Saturday, 6 May 2023

రావిచెట్టు (ఆశ్వత్థవృక్షం)

 

రావిచెట్టు (ఆశ్వత్థవృక్షం)


 రావిచెట్టు మర్రిచెట్టు ఒకేజాతిజిచెందినవి. భారత్, నేపాల్, చైనా దేశాల్లో అధికంగా పెరుగుతుంది. ఇది పొడిప్రాంతాలైనా తడిప్రాంతాలైనా పెరుగుతుంది. 30  మీటర్ల వరకు పెరిగే పెద్దచెట్టు. ఆకుకొస మొనదేలిన తోకవలె వుంటుంది. ఈచెట్టును పిప్పల, ఆదిత్యా అనికూడా పిలుస్తారు.

 వినాయకస్వామిని "ఓం వినాయకాయ నమః ఆశ్వత్థ పత్రం పూజయామి" అని అర్చిస్తారు. భగవద్గీతలో కృష్ణపర్మాత్మ వృక్షాలలో నేను అశ్వత్థవృక్షాన్ని అని చెప్పారు. అందుకే రావిచెట్టు హిందువులకు పూజనీయమైంది. అశ్వత్థం దేవతలనివాసస్థానమని అధర్వణవేదం చెబుతున్నది. అంబరీషముని శాపంకారణంగా విష్ణువు రావిచెట్టుగా పుట్టాడని పద్మపురాణంలో వుంది. యజ్ఞయాగాదులలో అగ్నిపుట్టించడానికి జమ్మిమొద్దుపై రావి కొమ్మతో అటుఇటు  వేగంగా త్రిప్పడం చేస్తారు. రావిచెట్టును పూజించినవారికి పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి. రావిఆకులపై ప్రమిదలుంచి నువ్వులనూనె దీపాలు వెలిగిస్తే అనుకున్నపనులు దిగ్విజయంగా నెరవేరుతాయి. శనిగ్రహ సర్ప రాహుకేతు దోషాలే కాకుండా ఇతరగ్రహ దోషాలుకూడా తొలగిపోతాయి. ఈవిధమైన దీపారాధనలో ఆదివారం పుట్టినవారు 12 రావిఆకులపైన, సోమవారం బుధవారం పుట్టినవారు మూడురావిఆకులపైన మంగళవారం పుట్టినవారు రెండురావిఆకులపైన, గురువారం పుట్టినవారు ఐదురావిఆకులపైన, శుక్రవారం పుట్టినవారు ఆరురావిఆకులపైన, శనివారం పుట్టినవారు తొమ్మిది రావిఆకులపైన దీపాలు పెట్టాలని పూజారులు చెబుతున్నారు. ఆకుల చివరితోకలు పూజించేవారివైపు వుండాలంటారు. దీపాలకు నూనెబదులు నెయ్యివాడటం శ్రేష్టం. అందువల్ల ఆర్థిక ఇబ్బందులు శీఘ్రగతిన తొలగిపోతాయి. సంతానప్రాప్తికి 40 రోజులు రావిచెట్టుకు ప్రదక్షిణచేయాలన్నది ఆర్యోక్తి. రావిప్రదక్షిన చేయాలనుకొనేవారు ఉదయాన్నే నదీస్నానంచేసి కుంకుమబొట్టు పెట్టుకోవాలి. ప్రదక్షణ సమయంలో "మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమోనమః" అన్నశ్లోకాన్ని పఠిస్తూ ప్రతిప్రదక్షకొకసారి చెట్టును తగలకుండా  నమస్కరించాలి.

  బ్రహ్మాండపురాణంలో మరిన్ని విశేషాలున్నాయి. అశ్వత్థవృక్ష దక్షిణ, పశ్చిమ, ఉత్తరదిక్కు శాఖలలో త్రిమూతులు, తూర్పుదిక్కు శాఖలలో ఇంద్రదిదేవతలూ, సప్తసముద్రాలు, సమస్తపుణ్యనదులూ, వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు , నాలుగువేదాలు ఉన్నాయి. వృక్షాన్నాశ్రయించి ఆష్టవసువులు ఉంటారు. ఓంకారంలోని "" కారం మూలంలోనూ, ""కారం మానులోను, "" కారం పళ్ళలోను  ఉంటుందని బ్రహ్మండపురాణం చెబుతున్నది.    

  జాతకంలో శని రాహుకేతువుల దోషమున్నవారు చెట్టుచుట్టూ తొమ్మిది ప్రదక్షినలు చేయాలి. ముఖ్యంగా శనిదోషమున్నవారు శనివారం చెట్టును తాకి "ఓం కోణః పింగళోబభ్రుః కృష్ణో రౌద్రాంతకాయకో యమః శౌరీశ్శనై శ్చరో మదః పిప్పలదేవ సంస్థుతః" అని పఠిస్తూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణచేయాలి. శనివారంతప్ప మిగిలినరోలలో రావిచెట్టును తాకరాదు. అట్లే చైత్ర, ఆషడ, పుష్యమాసాలలోను, గురు శుక్రమౌడ్యాలలోనూ, గ్రహణసమయాల్లోనూ, మైలపడిన సమయాల్లోనూ, రాత్రిభోజనానంతరమూ ప్రదక్షిణలు చేయరాదు. మొదలుపెట్టేటప్పుడు కృష్ణపక్షమై వుండకూడదు.

 

 ఉపనయన సమయాల్లో రావికొమ్మకుపూజ తప్పనిసరి. వివాహ సమయాల్లో వరుడు రాగిమండ భుజంపై ధరించి కాశీయాత్రకు బయలుదేరడమూ,అతన్ని వధువుపక్షంవారు బ్రతిమాలి పిలుచకవచ్చి వివాహంజరిపించడమూ ఒక ఆనవాయితీ. యజ్ఞంలో రావికట్టెలు సమిధలుగా వాడితీరాలి.

 

 గురువారం అమావాస్య కలిసివచ్చిన రోజున రావిక్రింద వేదవిప్రునికి భోజనంపెడితే కోటిమంది బ్రహ్మణులకు సమారాధన చేసినపుణ్యఫలం దక్కుతుంది. అంతేగాకుండా ఇటువంటి దినమే రావిచెట్టుక్రింద పుణ్యస్నానమాచరిస్తే, పాపాలన్నీ తొలగిపోతాయి. రావిచెట్టుక్రింద గాయత్రీ జపంచేస్తే నాలుగువేదాలూ చదివిన ఫలితం దక్కుతుంది. రావిచెట్టునునాటి పోషించిన వారియొక్క 42 తరాలవారికి స్వర్గం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

 

కుజదోషమున్నవారు, రావిమొదట్లో పచ్చిపాలుపోసి తడిసినమట్టితో నుదుటబొట్టు పెట్టుకుంటే దోషం తొలగిపోతుంది. రావిచెట్టును విష్ణుమూర్తిగానూ, వేపచెట్టును లక్ష్మీదేవిగానూ,తలంచి యీరెండుచెట్లూ కలసివున్నచోట వీటికి పెండ్లిజరిపిస్తే పెండ్లికాక ఆలస్యమౌతున్నవారికి దోషాలు తొలగిపోయి అతితొందరలో పెండ్లిజరుగుతుందన్న ప్రగాడవిశ్వాసం హిందువులకున్నది.  జైన బౌద్ధమతాలలోకూడా రావిచెట్టుకు గౌరవస్థానమున్నది. గౌతమబుద్ధునకు రావిచెట్టుక్రిందనే జ్ఞానోదయమైనది. అందుకే రావిచెట్టును బోధివృక్షమంటున్నారు. బుద్ధగయలో ఇప్పుడున్న బోధివృక్షం క్రీ.పూ 288 వ సంవత్సరం నాటిదని చరిత్రకారులు అంచనావేస్తున్నారు.
 రావిచెట్టును ఇంట్లో పెంచుకోకూడదన్న విషయం అవాస్తవం. కానీ రావివేర్లు చాలాదూరం లోతుగాప్రాకి ఇంటిగునాదులను పెగలించివేస్తాయనే భయంతో దీన్ని ఇంటిసమీపంలో పెంచుకోరు. పూర్వం కపిలబావులచెంత ఎద్దులకు మనుషులకు నీడకోస రావిచెట్ట్లను పెంచుకునేవారు. రావికొమ్మలనుండి తీసిననారతో గట్టితాళ్ళు రైతులు తయారుచేసుకొనేవారు.

 

ఆయుర్వేదంలోకూడా అశ్వత్థవృక్షం ఎక్కువగానే  ఉపయోగపడుతున్నది. రావిపుల్లలు ఎండబెట్టి, వాటిని నేతిలోతడిపి కాల్చి భస్మంచేసి, ఆభస్మాన్ని తేనెతో తగుమాత్రం సేవిస్తే శ్వాసకోశవ్యాధులు నయమౌతాయి. రావిచెట్టుగాలి ఆమ్లజనితం కావడంవల్ల స్త్రీలగర్భకోశ సమస్యలను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో వుంచుతుంది. మంచి ఉత్సాహాన్నిస్తుంది. హోమియోపతీలో  Ficus Religiosa అనేపేరుతో మందు దొరుకుతున్నది. ఇది రక్తస్రావాలను నిలుపుతుంది.  స్త్రీల అధికఋతుస్రావాల రుగ్మతను నయంచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులలో   కూడా యీ మందువాడి  నయంచేస్తున్నారు.                                               

Thursday, 4 May 2023

శమీవృక్షం (జమ్మిచెట్టు)

  శమీవృక్షం (జమ్మిచెట్టు)


హిందువులు పూజించే వృక్షాలలో జమ్మి ముఖ్యమైనది. ఋగ్వేదకాలమునుండి శమీప్రస్తావనవుంది. పాండవులు యీ వృక్షంమీదనే తమ ఆయుధాలను దాచియుంచి అజ్ఞాతవాసానికి వెళ్ళారు. అజ్ఞాతవాసానంతరం తిరిగి తమ ఆయుధాలను జమ్మినుండి గ్రహించేసమయంలో జమ్మిరూపంలోనున్న అపరాదేవిని పూజించి, ఆసీస్సులుపొంది కౌరవుపై విజయం సాధించారు. శ్రీరాముడు పదితలల రావణుని భీకరరూపంచూసి భీతిల్లి నిద్రించియున్న శక్తిని పూజించగా శమీరూప అపరాజితాదేవి మేల్కొని రాముని దీవించిందని దేవీపురాణంలోవుంది. ఆదీవెనలతోనే రాముడు రావణసహారం చేశాడన్నది పురాణగాధ. లంకనుండి అయోధ్యకు బయలుదేరేముందుకూడా రాముడు శమీపూజచేశాడు. శ్రీరాముడు, పాండవులు శమీపూజ చేసినరోజు విజయదశమి. అమ్మవారు మూడుమూర్తుల శక్తులతో భీకరయుద్ధం తొమ్మిదిదినాలుచేసి మహిషాసురుని సంహరించినదికూడా యీవిజయదశమి నాడే. దుర్గామాత తనకుమారులైన గణపతిని, కుమారస్వామిని చూడటానికివెళ్ళి వారిసేవలుపొంది తిగివచ్చిన దినంకూడా యీ విజయదశమిననే. అందుకే నవరాత్రులతర్వాతి విజయదశమిరోజున అందరూ శమీవృక్షరూపంలోనున్న అపరాజితాదేవిని యీ శ్లోకాలతో పూజిస్తారు.

శ్లో: శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ
    అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!!


శ్లో: కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్‌ సుఖం మయా
    తత్ర నిర్విఘ్న క‌ర్త్రీవం భవ శ్రీరామ పూజితా!

అనగా శమీవృక్షం పాపాలను శమింపజేస్తుంది. శత్రునాశం గావిస్తుంది. అర్జునిని గాండీవన్ని ఓసంవత్సరం ధరించింది. శ్రీరామునికి ప్రియాన్ని కలిగించింది. రామునిచే పూజింపబడింది .     ఎడారియాత్రికులకు జైత్రయాత్రకు ( యుద్ధానికి) వెళ్ళేవారికి  సౌఖ్యావిజయాలనిస్తున్నది. సమస్తకార్యాలనూ నిరాటంకంగానూ విజయవంతంగానూ కొనసాగింపజేస్తున్నది అని అర్థం.

శమీపూజానంతరం పై శ్లోకాలను, చీటీపై వ్రాసి జమ్మిచెట్టుకు కడతారు. అందువల్ల అమ్మవారి అనుగ్రహంతోపాటు, శనిగ్రహదోషం కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. శమీపూజానంతరం పాలపిట్టనుచూడటం శుభకరమంటారు. ఆతర్వాత ఇళ్ళకువెళుతూ, జమ్మిఆకులను తీసుకవచ్చి పెద్దల చేతిలోపెట్టి బంగారం తీసుకోమంటారు. ఈబంగారం లక్ష్మీదేవికి ప్రతీక. కర్నాటరాజ్యంలో దీనికిసంబంధించి ఒకకథ ప్రచారంలోవుంది. గురుమహానా అనే గురువుగారి గురుకులంలో శమీవృత్  అనే పేదబాలుడు, వృక్షిత్ అనే  రాకుమారుడు విద్యనభ్యసించారు. గురువుకు గురుదక్షిణ సమర్పించి ఇళ్ళకు వెళ్ళవలసిన సమయమొచ్చింది. గురువు యిప్పుడుకాడు మీరువెళ్ళి స్థిరపడండి, తర్వాత్ నేనే వచ్చి మీనుండి దక్షిణ గ్రహిస్తానన్నాడు. అన్నట్లే గురువు తొలుత రాకుమారుడు వృక్షిత్ దగ్గరకు వెళ్ళాడు. వృక్షిత్ ఎవ్వరూ యివ్వలేనంత ధనరాసులు,విరివిగా బంగారునాణాలు సమర్పిచాడు. ఇతరవిద్యార్థులు యేమిస్తారో తెలుసుకోవాలని మారువేషంలో గురువును అనుసరించాడు. గురువు పేదవాడైన శమీవృత్  యింటికెళ్ళాడు. అతడి పరిస్థితిచూసి గురువు శిష్యా! నాకు నీ పెరటిలోని శమీమొక్కను (బన్నీమొక్కను ) దక్షిణగాయివ్వు అన్నాడు. వెంటనే దాన్ని తీసుకెళ్ళి నాఆశ్రంలో నాటూ అన్నాడు. మారువేషం తీసేసి రాకుమారుడు వృక్షత్ పకపకానవ్వి, శమీవృత్‌ను ఎగతాళిచేశాడు. గురువు ఏమీమాట్లాడకుండా శిశ్యులిద్దరినీ ఆశ్రమం తీసుకెళ్ళి ముందు శమీమొక్కను నాటమన్నాడు. మొక్కనాటినవెంటనే శమీమొక్క ఒకప్రక్క ఆకులురాలుస్తూ మరోప్రక్క చిగురించడం మొదలుపెట్టింది. రాలిన ఆకులన్నీ బంగారునాణాలుగా మారసాగాయి. అవన్నీ గుట్టలుగుట్టలుగా ప్రోగై రాకుమారుని గురుదక్షిణకన్నా ఎన్నోరెట్లు ఎక్కువయ్యాయి. రాకుమారుని దగ్గరకు తీసుకొని గురువు శమీవృత్ తో స్నేహంగా మెలగమన్నాడు. గురువుచెప్పినట్లే యిద్దరూ మంచిమిత్రులయ్యారు. అప్పటినుండి ఆప్రాంతంలో "బన్నీ బంగారు వాగోనా" అన్న నానుడి ప్రచారంలోని కొచ్చింది. దీనికి రెండర్థాలు చెబుతారు. రండి మనం శమీదళాలవలె బంగారంగా మారుదాం అని ఒక అర్థమైతే, రెండఅర్థం మనం శమీవృత్‌వృక్షిత్‌లాగా (శమీవృక్షంలాగా) బంగారుబంధమై ఉందాం,అని

దేవదానవులు అమృతంకోసం సముద్రమథనం చేసినపుడు, ఆవిర్భవించిన వృక్షాలలో శమీవృక్షంకూడా వుంది. వనవాస సమయంలో శ్రీరాముడు జమ్మివృక్షంక్రిందనే సేదదీరినాడట. అంతేకాదు  జమ్మికట్టెలతోనే కుటీరం నిర్మించుకున్నాడట. వినాయకపూజలోకూడా శమీపత్రాలు ముఖ్యమైనవి. యజ్ఞసమయంలో జమ్మిని స్త్రీకర్రగానూ, రావిని పురుషకర్రగానూ భావించి, జమ్మికర్రపైన రావికర్రను మర్థించి అగ్నిని రగిలిస్తారు. అందుకే జమ్మిని వైదికభాషలో "అరణి" అని పిలుస్తారు.                                 

జమ్మి బఠానీజాతిచెట్టు. అఫ్గనిస్తాన్, ఇరాన్, ఇండియా, ఒమన్, పాకిస్తాన్, సౌదీఅరేబియా యునైటెడ్అరబ్ఎమెరేట్స్ , యెమన్లలో  పశ్చిమ్ఆసియా అంతటా యీ జమ్మి వుంటుంది. బెహరెయిన్ దేశం  Tree of life గా దీన్ని గుర్తించింది . జమ్మి ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది. ఎడారిలోకూడా పెరగడంవల్ల ఎండతాపంనుండి రక్షణనిస్తుంది. దీనిఆకులు ఒకవైపు రాలుతున్నా మరోవైపు చిగురిస్తూనే వుంటాయి . వేళ్ళుచాలాదూరం ప్రాకి నీటిని గ్రహిస్తాయి. చెట్టుగాలి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.  అందుకే చెట్టుచుట్టూ ప్రదక్షణలు చేయమంటారు. చెట్టును ఇంటి ఆవరణలో నాటుకుంటే శుభకరమని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇంటికిముందు తూరుపుదిక్కున శనివారమునాడు నాటుకోవడం మంచిది. ఇంటి ప్రధానద్వారం  కుడివైపు కుండీలోకూడ పెంచుకోవచ్చు అలాచేస్తే ఇంట్లోనికి సకారాత్మకశక్తులను రానిచ్చి నకారాత్మకశక్తులను యీమొక్క  అడ్డుకొంటుంది. శమీ ముళ్ళచెట్టుగనుక యింట్లో నాటుకోవడంలేదు. ముస్లింలు దీన్ని హజరత్ అల్ హయాత్ అని పిలుస్తారు. అరబ్ఎమిరేట్స్ దేశానికిది జాతీయవృక్షం. మన రాజస్తాన్, తెలంగాణా కుకూడా యిది రాష్ట్రవృక్షం.

ఆయుర్వేదరీత్యాకూడా  జమ్మి చాలా ఉపయుక్తమైన ఔషదమొక్క. జమ్మిఆకులపసరు పుండ్లకురాస్తే తొందరగా మానిపోతాయి. జమ్మిపూలను పంచదారతో కలిపిసేవిస్తే గర్భస్రావం జరగదు. జమ్మిబెరడు  దగ్గు ఉబ్బసాన్ని నయంచేస్తుంది. విరేచనాలను అరికడుతుంది. నరాలకు బలాన్నిస్తుంది. మొలలను తగ్గిస్తుంది. కండరాలలో యేర్పడిన గడ్డలను కరిగిస్తుంది. చెట్టునుండి స్రవించే జిగురు (బంక) లో చాలా పోషకాలున్నాయి. గర్భవతులకిది అమృతం  లాంటిది.  


Tuesday, 2 May 2023

జిల్లేడు (అర్క)

 

జిల్లేడు (అర్క)



జిల్లేడు ఒక పాలుగలమొక్క. పూలరంగునుబట్టి యీ చెట్టు మూడు రకాలు. తెల్లజిల్లేడు, ఎఱ్ఱజిల్లేడు, రాజుజిల్లేడు. సుమారు రెండుమూడు మీటర్లవరకు యీచెట్టు పెరుగుతుంది. దూదివంటినూగు చెట్టంతా కప్పబడి వుంటుంది. ఆకులు దళసరిగా వుంటాయి. పండియెండిన దీనికాయలనుండి తెల్లని మృదువైన దూదివుంటుంది. ఆశియాదేశాలన్నిటిలో జిల్లేడు లభిస్తుంది.

హిందూమతవ్యవస్థలో జిల్లేడుకు ప్రత్యేకస్థానమున్నది. వినాయకచవితి పర్వదినాన, గణపతివ్రతకల్పవిధానంలో జిల్లేడుఆకులతో గణపతిని ముఖ్యంగా పూజిస్తారు. రథసప్తమినాడు యీ ఆకులు తలపై ధరించి నదీస్నానంచేస్తే గొప్పపుణ్యమని నమ్ముతారు. తెల్లజిల్లేడుదూది వత్తులతో ఇప్పనూనెదీపాలు ఐదింటిని ఐదువారాలపాటు వెలిగిస్తే హనుమంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేగాక తెల్లజిల్లేడుపూలతో శివపూజ, ఆకులతో సూర్య(అర్క)పూజచేస్తే శుభప్రదమని భావిస్తారు. తెల్లజిల్లేడును ఇంట్లో పెంచుకుంటే గణపతి ఇంట్లో వున్నట్లేనని పండితులు చెబుతారు. అష్టైశ్వర్యాలు కలుగుతాయని, యీతిబాధలు తొలగిపోతాయని, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులు రాణిస్తారనీ,  సర్వకార్యాయూలు  జయప్రదంగా నెరవేరుతాయనినీ  పెద్దలుసూచించారు. పుష్యమీనక్షత్ర ఆదివారంగానీ, గురువారంగానీ "పుషార్కయోగం" ఆరోజున తెల్లజిల్లేడుచెట్టును నాటి పూజచేయడం శ్రేయస్కరంమని పండితులు సెలవిచ్చారు.  పూజకు ఎఱ్ఱమందారంపూలు, ఎఱ్ఱచందనం శేష్ఠం.  కొన్ని తెల్లజిల్లేడువేళ్ళు గణపతి ఆకారంలో వుంటాయి. ఇటువంటివి కాణిపాకం వినాయకాలయం చెంత అమ్ముతుండుటం గమనించవచ్చు. ఇవి పూజకు ఉత్తమమని పూజారులు సెలవిస్తున్నారు. జిల్లేడుచెట్లు విరివిగాగల  గ్రామాల్లో పంటలు బాగాపండుతాయని ప్రతీతి. ఈచెట్లు పాడుబడినయిళ్ళలో ఎక్కువగా మొలవడంవల్ల,  మీయింట్లో "జిల్లేళ్ళుబడ" అని శపిస్తుంటారు. అంతేగానీ జిల్లేడు అపశకునానికి కారణం కానేకాదు.

జిల్లేడు ఆయుర్వేదమూలికలలో ముఖ్యమైనది. జిల్లేడుపాలను పసుపులోకలిపి ముఖానికిరాసుకుంటే, ముఖవర్ఛస్సు పెరుగుతుంది. లేతచిగుళ్ళు తాటిబెల్లంతో కలిపినూరి కుంకుడుగిజప్రమాణం నాలుగు రోజులు రెండుపూటలా సేవిస్తే స్త్రీల ముట్టుకుట్టునొప్పి తగ్గుతుంది. జిల్లేడుపాలు దూదితో తడిపి పాముకరిచినచోట లేక తేలుకుట్టినచోట పెడితే విషం తలకెక్కదు. విషం దికివస్తుంది. దీన్ని ప్రధమచికిత్సగా చేయవచ్చును. ఆకులరసం తేనెతోకలిపి త్రాగితే, జ్వరాలు తగ్గుతాయి . ఎండినతెల్లజిల్లేడుపొడి 15 గ్రాములు,100 గ్రాముల బెల్లం, 10 గ్రాముల వామ్ముకలిపినూరి 5 గ్రాములంత మాత్రలు చేసుకొని, 40 రోజులు ఆవుపాలు లేక మంచినీటితో రోజుకోమాత్ర చొప్పున వాడితే మొండిఉబ్బసమైనా బాగౌతుంది. కీళ్ళనొప్పులకు, ఆకులకు ఆముదం పట్టించి, వెచ్చజేసి కడితే తగ్గుతాయి. ఎండినఆకులపొడి పాలతోసేవిస్తే, కడుపులో పుండ్లు మానుతాయి. ఆకులరసం విరేచనమవ్వడానికి, మలబద్ధకం పోవడానికి వాడుకోవచ్చు. దీనిపాలు నువ్వులనూనెతో కలిపి నూనెమిగిలేట్లు కాచుకొని అర్కక్షీరతైలం తయారుచేసుకోవచ్చు. ఇది నరాలబలహీనతకూ, చర్మవ్యాధుల నివారణకూ మర్ధన చేస్తారు. ఆవనూనెపట్టించి వేడిచేసినఆకులు నొప్పి వాపు వున్నచోట వేసికడితే ఉపశమనం కలుగుతుంది. జిల్లేడువేరుకాల్చిన బొగ్గుతో పళ్ళుతోముకుంటే దంతసమస్యలు రావు. ఆకులకు నువ్వునూనెగానీ ఆముదంగానీ పట్టించి, కాస్తాఉప్పు వేసినూరి పలుచటిగుడ్డలోవుంచి, రెండు మూడు చుక్కలు చెవిలోపడేట్లు పిండితే చెవిపోటు తగ్గిపోతుంది. ఆకులు అరికాళ్ళకు అంటించి సాక్సువేసుకొని రోజంతా లేక రాత్రంతా వుంచుకుంటే రక్తంలో చెక్కెర తగ్గుతుంది. జిల్లేడుపాలు కంట్లోపడితే చూపుపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గనుక జాగ్రత్తగా వుండాలి. హోమియోవైద్యంలోకూడా జిల్లేడుతో Calotropis Gigantea అనేమందు తయారుచేస్తున్నారు. ఇది ఉబ్బసం, దగ్గు, కుష్ఠు, బొల్లి, కీళ్ళనొప్పులకు మందుగా వాడుతున్నారు.                                                                 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...