Friday, 11 October 2024

ఒక తిక్కన భారత సన్నివేశం



ఒక తిక్కన భారత సన్నివేశం
ధృతరాష్ట్రునిరాయబారి సజయునితో శ్రీకృష్ణపరమాత్మ యిలా అంటున్నారు.

 

ఉ:  ఎందును నెవ్వరుం బడని యెంతయుఁ గష్టముపాటు వచ్చినం
     గొందల మంది పాండువిభుకోడలు దవ్వుల నున్న నన్ను ‘గో
            విందుఁడ ! కావు’ మంచుఁ బలవించుట యీఁగఁగరాని యప్పుఁ బో
            లెం దలపోయ వ్రేఁగయి చలింపకయున్నది యెప్పుడున్‌ మదిన్‌.    129


            తే:  ఇట్టి యేఁ దేరు గడపంగ, నెందు నుతికి
                 నెక్కు గాండీవ మేడ్తెఱ నెక్కు వెట్టి
                 రెండు దొనలను బూని కిరీటి యనికి

                 వచ్చు నేఁ డెల్లి; యెందుఁ బోవచ్చు మీకు?   130

(మహాభారతం ఉద్యోగపర్వం ద్వితీయాశ్వాసం 129 & 130 పద్యాలు )


సంజయా! ఎప్పుడూ ఎవ్వరూకూడా పడనటువంటి కష్టానెదుర్కోవలసి వచ్చింది ద్రౌపదికి. నిండుసభకు వెండ్రుకలుబట్టి యీడ్చుకరాబడింది. వస్త్రాపహరణకు గురికానున్న సమయంలో, ఆసభలోని వారినెవరినీ రక్షింపమని అర్థించలేదు. నేను వాస్తవానికక్కడ లేను. చాలాదూరంగా ద్వారకలో వున్నాను. ఎవరైనా నేనామెను ఆదుకోగల  నను కుంటారా? ఆదుకోలేననే అనుకుంటారు. అయితే ద్రౌపది గోవిందా! కాపాడుమని విల పించింది. ఆమె కాపాడబడింది. ఆమెకు నాపై యెంతవిశ్వాసమో చెప్పనలవికాని విషయమది. ఆనాటినుండి నాపరిస్థితి యెట్లున్నదంటే, దారుణంగా అప్పులలో కూరుకపోయి, తీర్చేమార్గంగానక యేవిధంగా మనిషి ఊపిరిసలపని విధంగా వ్యధకు లోనౌతాడో ఆవిధంగా నామనస్సు తీవ్రమైన వ్యధకు లోనై వున్నది. కనుక సజయా! నేనేదోఒకటి చేసి నావ్యధకు ఉపశమనం కనుగొనాలి. అందుకు మార్గం నేను అర్జునరథసారధినై ముందుకు నడిపించుచుండగా, అర్జునుడు తనరెండు భుజాలవెనుక అక్షయతూణీరములు దాల్చి, పేరెన్నికగన్న గాండీవ చాపము ధరించి త్వరలో రణరంగ ప్రవేశంచేసి శశత్రువులనుచీల్చి చెండాడుతాడు, అప్పటికీగానీ నాపరితాప మారదు. అప్పుడు మీకౌరవులెక్కడికి పారిపోతారు? ఆపద ముంచుకొస్తున్నది సుమా! అన్న శ్రీకృష్ణునిమాటలు సభాముఖంగా ధృతరాష్రునకు యదాతథంగా సంజయుడు వినిపించాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అదివేరు విషయం.  

 ఈపద్యాలు చూడటానికి సామాన్యసంగా కనబడినా, ఒకగొప్ప ఆధ్యాత్మికానుభవ రహస్య మిందులో యిమిడివుంది. మనం దైవసన్నిధికెళతాం. దర్శనంచేసుకుంటాం. ప్రార్థిస్తాం. మంచిదే, యిది సర్వసామాన్యం. కానీ మహాత్ముల ప్రవచనమేమంటే, మనంచూడ్డం సరే! కానీ దైవం మనలను చూడాలి. దైవందృష్టి మనపైబడాలి. అందులకేదో మనం చేయాలి, తత్ఫలితంగా దైవందృష్టి మనవైపునకు మరలాలి. ఆపనిచేసేసింది ద్రౌపది. ఏమాత్రం సంశయంలేని విశ్వాసం కృష్ణపరమాత్మపై వుంచింది. కేవలం మాటవరుసకుగాక "నీవేతప్ప యితఃపరంబెరుగ" అని సంపూర్ణ శరణాగతినొంది, పరమాత్మ యేదో ఒకచోటుకు పరిమిత మైయున్నాడనిగాక, పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని పూర్తిగా నమ్మి వేడుకొంది. అంతటితో ఆమెపని పూర్తిచేసేసింది. ఇక పరమాత్మకు ఆమెరక్షణ తప్పనిసరైపోయింది. ఆమెభారం పూర్తిగా పరమాత్మకు బదలాయించేసింది. అదీ భగవంతుని విషయంలో నిజమైనభక్తులు చేయవలసినపని. యిదీ యీపద్యాలద్వారా మనకందుతున్న  సందేశం.

 

భగవంతుడు తనవాడైపోవడానికి యెన్నోమార్గాలున్నాయ్. ఈవిషయంలో యెవరి ఉపాయం వారిది.చక్రధారి సినిమాలో ఒకగీతమున్నది. "నీవెవరయ్యా నేనెవరయ్యా నీవునేను ఒకటేనయ్యా " అదెలాగంటె "నేను కుండలుచేసే కుమ్మరినయ్యా నీవు బ్రహ్మను చేసిన కుమ్మరివయ్యా నువవునేను ఒకటేనయ్యా " అని ఒకకుమ్మరిభక్తుడైన గోరాకుంబర్ త్రికరణశుద్ధిగా నమ్మి భగవంతుని తనవానిగా చేసుకున్నాడు. అంతే, కృష్ణపరమాత్మ భక్తపోషణకై గోరాకుంబరునియింట మట్టిద్రొక్కి కుండలుజేయాల్సి వచ్చింది. భక్తపరాధీనత భగవంతుని లక్షణం. నమ్మండి. "నమ్మినవానికి ఫలముంది, నమ్మనివానికి యేముంది? (యేమీలేదు) నమ్మీనమ్మని మూఢజనానికి స్వర్గం (సద్గతి) దూరంగా వుంది"  ఆలోచించండి. నమ్మి ఫలితంపొందండి.

                                                                            ఓం తత్ సత్   


No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...