Friday, 20 December 2024

యజ్ఞోపవీతం (జందెం)

                            యజ్ఞోపవీతం (జందెం)


యజ్ఞ + ఉపవీతం యజ్ఞోపవీతమయ్యింది. యజ్ఞమనగా "యజ్ఞోవైశ్రేష్టతమం కర్మ" అంటే ఉత్తమకర్మాచరణము. ఇక ఉపవీత మంటే దారము.  మొత్తంమీద యజ్ఞోపవీత మనగా ఉత్తమకర్మలాచరించునపుడు దీక్షాచిహ్నముగా ధరించు దారమన్నమాట. యజ్ఞోపవీతాన్ని యజ్ఞోపరివీతం
, వ్రతబంధం, యజ్ఞసూత్రం, జందెం, జంధ్యం అనికూడా పిలుస్తారు. సంస్కారకోశంలో జంద్యాన్ని బ్రహ్మసూత్రమని వ్రాసియున్నది. బ్రహ్మమనగా వేదం, విద్య, జ్ఞానమని అర్థం. అందుకే దీనిని ఉపనయానంతరం బాలునిచే ధరింపజేస్తారు. అది వేదాధ్యయనారంభాన్ని (గాయత్రీమంత్రోపదేశ కాలాన్ని) సూచిస్తుంది. యజ్ఞోపవీతధరణతో యజ్ఞయాగాది క్రతువులు, వ్రతములు నిర్వహించడానికి అర్హత లభిస్తుంది. ఉపనయనం 5,8,12 వ యేట బాలురకు చేస్తారు. ఆర్యసమాజస్థాపకులైన దయానందసరస్వతులవారు యజ్ఞోపవీతాన్ని బ్రహ్మణ, వైశ్య, క్షత్రియులేకాక ఇతరకులాలవరూ ధరించవచ్చన్నారు. ఇప్పటికే విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, దేవాంగులు ధరిస్తున్నారు. దయానందసరస్వతులవారు "బ్రహ్మణి వేదగ్రహణకాలే ఉపనయనసమయే దృతంయత్సూత్రం ఇతి బ్రహ్మసూత్రం" అన్నారు. ఆయన యజ్ఞంచేయడం, జందెంధరించడం వేదాధ్యయనంచేయడం అన్నివర్ణాలవారు, స్త్రీలుకూడా చేయొచ్చన్నారు. ఆయా పుణ్యకార్యలకు సంబంధించిన నియమాలను శ్రద్ధగా, శుచిగా పాటించడమేన అర్హత అన్నారు.

 యజ్ఞోపవీతం నాలుగువేళ్ళవెడల్పుకు 24 రెట్లుండాలి. అంటే దాదాపు మనిషెత్తన్నమాట. మూడుపోగులు ఒకముడితో జందెం తయారౌతుంది. పెండ్లికాని బ్రహ్మచారి కి యీ మూడుపోగుల జందెం వేస్తారు. వివాహంతరువాత మామగారితరపున మరొకజందెం వేస్తారు. స్నానాదిసమయాలలో నగ్నంగా వుండరాదు. అలాంటి సమయాలలో దోషం కలగకుండా వుండటానికి మూడవజందెం వేస్తారు. మొలత్రాడు కూడా ఆదోషాన్ని తొలగిస్తుంది. అంతేగాదు మనకు ఉత్తరీయం తప్పనిసరి. అదిలేని సమయాల్లో, యీ ముడవజందెం ఉత్తరీయంతో సమానమౌతుంది. ఇక నాల్గవజందెం కూడా కొందరు ధరిస్తారు. అది అత్యవసర సమయాలలో యెవరికైనా జందెం తెగిపోతే, తత్కాలికంగా ధరించడానికి, దానంగా యివ్వటానికి పనికివస్తుంది. దానంగాపొందిన జందెం వీలైనంతతొందరగా మార్చుకొని క్రొత్తది ధరించాల్సి వుంటుంది.

 యజ్ఞోపవీతంలోని మూడుపొగులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం. ఆమూడుపోగులకున్నముడిని బ్రహ్మముడి లేక బ్రహ్మగ్రంథి అంటారు. ఆముడి త్రిమూర్తులు యేకమైయుండుటను సూచిస్తుంది. యజ్ఞోపవీతాన్ని ధరించేటప్పుడు తీసివేయాల్సి వచ్చినప్పుడు మంత్రయుక్తంగా పద్దతిప్రకారం చేయాల్సివుంటుంది. నూతనయజ్ఞోపవీతాన్ని ధరింపజేయునపుడు, యజ్ఞోపవీతాన్ని ఒకయిత్తడి లేక రాగి లేదా బంగారు పళ్ళెరంలోవుంచి, పసుపుకుంకుమలద్దుతూ, ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ || అంటూ

గాయత్రీమంత్రము చదవాలి. తర్వాత కలశజలంతో



ఓం ఆపో హిష్ఠా మయోభువః | తా న ఊర్జే దధాతన |
మహేరణాయ చక్షసే
మహేరణాయ చక్షసే | యో వః శివతమో రసః |
తస్య భాజయతే హ నః
తస్య భాజయతే హ నః | ఉషతీరివ మాతరః |
తస్మా అరంగ మామ వః
తస్మా అరంగ మామ వః | యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః//
ఆపో జనయథా చ నః//

అంటూ సంప్రోక్షణమంత్రం చదవాలి. తదనంతరం


ఓ౦! అసునీతే పునరస్మాసు చక్షు: పున:
ప్రాణమిహనోదేహి భోగమ్
జ్యోక్ పశ్యేమ సూర్యముచ్ఛర౦త
మనుమతే మృళయా న: స్వస్తి:
ఇతి ప్రాణప్రతిష్టాపన౦ కృత్వా
ఓ౦! నమో నారాయణాయ

 అంటూ ప్రాణప్రతిష్ఠ మంతాన్ని యెనిమిదిసార్లు చదవాలి, ఆతరువాత

        ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తుతేజః ||

అంటూ మంత్రోక్తంగా యజ్ఞోపవీతం యెడమభుజంమీద నుంచి కుడివైపు నడుమువరకు వ్రేలాడునట్లు ధరింపజేయాలి. పవిత్రమైన యీయజ్ఞోపవీత ధారణవల్ల అంతఃకరణశుద్ధి జరుగుతుంది. జీవునకు ఆదిమకాలంనుండి ప్రాణంతోపాటు శరీరంలో ఆత్మ నిర్ధిష్టమై యున్నది. అది ఆయుర్వృద్ధకమై సాటివారిలో అగ్రసరత్వమును కలిగిస్తుంది. తేజోబలమును చేకూరుస్తుంది. పెండ్లయినవారు కనీసం ధరించిన మూడుజంద్యాలలో కలిపి తొమ్మొది పోగులుంటాయి. ఆపోగులలోవున్న దేవతలనుస్మరిస్తూ

 

 “ ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీవాయుః

సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవఓంకారః

ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ తృతీయ నాగదైవత్యం

చతుర్థే సోమదేవతా పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ

 ప్రజాపతిః సప్తమే మారుతశ్రీ్చవ అష్టమే సూర్య ఏవ చసర్వేదేవాస్తు

సప్తమే మారుతశ్రీ్చవ అష్టమే సూర్య ఏవ చసర్వేదేవాస్తు

సప్తమే మారుతశ్రీ్చవ అష్టమే సూర్య ఏవ చసర్వేదేవాస్తు

నవమే ఇత్యేతాస్తంతు దేవతాః

అన్న మంత్రాన్ని ఉచ్ఛరించి, పూజాదికాలు చేసి కర్యక్రమాన్ని పూర్తిచేయాలి. జందెం తిసివేయాల్సి వచ్చినపుడు          

యజ్ఞోపవీతం యది జీర్ణవంతం
వేదాంత నిత్యం పరబ్రహ్మ సత్యమ్ |
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం విసృజస్తుతేజః ||

అను మంత్రమును చదివి తీసివేయాలి. తీసినజంద్యాన్ని యెవరూ త్రొక్కనిచోట, చెట్టుమీదవేయాలి లేదా నదీజలాలలో వదిలేయాలి.

   సిద్ధపురుషులు, ఋషులు జందెం ధరించనవసరంలేదు. "జగమెరిగిన బ్రాహ్మనునకు జందెంబేలా" అన్నట్లు, వారు అన్నిటికీ అతీతులు. వారు ముందుగా ధరించియుంటే, తీసివేయడం ఆఖరుసారిగనుక తలపైనుండి తేసివేస్తారు. మిగిలినవారు క్రొత్తది తలమీద నుండి ధరించి జీర్ణమైనది, పాతది శరీరం క్రిందిభాగంనుండి తొలగించుకుంటారు. నూతన యజ్ఞోపవీతం మరీచిన్నదైతే ఆయుష్షు తగ్గుతుంది. మరీపొడవైతే చేసినత్పస్సు నశిస్తుంది. మరీలావుగావుంటే కీర్తి అంతరిస్తుంది. మరీసన్నమైతే ధననష్టమౌతుంది. కనుక సమగావుండేట్లు తయారుచేసినదై వుండాలి. పొడవు తగ్గించుకొనుటకు ముడులు వేసుకోవచ్చును.

 యజ్ఞోపవీతం ఉగాదినాడు, శ్రావణపూర్ణిమ (జంద్యాల పూర్ణిమ) నాడు, సంవత్సరములో రెండుసార్లు మార్చుకోవాలి. అశౌచసమయాలలో అనగా ఆప్తుల జననమరణ సమయాల్లో అశౌచం వదిలినతరువాత మార్చుకోవాలి. గ్రహణం విడిచిన తరువాత మార్చుకోవాలి. జీర్ణమై తెగిపోయినపుడు, అమంగళకరదినాలు గడచినతరువాత జందెం మార్చుకోవాలి. ఆమార్చుకొనేరోజులు మంగళ, శనివారాలు కకుండా చూసుకోవాలి. వీలుచూసుకొని మంగళ, శనివారాలకు ముందురోజు మార్చుకుంటే సరి. గత్యంతరంలేని సమయాలలో వారాలను పరిగణనలోనికి తీసుకోకపోయినా తప్పులేదు. మలమూత్రవిసర్జన సమయాల్లో జందెం మెడలో దండవలె వుండునట్లు మార్చుకొని, తరువాత కుడిచెవికి తగిలించుకోవాలి. చెవి అగ్నిస్థానం గనుక జందెం అశుభ్రమవ్వదు, శుచిగానే వుంటుంది. అశుభకార్యములు నిర్వహించునపుడు జందెం కుడిభుజంమీద వుండేట్లు మార్చుకోవాలి.

 ఆఖరుగా మరొక్కమాట. భుజంనుంది గుండెవరకు వ్యాపించియున్న వేగస్‍నరముపై జందెంవల్ల తెలిసోతెలియకో మనం సున్నితంగానైన ఒత్తిడికలుగజేస్తూవుంటాం. అందువల్ల రక్తప్రసరణ క్రమబద్ధీకరింపబడి తద్వార మనసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత కలుగుతుంది. ఈవిధంగా కూడా యజ్ఞోపవీతం మనకు మేలుచేస్తుంది.    

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...