శ్రీశ్రీ కి జోహారు
శ్రీశ్రీ-నీ స్ఫురదరుణాంశు రుచిర
సహజప్రతిభకు జోహారు.
అభంగ తరంగ ఝరీ ప్రవహమై సాగు
నీ చైతన్య కవితాసుధలకు జోహారు
కల్లోల జనసాగర గభీరమై
జీవితానుభవ సార తీవ్రమై పొంగిన
నీ అక్షరఘోషకు జోహారు.
విదేశీ కవితానిల వీచికలకు
దేశీయ సాహితీ తావుల నలమిన
నీ వాడి తెలుగు కవిత్వ సృష్టికి జోహారు.
ప్రజాకవిత్వ యుగకర్తవై
తిక్కన వేమన గురజాడలే
తెలుగు కవిత్రయమన్న నీ
సూక్తి మయ స్ఫుర్తికి జోహారు.
యదార్థ వ్యధార్థ జీవన ఫూత్కారాలతో
ఆవేశాగ్ని కణికల రగిల్చి
తెలుగున నీవు రేపిన హుతాశన కీలకు జోహారు.
నేనుసైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి
ఆహుతుచ్చా నంటు పలికి
నాలోని "నేనును" మేల్కొల్పిన
నీ ధీరోదాత్త యోచనకు జోహారు.
రణరక్త ప్రవాహసిక్తం నరజాతిసమస్తమని
కార్మిక కర్శక ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేడని
కుమ్మరిచక్రం సాలెలమగ్గం కమ్మరికొలిమి శరణ్యమని
ఎలుగెత్తి పలికిన నీ గళానికి జోహారు.
జగన్నాధ రథచక్రాలను భూమార్గం పటించి
మరోప్రపంచపు దారికి త్రిప్పి
అగ్నికిరీటపు ధగధగలూ, హోమజ్వాలల భుగభుగలూ
జనతకు జూపిన నీ తెగువకు జోహారు.
మెరుపు మెరిస్తే వనకురిస్తే
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మాకే యని ఆనందించే
కూనలకోసం పరి స్పందించిన
నీ మృదుహృదయానికి జోహారు.
ముళ్ళగులాబీ పువ్వులు-ఆగ్రహభార్గవులు
పగబట్టిన చక్షుశ్శ్రవులు
ప్రభువులశిరస్సులపై పరుశువులని
దిగంబర కవులను మరి మరి మెచ్చి
నిర్భీతిగపలికిన నీ పలుకుకు జోహారు.
-O0O-
search: Sree Sree ki joharu
No comments:
Post a Comment