Showing posts with label kavitha. Show all posts
Showing posts with label kavitha. Show all posts

Sunday, 13 September 2020

కులసంఘం

    కులసంఘం   

కులమోల్లంతా గలిసి సంఘం బెడుతున్నరంట

ఇంగ మనం యిక్కట్లనుంచి గట్టెక్కినట్టే నంట

ఇడుములమొయిళ్ళు సంఘంగాలికి కొట్టకపోతాయంట

ఇంగేంగావాల! శానా మంచిదే ననికొనిండొక కులపోడు.

ఒకరోజు పనిపంచేటైనా పోయేతీరాలనికొనిండు

ఈ బాధల బందిఖానానుండి

బయటబడిపోయినట్టే ననుకొనిండు.

 

రానే వచ్చిందారోజు -  కులసంఘం బెట్టేరోజు.

పట్టుదుకూలాలు గట్టి - పెద్దలంతా వచ్చేసిండ్రు

గొప్పసభదీర్చిండ్రు - మనకులం శానా గొప్పదనిండ్రు.

గుడిలేక కులదేవత గుర్రుతో ఉన్నదనిండ్రు

కట్టితీరాల గుడి ఎట్టైనా తప్పదనిండ్రు.

కులదేవతకు మొక్కిండ్రు  ఈయమ్మ

 మనకోసమే ఎలిసిందనిండ్రు.

 

సిన్నంగా యింగ రాజకీయాలకొచ్చిండ్రు

మనోళ్ళు శానా బుర్రగలోల్లనిండ్రు.

ఎట్టైనా మనకు సీటుగావా లనిండ్రు

మనోడు సట్టసభల్లో ఎలగాల్సిందే ననిండ్రు.

కులపోల్లంత కట్టగా వుండాలనిండ్రు

ఓట్లుసీలకుండా సూడాలనిండ్రు.

లెక్కెంతైనా సందాలేసుకుందా మనిండ్రు

బాంబులకేం మనకు కొదవలేదనిండ్రు.

దొంగోట్లు శానా ఏసుకోవాలనిండ్రు

మనోడీసారి గెలిసి తీరాలనిండ్రు

ఇట్టాంటియన్నీ శానా మాట్లాడిండ్రు

సభను సాగదీసి యిసిగించిండ్రు

కులపోల్ల కష్టాలమాట మరిసిండ్రు

సంఘమైతే ఒకటి బెట్టి పోయిండ్రు.

 

మనకులపోడి కొచ్చింది అనుమానం

అసలు కులమంటేఏందబ్బా? అని

పనినిబట్టి కులమనుకొనిండు

ఏపనోడు అకులం పొమ్మనిండు.

మళ్ళీ అనుమనమొచ్చింది కులపోడికి

ఈపట్టుఉడుపుల్లోని పెద్దలెవరని?

 

ఒకడేమో మనుషుల నెత్తురుపీల్చే వడ్డీవ్యాపారస్తుడు

మరొకడు సిండికేట్ల రింగులల్లే బడా కాంట్రాక్టరు.

ఇంగొకడు తగవుబెట్టి తగవుతీర్చే ఛోటా నాయకుడు.

మరొకడేమో వానితోకబట్టి బలకొట్టే పోకిరిగాడు.

కులవృత్తిని నమ్మిబ్రతుకు వాళ్ళసలుకాదు యీళ్లు.

శిలలకింద ముల్లెకొరకు గోతులుతీసే కొక్కులు యీళ్ళు

అమ్మోరి జాతరలో అల్లరిజేసి కూసే కుక్కలు యీళ్లు.

 

ఈళ్ళాంతా కులపోళ్ళా? కాదంటే కాదనిండు

మోసగాళ్ళు దగకోర్లు దొంగలు యీళ్ళనిండు.

చెట్టుపేరుజెప్పి కయలమ్ముకొనే నాయాళ్ళు యీళ్లు

కులంపేరుతో పబ్బంగడుపుకొనే కుటిలులు యీళ్ళు

 

ముడిసరుకుకై యాతన కులమంతా పడుతుంటే

ఒకమాటైనా మాట్లాడిండ్రా యీళ్ళు

పనిసాగక కులమంత పస్తుల్తో చస్తుంటే

పరపతి మాటేమైనా ఎత్తిండ్రా యీళ్లు

పనికిమాలిన మటలు మాట్లాడిండ్రు

పనిపంచేటుజేసి పోయిండ్రు.

 

కులసంఘం చేసిందేముంది - కుల్లుబెంచడం తప్ప

అని అనుకొనిండు మనోడు అసలు సిసలు కులపోడు

కడగండ్లలో వున్నోడు.. సరైన పనోడు.

 --- 

 

search: kulasangham  

Saturday, 12 September 2020

మారాలి మనిషి

మారాలి మనిషి

 

కోటానుకోట్లు నొక్కేసినా  ఆ రాజకీయనాయకుని
బినామీ లాకర్లు నిండలేదు.
మేజక్రింద ఎంత హస్తలాఘవం జూపినా
ఆ ఉద్యోగి జోబులు నిండలేదు.
ఎంతగా వంచన నిలువెల్ల పులుముకొన్నా
ఆ వ్యాపారి గల్లాపెట్టె నిండలేదు.
ఒకటేమిటి సంపాదనా పరుగుపందేలకు 
మితి గతి లేకుండాపోయింది
వారి ఇనుపపాదాలక్రింద నలిగిపోయే సామాన్యునికి
దిక్కేలేకుండా పోయింది.
 
ఎందుకలా?

ఇంతసంపాదించితి, నికయేల యని తనియరాదని
ఆశాపాశము తా కడునిడువు లేదంతంబు దానికని
తిన్నదికాదు పుష్టి మానవుల కెనకేసికొన్నదే పుష్టి యని
సర్దిచెప్పుకోవలసిందే కానీ మార్గామ్తరమే లేదుకదా?

 
తెనెటీగలు తమతుట్టె నిండగానే
ఆగి ఆస్వాదించి అనందిస్తాయి.
చీమలు తమపుట్ట నిండగానే
ప్రయాస చాలించి హయిగా ఆహారిస్తాయి.
పశుపక్షాదులు ఏపూటకాపూట
దొరికిందితిని తృప్తిగా విశ్రమిస్తాయి.
ప్రకృతిలో ఒకభాగంగా జీవిస్తాయి.

 
ఎందుకు మానవుడు మాత్రమే ప్రకృతితికి వైరియై
కృత్రిమసుఖాలకై పోరాడుతున్నాడు?
అంతులేని ఆరాటంతో అసంతృప్తికిలోనై
అతలాకుతలమౌతున్నాడు?

 
నూతనావిష్కరణలంటూ పోటీపడి
ప్రకృతిని మైలపరుస్తున్నాడు.
ఒకవైపు తోటిజీవుల హింసిస్తూ
మరోవైపు శాంతినాకాంక్షిస్తున్నాడు.
మ్రొక్కులతో పైశాచిక పూజలతో
ఆవేదనల కంతం వెతుకుతున్నాడు.
అది అందని పండైనా అర్రులుచాస్తూ
అలసిపోతున్నాడు.

 
మనిషి జన్మతః క్రూరుడా? కాదుగదా?
మనిషంటేనే మానవత్వంగల ప్రాణి గదా?
మేథోసంపత్తి సమృద్ధిగా గల జీవిగదా?
వివేచనాజ్ఞాన సంపదకు వారసుడు గదా?
సృష్టికి ప్రతిసృష్టి చేయగల అపర పరమేమేష్టి కదా?

 
 మరైతే ప్రకృతికి పట్టిన చీడ్పురుగై
వినాశన హేతువౌతున్నాడెందుకు?
ఆలోచించాలి...మనిషి మారాలి.
 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...