మారాలి
మనిషి
కోటానుకోట్లు నొక్కేసినా ఆ రాజకీయనాయకుని
బినామీ లాకర్లు నిండలేదు.
మేజక్రింద ఎంత హస్తలాఘవం
జూపినా
ఆ ఉద్యోగి జోబులు నిండలేదు.
ఎంతగా వంచన నిలువెల్ల
పులుముకొన్నా
ఆ వ్యాపారి గల్లాపెట్టె
నిండలేదు.
ఒకటేమిటి సంపాదనా
పరుగుపందేలకు
మితి గతి లేకుండాపోయింది
వారి ఇనుపపాదాలక్రింద
నలిగిపోయే సామాన్యునికి
దిక్కేలేకుండా పోయింది.
ఎందుకలా?
ఇంతసంపాదించితి, నికయేల యని తనియరాదని
ఆశాపాశము తా కడునిడువు
లేదంతంబు దానికని
తిన్నదికాదు పుష్టి మానవుల
కెనకేసికొన్నదే పుష్టి యని
సర్దిచెప్పుకోవలసిందే కానీ మార్గామ్తరమే
లేదుకదా?
తెనెటీగలు తమతుట్టె నిండగానే
ఆగి ఆస్వాదించి అనందిస్తాయి.
చీమలు తమపుట్ట నిండగానే
ప్రయాస చాలించి హయిగా
ఆహారిస్తాయి.
పశుపక్షాదులు ఏపూటకాపూట
దొరికిందితిని తృప్తిగా
విశ్రమిస్తాయి.
ప్రకృతిలో ఒకభాగంగా
జీవిస్తాయి.
ఎందుకు మానవుడు మాత్రమే
ప్రకృతితికి వైరియై
కృత్రిమసుఖాలకై
పోరాడుతున్నాడు?
అంతులేని ఆరాటంతో
అసంతృప్తికిలోనై
అతలాకుతలమౌతున్నాడు?
నూతనావిష్కరణలంటూ పోటీపడి
ప్రకృతిని మైలపరుస్తున్నాడు.
ఒకవైపు తోటిజీవుల హింసిస్తూ
మరోవైపు
శాంతినాకాంక్షిస్తున్నాడు.
మ్రొక్కులతో పైశాచిక పూజలతో
ఆవేదనల కంతం వెతుకుతున్నాడు.
అది అందని పండైనా
అర్రులుచాస్తూ
అలసిపోతున్నాడు.
మనిషి జన్మతః క్రూరుడా? కాదుగదా?
మనిషంటేనే మానవత్వంగల ప్రాణి
గదా?
మేథోసంపత్తి సమృద్ధిగా గల
జీవిగదా?
వివేచనాజ్ఞాన సంపదకు వారసుడు
గదా?
సృష్టికి ప్రతిసృష్టి చేయగల
అపర పరమేమేష్టి కదా?
మరైతే ప్రకృతికి పట్టిన
చీడ్పురుగై
వినాశన హేతువౌతున్నాడెందుకు?
ఆలోచించాలి...మనిషి మారాలి.