సాలగ్రామం

సాలగ్రామం
దేవీభాగవతంప్రకారం విష్ణుప్రతీకమైన ఒక శిలావిశేషం. హైందవులు దీనిని తులసి,శంఖం తో సమానంగా పూజిస్తారు. ఈ సాలగ్రామాలు నేపాల్‍దేశపు రాజధాని
ఖాట్మండుకు 192 మైళ్ళదూరంలో ప్రవహిస్తున్న గండకీనదిలో
లభిస్తాయి. నదినానికొనియున్న సాలగ్రామగిరిపై కూడా యివి దొరుకుతాయి. నదిలో
దొరికేవాటిని జలజాలని, గిరిపై దొరికేవాటిని స్థలజాలని
అంటారు. వీటి మహాత్మ్యాన్ని క్రీ.పూ ఆపస్తంబుడు డనే మహనీయుడు తెలియజేసియున్నాడు.
సాలగ్రామంచుట్టూ సానుకూల శక్తిప్రకంపనలు (పాజిటివ్ ఎనర్జిటిక్ వేవ్స్) నిత్యం
సజీవంగావుంటాయని పెద్దల అభిప్రాయం. అందుకే వీటిని దేవతామూర్తులను నిర్మించటానికి
ఉపయోగిస్తారు. హైందవంలోని అద్వైత, ద్వైత, విశిష్టాద్వైతాల శాఖల వారందరూ వారివారి దేవతామూర్తులను సాలగ్రామాలతో
చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఆలయాలలోనూ, గృహాలలోనూ కూడా
సాలగ్రామవిగ్రహం పూజలందుకుంటుంది. మణి, స్వర్ణ, శిలావిగ్రహాలకు ఆవాహనాది షోడశోపచారాలు అవసరమౌతాయి. కానీ సాలగ్రామప్రతిమలకు
వాటిఅవసరంవుండదు. అవి సర్వదా దైవశక్తిపూరితాలు. ఈ సాలగ్రామాలవెనుక కొన్ని
పురాణగాథలు కూడా ఉన్నాయి.
చతుర్ముఖబ్రహ్మ
తన సృష్టిలో ద్రోళ్ళిన తప్పులనుగూర్చి పరితపించాడట. ఆ పరితాపం దుఃఖంగామారి ఆయన నయనాలనుండి నాలుగుఅశ్రువులు రాలాయి. ఆ
అశ్రుజలాలే గండకీనదిగా మారింది. గండకీనదీ స్నానంవల్ల జనులు పుణ్యాత్ములై
బ్రహ్మసృష్టి సవరింపబడుతూ వచ్చిందట. మరోకథలో జలంధరుడనే లోకకంటకుడు అతనిభార్య బృంద
పాతివ్రత్యమహిమ వల్ల అజేయుడై మరణంలేనివాడయ్యాడట. అతన్ని అంతమొందించటం
శివునివల్లకూడా కాలేదు. విష్ణువు అతని అజేయత్వానికి కారణం అతని భార్యబృంద
పాతీవ్రత్యమని గ్రహించి, జలంధరునిరూపంలో వెళ్ళి బృందపాతీవ్రత్యాన్ని
భంగపరిచాడు. అదే అదనుగా శివుడు జలంధరుని వధించాడు. విషయంతెలిసి బృంద విష్ణువును
శిలగామారమని శపించింది. విష్ణువు గండకీనదిలోని సాలగ్రామంగామారి కలియుగజనులచే
పూజలందుకొని మోక్షం ప్రసాదుస్తున్నాడనీ, విష్ణువు బృందశాపం
పొందికూడా ఆమె తులసిగా రూపాంతరంచెంది పూజలందుకుంటుందని వరమిచ్చాడట. అందుకే తులసి,
సాలగ్రామం పూజార్హతపొందాయి. మరోకథప్రకారం గండకీ అనునది ఒకవేశ్య
పేరు. ఆమెదొక చిత్రాతిచిత్రమైన పవిత్రగాథ.
గండకీ
(ప్రియంవద) జన్మతః ఒక అందమైన వేశ్య. తనవృత్తిధర్మాన్ని పవిత్రభావంతో ఆచరిస్తూ
కాలంగడిపేది. వృత్తిధర్మం ప్రకారం, ఎవరితో యేదినం
ఒప్పందం కుదుర్చుకుంటుందో అతన్నే ఆరోజంతా తనభర్తగా భావించి నిండుహృదయంతో
సేవించేది. ధనాశతో దుర్మార్గులను, దూర్తులను
దరిచేరనిచ్చేదికాదు. ఈమె కులధర్మాచరణనూ, సద్బుద్ధిని
పరీక్షింపనెంచి విష్ణువే ఒకదినం ఆమెవద్దకు విటునిగా విచ్చేశాడు. గండకీ ఆదినం
ఆయన్నే భర్తగాభావించి సేవచేయడం ప్రారంభించింది. విష్ణువు తనశరీరంనిండా
పుండ్లుకనబరచాడు. అయినా ఆమె అసహ్యించుకోలేదు. స్నానపానాదులు చక్కగాచేయించి రాత్రి కి
తనశయ్యపై చేర్చుకొన్నది. కానీ రాత్రంతా జ్వరంగావున్నట్లు కనిపించాడు విష్ణువు.
అయినా విడిచివెళ్ళలేదు గండకి. ఉదయనికల్లా ఆ మాయావిటుడు మరణించాడు. గండకీ
ధర్మానుసారం ఇతడే యీనాటి నాభర్త అని అందరికీ తెలియజేసి, అతనితో సతీసహగమనానికి
పూనుకొంది. ఎంతచెప్పినా, ఎందరు వారించినా వినలేదు.
అగ్నిప్రవేశం చేసేసింది. మహావిష్ణువు ప్రసన్నుడై ఆమెను వరంకోరుకోమన్నాడు. గండకీ తన
గర్భవాసంలో హరి మాటిమాటికీ జన్మించేవరం కోరుకొన్నది. ఆమే గండకీనదిగా మారింది.
అందులో సాలగ్రామాలు పుడుతూనేవున్నాయి. ఆ సాలగ్రామాలు సాక్షాత్తు
విష్ణురూపాలు. సాలగ్రామాలు
రకరకాలుగావుంటాయి. వాటిలోకొన్ని సౌమ్యం మరికొన్ని ఉగ్రం. చక్రశుద్ధి, వక్రశుద్ధి, శిలాశుద్ధి, వర్ణశుద్ధి
గల సాలగ్రామాలు పూజకు ఉపయోగిస్తారు. వివిధరూపాల్లోను వివిధరంగుల్లోను సాలగ్రామాలు
లభిస్తాయి. ఆకార వర్ణాలనుబట్టి వాటిగుణాలను నిర్ణయిస్తారు. తెల్లనివి సర్వపాపహరం.
పసుపుపచ్చనివి సంతానభాగ్యదాయకం . నీలం సర్వసంపదకారకం.
ఎరుపు రోగకారకం. వక్రం దారిద్ర్యకరం. నలుపురంగులోవుండి చక్రంకలిగి, చక్రంమధ్య ఉబ్బివుండి ఒకపొడవాటిరేఖ వుంటే అది ఆదినారాయణం. తెల్లగావుండి,
రంధ్రంగలిగి, రంధ్రం వైపున రెండుచక్రాలు
ఒకదానితోఒకటి కలిసిపోయివుంటే అది వాసుదేవం. గుండ్రని పసుపుపచ్చనిదై రంధ్రంగలిగి,
రంధ్రంవైపు మూడురేఖలుండి, పద్మచిహ్నం పైముఖంగా వుంటే అది అనిరుద్ధం.
ఇవి బహుదా క్షేమకరములు. కపిలవర్ణంగలిగి పెద్దచక్రం వుంటే నరసింహం అంటారు. దీన్ని
బ్రహ్మచర్యదీక్షతో పూజించుకోవాలి. బంగారురంగులో వుండి పొడవుగా మూడుబిందువులో వుంటే
అది మత్స్యమూర్తి. ఇది ముక్తిప్రదాయిని, సంపదకారి. నల్లని మెఱుపుతో
ఎడమన గదాచక్రాలు, కుడివైపు రేఖ వుంటే అది సుదర్శనమూర్తి. ఇది
శత్రుబాధానివారిణి. అనేకరంగులతో అనేకచక్రాలు పద్మాలతో రేఖలతోగూడివుంటే అది
అనతమూర్తి. ఇది సకలాభీష్టప్రదాయిని. మూడుముఖాలు ఆరుచక్రాలుగలిగి నేరేడుపండుఆకారంలో
వుంటే అది షట్చక్రసీతారామం. ఇది దొరకడం కష్టం. చాలాఅరుదు. ఇది మహామహిమాన్వితం.
సాలగ్రామానికి
నిత్యనైవేద్యం తప్పనిసరి. అదికూడా అనుదినం ఒకే రకమైన నైవేద్యనివేదన జరగాలి. అందుకే
చాలామంది అతిసులువైనది గనుక జలంనివేదిస్తారు. ప్రయాణాలలోకూడా వెంటతీసుకొనివెళ్ళి
క్రమంతప్పకుండా పూజాదికాలు నిర్వర్తించి నైవేద్యం సమర్పిస్తారు. మరీ అంతకూ
వీలుగాని పక్షంలో జాగ్రత్తగా పూజాదికాలు జరిగే దేవాలయంలో వుంచి వెళతారు. నైవేద్యం
మార్పువల్ల జరిగే అనర్థానికి సంబంధించిన ఒకకథ వుంది. అదికూడవిందాం--
సరైనవ్యాపారం
జరగని ఒక మాంసందుకాణందారుడు నదిలో ఒకనల్లని నున్ననిరాయి దొరికితే, ఆందంగా బాగుందని తీసుకవచ్చి తనగల్లాపెట్టెలో పెట్టుకున్నాడు. అది
సాలగ్రామం. దాన్ని మాంసంతాకిన చేతులతో తాకడంవల్ల ఆ సాలగ్రామం తనకు తగిలిన
మాంసాన్నే నైవేద్యంగా స్వీకరించి ఆ
మాంసంవ్యాపారిని సంపన్నునిచేసింది. ఇదంతా ఒక పండితుడు జాగ్రత్తగా గమనించి, సాలగ్రామాన్ని దొంగిలించి తనయింట మంచిమంచి నైవేద్యాలు సమర్పించి
పూజించాడు. కానీ నైవేద్యం మారడంవల్ల అతనికి దరిద్రంచుట్టుకొని కష్టాలపాలయ్యాడు.
ఇది యెంతవరకు నిజమోగానీ కథమాత్రం ప్రచారంలో వుంది.
శాస్త్రజ్ఞుల
అభిప్రాయం ప్రకారం సాలగ్రామం ఒకశిలాజం. ఒకవిధమైన జలచరం దీనిని నిర్మిస్తుంది.
ఇందులో "అమోనైట్" వుంటుంది. "అలి" అనే చేప శీతాకాలంలో
ఒకవిధమైన రసాయనికపదార్తం విడుదలచేస్తుంది. అది ఆ చేప కవచంగా మారుతుంది. ఈ కవచమే
సాలగ్రామం అని కొందరి అభిప్రాయం.
భారతసముద్రజలాల్లో నివసించే టెడైన్ అనే ప్రాణివల్లగూడా సాలగ్రామం తయారౌతుందని
కొందరంటారు. శంఖంవలెనే ఒకప్రాణి విడచిన గట్టిపదార్తమేగానీ నిజంగా సాలగ్రామం శిల
(రాయి) కాదని చాలామంది అభిప్రాయం. ఇదే నిజంకావచ్చు, గానీ
సాలగ్రామంనుండి సానుకూలప్రకంపనలు (Positive energetic waves)
వస్తూవుంటాయని, అవి
మన ఆలోచనలను క్రమబద్ధంచేసి ఉత్సాహానిస్తాయని, ఇది తమ
అనుభవమని అనేకమంది చెప్పడం గమనార్హం.

