Showing posts with label తేనెటీగ. Show all posts
Showing posts with label తేనెటీగ. Show all posts

Sunday, 1 August 2021

తేనెటీగ

తేనెటీగ (కథ)




మర్రిచెట్టునీడన మరేచెట్టూ ఎదగదంటారు. మా రోశిరెడ్డిగారు మర్రిచెట్తుకేం తక్కువగాదు. మాగడ్డమీద ఎవరికేం తగాదావచ్చినా ఆయనేతీర్చి గట్టెక్కిస్తారు. జనాలను మున్ముందుకుకు సాగనిస్తారుమరి. రోశిరెడ్డుగారు అందెవేసిన రాజకీయ నాయకుడు. ఆయన ఏపార్టీలోవున్నా మాగడ్డకాయనే ఏలిక. ఎగస్పార్టీలో ఏనాయకుడున్నా ఏంలాభంలేదు. ఇక్కడ మా రోశిరెడ్డిగారి మాటంటే మాటఅంతే. ఇదంతా ఎందుకు జెబుతున్నాననిగదా మీఆలోచన. రోంత సేపాగండి ఆంతా మీకే అర్థమై పోతుంది. అడుగో రాజాశెట్టిఅనుకుంటూండగానే వచ్చేస్తాండాడు. నూరేండ్లయ్యా రాజా నీకు రారా! పోయినపనేమైంది. నువ్వుజెప్పడంపనిగాకుండాపోవడమూనా! అయిపోయినట్టేలే! ఐనా నీ ఋణముంచుకోనులే! ముందు పనిగానీ. పదమస్తాన్‍కొట్లో ఒన్‍బైటూ దమంచాయ్ దాగుతా మాట్లాదుకుదాంఅంటూ రాజాశెట్టిఆయనవెంటనేనూ టీకొట్టువైపు కదిలాం.  

 

ఇంతకూ రాజాశెట్టి పనేందనిగదా మీ తపన! ఏమీ లేదుబజారులో ఆయనింటిముందు ఒకరూముందిగదా! అది గోవిందయ్యకు బాడిగకిచ్చినాడు గదా! పదేండ్లయింది. గోవిందయ్య మందులంగడి ఖాళీజెయ్యమంటే ఖాళీ చెయ్యడంల్యా. పదో పరకో బాడిగపెంచుతాడుగాని ఖాళీమాత్రం చెయ్యడంల్యా. ఏంజెయ్యాలబ్బా! అని రాజాశెట్టి దిగులుబడతావుంటే నేనే ఉపాయంజెప్పినా. ఉపాయమంటే యేమిల్యాసక్కంగా బసెక్కి రంగాపురంబోఆడ రోశిరెడ్డిగారింటికిబోయి ఆయనకో దణ్ణంబెట్టు. అయ్యా మీకిచ్చుకునేదిచ్చుకుంటాఆ గోయిందుగానితో నారూము ఖాళీ జేపించి యిపించయ్యాఅని అడుక్కోమన్నానంతే.

 

అనుకున్నట్టే రెండోరోజు రోశిరెడ్డి కారేసుకోనొచ్చి గోయిందంగట్లో గూకోనిఏంది గోయిందో! మన రాజాశెట్టి రూము రిపేర్లు జేసుకోని కొడుక్కేదో యాపారం బెట్టించాలనుకుంటేనువ్వు ఖాళీజేయనంటున్నావంట. ఇంతకూ ఏంది కతవెటకారంగా అడిగాడు రోశిరెడ్డి. అయ్యా! అదేంలేదు. చిన్నచిన్న రిపేర్లు నేనే జేసుకోని అంగడి నడుపుకుంటున్నా. అడిగినప్పుడల్లా యింతోఅంతో బాడుగ పెంచుతున్నా. శెట్టిగారి పిల్లోడు చానా చిన్నోడు. ఇప్పుడప్పుడే వ్యాపారం జేసుకోలేడు. వేరేచోటికి అంగడి మారిస్తే యీమాదిరి జరగదేమోనని భయపడుతున్నానయ్యాఅన్నాడు గోవిందు. అట్టాగాదుగానినువ్వు ఖాళీజేసెయ్. కావాలంటే ఓనెల గడువుదీసుకో. నేనే శెట్టిగారిల్లూ అంగడి కొనాలనుకుంటున్నానువ్వేం మాట్లాడకుండా ఖాళీజేసెయ్ అని అదేపోత. గోవిందేదో చెప్పాలనుకున్నాడు గానీ వినేవారెవరూ లేరక్కడ.

 

ఏంజేయాలబ్బా! ఎగస్పార్టీ సుబ్బరామయ్య మనకులస్తుడేగదా! ఆయనదగ్గరకెళ్ళి జెప్పుకుందామని ఆరోజు రాత్రికే ఆయనదగ్గరికెళ్ళాడు గోవిందు. నేనూ మీకులస్తున్నేనాపేరు గోవిందు. బజారులో గోవిందం మెడికల్‍స్టోర్స్ నాదే. పరిచయంజేసుకున్నాడు గోవిందు. కులం అనగూడదయ్యా సామాజికవర్గం అనాలి. సరే మనమిద్దరం ఒక సామాజికవర్గమే! అయితేఅనిగోవిందువైపు దిరిగి యికజెప్పుకో నీఅగచాట్లు అన్నట్లు జూశాడు సుబ్బరామయ్య. తన కష్టమంతా జెప్పుకున్నాడు గోవిందు. నువ్వేం ఖాళీజెయ్యద్దు. నేజూసుకుంటా. అంతా ఆరోశిగాడు జెప్పినట్లేనా! ఇది నాయేరియా యీడ వాడేందిజెప్పేది. ఇంగనూబో! అని పంపించేశాడు సుబ్బరామయ్య. నెలరోజుల గడువు రోజురోజుకు ఐసుగడ్డ కరికిపోయినట్లు తరిగిపోతుండాదిగానీ సుబ్బరామయ్య నుండి ఉలుకూలేదు పలుకూలేదు. మీదమీద రెండుసార్లు బోయి జ్ఞాపకంజేసినాడు గోవిందు. అయినా ఆయనగారు కదిలిన పాపానబోలేదు. రోశిరెడ్డితో మాట్లాడిందసలేలేదు. ఇంతలో రోశిరెడ్డి మరొకసారి తన మనుషులను పంపి  గట్టిగా హెచ్చరిక జేసినాడు. చెప్పినమాట వినకుంటే నీమందులూ సామాన్లూ రోడ్డుమీదుంటాయ్ జాగ్రత్తా! అని బెదిరించి పోయినారు రోశిరెడ్డిమనుషులు. సుబ్బరామయ్య మాటలమనిషేగాని చేతలమనిషి గాదనిరోశిరెడ్డి కెదురునిలిచి నాతరపున మాట్లాడలేడని అర్థమైపోయింది గోవిందుకు. చేసేదేమీలేక రూము ఖాళీచేసి మందులు తెలిసిన అంంగళ్ళకు తగ్గించిన ధరలకమ్ముకొనిఇంటికాడ దిగులుగా కూర్చున్నాడు. 

 

ఇప్పుడు నేన్జేయ్యాల్సిన పనిజెయ్యాలిగదా! ఎంతోకొంత కమీషన్ యీవైపునుండీ రాబట్టుకోవాలిగదా! బలవంతమేమీ లేదబ్బా! ఎదో! వాళ్ళిచ్చినంత నేను దీసుకున్నంత అంతే!. మంచోడన్న పేరుమాత్రం చెడిపోగూడదు. అదే మనకు ముఖ్యం. అడుగో! గోవిందు అరుగుమీద కూకోనుండాడుఆదారిన పొయినట్లుపొయ్ పలకరిద్దాం. ఏంగోయిందూ షాపుకు బోలాఅందరికీ జెప్పుకున్నట్లే గోయిందు తనగోడు నాకూ వినిపించాడు. తెలిసినా తెలియనట్లే అంతావిన్నా. పాపం యిల్లుగడవడమెట్లాఅన్న దిగులుపట్టుకుంది గోవిందుకు. గోయిందూ నేనొకమాటజెప్తా వింటావాఅన్నా. తలూపాడుగోవిందు. ఏమీల్యా! రేప్పొద్దునే రోంతమాసిన గుడ్డలుగట్టుకొని పెండ్లాంపిల్లల్నిదీసుకొని సక్కంగా బసెక్కి రంగాపురంబో. రోశిరెడ్డి యింటికాడ్నే వుంటాడు. రోశిరెడ్డామొగంవేలాడేశాడు గోవిందు. ముందు నేజెప్పేది యినయ్యా గోయిందూ. నువ్వేం ఆలోచించమాకునేన్‍జెప్పినట్లుజెయ్. సరేనంటూ యిష్టంలేకున్నా వినసాగాడు గోవిందు. ఆడికిబోతానే అందరూ చేతులెత్తి రోశిరెడ్డికిదండంబెట్టండి. "ఏం" అంటాడు రోశిరెడ్డి. "అయ్యా! మీరుజెప్పినట్లే రాజాశెట్టిగారి రూము ఖాళీజేసేసినా. ఏరేపని జేతగాక యింటికాడనే వూరకుండా. ఇల్లుగడవడం కష్టంగావుంది. ఇంగ పస్తులుండాల్సిదే. మీరేనాకు దారిసూపాల" అని యెడుపుమొగంపెట్టి నేలపై గూర్చోండి. ఈపనిజేసి గోయిందూ! సూడు అవతలేం జరుగుతుందోఅనిజెప్పి నేనొచ్చేసినా.

 

గోవిందుకు వేరేదారేముందిచెప్పింది చెప్పినట్లే జేసినాడు. నేనంతా గమనిస్తూనేవున్నా. నాలుగురోజులతర్వాత గోవిందు యింటికి బోయినా. హుషరుగా వుండాడు గోవిందు. కూర్చో! కూర్చో!మంటూ అడక్కుండానే చెప్పడం మొదలుబెట్టాడు . రోసిరెడ్డి చానామంచోడన్నా. మాకు అన్నంకూడా బెట్టిపంపించినాడు. నాకు సరిపోయేచోట ఎక్కడ ఖాళీరూమున్నా చూసుకోమన్నాడు. నేనొచ్చియిపిస్తా. లోన్‍కూడా యిపిస్తా భయపడొద్దుపో! అన్నాడన్నా. నిన్ననే రూంజూసొచ్చినా. అక్కడ రెడీమేడ్‍గుడ్డలంగడి బాగాజరుగుతుంది. లోన్‍దీసుకుంటాఇంగ బతుక్కుంటానన్నా. నీఋణం వుంచుకోనన్నా. రోంత నిల్దొక్కుకోనీ. గోవిందు గబగబా జెబుతూనేవున్నాడు. ఇంతలో గోవిందుభార్య మాకు కాఫీదెచ్చివటంతో చాలించాడు. సరే! నాక్కావలసిందీ అదేకదా! అనుకుంటూ కాఫీతాగి మంచిది గోవిందూ! అని వీపుతట్టి బయటకొచ్చేసినా.

 

ఇంతకూ రోసిరెడ్డీ నేనూ చేసేదేమిటిఒకరికి సాయంచేసి మరొకరిని రోడ్దున పడేయటం. మళ్ళీ వాణ్నీ గట్టెక్కించిరెండువైపులా కమీషన్‍గుంజేయటం. అదీ నొప్పిలేకుండా  తేనెటీగ పువ్వునుండి తేనె లక్కున్నట్లే సుమా!. మళ్ళీ వచ్చేఎన్నికల్లో రాజాసెట్టివర్గం ఓట్లూ మావే. గోవిందువర్గం ఓట్లూ మావే. ఇదే మాసీమ రాజకీయనాయకుల చతురత. ఈ విషయం ప్రజలకు తెలియదనాతెలుసు. అయినా వాళ్లేమిచేయగలరు పాపం. ఇదంతే!          

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...