Showing posts with label తాంబూలం. Show all posts
Showing posts with label తాంబూలం. Show all posts

Friday, 24 June 2022

తాంబూలం,Taambulam.

 

తాంబూలం

 


హిందూకుటుంబాలలో తాంబూలంలేకుండా యేశుభకార్యమూ జరుగదు. వ్రతాలకుగానీ, పూజలకుగానీ, పెండ్లికిగానీ మరేయితరశుభకార్యాలకేగానీ తాంబూలమిచ్చిపిలవడం ఒకసదాచారం. పూజలో భగవంతునికీ తాంబూలంసమర్పించడం తప్పనిసరి. పెద్దలకు తాంబూలమిచ్చి ఆశీర్వాదంతీసుకోవాలి. ఆఖరుకు సాగనంపేటప్పుడుకూడా తాంబూలమిచ్చి పంపాలి. ఒకశుభకార్యం పురమాయించేటప్పుడూ తాంబూలమిచ్చి పనిఅప్పజెప్పాలి. ఒకకావ్యం అంకితం తీసుకోవాలంటే కవికి తాంబూలమిచ్చి కానుకలివ్వాలి. ఒకపెళ్ళిసంబంధం కుదిరితే నిశ్చితార్థం చేస్తారు. అందులో నిశ్చయతాంబూలమియ్యడమే అతిముఖ్యం. రెండువైపులవారూ తాంబూలాలుమార్చుకుంటేనే సంబంధం కుదిరినట్లు. తాంబూలంతోపాటు, పుష్పాలు, పండ్లు, క్రొత్తబట్టలుకూడా యిస్తారు. కానీ ఏమున్నాలేకున్నా, తంబూలాలుమాత్రం తప్పనిసరి. గురజాడాప్పారావుగారి కన్యాశుల్కం నాటకములో అగ్నిహోత్రావధానులు ఒకముసలానకు తకూతురునిచ్చిపెండ్లిచేయడానికి నిశ్చితార్థంచేసుకొని వస్తాడు. భార్యా బావమరదులు మేమొప్పుకోమంటారు. అప్పుడు అగ్నిహోత్రావధానులు "తాంబూలాలిచ్చేశాను తన్నుకచావండి" అంటాడు. అంటే తాంబూలమిచ్చి మాటచెబితే యికదానికి తిరుగేలేదన్నమాట. ఇక పెండ్లిలో తాంబూలప్రశస్తి వేరుగాచెప్పవలసిన పనిలేదు. వధూవరులకలయిక ఆకూవక్కావలె విడదీయరానిదై వుండాలన్నది ఆర్యవాక్యం.

తాంబూలం భగవంతునకు పూజలోసమర్పిచడం, శతపత్ర(శతదళకమల)ములతో పూజించడంతో సమానమేగాక, సర్వదోషహరమని భావిస్తారు. కొన్ని పూజల్లో కలశస్థాపనచేస్తారు. పాత్ర(చెంబు) లో మంచినీరుపోసి, తమలపాకుతొడిమలు నీటినితాకునట్లు చుట్టూవుంచి పైన కొబ్బరికాయవుంచుతారు. ఆకులతొడిమలకు నీళ్ళుతగులుతుంటేచాలు ఆకులువాడిపోకుండా పచ్చగా కళకళలాడుతూవుంటాయి. ఇట్టి కలశంలోనికి ఇష్టదేవతనావాహనచేసి పూజిస్తారు. ఈవిధంగా తమలపాకులు, తాంబూలం శుభకార్యాలన్నింటిలో అగ్రస్థానం వహిస్తున్నాయి. అంతెందుకూ ఒకవ్యక్తిని మహోన్నతునిగా నిర్ణయించినందుకు గుర్తుగా అతనికి అగ్ర(తొలి)తాంబూలం ఇచ్చి గౌరవించాలి. రాజసూయయాగ చరమాంకంలో శ్రీకృష్ణుడు మహోత్తముడని గుర్తించి అగ్రతంబూలమిచ్చి గౌరవించించాడు ధర్మరాజు.   

 తాంబూలానికి సంబంధించిన పురాణగాథలూవున్నాయి. ఆంజనేయుడు లంకలో సీతాదేవిని దర్శించి, శ్రీరాముని అంగుళీయమిచ్చి తన్నుతాను రామదూతగా నిరూపించుకొనినపుడు, సీతసంతోషించి, తనసంతోషానికి చిహ్నంగా ఏమైనా యివ్వాలనుకున్నది. తనవద్ద యేమీలేకపోవడంతో దగ్గరలోవున్న తమలపాకుతీగనుండి రెండుతమలపాకులు త్రెంచియిచ్చింది. హనుమంతునికి అప్పటినుండి తమలపాకులంటే ఎంతోయిష్టం. అందుకే ఆయనకిష్టమైన తమలపాకులతో ఆకుపూజచేస్తారు. అర్జునుడు యుద్ధంలో విజయంకోసం యజ్ఞంచేయతలపెట్టాడు.  అందుకోసం ఋషులు తొలుత తమలపాకులు అందివ్వమన్నారు. సమయానికి అక్కడ తమలపాకులులేవు. దరిదాపుల్లోదొరకలేదు. వెంటనే అర్జునుడు నాగలోకంవెళ్ళి, అక్కడి నాగరాణినడిగి తమలపాకులు తెచ్చియిచ్చాడట. అందుకే తమలపాకుతీగను నాగవల్లి అంటున్నారు. మరికొందరి అభిప్రాయంప్రకారం తమలపాకుతీగ స్వర్గం(నాకం)నుండి భువికి వచ్చిందట, అందువల్లదానిని నాకవల్లి అని పిలిచారట. అదే కాలక్రమంలో నాగవల్లి అయిందట.

 అన్ని శుభకార్యాలలో, పూజలలో తాంబూలమంటే, ఆకూవక్కా అనే అర్థం. స్త్రీలు బొట్టుపెట్టి తాబూలమిచ్చేతప్పుడు, ఆకులచివర్లు యిచ్చేవారికి వ్యతిరేకదిశలో వుండాలంటారు. ఆకులు మూడులేక ఐదు, వక్కలురెండు, పండ్లురెండు చేర్చియివ్వడం శ్రేయోదాయకం. మంగళకరద్రవ్యాలు ఎనిమిది. వాటిని అష్టమంగళాలంటారు. వాటిలో తాంబూలంకూడా ఒకటి. అష్టమంగళాలుయేవంటే, అవి పుష్పాలు, ఫలాలు, అక్షింతలు, అద్దం, వస్త్రం, తాంబూలం, దీపం, కుంకుమ. భగవదారాధనకు షోడషోపచారాలున్నాయి. అందులోనూ తాంబూలమున్నది. షోడషోపచారాలు యేవంటే, అవి ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ఆత్మప్రదక్షణం. కొందరు ఆత్మప్రదక్షణానికి బదులు ధ్యానాన్ని చేర్చుకున్నారు.

 మనుషుల ఈతిబాధలు తొలగడానికి వారి రాశినిబట్టి తంబూలాన్ని ఒకప్రత్యేకవారం ఒకప్రత్యేక దైవానికి ప్రత్యేకఫలాలుచేర్చి పూజిస్తే మంచి ఫలితముంటుందని జ్యోతిష్కులుతెలియజేస్తున్నారు. అవి యీవిధంగా వున్నాయి.

 1. మేషరాశివారు తాంబూలంలో మామిడిపండ్లుంచి మంగళవారం కుమారస్వామిని పూజించాలి

2. వృషభరాశివారు తాంబూలంలో మిరియాలులుంచి మంగళవారం రాహువుపూజ చేయాలి.

3. మిథునరాశివారు తాంబూలంలో అరటిపండ్లుంచి బుధవారం ఇష్టదైవాన్ని పూజించాలి.

4. కర్కాటకరాశివారు తాంబూలంలో దానిమ్మపండ్లుంచి శుక్రవారం కాళీమాతను పూజించాలి.

5. సింహరాశివారు తాంబూలంలో అరటిపండ్లుంచి గురువారంనాడు ఇష్టదైవాన్ని పూజించాలి.

6. కన్యారాశివారు తాంబూలంలో మిరియాలుంచి గురువారం ఇష్టదైవాన్ని పూజించాలి.

7. తులరాశివారు తాంబూలంలో లవంగాలుంచి శుక్రవారం ఇష్టదైవాన్ని పూజించాలి.

8. వృశ్చికరాశివారు తాంబూలంలో ఖర్జూరపుపండ్లుంచి మంగళవారం ఇష్టదైవాన్ని పూజించాలి.

9. ధనుర్రాశివారు తాబూలంలో కలకండనుంచి గురువారం ఇష్టదైవాన్ని పూజించాలి.

10. మకరరాశివారు తాంబూలలో బెల్లముంచి శనివారం కాళీమాతను పూజించాలి.

11. కుంభరాశివారు తాంబూలంలో నెయ్యివేసి శనివారం కాళీమాతను పూజించాలి.

12. మీనరాశివారు తంబూలంలో పంచదారనుంచి ఆదివారం ఇష్టదైవాన్ని పూజించాలి.

ఇదీ పూజకు, శుభకార్యాలకు సంబంధించిన తాంబూలవిషయం.

 ఇక తాంబూలసేవన విషయానికొస్తే, మనభారతదేశంలో తాంబూలసేవనమొక భోగం, ఒకవిలాసం, ఒకదర్పం, ఒకగొప్పస్థాయికి చిహ్నం. రాజులు తమదర్పం కనబడటానికి ఆకులు వక్కలు సున్నం తోబాటు సుగంధద్రవ్యాలుంచిన వెండిపెట్టెను పట్టుకొనుండే విలాసిని నియమించుకునేవారు. ఆవిలాసినిని తాబూలకరండవాహిని అనేవారు. తాంబూలచర్వణమేగాదు ఆతర్వాత వూసేయాడానికీ  ఒకవిలువైన పాత్రను వాడేవారు. ఆతాంబూలసేవనంలో కూడా ఉదయంవక్కలు, మధ్యహాన్నం సున్నం , రాతిలో తమలపాకులు యెక్కువ వేసుకోవాలని శాస్త్రనిర్ణయం.

  శ్లో: ప్రాతః కాలే ఫలాధిక్యం

        చూర్ణాధిక్యంతు మధ్యమం

        వర్ణాధిక్యం భవే ద్రా త్రౌ

        తాంబూలమితి లక్షణం---బావప్రకాశిక.

 ఇంకా తాంబూల ప్రాశస్త్యాన్ని సుమతీశతకకారుడు యిలాగొనియాడారు.

 క: తమలము వేయని నోరును

     విమతులతో జెలిమిజేసి వెతఁబడు తెలివిన్

    గమలములు లేని కొలకును

    హిమధాముడులేని రాత్రి హీనము సుమతీ.

 కవితాపితామహుడు అల్లసానిపెద్దన కవితలల్లాలంటే తాబూలం వుండాల్సిదే నంటున్నారు

 ఉ: నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క

     ప్పుర విడె, మాత్మ కింపయిన భోజన, మూయల మంచ, మొప్పు త

    ప్పరయు రసజ్ఞు, లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,

    దొరకిన కాక, యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే .  

 రాజులుపోయినా తాంబూలవిలాససేవనం మాత్రం, యేమాత్రం తగ్గలేదు. అది సామాన్యునికీ నేడు అందుబాటులోనే వుంది. తాంబూలంలో ఆకువక్క, సున్నంతోబాటూ, కాచు (దీన్ని

తుమ్మజాతి చెట్టు బెరడునుండి తయారు చేస్తారు) ఏలకలు లవంగాలు, జాజికాయ, జాపత్రి, మెంథాల్, కొబ్బరితురుము గుల్కంద్ వంటి వస్తువులు ఎవరియిష్టానుసారం వాళ్ళు వేయించుకొని సేవిస్తారు. పెండ్లితర్వాత  కొత్తపెండ్లాము భర్తకు ముద్దుముద్దుగా చిలుకలుచుట్టి భర్తనోటికందిస్తుంది. చిలుకలంటే యిక్కడ చేతివేళ్ళకు చుట్టుకున్న తమలపాకులన్నమాట. ఇక వేశ్యాగృహాలలో యీ  చిలుకల వినియోగం ప్రత్యేకంగా  చెప్పవలసిన పనిలేదు. తాబూలానికివాడే తమలపాకులుకూడా చాలారకాలే వున్నాయి. తెల్లాకు, కారపాకు(బనారసి), కలకత్తాపత్తా, కుభకోణంఆకు, వెల్లారి, కలిజేడు వంటివెన్నోవున్నాయి. తాంబూలాన్ని విడెమని, బీడాయని, కిల్లీయనికూడాపిలుస్తారు. వీటిని ప్రత్యేకంగా తయారుచేయగల నేర్పరులున్నారు. వారు తంబూలాన్ని ఒక వ్యాపారవస్తువుగా చేసుకొని అమ్ముకొనుచున్నారు. పట్టణాలలో భోజనహోటళ్ళదగ్గర భోజనానంతరం వేసుకోవడానికి వీలుగా అమ్ముతుంటారు. వీటిలో జర్దాలు, పొగాకువంటివి కలిపిచేసే బీడాలు కూడా దొరుకుతాయి. వీటికి అలవాటుపడి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న వాళ్ళూ వున్నారు.

 సాధారణంగా తమలపాకువెనుక కనబడే ఈనెలూ, తొడిమలు తొలగించి తాంబూలంలోవాడుకుంటారు. ఈనెలు తొడిమలు ఆరోగ్యానికి మంచివికావని నమ్ముతారు. ఆయుర్వేదంలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యమున్నది. శ్వాసకాసవ్యాధులలో తమలపాకు చాలాబాగాపనిచేస్తుంది. జీర్ణప్రక్రియకు తోడ్పడుతుంది. గొంతునొప్పిని నయంచేస్తుంది. తాంబూలంలోని తమలపాకుసున్నం వలన ఎముకలు బలపడతాయి. ఇంకా ఎన్నోవ్యాధులకు తమలపాకుకలిపిచేసిన మందులు ఆయుర్వేదంలో వున్నాయి. నెయ్యి చాలాకాలం నిలువవుండటానికి తమలపాకులువేసి నెయ్యిని కాచుకుంటారు. నూనెలుకూడా తొందరగా చెడెపోకుండా వుండటానికి తమలపాకులు వేసివుంచుతారు. తాంబూలం అప్పుడప్పుడు వేసుకోవడం మంచిదేగానీ, అదిలేనిదే వుండలేనంతగా అలవాటుచేసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదియేమైనా తాంబూలం మనజీవనశైలిలో మిళితమైయున్నదనుట నిర్వివాదాంశం.                 

 

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...