Showing posts with label Ravi chettu. Show all posts
Showing posts with label Ravi chettu. Show all posts

Saturday, 6 May 2023

రావిచెట్టు (ఆశ్వత్థవృక్షం)

 

రావిచెట్టు (ఆశ్వత్థవృక్షం)


 రావిచెట్టు మర్రిచెట్టు ఒకేజాతిజిచెందినవి. భారత్, నేపాల్, చైనా దేశాల్లో అధికంగా పెరుగుతుంది. ఇది పొడిప్రాంతాలైనా తడిప్రాంతాలైనా పెరుగుతుంది. 30  మీటర్ల వరకు పెరిగే పెద్దచెట్టు. ఆకుకొస మొనదేలిన తోకవలె వుంటుంది. ఈచెట్టును పిప్పల, ఆదిత్యా అనికూడా పిలుస్తారు.

 వినాయకస్వామిని "ఓం వినాయకాయ నమః ఆశ్వత్థ పత్రం పూజయామి" అని అర్చిస్తారు. భగవద్గీతలో కృష్ణపర్మాత్మ వృక్షాలలో నేను అశ్వత్థవృక్షాన్ని అని చెప్పారు. అందుకే రావిచెట్టు హిందువులకు పూజనీయమైంది. అశ్వత్థం దేవతలనివాసస్థానమని అధర్వణవేదం చెబుతున్నది. అంబరీషముని శాపంకారణంగా విష్ణువు రావిచెట్టుగా పుట్టాడని పద్మపురాణంలో వుంది. యజ్ఞయాగాదులలో అగ్నిపుట్టించడానికి జమ్మిమొద్దుపై రావి కొమ్మతో అటుఇటు  వేగంగా త్రిప్పడం చేస్తారు. రావిచెట్టును పూజించినవారికి పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి. రావిఆకులపై ప్రమిదలుంచి నువ్వులనూనె దీపాలు వెలిగిస్తే అనుకున్నపనులు దిగ్విజయంగా నెరవేరుతాయి. శనిగ్రహ సర్ప రాహుకేతు దోషాలే కాకుండా ఇతరగ్రహ దోషాలుకూడా తొలగిపోతాయి. ఈవిధమైన దీపారాధనలో ఆదివారం పుట్టినవారు 12 రావిఆకులపైన, సోమవారం బుధవారం పుట్టినవారు మూడురావిఆకులపైన మంగళవారం పుట్టినవారు రెండురావిఆకులపైన, గురువారం పుట్టినవారు ఐదురావిఆకులపైన, శుక్రవారం పుట్టినవారు ఆరురావిఆకులపైన, శనివారం పుట్టినవారు తొమ్మిది రావిఆకులపైన దీపాలు పెట్టాలని పూజారులు చెబుతున్నారు. ఆకుల చివరితోకలు పూజించేవారివైపు వుండాలంటారు. దీపాలకు నూనెబదులు నెయ్యివాడటం శ్రేష్టం. అందువల్ల ఆర్థిక ఇబ్బందులు శీఘ్రగతిన తొలగిపోతాయి. సంతానప్రాప్తికి 40 రోజులు రావిచెట్టుకు ప్రదక్షిణచేయాలన్నది ఆర్యోక్తి. రావిప్రదక్షిన చేయాలనుకొనేవారు ఉదయాన్నే నదీస్నానంచేసి కుంకుమబొట్టు పెట్టుకోవాలి. ప్రదక్షణ సమయంలో "మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమోనమః" అన్నశ్లోకాన్ని పఠిస్తూ ప్రతిప్రదక్షకొకసారి చెట్టును తగలకుండా  నమస్కరించాలి.

  బ్రహ్మాండపురాణంలో మరిన్ని విశేషాలున్నాయి. అశ్వత్థవృక్ష దక్షిణ, పశ్చిమ, ఉత్తరదిక్కు శాఖలలో త్రిమూతులు, తూర్పుదిక్కు శాఖలలో ఇంద్రదిదేవతలూ, సప్తసముద్రాలు, సమస్తపుణ్యనదులూ, వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు , నాలుగువేదాలు ఉన్నాయి. వృక్షాన్నాశ్రయించి ఆష్టవసువులు ఉంటారు. ఓంకారంలోని "" కారం మూలంలోనూ, ""కారం మానులోను, "" కారం పళ్ళలోను  ఉంటుందని బ్రహ్మండపురాణం చెబుతున్నది.    

  జాతకంలో శని రాహుకేతువుల దోషమున్నవారు చెట్టుచుట్టూ తొమ్మిది ప్రదక్షినలు చేయాలి. ముఖ్యంగా శనిదోషమున్నవారు శనివారం చెట్టును తాకి "ఓం కోణః పింగళోబభ్రుః కృష్ణో రౌద్రాంతకాయకో యమః శౌరీశ్శనై శ్చరో మదః పిప్పలదేవ సంస్థుతః" అని పఠిస్తూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణచేయాలి. శనివారంతప్ప మిగిలినరోలలో రావిచెట్టును తాకరాదు. అట్లే చైత్ర, ఆషడ, పుష్యమాసాలలోను, గురు శుక్రమౌడ్యాలలోనూ, గ్రహణసమయాల్లోనూ, మైలపడిన సమయాల్లోనూ, రాత్రిభోజనానంతరమూ ప్రదక్షిణలు చేయరాదు. మొదలుపెట్టేటప్పుడు కృష్ణపక్షమై వుండకూడదు.

 

 ఉపనయన సమయాల్లో రావికొమ్మకుపూజ తప్పనిసరి. వివాహ సమయాల్లో వరుడు రాగిమండ భుజంపై ధరించి కాశీయాత్రకు బయలుదేరడమూ,అతన్ని వధువుపక్షంవారు బ్రతిమాలి పిలుచకవచ్చి వివాహంజరిపించడమూ ఒక ఆనవాయితీ. యజ్ఞంలో రావికట్టెలు సమిధలుగా వాడితీరాలి.

 

 గురువారం అమావాస్య కలిసివచ్చిన రోజున రావిక్రింద వేదవిప్రునికి భోజనంపెడితే కోటిమంది బ్రహ్మణులకు సమారాధన చేసినపుణ్యఫలం దక్కుతుంది. అంతేగాకుండా ఇటువంటి దినమే రావిచెట్టుక్రింద పుణ్యస్నానమాచరిస్తే, పాపాలన్నీ తొలగిపోతాయి. రావిచెట్టుక్రింద గాయత్రీ జపంచేస్తే నాలుగువేదాలూ చదివిన ఫలితం దక్కుతుంది. రావిచెట్టునునాటి పోషించిన వారియొక్క 42 తరాలవారికి స్వర్గం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

కుజదోషమున్నవారు, రావిమొదట్లో పచ్చిపాలుపోసి తడిసినమట్టితో నుదుటబొట్టు పెట్టుకుంటే దోషం తొలగిపోతుంది. రావిచెట్టును విష్ణుమూర్తిగానూ, వేపచెట్టును లక్ష్మీదేవిగానూ,తలంచి యీరెండుచెట్లూ కలసివున్నచోట వీటికి పెండ్లిజరిపిస్తే పెండ్లికాక ఆలస్యమౌతున్నవారికి దోషాలు తొలగిపోయి అతితొందరలో పెండ్లిజరుగుతుందన్న ప్రగాడవిశ్వాసం హిందువులకున్నది.  జైన బౌద్ధమతాలలోకూడా రావిచెట్టుకు గౌరవస్థానమున్నది. గౌతమబుద్ధునకు రావిచెట్టుక్రిందనే జ్ఞానోదయమైనది. అందుకే రావిచెట్టును బోధివృక్షమంటున్నారు. బుద్ధగయలో ఇప్పుడున్న బోధివృక్షం క్రీ.పూ 288 వ సంవత్సరం నాటిదని చరిత్రకారులు అంచనావేస్తున్నారు.
 రావిచెట్టును ఇంట్లో పెంచుకోకూడదన్న విషయం అవాస్తవం. కానీ రావివేర్లు చాలాదూరం లోతుగాప్రాకి ఇంటిగునాదులను పెగలించివేస్తాయనే భయంతో దీన్ని ఇంటిసమీపంలో పెంచుకోరు. పూర్వం కపిలబావులచెంత ఎద్దులకు మనుషులకు నీడకోస రావిచెట్ట్లను పెంచుకునేవారు. రావికొమ్మలనుండి తీసిననారతో గట్టితాళ్ళు రైతులు తయారుచేసుకొనేవారు.

 

ఆయుర్వేదంలోకూడా అశ్వత్థవృక్షం ఎక్కువగానే  ఉపయోగపడుతున్నది. రావిపుల్లలు ఎండబెట్టి, వాటిని నేతిలోతడిపి కాల్చి భస్మంచేసి, ఆభస్మాన్ని తేనెతో తగుమాత్రం సేవిస్తే శ్వాసకోశవ్యాధులు నయమౌతాయి. రావిచెట్టుగాలి ఆమ్లజనితం కావడంవల్ల స్త్రీలగర్భకోశ సమస్యలను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో వుంచుతుంది. మంచి ఉత్సాహాన్నిస్తుంది. హోమియోపతీలో  Ficus Religiosa అనేపేరుతో మందు దొరుకుతున్నది. ఇది రక్తస్రావాలను నిలుపుతుంది.  స్త్రీల అధికఋతుస్రావాల రుగ్మతను నయంచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులలో   కూడా యీ మందువాడి  నయంచేస్తున్నారు.                                               

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...