మహాభారత సూక్తినిధి
రచన: పోలిచర్ల సుబ్బరాయుడు
9966504951
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే .
శాంతాకారం భుజగశయనం - పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన
సదృశం - మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమల నయనం - యోగిహృద్ధ్యాన గమ్యం
వందే
విష్ణుం భవ భయహరం - సర్వలోకైక నాథం
నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం ।
దేవీం సరస్వతీం
వ్యాసం తతో జయముదీరయేత్ ॥
శ్లో: సంసార కటువృక్షస్య
ద్వే ఫలేహ్యమృత
సుభాషిత రసాస్వాదః
సంగతి స్సజ్జనై స్సహ.
సంసారమొక చేదువృక్షం. అయినా ఆది రెండు అమృతఫలాల నిస్తున్నది. అవి ఒకటి సుభాషితముల రసాస్వాదనము, రెండు సజ్జనులతో స్నేహసాంగత్యము.
ఉ: మెచ్చుడు మెచ్చువచ్చునెడ, మెచ్చకు డిచ్చకు మెచ్చురానిచో
మెచ్చియు మెచ్చు మ్రింగకుడు, మెచ్చక మెచ్చితిమంచు గ్రొచ్చలై
మెచ్చకు డిచ్చ మెచ్చుగని మెచ్చుడు మెచ్చొకమానమైనచో
మెచ్చియు మెచ్చకుండకయు మెచ్చుడు సత్కవులార! మ్రొక్కెదన్.
---- కేతన
నచ్చి మెచ్చుకోవాలనిపిస్తే మెచ్చండి. నచ్చక మెచ్చుకోవలసిందేమీ లేదనుకుంటే, మెచ్చుకోకండి. బాగుందని మనసుకు నచ్చినప్పటికీ మెచ్చుకోకుండా గొంతులోనే నొక్కేసుకోకండి. బాగలేదనిపించినా మొగమాటానికి మెచ్చుకోకండి. ఇష్టమైతేనే మెచ్చుకోండి. ఒకవేళ మెచ్చుకుంటే, అదిఒక కొలమానమైనందువల్ల ప్రశంస లందుకున్న వారికి మేలుకలుగుతుందంటే మాత్రం, నచ్చినా నచ్చకపోయినా మెచ్చుకోండి. సత్కవులారా మీకివే నావందనములు.
ఉ: నన్నభట్టు భీమకవి నాచనసోముని నెఱ్ఱప్రగ్గడన్
సన్నుత భారతార్థ ఘటనాచణు దిక్కనసోమయాజి వి
ద్వన్నుత దివ్యభాగవత వాక్పటు బమ్మెర పోతధీమణిన్
సన్నుతిజేసి యాధునిక సత్కవిరాజి బ్రశంసచేసెదన్.
----- దంతులూరి బాపరాజు
ముందుమాట
మహాభారతము ధర్మాలకు నిధి. నీతులగని. అవి నేటికి ఆచరణ యోగ్యలే, అంతేగాక అది గంభీరమైన భరతవీరుల గాథ. కథాగమనంలో ధర్మాలు, నీతులు, ఉపదేశాలు ప్రక్కనుంచి ముందుకుసాగడం సర్వసామాన్యంగా అందరంచేసే పనే. అందుకే ఆధర్మాలను, నీతులను సాద్యమైనన్ని యెన్నుకొని ఒక ప్రత్యేక పుస్తకంగా తీసుకవస్తే బాగుంటుందని, వాటిని శ్రద్ధగా తెలుసుకోవాలన్న జిజ్ఞాసులకు అనుకూలంగా వుంటుందన్న సత్సంకల్పంతో యీ పుస్తకం కూర్చడం జరిగింది.
నాకు తెలిసినంతలో సందర్భము భావము వ్రాయడం జరిగింది. ఏఒక్కరికి యీపుస్తకం ఉపయోగపడినా నా ప్రయత్నం ఫలించినట్లే భావిస్తాను.-- నమస్తే!
మీ
పోలిచర్ల సుబ్బరాయుడు
9966504951
మహాభారత సూక్తినిధి
సీ: ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రంబని
యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిక్షణుల్
నీతిశాస్త్రంబని
కవివృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు
సర్వలక్ష్యసంగ్రహమని
యైతిహాసకులితిహాసమనియు
పరమపౌరాణికుల్
బహుపురాణసముచ్చ
యంబని మహి గొనియాడుచుండ
ఆ:వె: వివిధ వేదతత్త్వవేది వేదవ్యాసు
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు
విశ్వజనీనమై
పరగుచుండ జేసె భారతంబు. (ఆది-1-32)
మహాభారతంలో
తొలుతనే నన్నయ, భారతం చదివేవారి తలంపునకు తగినట్లుగా భాసిల్లుచున్నదని చెబుతూ, ధర్మశాస్త్రంగా, వేదాంతంగా, నీతిశాస్త్రంగా, మహాకావ్యంగా, సర్వలక్ష్యసంగ్రహంగా, ఇతిహాసంగా, యెలాచూస్తే అలా కనిపిస్తుందనీ, ఇది విశ్వజనీనమని. విష్ణువుతో
సముడైన వేదవ్యాసులవారు దీన్ని మనకందించారని తెలియజేశారు.
శా: ఆయుష్యం బితిహాసవస్తుసముదాయం బైహికాముష్మిక
శ్రేయః ప్రాప్తి
నిమిత్తముత్తమ సభాసేవ్యంబు లోకాగమ
న్యాయైకాంతగృహంబు నాబరగి నానావేద వేదాంత వి
ద్యాయుక్తంబగు దాని జెప్పదొడంగెం
దద్భారతాఖ్యానమున్. (ఆది-3-11)
వైశంపాయనుడను, వ్యాసభగవానుని శిష్యుడు, అభిమన్యుని మనుమడైన జనమేజయునకు
భారతాన్ని గురించి చెబుతూ, ఇది శాంతిరసప్రాధ్యాన్యత గలది, గనుక ప్రశాంతతనిచ్చి, దీర్ఘాయువునిస్తుంది. అనేక
ఇతిహాసముల నందించి సంతోషానిస్తుంది. ఇహపరశ్రేయోదయకమైనది. పెద్దసభలలో మాన్యులచేత
చర్చింపజేస్తుంది. లోకంలో అనుసరించవలసిన నీతి న్యాయాలను నేర్పుతుంది.
సర్వవేదవిద్యలకు నిలయమై యున్నదీ మహాభారతమని,భారతాన్ని చెప్పడం
ప్రారంభిస్తాడు. అందుకే యిందులోని నీతులను, న్యాయాలను, ధర్మాలను, వెదికే ప్రయత్నం చెద్దాం.
మ: అమితాఖ్యానక శాఖలం బొలిచి, వేదార్థామల చ్ఛాయమై
సుమహావర్గ చతుష్కపుష్ప వితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమ నానాగుణకీర్తనార్థఫలమై
ద్వైపాయనోద్యాన జా
త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై (ఆది-1-66)
మహాభారతం
కల్పవృక్షంతో సమానం. ఇందులోని అనేక ఉపాఖ్యానాలు (కథలు) కల్పవృక్ష శాఖలు. నీడ
నిర్మలవేదార్థములు. పువ్వులు నాలుగుపురుషార్థములు
(ధ ర్మార్థకామ
మోక్షములు), పండ్లు శ్రీకృష్ణార్జున యోగ్య సద్గుణముల ప్రశస్తి వలన కలిగే
శ్రేయస్సు. ఈకల్పవృక్షమున్న ఉద్యానవనం సాక్షాత్తు శ్రీవ్యాసమునీంద్రుల హృదయమే.
కనుక యిది సద్గుణుల (విప్రుల) కు ప్రార్థింపదగినదై యలరారుచున్నది.
క: తగునిది తగదని యెదలో
వగవక సాధులకు బేదవారల కెగ్గుల్
మొగిజేయు దుర్వినీతుల
కగు ననిమిత్తాగమంబులయిన భయంబుల్. (ఆది-1-85)
జనమేజయ
మహారాజు యజ్ఞంచేస్తున్నాడు. అప్పుడు "సరమ" అనే దేవతాకుక్క వచ్చి, మహారాజా! నాపిల్లలు
మీయజ్ఞసంబారాలను ముట్టలేదు. ఎటువంటి అకృత్యమూ చేయలేదు. అయినా నీతమ్ములు నాపిల్లలను
కొట్టి బాధించినారు. దీని ఫలితమేమో తెలియునా? అంటూ చెప్పిందీ పద్యం. తపొప్పులు
విచరించకుండా, శక్తిహీనులైన సాధుస్వభావులను, పేదవారిని బాధిస్తే, తత్ఫలితంగా బాధించినవారికి
యేకారణము లేకుండానే, భయాలు కలుగుతాయి, అన్న సత్యన్ని తెలియ జేయుచున్నదీ పద్యం. ఇది
యెవరికైనా, యేకాలంలోనైనా వర్తించే ఒక ప్రకృతి నియమం, ఒక హెచ్చరిక.
ఉ: నిండుమనంబు నవ్యనవనీత సమానము; పల్కుదారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుతా! విప్రులందు; నిక్కమీ
రెండును. రాజులందు విపరీతము గావున, విప్రుడోపు: నో
పండతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్.
(ఆది-1-100)
ఉదంకుడన్న
మహర్షి, పౌష్యమహారాజు ఇద్దరు గొప్పవారే, ఒకానొక సందర్భంలో ఒకరినొకరు
శపించుకున్నారు. ఉదంకుడు విప్రుడు. అనగా విశేషమైన ప్రజ్ఞగలవాడు. అతని హృదయం
క్రొత్తవెన్నవలె మెత్తనిది. అతని కోపము తాత్కాలికము. తననుతాను అనతికాలములోనే
అదుపుచేసుకొనగల మృదుస్వభావుడు. గనుక తను
శపించిన వానికి విముక్తి సూచించగలడు. కానీ రాజు అలాకాదు. అతని హృదయం వజ్రాయుధంవలె
కఠినం. శపిస్తే తిరిగి శాపమును వెనక్కు తీసుకోలేడు. ఈవిషయం పౌష్యమహారాజే, ఉదంకమునికి తెలిపి, తన అశక్తతను ప్రకటించినాడు. ఈ
పద్యంతో నన్నయ విప్రునకు, అనగా ప్రజ్ఞావంతుడైన మృదుహృదయునకు, కఠినమనస్కుడైన క్షత్రియునకు గల
బేధము తేటతెల్లముజేసినాడు. మృదుహృదయమువైపు మొగ్గు జూపినాడు.
క: పలుమఱు శపథంబులు, నం
జలియును నభివాదమును, సామప్రియభా
షలు, మిథ్యావినయంబులు
గలయవి దుష్టస్వభావ కాపురుషులకున్. (ఆది-1-112)
ధర్మరాజును
యువరాజుగా యెన్నుకున్నారు. దుర్యోధనుడు సహించలేక పోయాడు. కణికుడనే మంత్రిని
రాజనీతిని గురించి అడిగాడు. ఆసందర్భంలో కణికుడు వెప్పిన నీతి యిది.
విచక్షణారహితంగా మాటిమాటికి శపథాలు చేయడం, వంగివంగి దండాలు పెట్టడం, అదేపనిగా తెచ్చిపెట్టుకున్నట్లు
ప్రియంగా మాట్లాడటం, దొంగవినయాలు, ఇవి దూర్తలక్షణాలు. నన్నయ మనజాగ్రత్తకోసం చెపిన దూర్తలక్షణాలివి.
క: తన
కపకారము మది జే
సిన జను డల్పుడని నమ్మి, చేకొనియుండం
జన, దొకయించుక ముల్లయి
నను బాధ తలమున నున్న నడవనగునే? (ఆది-6-116)
తనకపకారంచేసిన
వ్యక్తిని అల్పుడని యేమరియుండరాదు. చిన్నముల్లయినా తేసి వేయకపోతే, నడవలేము. గనుక అట్టివారియెడ అప్రమత్తంగా
వుండితీరాలి. అని కణికుడు పైసందర్భములో దుర్యోధనునకు చెప్పిన నీతి యిది. నన్నయ
చెప్పిన జాగరూకత యిది
క: తనయెరిగిన యర్థం బొరు
డనఘా ఇది యెట్లు
సెప్పుమని యడిగిన జె
ప్పనివాడును సత్యముసె
ప్పనివాడును ఘోరనరకమున
బడున్. (ఆది-1-136)
పులోముడనే
రాక్షసుడు భృగువంశజుని భార్యయైన పులోమను ( రాక్షసుని పేరేకాదు భార్గవుని భార్యకూడా
పులోమయే) అపహరించే తలంపుతో అక్కడున్న హోమాగ్ని దేవుని నిజంచెప్పు, యీమె పులోమేనా? అనిఅడిగాడు. అగ్ని సందేహంలోపడ్డాడు.
నిజంచెప్పడమే సరియని, ఆమె పులోమయే అన్నాడు. రాక్షసుడు ఆమెను అపహరించ యత్నించాడు.
ఆమెగర్భస్థ శిశువు జారి పడ్డాడు, ఆశిశువు తేజస్సుకు తాళలేక రాక్షసుడు మరణించాడు (ఆశిశువే చ్యవన
మహర్షి). అప్పుడే భార్గవుడు ప్రవేసించి, అగ్నిని సర్వభక్షకుడవు కమ్మని శపించాడు. అగ్నిదేవుడీ పద్యం చెబుతాడు.
నిజంచెప్పమన్నపుడు, తెలిసియెలా చెప్పకుండా వుంటాను? అది నరకహేతువుగదా? అన్నాడు. కానీ ఆనిజం ఒకరికి
హానిచేసేదైతే అది సత్యమనిపించుకోదని తర్వాత వివరించబడింది. మహభారతం యిక్కడ
సత్యానికి సరైన నిర్వచనమిచ్చింది.
ఆ:వె: మొదలి
పెక్కుజన్మముల బుణ్యకర్మముల్
పరగపెక్కుజేసి పడయబడిన
యట్టి యెరుక జనుల కాక్షణ మాత్రన
చెఱచు మద్యసేవసేయ నగునె. (ఆది-3-120)
నన్నయ
యీపద్యంద్వారా మద్యపానదోషాన్ని తెలియజేసి మనకు జాగ్రత్త చెబుతున్నాడు.
రాక్షసగురువు శుక్రాచార్యులు, బృహస్పతికొడుకు కచుని శిష్యునిగా చేర్చుకున్నాడు. అది
రాక్షసవిద్యార్థులకు నచ్చలేదు. వారు సమయంచూసి కచుని చంపి, కాల్చిబూడిదచేసి కల్లులోకలిపి
గురువుకు త్రాగించారు. అది తెలిసి శుక్రాచార్యులు తన మృతసంజీవనివిద్యచేత
బ్రతికించుటకు వీలులేని పరిస్థితి. అపుడాయన కచున్ని కడుపులోనే బ్రతికించి, కడుపులోని కచునికి
మృతసంజీవనివద్యను నేర్పి, పొట్టచించుకొని బయటికిరా, వచ్చి నేనునేర్పిన విద్యతో నన్నుబ్రతికించుకో అన్నాడు. కచుడు అలానే
చేశాడు. అప్పుడు శుక్రాచార్యుడు. మద్యపానంవలన యెంత దారుణాలు జరుగుతాయో గ్రహించి యీ
పద్యం చెప్పాడు. ఎన్నోజన్మలనుండి ఆర్జించిన పుణ్యాలు, జ్ఞానంసర్వస్వం ఒక్కక్షణంలో తాగుడువల్ల నాశనమై
పోతాయి, కనుక తాగుడు యేపరిస్థితులలోనూ మంచిదికాదని లోకాన్ని
హెచ్చరించాడు.
క: అలిగిన నలుగక యెగ్గులు
పలికిన మఱి విననియట్లు ప్రతివచనంబుల్
పలుకక బన్నమువడి యెడ
దలపక యున్నతడ చూవె ధర్మజ్ఞుడిలన్ (ఆది-3-147)
శర్మిష్ఠ
రాక్షసరాజు వృషపర్వుని కూతురు. ఈమె శుక్రాచార్యుని కూతురు దేవయానితో తగవులాడింది.
శర్మిష్ఠ దేవయానిని బావిలోత్రోసి వెళ్ళిపోయింది. తర్వాత ఆమెను యయాతి మహారాజు
కాపాడినాడు. ఆచార్యుని కుమార్తె గదా! అలిగింది ఇంటికి వెళ్ళక భీష్మించి కూర్చుంది.
శుక్రచార్యులు వచ్చి ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకపోయే ప్రయత్నంలో ఆయన కూతురికి
చెప్పిన నీతియిది. కుమారీ! ఒకరు కోపగించుకున్నంత మాత్రాన మనంకూడా కోపగించుకో
కూడదు. నిందిస్తే విననియట్లు ఊరకుండిపోవాలి. అవమానానికి గురైనా యేమి జరగనట్లే
మిన్నకుండాలి. అటువంటివారే ఈలోకంలో ధర్మాత్ములు. ఇది నన్నయ ధర్మానికిచ్చిన
నిర్వచనం.
క: ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనులగోష్ఠి గదలక ధర్మం
బెఱగుచు నెఱిగినదానిని
మఱవకనుష్ఠించునది సమంజసబుద్ధిన్. (ఆది-3-203)
చంద్రవంశపురాజు
యయాతి, రాజులలో ఇంద్రునివంటివాడు. తనమామయైన శుక్రాచార్యుడు శపించడంవల్ల
ముసలితనాన్ని అనుభవించవలసి వచ్చింది. కానీ తనచిన్నకొడుకు పూరుడు ఆముసలితనాన్ని
స్వీకరించి తండ్రికి తన యవ్వనాన్ని యిచ్చేశాడు. తదనంతరకాలంలో శాపవిముక్తుడైన
పూరునకే రాజ్యందక్కింది. యయాతి పూరునకు అనేక నీతులు బోధించాడు. అందులోనిదే
యీపద్యం. జ్ఞానులనడవడిని గమనించి, వారిమార్గంలో ముందుకుసాగాలి. సజ్జనుల ప్రసంగాలను శ్రద్ధతోవిని
ధర్మాలను తెలుసుకోవాలి. కేవలం తెలుసుకోవడంతోనే ఆగక, వాటిని నిజ జీవితంలో అమలుజరపాలి.
అట్లున్నవాని బుద్ధిమాత్రమే సమంజసమైనది. అని యయాతి పూరునకు ఉపదేసించాడు. సర్వకాల
సర్వావస్థలలో ఆచరణయోగ్యమైన నన్నయ నీతిపద్యమిది.
చ: నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావిమేలు; మఱిబావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతువదిమేలు; తత్క్రతుశతంబుకంటె సుతుండుమేలు; త
త్సుతశతకంబుకంటె నొక సూనృతవాక్యముమేలు సూడగన్.
(ఆది-4-93)
శకుంతల
తన కుమారుని తీసుకొని కణ్వాశ్రమం నుండి భర్తయైన దుష్యంతమహారాజు కొలువుకూటమునకు
వచ్చింది. రాజు నీవెవరో నాకు తెలియదన్నాడు. అప్పుడామె వ్యధకు అంతేలేకుండాపోయింది.
తర్వాత ఆమెతేరుకొని ధైర్యంగా, ఆరాజుకు తెలివివచ్చేవిధంగా, సత్యవాక్యముయొక్క గొప్పదనాన్ని తెలియజెప్పింది. ఆసందర్భము లోని
పద్యమిది. ఓ రాజా! నూరు చిన్నచిన్న నూతులకంటే, ఎన్నినీళ్ళు తోడినా తరగని
ఒకపెద్దబావి (లేదా దిగుడుబావి) మేలు, అట్టి నూరుబావులకంటే, ఒక యజ్ఞం (పరుల కొరకై నిస్స్వార్థంగా చేసే మంచిపని) మేలు. నూరు
యజ్ఞాలకంటే ఒక్కసుపుత్రుడుమేలు. అట్టి నూర్గురు పుత్రులకంటే సర్వసమ్మతమైన
సత్యవాక్యము మేలు. కనుక అసత్యము పలకవలదు. అని బుద్ధిచెప్పింది శకుంతల.
క: వెలయగ నశ్వమేధం
బులు వేయును నొక్క
సత్యమును నిరుగడలం
దుల నిడి తూపగ సత్యము
వలనన ములుసూపు గౌరవంబున
పేర్మిన్. (ఆది-4-94)
ఇదికూడా పైనచెప్పిన సందర్భములో చెప్పిన శకుంతల పద్యమే. వేయి అశ్వమేథ
యాగములను, ఒకసత్యమును త్రాసులోని రెండు పళ్ళెరములలో వుంచి తూచే మార్గమేవుంటే, సత్యవాక్యమున్న పళ్ళెరమువైపునకే
ముల్లు వాలుతుందని చెప్పి
సత్య వాక్య గౌరవము నిల్పిన నన్నయ పద్యమిది.
తే:గీ: సర్వతీర్థాభిగమనంబు సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుగావ
యెఱుగు మెల్లధర్మంబుల కెందు పెద్ద
యండ్రుసత్యంబు ధర్మజ్ఞులైన మునులు.
(ఆది-4-95)
ఇది
పైపద్యమునకు కొనసాగింపు. ఎన్నితీత్థములు తిరిగినా, వేదములన్నీ అధ్యయనం చేసినా. ఒక
సత్యంతోసమానంకావు. ఇది ధర్మంతెలిసిన మునులమాట. అంటూ శకుంతల సత్యంయొక్క గొప్పదనన్ని
వివరించింది. చిన్న తేటగీతలో గొప్ప నీతిని చెప్పిన నన్నయ పద్యమిది.
చ: విమలయశోనిధీ! పురుషవృత్త మెఱుంగుచు
నుండుచూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు
నంతరాత్మయున్
యముడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు
నమ్మహాపదా
ర్థములివి యుండగా నరుడు దక్కొన నేర్చునె
తన్ను మ్రుచ్చిలన్. (ఆది-4 -79)
స్వచ్ఛమైమ కీర్తిగల ఓ రాజా! ఎవరూ చూడలేదుగదాయని
నిన్నునీవు మోసగించుకోకు. దొంగవుగాకు. వేదములు, పంచభూతములు, ధర్మము, తొలిమలిసంధ్యలు, అంతరాత్మ, యముడు, రవిచంద్రులు, పగలు, రేయి యివన్నీ మనల్ని గమనిస్తూనే వుంటాయి.
కనుక కల్లలాడి తప్పించుకోజూడకు మని శకుంతల తనభర్త దుష్యంతుని హెచ్చరించిన పద్యాలలో
యిదీఒకటి. మాటిమాటికి సత్యంగొప్పదనాన్ని చెబుతూ నన్నయ సత్యాయ్యానికిచ్చిన గౌరవమిది.
సీ:
ధర్మార్థకామసాధన కుపకరణంబు
గృహనీతి విద్యకు గృహము;విమల
చారిత్ర శిక్షకాచార్యకం; బన్వయ
స్థితికిమూలంబు; సద్గతికినూత;
గౌరవంబున కేకకారణం; బున్నత
స్థిరగుణమణుల కాకరము; హృదయ
సంతోషమునకు సంజనకంబు భార్యయ
చూవె; భర్తకు నొండ్లుగావు ప్రియము
ఆ:వె: లెట్టిఘట్టములను నెట్టియాపదలను
నెట్టితీఱములను ముట్టబడిన
వంతలెల్ల బాయ నింతుల ప్రజలను
నొనరజూడగనిన జనుల కెందు. (ఆది-4 -84)
ఈ పద్యంగూడా
పైసందర్భం లోనిదే. శకుంతల దుష్యంతమహారాజుతో రాజా! నేను నీఇల్లాలిని, నన్ను తిరస్కరించటం నీకు
భావ్యంకాదు. భార్య ధార్మార్థకామమోక్షాలనే పురుషార్థములను సాధించటానికి
సహాయపడుతుంది. నీతివంతమైన గృహస్థ జీవితానికి భార్య నెలవు. సరియైన నడవడితో
జీవించటానికి మార్గదర్శి. వంశం నిలవడానికి ఆధారం. ఉత్తమగతులను పొందటానికి
సహాయకారి. గౌరవమర్యాదలు కలగటానికి ఆమే కారణం. భర్తకు గొప్పదనాన్ని తెచ్చిపెట్టేది
భార్యయే. భర్తసంతోషానికి ఆమే కారణం. భర్యకంటే ప్రియమైనదేదీలేదు. ఏసందర్భములోనైనా, యేఆపదలు గలిగినా ఆలుబిడ్డలను
ఆప్యాయంగా చూసుకొనే వారికి అండగానిలిచేది భార్యయే సుమా! కనుక నన్నాదరించకపోవటం
తగదు. అంటూ హితవుపలికింది శకుంతల. ఇదీ మహాభారతం స్త్రీకిచ్చిన విలువ.
విలువలతోగూడిన జీవితానికి భారతం చూపిన ఆదర్శమార్గం.
క: మతిదలపగ సంసారం
బతిచంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు
గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్. (ఆది-5-159)
కుంతి
తనభర్త మరణానంతరం బిడ్డలతో వనం విడచి హస్తిన వచ్చింది. భర్తమాణానికి సంబందించిన కార్యక్రమాలన్ని
ముగిశాయి. సత్యవతీదేవి (భీష్ముని పినతల్లి) కుటుంబంలో జరుగుచున్న సంఘటనలకు
వ్యధజెందూవుంది. ఆసమయంలో వ్యాసభగవానుడు తల్లియైన సత్యవతీదేవిని ఓదర్చుతూ యీ పద్యం
చెబుతాడు. అమ్మా! మనసుపెట్టి ఆలోచిస్తే అర్థమౌతుంది, ఎండమావి వంటిదీ సంసారం. కనబడే ధన
రాసులు క్షణికాలు. అంతామాయ. గడచిపోయిందే మంచికాలం. రాబోయే కాలంలో కలిగే ఉపద్రవాలను
చూసి మీరు భరించలేరు. అని వాస్తవాలుచెప్పి సత్యవతిని, ఆమె కోడండ్రిద్దరిని పిలుచుకొని
ఆశ్రమానికిపోయి, వారికి మోక్షమార్గం చూపించారు. గతకాలము మేలు, వచ్చుకాలము కంటెన్.
అనునది ఒక నానుడి యై నేటికీ చెల్లు బాటులో నున్నది.
క: ఆపద యయినను ధర్మువ
ప్రాపుగ రక్షింప వలయు
బరమార్థము ధ
ర్మాపాయమ ధార్మికులకు
నాపద జన్మాంతరమున ననుగత
మగుటన్. (ఆది-6-221)
హిడింబఅన్నను,
భీముడు చంపేశాడు. హిడింబ దీనయై పాండవులవెంట వచ్చుచున్నది. భీముడు ఆమెరాకను
అడ్డుకొని, యీరాక్షసి మనకు అపకారం చేయవచ్చు నని ధర్మరాజును హెచ్చరించాడు. అప్పుడు
ధర్మరాజు చెప్పిన మాటలివి. మనకు ఆపదగలిగినా ధర్మాన్ని రక్షించవలసిందే.
ధర్మాత్ములైన వారికి ధర్మము విడనాడుటే ఒక ఆపద. ఎందుకంటే ధర్మరక్షణ చేయకపోవడమనే
పాపము మరుజన్మకు కూడా వెంటవచ్చి పీడిస్తుంది. ఈహిడింబ అన్నఅనే ఆధారాన్ని
పోగొట్టుకొంది. అబల. భయ కంపితురాలై యున్నది. ఈమె అపకారియని శంకించి రక్షించకపోవడం
తప్పు. రక్షించి తీరాల్సిందే. అదేధర్మం అన్నాడు ధర్మరాజు. నన్నయ ధర్మరక్షణ ప్రాధాన్యతను
వివరించిన పద్యమిది
క: కృతమెరుగుట పుణ్యము; స
న్మతి దానికి సమముసేత మధ్యము; మఱి త
త్కృతమున కగ్గలముగ స
త్కృతి సేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్.
(ఆది-6-241)
ఏకచక్రపురంలో
పాండవులు బ్రాహ్మణవేశధారులై ఒకరింట తదాచుకొని యున్నారు. ఆయింటివారికాపద వచ్చింది.
వారు యేడుస్తున్నారు. అప్పుడు కుంతి వారికొచ్చిన కష్టం తెలుసుకొని సహాయం చేయాలి.
వీరు మనకు ఆశ్రయమిచ్చారు. అంటూ కుంతి పలికిన మాటలివి. చేసినమేలు మరువకపోవడం
పుణ్యపురుషుల లక్షణం. ఆచేసినమేలుకు సమంగా తిరిగి మేలుచేయడం మధ్యమం. వారుచేసిన
మేలుకు మించి మేలుచేయడం ఉత్తమం. ఇది నన్నయ చెప్పిన కృతజ్ఞతా లక్షణం.
తే:గీ: ఎరుకగలదేని మఱి శక్తుడేని యన్యు
లన్యులకు హింసగావించు నపుడె దాని
బూని వారింపకున్న, నప్పురుషు డేగు
హింసచేసిన వారలు యేగు గతికి.
(ఆది-7-146 )
ఔర్యుడనే
భృగువంశీయుడు, తనపూర్వీకులు కార్తవీర్యవంశపురాజులచేత చంపబడ్డా రన్న కోపంతో, లోకాలన్నిటిని నాశనంచేస్తానని
తపస్సుచేయ సాగాడు. అతని తపస్సుకు లోకాలన్నీ కంపించిపోయాయి. ఔర్యుని పిత్రుదేవతలు
దిగివచ్చి ఔర్యుని శాంతింపజేశారు. ఔర్యుడు తన కోపానికి కారణంగా చెప్పిన పద్యమిది.
తెలిసి ఆపగలిగి యుండికూడా హింసను కొనసాగనిస్తే, అతడుకూడా హింసాత్మకుని వలెనే దుర్గతి
పొందుతాడు. యిది నన్నయచెప్పిన సూక్తులలో విలువైన సూక్తి
క: ఆరంభరహితు బొందునె
యారయ సంపదలు? హీనుడయ్యు బురుషుం
డారంభశీలుడయి యకృ
తారంభుల నోర్చు నెంత యధికులనయినన్. (సభా-1-122)
ధర్మరాజు
రాజసూయంచేయాలన్నది స్వర్గస్తుడైన పాండురాజు కోరిక. ఆవిషయం నారదునివల్ల తెలిసి, రాజసూయం చేయాలనే ఆలోచనజేసే
సమయంలో భీముడు పల్కిన పల్కులివి. సంపదకావాలంటే, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం
చేయనివాడు యెంత గొప్పవాడైనా, ప్రయత్నం చేసే హీనునిచేతిలో ఓడిపోవలసి వస్తుంది. కనుక రాజసూయంచేద్దాం
అన్నాడు భీముడు. ఈపద్యంలో ప్రయత్నానికున్న బలాన్ని చెప్పాడు నన్నయ.
తే:గీ: ప్రియము పలికెడు వారిన పెద్ద మెత్తు
రప్రియంబును బథ్యంబులైన పలుకు
వినగనొల్లరు గావున వేడ్కదాని
బలుకరెవ్వరు నుత్తమ ప్రతిభులయ్యు. (సభా-2-191)
తే:గీ: మొదలు నప్రియమయ్యును తుది గరంబు
పథ్యమగుపల్కు ప్రియులందు బలిమినైన
బలుకవలయు మోమోడక యొలసి యట్టి
వాడు దగుసహాయుండు భూవల్లభునకు. (సభా-2-192)
కౌరవులు
పాండవులు జూదమాడు సమయంలో విదురుడు పల్కిన పల్కులివి. ఇష్టంగావున్న మాటను బహుగా
మెచ్చుకుంటారు. ఇష్టంలేనిమాట మేలుచేసేదైనా వినరు. కనుక తెలిసినపెద్దలు కూడా ఊరకే
చూస్తూవుడిపోతారు.
తొలుత
వినడానికి కష్టంగావున్నా, చివరికి మేలుచేసే హితవాక్యాలు తమవారనుకునేవారికి చెప్పక తప్పదు.
అలాచెప్పి తనకిష్టమైనవారిని కాపాడుకోవాలి. వారే రాజుకు నిజమైన సహాయకులు. విదురమహాశయులు, భీష్మద్రోణాదులు ఊరకున్నా, హితంపలికాడు ధృతరాష్త్రునితో.
అయినా వినలేదు రాజు. అందుకే నాశనం కొనితెచ్చుకొన్నాడు. నన్నయ లోకానికి చెప్పిన
గొప్ప హితవాక్యాలివి.
క: హారి విషయాభిలాషము
గారణముగ నెంత
యెఱుకగలవారును దు
ర్వార వికారముబొందెడు
వారు; నిజేంద్రియము లివి యవస్యము
లగుటన్. (అర-1-32)
ధర్మరాజు
అరణ్యవాసంలో వుండగా, మునులు ఆయన వద్దకొచ్చి అనేక ధర్మాలు, నీతులు, మహాత్ముల చరిత్రలుచెప్పేవారు.
శౌనకమహర్షి ధర్మరాజుకు చెప్పిన ఆధ్యాత్మిక విషయమిది. ఇంద్రియాలను అదుపుచేసుకోవటం
అంత సులువైన విషయంకాదు. ప్రాపంచిక విషయములమీదికి అవి బలవంతంగా లాక్కొనిపోతాయి.
ఎంతటి జ్ఞానులైనా ఇంద్రియాలను అదుపుచేయటం కష్టమే. ఎంతబలంగ వటిని అదుపుచేయ యత్నిస్తే
అంతే బలంగా అవి విజృంభిస్తాయి. అని శౌనకుడు ధర్మరాజుకు జాగ్రత్తలు చెప్పాడు.
ఆ:వె: కార్యగతులతెరగు కలరూపు చెప్పిన
నధికమతులు దాని నాదరింతు
రల్పకార్యబుద్ధులగు వారలకు నది
విరసకారణంబు విషమపోలె. (అర-1-59)
ధృతరాష్త్రునికి
నిర్మొగమాటంగా విదురుడు సలహాలనిస్తాడు. అది నచ్చదు, ధృతరాష్త్రునికి. ఒకసారి రాజా!
పాండవులను అరణ్యవాసంనుండి వెనక్కు పిలిపించి వారిరాజ్యం వారికి యిచ్చెయ్యడం మంచిది
లేకుంటే, అరణ్యవాసం అజ్ఞాతవాసం తరువాత వారు విజృంభించి కౌరవులను యుద్ధంలో
హతమార్చే ప్రమాదముందని హెచ్చరించాడు. ధృతరాష్ట్రుడు కోపగించుకొని, నీవు హస్తినవదలి వెళ్ళిపో
అన్నాడు. విదురుడువెళ్ళి అరణ్యంలోవున్న ధర్మరాజువద్దకు చేరుకున్నాడు. తనరాకకు
కారణం చెబుతూ, విదురుడు యీ మాటలన్నాడు. ధర్మరాజా! హితవాక్యాలు యెవరైనా చెబితే
సజ్జనులు వాటినివిని అర్థంచేసుకొని ఆచరించి మేలుపొందుతారు. అదే అల్పబుద్ధి గలవారు
మంచిమాట వినరు. పైగా వారికి ఆగ్రహంవస్తుంది. మంచిమాట వారికి విషంగా గోచరిస్తుంది.
అందుకే నేను నెట్టివేయ బడ్డాను, అన్నాడు విదురుడు. ఇది నన్నయ మనకిచ్చిన హితవాక్యం.
ఆ:వె: క్షమయ తాల్చియుండజన దెల్లప్రొద్దు దే
జంబు తాల్చియుండ జనదు పతికి
సంతత క్షముండు, సంతత తేజుండు
నగుట దోష మందు రనఘమతులు. (అర-1-217)
సీ:
క్రోధంబు పాపంబు; క్రోధంబునజేసి
యగుజువ్వె ధర్మకామార్థ హాని
గడుక్రోధి కర్జంబుగానండు; క్రుద్ధుండు
గురునైన నిందించు; గ్రుద్ధుడైన
వా డవధ్యులలైన వధియించు; మఱియత్మ
ఘాతంబు సేయంగ గడగు గ్రుద్ధు
డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి
క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ?
ఆ:వె: యెఱుకగల మహాత్ము దెఱుక యన్జలముల
నార్చు గ్రోధమను మహానలంబు
గ్రోధవర్జితుండు గుఱుకొని తేజంబు
దాల్చు దేశకాల తత్త్వమెఱిగి. (అర-1-222)
పాండవులరణ్యవాసం
చేసే సమయంలో ద్రౌపది ఒకరోజు ధర్మరాజుతో యిలా అన్నది. ఎల్లవేళల వ్యక్తి శాంతివహించి
వుండడము, లేదా యెల్లప్పుడూ చిరబురులాడుతూ వుండడము సబబుగాదని పుణ్యాత్ములు
చెబుతారని, ధర్మరాజు
శాంతస్వభావాన్ని ఉద్దేశిస్తూ అన్నది.
దానికి జవాబుగా ధర్మరాజు కోపమెంత దుర్గుణమో యిలా చెప్పారు. అసలు కోపంతో
వుండడమే ఒకపాపం. ధర్మార్థకామాలు కోపిష్ఠిలో లోపిస్తాయి. కోపంగలవాడు కర్తవ్యం
విస్మరిస్తాడు. గురువును సైతం ధిక్కరిస్తాడు. అమాయకులకు ప్రాణహాని కలిగిస్తాడు.
లేదా ఆత్మహత్యకు పాల్పడతాడు. మనట్టి సజ్జనులు, ధర్మాత్ములు కోపగించుకోవడం తగదు.
జ్ఞాని తనజ్ఞానమనే నీటితో కోపమనే అగ్నిని చల్లారుస్తాడు. దేశకాలానుగుణంగా శాంతుడు
తేజస్సుతో మెలగుతాడు. నన్నయ సమంజసంగా శాంతుని గొప్పదనాన్ని వివరించాడీ పద్యంలో.
సీ: ధర్మకామంబులు దఱుగంగ నర్థార్థి
యగువాడు పతితుడౌ నర్థసేవ
నర్థార్థముగజేయు నతడుగ్రవనములో
గోరక్షసేయు నక్కుమతి బోలు
నర్థధర్మములకు హానిగా గామార్థి
యగునాతడల్ప జలాశయమున
జలచరంబెట్టు లజ్జలములతో జడు
నట్లు కామంబుతో హానిబొందు
అవె : నర్థధర్మములు మహబ్ధి మేఘములట్టు
లుభయమును బరస్పరోదయమ్ము
లిట్లుగా ద్రివర్గమెఱిగి సామ్యమున సే
వించువాడు సర్వ విత్తముండు. (ఆర-1-245)
అరణ్యవాసం
చేస్తున్న సమయంలో భీముడు ధర్మరాజుతో చెప్పిన మాటలివి, ధర్మార్థకామములనే త్రివర్గాలను
సమన్వయంతో పాటించాలి, సమన్వయంతప్పితే యెలా వుంటుందో వివరించిందీ పద్యం. ఈసమన్వయలోపం
కౌరవులది. ధర్మకామాలను నిర్లక్ష్యంచేసి కేవలం అర్థం (ధనం) యెలాగైనా సంపాదించా లనుకునేవాడు, ఘోరమైన అడవిలో ఆవును
క్రూరజంతువుల బారినుండి రక్షించటం అసాధ్యమని గ్రహించక మొండిగా ఆపనికి పూనుకొన్నవానివలె, బుద్ధిహీనుడౌతాడు. ఇక
అర్థధర్మాలను నిర్లక్ష్యంచేసి కామం అనగా కోరికలు యెలాగైనా తీర్చుకోవడమంటే, కొద్దిగానీరుండె చెఱువులో చేపఅగచాట్లవలె, వ్యధకు లోనవ్వటమే. ఇక అర్థధర్మాల
అనుబంధం సముద్రం మేఘాల స్నేహంవలె వుంటుంది, కడలినీరు ఆవిరై మేఘాలు
జలధరాలౌతాయి. అవి వర్షించి నదులు వరదలైపారి సముద్రంచేరి తిరిగి సముద్రాలు నీటితో
సంపూర్ణంగా వుంటాయి. మొత్తంమీద ధర్మంగా సంపాదించాలి. ఆసంపాదన తో ధర్మబద్ధంగా
కోరికలు తిర్చుకోవాలి. అలా త్రివర్గాలను సమన్వయంతో పాటించా లన్న విషయం ఉదాహరణలతో
వివరించారీ పద్యంలో నన్నయ.
క: వగవగ
సాంగోపాంగము
లగు నాలుగువేదములయు నధ్యయనము పొ
ల్పుగనొక సత్యముతో నెన
యగునే యెవ్వియును బోలవటే సత్యంబున్. (అర-2-83)
నలుడు
జూదంలో సర్వము గోల్పోయాడు. అడవులపాలయ్యాడు. భార్యదమయంతిని, కష్టపెట్టకుండా తల్లిగారింటికి
పంపాలనుకున్నాడు. ఆమె మహాపతివ్రత భర్తనువిడచి వెళ్ళుటకు ఇష్టపడలేదు. ఇక నలుడే
ఆమెను నిద్రలోవుండగా వదలి వెళ్ళిపోయాడు. ఆమె తల్లిగారింటికి వెళుతుందని ఆయన ఆలోచన.
కానీ నలుడు చేసినపనికి దయంతి తల్లడిల్లిపోయింది. నిష్ఠూరంతో నలమహారాజును
నిందించింది. ఇది నిష్ఠూరం. అంతే గాని ప్రేమలేకగాదు. నన్నయకు అవవకాశము దొరికింది. సత్యంయొక్క గొప్పదనాన్ని
మరోసారి వివరించాడు. విచారించిచూస్తే నాలుగువేదములు, వాటి పదునాల్గు అంగ ఉపాంగములు
అన్నీ అభ్యసించవచ్చు. కానీ అవి సత్యముతో సరిగావు. పెళ్ళినాడు చేసినబాసలన్ని మరచి
నలుడెలా నన్ను వదలివెళ్ళాడని వ్యధజెందింది దమయంతి.
క: ధర్మజ్ఞులైన పుఋషులు
ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్
ధర్మముగా మది దలపరు;
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్. (అర-3-230)
శిబిచక్రవర్తిని
పరీక్షించనెంచి అగ్ని, ఇంద్రుడు గ్రద్ధ పవురాయి రూపాలు ధరిస్తారు. పవురాయివెళ్ళి శిబిచక్రవర్తి
ఒడిలో వ్రాలి రక్షించమంది. గ్రద్ధ వదిలెయండి రాజా! అది నా ఆహారమంది. అది
నారక్షణలోవుంది. రక్షించడం ధర్మం అన్నాడు రాజు. అప్పుడు గ్రద్ధచెప్పిన మటలివి.
రాజా! ధర్మమనేది అందరికీ మేలుచేయాలి. నాఆహారాన్ని నాకందకుండాచేసి నన్ను ఆకలితో
చంపేస్తావా? ఒకధర్మాన్ని అడ్డుకొనే ధర్మమేదైనా వుంటే, అది ధర్మంకానేరదని ధర్మాత్ముల
మాట. కనుక పావురాన్ని వదలమంది గ్రద్ధ. రాజు పావురానికి సమం తనమాంసమిస్తానని, అలాచేసి దేవతల పరీక్షలో నెగ్గాడు
సిబిచక్రవర్తి. అది అవతలి కథ. నన్నయచెప్పిన ధర్మసూక్ష్మ మిది.
శా:
ఆలస్యం బొకయింతలేదు; శుచి యాహారంబు; నిత్యక్రియా
జాలంబేమఱ ; మర్చనీయు లతిథుల్; సత్యంబ పల్కంబడున్;
మేలౌ శాంతియు
బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తు మట్లౌట నె
క్కాలంబటు మృత్యురోగ భయశంకం బొందమేమిమ్ములన్.
(అర-4-190)
హైహయవంశపు
రాకుమారుడు ధుంధుమారుడు, పొరబాటున బ్రాహ్మణబాలకుని చంపేశాడు. ఆవిషయంవిని అతని పెద్దలు
చింతించి తార్‍క్షుడనే మునిఆశ్రమానికి వెళ్ళి తమవ్యధను వెల్లడించారు. ఆయన వారు, చచ్చెనని చెప్పిన బాలుడు
ఆడుకుంటుండగా చుపించాడు. అందుకుకారణంగా మునిచెప్పిన వాక్యాలే యీ పద్యం.
మాఆశ్రమవాసులకు అలసత్వంలేదు. శుచియైన సాత్వికాహారమే భుజిస్తారు. నిత్యకృత్యములు
యేమరపాటులేకుండా చేస్తారు. వచ్చిన అథిదులను ప్రేమతో గౌరవిస్తారు. సత్యమే
వచిస్తారు. శాంతంగావుంటారు. బ్రహ్మచర్యాన్ని జాగ్రత్తగా పాటిస్తారు, కనుకనే మాకు మృత్యువు, రోగము, భయము, కీడుకలుగుననే ఆలోచన మాకు కలుగవు.
అని మునిచెప్పాడు. అసలీకథ అరణ్యవాసంచేయుచున్న ధర్మరాజుకు మార్కండేయమహర్షి విప్రుని
గొప్పదనాన్ని వివరిస్తూ చెప్పినది. చక్కని ఆచరణవల్ల కలిగే లాభాలను వివరిస్తున్నదీ
ఎఱ్ఱన పద్యం.
తే:గీ: కోధమోహనామకులైన ఘోరశత్రు
లిరువు రెరియించు చుండుదు
రెపుడు నంత
రంగ వయ్యుభయంబును నడగకున్న
గలదె యూరక బ్రాహ్మణ్య
గౌరవంబు. (అర-5-23 )
కౌశికుడు
బిక్షకు వెళ్ళాడు. ఆఇంటియిల్లాలు భర్తసేవలోవుండి బిక్ష ఆలస్యంగా తెచ్చింది.
కౌశికుడా ఆలస్యానికి కోపగించుకున్నాడు. ఆయిల్లాలు నీకోపానికి చచ్చే కొక్కెర లిక్కడలేవు.
అంటూ కౌశికుడు అంతకుముందు తనపై రెట్టవేసిన కొక్కెరను తన కంటిచూపుతో కాల్చివేసిన
విషయం చెప్పి, ఈ పద్యం చెప్పింది. కోపము మోహము అనే శత్రువులు హృదయంలో తిష్టవేసుకొని
మనపతనానికి కారణమౌతున్నాయి. వాటిని అదుపుచేసుకోకుండా బ్రాహ్మాణుడు గౌరవం పొందలేడు.
బ్రాహ్మణుడే అననేల యెవరూ గౌరవం పొందలేరు. నీవు వెళ్ళి జనకుని రాజ్యంలో మాంసం ఆమ్ముకొని
జీవించే ధర్మవ్యాధుని ఆశ్రయించి ధర్మాధరాలను తెలుసుకో పొమ్మంది ఆయిల్లాలు.
పుట్టుకతోనే బ్రాహ్మణుడంటే సరిపోదు. క్రోధమోహదులను జయించినవాడే బ్రాహ్మణుడుగా
మర్యాదలు పొందుతాడని యీపద్యంలో హితముపదేశించాడు ఎఱ్ఱనకవీంద్రుడు.
క: మదిమఱపున బాపము దన
కొదవుటయును బిదప వగచి యొక సగమును, నే
నిది సేయనింకననియెడు
మది బెరసగమైన నరుడు మలుగు నఘంబున్. (అర-5-41)
కౌసికునకు ధర్మవ్యాధుడు చెప్పిన ధర్మాలలో యిదీ
ఒకటి. పొరపాటున చేసిన పాపము పశ్చాతాపముతో సగం తరగిపోతుంది. ఇక నేనెప్పుడు చేయనని
నిశ్చయించుకుంటే, మిగిలిన ఆసగం పాపముకూడా పోతుందిదని, ధర్మవ్యాధుని ద్వారా మనకు
తెలిపిన పాప నివారణప్రక్రియ.
మ: అనయంబున్ శ్రుతవంతుండైవినుత
శిష్టాచార మార్గంబులం
జను పుణ్యాత్ముండు దుర్గముల్
గడచి ప్రజ్ఞాహర్మ్య సంరూఢుడై
కనుచుండుం బటు మోహపంకజలమగ్నంబైన లోకంబు వీ
క నధోభాగము నందు డింది కడుదుఃఖం బొందగా నవ్వుచున్. (అర-5-50)
వేదవిజ్ఞాన్నార్జించి
అన్నివేళల సదాచారుడై మెలగుచుండు పుణ్యాత్ముడు తీవ్రమైన కష్టాలను గట్టెక్కి ప్రజ్ఞ
అనబడు మేడపైకెక్కి మోహమనే బురదనీటిలో కొట్టుమిట్టాడుతున్న లోకాన్ని చూచి
నవ్వుకుంటాడు. అంటూ వేదవిద్యను సదాచారాన్ని ప్రశంశిస్తూ కౌసికునకు ధర్మవ్యాధుడు
ధర్మోపదేశం చేశాడు. ఇక్కడ ఉపదేశం జ్ఞానియైన మాంస విక్రేత చేయగా బ్రాహ్మణుడు
తెలుసుకొంటున్నాడు. జ్ఞానం యేఒక్కరిసొత్తూ కాదని, ఎక్కడనుండైనా యేవైపునుండైనా
జ్ఞానం లభించవచ్చు. బుద్ధిమంతులు శ్రద్ధ వినయాల తో గ్రహిస్తారన్న సత్యాన్ని ఎఱ్ఱన
యీ పద్యంద్వారా తెలియపరచారు.
తే:గీ: హింసచేయని వాడు లేడిజ్జగమున
నొక్కడైనను; దమతమ యోపినట్లు
హింసతెరవున కెడగల్గి యేగవలయు;
నదియ చూవె యహింసనా నతిశయిల్లు. (అర-5-60)
ఈపద్యం
కూడా ధర్మవ్యాధుడు కౌశికునకు చెప్పినదే. లోకంలో హింసచేయనివాడు లేనేలేడు. అయితే
అహింస అంటే యేమిటి? అంటే, తనకెంతవరకు వీలౌతుందో అంతగా హింసజోలికి పోకుండుటే అహింస. అని
ఎఱ్ఱన ధర్మవ్యాధుని ద్వారా అహింసకు చక్కని వివరణ నిచ్చారు.
తే:గీ:
కార్యఫలములయెడ దాన కర్తననుట
కడు నెఱుంగమి జువ్వె తాగర్త యేని
తగిలి దనదైన కార్యజాతంబు నెల్ల
జెడక ఫలియించు నట్లుగా జేయరాదె. (అర-5-66)
ఈపద్యంకూడా
పై సందర్భంలోనిదే, ఇక్కడ భగవద్గీతలోని నిష్కామకర్మయోగం వివరణమున్నది. ప్రతికార్యానికి
ఒకఫలితముంటుంది. ఆఫలితం నావల్లనే సకూరిం దనుకోవడం తప్పు. చేసేవరకే నీవు కర్తవు.
ఫలితం దైవాధీనం. అలాకాక ఫలితంకూడా నీచేతిలో వుంటే, నీవుచేసిన పనులన్నీ, నీవనుకున్న ఫలితాలనే యివ్వాలిగదా? ఎందుకు కొన్ని చెడిపోతున్నాయి? కనుక ఫలితం నీచేతిలోలేదని
గ్రహించాలి. దైవేచ్ఛ నీఇచ్ఛ ఒకటైనప్పుడు మత్రమే సత్ఫలితాలు వస్తున్నాయి. నిజనికి
జరిగేది దైవేచ్ఛమాత్రమే. నీవూ అదే కోరుకున్నావు గనుక నాయిష్టప్రకారం జరిగిందని
భ్రమపడు తున్నావు, అంతే. ఇది ధర్మవ్యాధుడు కౌశికునకు బోధించిన విధంగా ఎఱ్ఱన రచించిన
ఆధ్యాత్మిక విషయంగల పద్యం.
ఉ: ధీరుడు నిర్జితేంద్రియుడు
దెల్లముగా దనుగాంచు భూత వి
స్తార నిరూఢమైన పరతత్త్వముగా; దనయందు భూత వి
స్తారము
నెల్ల గాంచు సతతస్ఫుట దర్శనుడై సమగ్ర చి
త్పారము బొంది నిర్మల తపంబులయందు జెలింప
డెప్పుడున్. (అర-5-89)
ఇంద్రియములను
జయించిన ధీమంతుడు అన్నింటావ్యాపించియున్న పరమాత్మగా తన్నుతాను భావిస్తాడు.
తపస్సులో స్థిరంగావుంటూ సర్వభూతములను తనయందే దర్శించగలుగుతాడు. ఇది అధ్యాత్మిక
విషయం. అనుభవమున సాధించినవారికే యిది పూర్తిగా తెలుస్తుంది. మిగిలినవారికి
పద్యములోని పదాలకు అర్థం మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ బోధించేవాడు ఆధ్యాత్మిక
సాధనలో విజయంపొందిన ధర్మవ్యాధుడు. వినే కౌసికుడు గ్రహించగల ప్రజ్ఞావంతుడు.
ఎఱ్ఱనచెప్పిన ఆద్యాత్మిక సారపు పద్యమిది.
ఆ:వె: పాపవర్తనుండు
బ్రాహ్మణుండయ్యును;
నిజము శూద్రుకంటె నీచతముడు
సత్య,
శౌచధర్మశాలి శూద్రుడయ్యు,
నతడు సద్ద్విజుండ యనిరి మునులు. (అర-5-137)
ధర్మవ్యాధుని
సూక్తులువిని కౌశికుండు తెలిపిన మాటయిది. పాపకృత్యాలు చేసేవాడు, బ్రాహ్మణుడైనా సరే, అతడు పరమనీచుడే. సత్యము శౌచము
ధర్మము నాచరించిన శూద్రుడైన అతడు సద్విజుడే ఔతాడు. ఇది బ్రాహ్మణుడనడానికి ఎఱ్ఱన
తెలిపిన లక్షణాలు.
క: శరణంబని వచ్చిన భీ
కరశత్రుని
నయిన బ్రీతిగావగ వలయుం;
గరుణా పరుల తెరంగిది
యిరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్. (అర-5-413)
ఘోషయాత్ర
నెపంతో అరణ్యవాసం చేయుచున్న పాండవులను అవహేలనచేయడానికి దుర్యోధనుడు తన పరివారంతో
వచ్చాడు. అక్కడొక గంధర్వునిచేతిలో ఓడిపోయి బంధింపబడ్డాడు. ధర్మరాజువద్దకు
దుర్యోధనుని చారులువెళ్ళి రక్షించమని వేడు కున్నారు. ధర్మరాజు వెళ్ళి కాపాడుని తమ్ములకు
చెప్పాడు. వారు శత్రువును రక్షించ కూడదని వాదించారు. అప్పుడు ధర్మరాజు తమ్ములకు
చెప్పిన నీతివాక్యములివి. కరుణగల సజ్జనులు శరణుజొచ్చిన శత్రును సహితం సంతోషంగా
రక్షిస్తారు. ఇది వారి నైజం. ఇతరయే ధర్మాలూ దీనికి సాటిరావు. అని తమ్ములకు
ధర్మోపదేశంచేసి దుర్యోధనుని తమ్ములసాయంతో రక్షించాడు ధర్మరాజు. విభీషణుని విషయంలో
శ్రీరాముడు కూడా యిలానే ప్రవర్తించాడు గదా! ఎఱ్ఱన చెప్పిన శరణాగతరక్షణ పద్యమిది.
ఉ: కాలవిపర్యంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు నె
క్కాలము నేరికిన్ ధ్రువముగాదు సుఖంబును
దుఃఖమున్ మహీ
పాల! బుధుండు దద్విధభంగు లెరింగి ప్రమోద ఖేద సం
శీలుడు గాడు రెంటను బ్రసిద్ధపథంబున
నప్రమత్తుడై. (అర-6-106)
క: క్షమయు నహింసయు సత్యము
సమతయు నింద్రియ జయంబు శమము బరిత్యా
గమును దపోలక్షణములు
గ్రమమున నిన్నియు నూర్ధ్వగతి కారణముల్.
(అర-6-108)
తే:గీ: ఇందుజేసిన పుణ్యంబ యందు గుడుచు
మీది జన్మంబునకు నది మేలుజేయు
గాన
తనశక్తితో గూడ దానధర్మ
చిరపరోపకారంబులు సేయవలయు.(అర-6-109)
సీ: దానమూర్జితఫలదం బర్థసాధ్యమై
పరగుట కరము దుష్కరము నదియు
నరులకు నధిప! ప్రాణంబుకంటెను
రూపింప నర్థంబు తీపు వినవె
యుగ్రంబులైన యాయుధముల మొనలపై
నుఱుకుట యంభోధి తఱిసి చనుట
కృషి పాశుపాల్య సంక్లేశంబు నొందుట
యడవుల గొండల నిడుమ పడుట
ఆ:వె: నవసి పొవసి యనుదినము బరప్రేష్యులై
యునికి దలప నర్థమునకు చూవె
యట్టి
దుఃఖలబ్దమైన యయ్యర్థంబు
విడచు టెవ్విధమున గడిది గాదె. (అర-6-111)
శా: అన్యాయర్జితమైన విత్తమున జేయంబూను దానంబు
మూ
ర్ఖన్యాయంబది; దానజేసి ఫలపాకంబేమియున్ లేదు యు
క్తన్యాయార్జిత
మించుకంత యయినం గాలంబు దేశంబు స
మ్మాన్యంబై తగ బాత్రయోగమున సౌమ్యంబై ఫలించు
దుదిన్. (అర-6-112)
పదునొకండు
సంవత్సరముల వనవాసం గడిపేశారు పాండవులు. కామ్యకవనంలో మిగిలిన సంవత్సర కాలం
గడుపుతున్నారు, ఆసమయంలో వ్యాసులవారు పాండవుల వద్దకు వచ్చారు. పాండవుల కష్టాలను
గమనించి వారిని ఓదార్చాడు. ధర్మరాజు సంశయాలను దీర్చాదు. ఆసందర్భములోనివీ పద్యాలు.
ధర్మరాజా! జీవితకాలంలో సుఖదుఃఖాలు సహజం. అవి వస్తూపోతు వుంటాయి. బుద్ధిమంతులు
వాటిని సమంగా స్వీకరించి వ్యధజెందక కాలంగడిపేస్తారు. వారు జీవితంలో క్షమ, అహింస, సత్యము, సమత్వము, ఇంద్రియములపై విజయము, ఓర్పు, త్యాగము పాటిస్తారు. అవన్నీ
తపస్సు లక్షణాలు. వీటిని అనుసరించడం ద్వార వారు దేహత్యాగానంతరం ఉత్తమలోకాలకు
వెళ్తారు. ఈజన్మలో చేసిన పుణ్యాఫలాలను పైలోకాలలో అనుభవిస్తారు. మరుజన్మ లోకూడా
పుణ్యఫలాలను పొందుతారు. కనుక దానధర్మాలను, పరోపకారం చేస్తూ వుండాలి. ఇక దాన,
తపస్సులలో యేది ఉత్తమమని అడిగావు. దానం గొప్పది. మనిషికి ప్రాణంకంటే ధనమే
ప్రియమైనది. ధనసంపాదనకు యెన్నిపాట్లైనా పడతాడు. కత్తి మొనలపై పరుగిడతాడు. సముద్రాలనీది
దాటుతాడు. సేద్యం, పశుపాలనం కష్టాలకోర్చి చేస్తాడు. అడవుల్లో కొండల్లో శ్రమకోర్చి
సంచరిస్తాడు. ఇతరులకు దాస్యంచేసి చమటోడుస్తాడు. ఇంత శ్రమపడి సంపాదించినధనం ఊరకే
యిచ్చేయడం యెంత కష్టమో గదా! కనుక దానం గొప్పది. ఆదానంకూడా, అన్యాయంగా సంపాదించిన దానితో
చేయరాదు. అలచేయడం మూర్ఖత్వం. సరైన న్యాయమార్గంలో సంపాదించింది కొంచమైనను మంచిదే.
దేశకాలానుగుణంగా అవసరాన్ని గుర్తించి చేసేదానం కడకు సత్ఫలితాలనిస్తుంది. అని
వ్యాసుడు ధర్మరాజుకు చెప్పినాడన్న నెపంతో మనకిన్ని సూక్తుల నందించారు
ఎఱ్ఱనకవీంద్రులు.
చ: ఎడపక వాఙ్మనఃక్రియల నేరికి హింస యొనర్పబూనరె
య్యెడను దీనులం గరుణ యేర్పడ బ్రోవజూతు రిచ్చుచో
గడమవడంగ నీకెదిరి కాంక్షితముల్ దుదిముట్ట
దీర్తు రె
క్కుడు మదిగూర్తు రాశ్రితులకున్ విను మిన్నియు
నార్యధర్మముల్. (అర-7-228)
సావిత్రి
భర్తప్రాణములు గొంపోవు యమధర్మరాజును వెంబడించింది. యముడు వారించినా ఆమె విడువక
వెంటవెళ్ళుచునేయున్నది. ఆసమయంలో ఆమె యమునితో అనిన మాటలివి. ఆర్యులు (ధర్మాత్ములు)
త్రికరణశుద్ధిగా అనగా మనస్సులో యేది అనుకుంటారో అదే మాట్లాడుతారు, అదే చేస్తారు. ఎవరికి హాని
తలపెట్టరు. దీనులను కరుణతో ఆదుకుంటారు. దానమిస్తే గ్రహించేవాడు తృప్తిజెందేంత
యిచ్చేస్తారు. ఆశ్రితుల నెప్పుడు నిరాశపరచరు. వారినాదుకుంటారు. అంటున్నప్పుడు
సావిత్రి యమునినుండి అవన్నీ ఆశిస్తున్నదన్నమాట. ఒకరకంగా యివి పొగడ్తలే అయినప్పటికి
వాస్తవాలు. నన్నయ చెప్పిన ఆర్యధర్మాలివి.
తే:గీ:
ఏడుమాటలాడినయంత నెట్టివారు
నార్యజనులకు జుట్టంబు లగుదురనిన
జిరసమాలాప సంసిద్ధిజేసి నీకు
నేను జుట్టమనని వేఱయేల చెప్ప. (అర-7-246)
ఇదికూడా
పైసందర్భములోని పద్యమే. సావిత్రి తనమాటలతో, యమధర్మరాజును తన వైపునకు
త్రిప్పుకొని పతిని బ్రతికించుకొనుయత్నమిది. అయినా గొప్పసత్యం వచించిందామె.
ఏడుమాటలు మాట్లాడుకుంటే చాలు. ఆర్యులనదగు ధర్మాత్ములు ఒకరికొకరు బంధువులైపోతారు.
యమధర్మరాజా! ఇప్పటికే మనం చాలామాట్లడు కున్నాం. కనుక మనం బంధువులం. తండ్రిబిడ్డ
బంధుత్వం మనకు సరిపొతుంది. అనిచెప్పి, కడకు భర్తను బ్రతికించుకుంది. ఇక్కడ ఎఱ్ఱన మాటలన్నపదం
వాడారు. కానీ సంస్కృతంలో "సఖ్యం సాప్తపదీయం" అన్నసూక్తి గలదు. అందులోని
పదం అన్నమాటకు అడుగు అన్న అర్థంలో వివాహాలలో నూతన వధూవరులను అగ్నికుండంచుట్టూ యేడు
చుట్లు త్రిప్పుతున్నారు.
ఆ:వె: ప్రియము
నప్రియంబు బెల్లగు సౌఖ్యదుః
ఖములు
భూత భావి కార్యములును
నెవ్వనికి సమంబు లివి సర్వధనియన
బరగుజువ్వె యట్టి భవ్యు డనఘ! (ఆర-7-455)
పాండవు
లరణ్యవాసం జేస్తున్న రోజులవి. ధర్మరాజుతమ్ములు దప్పికదీర్చుకోవటానికి సరస్సు
వద్దకువెళ్ళి నీళ్ళు తీసుకోబోగా, ఒకయక్షుడు నా ప్రశ్నలకు జవాబు చెప్పిగానీ మీరు నీరు తగలడానికి
వీలులేదన్నాడు. ధర్మరాజు తమ్ములు యక్షుణ్ణి ధిక్కరించి, ఒకరితర్వాత ఒకరుగా నలుగురూ
మరణించారు. వారిని వెతుక్కుంటూ వెళ్ళిన ధర్మరాజు, యక్షప్రశ్నలన్నిటికి వినయంగా
సమాధానంచెప్పాడు. అసందర్భంలో ఒకప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు చెప్పిన పద్యమిది.
సర్వధని (నిత్య సంపన్నుడు) యైనవాడు యెల్లవేళల సమతను పాటిస్తాడు. అతనికి ప్రియము
అప్రియమూ రెండూ ఒకటే. సుఖదుఃఖములలో పొంగిపోడు కృంగిపోడు. భూతభవిష్యత్తులలో యేమి
జరిగి యుండినా, యేమిజరుగబోతున్నా, అతనిలో యేమార్పు రాదు, రాబోదు. అని జవాబుచెప్పి, యక్షరూపంలోనున్న యమధర్మరాజును ప్రసన్నుని జేసుకొని తన తమ్ములను
బ్రతికించుకున్నాడు ధర్మరాజు. నిజమైన ధనికుడెవరో నిర్వచించాడు, ధర్మరాజు సమాధానం రూపంలో
ఎఱ్ఱనకవీంద్రుడు.
తిక్కన విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకుగల పదునైదు పర్వాలు
తెనుగించారు. నాటకీయ విధానంలో ఆయనరచన సాగింది. పాత్రలతో ఆయన చెప్పించింన సూక్తులు
యిక కొన్నైనా తెలుసుకుందాం
తిక్కన సూక్తులు
విడురనీతి
కౌరవ
రాయబారిగా వెళ్ళిన సంజయుడు తిరిగివచ్చి. పాండవుల క్షేమసమాచారాలు ధృతరాష్ట్ర
మహారాజుకు తెలిపి. ధృతరాష్ట్రునితీరును తప్పుబట్టి, ప్రయాణ బడలిక, మరియు
ప్రోద్దుపోయియుండుట వలన రేపటిరోజు
మిగిలినవిషయాలు తెలియజేస్తానని వెళ్ళాడు. ధృతరాష్ట్రుని, మనసు సంక్షోభితమై
నిద్రపట్టక విదురుని పిలిపించుకొని మనస్సు శాంతించడానికి కొన్ని మంచిమాటలు
చెప్పమన్నాడు. అప్పుడు విదురుడు రాజుకు నిద్రపట్టక మనస్సు వ్యధజెందుటకు కారణమేమి
రాజా! అంటూ
క: బలవంతుడు పై
నెత్తిన
బలహీనుడు, ధనము గోలుపడినయతడు, మ్రు
చ్చిలవేచువాడు గామా
కులచిత్తుడు, నిద్రలేక కుందుదు రధిపా!
(ఉ-2-21)
బలవంతుడైన
రాజు బలహీనుడైన రాజుపై దండెత్తినపుడు, బలహీనుడైనరాజుకు నిద్ర పట్టదు. ధనము
పోగొట్టుకున్న వానికి నిద్రపట్టదు. దొంగతనం చేయబూనే వాడికి, వ్యభిచరించ దలచిన
వానికి నిద్రపట్టదు. మీకే కారణముచేత నిద్రాభంగ మగుచున్న దనగా,
ధృతరాష్ట్రుడు విదురా! ధర్మరాజు మనసులోని మాటేమితో సంజయుడు చెప్పలేదు.
రేపుచెబుతానని వెళ్ళిపోయాడు. అందుకే యీవ్యధ అన్నాడు. సరే వినండి మహారాజా! అంటూ చెప్పిన సూనృతములే యీ విడురనీతి (ఉ-2 -31 నుండి 101 వరకు )
క. జనులకు నొడఁ
బా టగువిధ
మున నడచుచు, లోకనింద్యముల
నుడుగుచు,
మీఁ
దని యొకని
కలిమి కులుకక
క. కోపము, నుబ్బును, గర్వము నాపోవక యునికియును, దురభిమానము, ని ర్వ్యాపారత్వము నను నివి కాపురుషగుణంబు
లండ్రు కౌరవనాథా! - 32
క. ఏలిన వానిని, దైవము, నాలిని, బంధులను
సముచితారాధన సం శీలతఁ బ్రీతులఁ జేయని పాలసుఁడా ఫలము లాసపడు, మనుజేంద్రా! -33 క. నెమ్మి గలవారి నొల్లరు త మ్మొల్లనివారి వెనుకఁ దగులుదు; రధిక త్వ మ్మెఱిఁగి యెఱిఁగి తొడరుదు రి మ్మెఱుఁగని
యట్టివార లిభపురనాథా! -34
క. ధనమును, విద్యయు, వంశం బును దుర్మతులకు మదంబుఁ బొనరించును; స జ్ఞను లైనవారి కడఁకువ యును, వినయము
నివియతెచ్చు నుర్వీనాథా! -35 క. అరిది విలుకాని యుజ్జ్వల శర మొక్కని నొంచుఁ; దప్పి చనినం
జను;
నే ర్పరి యైనవాని నీతి స్ఫురణము పగరాజు, నతని భూమిం
జెఱుచున్. -36
తే. ఒకటిఁ గొని, రెంటి
నిశ్చలయుక్తిఁ జేర్చి, మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి, యేనిటిని గెల్చి, యాఱింటి
నెఱిఁగి,
యేడు
విడిచి వర్తించువాఁడు వివేకధనుఁడు. -37
క. విను, మధురాహారంబులు
గొనుటయుఁ, బెక్కండ్రు
నిద్ర గూరినయెడ మే ల్కని యునికియుఁ, గార్యాలో చనముఁ, దెరువు
నడచుటయును జన దొక్కనికిన్. -38
క. నడవడి యను మున్నీటిం గడవం బెట్టంగ నోడకరణిం దగి తా నొడఁగూడు ననిన, సత్యము గడచినగుణ మింక నొండు గలదే యరయన్? -39 క. క్షమియించు వారిఁ గని చా లమి వెట్టుదు; రైననుం దలంప, ననూన క్షమయ కడు మెఱయు తొడ; వు త్తమ రూపము గోరువారు దాల్తురు దానిన్.-- 40
క. పురుషుండు రెండు దెఱఁగుల ధర నుత్తముఁ
డనఁగఁ బరఁగుఁ;
దా
నెయ్యెడలం బరుసములు వలుక కునికిన్; దురితంబులు వొరయు పనులు దొఱఁగుట కతనన్. -41
తే. చెల్లియుండియు సైరణ సేయువతఁడుఁ, బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ దనకుఁ గల భంగి నిచ్చు నతండుఁ, బుణ్య | పురుషు లని చెప్పి రార్యులు కురువరేణ్య! -42
ఆ. పాడి దప్పకుండఁ బడయు సొమ్ములకు న పాత్రములకు నీగి, పాత్రములకుఁ బెట్ట కునికి యనఁగ నెట్టన రెండు వి ధములఁ గీడు దొడరు ధరణినాథ! -4 3
తే. వెలఁది, జూదంబు, పానంబు, వేఁట, పలుకు ప్రల్లదంబును, దండంబుఁ
బరుసఁదనము సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేఁత యనెడు సప్తవ్యసనములఁ జనదు తగుల. --44
తే. తగిన వేషంబు, దనుఁ దాన
పొగడుకొనమి నొచ్చియును గీడు వలుకమి, యిచ్చి వగవ కునికి, దన కెంత
నడవకయున్నఁ బథము దప్పకుండుట నడవడి కొప్పు సేయు. -45 క. చెలిమియు, సంభాషణమును బలిమి, వివాదంబుఁ, ద్రోపుఁ
బాడియుఁ దమయం తలవారితోన తగు; నథి కుల, హీనుల
తోడనైనఁ గొఱ గా దధిపా! -46
తే. కొంచె మైనను దగఁ బంచి కుడువ మేలు; పనులయెడ దుఃఖ మోర్చి యల్పంబు సుఖము ననుభవించుట హితము; శత్రునకు
నైన నిచ్చుటయ లెస్స యడిగినయెడ నృపాల! -47
క. తను లోకము గొనియాడఁగ విని యుబ్బఁడు సజ్జనుండు; వెండియుఁ
గడు మే నరించుఁ; గీ డొకించుక
యును దసదెసఁ దోఁపనీక యుడుపుచు వచ్చున్. - 48
|
వ: ఇట్టి చందంబులు ధర్మనందనునకుం గల’ వని పలికి, విదురుం డది ప్రసంగంబుగాఁ బాండవులఁ బ్రశంసించి, ‘నీవు వారలం బెనిచి మానుసులం జేసి రక్షించి, యిప్పు డుపేక్షించి, వారలు వెలినుండ నూరకుండం దగునే? తగుపాలిచ్చి, వారి రావించి, నీ కొడుకుల తోడివారింగా నడపుట యుచితంబు, మీరును వారును నొక్కటియై యున్న మీదిక్కు దేవతలకుం దేఱి చూడరా’ దనిన, నమ్మాటలు వెడవెడ యూఁకొని ధృతరాష్ట్రుండు విదురున కిట్లనియె. (49 )
తే:గి: ‘హితముఁ గర్తవ్యమును నాకు నెఱుఁగు దీవ;
ధర్మసుతు చందమును విదితంబు నీకు;
నట్లు
గావున నెఱిఁగింపు మఖిలకార్య
జాతమును
జిత్తతాపోపశమము గాఁగ.’(50)
క: అనుడు విదురుఁ డాతని కి
ట్లను; ‘నిమ్మెయి నన్ను నొత్తి యడిగినఁ జెప్పం
జను నున్న రూపు; సెప్పెద
విను
మవధానంబు తోడ విమలవిచారా! (51)
ఉ:
డక్కెను రాజ్యమంచు నకటా! యిటు దమ్ముని భాగ మీక నీ
వెక్కటి మ్రింగఁ జూచె; దది
యె ట్లఱుగున్?
విను, మీను లోలతన్
గ్రక్కున నామిషంబు చవి గాలము మ్రింగిన చాడ్పు సూవె యి;
ట్లుక్కివుఁడైన నీ కొడుకు నుల్లము నున్నటు లాడఁగూడునే?’ (52)
క: అన విని నిరుత్తరుం డయి
మనుజేంద్రుఁడు
గొంతసేపు మ్రాన్పడి తలఁపుల్
పెనఁగొన,
నిద్రాహానిం
దను
వలయఁగ విదురుతోడఁ దా నిట్లనియెన్. (53)
క: ‘ఇందాఁక నీదు పలుకుల
డెందము తాపంబు గొంత డిందుపడియె; నా
కుం దగ నయానయంబుల
చందంబులు
సెప్పుచుండు సౌజన్యనిధీ!’(54)
వ:
అనిన విని విదురుం డిట్లనియె (55)
క: ‘తనియఁ బండకుండ మును గోసికొనఁ జవి
చేటె కాదు;
విత్తు చేటుఁ గలుగుఁ;
బక్వమైనఁ గొనిన ఫల మించుఁ, జెడదు
బీ
జంబుఁ; గార్యసిద్ధిచంద మిట్లు. (56)
తే:గి: మాలకరి పుష్పములు గోయుమాడ్కిఁ, దేఁటి
పువ్వుఁ దేనియ గొనియెడు పోల్కి నెదురు
గందకుండఁగఁ గొనునది కార్యఫలము;
బొగ్గులకుఁ
బోలె మొదలంటఁ బొడువఁ జనదు.(57)
క: పరుల ధనమునకు, విద్యా
పరిణతికిం, దేజమునకు, బలమునకు మనం
బెరియఁగ నసహ్యపడు న
న్నరుఁడు
దెవులు లేని వేదనం బడు నధిపా! (58)
క: ఎదిరికి హితమును, బ్రియమును,
మది కింపును గాఁగఁ బలుకు మాటలు
పెక్కై
యొదవినను లెస్స; యటు
గా
కిది
యది యన కూరకునికి యెంతయు నొప్పున్. (59)
క: చెలిమియుఁ బగయును, దెలివియుఁ,
గలఁకయు, ధర్మంబుఁ, బాపగతియును, బెంపుం,
దులువతనంబును వచ్చును
బలుకుబడిన; కానఁ బొసఁగఁ బలుకఁగ వలయున్. (60)
క: బెడిదముగఁ గత్తి గొడ్డటఁ
బొడువఁ దెగినమ్రానఁ జిగురు వొడముఁ; బలుకులం
జెడఁ దునిసిన కార్యంబు ని
గుడనేరదు
పిదపనెట్టుఁ గురువంశనిధీ! (61)
క: తనువున విఱిగిన యలుఁగుల
ననువునఁ
బుచ్చంగవచ్చు;
నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను
మెన్ని యుపాయములను వెడలునె యధిపా! (62)
ఉ:
అక్కట! ధర్మనందనుని యాస్యమునం దొకనాఁడుఁ గీడుప
ల్కొక్కఁడు లేదు; నీ కొడుకు లొండొరు మీఱి
నికృష్టవాక్యముల్
పెక్కులు పెక్కుభంగులను బ్రేలుచు నుండఁగ నీవు
దానికిన్
స్రుక్కక వించు నుండె; దనురూపమె నీ కిది కౌరవేశ్వరా? (63)
అ:వె: చేటుకాలమైనఁ జెట్టమాటలు నెఱి
గాని తెరువు వట్టు కర్జములును
దగవు లట్లు తోఁచుఁ; దగియెడునవి
యవి
నీతు లని మనంబు నిశ్చయించు. (64)
వ: నీ బుద్ధి పాండవులతోడి విరోధంబునెడ
మరలంబడమి పాపం బింతియకాక యేమి సేయుదము? మన
కులంబునం దేజో ధైర్య ధార్మికత్వాది గుణంబుల గరిష్ఠుండయిన యుధిష్ఠిరుండు నీ సిరికి వెలియై
యట్లుండుట దగ వగునే?
నీ పెద్దతనంబు సూచి సైరణ వాటించి
యున్నవాఁ’డనిన, విదురు దిక్కు మొగంబై ధృతరాష్ట్రుండు ‘నీ చెప్పిన నీతివాక్యంబుల నా మనంబు
దనివోవ దింకను జెప్పు’
మనవుడు నతండు వెండియు నిట్లనియె. (65)
అ:వె: ‘సకల పుణ్యకర్మ చయమును నొకదెస,
వినుము
పాడి దప్పకునికి యొక్క
దిక్కు; దీని శ్రుతులు తెలిపెడునెడఁ, బాడి
కలిమి
యెందుఁ బెద్దగా నుతించె. (66)
తే:గి: పాడి గలిగిన నిహలోకఫలములెల్లఁ
జేరుటయ కాదు, కీర్తియుఁ జెందుఁ బురుషు;
ధరణిఁ బొగడిత యెందాఁకఁ బరఁగు, నంత
కాలమును
బుణ్యలోకంబు గల్గు నండ్రు. (67)
వ: తొల్లి ప్రహ్లాదుండు దైత్యజాతి
సంభవుం డయ్యును,
దనకొడుకు విరోచనుండును, నంగిరసుండను విప్రు కొడుకు సుధన్వుండును దమతమ ప్రాణంబు లొడ్డుగా
నొడ్డి యొక్క ధర్మ సందేహంబునకుఁ బన్నిదంబు సఱచి వచ్చి త న్నడిగిన, నితండు గొడు, కితండు లాఁతి యని తలంపక మధ్యస్థుండై
సుధన్వు గెలిపించి,
యతని చేత నిజతనయుని జీవితంబు
దానంబుగాఁ గొని వాని బ్రదికించెం గావున, నీవును
ధర్మంబు విడువక,
యధర్మోపేతులైన నీకొడుకులవలని
పక్షపాతంబు విడిచి తెఱంగు సేయుము; వారును
వీరును నాపదలేక బ్రదుకుదురు; నీవును
శోకంబులేక తక్కుదు’వని చెప్పి మఱియును-(68)
క: ‘పాపంబులు గర్జము లని
యేపునఁ జేయంగ నవియు
నింపగు;
ధర్మ
వ్యాపారంబు లకార్యము
లై పరిణతిఁ బొందెనేని నట్టుల చెల్లున్. (69)
చ : అది సభయే ప్రియం బెసఁగ నార్యులు
నిల్వరయేని?
నార్యులే
మదిఁ దలఁపంగ వారలు సమంచిత ధర్మము వల్కరేని? న
ట్టిదియును ధర్మువే తగ ఘటించిన నిక్కము లేద
యేనిఁ?
దాఁ
బదిలపునిక్కమే యొక నెపంబిడు చొప్పగునేని భూవరా!
(70)
ఉ:
నీతి పథంబునన్ బ్రదుక నేర్చుట యుత్తమ భంగి; శౌర్య సం
జాతములై కరం బలరు సంపద లొందుట మధ్యవృత్తి; య
స్ఫీతములైన భారవహజీవనముల్ దలఁపం గనిష్ఠముల్;
నీతికి బాహ్యులైన, ధరణీవర!
మెత్తురె వారి నుత్తముల్?
(71)
అ:వె: కయ్యమునక యెపుడుఁ గాలు
ద్రవ్వుదురు నీ
పుత్త్రు లెల్ల; సూతపుత్త్రుఁ డాది
యగు తదీయ మంత్రు లంతకు ముందర
బిరుదు; లీవు నీతి తెరువు సొరవు. (72)
క: పాండవులు శౌర్య మొల్ల; ర
ఖండిత నీతి ప్రకార కార్యము మెచ్చై
యుండుదు;
రెదు రేచినఁ దుది
మండుదు; రార్పంగ రాదు మఱి యెవ్వరికిన్. (73)
క: తమ తండ్రి భంగి నీకును
సముచిత మగు భక్తి సేసి సజ్జననుత
మా
ర్గమున నడచువారల నీ
వమలమతిం గన్నకొడుకు ల ట్లరయఁదగున్.’ (74)
వ:
అని పలికి మఱియు నిట్లనియె: (75)
క: ‘కారణము లేకయును నుప
కార పరత్వమున నొరుల కార్యంబులకున్
వారని యలజడిఁ బడియెడు
వారల చూ యేడుగడయు వారికి నధిపా! (76)
చ:
ఒకరుని చేతిప్రోపును దదున్నతి ప్రాపును
గాంచి,
యెల్లవెం
టకును గొఱంతలేక పొగడందగు సంపద నొంది, యట్టి దా
తకుఁ దుదిఁ గీడు సేసిన కృతఘ్నుని
పీనుఁగునైన రోఁత వు
ట్టక కబళింపఁ గుక్కలు నొడంబడునే
కురువంశవర్ధనా! (77)
వ:
కావునఁ గృతము దలంపమి గీడు; పాండురాజు
నీకుం బరమ భక్తుండు;
పాండవులునుం దేజో లాభంబులు గావించినవారలు; వారల నాదరింపు’ మని చెప్పి వెండియు నిట్లనియె: (78)
అ:వె: ‘బ్రదుకు, చేటు, పొగడువడుట, దూ ఱొందుట,
యీఁగి, వేఁడుకొనుట, యిట్లు మఱియుఁ
గలుగు సౌఖ్య దుఃఖములు వచ్చు నడవడి;
వాని
కింత యేల వగవ నధిప! (79)
క: వగ బలము దఱుఁగు, రూపఱు;
వగచిన మతి దప్పుఁ, దెవులు వచ్చును; దూరన్
వగచి నలంగినఁ బ్రియ
మగుఁ |
బగతురకును; వగచు టుడుగు; పార్థివముఖ్యా!’(80)
వ:
అనిన విని ధృతరాష్ట్రుండిట్లనియె (81)
క: ‘రిత్త
యుపచారముల నే
నుత్తముఁ డగు ధర్మతనయు నుడికించితి; దు
ర్వృత్తులగు మత్సుతులకును
మిత్తి యగుం బోర; వగలు మిగులక యున్నే? (82)
వ: నెవ్వగలు
నివ్వటిల్లనీక నిలుపునట్టిది యెయ్యది? దాని నెఱింగింపు’ మనిన విదురుం
డిట్లనియె.(83)
తే:గీ:
‘నియత తపమును, నింద్రియ నిగ్రహంబు,
భూరి
విద్యయు శాంతికిఁ గారణములు;
వాని యన్నిటికంటె మేలైన శాంతి
కారణము
లోభ ముడుగుట కౌరవేంద్ర!’
(84)
వ: అని వెండియు. (85)
క: ‘జ్ఞాతుల పోరితమును; గో
వ్రాతము నాక్రమము, విప్ర వర్గము చనవున్,
నాతులఁ గారించుటయును
బ్రీతిం జన నిచ్చునతని పెం పొప్పు నృపా! (86)
క: అలమికొని యొండొరుల ప్రో
పులఁ బ్రాపుల నెలమికలిమిఁ బొంది
బహు జ్ఞా
తులు నెమ్మిఁ గూడి తామర
కొలని
క్రియన్ సిరికిఁ బట్టగుదు రుజ్జ్వలులై. (87)
చ:
కరి తురగాది ఘట్టనయు గాలియు నొంపదె యొంటి నున్న య
త్తరువు? ననేక భూరుహవితానము గుంపయిపేర్చి బాధలం
బొరయునె? యన్నదమ్ములును బొందిన నేరి కసాధ్యు; లట్లు గా
కెరవయి నిల్చినం గెలని కెల్లిదమై పఱివోదు
రెంతయున్. (88)
వ: కావునఁ గౌరవులుం
బాండవులు నొండొరులకుఁ బ్రాపై పొదలిన నెదిరికి నజయ్యు లగుదురు; పరుల యొత్తులేని రాజ్యంబు పూజ్యమహిమం బరఁగు.
వనవాసంబునం గుందిన కౌంతేయులం దడయక తెచ్చి యుచితపదం బిచ్చి నిలుపుట నీ కొడుకులకు
నిలుపు గావించుట యగు’నని చెప్పి మఱియు నిట్లనుఁ ‘బ్రియవాదు లెందును గల
రప్రియం బగుంగాకేమియని పథ్యంబు(తథ్యంబు) వలుకువారు లేరు. జూదంబునప్పు డే నడ్డపడి, యప్రియం బగుటకు శంకింపక
తథ్యంబు వలికితి; నది నీకు రుచియింపక, రోగికిఁ బథ్యాహారంబు దలకంటగించునట్లయ్యె; నైన నిప్పుడుం జెప్పెద
వినుము: కాకంబులం గైకొని మయూరంబులం బరిహరించు విధంబున, మార్జాలంబులం బాటించి
సింహంబులయెడ ననాదరంబు సేయు చందంబున సుయోధనాదులం బట్టి యుధిష్ఠిర ప్రముఖుల విడిచితి; నేఁడు కార్యంబు
ముట్టవచ్చినం దోఁపక మిడుంగుఱు సోఁకినట్లు దల్లడించెదవు. కులంబునకై యొకనిఁ దొఱంగుటయ
నీతి యని పెద్దలు సెప్పుదురు; దుర్ణయపరుండై సద్బుద్ధి సెప్ప వినం డేని, మనము దుర్యోధనుం దొఱంగిన
నేమి యగు? నది యట్లుండె, సంపద సహాయంబు నపేక్షించియుండు; సహాయంబు సంపద నుద్దేశించి
వర్తిల్లు; నిట్లవి యొకటొకటి పొందునంగాని సిద్ధింపవు కావున నీ సంపద పాండవులకును, వారి సహాయత్వంబు నీకునుం
బ్రియం బొనరింప, నొండొరుల కలయుట మేలుగాక, మనలావువెలిసేయుట లెస్స యగునే? కురువంశనిస్తారకులగు
భీష్మ యుధిష్ఠిరులును, నవక్ర విక్రములగు కర్ణార్జునులును, బ్రతాపధాములగు భీమ
దుర్యోధనులును, శస్త్రాస్త్రపారగులగు నభిమన్యు లక్ష్మణ ప్రభృతి కుమారులును, శాపాను గ్రహసమర్థులగు
ద్రోణ ద్రుపదాది పరమాప్తులును, వారి వారి బంధు మిత్రజనంబులును, నొక్క మొగంబై నీ పనుపు
సేయుచు, నయ విక్రమంబు లప్రతిహతంబులై నడవం, బృథివి శాసింప భవదీయ
విభవం బుజ్జ్వలంబై యొరులకెడలేక చెల్లుచున్న నెంత యొప్పగునో యటు విచారింపుము.
పాండవులు ధీరమతులై వైర మెత్తక యూరక తొలంగియుండిరేనియుఁ, గతిపయ దినంబులలోఁ
జీకాకుపడి చెడుంగాక, గాంధారీనందనుచేత వసుంధరా పరిపాలన భారంబు నిర్వహింపబడునే?’ యనిన విని ధృతరాష్ట్రుండు
విదురున కి ట్లనియె: (89)
క: ‘నీవు
సెప్పిన మాటలు నిర్మలములు,
నిపుణ సమ్మతములు, రాజనీతి మార్గ
బోధకంబులు;
నైనను బుత్త్రువిడువ
నోప, ‘ధర్మో జయతి’యని యుండువాఁడ.’ (90)
వ: అనిన విని విదురుం డతని కిట్లనియె:
‘దేవా! జ్ఞాతులు గుణహీనులైనను విడువందగ
దనిన, సకల
గుణసంపన్నులై భవత్ప్రసాదంబు గోరుచున్న కౌంతేయులన్ దిగవిడువం దగునే? యేను నీకు హితంబు గోరెడువాఁడనని
నిశ్చయించి నా బుద్ధి వినుము; వారల
జీవనంబునకుఁ గొన్ని యలంతిపల్లియలైనను దుర్యోధను నొడంబఱచి యేర్పఱచి, తెఱంగు పఱచిన లెస్స యని చూచెద; నతని విడువ వలయునని చెప్పితినేనిఁ
బెనఁకువం బశ్చాత్తాపంబువుట్టు; దాని
కప్పుడు ప్రతీకారంబు లేదు. కావున నెల్లభంగుల నియ్యకొని పాండవులతోడ సంధి సేయవలయు; నట్లుం గాక. (91)
క: తమలోని పాళ్ళకుం గా
సమరము సేసినను గాని చాఁ జనదె? శరీ
రము లాధివ్యాధి జరా
సమన్వితము లగుటఁ జేటు సహజం బరయన్.(92)
చ:
గజ తురగాది సంపదలుఁ,
గాంతలతోడి విహారలీలలుం,
బ్రజ కనురాగ మొందఁ బరిపాలన సేయుక్రమంబుఁ, బోరులన్
విజయము లొంది పేర్చుటయు, విస్ఫురితాభరణానులేపవ
స్త్ర జనిత వైభవంబుఁ గల రాజులుఁ బోయిర కాక
నిల్చిరే? (93)
క: కావునఁ జెవికిం జేఁ దగు
నీ వాక్యము వినఁగఁ జాలితేని, నిహపర
శ్రీ విభవములకుఁ గీర్తికిఁ
దావలమై
వెలయు టింత తథ్యము సుమ్మీ! (94)
క: తగ నీలో నూహింపుము;
దిగ విడువకు ధర్మతనయు; దృఢమతివై పొం
దగు చందము గొడుకులకుం
బ్రెగడలకుం జెప్పి తీర్పు పెం పేర్పడఁగన్. (95)
ఆ:వె: అనిన నాంబికేయుఁ డను: ‘నీదు పలుకులఁ
గలఁక దేఱి బుద్ధి దెలివి నొందె;
నిట్ల చేయువాఁడ; నిదియ కర్జము, ధర్మ
మును, యశంబు, లాభమును దలంప.’(96)
చ:
అనుడు ముదంబు నమ్మమియు నాత్మఁ బెనంగొన నన్నతోడ ని
ట్లను విదురుండు: ‘పెద్దవడి
కక్కట! నీ మది కార్యవృత్తి నూ
ల్కొనియె;
సుయోధనుం గని యకుంఠిత నిశ్చయమై యతండు
వ్రా
లినదెస వ్రాలకుండిన బలే, మముబోఁటులకుం
బ్రియం బగున్. (97)
వ:
అని పలికి నిట్టూర్పు నిగిడించి.(98)
క: ‘దైవంబు నేర్చుఁగా; కిటు
వోవఁగ నే నేర్తు, నేరఁ బొమ్మని పలుకం
గా వశమె నరున? కెక్కుడు
దైవము పౌరుషముకంటె ధరణీనాథా!’ (99)
వ:
అనిన, విదురునకు వైచిత్రవీర్యుం
డిట్లనియె: (100)
తే:గీ:‘ధర్మ పథమును, నీతి తత్త్వంబు తెరువు
నిర్మలములగు పలుకుల నీవు నాకుఁ
దెలియఁ
జెప్పితి;
పరమార్థ దృష్టి యెట్టి
వాక్యములఁ గల్గుఁ? జెప్పుము వాని ననఘ! (101)
ప్రజలతో
మంచిగావుంటూ, లోకం మనలను నిందించు పనులు చేయక. అన్యుల సంపద జూచి ఈర్ష్యపడక అందరితో
కలసి మెలసి జీవించడం ఉత్తమం.
కోపము, రెచ్చిపోవడము, గర్వము, అసంతృప్తి, దురభిమానము, ఏపనిచేయకుండా వృధాగా కాలం గడపడము
అనేవి దుర్జన లక్షణములు.
దైవాన్ని, భార్యను, బంధువులను తగినవిధంగా ఆదరించి, యుక్తాయుక్తములు తెలిసి వివేకంతో
మెలగాలి.
తననిష్టపడేవారిని
నమ్మక, ఇష్టపడనివారికోసం తపనజెందుతూ, తనకంటే అదికుడైన వానితో విరోధం
కొనితెచ్చుకోవదం తగని పని.
ధనము, విద్య, గొప్పవంశములో పుట్టడం, ఇవి వాటికవి చెడ్డవికావు. ఇవి
దుర్మార్గునిలో దూర్తగుణాలను పెంచుతాయి. సజ్జనులలో సద్గుణాలను యివే వృద్ధిచేస్తాయి.
విలుకాడు
వదలిన బాణం ఒకరిని నొప్పించవచ్చు, లేదా గురితప్పి వృధాకావచ్చు. కానీ నేర్పరియైనవాడు తెలివితో
శత్రురాజును, అతని రాజ్యాన్ని కూడా హరిస్తాడు.
37వ,పద్యంలో ఏడుసంఖ్యలున్నాయి. అవి
దేనికి ప్రతీకలో మనమే నిర్ణయించులోవాలి. వీటిని పలువిధాలుగా అన్వయించి యున్నారు. ఒక
విధానం ప్రకారం, ఒకటి అంటే, రాజ్యం. మంత్రోత్సాహమను రెండిటిని నిశ్చలమైనయుక్తితో తగినవిధంగా
ఉపయోగించి, మిత్రామిత్ర తటస్తులను మువ్వురిని సామదానభేదదండోపాయములను
చతురోపాయములతో కట్టడిచేసుకొని సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీ భావనలనే ఆరింటింని తెలిసికొని వేట, జూదము, మధుపానము, అనవసరంగా ఒకరిని తిట్టడము, కొట్టడము, దొంగతనంచేయడము, స్త్రీవ్యామోహము అనే ఏడు
వ్యసనాలను వదలుకొన్నవాడే వివేకి.
ప్రియమైన
ఆహారం ఇతరులతో పంచుకోకుండ తానేతినటం. అందరూ నిద్రించే సమయంలో మేల్కొని దురాలోచన
చేయటం, ఎవరినీ సంప్రతించకుండా ఒక్కడుగా నిర్ణయాలు తీసుకోవడం. ఒంటరిగా
ప్రయాణంచేయడం మంచిదికాదు.
శీలం అనే కడలిని దాటడానికి సత్యమే సరియగు ఓడ. క్షమించడమనేది
గొప్పసుగుణం.
ఈసుగుణాన్ని చేతగానితనంగా పరిగణించటం తప్పు. శీలసౌందర్యానికి క్షమ ఒక
బంగారు ఆభరణం వంటిది.
ఉత్తముడుగా
పదిమందిమెప్పు పొందాలంటే, ఎవరిని దూషించకూడదు. దూర్తవర్తనం విడనాడాలి.
దండించగలిగిన
శక్తిగలిగి కూడా క్షమించి వదిలివేయువాడు, తను పేదవాడైనాసరే, ఉన్నంతలో కొంతైనా దానంచేయువాడే పుణ్యాత్ముడు.
న్యాయబద్దంగా
సంపాదించాలి, కష్టంలోవున్నవానికింత యివ్వాలి. అంతేగాక అపాత్రా దానం చేయనేకూడదు.
స్త్రీలతో
అక్రమసంబంధం, జూదం, మధుసేవనం, వేట, తిట్టడం కొట్టడం, దుబారాఖర్చు చేయడం అనేవి సప్తవ్యసనాలు. వీటికి దూరంగా వుండాలి.
తనస్థాయికి
తగిన దుస్తులు ధరించాలి. గొప్పలు చెప్పుకోవడం తప్పు. తనకు బాధ కలిగినా ఇతరులకు
కీడుతలపెట్టకపోవడం, దానంచేసి బాధపడకపోవడం, తను లేమితో అవస్థలు పడుతున్నా ధర్మమార్గం విడువకుండటం శీలవంతుల
లక్షణం.
స్నేహంచేయాలన్నా, మంచిచెడు మాట్లాడుకోవాలన్నా, వివాదపడి తలపడాలన్నా సమానులతోనే
జరగాలి. అంతేగాని అల్పులతోగాదు.
ఉన్నది
కొంచమైనా సరే! నలుగురితో కలిసి అనుభవించాలి. కష్టానికి తగినఫలితం కొంచమైనా ఆనందమే.
శత్రువైనా లేదని చేయి జాచితే యివ్వడమే ఉత్తమం.
సజ్జనుడు
పొగడ్తకు పొంగిపోడు. మేలుచేయడం మానుకోడు. కీడుచేయడమనేది అతని నైజమేకాదు.
ఇలా
చాలానీతులు చెప్పి, ధర్మరాజును నీకొడుకులతో సమానంగా ఆదరించు. నీకొడుకులను అదుపుచేసుకో, ఎరకు ఆశపడి గాలానికి చిక్కిన చేపవలె, ఆశకుపోయి
ఆపదకొనితెచ్చుకోకు అని, విదురుడు చెప్పగా, అర్థమైనట్లు తలవూపి ధృతరష్ట్రుడు యింకా వినాలనివుంది చెప్పమన్నాడు.
విదురుడు కొనసాగించాడు.
పిందెకాయయై
పండుగామారకుండానే తినాలనిజూస్తే, అది రుచిగావుండదు. అంతే గాదు అందులోని విత్తనం మళ్ళీ మొలవదు కూడా.
కార్యసాధకుడు పండినఫలాన్ని తినేవాని వలె వ్యవహరిస్తాడు.
దండలల్లేవాడు
పూలుమాత్రమే కోసుకుంటాడు. చెట్టును పెగలించడు. మధుపములు యేమాత్రం హానితలపెట్టకుండా
పువ్వులనుండి మకరందం గ్రహిస్తుంది. అట్లే యితరుల నుండి మనకుగావలసినవి బాధించకుండా
సేకరించుకోవాలి. అలాకాకుంటే కాసే పూసే చెట్లను బొగ్గులకొఱకు నరికినట్లౌతుంది.
ఇతరుల
సంపద, విద్య, తేజస్సు, బలం చూసి ఈర్ష్యపడువాడు, రోగమేమిలేకుండానే వ్యధకులోనౌతాడు.
ఇతరులు
సంతోషపడేట్లు, వారికి నచ్చేట్లు, వారికి మేలుగలిగేట్లు వ్యవహరించటం. మంచిది. అలా వుండలేకపోతే, వూరకుండటం శ్రేయస్కరం.
మాటతీరు
బాగుండాలి. స్నేహం, శత్రుత్వం, తెలివితేటలు, ధర్మాధర్మాలు, గొప్పదనం, నీచత్వం కేవలం మాటతీరునుబట్టే వుంటాయి.
చెట్టును
కత్తితోనో గొడ్డలితోనో నరికితే మళ్ళీ అది చిగిర్చే అవకాశంవుంది. కానీ దురుసుతనంతో
మాట్లాడి మనస్సును నొప్పిస్తే, ఇక సఖ్యత యేనాటికి కుదరదు.
శరీరానికి
తగిలిన బాణాలను తొలగించడానికి వీలౌతుంది. కానీ మనస్సును నొప్పించిన మాటలను వెనక్కి
తీసుకోలేము. అటువంటిది నీకొడుకులు మనస్సు నొచ్చుకొనే మాటలు మాట్లాడటం, అవి విని నీవు వూరకుండటం
సమంజసంగా లేదు.
కాలం
వికటిస్తే చెడుమార్గం బాగుందనిపిస్తుంది. మంచిమాటకూడా చెడుగా తోస్తుంది.
కనుక
నామాటవిని పాండవులను ఆదరంతో చూడు. ధర్మరాజు నీతిమంతుడు. అతని శాంతాన్ని
పరీక్షించకు. అని విదురుడు చెప్పగా, ధృతరాష్ట్రుడు, నీమాట వింటున్నాను చెప్పుమన్నాడు.
పుణ్యములన్నీ
ఒకయెత్తు, న్యాయవర్తనమొకయెత్తు. వేదములు న్యాయవర్తనాన్నే సమర్థించాయి.
న్యాయవర్తనం
యీలోకంలో మేలుచేయడమేగాక, కీర్తికూడా లభిస్తుంది. యీకీర్తి భూలోకం యెంతకాలం
జ్ఞాపకముంచుకుంటుందో అంతకాలం పుణ్యలోకాలలో కాలం గడుపుతారు.
అంగీరస పుత్రుడైన సుధన్వుడు, ప్రహ్లాదపుత్రుడైన విరోచనుడు, ప్రాణాలను ఫణంగాపెట్టి ఒకకన్యను
వివాహంజేసుకొనే విషయంలో పందెంకాసి ప్రహ్లాదుని న్యాయమడిగితే, ధర్మంవైపు నిలచి, ప్రహ్లాదుడు సుధర్మునిదే న్యాయమని చెప్పి, సుధర్ముని తనకు
పుత్రబిక్షపెట్టమని యాచించి కొడుకును కాపాడు కున్నాడు. కనుక మహారాజా! ధర్మంవైపు
నిలచి పాండుపుత్రులకు న్యాయంచెయ్యమన్నాడు దృతరాష్ట్రునితో విదుర మహాశయుడు.
విదురుడు యింకా యిలా చెప్పాడు.
గర్వించి
పాపాలు చేస్తూపోతే, అవి చాలా బాగున్నాయనిపిస్తుంది. ధర్మకార్యాలు పనికిరానివిగా తలంచడం
మొదలుపెడితే, అవి అలనే పనికిరానివనిపిస్తుంది. కనుక జాగ్రత్తగా వివేకంతో మెలగాలి.
సభలో
ఆర్యులుండితీరాలి, ఆర్యులంటే యెవరోకాదు ధర్మాత్ములే, వారుకూడా వాస్తవమే వచించాలి. అలా
వచించే సత్యం, యేదో ఒకసాకుచెప్పి స్వార్థప్రయోజనాలకు ఉపయోగ పడునట్లు
వక్రీకరింపబడటానికి వీలులేనిదిగా వుండాలి.
నీతిగా
సపాదించిన ధనంతో జీవించడం శ్రేష్థం. శౌర్య ప్రతాపాలతో గడించిన ధనంతో జీవించడం
మధ్యమం. బరువులుమోసి కాయకష్టంతో బ్రతకడం అధమం. కానీ నీతిమాలిన పనులుజేసి బ్రతకడం
ఒకబ్రతుకేగాదు, అది నీచమైన బ్రతుకు.
ఒకగొప్పవాని
ప్రాపునజేరి, అతని అండదండలతో వృద్ధిలోనికి వచ్చి, అతనికే హాని తలపెట్టే కృతఘ్నుని
శవాన్ని కుక్కలుసైతం తినడానికి శంకిస్తాయి.
రాజా!
నీతమ్ముడు పాండురాజు తనశౌర్యంతో నీకు సంపద కూర్చిపెట్టాడు. పాండవులు నీకీర్తిని
యినుమడింపజేశారు. వారిని నిరాదరించటం తగదు.
సంపద
వస్తుంది పోతుంది. అది సహజం. దానికై మనిషి చింతించవలసిన పనిలేదు. అధర్మానికి మాత్రం
యెట్టిపరిస్తితుల్లోను తావివ్వరాదు.
దుఃఖం
మనిషిని బలహీనపరుస్తుంది. అందువల్ల రూపం చెడిపోతుంది. మానసిక రుగ్మతలకు దుఃఖమే
మూలకారణం. అదే తిరిగి శారీరక రోగాలకు దారితీస్తుంది. అట్టివారు శత్రువులకు
లోకువౌతారు.
నియమబద్ధమైన
తపస్సు, ఇంద్రియాలపై విజయం, నీతికి సంబందించిన విద్య నభ్యసించడం, మనస్సుకు శాంతి నిస్తాయి.
అయినవారితో
తగవు పెట్టుకోవడం, గోవులను తస్కరించటం, విప్రులను అవమానించటం, స్త్రీలనుబాధించటం చేయరాని పనులు. చేయరానిపనులజోలికి వెళ్ళకపోవటం వలన
ఘనత యినుమడిస్తుంది.
దాయాదులతో
కలసిమెలసి, ఒకరికొకరు సహాయపడుతూ, ఆనందంగా జీవిస్తే, వారిజీవితం
తామరకొలనువలె చూడముచ్చటగా వుంటుంది. వారు
శ్రీమంతులై ఒద్దికగా సుఖంగా జీవిస్తారు.
వృక్షాలు
గుంపుగా బలంగావుంటే, ఏనుగులు గుఱ్ఱాలు వాటిని పడదోయలేవు. పెనుగాలులు పెగలించలేవు. కనుక
అన్నదమ్ములబిడ్డలందరూ ఒకటిగా కలసిమెలసి వుంటే వారిజోలికెవరూ రారు. అట్లుగాక
యెవరికివారై విడివిడిగా వుంటే శత్రువులకు లోకువైపోటారు.
ఏనుగులు, గుఱ్ఱాలు, అందమైనస్త్రీలతోవిహారాలు, ప్రజానురంజకమైన పాలన, యుద్ధ విజయాలు, ఆభరణాలు, పట్టుపీతాంబరాలు అన్నీవున్న
రాజులు మాత్రం కాలగర్భంలో కలసిపోలేదా? కనుక క్షణికములైన ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని ధర్మం విడనాడరాదు.
ధర్మాలను
పురుషప్రయత్నంగా పాటించడానికి పూనుకోవాలి. అయినా దైవం యెలా నడుపుతే, లోకం అలానడుస్తుంది. అని అనేక
నీతులను చెప్పాడు విదురుడు. ఆతరువాత ఆధ్యాత్మిక విషయలు ధృతరాష్ట్రుడడుగగా, విదురుడు సనత్సుజాతుని మనస్సున ప్రార్థించినంత ఆయన ప్రత్యక్షమై
ధృతరాష్ట్రునకు ఆద్యాత్మిక విషయలు బోధించారు. అయినా అన్నిటినీ విన్నట్లేవిని
ఆచరణశూన్యుడై, అదుపుదప్పిన పుత్రప్రేమతో ధర్మాన్ని మరచి కడకు యెంతఆపద
కొనితెచ్చుకున్నాడో మనందరికీ తెలిసిందేకదా! కనుక వినడము తెలుసుకోవడమే కాదు, ఆచరణ అతిముఖ్యమని విదురనీతి
తేటతెల్లము జేయుచున్నది.
తే:గీ: ఎల్లయెందును దా వసియించుటెల్ల
యదియు
దనయెందు వసియించుటంద్రు వాసు
దేవుడనిపేరి కర్థంబు దెల్లమింత
యెఱుగు జనులందు దగ వసియించుశుభము. (ఉ-2-326)
సంజయుడు
పాండవుల వద్దకు రాయబారిగావెళ్ళివచ్చి ధృతరాష్ట్రుని సభలో విషయమంతా వివరించాడు.
ధృతరాష్ట్రుడు నాకుకొన్ని సందేహాలున్నాయి తీర్చమన్నాడు. సంజయుడు వ్యాసభగవానుని
అడగమన్నాడు. ధృతరాష్ట్రుడు వ్యాసుని ప్రార్థించాడు. అప్పుడు గాంధారికూడా
ప్రక్కనేయున్నది. వ్యాసుడువచ్చి సంజయా! నీకన్నీ తెలుసు. మీరాజు సందేహం నీవేతీర్చు,
అన్నాడు. రాజు వాసుదేవుడంటే అర్థమేమిటి? అని అడిగాడు. సంజయుడు, రాజా! ఇందు అందు అనే తేడాలేకుండా, అంతటా వుండేవాడు. అంతేగాక సర్వం
తనలోనే గలిగి వుండేవాడు వాసుదేవుడు. ఈసత్యం గ్రహించినవాడు స్థిరంగా శుభాలను
పొందుతాడు అన్నాడు. ఈవిషయం అర్థంగావడమంత సులభంగాదు. వాసుదేవుడంటే దైవమే. దైవానికి
రూపంలేదు. అదిఒక స్వచ్ఛమైన స్థితి. గనుకనే, అంతటా అనగా బహిరంతరములందంతటా వ్యాపించి
వుండగలదు, వుంటుంది. అయితే కృష్ణుడు వసుదేవుని కొడుకు గనుక వాసుదేవుడయ్యాడు.
రెందువిధాల కృష్ణుడు వాసుదేవుడే.
ఆ:వె:
పగయు కలిగినేని బామున్న యింటిలో
నున్నయట్లు కాక యూఱడిల్లి
యుండునెట్లు చిత్తమొకమాటు గావున
వలవ దధిక దీర్ఘ వైరవృత్తి. (ఉ-3 -20)
చ: పగయడగించు టెంతయు శుభంబది లెస్సయడంగునే పగం
బగ వగగొన్న మార్కొనక పల్కక యుండవచ్చునే
కడుం
దెగ మొదలెత్తిపోవ బగదీర్పగ వచ్చిన
గ్రౌర్యమొందు నే
మిగతి దలంచినన్ బగకు మేలిమిలేమి ధ్రువంబు
కేశవా! (ఉ-3-21)
ధర్మరాజుశ్రీకృష్ణుని,
కౌరవసభకు రాయబారిగా పంపటానికి కృష్ణుని వద్దకు వచ్చినపుడు నుడివిన మాటలివి.
ఎవరితోనైన పగ, వైరముంటే, అది పామున్నయింటిలో సంసారం జేసినట్లుంటుంది. ఏమాత్రం అలికిడైనా, పామేమోనన్న భయం గలుగుతుంది.
ఎప్పుడూ పాముమీదే దృష్ఠి. అది దుర్భరం. కనుక చాలాకాలం పగను కొనసాగనివ్వరాదు. పగను
పగచే అణచివేయలేము. అది మతింత పెరిగిపోతుంది. అలాగని ఊరకుంటే శత్రువు మరింతగా
రెచ్చిపోతాడు. ఇకలాభంలేదు రణమే శరణ్యమని, దండెత్తిపోయి అంతంజేస్తామా అంటే, జనులు మనల్ని కఠినులమని, దూర్తులమని నిందిస్తారు. పగతో
అన్నీ యిబ్బందులే, సుఖంలేదు. కనుక యేదోఒక విధంగా సంధిచేసుకోవడం మంచిదని ధర్మరాజు తన
అభిప్రాయన్ని తెలియబరుస్తున్నాడు
చ: ప్రియమెసగం దగ బిలిచి పెట్టెడు కూడది లెస్సకూడు; ద
క్కయనయహీనతం దమకు ఆపదయైనెడ నిట్లునట్లు నే
మియు ననలేని కూడదియు మేవడి యైచను; నీవు మాదెసం
బ్రియుడవు కావు; మాకుధృతిపెంపఱ నాపద లే
దొకింతయున్. (ఉ-3-222)
శ్రీకృష్ణుడు
కౌరవులవద్దకు పాండవదూతయై వచ్చాడు. దుర్యోధనుడు భోజనానికి పిలిచాడు. కృష్ణుడు
తిరస్కరించాడు. అందుకు కరణంచెబుతూ కృష్ణుడన్న మాటలివి. ప్రేమతో భోజనానికి పిలిచి
పెడితే, సంతోషమే, భోంచేయవచ్చు. లేదా గతిలేక అవస్తలుపడుతుంటే, అన్నం పిలిచిపెడితే తినవచ్చు.
కానీ యిప్పుడా పరిస్థితులు రెండు లేవు. నీవు మాకు ప్రియుడవుకావు. పాండవులతో
శత్రుత్వమువహించియున్నావు. నేను పాండవ రాయబారిని, వారిహితంకోరేవాడిని. కనుక నీయింట
భోజనం చెయ్యనని నిర్మొగమటంగా, చెప్పాడు కృష్ణుడు. భోజనం యెవరియింట చెయ్యచ్చునో, యెవ్వరి యింట చెయ్యకూడదో విషదమైన
దిచ్చట.
క: దొరకొని పుణ్యము బాపము
నరుడర్థిం జేయుచుండ నడుమనొకటన
వ్వెరవెడలి దప్పినను, ద
త్పరిణతి ఫలమొందు నండ్రు ధర్మవిధుల్. (ఉ-3
-240)
శ్రీకృష్ణుడు
పాండవదూతయై హస్తినవచ్చినపుడు, విదురుని యింట బసచేసినాడు. విదురుడు కృష్ణా! కౌరవులు యెవరిమాటా
వినరని నీకుతెలియదా? ఎందుకీ ప్రయాసనీకు, అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాటయిది. పాపమో పుణ్యమో
మనిషిచేయ్యాలని పూనుకొని చేస్తుండగా మధ్యలో ఆపని చెడిపోయినా కూడా, అది పాపకార్యమైతే పాపము, పుణ్యకార్యమైతే పుణ్యము అతనికి
వచ్చితీరుతుంది. ఇది ధర్మాత్ములైన పెద్దలమాట. అందుకే యిది పుణ్యకార్యమని
వచ్చినాను. సఫలమో విఫలమో యేమైతేనేమి, నాప్రయత్నం నేనుచేస్తానన్నాడు శ్రీకృష్ణుడు.
తే:గీ: చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు
డడ్డపడి వారితోడ గొట్లాడి యైన
దాన
యుడుపంగ జొరకున్న వాని గ్రూర
కర్ముడని చెప్పుదురు కర్మకాండవిదులు.
(ఉ-3-242)
బంధువులలో
వివాదం యేర్పడినప్పుడు కలుగజేసుకొని, వాదించి, వివాదపడియైన సరే బంధువులమధ్య
సయోధ్య కుదుర్చాలి. అలా చేయకపోతే క్రూరుడంటారు. ఇది కర్మ కాండ తెలిసిన పెద్దలమాట.
కనుక నాప్రయత్నం నేనుచేస్తానన్నాడు, విదురుని యింట బసచేసియున్న కృష్ణుడు, విదురునితో.
ఉ: సారపుధర్మమున్
విమలసత్యము బాపము బొంకుచే
బారము పొందలేక చెడబారినదైన యవస్థ ధక్షులె
వ్వారలుపేక్షచేసి రది వారల చేటగుగాని ధర్మని
స్తారకమయ్యు సత్యశుభదాయక మయ్యును
దైవముండెడున్. (ఉ-3-273)
శ్రీకృష్ణుడు
పాండవదూతగా కౌరవసభకు వచ్చి, పాండవుల వినయవిధేయతలను ధృతరాష్ట్రునకు వివరించిచెప్పి
మహారాజా! ప్రశస్తమైనధర్మము పాపముచేత, స్వచ్ఛమైన సత్యము అబద్ధముచేత గట్టెక్కలేక పడైపోతుండగా శక్తిగలిగి
కూడా, రక్షించక
చూస్తూ ఊరకుండడం తగదు. అలా వూరకున్న
శక్తిమంతునికి, అది ఆపద కలుగజేస్తుంది. ధర్మం దైవంచేత వృద్ధిపొందుతుంది. సత్యమునకు
దైవమెప్పుడూ శుభాలను కలుగజేస్తుంది. అనికృష్ణుడు హితవు పలికినాడు.
క: పురుషుడు సెడు ననువాడును
బురుషుడు
సెఱుచు ననిపలుకు పురుషుండును న
య్యిరువురు నవివేకులు; య
ప్పురుషుడు సెఱుపండు సెడడు భుజవీర్యనిధీ. (భీ-1-198)
క: ఫలములఎడ బ్రహ్మార్పణ
కలనపరుండగుచు గార్యకర్మము నడుపన్
వలయుం దత్త్వజ్ఞానము
తలకొనినం గర్మశమము దానై కలుగున్. (భీ-1-202)
క:
వైరమున నులిచి త్రెంపక
కారాకులు డుల్లినట్లు కర్మములెల్లం
దార పెడబాయ వలయుట
పారకృపం దెలియజెప్పె శౌరి యతనిన్. (భీ-1-204)
సీ: దేవ నీదగు దివ్యదేహంబు నందును సు
రాసుర గంధర్వు లాదిగా గ
గలదేవయోనులు గమలాసనుండును
నచరాచరంబైన జగమునాకు
దోచెమొగంబులు దోర్దండములును బా
దములు గన్నులు ననేకములు గంటి
మకుటాది భూషణనికరంబు జక్ర గ
దాధ్యాయుధములు మాల్యాబరంబులు
ఆ:వె: బెక్కు గాన వచ్చె నక్కజమై యిది
నడుమ మొదలు దుది యనంగరాదు
తేజ మప్రమేయ దేదీప్య మానని
ర్వికృతి మహిమ దుర్నిరీక్ష్య మయ్యె. (భీ-1-211)
తే:గీ: క్రందుకొను సర్వధర్మ వికల్పములను
నెడల
విడిచి దృఢంబుగ నేనొకండ
శరణముగ నాశ్రయింపుము సకల దురిత
ములుకు దొలకింతు నిన్ను బ్రమోదమొంద. (భీ-1-224)
ఉభయసేనామధ్యమున
రథం నిలిపి, శత్రుపక్షముననున్న తన ఆప్తులనుజూచి, వారిని చంపడం తగునా, అన్న
ఆలోచనతో వైరాగ్యభావంతో నిండిన అర్జునునకు శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించినాడన్న
విషయం మనకు తెలిసినదే. తెలుగుభారతంలో తెలుగుపద్యాలలో చెప్పిన భగవద్గీత సా రాంశమిది.
ఆత్మ
యెప్పుడూ నశింపదు. దాన్ని నశింపజేయడం యెవరితరంగాదు. ఈవిషయం అంగీకరించనివాడు
అవివేకి. ప్రతి కర్మకు (పనికి) ఫలితముంటుంది.
అది అనుభవింపక తప్పదు. తప్పించుకోవాలంటే, కర్మఫలత్యాగమే శరణ్యము. అది
యెలాగంటే కర్మఫలితము పరమాత్మ కప్పజెప్పుతున్నాననే భావనను వృద్ధిజేసుకుంటే సరి.
అలచేయడంద్వార పండుటాకులు వాటికవే రాలిపోయినట్లు తొలగిపోతాయి. కర్మఫలాలను నీవు
వైరంబూని బలవంతంగా త్రెంచవలసిన పనిలేదు. అలావాటిని తొలగించనేలేము. కృష్ణార్పణభావనే
సరియైనది. సులువైనది. ధర్మాధర్మాలనుగూర్చి నీవు తర్కించి వితర్కించి చేయవలసిన
కార్యములను గురించి చింతపడనవసరంలేదు. పరమాత్ముడైన శ్రీకృష్ణునకు శరణుజొచ్చి, సర్వం ఆయనకు అప్పజెప్పి, కర్తవ్యభావనతో పనులు చేసుకొంటూ
పోవడంవల్ల, మనం భారమునుండి విముక్తులమగుదుము.
గీతాబోధ
సందర్భమున అర్జునుడు దర్శించిన శ్రీకృష్ణపరమాత్మ విశ్వరూపం యెలా వున్నదంటే, వాసుదేవుడైన కృష్ణపరమాత్మ దేహంలో
రాక్షసులు, దేవతలు, గంధర్వులు మొదలైనవారేగాక, బ్రహ్మశంకరాదిదేవేశులు, చరాచరజీవులు, అనేకతలలు వాటిపై కిరీటములు, ఆనేక కరచరణములు, వాటికి వివిధాభరణములు, చేతులలో గద ఖడ్గాది వివిధాయుధములుకలిగి చూడశక్యముగాని రూపములో
భగవానుడున్నాడు. ఇది మొదలు యిది తుది యనడానికి వీలులేకుండా విశ్వమంతా
వ్యాపించియున్న విశ్వరూపం అర్జునుడు దర్శించాడు.
తిక్కన
కవీంద్రుడు భీష్మపర్వంలోనే భగవద్గీతమొత్తం ఉన్నదున్నట్లు తెనుగించలేదు. వీలైనచోట్ల
విషయం వివరిస్తూ పోయారు. ఎలాగూ అనేక వ్యాఖ్యనాలతో పూర్తి భదవద్గీత మనకు
లభిస్తున్నది గనుక మనకేమీ లోటులేదన్నది వాస్తవమే గదా!
సీ: ప్రారంభములకెల్ల బౌరషమ్మును దైవ
మును సాధనమ్ములు వినుమువాని
లోన నొకటి చేతగానేర వనగ
తత్ఫలసిద్ధు లెట్లన్న దఱచు వాన
కారుపొలంబున గల్గెనేనియు గొల్చు
గావింప నేర్చునే? కలవిధమున
వలనేర్పడగ దున్నుబొలములో నైన వ
ర్షంబు లేకున్న
ధాన్యంబులగునే
ఆ:వె: కాపులావు వెఱపు గల్గి కర్శనము సే
యంగ వృష్టి దగినయట్లు గలుగ
ఫలముగల్గు; నట్లు పౌరుషంబునకు దై
వంబుతోడు పాటు వలయు నెందు. (సౌ-1-31)
క: తగుపని కుద్యోగించుచు
దగ నెఱిగెడు హితుల కనుమతంబుగ జేయన్
జగతీసురవర! కార్యము
లగు;వారికి గలుగు విధిసహాయత్వంబున్.
(సౌ-1-33)
క: ధర్మము తప్పక నయగతి
గర్మాచరణంబు నడుపగా ఫలసిద్ధిన్
నిర్మలయశమగు; దప్పిన
బేర్మి సెడదె నిందరా నభేద్యోత్సాహా. (సౌ-1-34)
ఉ:
నీతిదొరంగి కార్యముల నెట్టన యాగ్రహవృత్తి జేసినం
బ్రీతిగ సిద్ధిబొందినను భీతియు గుత్సయు
బుట్టు; భూజను
ల్వేతురు; చేటుచేతలు ఫలింపకతక్కిన, మున్నవచ్చు న
త్యాతురతాస్పదంబులగు నాపద; లిద్ధ వివేక వైభవా! (సౌ-1-35)
ఉ:
క్రోధము, లోభమున్ భయము గూరిన చిత్తముతోడ దుష్క్రియా
సాధనవృత్తి దుర్జనుడు సజ్జను లాగగ
జేయుకార్యముల్
బాధల బెట్టకున్నె? సిరిపాయక జేయక యున్నె? వాని? దీ
వ్రాధి నితాంత దుఃఖ హృదయత్వము దేరక యున్నె
వానికిన్. (సౌ-1-36)
చ: అలుక మనంబునం గదిరినాతడు, దాననెఱుంగ డొడ్లచే
తెలియడు కార్యతంత్రములు; ధీమహితుండగువాని
కైన నుం
జెలులును జుట్టలుం దగిలి చెప్పగ జొప్పడుగాక
తక్కు ని
ర్మలమగు నీతితంత్రము దిరంబయి చిత్తమునందు
నిల్చునే? (సౌ-1-77)
క:
మతినెప్పుడు దాధర్మ
స్థితినూహించుచును, హితులు సెప్పెడి వెర పు
ద్ధతి
దక్కి యాచరించుచు
జితేంద్రియత గలిగి నడవ, జెందు సుభంబుల్.(సౌ-1-78)
తే:గీ: దుష్పథంబుల జొరనీక తొలగ దివుతు
రాప్తజనములు దగ వశ్యులైనవార
అందు బుణ్యంబు దొలగని యతడు దొలగు
దొలగనేరడు భాగ్యంబు దొలగువాడు. (సౌ-1-79)
క: మతిమంతులైనవారికి
హితులగు వెరవుగలవార లెలిగింతురు దు
స్థితిగాకుండగ గార్యము
గతి యొత్తియు దప్పులిడియు గడవ బలికినన్
(సౌ-1-80)
భీముని
గదాఘాతములకు దుర్యోధనుడు తొడలువిరిగి రణభూమిలో పడిపోయడు. అశ్వత్థామ కౌరవులవైపు
మిగిలిన కృపాచార్యులు, కృతవర్మలను తీసుకొనిపోయి అడవిలో ఒకవృక్షంక్రింద విశ్రమించారు.
నడిరేయి సమయంలో ఒక గుడ్లగూబ చెట్టుపై తమగూటిలో నిద్రిస్తున్న కాకులు, వాటి పిల్లలపై దాడిచేసి
కిరాతకంగా చంపేసింది. అది అశ్వత్థామకు స్పూర్తినిచ్చింది. ఈరాత్రి సమయంలో
పాండవులను, మిలినవారి సైన్యాన్ని నాశనంచేయాలనుకున్నాడు. అప్పుడు కృపుడు అది
తగదని, హితబోధచేశాడు. ఆహిత బోధే, యీ పద్యలు.
అశ్వత్థామా!
ఏపనికైనా మానవుని దృఢనిశ్చయము, బలముతోపాటు దైవంకూడా సహకరించాలి. రెండూవుంటేనే పని నెరవేరుతుంది.
రెంటిలో యేదిలోపించినా ఆపని నెరవేరదు. వర్షం బాగకురిసినా రైతు, దున్ని విత్తనం వేయకపోతే, పంటపండదు. అలాగే రైతు దున్ని
విత్తనంవేసినా వర్షంపడకపోతే, నీరు అందుబాటులో లేకపోతే, అప్పుడుకుడా పంటపండదు. కనుక మానవప్రయత్నానికి దైవంతోడైతేనే
యేప్రయత్నమైనా సఫలీకృతమౌతుంది.
చేయదగిన
పనులకు, తెలిసిన సజ్జనులు, యిది సబబు అనిచెప్పుచుండగావిని
చేస్తే, ఆసత్కార్యానికి విధికూడా సహకరిస్తుంది.
ధర్మాన్ని
విడనాడకుండా, పనులు నియమబద్ధంగా చేస్తే, ఆపనులు సిద్ధిస్తాయి. అందువల్ల స్వచ్ఛమైన కీర్తి లభిస్తుంది. అలాకాక
అధర్మమైన పనులుచేస్తే, నింద, అపకీర్తి వస్తుంది.
నీతినియమాలు
వదిలేసి ఆగ్రహంతో చేసిన దురాగతంలో విజయుడైనప్పటికి, దానివల్ల భయము, నింద కలుగకపోవు. జనులు
అసహ్యించుకొని పీడిస్తారు. ఒకవేళ అలాచేసినపని విఫలమైతే, ఆపదలు మితిమీరి మరిన్నిబాధలకు
గురౌతారు.
భయబా కోపంతో
లోభమునకు గురై, భీతితో దూర్తుడై, హితులు వద్దనివారించినా, వినక దుర్మార్గాలుచేస్తే, వానికి వ్యధలు తప్పవు. వాని సంపద హరించుక పోతుంది. హృదయవేదన తీవ్రమై
అతడిని విడువక బాధిస్తుంది.
కోపంతో
రగిలిపోయేవానికి మంచిచెడ్డాతెలియదు. ఇతరులు చెప్పినా గ్రహించలేడు.
ఎంతబుద్ధిమంతుడైనా మిత్రులు, బంధువులు అర్థమయ్యేట్లు చెబితేనే విషయం గ్రహించి, కృతార్థుడౌతాడు. ధర్మంగా
ఆలోచిస్తూ నిగర్వియై, పెద్దలమాటను గౌరవిస్తూ, వారి హితవును పాటిస్తూ, ఇంద్రియనిగ్రహంతో మెలిగేవారికి, శుభాలు చేకూరుతాయి.
మనమేలుగోరే
ఆప్తులు, మనం అపమార్గంబట్టి పోకుండా సూచనలిస్తారు. పుణ్యత్ములు వాటి
ననుసరిస్తారు. భాగ్యహీనుడు పెడచెవినిబెట్టి పతనమౌతాడు.
మనహితంగోరే
బుద్ధిమంతులు, కార్యసిద్ధిక్రమాలు చూపించి, దండించి గట్టిగా మందలించి మనల్ని
సక్రమమార్గంలో నడిపిస్తారు. వారు హృదయంలో మనమేలు గోరుతున్నారన్న విషయం గ్రహించి, మేల్కొని బాగుపడాలి. కనుక
అశ్వత్థామా! నీవు చేయబూనినపని తగనిది. ఆలోచించు అన్నాడు, కృపాచార్యులు. అయినా అశ్వత్థామ
ఆరాచకహింస చేయకుండా ఆగనూలేదు, వ్యధ, అపకీర్తిపాలవ్వడమూ తప్పలేదు.
క: అర్యులు తఱితో దగియెడు
కార్యమనుష్ఠింతు; రటుగాకప్పని మా
త్సర్యమున దిగిచి పట్టి, య
నార్యులు దుది దూర వగతు రాపదయైనన్.
(స్త్రీ-1-18)
కురుక్షేత్ర
రణరంగంలో తనవారినందరిని కోల్పోయిన ధృతరాష్ట్రుని, సంజయుడు ఓదార్చిన సందర్భమునదీ
పద్యం. రాజా! ఆర్యులు (ధీరులు) సమయానుకూలంగా ధైర్యంగా వ్యవహరిస్తారు. అలాకాక
తనమొండి పట్టుదల సడలింపక, పనులు నెరవేరక , అనార్యులైనవారు ఆపదలకు గురై దుఃఖిస్తారు. కనుక పరిస్థితుల కనుగునంగా
ధైర్యంవహించండి. పాండవులను శత్రువులుగా భావించకండి. పెద్దరికంతో సంయమనం పాటించండి.
అని ధీశాలురు కష్టకాలంలో మెలగవలసిన తీరును తెలిపి, ఓదార్చినాడు సంజయుడు.
క: పెరుగుట స్రగ్గక; రుచులం
బొరయుట యరుచంబు గాగ, బుట్టుట సావం
బెరయుట పాయ బదార్థో
త్కరముల నైజ; మదియెట్లు దప్పింపనగున్.
(స్త్రీ-1-24)
కురుక్షేత్ర
రణరంగంలో తనవారినందరిని కోల్పోయిన ధృతరాష్ట్రుడు దుఃఖితుడయ్యాడు. సంజయుడు
కొంతవరకోదార్చాడు. ఇప్పుడీ మాటలతో విదురుడు సున్నితంగా మందలిస్తూ వాస్తవాలు
తెలుపుతున్నాడీ పద్యంలో. మహారాజా! పెరుగుట విరుగుటకొరకే, రుచులపై ఇష్టం, రుచిలేని స్థితికి రావటానికే.
పుట్టటం మరణించటానికే. కలియటం విడిపోవటానికే. ఇది ప్రకృతిలోని ప్రతివస్తువు యొక్క
లక్షణం. దీనినెవరూ తప్పించలేరు. బాధపడకండి, ధీరులై సంయమనంతో మెలగండి అంటూ
విదురుడు ఓదార్చాడు.
క: తేరు శరీరము, దానికి
సారధి సత్త్వంబు తురగచయ మింద్రియముల్
దారుణతర బుద్ధివ్యా
పారము లొనరంగ గనపగ్గము లధిపా! (స్త్రీ-1-57)
ఈపద్యం
కూడా పై సందర్భంలోనిదే. రాజా! ఈదేహమొక రథం. సత్త్వం (మనస్సు) సారధి. ఇంద్రియములు
అశ్వములు. వాటిని అదుపుచేసే గట్టి పగ్గాలు బుద్ధిచేసే పని. జీవుడు గమ్యంచేరాలంటే, ఇవ్వన్నీ సక్రమంగ వుండడమేగాకుండా, బాగా పనిచేయాలి. లేకుంటే
గమ్యంచేరడం కష్టం. నీవిషయంలో యివేవి అదుపులోలేకనే, యీకష్టానికి కారణమున్న మందలింపు
యిందులోవుంది.
క: కలిమియ చుట్టల జేర్చుం
గలిమియ చెలులను ఘటించు; గలిమియ శౌర్యో
జ్వలు డనిపించున్, గరిమయ
పలువురు సద్బుద్ధియనగ బరగంజేయున్. (శాంతి-1-51)
ధర్మరాజు
రాజయ్యాడు, గాని జ్ఞాతులజంపితినన్న చింతలో బడ్డాడు. ఆయన్ను ఓదార్చడానికి అందరూ
ప్రయత్నించారు. అర్జునుడుకూడా ఓదార్చాడు ఆసందర్భము లోనిదీ పద్యం. అన్నా! సంపదతో
అనేకం సమకూరుతాయి. చుట్టాలుదరిజేరుతారు. అందరూ మిత్రులౌతారు. ధనమున్నవాడినే
శౌర్యోజ్వలుడంటారు. బుద్ధిమంతుడనికూడా పొగడుతారు. అట్టిది కురుక్షేత్రయుద్ధం
గెలిచి రాజ్యలక్ష్మిని చేపట్టి చింతించడం తగదన్నాడు అర్జునుడు. నేడు మనంకూడా Money makes many things అంటున్నాం గదా! ఈలోకంతీరు నే అర్జునుడుకూడా
పలికాడు.
క: ఏవాని బంధుమిత్రులు
జీవధనంబులును దప్పి జెందును గృశునిం
గావాని నెన్నగాదగు
గేవల తను కర్శ్యయుతుడు గృశుడె నరేంద్రా!
(శా-1-52)
పై
సందర్భంలోనిదే యీపద్యంకూడా. అన్నా! ఎవరు బంధుమిత్రులను, ధనాన్ని, ప్రాణసమానులైన హితులను, పోగొట్టుకుంటారో వారే బలహీనులు.
అంతేగాని, దేహం బహీనమైనంతనే అతన్ని బహీనుడనలేము. ధనము, బలగము ఉన్నవాడే శాసించగల
స్థాయిలో వుంటాడు, కండబలం కాయకష్టానికేగాని, అధికారం చలాయించలేదుగదా! మేమంతావున్నాం, రాజ్యాధికారమున్నది
నీవుచింతించడమేటికి? అన్నాడు అర్జునుడు. అప్పుడూ ఇప్పుడూ యిదేకదా పరిస్థితి.
సీ:
సారహీనములగు సంసార సుఖములు
విడిచి, యేకాకినై యడవికేగి
తాపసవాక్యామృతములు వీనులగ్రోలి
చెలిమి వేర్పాటును చిరమరలకు
జొరక, నిదాస్తుతుల్ సరిగాగొనుచు, గత్తి
నొకడు వ్రేసిన వేరొక్కరుండు
చందనం బలదిన డెందమయ్యిరువుర
యెడ సమంబుగ మూగ జడుడనంగ
తే:గీ: మెలగి తగువేళ బర్ణశాలలకు నరిగి
యెత్తగాబిక్ష యెవ్వారలెట్టులేమి
యిడిన
గైకొని నాలుగే నెడల మాత్ర
గన్న
దాన దృప్తుండనై యున్న మేలు. (శా-1-58)
జ్ఞాతులజంపి
రాజ్యం తనవశం జేసుకున్నా నన్న తలంపుతో ధర్మరాజు, మానసికంగా బలహీనపడి, రాజ్యం నాకు వద్దంటూ, పరితాపంతో పలికిన పలుకులివి.
నిస్సారమైన సంసారసుఖాలు నాకు వద్దు. నేను తిరిగి అడవికేగి అమృతతుల్యములైన మునుల
ప్రవచనాలు వింటాను, స్నేహం పగ, నింద పొగడ్త, సమంగా స్వీకరిస్తూ, హింసించినా గంధమలమినా, ఒకటిగానే స్వీకరించి, పర్ణశాలలో ప్రశాంతజీవనం గడుపుతూ, బిక్షాటనతో కడుపునింపుకుంటూ, నాల్గుదిక్కులా
స్వేచ్ఛగావిహరిస్తూ, తృప్తిజెంది బ్రతకడం మంచిదని నా ఆలోచన అంటున్నాడు ధర్మరాజు. మనిషికి
జీవితంలో పలుమార్లు యిటువంటి వైరాగ్యభావం కలగటం సహజం. తిరిగి తనవారి హితోక్తులతో
సేదదీరి సామాన్యజీవనం గడపటమూ సహజమే. ఈవిషయాన్ని ప్రతియొక్కరూ తమతమ జీవితాలను తరచి
చూచుకోవచ్చు. అవసరమైన సమయాలలో ఓదార్పునూ పొందవచ్చు.
క : కేవల నిష్కర్మత మో
క్షావహమగునేని గిరులు నవనీజములున్
భూవర ముక్తిం బడయం
గావలదే? యడవినునికి కైవల్యదమే? (శా-1-68)
వైరాగ్యభావంతో
రాజ్యమొల్ల నంటున్న ధర్మరాజునుద్దేశించి, భీముడన్న మాటలివి. రాజా! కేవలం పనిమాని ఊరకుంటే మోక్షం వస్తుందా? అదే నిజమౌతే, కొండలూ, గుట్టలూ మోక్షం పొందాలికదా! కనుక
అడవిలో జడంగా పడియున్నంతనే కైవల్యం కలుగదు. బ్రహ్మర్పణ బుద్ధితో పనులుచేసుకుంటూ
పోవాలి. అంటూ చక్కని భావన వ్యక్తంచేశాడు భీముడు.
సీ:
దుఃఖంబు బొమ్మని త్రోవ, సుఖంబు
రమ్మని దెచ్చుకొన వశమయ్య? వాని
దొలుబామునందలి దుష్కృతంబును, సుకృ
తంబు హేతువులుగ దగిలిచేయ
బురుషుని కాలంబు; దిరములు గావవి;
పొరిబొరి వచ్చును బోవుచుండు;
నర్థముల్ దుర్బుద్ధి కైనను సిద్ధించు
నగుకాలమున; నార్యులయ్యు గాని
ఆ:వె: కాలము విఘటింపగా నేర రనిల వ
ర్షాతపేందు రుచులు నధిప! కాల
కల్పితములు; మంత్ర శిల్పౌషదంబులు
మేలుసేత కాలకీలితంబు. (శా-1-185)
యుద్ధంలో
జ్ఞాతులను చంపించినానన్న భావంతో ధర్మరాజు విచారగ్రస్థుడై రాజ్యమేలజాల, అడవులకెళ్ళి తపంజేసుకుంటానంటున్న
సమయంలో వేదవ్యాస మహర్షి ధర్మరాజు నుద్దేసించి పలికిన అనునయ వాక్యములలోనిదీ పద్యం.
రాజా! దుఃఖాన్ని పొమ్మంటేపోదు. సుఖాలు రమ్మంటేరావు. గతజన్మలోచేసిన పాపపుణ్యాల
కారణంగా అవి వస్తూ పోతూవుంటాయి. స్థిరంగా యేవీవుండవు. కనుక ప్రస్తుతం దుర్మార్గునికైనా
సంపదలు కలుగచ్చు. అలగే సజ్జనునికి కష్టాలూ కలగవచ్చు. గాలి, వర్షము, యెండ, వెన్నెల కాలానుగుణంగా వచ్చి
పోతూవుంటాయి. మంత్రవిద్యలు, నేర్పు, ఔషదప్రభావములు అన్నీకూడా కాలకల్పితములే. యేవీకూడా మనుషుల చేతిలోవుండవు.
కనుక జరిగిపోయిన వాటినిగురించి చింతించక కాగలకార్యముల గురించి ఆలోచించు అని హితవు
పలికారు వ్యాసభగవానులు.
చ: వలవధికంబుగా గలుగు వైద్యులు
శాస్త్రములభ్యసించి మం
దుల నొడగూర్చి తనుదోషము లారయు బుద్ధిగల్గి యా
ర్తులకు చికిత్సచేసెదరు; రోగము వాయమి లేదె? వారు రో
గులగుట గానమెట్లు? ప్రతికూలవిధిన్ నరునేర్పు దోచునే? (శా-1-215)
పైన
జెప్పిన సందర్భములోనిదే యీ పద్యంకూడా. వ్యాసులవారు పూర్వం జనకుని కాలంలో జరిగిన
విషయాలను కూడా ఉదాహరణలుగా జెప్పి ధర్మరాజును అనునయించారు. ఈపద్యం ఆశ్మకుడనే మహర్షి
జనకునకుజెప్పిన నీతులలోనిది. ధనం బలగం అన్నీవున్నప్పుడు, అవేవి లేనప్పుడు, యేవిధంగా వ్యవహరిస్తే, మదము విషాదము గలగవో
చెప్పమన్నప్పుడు, అశ్మకుడు చెప్పిన నీతులలోనిదీ పద్యం. వైద్యులు శాస్త్రంనేర్చి, రోగంనిర్ధారించి, సరైన ఔషదమ్యిచ్చినా సరే, రోగులు చస్తున్నారు. అంతేగాక
అంతా తెలిసిన వైద్యులూ రోగంతో చస్తున్నారు. కాలంకలిసిరానప్పుడు మానవప్రయత్నాలు
సత్ఫలితాలనివ్వవు. కనుక మనమేదో చేసినామనుకోవడం తప్పు. అంతా విధివిదానమే. కనుక
రాజా! దుఃఖంమాని నీకర్తవ్యం నీవు పాటించమంటూ కర్తవ్యబోధ చేశారు
వ్యాసభగవానులు.
చ: మనుజులు సేయరెవ్వరు; సమస్తము నీశ్వరునాజ్ఞ జెల్లెడు;
న్వినుము కుఠారపాని
ధరణీరుహముల్ నఱకంగ బాప మొం
దునొకొ కుఠారమున్; జనులు దోసముబొందరు; కర్త ఈశ్వరుం
డనియెడి నిశ్చయంబు దృఢమై మది నిల్పిన జాలు
భూవరా! (శా-1-227)
పైసందర్భములోనిదే
యీపద్యం కూడా. వ్యాసుడు ధర్మరాజుకు చెబుతూ, రాజా! అన్నీ భగవంతుని
ఆజ్ఞానుసారమే జరుగుతున్నాయి. మనుజుడు భ్రమకులోనై నేను కర్తననుకుంటున్నాడు. ఇదినిజం
మనిషి వృక్షాలను గొడ్డలితో నఱుకుతాడు. పాపం గొడ్డలిది కాదుగదా! కనుక మనిషి నేను
గొడ్డలివంటి వాడనే అనే వాస్తవంగ్రహించి, అదే భావనతో మెలిగితే, పాపంఅంటదు. కనుక ధర్మరాజా! నీవు నిమిత్తమాత్రుడవు. కర్త భగవంతుడే.
నీవేపాపము చేయలేదని హితవు పలికారు వ్యాసులవారు.
క: ఆలును బిడ్డలు బంధులు
నై లీలజరించుచును గృహస్థుడు దత్త
ల్లోలత్వరహిత చిత్తత
మేలుగ నలవఱుపవలయు మీదెరిగి నృపా! (శా-1-327)
ధర్మరాజుకు
అనేకములైన నీతులు, విధివిధానములు చాలామంది చెప్పారు. ఇది వ్యా స భగవానుడు చెప్పిన
ఆధ్యాత్మవిధి. భార్యాబిడ్డలు, చుట్టాలతో మనిషి సాంసరిక జీవనం గడుపుతూ, ఇహలోకాన్నేకాకుండా, పరలోకాన్నికూడా గుర్తించి
ఇహలోకబంధాలలో చిక్కుబడకుండా, సాధనద్వారా దైవారాధనచేసి ఉత్తమలోకప్రాప్తికోసం ప్రయత్నించాలి,
అన్నారు వ్యాసులవారు. ఈవిధంగా గృహస్థజీవితం ఉత్తమలోకప్రాప్తికి అవరోధం కాదన్నారు
వ్యాసులవారు.
తే:గీ: షండునకు బిడ్డనిచ్చిన చందమొందు
బూదిలో నేయివేల్చుట బోలు, నోటి
కడవ నీళ్ళులు వెట్టిన కరణియగు, న
పాత్రజనులకు బెట్టుట పౌరవేంద్ర! (శా-1-332)
ఈపద్యంకూడా
పైసందర్భంలోనిదే. దానప్రక్రియకు సంబంధించిన పద్యమిది. నపుంసకునకు బిడ్డనిచ్చి
పెండ్లిచేయటం. బూడిదలో నేయిపోసి యజ్ఞమనుకోవటం. ఓటి కుండలో నీరుపోసివుంచడం యెలా
నిష్ప్రయోజనమో అలానే అనర్హునకు దాన మియ్యయడం కూడా నిష్ప్రయోజనమే. అంటూ
దర్మరాజుకుపదేశించారు వేదవ్యాసులవారు.
సీ:
వ్యవహారశుద్ధి సర్వప్రజాప్రియకారి
యదియ భూపతికి ధర్మాతిశయము
గీర్తియు జేయు నక్షీణసత్యులు ధర్మ
పరులును నైన భూసురులు నీవు
ద్రాసులుంబోని చిత్తంబులతోడుత
బ్రజవివాదములెడ బక్ష ముడిగి
విని ధనవాంఛమై ధనికులదెస వ్రాలి
తీర్పక ధర్మంబు తెరువు దప్ప
ఆ:వె: కుండ బాడి దీర్చి దండింప దగునెడ
ననుగుణంపుదండ మాచరింపు
మొఱగ
బలికితేని నుండదు ప్రజ డేగ
గనిన పులుగుపిండు కరణి జెదరు. (శా-2-374)
న్యాయం, తీర్పు జెప్పేసమయంలో రాజు
పరిశుద్ధమనస్కుడై యుండాలి. అప్పుడే అందరూ సంతోషిస్తారు. అందువలన ధర్మంనిలచి రాజుకు
కీర్తివస్తుంది. నిత్యసత్యవచనులు ధర్మాత్ములునైన విప్రులు, నీవు త్రాసువలె సమానమైన మనస్సుతో అంటే హెచ్చు తగ్గులులేక
పక్షపాతరహితంగా, ఇరుపక్షాల వాదనలు విని యేవిధమైన ప్రలోభాలకు లొంగకుండా
తీర్పుజెప్పాలి. శిక్షించాల్సివస్తే కోపతాపాలకు గురికాకుండా తదుచితమైన
శిక్షవిధించాలి. అలాకాని పక్షంలో గ్రద్ధనుచూచిన పిట్టలవలె జనులు పారిపోతారు.
న్యాయంకోసం యెవరూ రాజునాశ్రయించరు. రాజ్యం అరాచకమైపోతుంది. కనుక రాజు జాగరూకుడై
మెలగాలని భీష్ముడు ధర్మరాజుకు పాపము నిందరాని విధంగా యెలాతీర్పు వెలువరించాలో
చెప్పిన విధమిది.
క: గతమునకు వగవక నా
గతమునకు నోరుదెఱచి కడుగోరక దీ
నత బొందక, దైవంబే
గతి బుచ్చిన దానబోదు గాకన వలయున్. (శా-3-30)
భీష్ముడు
అంపశయ్యమీద వుండి, ఉత్తరాయణపుణ్యకాలంలో తనువు విడవడానికి వేచి యున్నాడు.
ఆసమయంలోకూడా ధర్మరాజుకు అనేక నీతులు పరిపాలనా విధివిధానాలు చెప్పారు.
సంశయాలుదీర్చారు. ఆసందర్భంలోనిదీ పద్యం. భీష్ముడు కాలకవృక్షీయ ముని, క్షేమదర్శికి
తెలిపిన విషయమిదియని చెబుతూ, గడచిపోయినదానికై వ్యధ జెందడం వృధా. జరగబోయేది వైభవమని గొప్పగా ఆశలు
పెట్టుకోకూడదు. అట్లని నిరాశజెందనూ కూడదు. భగవంతుడెట్లా నడిపితే అట్లేనడుస్తాను.
అదేసరియైనది. భారం దైవంపైవేసి జీవించడముత్తమమైనదని బోధించాడు.
క: సమతయు దమము దితిక్షయు
నమత్సరము హ్రీయు ధృతియు ననసూయార్య
త్వములు నహింసా దాన
క్షమాత్యజన సూనృతములు సత్యము మూర్తుల్.
(శా-3-417)
ఇదికూడా
పైసందర్భములోనిదే. సమత, దమము, తితీక్ష, మాత్సర్యము లేకుండుట, హ్రీ, ధృతి, అసూయపడకుండుట అనునవి ధర్మాత్ముల
లక్షణములు. అహింస, దానము, క్షమించుగుణము, హితవాక్యములు సత్యస్వరూపములు. ఇవి పాటించదగ్గవి అన్నారు భీష్ములు
ధర్మరాజుతో. ఈపద్యంలో కొన్ని పదాలకు అర్థము తెలియవలసియున్నది. అవి దమము, తితీక్ష, హ్రీ ధృతి. దమము అంటే
ఇంద్రియనిగ్రహము, కష్టములనోర్చుకొను గుణము. తితీక్ష అంటే, ఇతరులు బధిస్తే కూడా
ప్రతీకారేచ్ఛ మనసులో కలగని స్థితి. హ్రీ అంటే తనవలన ఇతరులకుచెడుజరుగకుండా
అప్రమత్తంగా నుండటం. ఇక ధృతి అంటే ధీరత్వం లేక స్థిరత్వం అని
అర్థంచేసుకోవాలి.
చ: కుదురు సమస్త ధర్మములకున్ విను సత్యము; యోగమోక్ష స
త్పదములు సత్యకార్యములు; పాపమసత్యముకంటె నొండు లే
దు; దలప నశ్వమేధములు తొమ్మిదినూఱులు
వెండి నూఱునై
యొదవిన నీడుగావు భరతోత్తమ! సత్యము
మూర్తుల్. (శా-3-419)
పైసందర్భములోనిదే
యీపద్యం. రాజా! విను సత్యము సమస్త ధర్మాలకు ఆధారం. యోగము (దైవంలోఐక్యం) మోక్షము
సత్పదములు యివన్నీ సత్యముతోనే లభిస్తాయి. అసత్యము పాపము. వేయి అశ్వమేథయాగములు
చేసినా సత్యమునకు సరిగావు. అన్నాడు భీష్ముడు ధర్మరాజుతో.
క: భీరుడు, శూరుడు, జడుడు, వి
శారదుడబలాత్మకుండు, సబలుండన లే
దేరినయిన మృత్యువు దు
ర్వారంబై యపహరించు వైదికవర్యా. (శా-4-24)
ఈపద్యం కూడా
ధర్మరాజుకు భీష్ముడు చేసిన బోధయే. పితాపితృ సంవాదం అనే కథ ఆధారంగాచెప్పిన మృత్యువు
తీరే యీపద్యం. పిరికివాడు శౌర్యవంతుడు, జ్ఞాని, అజ్ఞాని, బలవంతుడు, బలహీనుడు అనే తేడాలేకుండా యెవరినైనా మృత్యువు కబళిస్తుంది. దానికి
అడ్డేలేదు. తప్పించుకోజూడడం వృధాప్రయాస. అంటూ హితవుపలికాడు భీష్ముడు.
తే:గీ: సారమతి బ్రికింపంగ బౌరుషంబు
కంటె దైవంబు ముఖ్యంబు గార్యసిద్ధి
కెచటనేమియు బౌరుష మెసగమెసగె
నేని యది దైవదత్తంబ యింత నిజము. (శా-4-41 )
చ: సులభమొ దుర్లభంబో యని చూడనెఱుంగవు; గన్నదానిపై
నలముదు కామమా! యిడుమలందగ జేయుదు; నిందు నేమిటం
గలుగదు నీవు; నీతెఱగగాధరసాతల భంగి; నీవు స
న్పొలమున బోవకుండి నిను బుచ్చెద బచ్చన
రూపుపోలకన్. (శా-4-51)
మంకి
యనునాతడు ధనాశగలవాడు. ఒకరోజు తన కోడెదూడలకు ఒకేతాడుతో రెండింటి మెడలకు లంకెవేసి
వుంచాడు. అవి చలాకిగావుండి బయటిదారిలోనికి పరుగెత్తాయి. దారిమధ్యలో ఒక ఒంటె
కూర్చొనియున్నది. దూడలు, ఒంటెకు అటుఒకటి యిటు ఒకటిగా
పరిగెత్తాయి. ఒంటె భయపడి అదీ పరుగెత్తింది. దూడలు ఒంటెశరీరానికి రెండువైపులా
యిరుక్కపోయి వ్రేలాడి గొంతులకు తాళ్ళు బిగుసుకపోయి చనిపోయాయి. మంకి వాటిని మంచి
వెలకమ్ముకున్నామన్న ఆశ నిరాశయ్యింది. అతనికి నిర్వేదంకలిగి యీ మాటలన్నాడు.
బుద్ధిగలిగి ఆలోచిస్తే, మానవప్రయత్నంతో యేమీ నెరవేరదని అర్థమౌతుంది. జరిగేది దైవసంకల్పమే.
కొన్నిపనులు మానవ యత్నంతో జరిగినట్లనిపిస్తాయి. అది కేవలం భ్రమ. అప్పుడుకూడా
దైవసంకల్పమే జరిగింది. నేను కర్తననుకోవడం మనిషి తప్పిదమే. ఈభ్రమనుండి బయటపడిన మంకి, కోరికనుద్దేసించి యిలా
అంటున్నాడు. ఓకోరికా (కామమా) విచక్షణలేకుండా, యిది సులభంగా జరిగేపనా కాదా అన్న
ఆలోచనలేకుండా, చూచిందల్లా కావాలని ఆరాటపడి కష్టాలలో పడేస్తావు. ఆశ అంతుచిక్కని
రసాతలమంత లోతైనది. నీవెలా లాగితేఅలా నీకిష్టమైన పొలాలలోనికికరాను. ఇకనీవు నాఅధీనంలో
వుండకతప్పదు అన్నాడు, మాయ తొలగిన మంకి. ఈ కథద్వారా భీష్ముడు కోరికలతీరును వివరించాడు
ధర్మరాజుకు.
ఆ:వె: మణిమయములు, గనకమయములు, రజత మ
యములు, మఱియు మృణ్మయాదికములు,
నైన పెక్కుపూసలందు ద్రాడున్నట్లు
భూతకోటియందు పురుషుడుండు. (శా-4 -191)
హరములు,
మణిమయములు గావచ్చు, బంగారు వెండి కడకు మట్టితోచేసినవైనా గావచ్చు, వాటిమధ్య దారముండి హరమౌతున్నది.
ఈవిధంగానే జీవజాలమందంతటా హారంలో దారంవలె పురుషుడున్నాడు. పురుషుడు భగవానుడొక్కడే.
మిగిలిన విశ్వమంతా స్త్రీ (ప్రకృతి)కి ప్రతీకే. బృహస్పతి మనుసంవాద రూపముననున్న
ఆధ్యత్మిక విషయములు, భీష్ముడు ధర్మరాజుకు తెలియజెప్పాడు.
క: జ్ఞానము గేవల కృప న
జ్ఞానికి నుపదేశవిధి బ్రజనితము సేయం
గానది సకల ధరిత్రీ
దానమునకంటె నధికతర ఫలద మగున్. (శా-4-255)
విష్ణువు
నారదునకు తెలిపిన అనుస్మృతిలోని విషయాన్ని భీష్ముడు ధర్మరాజుకు తెలిపాడు.
జ్ఞానియైన మహత్ముడు యేవిధమైన ప్రతిఫలపేక్ష లేకుండా ఆధ్యాత్మికవిద్యనుపదేశిస్తే, అది సకలధరిత్రిని దానంచేసిన
ఫలాన్నిస్తుందని, విద్యాదాన మహిమను తెలియపరిచారు.
చ: జనవర సౌఖ్యముం బొరసి సాత్వికభావ సముద్గమంబు సు
మ్మనియును, దుఃఖముల్ గదిరి నప్పుడు రాజసభావ
భంగి సు
మ్మనియు; జడత్వసంగ సమయంబున దామస భావవృత్తి
సు
మ్మనియును ద్రోచి వానబడకాత్మ రతిన్
నిలుపిచ్చు మోక్షమున్. (శా-4-543)
పంచశిఖుడనే
విద్యావేత్త జనకునికి జెప్పిన విషయమిది. సుఖసంతోషములు గలిగి నప్పుడు సాత్వికభావ
సత్ఫలితమని, దుఃఖం గలిగినప్పుడు రాజసంవల్ల గలిగిందని, జడత్వంతోనిండినప్పుడు
తామసభావంవల్ల ఉత్పన్నమైందని ఆలోచించడం మాని ఆత్మజ్ఞానమందు స్థిరంగా వున్నప్పుడే, మోక్షం కలుగుతుందని పంచముఖుడు
చెప్పిన విషయాన్నే భీష్ముడు ధర్మరాజుకు తెలిపాడు. ఈపద్యం ద్వారా త్రిగుణాతీతుడే
మోక్షార్హుడని తెలియజేయడం జరిగింది.
క: ధృతి యారోగ్యము నొసగును;
ధృతి యుజ్జ్వల లక్ష్మిదెచ్చు; ధృతికీర్తి సము
న్నతిజేయు; గాలగత్యవ
గతిగలిగిన గలుగుధృతి; వికారవిదూరా! (శా-4-421)
ధైర్యము
ఆరోగ్యదాయిని. సంపదనిస్తుంది. కీర్తినిదెస్తుంది. కాలగమాన్ని గుర్తించి మెలిగేవానికీ
ధైర్యం కలుగుతుంది, అంటూ ఇంద్రమను సవాదంలోచెప్పిన యీ ధైర్యప్రశస్తి, భీష్ముడు ధర్మరాజుకు
తెలియజేశాడు.
ఆ:వె: జంతుపదములెల్ల దంతిపదమ్ములో
నడుగుక్రియ, నహింసయందు సకల
ధర్మములు నడంగు; గర్మసంత్యాగికి
నైన భూతదయ సమర్హగుణము. (శా-145)
భీష్ముడు
ధర్మరాజుకు నీతిబోధచేస్తూ, వ్యాసశుకమహర్షుల సంవాదంలోగల అహింస ప్రాముఖ్యతను యిలా వివరింవారు.
యేనుగు భూమిపై పాదంమోపిందంటే, అంతకుముందు పడిన యితర జంతువుల పాదముద్రలిక అక్కడవుండవు. అవి
గజపాదముద్రలతో అణగిపోతాయి. అహింస గజపాదముద్ర వంటి సుగుణము. మహా ధర్మము.
అహింసపాటిస్తే యిక యేధర్మాలు పటించనవసరంలేదు. అన్నీ వదిలేసిన సన్యాసికైనా అహింస
పాటించడం వదలకూడని సుగుణము. అహింసను గూర్చి చెప్పిన గొప్పపద్యమిది.
ఆ:వె: సకల రత్నపూర్ణ సర్వవసుంధరా
చక్రదాన విధియు సరియనంగ
రాదు; విశ్వవేదరాశిసారాధ్యాత్మ
విద్య యిచ్చుటకు వివేకధుర్య. (శా-5-159
)
ఇదికూడా
పైసందర్భములోని పద్యమే. వ్యాసశుకసంవాదం లోనిదే. ఆధ్యాత్మికవిద్య ఘనతను, భీష్ముడు ధర్మరాజునకు
తెలియజేశాడు. తత్నరాశులతో గూడిన భూచక్రమంతయూ దానంచేసినా, విశ్వవేదరాశి సారాంశమైన
ఆద్యాత్మికవిద్య నేర్పుటతో సమానంకాదన్నాడు.
క: ఒరులకు దా వెఱవక, తన
కొరులు వెఱవకుండునట్టి యొప్పెడు సమతం
దిరమైన నడవడింగల
పరిణతచిత్తుండ సూవె బ్రాహ్మణుడనఘా! (శా-5-18 9)
ఇదికూడా
ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన విషయమే. బ్రాహ్మణశీలము గురించి చెప్పిన పద్యమిది.
తాను యెవరికీ భయపడడు. అంతేగాకుండా, తనంటే యెవరికీ భయముండదు. అటువంటి సమతను పాటించి మెలగు మహనీయుడే
బ్రాహ్మణుడు.
తే:గీ: బంధనంబులలోనెల్ల పరమబంధ
నంబు గామంబు దద్వర్జనమున నాత్మ
యభ్రపటలంబు వాసిన యమృతకిరణ
పూర్ణమండలమును బోలె బొలుచు ననఘ. (శా-5-190)
యిదికూడా
పై సందర్భంలోనిదే. కామమనేదే జీవుడిని బంధించే పెద్దబంధము. కోరికలను జయిస్తే, మబ్బులు తొలగిన తర్వాత
ప్రకాశించే పూర్ణచంద్రునివలె ఆత్మ ప్రకాశిస్తుంది. అని వ్యాసమహర్షి, పుత్రుడైన శుకయోగికి తెలిపెనని
భీష్ముడు ధర్మరాజుకు తెలిపెను.
సీ: విను మోహబీజ సంజనితంబు గామద్రు
మంబు ప్రమాదజలంబు దనకు
బరిసేచనంబుగ బెరుగు నజ్ఞాన స్థి
రాధార కలితమై యందసూయ
పత్రసంపద యదిచిత్రతరంబు మా
నస్కంద ధృడత నున్నతి వహించు
శోకశాఖంబు ననేకచింతోపశా
ఖంబు బురాకృత కర్మసార
తే:గీ: ఘనము దృష్ణాలతా పరిగతము నగుచు
బొలుచు తత్ఫలములకు లబ్దులు గడంగి
ప్రాకి పడుదురు విడుపు శస్త్రముగనది వి
ఖండితముసేసి బుధుడు దుఃఖముల దొఱగు.
(శా-5-199)
సీ:
పురము శరీరంబు; తత్స్వామిని
సర్వార్థ చింతనసచివ పదవి
నడచుచునుండు; మనంబు శబ్దాద్యంబు
లై చెల్లు విషయంబులైదు దగుపు
రోహితవర్గంబు; శ్రోత్రాదు లగునింద్రి
యంబులు పౌరజనంబు; లిట్లు
పరగెడురాజ్యంబు పరిభోగమునకు దూ
షకు లైనదొరలు రజస్తమంబులు;
తే:గీ: వారి కఱపుల బడు బుద్ధి నేరకుండి
మనసుతోడ నేర్పడిన దానును మనంబు
నేకముఖత గార్యము సూచునేని దుష్టు
లడగుదురు; భోగ మవ్యయమగు గుమార. (శా-5 -200)
ఈపద్యాలు
కూడా పైసందర్భంలోనివే. మోహము విత్తనము, దానినుండి కామము (కోరిక) అనే వృక్షం మొలుస్తుంది. అలసత్వమనే నీటితో
పెరిగి, అజ్ఞానమనే దాని కూకటివేర్లతో పాదుకొపోతుంది. అసూయ దానికి ఆకులై
మొలుస్తాయి. మానమనే కాండం ధృడమై, దుఃఖమనే కొమ్మలు చింతలనే రెమ్మలు వృద్ధిజెంది, పూర్వకర్మల బలంతో చేవ గలిగి, ఆవృక్షం ఆశలనే తీగలతో
చుట్టబడుతుంది. లోభగుణులు ఆచెట్ల ఫలాలకై ఆశతో పైపైకెక్కి తుదకు క్రిందపడి చస్తారు.
ఆత్మజ్ఞాని త్యాగమనే గొడ్డలితో ఆవృక్షాన్ని నరికి శోకరహితుడౌతాడు.
మరోవిధంగ
ఆలోచిస్తే, దేహమే ఒక పురం. దానికి అధిపతి బుద్ధి. అన్నిటిని పట్టించుకొని
యోచించే చిత్తము మంత్రి. శబ్దాది ఐదువిషయాలు పురోహితులు. పంచేంద్రియాలు పురప్రజలు.
వీరిని పీడిస్తూ, రజస్తమోగుణాలనే దూర్తులు తిరుగుతుంటారు. వివేకం బలంలేనిదై చిత్తంతో
విభేదించి, దూర్తులవల్ల నశిస్తుంది. అలాకాక మనస్సుతో అది తనకర్తవ్యాన్ని
గుర్తించి, ప్రవర్తిస్తే, దుర్జనులైన రజస్తమోగుణాల దౌర్జన్యాలను అణచివేయగలదు. పురపాలన సజావుగా
సాగగలదు.
క: ఒరులేమి యొనర్చిన
నరవర! యప్రియము తన మనంబునకగు దా
నొరులకు నదిసేయకునికి
పరాయణము పరమ ధర్మపథములకెల్లన్. (శా-5-220)
ఇది
భీష్ముడు ధర్మరాజుకెరిగించిన సర్వధర్మసర్వస్వం. ఇతరులేది చేస్తే మనమనస్సుకు
కష్టంగావుంటుందో, అద్దానిని ఇతరులకు మనం చేయకుండావుండటమే, గొప్పధర్మం. అంటూ గొప్పసత్యాన్ని
చెప్పారు భీష్మాచార్యులు.
క: మానవునకు దలపగ న
జ్ఞానము నట్టి పగలే దసంగత కృత్యా
ధీనుండై రూపుసెడును
దానం గావున నుదాత్తధర్మ విధిజ్ఞా!
(శా-5-221)
అసంబద్ధ
కార్యకలాపాలతో అర్థరహితంబుగా ప్రవర్తిస్తూ, అజ్ఞానియై మనుజుడు చెడిపోతాడు.
కనుక అజ్ఞానమే మనిషి శత్రువు. అని జనక పరాశర సంవాదంలోని విషయాన్ని ధర్మరాజుకు
భీష్ముడు తెలియజేశాడు.
చ: వినుము జరానుబంధమున వెండ్రుకతండము బండ్లు
వీనులుం
గనుగవయున్ జరం బొరయు గాని యొకప్పుడు దృష్ణ
జీర్ణ గా
దనయము బేర్చి ప్రాణముల నన్పక పోదది రోగ
మల్పబు
ద్ధి నరులు ద్రోవ లేరది మదిం జొరనీక
సుఖార్థులై బుధుల్. (అను-1-147)
భీష్ముడు
ధర్మరాజుకు తెలిపిన కోరికల తీవ్రత, వాటివలన మనకు గలుగు అనర్థం గురించి తెలిపిన పద్యమిది. వయసు మీదబడి వృద్ధాప్యం
వచ్చినపుడు వెంట్రుకలు తెల్ల బడతాయి రాలిపోతాయి. దంతములూడుతాయి. చెవులు వినబడవు, కళ్ళుకనబడవు. కానీ ఆశమాత్రం
చావదు. అదే అన్నిటికంటే గొప్పజబ్బు. అజ్ఞానులు దీనివాతబడి నశిస్తారు. జ్ఞానులు
కోరికలకు లొంగక సుఖంగా జీవిస్తారు.
తే:గీ: బ్రహ్మచర్యంబు కంటెను బరము మద్య
మాంసంబులు రెండునుడుగుట మనుజనాథ
లోకయాత్ర వాటించుచలోజ పతయు
శమము గల్గి వర్తించుట శౌచవిధము.
(అను-2-45)
ఈపద్యంకూడా
పైసందర్భంలోనిదే. మధ్యమాంసములు మానడం, బ్రహ్మచర్యము పాటించడము కంటే శ్రేష్ఠము. ఈప్రపంచంలో జీవనయాత్ర
సాగించుచు శమము (కామక్రోధాది అరిషడ్వర్గములను అదుపులో నుంచుకొని ప్రశాంతజీవనం
గడుపుట) గలిగి యుండుటయే శుచిత్వమునకు అర్థము.
తే:గీ: రూపగుణశీలముల ననురూపుడైన
వరునకీక, కన్నియ దనవలసినట్ల
తగని వానికి నిచ్చుట, ధర్మదేవ
తా తనూభవవ! బ్రహ్మహత్యా సమంబు.
(అను-2-70)
పైన
చెప్పిన సందర్భములోనిదే యీపద్యంకూడా. ధర్మదేవతా తనయుడవైన ఓ ధర్మరాజా! రూప గుణ
శీలము గలిగిన వరునకు తనకుమార్తెనిచ్చి వివాహం చెయ్యలి గాని, అవేవి చూడకుండా, యెవడికంటే వాడికిచ్చి
పెండ్లిచేయరాదు. అది బ్రహ్మహత్యతో సమానమన్నాడు భీష్ముడు.
క: అనసూయయు, నక్రోధం
బును దమము, బ్రహ్మచర్యంబును, ఋజుభావం
బును, సత్యంబు, నపైశున
ము, నహింసయు జూవె! యతికి
ముఖ్యవ్రతముల్. (అను-2-173)
ఈపద్యంకూడా
పైసందర్భం లోనిదే. అసూయ లేకుండుట, కోపము లేకుండుట, ఇంద్రియనిగ్రహము గలిగి వ్యవహరించుట, బ్రహ్మచర్యము (పరమాత్మయందు లీనమై
యుండుటను) పాటించుట, స్వచ్ఛమైన నిజాయితీతో మెలగుట, సత్యంపలుకుట, లోభత్వంలేకుండుట, అహింసను పాటించుట అనునవి యతికి
ముఖ్యమైన వ్రతాలు. అని ధర్మరాజుకు భీష్ముడు యతిలక్షణములు తెయజేశారు.
చ: అడిగిన నిచ్చుకంటెను, నయాచకుగాగ నెఱింగి యిచ్చుటె
క్కుడు ఫలమిచ్చు దానవిధికోవిధ! వేడుట సావు; వేడగా
బడుటది పెద్దసావు; దగుప్రార్థన పూర్ణముసేయ నాతడా
యడిగినవాని దన్నును దయారతి గావగజాలు
వాడగున్. (అను-2-343)
యచించడం
చావుతో సమానం. అటువంటి అభిమానధనునికి అవసరమెఱిగి కావలసినదిచ్చి ఆదుకోవటం అధిక
ఫలితమిచ్చే దానం. గత్యంతరములేక అడుక్కొనేస్థితికి దేవటం చావుకంటే మరింత హీనమైనది.
కనుక దయతో అవసరమెఱిగి ఆడగకముందే దానంచేయడం వలన దాతకు గ్రహీతకు గుడా
మేలుకలుగుతుంది. అంటూ భీష్ముడు ధర్మరాజుకు దానవిధానం తెలిపాడు.
ఆ:వె: వృద్ధు వచ్చునపుడు విను బాలుప్రాణంబు
లెగయజూచు; నతని కెదురు లేచి
ప్రణతిజేసెనేని బాదుబడి యవి
దొంటియట్ల నిలుచు దురితదూర!
(అను-4-101)
ధర్మరాజు
భీష్మునితో యిలా అడిగాడు. తాతా! నూరేండ్లాయువుగల మనుజుడెందుకు ముందే చనిపోతున్నాడు? ఈప్రశ్నకు సమాధానమిచ్చి, యీ
విషయంకూడా తెలియ జేశాడు. వృద్ధులు తనకెదురుగా వచ్చినపుడు, పిల్లలప్రాణాలు పైపైకిలేచి
పోవడానికి సిద్ధపడతాయి. అప్పుడు పిల్లలు, వృద్ధుల పాదాభివందనం చేయగానే, మళ్ళిప్రాణాలు కుదుటబడి, యధావిధిగా కొనసాగుతాయి. అంటూ
భీష్ముడు పెద్దవారికి యెందుకు పాదాభివందనం చేయాలో చెప్పి, గొప్పరహస్యం విప్పారు.
చ: తెవుళులు గొన్నవారి కవి దీరుట కౌషదమీగి; దుర్గతుల్
దవులు జనాలిబ్రోవు; సుపథంబుగ దైర్థికకోటి నన్పు; బాం
ధవరహిత తత్వదీన శవదాహము; దుఃఖితులైనవారి దే
ర్ప వెరపు నోర్పు గల్మియును
బ్రస్తుతికెక్కిన మేటిధర్మముల్. (అను-5-214)
నారదుడు
ఉమామహేశ్వర సంవాదాన్ని శ్రీకృష్ణుని వద్ద తెలిపాడు. అందుండే నీతి, ధర్మరాజుకు భీష్ముడు తెలిపాడు.
వ్యాధిగ్రస్తులకు ఔషదమిప్పించటం, కష్టాలలో వున్నవారిని ఆదుకోవటం, తీర్థయత్రలకు వెళ్ళేవారి సౌకర్యం
కొఱకు చక్కని దారులు వేయించటం, అనాథశవాలకు అంతిమసంస్కారములుచేయడం, దుఃఖితులైనవారిని ఓదార్చే నేర్పు
ఓర్పు గలిగియుండటం అందుకు ధనంవెచ్చించే
దానగుణం గలిగి యుండటం అనే యీకార్యాలు సర్వులూ కీర్తించే గొప్పగుణాలు.
చ: పనివడి పూచి పట్టమి; సుబంధుర ధైర్యము నిర్వహింతు నే
నను మతిసొన్పకుండుట సమగ్రతపంబున తత్ఫలేచ్ఛ
లే
కునికి; విమోక్షతృష్ణభర మొందమి, కాము నడంచుగాన ని
య్యనువులు లేమి సువ్వె యనపాయతగా నత
డాడెభూవరా! (అశ్వ -1-133)
శ్రీకృష్ణుడు
ధర్మరాజులోని తాపోపశమనముగా కామగీతలను వివరించాడు. రాజా! కురుక్షేత్రయుద్ధం
యుద్ధమేగాదు. దాన్ని ప్రక్కకుబెట్టు, నీ లోనిశత్రుజయమే అసలు జయం. అందులో కోరికల (కామం)పై విజయం
అతిముఖ్యమైనదన్న విషయం చెబుతూ, రాజా! అదేపనిగా యెప్పుడూ పట్టుదలకుపోకూడదు. సడలనిధైర్యం నాస్వంతమని
హెచ్చులకు పోకూడదు. సమగ్రమైన తపమచరించి కూడా ఫలితమాశించకూడదు. మోక్షంకూడా కోరకుండా
నిర్వ్యామోహగుణంతో మెలగినవాడు కాముణ్ణి జయిస్తాడు. కనుక జాగరూకుడవై యుండుమన్నాడు
శ్రీకృష్ణుడు ధర్మరాజుతో.
క: విను పెక్కులేల కోరిక
మనమున జొరనీకయున్న మడియుం గాముం
డనవధ్య యశ్వమేధం
బొనరింపుము; గోరకుండు మొక్కటియు మదిన్.
(అశ్వ-1-134)
రాజా!
యిన్నేల కోరికలు మనస్సున ప్రవేశించనీకు. కాముడు నిన్ను వదలి వెళ్ళిపోతాడు. నీకు
తిరుగేమున్నది, అశ్వమేధంచెయ్యి, అయితే తత్ఫలితంగా నీవేమి ఆశించకు. అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో
హితవుపలికాడు. తొల్లి అర్జునునకు బోధించిన నిష్కామకర్మయోగమూ యిదేకదా!.
చ:
అనఘచరిత్ర! విన్ము శరణాగతు జేకొనకున్కి శుద్ధ మి
త్రుని యెడ జేయు ద్రోహము, వధూటి వధించుట, విప్రునర్థముం
గొనుట యనంగ గల్గునివి కూడి సమంబగు నాకుజూడ
భ
క్తుననపరాధునిన్ విడుచు దోషముతో; నిది యోర్వవచ్చునే. (మహా.58)
భార్యయైన
ద్రౌపది, తమ్ములు అందరూ దారిలో పడిపోయి పరలోకగతులయ్యారు. కానీ ఒకకుక్క మాత్రము
ధర్మరాజు వెంట వస్తూనేవున్నది. కడకు ధర్మరాజు కూడా యీ లోకం వదలి వెళ్ళవలసిన సమయం
వచ్చింది. ఇంద్రుడు ఆయన్ను సశరీరంతో తనలోకానికి తీసుకెళ్ళడానికి దివ్యరథంతోవచ్చి, ధర్మరాజా! వచ్చి రథమధిరోహించ
మన్నాడు. ధర్మరాజు యీకుక్కకూడా వస్తుందన్నాడు. కుదరదన్నాడు దేవేంద్రుడు. అయితే
నేను కూడా రాను. శరణుగోరి వచ్చినవానిని రక్షించకపోవడం, నమ్మినస్నేహితునికి ద్రోహం తలపెట్టడం.
స్త్రీవధ, విప్రుని ధనమపహరించడం, యివన్నీ దోషాలు. ఈదోషాలతో సరితూగేదే, యేతప్పుచేయని భక్తుని వదలివేయడం.
కనుక యీకుక్కను వదలి నేను రాలేను, అని తెగేసిచెప్పాడు ధర్మరాజు. అప్పుడు కుక్కరూపంలోనున్న యమధర్మరాజు
నిజరూపదర్శనమిచ్చి, ఆఖరు పరీక్షలోకూడా నెగ్గావు ధర్మరాజా, యిక రథమెక్కు వెళదా మన్నాడు. అలా
కడవరకు ధర్మం విడువరాదని మహాభారతం మనకు నీతిని బోధిస్తున్నది.
ఓంతత్సత్
No comments:
Post a Comment