సంధ్యారాగం
తొలిమలి సంధ్యల కెంజాయ
తమఃప్రభల కలగలుపు
నాచర్మ చక్షువులకు ఒకేవిధంగా దృగ్గోచరమైన
నా మనసుకు మాత్రం తేడా తెలుస్తునే వుంది
జీవిత తొలిసంధ్య పాత జ్ఞాపకాలను
మలిసంధ్య భవిషదుహాలను
గుర్తు చేస్తునే వున్నాయ్
ఒకటి జ్ఞానాగ్ని రగలని అమాయకత
మరొకటి, కేవల జ్ఞానాగ్ని గురుతుల నిరుపయోగత
అధికారచ్చాయలంటని పసితన మొకటి
అధికారం చెల్లని పెద్దతన మింకొకటి
ప్రేమానురాగాల తొలకరింపొకటైతే
కేవల కర్తవ్యతాబద్ద కృత్రిమ పలకరింపింపొకటి
ముద్దుల పెంపకమొకటి
మరి వృద్ధాప్య బాధ్యతా పంపక మింపొకటి
ఈ తొలిమలి సంధ్యల మధ్యన
మరెన్నో స్వల్పాస్వల్ప సంధ్యలు
వేసిన నాటకం లోని తీపిగురుతులు
వేసే నాటకం కోసం సీరియస్ రిహార్సల్సు
ఉద్యోగం పొందిన సంధ్య
ఉద్యోగ విరమణ సంధ్య
లాటరీనంబరు పేపర్లో పడిన సంధ్య
రేసుల్లో సర్వమంగళం పాడిన సంధ్య
ఎన్నికల్లో గెలిచి ఊరేగిన సంధ్య
ఉద్వాసనపొంది ఇంటికొచ్చిన సంధ్య
ఓహో ఎన్నెన్ని తోలిసంధ్యలు
ఎన్నెన్ని మలిసంధ్యలు
ఈ తొలిమలి సంధ్యల అనుభవం
జీవితకాలంలో బహుకీలకం
ఇటు పగటికి అటు రాత్రికి
ఇవేసుమా ఆలంబనం .
***