అన్నమయ్యా నీకు వందనం
1, ఇదిగాక సౌఖ్య మిదిగాక తపము
మరి యిదిగాక వైభవంబింకొకటి గలదా!
అని హృదయ పరిపాకశుద్ధితో, చనువుతో
శ్రీవేంకటేశ్వరుని శృంగార రససరసి
ముంచి ముంపించుకొని ఓలలాడిన
పదకవితాపితామహా-అన్నమయ్యా
నీకు వందనం-అభివందనం
2, ఎంతమాత్రమున కెవ్వరు దలచిన
అంతమాత్రమే హరిదయయని
ఏకులజుడైననేమి హరిదయకు పాత్రులందురని
దేవా! నీవలన కొఱతలేదు మరి నీరుకొలది తామెర యని
ఎఱిగి భావములోన బాహ్యమునందును
గోవింద గోవిందయని మనసార దలచిన
పంచమాగమ సార్వభౌమా-అన్నమయ్యా
నీకు వందనం అభివందనం
3. పుట్టుటయు నిజము పోవుటయు నిజమని
నట్టనడిమిపని నాటకమని ఎఱిగి
ఆకటివేళల అలుపైన వేళల
తేకువ హరినామమే గాక మరి ఏది దిక్కని
నాతిలో రాతిలో అన్ని అవతారాలలో
కోనేటిరాయని గని పరవశుడవైన ఓ
సాహిత్య సంగీతసారజ్ఞతారూపా-అన్నమయ్యా
నీకు వందనం-అభివందనం.
4. నేరిచి మాపెద్దలిచ్చిన, నిధానమైయున్న
మాకులస్వామి కొండలరాయుని గొలువ
ముద్దులొలుకు మా పల్లెపలుకుల వెన్నముద్ద లనగ
పదకవితలల్లి మమ్మాస్వాదింప జేసిన
వాగ్గేయకార బహుదూరపు బాటసారీ
అన్నమయ్యా! నీకు వందనం-అభివందనం.
కృష్నదేవరాయా! నీకు కేలుమోడ్తు.
***
Search: Annamayya neeku vandanam