పోలిచర్ల సుబ్బరాయుడు - జీవనరేఖలు
కవిగా, ప్రవచనకర్తగా,
నాటకకర్తగా, నటుడిగా, సాహిత్య సంస్థల కార్యదర్శిగా ప్రసిద్ధులు పోలిచెర్ల సుబ్బరాయుడుగారు.
సుబ్బరాయ కవిగా ప్రఖ్యాతుడైన పోలిచెర్ల సుబ్బరాయుడుగారు
18-07-1949 న కడపజిల్లా అట్లూరు మండలం జొన్నవరం గ్రామంలో జన్మించారు. శ్రీమతి చిన్న
సుబ్బమ్మ,
శ్రీ పిచ్చయ్యగార్లకు ద్వితీయ సంతానం వీరు. రహదార్లు భవనములశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. పద్యగద్య మరియు నాటకరచనలు చాలా చేశారు. మంచివక్త. భారత, భాగవత, రామాయణాది
పురాణాలపై చక్కని ఉపన్యాసాలిస్తున్న పౌరాణికుడు. ప్రవచనకర్త, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార సమితి ద్వారా అనేక ప్రాంతాలలో ప్రవచనాలు చేయటమేగాక సప్తాహాలుకూడా నిర్వర్తించారు.
పెక్కు వేదికలపై నుండి సాహిత్య ఆధ్యాత్మిక ప్రసంగాలు మరియు కవితాగానాలు చేశారు. కడప ఆకాశవాణినుంది వీరి కవితలు, ప్రసంగాలు విశేషంగా ప్రసారమయ్యాయి. వీరు రచించిన 'వాడినపూలేవికసించాయి', 'మంచిమనసుకు మంచి రోజులు', 'అంతం కాదిది ఆరంభం', ప్రకాశం', 'దూరపుకొండలు' వంటి నాటికలు, 'ఇంద్రసింహాసనం' 'మొల్ల” 'సరళమార్గం' 'రావణ విజయం' వంటి పౌరాణికనాటకాలుకూడా ఆకాశవాణి ప్రసారం చేసింది. సుబ్బరాయుడుగారు రచించిన సాంఘిక నాటకం 'చిన్నోడు పెద్దాడు' ప్రజానాట్యమండలి (అలంఖాన్ పల్లి) వారు పలు చోట్ల ప్రదర్శించారు.” ఇంద్ర సింహాసనం”, యంగ్ మెన్స్ డ్రమెటిక్అసోసియేషన్, కడపవారు, “ రావణ విజయం” సౌజన్యనాట్య కళామండలివారు ప్రదర్శించారు.
పలు ప్రభుత్వ కార్యక్రమాలకు రచనలు అందించి, అక్షరాస్యత, ఎయిడ్స్, కుష్టువ్యాధుల నివారణ, బాలకార్మికవ్యవస్థ నిర్మూలనవంటి కార్య క్రమాలకు తోడ్పడ్డారు. ఎస్.ఆర్.సి. వారి వయోజన విద్య కొనసాగింపు వర్కషాపుల్లో పాల్గొని రచనలు చేశారు. వాటిలో ఒకరోజు దొరతనం, బాలనాగమ్మ, గురువుకునామం, చంద్రహారం, ఆకుకూరలు, పండ్లతోటల పెంపకం, గాలికుంటు మొదలగునవి పుస్తకాలుగా రాష్ట్రంలో పంపిణీ చేయబడ్డాయి.
పోలిచర్లవారు "బాలలగుండెలు పదిలం" అనే నృత్యనాటిక రచించి కడప లో గవర్నర్ఎదుట ప్రదర్శిం చారు. నేటి ప్రముఖ అవధానుల అవధానాల్లో అన్ని అంశాల్లో వృచ్ఛకులుగా వ్యవహరించారు. అప్రస్తుత ప్రసంగాంశంలో తన ప్రత్యేకతను నిలుపు కున్నారు
వీరి గురువుగారైన శ్రీరామచంద్రజీ మహరాజ్ షాజహాన్‌పూర్ గారి అమృత వాక్కులను పద్యరూపంలో కైవల్యపథం' అనే పుస్తకంగా రచించారు.
సుబ్బరాయకవిగారు
మంచినటుడు కూడా. యోగివేమన, కాలజ్ఞానం, సర్పయాగం, నథింగ్ బట్ ట్రూత్, గురుబ్రహ్మ, ఇంద్రసింహాసనం,
పద్మవ్యూహం వంటి అనేక నాటికలలో చక్కని నటనను కనబరచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో ప్రత్యేకసంచికల్లో,
కవితాసంపుటాల్లోను, వైశ్యప్రబోధిని, వృద్ధజనవేదిక, పద్మాంజలి, వంటి మాసపత్రికలలో వీరి
వ్యాసాలు, కవితలు ప్రచురింపబడ్డాయి. అభినయ ఆర్ట్స్, సౌజన్యనాట్యకళామండలి, సవేరాఆర్ట్స,
రచనాసాహిత్య వేదిక, ఒంటిమిట్ట పోతన సాహిత్యపీఠం, పెద్దన సాహిత్యపీఠం, బ్రౌన్ గ్రంథాలయం,
పులివెందుల మిట్టమల్లేశ్వర సాహిత్య ఆధ్యాత్మికసంస్థ, పుష్పగిరిమరం, కడవ రామకృష్ణ మఠం
వంటి సంస్థలు వీరిని ఘనంగా సత్కరించాయి.
కర్నూలు బాలసాయిబాబా రామాయణ నాటకయజ్ఞం సందర్భంగా సుబ్బరాయకవిగారిని సత్కరించారు. చిన్న జియర్‌స్వాములవారు వస్త్రాలు బహూకరించారు. వీరు పోతన సాహిత్య పీఠం ఉపాధ్యక్షులుగాను,
దోమా వేంకటస్వామిగుప్త
సాహిత్యపీఠం కార్యదర్శిగాను, జిల్లా సాంస్కృతిక మండలి సభ్యులుగాను పనిచేశారు. సాంఘిక సేవలో కూడా చురుకైన పాత్ర వహిస్తున్నారు.
కడప కెంట్ హోమీయోఆసోషియేషన్ ద్వారా ఉచిత చికిత్సాకేంద్రానికి
సహకరిస్తున్నారు. దోమా వేంకటస్వామిగుప్త సాహిత్య పురస్కారం, పుష్పగిరిపీఠం ఉగాది పురస్కారం,
కడపజిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా కందుకూరి
వీరేశలింగంపంతులుగారిపేర, నాటకరంగపురస్కారం, వ్యాస్అవార్డు పొందారు. శ్రీరాంచంద్రాజీ
మహరాజ్ సేవాట్రస్ట్ కడప ద్వారా ప్రశిక్షకులుగా అధ్యాత్మికసేవ లందిస్తున్నారు. ప్రస్తుతం
విశ్రాంతప్రభుత్వోద్యోగిగా కడపలో జీవనం సాగిస్తున్నారు.
పోలిచర్ల వంశవార్థి సుధాంశా! సుబ్బరాయకవీంద్రా! తమనిరాడంబరతకు నిస్తుల నీతి నియమాలకు నిరుపమవిద్యాసంపత్తికి క్రమకవితా సుధానిధికి తత్వార్థ సారసంపదకు సన్మైత్రికి ధన్యాడ్యతకు స్పందించి చంద్రునకో నూలుపోగన్నట్లు రచనా సక్తితో, తమపై పద్యరచనచేసి తమకు చేరవేస్తున్నాను స్వీకరిస్తారని విశ్వశిస్తున్నాను.
ReplyDelete1. క: శ్రీ సుబ్బరాయ కవివర!
వాసిగ జీవించుచుండు వాడవు. భాషా
సేవధనుడవు ఘనుడవు
దైవాశీస్సులను నలరు ధారుణియందున్
2. ఆ.వె: పోలిచర్ల వంశ పూర్ణచంద్రుండన
నవని జన్మమంది నట్టి సుగుణ!
సత్యవర్తనమును సాగించు చున్నావు
మైత్రిధనుడ! తమను మరువబోను.
3. చ: సరసపు పల్కులున్ విమల సాత్వికభావ మరందవాహినిన్
పరమసుఖోన్నతిన్ వరలు ప్రాజ్ఞత సఖ్యత తాత్వికోన్నతిన్
వరకవితా సుధారసము వర్థిలు ధీయుత సూక్తిపంపదన్
మురహరు డిచ్చెనీకు భువి భూరియశస్సున రాణనందుమా!
4. మ: సమసద్యోగ మహామహత్వ విధమున్ ధర్మాభిధానమ్ముతో
క్షమ శౌచోన్నత నిత్యసత్యరతులై స్వాధ్వాయ సంపత్తిమై
అమలోదాత్త విశేష ధన్యధనమై అస్తోక మోక్షార్హతై
సుమనోల్లాస వికాసపూజితమునై క్షోణిన్ సదావెల్గుతన్.
5. మ: నివురున్‌గప్పిన నిప్పువోలె ప్రతిభన్ నీజ్ఞాన వారాశిన్
సువిశాలోన్నత దివ్యదీక్ష వ్రతమున్ శోభింపజేశావయా!
పవలున్‌రేయియు సభ్యమానవులు నీభవ్యైకశుద్ధాత్మనున్
అవిరామమ్ముగ నెంచుచుంద్రు సఖుడా! ఔన్నత్య విధ్యానిధీ!
స్వీకరంచువారు రచన సమర్పణ
శ్రీ పోలిచర్ల సుబ్బరాయుడు విద్వాన్ వల్లురు చిన్నయ్య ఎం.ఏ
కడప. 9966504951 రాజంపేట 9948348918