Wednesday, 8 March 2023

కొబ్బరికాయ,Coconut

 

కొబ్బరికాయ



కొబ్బరికాయను టెంకాయ, శ్రీఫలం, నారికేళం అనికూడాఅంటాఋ. ఇదిహిందువులకు అతిముఖ్యమైన పూజావస్తువు. పాంజాతికి చెందిన వృక్షమిది. ఇసుకనేలలలో బాగాపెరుగుతుంది. వందసంవత్సరాలు బ్రతుకుతుంది. ఏడుసంవత్సరాల తర్వాత ఫలిస్తుంది. ముఫ్పై మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. వేదాలలో కొబ్బరికాయ ప్రస్తావనలేదుకానీ పురావస్తుశాఖ త్రవ్వకాల్లో, ఆయుర్వేద గ్రంథాల్లో, చైనా, అరేబియా, ఇటలీ, యాత్రికుల అనుభవాలు లిఖించిన గ్రంథాల్లో నారికేళప్రస్తావన కనబడుతుంది. అమరకోశం (క్రీ.శ 500 -800)లో నారికేళం కనబడుతుంది. మనిషి ఆవిర్భానికిముందే, రెండుకోట్ల సంవత్సరాలక్రితము  నుండే కొబ్బరివుందని పురవస్తుశాఖ శిధిలాల పరిశోధనలప్రకారం నిర్ధారించారు. ఒకటి, రెండు శతాబ్దాలనుండి కొబ్బరికాయ ధార్మికకార్యక్రమాలలో వాడటం మొదలైందట. మధ్యయుగంనాటి శిలాశాసనాలలో దేవాదాయఆస్తులుగా కొబ్బరితోటలున్నాయి. చరకసంహితలో ఔషదవృక్షంగ కొబ్బరినిపేర్కొనడం జరిగింది. ఆగ్నేషియా, ఇండోనేషియా, ఆష్త్రేలియా, పసిపిక్‍దీవులు, ఇండియాలో కొబ్బరిసాగు జరుగుచున్నది. ఇండియాలోని కేరళరాష్త్రం,  ఆంద్రప్రదేశ్‍లోని కోనసీమ కొబ్బరిపంటకు ప్రసిద్ధిచెందింది.

 డిల్లీకిచెందిన పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకరశర్మగారు కొబ్బరికాయను మానవశరీరంతో పోల్చారు. పీచు టెంక అహంకారం. లోపలికొబ్బరి మనస్సు. నీరు నిర్మలత్వం. మనిషితన అహంకారాన్ని తొలగించుకొని, తననుతాను నిర్మలంగా భగవంతునికి సమర్పించుకోవడమే, అనగా ఆత్మసమర్పణమే నారికేళసమర్పణమన్నారు. కొబ్బరికాయను మరికొందరు పండితులు మనిషితలతో పోల్చారు. పైపీచు వెంట్రుకలు, గుండ్రని‍ఆకారం ముఖం, లోపలినీరు రక్తం, తెల్లటికొబ్బరి మనస్సు అన్నారు. ఇంకొందరు పెద్దలు టెంకాయకున్న మూడుకళ్ళు స్ఠూల,సూక్ష్మ,కారణ శరీరాలకు ప్రతీకలన్నారు. కొందరైతే అవి శివుని త్రినేత్రాలన్నారు. కొబ్బరివృక్షం స్వర్గంనుండి భూమికి లక్ష్మీనారాయణులచే తేబడిందని చెబుతారు. ఇది భువిపైగల కల్పవృక్షమని హిందువులుభావిస్తారు. కొబ్బరికాయను దైవారాధనకేగాదు దోషనివారణకూ ఉపయోగిస్తారు.

 ఏవిధమైన పూజచేసినా, అది యజ్ఞారంభంకావచ్చు, పెళ్ళిళ్ళలోకావచ్చు, ఉత్సవాలలోకావచ్చు, క్రొత్తవాహనానికి పూజలోకావచ్చు, గృహనిర్మాణాలకుముందు శంకుస్థాపనలలోకావచ్చు, నూతనగృహ ప్రవేశాలలోకావచ్చు, అన్నిశుభకార్యాలలో, పండుగల్లో పూజానంతరం కొబ్బరికాయకొట్టాడం హిందువుల ముఖ్యాచారం. ఇది శాంతికారకమని వారినమ్మకం. టెంకాయకొట్టేటప్పుడు ముందుగా కాయను బాగాకడిగి జుట్టుపైకుండేటట్టు పట్టుకొని దేవునిప్రార్థించి, తర్వాత జుట్టువెనక్కు త్రిప్పుకొని, ఆగ్నేయదిశలో రాయినుంచుకొని, 8,9 అడుగుల ఎత్తుకు టెంకాయనెత్తి కొట్టాలని అర్చకస్వాములు చెబుతారు. టెంకాయపగిలి నీరుబయటికి వస్తున్నప్పుడు ఆనీటితో వెంటనే అభిషేకం చేయకుండా, నీటిని వేరొకపాత్రలోనికి పట్టుకొని, రెండిచిప్పలు విడదీసి, దేవునిముందుంచి, తర్వాత పాత్రలోని టెంకాయనీళ్ళతో అభిషేకంచేయవచ్చు, లేదా ఆనేటినే తీర్థంగా స్వీకరించవచ్చు. టెంకాయ ఎలాపగిలినా దోషంలేదు. కొట్టిన తర్వాత  జుట్టును తీసేయాలి. కొబ్బరికి కుంకుమ పసుపు పూయరాదు. కొబ్బరిని తీసి చిన్నచిన్నముక్కలుగాతరిగి అందులో అటుకులు చెక్కెర లేక కలకండపొడి కలిపి ప్రసాదంగా స్వీకరించడం శ్రేయస్కరం. కొబ్బరికాయకొట్టినతర్వాత అదిక్రుళ్ళినదని తెలిస్తే, చింతింతవలసిన పనిలేదు. అంతటితో దోషాలన్నీ పోయినవని భావించాలి. అలా అనుకోలేని పక్షంలో "సర్వంసర్వేశ్వరార్పితమ్" అనిగానీ లేక "శివాయనమః" అనిగానీ నూటాయెనిమిదిసార్లు జపిస్తే సరిపోతుంది. క్రొత్తదంపతులు కొట్టిన టెంకాయలో పువ్వువస్తే త్వరలో సంతానప్రాప్తి కలుగుతుంది. టెంకాయ నిలువుకు పగిలితే కూతురికిగానీ కుమారునికిగానీ సంతానం త్వారలో కలుగుతుందని సూచనగా తెలుసుకోవాలి. ఆలయంలో కొట్టిన టెంకాయ కుళ్ళితే, దాన్నిపారవైచి, కాళ్ళుచేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీపూజచేసి టెంకాయకొట్టవచ్చును. అందువల్ల తొలిటెంకాయతో దోషంతొలగి, మలిటెంకాయతో శుభములు కలుగుతాయని పూజారులు చెబుతారు. క్రొత్తవాహనాలకు పూజచేసి కొట్టిన టెంకాయ క్రుళ్ళితే దృష్టిదోషం నివారణ జరిగిందని తలంచాలి. అవసరమనిపిస్తే మరోటెంకాయకొట్టుకోవచ్చు. లేకుంటేలేదు. పెళ్ళిపందిరిగుంజలకు కొబ్బరాకుమట్టలుకట్టి శోభను పెంచుకోవచ్చు. కొందరు శవయాత్రకేర్పరచిన పాడెపైకూడా కొబ్బరాకుమట్టనుంచి తీసుకెళతారు. శవాలకు, సమాధులకు సైతం టెంకాయకొట్టి నమస్కరించడం పరిపాటి. కలశంపైకూడా కొబ్బరికాయనుంచి అది గణపతిగా భావించి పూజిస్తాము. కొబ్బరికాయను స్త్రీలు కొట్టకూడదంటారు. కొడితే ఆస్త్రీసంతానానికి హానికలుగుతుందని భావిస్తారు. ఇది కేవలం అపోహకావచ్చు. కొన్నిదేవాలయాల్లో కొట్టిన టెంకాయ‍అర్థభాగాలు హోటళ్ళలో చట్నీకివెళితుంది. ఇంకాయెక్కువైతే నూనెతయారీకి వెళుతుంది. ఇదికూడా ఒకరకంగా సద్వినియోగమే అవుతుంది. ఎక్కువై పారవేయడం మంచిదికాదుగదా? కొందరుకోరుకొన్న కోరికలునెరవేరి, గుడిలో నూరుటెంకాయలు కొడతారు. అలాచేయడం కేవలం వారిమ్రొక్కుకావచ్చు. అంతేగానీ అదేంశాస్త్రం కాదు. కలలో కొబ్బరికాయ కనబడినా శుభదాయకమేనంటారు.

 కొబ్బరికాయ దైవప్రసన్నత కొఱకేగాక దోషనివారణకు, దరిద్రనివారణకు కూడా ఉపయోగపడుతుందంటారు. శుక్రవారం ఎఱ్ఱనిదుస్తులు ధరించి లక్ష్మీపూజచేసి, టెంకాయకొట్టి, మరుదినం కొబ్బరిచిప్పలను ఎఱ్ఱటివస్త్రంలో చుట్టి బయటివారికి కనబడకుండా ఇంట్లో దాచివుంచితే, ఆర్థికకష్టాలు తొలగిపోతాయి. శనివారం దేవాలయంలో కొట్టిన కొబ్బరిచిప్పలను నదికిసమర్పిస్తే శనిదోషం పోతుంది. ఎండుకొబ్బరిరౌండ్‍ను రెండుగకోసి అందులో చెక్కెరనింపి ఇంట్లో దాచితే రాహు కేతుదోషాలు తొలగిపోతాయి. మంగళవారం కొబ్బరికాయ, నల్లనువ్వులు, ఉద్దిపప్పు, ఒకగోరు కలిపి నల్లగుడ్డలో చుట్టి నదిలో విడిచిపెడితే సర్పదోషనివారణమౌతుంది. లక్ష్మీనారయణులను పూజించి కొబ్బరికాయ తెల్లటితీపిపదార్తం పసుపుగుడ్డలో మూటగట్టి వ్యాపారస్థలంలో వుంచుకుంటే, నష్టాలురావు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కొబ్బరికాయను తలనుండి పాదముల వరకు పదకొండుసార్లు దిగదుడిచి, దానిని నిర్జనప్రదేశంలో కాల్చివేస్తే, పిల్లలలో కంటిచూపుదోషాలు తొలగిపోతాయి. టెంకాయను ఇరవైఒక్కసార్లు తలనుండి పాదములవరకు దిగదుదిచి ఆలయఆవరణలో కాల్చివేస్తే, అనారోగ్యసమస్యలు తొలగిపోతాయి. ఇలా ఐదు మంగళ,శనివారాలు చేస్తే ఆర్థికసమస్యలుకూడా తొలగిపోతాయి. ఎఱ్ఱనివస్త్రంలో టెంకాయనుచుట్టి ఏడుసార్లు వ్యక్తి పైనుండిక్రిందకుత్రిప్పి హనుమంతుని పాదాలచెంతవుంచితే యితరుల చెడుదృష్టిదోషం తొలగిపోతుంది. ఇంట్లో కొబ్బరిచెట్టునాటితే ఉద్యోగవ్యాపారాల్లో విజయంలభిస్తుంది. గురుగ్రహం అనుకూలించి అనుకున్నపనులు నెరవేరుతాయి. చెట్టును ఇంటికి దక్షిణంలేదా పడమరదిశలో నాటడం మంచిది. చట్టపరమైన కేసులు అనుకూలించి దరిద్రంవదలిపోవాలంటే, కృష్ణ శుక్లపక్షాలు రెండింటిలో అష్టమినాడు కాలభైరవునికి కొబ్బరిదీపం వెలిగించాలి. దీనితో ఏలినాటిశని ప్రభావంకూడా తొలగిపోతుంది. ఐదు గురువారాలు వినాయకునిగుడిలో స్వామికెదురుగా టెంకాయకొట్టి, రెండుచిప్పలలో “X” ఆకారంలో ఒక్కొక్కచిప్పలో నాలుగు వత్తులువేసి వెలిగించాలి. కోరినకోరికలు నెరవేరుతాయి. కొబ్బరిదీపాలలో వత్తులు వెలగడానికి నెయ్యినిమాత్రమే వాడాలి. శివునిగుడి ద్వజస్తంభంవద్ద, అమావాస్యసాయంత్రం ఆవునేతితో కొబ్బరిదీపాలు వెలిగిస్తే విపరీతంగా బాధిస్తున్న కష్టాలు తొలగిపోతాయి. ఈవిషయంలో మనిషికి ఎన్ని సంవత్సరాల వయస్సుంటే అన్ని దీపాలువెలిగిస్తే మంచిది.

 కొబ్బరిచెట్లవలన కేవలం నమ్మకంతోనేవున్న ప్రయోజనాలేగాకుండా మనకళ్ళయెదుటే కనిపించే ప్రయోజనాలెన్నోవున్నాయి. కొబ్బరి‍ఆకుతో బుట్టలల్లుకుంటారు. కొబ్బరిపీచుతో దృడమైన తాళ్ళు తయారౌతాయి. చలువకోసం సోఫాలలో కొబ్బరిపీచును వాడుతారు. కేరళలో కొబ్బరినూనెను వంటల్లో వాడుకుంటారు. కొబ్బరినూనెను మేలైన సబ్బులతయారీలో వాడతారు. ఉప్పునీటిస్నానానికిసైతం యీసబ్బులు బాగాపనిచేస్తాయి. తలనూనెగా కొబ్బరినూనె వాడకం అందరికీతెలిసిందే. కొబ్బరితురుముపొడి కూరలలో రుచి చిక్కదనం రావడానికి వాడతారు. పచ్చికొబ్బరిచట్నీ తెలియనివారుండరు.

 కొబ్బరికి ఔషదగుణాలుకూడా ఎక్కువే. కొబ్బరిబోండానీళ్ళు నిస్సత్తువను పోగొడతాయి. ఈనీళ్ళలో గ్లూకోస్, పొటాషియం, సోడియం, వుంటాయి. ఎలక్టోలిటిన్ వుండటంవలన జలోదరంలాంటి జబ్బులలో మూత్రం సజావుగా జారీయై ఉపశమనంకలుగుతుంది. కలరా నీళ్ళవిరేచనలలో కొబ్బరినీరు ప్రాణప్రదాయినిగా పనిచేస్తాయి. శరీరంలో నీటిశాతాన్నిపెంచి రక్షిస్తాయి. పైత్యప్రకోపాన్ని తగ్గిస్తాయి. శరీరంలోని విషపదార్తాలను బయటకు నెట్టివేస్తాయి. ప్రేగులను శుభ్రపరచి విషరహితంగావిస్తాయి.                       

ఉష్ణప్రాంతాల వారికి కొబ్బరినీరు అమృతంవంటిది.  సూర్యతాపం తగ్గించి చలువచేసి శరీరఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. కొబ్బరిని పేస్టుగాచేచి రాస్తే గాయాలు మానిపోతాయి. కొబ్బరినూనె రెండు మూడు చంచాలు రాత్రిపడుకొనేప్పుడు తాగితే మలబద్దకం నివారణమౌతుంది. థైరాయిడు మస్యలు రావు. పైత్యరసాన్ని నియంత్రిస్తుంది. ఆహారం బాగాజీర్ణమౌతుంది. పొడిదగ్గు రొమ్మునొప్పికూడా తగ్గిపోతుంది. కాయముదిరితే లోపల పువ్వువస్తుంది. ఆపువ్వుజూస్ గర్భాశయానికి బలాన్నిస్తుంది. బాలింతల రక్తస్రావాన్ని అరికడుతుంది. కొబ్బరిరుబ్బి పాలుతీసుకోవచ్చు. ఈపాలలో సంతృప్త,అసంతృప్త ఆమ్లాలుంటాయి. ఎ,బి,సి,ఇ విటమిన్లు, లసిక్‍ఆసిడు, ఫాల్మటిక్,స్టరిక్,లినోలెయిక్‍ఆసిడులుంటాయి.రెట్లోప్లెవిన్, ఇనుము, క్యాల్సియమ్, భాస్వరం,పిండిపదార్తాలు, క్రొవ్వులు, ప్రొటీన్‍లు కూడా సమృద్ధిగవుంటాయి. ఇవన్నీ ఆరోగ్యప్రదాయినులే. కొబ్బరిపాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. మూత్రపిండ సమస్యలకు యివి మంచిఔషదంగా పనిచేస్తాయి. పచ్చికొబ్బరిదంచి వృషణాలకు పట్టించి గట్టిగాగోచిపెట్టుకొని రాత్రిపడుకొని తెల్లారి తీసేస్తూ, కొద్దిరోజులు చేస్తే వృషణాలవాపు బుడ్డ,వరిబీజము నయమౌతాయి. నూనెలో లారిక్‍ఆసిడు వుండటంవల్ల వంటలో  వాడుకొనేవారి గుండెకు మేలిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. నూనెలో "ఇ" విటమిన్‍కూడ వుండటంవల్ల, చర్మానికి రుద్దుకుంటే చర్మంకోమలంగా మారుతుంది. రాత్రిపడుకొనేముందు అరికాళ్ళకు అరిచేతులకు నూనె రుద్దుకుంటే నిద్రబాగా పడుతుంది. కొబ్బరిపాలు చర్మానికి పట్టిస్తే, మృతకణాలు మురికి తొలిగిపోయి శరీరం కాంతివంతమౌతుంది. ఈపాలు తలకుపట్టించుకొని స్నానంచేస్తే, వెంట్రుకలు మెరుస్తాయి. వెంట్రుకలు చిట్లకుండా కాపాడుతాయి. నూనె సూర్యరశ్మికి సన్‍బ్లాకర్‍గా పనిచేసి సూర్యకిరణతీవ్రతనుండి కాపాడుతుంది. నూనెలోని ఫాలిక్యులిటిన్ తామరవ్యాధిని అరికడుతుంది. ఆంటిబయోటిక్, ఆంటిఫంగల్ మందుగా పనిచేస్తుంది. కొబ్బరిపాలుగానీ, నూనెగానీ రాత్రిపూట ముఖానికి పట్టిస్తూవస్తే మొటిమలు తగ్గిపోతాయి. మళ్ళీమళ్ళీ ఎక్కువసార్లు ఎక్కువగా కాచిచల్లార్చిన కొబ్బరినూనె వంటలకు వాడటం మంచిదికాదని వైద్యులసలహా. కొబ్బరికున్న సుగుణాలు ఇన్నీఅన్నీ కావని, నక్షత్రాలను లెక్కపెట్టగలిగితే కొబ్బరి ప్రయోజనాలూ లెక్కపట్టవచ్చని ఫిలిప్పియన్స్ నానుడి వుండనేవుంది. అంటే లెక్కలేనన్ని సుగుణాలగని కొబ్బరి అనవచ్చు.                                         

 

 

 

 

 

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...