Showing posts with label tulasi. Show all posts
Showing posts with label tulasi. Show all posts

Friday, 3 June 2022

tulasi, తులసి

 


తులసి

  

శ్లో: యన్మూల్యే సర్వతీర్థాని యన్మధ్యేసర్వదేవతా

                         యదగ్రే సర్వవేదాని తులసిత్వామ్ నామామ్యాహమ్//

 తులసి హిందువులకు పరమపవిత్రమైనది. దేవతాస్వరూపం తులసిని విష్ణుకామిని యని, విష్ణుభూషణమని, విష్ణుపాదస్థల నివాసినియని వైష్ణవులుభావిస్తారు. తులసితీర్థం గంగాజలంతో సమానమంటారు. తులసిలో ఏడురకాలున్నాయి. కృష్ణతులసి, రామతులసి, లక్ష్మీతులసి, విష్ణుతులసి, వనతులసి రకాలు ముఖ్యమైనవి. అన్నీ పవిత్రమైనవే, అయినా కృష్ణతులసి ప్రాముఖ్యమెక్కువ. దైవకార్యాల్లోనూ, పితృకార్యాల్లోనూ తులసీదళాలు తప్పనిసరి. ఇదిలేనిదే దేవతలనుగానీ, పితృదేవతలనుగానీ ఆవాహనచేయలేరు. దుష్టశక్తులని దరిచేరనివ్వదు. అందుకే తులసిచెట్టును ప్రతిగృహంలోనూ పెంచుకుంటారు. కోటవలె రక్షణకల్పించాలని కోటరూపంలో తొట్టిని నిర్మించుకొని అందులో తులసిచెట్టును నాటుకొని, ఇరుసంధ్యలలో దీపంపెట్టి మరీపూజిస్తారు. తులసి ప్రతికూలతలను, వాస్తుదోషాలను తొలగిస్తుంది. శుక్రగ్రహదోషంవల్ల కలిగే వైవాహికసమస్యలు రామతులసిపూజవల్ల తొలగిపోతాయి. శనిగ్రహదోషంవల్ల కలిగే ఆయుర్ధాయసమస్యలు, అనారోగ్యాలు, ఏల్నాటిశనిబాధలూ కృష్ణ(నల్ల)తులసిపూజవల్ల తొలగిపోతాయి.


 తులసికిసంబంధించి అనేకపురాణగాథలున్నాయి. ఈమెతొలుత గోలోకవాసి. తులలేని సౌదర్యవతిగావున తులసియయ్యింది. సర్వలోకాధిపతి శ్రీకృష్ణుని పరమభక్తురాలు. ఈమెది మధురభక్తి. శ్రీకృష్ణమోహంతో ఒకదినమామె మూర్చపోయింది. రాధ ఆమెనుగమనించి కృష్ణప్రేమలో నాతోపోటీపడతావా? రాక్షసివైపుట్టుమని శపిస్తుంది. గోలోకంలోనే వుంటున్న మరొకకృష్ణభక్తుడు సుధామ, తులసిని శపించడం అన్యాయమనీ, శాపమునుపసంహరించమని రాధాదేవిని ప్రాధేయపడ్డాడు. కోపంతోవున్నరాధ తులసికీనీకు యేమి సంబంధం. నీవెందుకు జోక్యంచేసుకుంటున్నావు, నీవుకూడా రాక్షసుడవై జన్మించు అని శపించేసింది తర్వాతరాధాదేవి శాంతించి, తనతప్పు తెలుసుకొని, దయచూపి, నాశాపమునకు తిరుగులేదు. అయినామీరు శ్రీకృష్ణకృపాకటాక్షమునకు పాత్రులై లోకప్రసిద్ధిగాంచెదరని దీవించింది. తులసి కాలనేమిఅనే రాక్షసుని కూతురై జన్మిస్తుంది. సుధాముడు శంఖచూడుడనే రాక్షసుడైజన్మించి తులసిని వివాహమాడుతాడు. ఇది బ్రహ్మవైవర్తపురాణగాథ, ఈపురాణంప్రకారం గోలోకంలో రాధాకృష్ణులు విరాజమానమైయుండి, లోకాలను పాలిస్తుంటారు. త్రిమూర్తులు వారిఆజ్ఞానుసారం అప్పజెప్పిన కార్యనిర్వహణ జేస్తారు. శ్రీకృష్ణుడు విష్ణువుయొక్క అవతారం కాదు. కృష్ణుడే సర్వలోకాధిపతి. శివపురాణంప్రకారం తులసిభర్తపేరు జలంధరుడు. శివుని నయనాగ్నిజ్వలనుండి ఉద్భవించినవాడు. మిలిలినకథ దాదాపు సమానమే. జలంధరుడు మహాబలవంతుడు. దేవతలను ఓడించి స్వర్గంనుండి వారిని తరిమేస్తాడు. దేవతలు శంకరుని శరణుజొచ్చి కాపాడమని ప్రార్థిస్తారు. శంకరుడు విష్ణువుతోకలసి వ్యూహరచనజేస్తాడు. శివుడు జలంధరుని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. తులసి కీడునుశంకించి తనపతికి ఆపదకలుగకుండుటకై  ధ్యానంలోనిమగ్నమౌతుంది. జలంధరునితోయుద్ధం శివునకు దుస్సహమౌతుంది. తులసిధ్యానం భంగమైతేనేగాని జలంధరుడు చావడని గ్రహించిన విష్ణువు జలంధరునిరూపంలో తులసిదగ్గరకువెళ్ళి, తులసీ! నేను యుద్ధరంగంనుండి క్షేమంగా తిరిగివచ్చాను, బ్రహ్మరాయబారంవల్ల సంధికుదిరి యుద్ధం ముగిసింది. ఇకనీవు ధ్యానం విరమించు, అన్నాడు. భర్తక్షేమంగా రణభూమినుండి తిరిగివచ్చాడని సంతోషించి తపంచాలించింది తులసి. ఇదేఅదనుగా శంకరుడు జలంధరుని సంహరించేశాడుచారులు పరుగుపరుగునవచ్చి తులసికి జలంధరుని మరణవార్త చెబుతారు. విష్ణువు నిజరూపుదాల్చి, తులసీ! జలంధరుడు లోకకంటకుడు. అతడు శివునిచే మరణించక తప్పదు. మహాపతివ్రతవైన నీధ్యానం భంగమైతేనేగాని అతడుమరణించడు. అందుకే నేనిలాచేయవలసి వచ్చిందంటాడు. తులసి కోపోద్రిక్తురాలై, విష్ణువును శిలగామారమని శపిస్తుంది. అంతేగాకుండా, నావలెనీవూ వియోగబాధననుభవింపుమని శపిస్తుంది. ఆ కారణంగా విష్ణువు గండకీనదిలో సాలగ్రామమైపుట్టి ఆరూపంలోనే పూజలందుకుంటున్నాడు. అలాగే రామావతారంలో సీతావియోగక్లేశాన్ననుభవించాడు. మహావిష్ణువు తులసి శాపాన్నిచిరునవ్వుతో స్వీకరించి ,తులసిని నిందించక, ఆమెననుగ్రహించి తులసీ! నీవు పరమపవిత్రురాలవు. మరుజన్మలో తులసిచెట్టువై పుట్టి, నాతోసమానంగా పూజలందుకుంటావు. తులసీమాలధరింపజేసి, తులసీదళములతోచేసేపూజనాకు  ప్రియాతిప్రియమైవుంటుంది, అని శ్రీమహావిష్ణువు తులసిని దీవిస్తాడు. ఇదీ తులసి పురాణగాథ.              

 

తులసిచెట్టును యింట్లో ఏదిశలోనైనా పెంచుకోవచ్చు. కానీ ఈశాన్యదిశశ్రేష్ఠం. ఇంట్లోకి గాలివచ్చు మార్గంలో పెట్టుకుంటే గాలిశుభ్రమై యింట్లోకి ప్రవేసిస్తుంది. తులసిపూజవల్ల స్త్రీలకువైధవ్యప్రాప్తి కలుగదన్నది గొప్పవిశ్వాసం. తులసి సర్వపాపనాశిని. సంస్కృతంలో తులసిని సురసా, సులభ, బహుమంజరీ, దేవదుందుభి, వృందా అనే నామాలున్నాయి.

 

తులసిమాలధారణకొక ప్రత్యేక స్థానమున్నది. తులసికాండంతో పూసలుతయారుచేసుకొని, మాలలల్లుకుంటారు. ఇవి ఎవరికివారే తయారుచేసుకోవడం మంచిది. కృష్ణజన్మస్థానమైన మథురపట్టణంలోని నిధివన్ మరియు సేవాకుంజ్ వనాలలోని తులసిచెట్లనుండి తయారుచేసినవి విక్రయిస్తారు. వీటికి ప్రత్యేకశ్రేష్ఠత కలదని విశ్వసిస్తారు. మరణమాసన్నమైనపుడు తులసితీర్థం పోస్తారు. అంతేగాకుండా తులసిమాల ధరింపజేస్తారు. అందువల్ల పాపాలన్నీ తొలగిపోయి నేరుగా వైకుంఠం వెళతారని హిందువుల ప్రగాఢవిశ్వాసం. విష్ణుభక్తులు జపంచేసుకోవడానికి తులసిమాల నుపయోగిస్తారు.    

మెడలోమాలగాకూడా నిత్యంధరిస్తారుతులసీ స్మరణేరైవ సర్వపాపం వినశ్యతి,” తులసీస్పర్శనేరైవ నశ్యంతి వ్యాదయో నృణామ్” అన్నది  అర్యోక్తి. తులసిమాల ధరించునప్పుడు,తులసితీర్థం తీసుకునేప్పుడు  యీ మంత్రంపఠించడం  అత్యంత శ్రేయోదాయకం.

      ప్రసీద దేవదేవేశి,  ప్రసీద హరివల్లభే

          క్షీరోదమాధనోద్భూతే  తులసి త్వాం నమామ్యహమ్”

 జపంవల్ల చేతిలోని ఆకుపంచర్ పాయింట్స్ పై ఒత్తిడికలిగి మానసికప్రశాంతతకు దారితీస్తుంది. మాలధారణద్వారా ఒకవిధమైన విద్యుత్ శక్తితరంగాలు ఉత్పన్నమై రక్తప్రసారం సజావుగాజరగడానికి తోడ్పడి తద్వార రక్తపోటు నియంత్రణలోవుంటుంది . ఈశక్తితరంగాలవలన సాత్వికతపెంపొంది స్వరం శ్రావ్యంగామారుతుంది. గుండె, ఊపితిత్తులు క్రమబద్ధంగా పనిచేయునట్లుచేసి రోగాలురాకుండా చూస్తుంది. అతిపురాతనమైన ఋగ్వేదంలోనూ చరకసంహితలోనూ తులసి ప్రస్తావనవుంది. ఇప్పుడుకూడా తులసిగింజలచూర్ణాన్ని, తులసిగింజలనుండి తీసిన తైలాన్ని వైద్యరంగంలో విరివిగా వాడుతున్నారు. గింజలలో ఆంటీఆక్సిడెంట్లు ఎక్కువగావుండటంవలన  రోగనిరోధకశక్తిని పెంచడమేగాకుండా, క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించి మనకు రక్షణనిస్తుంది. ఒకగ్రాము తులసిగింజలచూర్ణం రాత్రికి నీళ్ళలోనానబెట్టి ఉదయంపడగడుపున సేవిస్తే వీర్యరక్షణకు, వృద్ధికి సహాయపడుతుంది. అధికబరువునుతగ్గిస్తుంది. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రక్తనాళాలలోక్రొవ్వు నియంత్రణలోవుంటుంది. వయస్సుపెరిగినా చర్మంపై  త్వరగాముడుతలు పడనీయదు. రక్తహీనతరానివ్వదు. విత్తనాలను నమలడంద్వారా నోటిదుర్వాసన పోతుంది. సేవనంద్వారా కడుపులో నులిపురుగుగులు నశిస్తాయి. మలబద్దకం పోతుంది. చర్మవ్యాధులు నయమౌతాయి. బొల్లి, ధనుర్వాతం, ప్లేగువ్యాధులను నయంచేస్తుంది. తులసితైలం, పట్టించడంద్వారా కీటకాలకాటువల్ల కలిగే మంటను నివారిస్తుంది. గాయాలను తొందరగామాన్పుతుంది. పులిపిర్లు రాలిపోయేట్లుచేస్తుంది. కాళ్ళపగుళ్ళును మాన్పుతుంది. అంతెందుకు కరోనాకుకూడా మంచిమందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. తులసితైలాన్ని కేశతైలాలలోకూడాకూడా విరివిగావాడుతున్నారు. దీనివల్ల వెంట్రుకలురాలిపోవడం తగ్గుతుంది. తలలోపేలు, చుండ్రుపోయి జ్జాపకశక్తిని పెంచుతుంది. కంటిచూపునుమెరుగుపరుస్తుంది. ఇటువంటి ఐదువందల రుగ్మతలను నయంచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇన్ని ఉపయోగాలుగల తులసిని ఎంతశ్లాఘించినా తక్కువే ఔతుంది.  

 

 

 

 

 

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...