Wednesday, 13 November 2024

వికర్ణుడు



వికర్ణుడు

కౌరవులు నూరుగురు. అందులో దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరికీ తెలుసు. ఆతెలియడంకూడా దుష్టులుగా తెలుసు. కానీ కౌరవులలో ఒక ధర్మాత్ముడున్నాడు. అతడే వికర్ణుడు. తనధర్మనిరతి వల్లనే అతడు గుర్తింపబడ్డాడు. లేకపోతే నూరుగురిలో ఒకడుగా మరుగునబడి యుండెడివాడు.

 మహాభారతానికి సంబంధించి అనేకగాథలు మనకు కనబడతాయి. వాటిలోకూడా వికర్ణుని నీతిమంతునిగనే చూపించారు. ఇతడు గంధారీ నందనులలో 18 వాడు. వీరత్వంలో మూడవవాడుగా గుర్తింపబడ్డాడు. కౌరవులలో యితడు మహారథిస్థాయికి చెందిన యోధుడు. కనుకనే దుర్యోధనుడు పేర్కొన్న కొద్దిమంది వీరులలో యితడుండటం భగవద్గీతలోని యీశ్లోకంద్వార మనకవగత మగుచున్నది.

 భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।

అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ  (గీత –ఐ-8)

 వికర్ణుని భార్యలపేర్లు సుదేష్ణవతి, ఇందుమతి. సుదేష్ణవతి కాశీరాజకుమారి. వికర్ణు డంటే చెవులు లేనివాడని, విశాలమైన చెవులు గలవాడని అర్థమున్నది. అలాగాక విశేషార్థంలో యితడు యెవరిమాటా వినడని. తన బుద్ధితో విశ్లేషించుకొని ప్రవర్తించే వాడని పెద్దలు వివరించారు. ద్రౌపదివస్త్రాపహరణ సమయంలో, యితడది అధర్మమని యెదిరించి కర్ణునితో మాటబడ్డాడు. కానీ సోదరధర్మాన్ని పాటించి, తొల్లి రావణుని తమ్ముడు కుంభకర్ణునివలె అన్నకు నీతిమాటలు చెప్పినా క్లిష్టసమయాలలో, యుద్ధాలలో అన్నవైపే నిలచి పోరాడాడు. గురుదక్షిణగా ద్రుపదుని పట్టితెమ్మని ద్రోణాచర్యుడు కోరినపుడు కౌరవసేనలోనే వుండి పోరాడాడు. మహాభారతయుద్ధం లోకూడా అన్నదుర్యోధనుని వైపున నిలచి శక్తివంచనలేకుండా పోరాడాడు. యోధాను యోధులైన అభిమన్యుని, భీముని, అర్జునుని, శిఖండిని, మహిష్మతీపతిని నిలువరించే ప్రయత్నం చేసినాడు.

 వికర్ణుని ధర్మనిరతి ద్రౌపదివస్త్రాపహరణ ఘట్టంద్వారానే వెలుగులోనికి వచ్చింది. ఆనాటి సంఘటన నన్నయ సభాపర్వంనిర్వహణ లో యెలా వివరించారో ఆయన మటల్లోనే తెలుసుకుందాం.

వ.

అనుచు దుఃఖితులగు చున్న పాండవులను దుశ్శాసనాపకృష్టయై సభాంతరంబున నున్న ద్రౌపదిం జూచి వికర్ణుం డన్యాయశ్రవణవికర్ణులై మిన్నకున్న సభ్యుల కి ట్లనియె.

క.

సమచిత్తవృత్తు లగు బు | ద్ధిమంతులకు నిపుడు ద్రౌపదీప్రశ్న విచా
రము సేయ వలయు; నవిచా | రమునఁ బ్రవర్తిల్లు టది నరకహేతు వగున్‌.

వ.

ఇక్కురువృద్ధు లైన భీష్మ ధృతరాష్ట్ర విదురాదులును నాచార్యులయిన ద్రోణకృపాదులుం బలుకరైరి; యున్న సభాసదులెల్లం గామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుండనిన నెవ్వరుం బలుకకున్న నే నిందు ధర్మ నిర్ణయంబు సేసెద; నెల్లవారును వినుండు; జూదంబును వేఁటయుఁ బానంబును బహుభక్షణాసక్తియు నను నాలుగు దుర్వ్యసనంబులం దగిలిన పురుషుండు ధర్మువుం దప్పివర్తిల్లు; నట్టి వాని కృత్యంబులు సేకొనం దగవు; కిత వాహూతుండై వ్యసనవర్తి యయి పరాజితుం డయిన పాండవాగ్రజుండు పాండవుల కందఱకు సాధారణ ధనంబయిన పాంచాలిఁ బణంబుఁ జేసెం గావున ద్రౌపది యధర్మవిజిత; యక్కోమలి నేకవస్త్ర నిట దోడ్కొని తెచ్చుట యన్యాయంబనిన వికర్ణుపలుకుల కొడంబడక కర్ణుండు వాని కి ట్లనియె.

ఆ.

ఎల్లవారు నెఱుఁగ నొల్లని ధర్మువు | బేల! నీకుఁ జెప్ప నేల వలసెఁ?
జిఱుతవాని కింత తఱుసంటి పలుకులు | సన్నె వృద్ధజనము లున్నచోట?

వ.

నీవు ద్రౌపది నధర్మవిజిత యని పలికితి; సభాసదులెల్ల నెఱుంగ ధర్మజుండు దన సర్వస్వమ్ము నొడ్డి యోటువడి నప్పు డిది వానికి వెలిగాదు గావున ధర్మవిజితయ; యిట్లు గానినాఁడు పాండవు లిందఱును దీని విజితఁగా నేల యొడంబడుదురు? మఱి యేకవస్త్రయై యున్న దీని సభకుం దోడ్కొని వచ్చుట ధర్మువు గాదంటి; భార్యకు దైవవిహితుం డయిన భర్త యొక్కరుండ; యిది యనేకభర్తృక గావున బంధకి యనంబడు; నిట్టిదాని విగతవస్త్రం జేసి తెచ్చినను ధర్మవిరోధంబు లేదని కర్ణుండు వికర్ణువచనంబులకుం బ్రత్యాఖ్యానంబు సేసిన విని, దుర్యోధనుండు దుశ్శాసనుం బిలిచి యిప్పాండవులయు ద్రౌపదియు వస్త్రంబు లపహరింపుమని పంచిన దాని నెఱింగి........

 చూచాముగదా! వేట, సురాపానము, జూదము, తిందిపోతుదనము (సంస్కృత భారతములో దీనికిబదులు స్త్రీవ్యసనమని యున్నది.) యివి రాజైనవాడు చేయదగని పనులు. ఇట్టిచేయదగనిలోనిదైన జూదములో ధర్మరాజు ద్రౌపదిని పందెముగానొడ్డి ఓడిపోవడము లోకసమ్మతముగాదు. కనుక అమెను పరాభవించడం అధర్మమమని సభలో వికర్ణుడొక్కడే వాదించడం గమనార్హం. అయితే కర్ణుడు మందలించి వికర్ణుని నోరుమూయించాడు. సంస్కృతమహాభారతంలో చెప్పినట్లు, పాండవులు తొలుత జూదంలో పోగొట్టుకున్నదంతా, ధృతరాష్త్రమహారాజు తిరిగియిచ్చేసి ఇంద్రప్రస్థానికి పంపించేశాడు. అయితే తిరిగి వారిని పిలిపించి జూదమాడాలన్నప్పుడు, వద్దని, అది అశాంతికి హేతువని సోమదత్తుడు, ద్రోణుడు, భూరుశ్రవుడు, భీష్ముడు, అశ్వత్థామ, యుయుత్సుడే గాకుండా వికర్ణుడుకూడా నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ జూదంజరగడం, ఓడి పాండవులు అరణ్యాలపాలవ్వడం జరిగిపోయాయి. వికర్ణుడి ప్రయత్నాలు విఫలమయ్యయి కానీ, తనుమాత్రం యెవరువిన్నా వినకపోయినా ధర్మం ధైర్యంగా వచించాడనడం నిర్వివాదాంశం.

 ఆఖరుకు కురుక్షేత్రమహాసంగ్రామంలో నిర్భయంగా 14వ రోజున బీమునితో తలపడ టానికి సిద్ధమయ్యాడు. వికర్ణుని ధర్మనిరతిని గుర్తించి, ద్రౌపది వికర్ణుని చంపవద్దని ముందేచెప్పింది. భీముడు ద్రౌపదిమాటను జ్ఞాపకముచేసుకొని, వికర్ణుని అడ్డుతొలగిపొమ్మని, నిన్ను చంపడం నాకిష్టంలేదని, చెప్పిచూశాడు. కానీ వికర్ణుడు వినలేదు. అన్నదుర్యోధనునికి ఓటమి కలుగనివ్వనని, భీముడు తనకంటే బలశాలియని తెలిసినా, పోరాడి వీరమరణం పొందాడు. భీముడు చంపకతప్పని పరిస్థిలో వికర్ణుని చంపి, మానసికక్షోభ ననుభవించాడు. మరణించే సమయంలో వికర్ణుడు భాతృధర్మం పాటించి, అధర్మంవైపు యుద్ధంచేశానని, మన్నించమని భీముని వేడుకొని, తన దహనసంస్కారాన్ని నీవేచేయమని బీమునికోరి కన్నుమూశాడని కొన్ని కథలలో వున్నది. ఇదీ మహవీరుడైన వికర్ణుని వృత్తాంతం. ఈభారతమహాయోధుని కథను శ్రీచింతక్రింది శ్రీనివాసరావుగారు నవలగా వ్రాశారు. ఆసక్తిగలవారు 8897147067 కు ఫోన్‍చేసి తెపించుకొనవచ్చును.

 

 

 

 

 


పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...