ఘంటానాదం

ఘంటను
గంట అనికూడా అంటారు. హైందవపండితులు పూజకు ఉపక్రమించేముందు ఘంటానాదం చేయాలంటారు.
" ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రాక్షసాం, కుర్వాత్‍ఘంటారావంతు
తత్ర దేవతాహ్వానం లాంఛనం." దేవతలు ప్రవేశించేందుకు, రాక్షసులు
పారిపోయేందుకూ గుర్తుగా ఘంటానాదం లాంఛనంగా చేయాలని దీనర్థం. ఘంట మ్రోగినప్పుడు,
శబ్దతరంగాలు పెద్దపెద్ద వృత్తాకారాలలో వెలువడతాయి. ఇవి శక్తిసంపన్నాలు.
పూజకనుకూల పరిస్థితుల నేర్పరుస్తాయి. క్రైస్తవులు నూతన సంవత్సరానికాహ్వానంగా పాతసంవత్సరానికి
వీడ్కోలుగా చర్చీల్లో గంటలు వాయిస్తారు. మిగిలిన సమయాలలో, సమయసూచికంగా
గంటలు కొడతారు. బౌద్ధ, జైన మతాలలోకూడా ఘంటానాద ప్రసక్తి వున్నది.
హిందూదేవాలయాలలో ప్రధానద్వారం వద్ద మహాఘంట వ్రేలాడదీసివుంటుంది. ప్రాతఃకాలంలో పూజారి ఆలయప్రవేశం
చేయగానే మూడుసార్లు దీన్ని వాయిస్తాడు. ఇది అందరినీ మేల్కొల్పుతుంది. శివాలయాల్లో గంటపై
నంది చెక్కబడి వుంటుంది. వైష్ణవలయాల్లోనైతే హనుమ లేక గరుత్మంతుడు చెక్కబడి వుంటుంది.
ఈఘంటానాదం అభిషేకసమయాల్లోను, హారతినిచ్చే సమయాల్లోనూ,
యజ్ఞోపవీతం వేసేటఫ్ఫుడూ, ధూపంవేసేటప్పుడూ,
ఘంటానాదం చేస్తారు. నైవేద్యసమర్పణ సమయాల్లో మాత్రం ఘంటానాదం చెయ్యరు.
అలాచేయడం నరకహేతువని శాస్త్రంచెబుతున్నది. " ఘంటానాదంతథా వాద్యం నృత్యం గీతం తదైవచ
నైవేద్యకాలేయః రౌరవాద్ నరకంవ్రజేత్."
ఘంటనాలుకలో
సరస్వతీ, ముఖభాగంలో బ్రహ్మ, కడుపుభాగంలో
రుద్రుడు, కొసభాగంలో వాసుకి (శివుని మెడలోని సర్పం) ఉంటారని హిందువులు
నమ్ముతారు. గంటపిడి భాగంలో ప్రాణశక్తి వుంటుంది. ఘంటలు తయారుచేయడం కూడా ఒకకళ. శబ్దం
మృదువుగాను కర్ణపేయంగానూ, వెలువడటానికి శాస్త్రనిర్దేశానుసారం
కొన్ని కొలతలుపాటించి తయారుచేస్తారు. నిర్మాణానికి కంచులోహం వాడుతారు. "కంచుమ్రోగునట్లు
కనకంబు మ్రోగునా" అన్న వేమనమాట ఉండనేవున్నది. ఘంటనుండి వెలువడే శబ్దతరంగాలలో ఓంకారనాదం
(ప్రణవం) ఉన్నది. ఇది ఆధ్యాత్మిక సారం. సకలశుభాలకూ సంకేతం. చంచలమైన మనస్సును కుదుటపరచి
దైవంపై లగ్నమయ్యేట్లు చేస్తుంది. అసలు శబ్దం రెండురకములు. ఒకటి ధ్వని. ఇది ఉత్పన్నమై
వెంటనే నిలిచిపోతుంది. రెండు నాదం. ఇది కొంతసమయం ప్రతిధ్వనిస్తూ కొనసాగుతుంది.
"నా" అనగా ప్రాణం. "ద" అనగా అగ్ని. ప్రాణాగ్నుల కలయికే నాదం. నాదం
శబ్దకాలుష్యం చేసేదిగా గాక హృద్యంగా వుండాలి. కనుక గంటవాయించే టప్పుడు సున్నితంగా వాయించాలి.
"ఘంటాతు తాడయేద్దీమాన్ అస్త్ర మంత్ర సముచ్ఛరన్" క్రమపద్ధతిలో మెల్లగా వాయిస్తే
దైవికపూజ సఫలమౌతుంది. శాస్త్రప్రకారం ఘంటకు అధిష్టానదేవత బ్రహ్మ. కొందరిభావనలో గంటలోని
నాళం (నాలుక) ఆదిశేషునకు ప్రతీక. ఉత్పన్నమయ్యే నాదం శబ్దబ్రహ్మంగా పరిగణిస్తారు.
గంటలు
మూడురకాలు. 1. చేగంట. పూజాసమయంలో వాయించే చిన్నగంట. దీన్ని ఎడమచేత్తో, వాయిస్తూ, కుడిచేత్తో నీరాజనాది ఉపచారాలు చేస్తారు. 2.
జేగంట. ఇది గుండ్రముగావున్న కంచుపలక. దీన్ని చెక్కగూటముతో వాయిస్తారు. ఆలయంంలో బలిహరణ
సమయాల్లోనూ, ఊరేగింపుల్లోనూ వాయిస్తారు. 3. వ్రేలాడు గంట. ఇది
దేవాలయాల్లో వ్రేలాడదీయు పెద్దగంట. ఆలయప్రవేశం చేయగానే దీన్ని వాయిస్తారు. దీన్ని మృదువుగా
ఒకవైపు మాత్రమే తగిలేట్లు వాయిస్తారు. దేవాలయం విడిచిలెళ్ళేప్పుడు దీన్ని వాయించరు.
గంట శాస్త్రానుసారం మూడుసార్లు వాయించాలి. "ఏకతాడే మరణం చైవ. ద్వితాడే వ్యాధిపీడనం.
త్రితాడే సుఖమాప్నోతి. తత్ఘంటానాద లక్షణం". గంట ఒకసారికొడితే మరణాన్ని,
రెండుసార్లు కొడితేరోగన్ని, మూదుసార్లు కొడితే
సుఖసంతోషాలను కలిగిస్తుందని దీనర్థం.
ఘంటానాదాన్ని
వినడానికి కూడా ప్రత్యేక వార నక్షత్ర సమయాలను జ్యోతిష్కులు నిర్ధారించారు.
1.ఆదివారం
అశ్వని,మూల నక్షత్రాలున్న రాహుకాలం సా: 4-30 నుండి 6-౦౦ వరకు.
2.సోమవారం
ఆరుద్ర,స్వాతి,శతభిష నక్షత్రాలున్న రాహుకాలం
ఉ: 2-30 నుండి 9-00 వరకు.
3.గురువారం
ఫుష్యమి నక్షత్ర మున్న రాహుకాలం మ: 1-30 నుండి 3-00 వరకు.
4.శుక్రవారం
హస్తా నక్షత్ర మున్న రాహుకాలం ఉ: 10-30 నుండి12-00 వరకు.
5.శనివారం
రేవతి నక్షత్రమున్న రాహుకాలం ఉ: 9-00 నుండి 10-30 వరకు.
ఈసమయాలలో
శుక్లపక్షమైతే ఘంటానాదం భక్తునకు ఎడమవైపు నుండి వినబడాలి. అదే బహుళపక్షమైతే, కుడివైపునుండివినబడాలి. పూర్ణిమ దినాలలో ఏవైపునుండైనా పరవాలేదు. అమావాస్యనాడు
వదిలేయండి. ఒకవేళ అమావాస్యనాడు గుడిలోనైతే గంటమ్రోగించేముందు పితృదేవతలను స్మరించి
తర్వాత గంటలు మ్రోగించాలి. ఇలా చేయడం అత్యంత శుభదయకం.
No comments:
Post a Comment