ఉంగరం చేతివ్రేలికి ధరించే ఆభరణం. మణికట్టుపైన ధరించే కంకణం.
మోచేతిపైన ధరించే వంకిణి కూడా ఉంగరంవంటి ఆభరణాలే. అన్నిజాతులూ, అన్నిమతాలవారు పురాతనకాలమునుండి ఉంగరాలు
ధరిస్తూనే వున్నారు. హనుమంతుడు శ్రీరాముని ఉంగరాన్ని లంకలోని సీతాదేవికి ఆనవాలుగా
చూపించాడన్నది మనందరకు తెలిసిన విషయమే. కొందరు ముస్లిములు వారి మతాచారాన్ననుసరించి
ఉంగరం ధరించరు. హిందువులు జ్యోతిషశాస్త్రానుసారం రాశులు, నక్షత్రాలననుసరించి
ముత్యాలు, వజ్రాలు, పగడాలు, రత్నాలు పొదిగిన ఉంగరాలు ధరిస్తారు. పాశ్చాత్యులు వివాహసందర్భంగా వధూవరులు
ఒకరికొకరు ఉంగరం తొడుగుతారు. అందువల్ల ఒకరిస్పందనలు మరొకరికి తాకుతాయని నమ్ముతారు.
ఇప్పుడు హిందువుల కుటుంబాలలో కూడా నిశ్చితార్థం రోజు వధూవరులు ఉంగరరాలు ఒకరికొకరు
తొడిగే కార్యక్రమం చేస్తున్నారు. పూర్వపు రాజులు తాముధరించేఉంగరాన్నే తమ అధికరముద్రికగా
ఉపయోగించేవారు. ఉంగరపువ్రేలికి చెవికి నరాల అనుబంధం వుంది. ఉంగరం ధరించడమువల్ల
శరీరంలోని నరాలు ఉత్తేజితమౌతాయి. కుడిచేతికి ముఖ్యంగా రాగిఉంగరం ధరించడంవల్ల
కలుషిత ఆహారాన్ని గుర్తించి జాగ్రత్త పడవచ్చు. ఆహారం విషపురితమైతే రాగిఉంగరం
నీలిరంగులోకి మారుతుంది. రాగివల్ల యింకా ఎన్నోప్రయోజనాలున్నాయి. కుడి అనామిక
(ఉంగరపు వ్రేలు) సూర్యునికి ప్రతీక. రాగికూడా సూర్యునినుండి అంగారకునినుండి
అనుకూలశక్తిని గ్రహించి శరీరానికందిస్తుంది. తద్వరా శరీరం వ్యర్థాలను బయటికి
పంపించేస్తుంది. రాగి మానసికఒత్తిడిని తగ్గించి ప్రశాంతతనిస్తుంది. తలనొప్పిని
నివారిస్తుంది. తాపాన్ని తగ్గిస్తుంది. రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంది.
అందువల్ల కీళ్ళనొప్పులు, ఉదరవ్యాధులు నయమౌతాయి. దగ్గు
గొంతువ్యాధులు రావు. చర్మానికి జుట్టుకు మేలుచేస్తుంది. ఒకేవుంగరమైతే కుడి అనామిక
(చిటికెనవ్రేలు ప్రక్కవ్రేలు)కు ధరిస్తారు. అనేకమైతే యిక పదివ్రేళ్ళకూ ధరించవచ్చు.
బంగారు, వెండి, రాగి మరియూ
మిశ్రమలోహాలతోగూడా స్తోమతనుబట్టి చేయించుకుంటారు. ఎడమచేతి ఉంగరం గుండెకు
మేలుచేస్తుంది. సామాన్యంగా ఊరకున్నప్పుడు ఉంగరాన్ని పైకిక్రిందికి కదిలిస్తూ
వుంటారు. అందువల్ల కలిగే ఒత్తిడివల్ల మేలే కలుగుతుంది. కిడ్నీల నరాల పనితీరు
మెరుగౌతుంది. ఉంగరం బొటనవ్రేలికి ధరిస్తే ఆత్మవిశ్వాసం పెంపొంది, ఏపనినైనా సాధించాలనే పట్టుదల గలిగి ధైర్యంతో వ్యవహరిస్తారు.
చూపుడువ్రేలికి ధరిస్తే నాయకత్వలక్షణాలు పెంపొంది, శ్రమకోర్చి
ఆత్మగౌరవంతో మెలగుతారు. మధ్యవ్రేలికి ధరించడంవల్ల బాధ్యతగలవ్యక్తిగా జీవిస్తారు.
అనామికకు (ఉంగరం వ్రేలికి) ధరిస్తే నూతనావిష్కరణలవైపు మొగ్గుచూపుతారు. ప్రేమ
అనుబంధాలకు విలువనిస్తారు. చిటికనవ్రేలికి ధరిస్తే వృత్తివిద్యలలో,
ప్రసారమాధ్యమవిద్యలలో నిపుణులౌతారు. బుధగ్రహం అనుకూలమై తెలివితేటలతో వ్యవహరిస్తారు.
దర్భవుంగరం పవిత్రంగా యజ్ఞయాగాదులలో వ్రతాలలో ధరిస్తారు. దీని ఆధారంగా కేరళలోని కన్నూర్‌జిల్లా పయ్యనూర్ పురోహితుల సలహామేరకు దర్భ ఉంగరం ఆకారంలోనే బంగారువుంగరాలు పయ్యనూర్లోని కొన్నికుటుంబాలవారు మూడునుంచి ఏడురోజులు శ్రమించి తయారుచేస్తారు. మూడుగీతలుగల యీ ఉంగరం ఇడ, పింగళ, సుషుమ్ననాడులకు ప్రతీకగా భావిస్తారు. పయ్యనూర్ కుమారస్వామి వద్ద పూజలోవుంచి తదనంతరం ధరించడానికిస్తారు. కుడి అనామిక కొలతలతో 30.28,19,14,9,7,4 గ్రాములబరువుతో యీ ఉంగరాలు నిష్ఠతో తయారుజేస్తారు.ఈ ఉంగరం ధరించడంవల్ల కుండలినీశక్తి ఉత్తేజితమౌతుంది. దైవానుగ్రహం కలుగుతుందనీ, దైవం మీవెన్నంటివుండి విజయంచేకూరుస్తాడనీ నమ్ముతారు. ఈ ఉంగరం తయారుచేసేవారు జీవితాంతం పొగత్రాగరు, మధుమాంసాదులు ముట్టరు. ఉంగరాలలో మేరువు (తాబేలు) ఉంగరానికిగూడా చాలామహిమ గలదని నమ్ముతారు. ఈ ఉంగరాల శిరస్సుభాగం మణికట్టువైపు ఉండేట్టు ధరించాలి. అంటే గుప్పిటముడిచి కళ్ళకద్దుకొనుటకు వీలుగా వుండాలి. ఈపవిత్రవుంగరాలను స్ట్రీలు బహిష్టుసమయానికిముందే తీసి దేవునిగూట్లో భద్రంగావుంచాలి. భోజనంచేసేటప్పుడు ఎంగిలి ఉంగరానికంటరాదు. ధూమపానంచేయరాదు. సారాయిత్రాగరాదు. మాంసాహారాలు తినరాదు. ఈనియమాలు పాటించకపోతే అనిష్టమని పురోహితులు జాగ్రత్తలు చెబుతున్నారు.