Thursday, 30 March 2023

నైవేద్యం -ప్రసాదం

                           నైవేద్యం -ప్రసాదం


నైవేద్యం అంటే దైవానికి సమర్పించిన ఆహరపదార్తం. ప్రసాదమంటే పూజానంతరం అందరికీపంచి మనమూస్వీకరించే పదార్తం. సాదమంటే ఆహారం.ప్ర చేర్చడంవల్ల అది మహత్తరమైంది. మనం పరిశుభ్రులమై పరిశుభ్రంగా  తయారుచేసిన ఆహారపదార్తానే దైవానికి సమర్పిస్తాం. ఆపదార్తాన్నే ప్రసాదంగా స్వీకరిస్తాం. అదికూడా మనకిష్టమైన పదార్తాన్నే నైవేద్యంగా పెడతాం. నైవేద్యం ఎంగిలిపడుతుందని రుచికుడా చూడం.   అంత శుచిగాసమర్పిస్తాం. ఎలా ఆలోచించినా భక్తితో పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం, ముక్తిదాయకం. విగ్రహరూపంలోని దేవుడు తినడుకదా? ఆంటే, ఔను తినడు. కానీ పవిత్రభావనతో తయారు చేసి ప్రశాంతచిత్తముతో సమర్పించి, భక్తిభావంతో స్వీకరించిన ఆహారం అన్ని విధాలా మేలేచేస్తుందన్నది నిర్వివాదాంశం. గ్రామదేవతల యెదుట బలులు, కొన్నికథలలో రక్తమాంసాదులు సమర్పించిన విధులు వున్నాయి. అందులో భూతదయ లేదు. హింస ప్రత్యక్షముగా కనబడుతున్నది. కనుక అటువంటి వాటిని గురించి చర్చించదలచలేదు. సాత్విక సమర్పణలు స్వీకరణలు మాత్రము శ్రేష్ఠములన్న విషయము నిర్వివాదాంశము. సాత్వికములనునవి మాత్రము దైవసృష్టికాదా? దైవమిచ్చినవే తిరిగి దైవమునకు సమర్పించుట సక్రమమా? అన్నవాదనా ఉండనే ఉండనే వున్నది. నిజమే సర్వం దైవమయం అన్న మహోన్నత సత్యాన్ని అనుభవ పూర్వకంగా గ్రహించిన మహనీయులు తమ ఆకలితీరడానికి తిన్నదంతా ప్రసాదమే, త్రాగిన నీరమంతా  తీత్థమే. ఒకసాధ్వీమణి తనకీ జన్మకు భగవంతుడిచ్చిన భర్తకు, బిడ్డలకు, అత్తమామలకు, తల్లిదంద్రులకు, నేను ప్రసాదాన్ని చేస్తున్నాను, అని సంకల్పంచేసి చేసిన సంగటిముద్ద కూడా తన వారందరికీ ప్రసాదమే ఔతుంది. అది తిన్న కుటుంబసభ్యులందరి ప్రవర్తన సక్రమంగా వుంటుంది. అయితే అంతదూరమాలోచించలేని సామాన్యజనాలు దేవుడు, దైవమనే భావనతో తాత్కాలికంగానైనా దైవచింతనతో నైవేద్యానికి సరకులు సమకూర్చుకొంటూ, నైవేద్యం తయారుచేస్తూ, దైవానికి నివేదిస్తూ, ప్రసాదంస్వీకరిస్తూ, భక్తిభావంతో కొంత సమయం గడపటానికి యీప్రక్రియ ఉపయోగపడుతున్నది. ఇలా చేస్తూపోతే, వారే క్రమేణా మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు. చివరకు అర్పణలన్నిటికన్నా హృదయార్పణమే మిన్నయన్న మహోన్నతస్థితికి చేరుకుంటారు. అందుకు భగవంతుడే దారిచూపిస్తాడు. 

 దేవుడొక్కడే నంటూనే ఒక్కొకకోరిక నెరవేరడానికి, ఒక్కోదేవునికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. ఏపేరుతో ఏనైవేద్యం సమర్పించినా అంత నాకే చెందుతున్న గీతావాక్యానుసారం, “భక్తిగలుగు కూడు పట్టెడైననుచాలు” అన్న వేమన మాటప్రకారం, కొంతైనా మేలు జరుగకపోదు గదా! ఎందుకంటే ఇక్కడ కూడా దైవమన్నభావన వున్నదిగదా! అదే ముఖ్యం. భక్తిభావం చెదిరిపోకుండా ఉండేందుకు పండితులు కొన్ని విధివిధానాల నేర్పరచినారు. నైవేద్యం పెట్టేప్పుడు "ఓం సత్యం చిత్తేన పరిషించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి స్వాహా" అని నైవేద్యంచుట్టూ, నీటిబిందువులు చిలకరించి, తర్వాత "ఓం ప్రాణాయస్వహా. ఓం ఉదానాయస్వాహా. ఓం సమానాయస్వాహా. ఓం బ్రహ్మణే" అని కుడిచేత్తో నైవేద్యాన్ని దైవానికి చూపించాలి. "మధ్యే మధ్యే పానీయం సమర్పయామి" అని నైవేద్యం మీద మళ్ళీ నీటిబందువులు సంప్రోక్షించాలి. "నమస్కరోమి" అని సాష్ఠాంగదండ ప్రణామం చేసి ఆతర్వాత అక్కడున్నవారందరూ బయటికివెళ్ళి రెండునిముషాల తర్వాత తిరిగివచ్చి, మళ్ళీ దైవానికి నమస్కరించి, అక్కడున్న వారందరికి ప్రసాదంపెట్టి తనూస్వీకరించాలి. భగవంతునిముందు విస్తరిలో సంపూర్ణభోజనం నివేదిస్తే, అది మహానైవేద్యమౌతుంది. తీర్థస్వీకరణానంతరం ఇంటియజమాని దాన్ని భక్తితో  భుజించవచ్చును. ఇది సామాన్యులు సులువుగా చేయదగిన విధానము. ఇదికూడా పాటించకుండా, ఎందరుభక్తులు తమ యిష్టదైవానికి తమకిష్టమైన నైవేద్యంపెట్టలేదు? అంటూ కొందరు భక్తకన్నప్పను ఉదహరించవచ్చు. సరే అన్నింటికి మూలం భక్తి. భక్తిముఖ్యంగానీ విధివిధానాలంత ముఖ్యంగాదని చెప్పిన పెద్దలూ ఉన్నారు. సరే అలాగే ననుకున్నాం, "లొకో భిన్నరుచిహిః" అన్న నానుడి ఉండనేఉన్నది గదా!

 ఇక నైవేద్యం ఏమి సమర్పిస్తే, ఏఫలితం వస్తుందోకూడా పూజారులు తెలియజేశారు. అదీ సరేమరి! ఏదో ఫలితమాశించైనా దైవాన్ని తలచుకుంటున్నారు గదా! అదీ కొంతలోకొంత మంచిదేననుకున్నాం.  ఇక అవిషయానికొస్తే, కొబ్బరికాయ సమర్పిస్తే పనులు సానుకూలంగా నెరవేరుతాయట. అలాగే కమలాపండ్లు సమర్పిస్తే నిలచిపోయిన పనులలో కదలికవచ్చి సనుకూలంగా పూర్తౌతాయట. మమిడిపండు వల్ల పాతబాకీలు వసూలౌతాయట. చెల్లించవలసిన బాకీలు సకాలంలో చెల్లించగలుగుతారట. గణపతికి తేనె మామిడిపళ్ళరసం సమర్పిస్తే మోసంచేయడానికి వచ్చినవారు కూడా మారిపోయి మేలుచేస్తారట. సపోటాపండు సమర్పిస్తే, సంబంధాలు తొందరగా కుదిరి వివాహాలు శీఘ్రంగా జరుగుతాయట. చిన్న అరటిపండ్లు సమర్పిస్తే, పనులు వేగంగా పూర్తై, కార్యసిద్ధి కలుగుతుందట. అరటిగుజ్జు సమర్పిస్తే, శుభకార్యాలకు అడ్డంకులు తొలగిపోయి, నష్టాలనుండి బయటపడతారట. నేరేడుపండు భోజనంతోసహ నివేదిస్తే, అన్నపానాదులకు లోటురాదట. నేరేడుపండ్లు శనిదేవునికి సమర్పిస్తే, నడుము, మోకాళ్ళనొప్పులు నయమౌతాయట. ఈపండ్లు శివకేశవులకు సమర్పిస్తే, సమస్త శుభాలూ చేకూరుతాయట. ద్రాక్షపండ్లు సమర్పిస్తే, పక్షపాతం నయమౌతుందట. సుఖసంతోషాలు కలుగుతాయట, జామపండ్లు సమర్పిస్తే, ఉదరకోశవ్యాధులు నయమౌతాయట. వ్యాపారాభివృద్ధి జరుగుతుందట. ఈపండ్లు దేవికి సమర్పిస్తే, చెక్కెరవ్యాధి తగ్గుతుందట. దాంపత్యకలహాలు తొలగిపోయి, సంతానభివృద్ధి జరుగుతుందట. సంఘంలో  గౌరవం పెరుగుతుందట. గణపతి అనుగ్రహం కొఱకు ఉండ్రాళ్ళు వినాయకచవితినాడు సమర్పిస్తారు. శ్రీరామనవమికి వడపప్పు పానకం సమర్పిస్తారు. కృష్ణాష్టమికి వెన్నముద్దలు సమర్పిస్తారు. ఉట్టికొట్టేవేడుక జరుపుకుంటారు.

 అందరికీ తెలిసిన ప్రసాదాలు వుండనే వున్నాయి. తిరుపతి వేంకటేశ్వరునికి చాలాచాలా నైవేద్యాలే సమర్పిస్తారు. లడ్డూ, వడ మాత్రం చెచ్చుకోకుండా, పంచకుండా వుండలేరు. శబరిమల అయ్యప్ప ప్రసాదం అదోరకం. చిన్నచిన్న డబ్బలలో తెచ్చి పంచిపెడుతుంటారు. పేరుపొందిన దేవాలయాలన్నిటిలో రకరకాల ప్రసాదాలు యిస్తున్నారు, భక్తులు తెచ్చుకొని తాముస్వీకరించి, యితరభక్తులకూ పంచుతున్నారు.  ఏదియేమైనా సమర్పించేది, పత్రం, పుష్పం, ఫలం తుదకు తోయమైనా ( జాలమైనా) సరే, మనస్సులో సమర్పణభావం, శ్రద్ధ, భక్తి, ఉంటే అదిసార్థకమౌతుంది. శ్రీరాంచంద్రజీ తమ సహజమార్గ విధానంలో  నైవేద్య సమర్పణ మరొక పద్దతిలో చెప్పారు. వారు బూంది (లడ్డుపొడి) ని పెట్టి,  మానవ సమాజోద్ధరణకు పాటుబడిన మహనీయుల నావాహనజేసి, యీఆహార పదార్తమును శక్తివంతముజేసి, స్వీకరించిన వారందరికి ఆత్మోన్నతి  కలుగజేయు నట్టిదిగా జేయుడని వినమ్రతతో ప్రార్థించి, తొలుత పిల్లలకు పెట్టి, తర్వాత  మిగిలివారందరూ స్వీకరిస్తారు. ఈవిధానంలో దేవుడు తినడమన్నది లేదు. చాలాసమర్థనియముగా కుడా ఉన్నది.        

ఏదిఏమైనా,  కోరికలులేని, నిష్కామభక్తితో చేసిన సమర్పణ ఉత్తమోత్తమం. అలాకాక యాంత్రికంగా యెదోచేశాం, అయిపొయింది, అనే పద్దతిలోచెసే పూజలు, పెట్టే నైవేద్యాలు స్వీకరిచే ప్రసాదాలూ నిరుపయోగమని గ్రహించి, భక్తిని ఇష్టంగా పాటిద్దాం. భగవదనుగ్రహనికి పాత్రులమౌదాం.  కడకు హృదయార్పణకు మించిన సమర్పణ మరొకటిలేదన్న సత్యన్ని గ్రహించి, భగవంతుని శరణుజొచ్చి తరిద్దాం.                         

 

         

 

 

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...