విషఫలం
మండి పడుతున్నాడు మార్తండదేవుడు
అకృత్యపర్వారంభ మాసన్నమయిందని
ఎమ్మెల్యేఎన్నిక లెగద్రోసిన విద్వేషం
ఓటింగుబూతులోరగిలిన జగడపు సెగ
శిగబట్టి యీడ్వ వీధిన బడ్డ యేజంట్ల పగ
అదనుకొఱకు ఒకింత అణిగియున్న జ్వాల
మింటిగెగస్తుందని మున్నే పసిగట్టి కాబోలు
పడమటికి వ్రాలినా ప్రకాశంరెట్టిస్తున్నాడు
అది ఆదిత్యునకెరుక మరి ఆ ఆర్టీసీ బస్సునకేమెఱుక
కంట్రోల్డుస్పీడ్ సంకెళ్ళతో కుక్షినిండిన పిల్లల వృశ్చిక గతి
మృత్యు గహ్వర గమ్యంతో సమవర్తికి సహకార మంటూ
చేయెత్తితే నిలబడతానని, చేసినబాసను తప్పనని
ఆర్డినరీ యని నన్నంటారని అదిగో వస్తుందాబస్సు
తరణి కిరణస్పర్శకు తళుకులీనుతున్నాయ్ కొడవళ్ళు
కవోష్ణ రక్త పిపాసలై కరకరలాడుతున్నాయ్ పరుశువులు
కృష్ణ ధృఢహస్తాలలో వాటి కరాళ నృత్యం
వారుణీ సేవిత ముఖావిర్భవ భీకర కోబలి రవం
ఆజ్ఞగాతలదాల్చి ఆగిందా ఆర్టీసీ బస్సు
అరచేత ప్రాణాలతో ఊపిరి బిగబట్టిందో అరడజన్ గణం
అర్థమై అర్ధాంతరంగా దిగిపోయింది మిగిలిన అర్థరహిత జనం
అరడజన్ హృదయాలలో ప్రపంచపుటంచుకు చేరిన భావం
వదనాలపై విశ్లేషణ కందని గంభీర ముద్రలు
దిగండ్రా! అన్న యమ మహిషగళ ఘంటికానాదం
దిగిన మరుక్షణం శిరచ్ఛేదం వెంట శిరచ్ఛేదం
పుచ్చకాయల్లా ద్రొల్లిన మానవ మస్తక షట్కం
భుగభుగ మని యెగజిమ్మిన అరుణాంచిత రుధిరం
దేహాల వీడనోల్లని ప్రాణాల పెనుగులాట
రక్తం రక్తం రక్తం నేలానింగీ అలమిన యెఱ్రదనం
జేవురించి జాజువారిన భాస్కరబింబం
పడమటికొండన ముఖం చాటేస్తున్న తరుణం
నలుపెక్కుతున్న రక్తంతో జతగలిపి గ్రమ్మిన తిమిరం
చీకటి చీకటి చీకటి భుమ్యాకాశమంతా చీకటి
ఇది ప్రజాస్వామ్య వృక్షం మనకందించిన మహా
కజ్జలి వర్ణపు దారుణ విషఫలం.
-ooo-
Search : Vishafalam, vishaphalam