Thursday, 6 April 2023

తీర్థం,Tirtham

 

తీర్థం

తీర్థమనగా భగవంతుని అభిషేకించినజలం లేదా గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర వంటి పుణ్యనదుల నావాహనజేసిన, కలశంలోని పవిత్రజలం. ఒక పవిత్రజలాశయం లేదా నదినాశయించియున్న దేవస్థానన్ని కూడా తీత్థమనే అంటారు. దేవాలయాల్లోగాని గృహాల్లోగానీ పూజానంతరం తీర్థంపుచ్చుకుంటూ వుండడం హిందువుల ఆచారం. కొన్నిచోట్ల చర్చీలలోకూడా క్రీస్తు పాపులకోసం కార్చిన రక్తమనిచెప్పి ద్రవాహారాన్ని యివ్వడం జరుగుచున్నది. ఒక రాజకీయ నాయకుడు ఉన్నపార్టీవదలి మరోపార్టీ లోచేరితే అతడు ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నాడంటారు. ఇలా హేళన చేయడానికి కూడా యీ తీర్థమనే పదం వాడబడుతున్నది. హిందువులకు మాత్రం ఇది పూజానంతరం నిర్లక్ష్యము చేయరాని ప్రక్రియ, పూజారి "అకాలమృత్యు హరణం. సర్వవ్యాధినివారణం. సమస్తపాపక్షయకరం. శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం" అని ఉచ్చరిస్తూ రాగిపాత్రలోని తీర్థాన్ని తొలుత అర్చకస్వాములు, తరువాత సర్వసంగపరిత్యాగులు (సన్యసించినవారు), తర్వాత అధ్యాపకులు, యజమానులైన ధర్మకర్తలు ఆతర్వాత మిగిలిన భక్తులందరు వరుసగా స్వీకరిస్తారు.  పరమేశ్వర”  బదులుగా  ఆసమయంలో పూజించిన దైవనామాన్ని ఉచ్చరించవచ్చును. సర్వసామాన్యంగా తులసీదళాలు, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, శ్రీగంధం కలిపిన మంచినీటితో శుద్ధోదకాభిషేకం చేసినతర్వత అదేజలాన్ని తీర్థంగాసేవించడం జరుగుతుంది. ఒలికిపోకుండ క్రిందపదకుండా వుండేందుకు పురుషులైతే, ఉత్తరీయాన్నీ (కండువాను), స్త్రీలైతే చీరకొంగు లేక చున్నీపైటకొసను నల్గుమడతలు మడిచి ఎడమ అరచేతిపై వేసుకొని, పైన కుడి అరచేతినుంచి, గోకర్ణ ముద్రలోనికి మడిచి, అంటే కుడిమధ్యవ్రేలు చూపుడువ్రేలు మధ్యకు బొటనవ్రేలు పోనిస్తే తీర్థం తీసుకోవడానికి అనువుగా గుంత యేర్పడుతుంది. అందులో తీర్థము వేయించుకొని కళ్ళకద్దుకొని భక్తిపూర్వకంగా స్వీకరించాలి. పూజారి ముడుసార్లు ఉద్దరనితో తీర్థంవేసిన తర్వాత, సేవించాలి. లేదా వేరువేరుగా మూడుసార్లు తీర్థంసేవించాలి. మొదటితీర్థం మానసిక, శారీరక శుద్ధిని, రెండవది సద్బుద్ధిని, న్యాయవర్తనను, కలిగిస్తుంది. మూడవది పరమపదాన్ని చేరుస్తుంది. తీర్థం స్వీకరిచేటప్పుడు, జుర్రుకొన్నశబ్దం రాకుండ, వీలైతే కుదురుగా కూర్చొని భక్తిశ్రద్ధలతో తీసుకోవాలి.  

 తీర్థాలు నాలుగురకాలుగా, ఆయాదేవస్థానాల ఆచారాన్ని బట్టి వుంటున్నాయి. 1.జలతీర్థం - ఇది అంతటా సర్వసామాన్యంగా యిస్తూవుంటారు. ఈ తీర్థసేవనంవల్ల పవిత్రత జేకూరుతుంది. అకాలమాణాలను (60సంవత్సరములు దాటకుండా చనిపోవడాన్ని) నివారిస్తుంది.  ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, పాపాలను పరిహరిస్తుంది. 2. కషాయతీర్థం- ఇది తీర్థంగా స్వీకరించే ఓషదుల కషాయం. కొల్హపురి లక్ష్మిదేవి గుడిలోనూ, కొల్లూరు మూకాంబికా దేవాలయంలోనూ, హిమాచలప్రదేశ్ జ్వాలామాలిని ఆలయంలోనూ, అస్సోం లోని శ్రీకామాఖ్యదేవాలయంలోనూ, యీతీర్థం రాత్రి పూజానంతరం యిస్తారు. ఇది సమస్తరోగనివారిణి. కనిపించని రోగాలనుసైతం బాగుచేస్తుంది. 3. పంచామృతతీర్థం- ఇది పాలూ, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపినతీర్థం. కొన్నిఆలయాలలో పాలూ పెరుగుకు బదులుగా కొబ్బరి, అరటిగుజ్జు వినియోగిస్తారు. ఈతీర్థం నరసిహస్వామి ఆలయాలలో ఎక్కువగా యిస్తారు. ఈతీర్థం పయత్న విజయకారిణి, కడకు బ్రహ్మలోకప్రాప్తి కలుగజేస్తుంది. 4. పానకతీర్థం- ఈతీర్థం శ్రీమంగళగిరి నరసింహస్వామివద్ద, అహోబిళ నరసింహస్వామివద్ద ఇస్తారు. ఈతీర్థం చైతన్యదాయిని. ఉత్సాహాన్నిస్తుంది. శరీరవేడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఎముకలకు దృఢత్వాన్ని కలుగజేస్తుంది. నోరెండిపోవడాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తినిపెంచి, ఆకలిని కలుగజేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శత్రుపీడలనుండి విముక్తి కలుగజేస్తుంది. ఇవిగాక బిళ్వతీర్థం కూడావుంది. వైష్ణవాలయాల్లో తులసితీర్థ మెంతముఖ్యమో, శివాలయాల్లో బిళ్వతీర్థమంత ముఖ్యం

 తీర్థం రాగిపాత్రలో వుంటుందిగనుక శరీరంలోని అధికవేడిని తగ్గిస్తుంది. అంతేగాక రాగిపాత్రలోని తీర్థసేవనంవల్ల ఆహారంలోని యితర లవణాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. అలాగే తీర్థంలోని పచ్చకర్పూరం మానసికోల్లాసాన్ని కలుగజేస్తుంది. తులసీదళాలు కఫహారిగా పనిజేస్తాయి. మరణశయ్యపై ఉన్నవారికి గళంలో కఫమడ్డపడి బాధిస్తుంది. తులసితీర్థంపోయడంవల్ల కఫం తొలగిపోయి బాధలేని మరణం ప్రాప్తిస్తుంది. తీర్థం స్వీకరించిన తర్వాత చేతులు కడుక్కోవాలి, లేదా వస్త్రంతో తుడుచుకోవాలి. అంతేగాని తలకు రాసుకోరాదు. తల బ్రహ్మస్థానం. దాన్ని ఎంగిలి చేయబడ్డ తీర్థంతో అపవిత్రంచేయరాదు. అంతేగాక శఠకోపం తలపైపెడతారు. శఠకోపమంటే దేవునిపాదాలు. కనుక పవిత్రమైన దేవునిపాదాలను మనం ఎంగిలితో మైలపరచరాదు. అంతేగాక తీర్థంలో తేనె, పంచదార ఉంటాయిగనుక అవి తలకురాయడం తగదని వైద్యులసలహా. అయినా కొందరు తీర్థసేవనం తరువాత తలకురాస్తే బ్రహ్మహత్యాదోషం తొలగుతుందని నమ్ముతారు. గంగాజల(కాశీ)తీర్థం తలకుతగిలితే దోషం లేదని కూడా అంటారు. ఈవిషయంలో ఎవరి విశ్వాసం వారిదని వదిలేద్దాం. "శంఖంలోపోస్తేనేతీర్థం" అన్నసామెత ఒకటున్నది. దీన్ననుసరించి తులసి తీర్థాన్ని  ఉద్దరణితోగాకుండా శంఖంలో పోసి, దానిద్వారా భక్తుల కివ్వడం కూడా జరుగుతుంది .  ఇక ఆలయాల్లోగానీ ఇంట్లోగాని తీర్థం మిగిలిపోతే తులసికోటలోని తులసిచెట్టుకు పోయాలి. లేదా ప్రవహించే నదిలో కలిపేయాలి. తీర్థానికి సంబంధించిన అనేక విషయాలను "తీర్థగోష్టి" గ్రంధంలో వ్రాయబడి ఉన్నాయి.                      

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...