలు శివుని కన్నీటిబిందువులు భూమిపైబడి మొలిచాయని పురాణాలు చెబుతున్నాయి. శివునిబాష్పకణాలు భూమిపైబడిన సందర్భాలు వివిధములుగా చెప్పబడుతున్నాయి. శివుడు శక్తివంతమైన అఘోరాస్త్రం పొంది త్రిపురాసురులను సంహరించటానికి తీవ్రమైన బహుకాలతపమాచరించాడు. తపముఫలించి సమాధినుండిలేచి కళ్ళుతెరిచాడు. అప్పుడు ఆయనకళ్ళనుండి నీటిబొట్లురాలాయి. ఇదొకకథనం. మరొకకథప్రకారం, శివుడు త్రిపురాసురులను సంహరించి, వారిచావుకు చింతించి కన్నీరుకార్చాడు. మరోకథప్రకారం సతీదేవి, తండ్రిదక్షుని నిరాదరణకు గురై తన్నుతాను దహించుకొని ప్రాణత్యాగంచేసింది. అదితెలిసిన శివునికన్నులనుండి నీటిబొట్లు రాలాయి. ఏదియేమైనా శివునికన్నీటిబొట్లే రుద్రాక్షవృక్షాలైనాయన్నది మనం గ్రహించవలసియున్నది. ఈబాష్పజలబిందువులు శివుని ఎడమకంటినుండి 12 , కుడికంటినుండి 16, మూడవనేత్రమైన అగ్నినేత్రం నుండి నల్లని10 బిందువులు భూమిపైబడి మొత్తం 38 రకాల వృక్షాలు మొలిచాయి. ఇవి గౌడ, కాశి, అయోధ్య వంటి క్షేత్రాల్లోను, మలయ, హిమాలయ, సహ్యాద్రి ల్లాంటి పర్వతప్రాంతాల్లోను పడి రుద్రాక్షవృక్షాలు మొలిచాయంటారు.

శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చె బుతారు.

 “స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్,

    భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్

    లక్షంతు దర్శనా త్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్ ”-- జాబాలోపనిషత్.

 అంటే భక్తుల ననుగ్రహించ డానికే రుద్రాక్షలు స్థావరాలుగా (వృక్షాలుగా) అవతరించాయి. వీటినిధరించిన భక్తుల పాపాలు ఏరోజు కారోజుననే నశిస్తాయి. దర్శింనా, ధరించినా కోటిజన్మలపుణ్యం లభిస్తుంది  

 వృక్షశాస్త్రంప్రకారం ఇది మాగ్నొలియోఫైటా జాతికి చెందిన,ఎలాయోకార్పాస్ వర్గవృక్షాలు. నునుపుగా, గట్టిగా, ముడులుముడులుగా నున్న పెద్దరుద్రాక్షలు ధారణకైనా, జపానికైనా మంచివి. ఇవి ఉసరికకాయంతవి, రేగుపండంతవి, గురివింద(శనగ)లంతవిగా లభిస్తాయి.ఇవి ప్రమణాన్నిబట్టి ఉత్తమ,మధ్యమ,అధమ పలితలిస్తాయని శాస్త్రం. 

                            ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
                              బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
                             అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే

చిన్నరుద్రాక్షలు తాంత్రికవిద్యాసాధకులు ధరిస్తారు, రుద్రాక్షలనుగురించి శివపురాణం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రకారుణ్యమహాత్మ్యం, దేవీభాగవతం, రుద్రజాబాల్యుపనిషత్తు, లింగపురాణం, స్కందపురాణం, పద్మపురాణాలలో వివరణలున్నాయి. అన్నివర్ణాలవారూ రుద్రాక్షలు ధరించవచ్చు. ఋషులు, మునులు, రాక్షసులు, దేవతలుసైతం రుద్రాక్షలు ధరించినవారే. పూజారులు, గురువులు, వేదాంతులు వీటిని ధరిస్తున్నారు. మామిడిచెట్టును పోలియుండు రుద్రాక్షచెట్లే ఫలాలనిస్తాయి. నీలిరంగులో పండ్లుంటాయి. కాస్తాపుల్లనిరుచిగల గుజ్జులో రుద్రాక్ష వుంటుంది. పండుగావుండగా కోడిగ్రుడ్డుఆకారంలోవుండి ఎండిపోయినతర్వాత గుండ్రంగా మారుతాయి. పండుమాగినతర్వాత గుజ్జు నుండివేరుచేసిగాని, ఎండినఫలాలనుండిగాని రుద్రాక్షలు సేకరిస్తారు. తొడిమ తొలగించిచూస్తే రుద్రాక్షమధ్య రంధ్రం కనబడుతుంది. ఈరంధ్రంద్వార దారం లేదా వెండి,బంగారు తీగగానీ పోనిచ్చి మాలలు తయారుచేస్తారు. వైద్యశాస్త్రరీత్యా ఇది క్షయనివారిణి, కఫ, వాతరోగాలను హరిస్తుంది. నీటితోఅరగదీసి నాకిస్తే మశూచిని, తేనెతోఅరగదీసినాకిస్తే మూర్ఛలను నయంచేస్తుంది.

 రుద్రాక్షకుండే చారలనుబట్టి రుద్రాక్షముఖాలను నిర్ణయిస్తారు. ముఖాలనుబట్టి వాటి ప్రత్యేకతలుంటాయి. అవసరాన్నిబట్టి ధరించదలచినవారు ఎన్నిముఖాల రుద్రాక్ష ధరించాలో నిర్ణయించుకుంటారు. అలాకాక కొందరు వారిజన్మనక్షత్రాన్ని బట్టి రుద్రాక్షను ఎంపికచేసుకుంటారు. మరికొందరు నవరత్నాలకుబదులు రుద్రాక్షలను ఎంపికజేసుకుంటారు.

 రుద్రాక్షముఖాలు ~ వాటిమహాత్మ్యము ~ ప్రయోజనాలు

 ఏకముఖి:- ఇది చాలావిలువైనది. దీన్ని శివునిప్రతిరూపంగా భావిస్తారు. దర్శనభాగ్యంవల్లనే మహాపాతకాలు నశిస్తాయి. అర్చనవల్ల లక్ష్మీకటాక్షం కలుగుతుంది. కొరతలన్నీ తీరుతాయి. వ్యక్తివికాసం, జ్ఞానం వృద్ధిచెందుతుంది. దుష్టమంత్రతంత్రప్రయోగాలను త్రిప్పికొట్టగలదు. శిరోవేదనలను నయంచేస్తుంది.

 ద్విముఖి:- అర్థనారీశ్వరతత్త్వానికిది ప్రతీక. కుండలినీశక్తిని సులభంగామేల్కొలిపి శక్తివంతంగావిస్తుంది. గోహత్యాపాతకకారిణి. సంతానప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపారవృద్ధిని కలిగించి మనోవ్యాకులతను మాన్పుతుంది.దీన్ని కొందరు బ్రహ్మరుద్రాక్ష అనికూడా వ్యవహరిస్తారు.

 త్రిముఖి:- ఇది అగ్నిస్వరూపిణి. అదృష్టదాయిని, ఆరోగ్యప్రదాయిని, అభ్యుదయభావదాయిని, ధనధాన్యసమృద్ధికితోడ్పడును. కార్యసిద్ధి, విద్యావృద్ధి కలిగించును. కామెర్లు, సర్పదోషములు హరించును.

 చతుర్ముఖి:- బ్రహ్మస్వరూపుణి, విద్యాప్రదాయిని, ఏకాగ్రతనిచ్చును. పరిశోధకులకు జ్యోతిర్గణితవేత్తలకు రాణింపు నిస్తుంది. స్పర్శమాత్రమున పాపనాశము, నరహత్యాదోషనునివారణ జరుగుతుంది. పాలలో యీ రుద్రాక్షవేసి ఆపాలుత్రాగితే మానసికరోగాలు నయమౌతాయి.

 పంచముఖి:- ఇది కాలాగ్నిస్వరూపం. మోక్షాన్నిస్తుంది. అకాలమృత్యువును తప్పిస్తుంది. శత్రునాశిని. సర్పవిషాన్ని విరిచేస్తుంది. హృద్రోగనివారిణి. మలబద్ధకాన్నిపోగొడుతుంది.

 షణ్ముఖి:- కుమారస్వామిస్వరూపం. సమస్తపాపహరం. శక్తినిచ్చి విజయాన్నందిస్తుంది. శరీరదారుఢ్యాన్నిపెంచి ఆరోగ్యాన్నిస్తుంది. హిస్టీయా, రక్తపోటువ్యాధిని నయంచేస్తుంది.

 సప్తముఖి:- మన్మథరూపిణి. వశీకరణి. అకాలమృత్యునివారిణి. సభావశ్యత, సంపద, ఉత్తేజం, కీర్తి కలుగజేస్తుంది. కామధేనువుకు ప్రతీకయనికూడా కొందరి విశ్వాసం.

 అష్టముఖి:- భైరవరూపిణి. దారిద్ర్యవిధ్వంసిని. దీర్ఘాయువునిచ్చును. ఆకస్మికధనలాభముకలుగజేయును. కుండలీనీశక్తిని హెచ్చించును. విఘ్నేశ్వరునకు ప్రతీకయనికూడా కొందరినమ్మకం.

 నవముఖి:- నవదుర్గాస్వరూపం. శివతుల్యవైభవకారిణి. భైరవస్వరూపమని కొందరి అభిప్రాయం. పరోపకారబుద్ధిని పుట్టిస్తుంది. అపమృత్యువునురానివ్వదు. రాజకీయపదవులలోఔన్నత్యాన్నిస్తుంది. దీన్ని ఎడమచేతికి ధరించుట మంచిది.

దశముఖి:- విష్ణుస్వరూపిణి. సకలాభీష్టప్రదాయిని. అశ్వమేధయాగంచేసినంత ఫలందక్కుతుంది. నవగ్రహదోషాలను తొలగిస్తుంది. గొంతుసంబంధవ్యాధులను నయంచేస్తుంది.

 ఏకాదశముఖి;- రుద్రరూపిణి. విశేషఫలదాయిని. దుష్టశక్తులనంతంచేస్తుంది. వైవాహికజీవనసుఖప్రదాయిని. గర్భసంబంధవ్యాధులను నయంచేస్తుంది.

 ద్వాదశముఖి:- ద్వాదశాదిత్యులకు ప్రతీక. గౌరవంకలుగజేస్తుంది.

 త్రయోదశముఖి:- కామధేనువునకు ప్రతీక. కార్తికేయునకు ప్రతీకయని కొందరివిశ్వాసము. ఈరుద్రాక్ష పాలలోవేసి ఆపాలుత్రాగితే అందం వృద్ధియౌతుంది.

 చతుర్దశముఖి:- ఉపనిషత్తులప్రకారం ఇది పరమశివుని కన్ను. పరమేశ్వరప్రీతికరం.

 పంచదశముఖి:- పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మికసాధనకు సహాయకారి.

షోడశదశముఖి:-పరిపాలనా దక్షత కలుగజేస్తుంది. సత్య ధర్మమార్గంలో నడిచేట్లుజేస్తుంది.

సప్తదశముఖి:- విశ్వకర్మకుప్రతీక. సంపదనిస్తుంది.

అష్టాదశముఖి:- భూదేవికి ప్రతీక. స్థలాలవ్యాపారం లాభిస్తుంది. వ్యవసాయం మంచి ఫలితాలనిస్తుంది.

ఎకోనవింశతి ముఖి:- నారాయణునకు ప్రతీక. భక్తిని, ఆస్తికతను పెంపొందిస్తుంది.

వింశతిముఖి:- సృష్టికర్తబ్రహ్మకుప్రతీక. సంతానవృద్ధికరం.

ఏకవింశతి ముఖి :- భక్తిప్రదాయిని. జనన మరణ చక్రం నుండి విడుదలగావించి సాయుజ్యదశకుచేరుస్తుంది. దీన్నికొందరు కుబేరునికి ప్రతికగాను, మరికొందరు ఇంద్ర మాలగానూ భావిస్తారు.

 గౌరీశంకరరుద్రాక్ష:- ఇది ఇడ,పింగళనాడులను క్రమబద్ధీకరించి, క్రియశీలతకు తోడ్పడుతుంది. ప్రశాంతతనిస్తుంది.

 గణపతిరుద్రాక్ష :-రుద్రాక్షపైనుండే ముడుతలు గణపతి తుండం ఆకారంలో ఏర్పడి వుంటాయి. గణపతికి ప్రతీక. విఘ్ననాశిని. కన్యలవివాహాలకు ఏర్పడిన ఆటంకాలను తొలగిస్తుంది. సంతానప్రాప్తికి దోహదపడుతుంది. విద్యాబుద్ధుల నిస్తుంది. పండితుల ప్రాభవాన్ని పెంచుతుంది.

 ప్రస్తుతం పదునాలుగుముఖాల రుద్రాక్షల వరకు లభ్యమౌతున్నాయి. 12,13,14ముఖాల రుద్రాక్షలు ఏదైనా ఒకకోరికను హృదయంలోతలంచి రుద్రాక్షను పూజాగృహములోవుంచి ఆరాధిస్తే నలువది(మండలం)దినములలో ఆకోరిక నెరవేరుతుంది.

 నిజమైనరుద్రాక్షను ఇండ్రస్ట్రియల్ స్కానింగ్ లేక  డెంటల్xరే ద్వరా గుర్తించవచ్చును. నకిలీరుద్రాక్షలు ఎఱ్ఱచందనంతో తయారుచేస్తున్నారు. ప్రతిసంవత్సరం వందలకోట్లలో రుద్రాక్షలవ్యాపారం మనదేశంలో జరుగుచున్నది. కాబట్టి నకిలీరుద్రాక్షలు మోసగాళ్ళు అమ్మజూపుతున్నారు. అంతేగాక బీహార్, ఉత్తరప్రదేశ్ లలో బద్రాక్షలు పండించి అమ్ముతున్నారు. ఇవి విషతుల్యమైనవి. కీడుచేస్తాయి. కనుక అనుభవంగలవారి సలహామేరకు రుద్రాక్షలు సేకరించుకోవడం మంచిది.

 జన్మనక్షత్రం తెలిసివుంటే, ఆనక్షతంప్రకారం ఎన్నిముఖాలరుద్రాక్ష ధరించాలో యీక్రింద తెలియజేయబడింది. ఈపద్ధతి బహుదాక్షేమకరం.

 అశ్వని-9ముఖాలు. భరణి-6ముఖాలు. కృత్తిక-1,12ముఖాలు. రోహిణి-2 ముఖాలు. మృగశిర-3ముఖాలు. ఆరుద్ర-8ముఖాలు. పునర్వసు-5ముఖాలు. పుష్యమి-7ముఖాలు. ఆశ్లేష-4ముఖాలు. మఖ-9ముఖాలు. పుబ్బ-6ముఖాలు. ఉత్తర-1,12ముఖాలు. హస్త-2ముఖాలు. చిత్త-3ముఖాలు. స్వాతి-8ముఖాలు. విశాఖ-5ముఖాలు. అనూరాధ-7ముఖాలు. జేష్ట-4ముఖాలు. మూల-9 ముఖాలు. పూర్వాషాడ-6ముఖాలు. ఉత్తరాశాడ-1,12ముఖాలు. శ్రావణం-2 ముఖాలు. ధనిష్ట-3ముఖాలు. శతభిషం-8ముఖాలు. పూర్వాభాద్ర-5ముఖాలు. ఉత్తరాభాద్ర-7ముఖాలు. రేవతి-4ముఖాలు.

 నవరత్నాలు చాల ధరగలిగినవి అందువల్ల నవరత్నజ్ఞానంగలిగినవారు గానీ తెలిసినవారి సలహాయం మేరకుగానీ నవరత్నాలకు బదులు ఎన్నిముఖాల రుద్రాక్ష ధరించాలో యీ క్రిందతెలిపిన ప్రకారం ఎంపికచేసుకొని ధరించి మేలు పొందవచ్చును.

 కెంపు-1,12ముఖాలు. ముత్యం-2,11ముఖాలు. పగడం-3,ముఖాలు. పచ్చ-4,13ముఖాలు. పుష్యరాగం-5,14ముఖాలు. వజ్రం-6,15ముఖాలు. నీలం-7,16ముఖాలు. గోమేదికం- లేక గౌరీశంకరరుద్రాక్ష. వైడూర్యం-9,18ముఖాలు.

 ఎన్నిరుద్రాక్షలు శరీరంలో ఏభాగమున ధరించవలెనో కూడా తెలుపబడింది.

 కంఠం-32. తలమీద-40. చెవులకొక్కదానికి-6. ఒక్కొకచేతికి-12. ఒక్కొకభుజానికి-16. రొమ్ముపై-108రుద్రాక్షలు ధరించాలని శివపురాణంలోనూ, దేవీభాగవతంలోనూ చెప్పబడింది. ఈరుద్రాక్షలను మంత్రపూర్వకంగా ధరించటం  అవసరం. అప్పుడవి శుద్ధియై శక్తివంతంగా పనిజేస్తాయని పెద్దలుచెబుతారు. సోమవారంగానీ పుష్యమినక్షత్రంనాడుగానీ లేదా ఏదైనా శుభదినంనాడు "ఓంనమఃశివాయ" అను మంత్రాన్ని నూటఎనిమిదిసార్లు జపించి ధరించాలని కొందరి అభిప్రాయం. మరికొందరు  "ఓంక్రీంహ్రీంక్షాంవ్రీంఓం" అనుమంత్రాన్ని పదునొకండుసార్లు జపించి ధరించాలంటారు. మరికొందరు 1,4,5,6,9,10,11,14ముఖాల రుద్రాక్షలు ధరించునపుడు "ఓంహ్రీంనమః" అను మంత్రాన్నీ, ముడుముఖాలరుద్రాక్ష ధరించునపుడు "ఓంక్లీంనమః” అనుమంత్రాన్నీ ఏడు,ఎనిమిదిముఖాల రుద్రాక్షలుధరించునపుడు "ఓంహుంనమః" అను మంత్రాన్నీ, ద్వాదశముఖిరుద్రాక్ష ధరించునపుడు "ఓంక్రౌంనమః" అను మంత్రాన్నీ నూటయెనిమిదిసార్లు జపించి ధరించాలని సూచించారు. ఏఆశా లేకుండా యిలా రుద్రాక్షలుధరిస్తే భక్తివైరాగ్యలు కలిగి అధ్యత్మికజ్ఞానం  పెంపొందుతుంది.

 మునులు, ఋషులు సంవత్సరాలపాటు అడవులలో తపమాచరిస్తూ వుంటారుగనుక వారుత్రాగేనీరు మంచిదోకాదో తెలుసుకోవడానికి నీటికికొంతఎత్తులో రుద్రాక్షను అరచేతిలోవుంచిచూస్తే అది సవ్య(Anti clock)దిశలో తిరుగుతుంది. మంచినీరుకాకపోతే అపసవ్యదిశలో తిరుగుతుంది. ఇలావారు మంచినీటిని గుర్తించి త్రాగేవారు. అనుమానం వచ్చినప్పుడు ఆహారంవిషయంలోకూడా వారు యిలానేచేసి తెలుసుకొనేవారు. ఈపద్దతి మనంకూడా పాటించి జలాన్నాలను తీసుకోవచ్చు. తద్వార విషతుల్యమైన అన్నపానీయాలను(Food poisioning)గుర్తించి జాగ్రత్తపడవచ్చును.

 ఇక అఖరుగా రుద్రాక్ష ధరించువారు పాటించవలసిన కొన్నినియమాలను తెలుసుకొందాం అవి...

 1. మైలపడిన స్త్రీపురుషులనూ, ప్రసవస్త్రీకి స్నానంచేయించువరకు తాకరాదు.

2. శవయాత్రలోపాల్గొనుట, శవమునుత్రాకుట, స్మశానమునకువెళ్ళుట చేయరాదు.

3. ఎవరి రుద్రాక్షమాల వారే ధరించాలి. ఒకరిదిఒకరు ధరించరాదు.

4. రుద్రాక్షధరించి నిద్రించరాదు. నిద్రించుటకుముందు పూజగృహమందుంచవలెను.

5. రుద్రాక్షను ఉంగరములోపొదిగించుకొని ధరించరాదు.

6. రుద్రాక్షధరించి శృంగారములోపాల్గొనరాదు.

7. మధుమాంసాదులు రుద్రాక్షధరించి ముట్టారాదు.

 ఏదియేమైనా హైందవంలోని కర్మసిద్ధాంతమును నూటికినూరుపాళ్ళు నమ్మి సర్వత్రాసర్వకాలసర్వావస్థలందునూ భగవంతుడు నిత్యుడనినమ్మి, శరణుజొచ్చి, సర్వమూ భగవదిచ్ఛకువదిలి, ఏదిజరిగినా తనమేలునకేననీ, భగవదిచ్ఛానుసారమే అంత్యయూ జరుగుచున్నదనితలచి జీవించువారికి దేనిసహాయముగాని, ఏనియమముగానీ అవసరములేదనుట నిక్కము. ఇటువంటి నిష్కామకర్మయోగుల ధ్యానమునకు రుద్రాక్షధారణ, ప్రశాంతతనొసగి వారిసాయుజ్యమునకు తోడ్పడునని ఆధ్యాత్మవిదుల బోధ.

ఓం తత్ సత్

 


 

             

 



 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...