Showing posts with label ముగ్గులు (రంగవల్లులు). Show all posts
Showing posts with label ముగ్గులు (రంగవల్లులు). Show all posts

Thursday, 22 December 2022

ముగ్గులు (రంగవల్లులు)

 

ముగ్గులు (రంగవల్లులు)



ఇంటిముందు ముగ్గులుపెట్టడం హైందవసాంప్రదాయంలో ఒకభాగం. ముగ్గులు పెట్టడమంటే భూమినలంకరించడమే.కంటికింపుగా అలంకరించిన భూమినిచూడటం వలన పీడలు తొలగిపోతాయి.దీర్ఘాయువు కలుగుతుందని హైందవవిశ్వాసం. ఇంటిగడపముందు రెండూడ్డగీతలుగీసి ముగ్గువేస్తే ఇంటిలోనికి దుష్టశక్తులు రావు. ఇంట్లోవున్న లక్షీదేవి బయటకువెళ్ళిపోదు. ముగ్గుకు నలువైపులా అదేముగ్గుపిండితో జంటగీతలువేసి ఇక శుభకార్యాలు నిరాటంకంగా జరుపుకోవచ్చు. ఆముగ్గుగీతలు రక్షగానిలుస్తాయి. నక్షత్రాకారంలో వేసేముగ్గు భూతప్రేతపిశాచాలను దూరంగా తరిమేస్తుంది. ముగ్గులోనిగీతలు యంత్రాలుగా పనిచేస్తాయి. కనుక వాటిని కాళ్ళతో త్రొక్కరాదు. ముగ్గుత్రొక్కకుండా వెళ్ళడానికి అనువుగా దారివదలి వేసుకోవాలి. యజ్ఞగుండాలచుట్టు జంటగీతలుగీసి ముగ్గులువేసి శుభకరం గావిస్తారు. త్రొక్కే ప్రమాదమున్నచోట దేవతలరూపాలనూ స్వస్తిక్ శ్రీ గుర్తులను ముగ్గుగా వేసుకోరాదు. దేవాలయాల్లో లక్ష్మీదేవి మహావిష్ణువుముందు ముగ్గులువేసే స్త్రీ నిత్యసుమంగళిగా వర్థిల్లుతుందని దేవీభాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.ఇంటిముందు ఇంటివెనుక తులసికోటకు ముందు వేసే గీతలముగ్గులు నకారాత్మకశక్తునను నిరోధించి దైవీయశక్తులను ఆకర్షిస్తాయి. ఇంటిముందు ముగ్గులేని ఇల్లు అశుభానికిగుర్తు. ఆ ఇంటిలో శ్రాద్ధకర్మలు జరిగుతున్నాయని భావించి పూర్వం యాచకులుకూడా ఆ ఇంటిముందుకు వచ్చేవారు కాదట.  

సంక్రాంతిపండుగ ముగ్గులకు ప్రసిద్ధి. నెలరోజులముందునుంచే ఇంటి ఇల్లాలు కల్లాపిజల్లి ముంగిళ్ళలో రకరకాలరంగులముగ్గులు వేస్తారు. పూర్వం ముగ్గుపిండిగా బియ్యంపిండి వాడేవారు. ఆ బియ్యంపిండి చీమలకు పిచ్చుకలవంటి చిన్నచిన్నపక్షులకు ఆహారంగా ఉపయోగపడేది.  తర్వాతికాలంలో తెల్లటిముగ్గురాళ్ళపిండిని సుద్దముక్కలను చాక్‌పీసులను వాడుచున్నారు. ప్రస్తుతం చిత్రాతిచిత్రంగా ముగ్గులువేయడానికి అనేకరకాలైన రంగులు మార్కెట్‌లో అభ్యమౌతున్నాయి. చుక్కలముగ్గులు గీతలముగ్గులు,నెమళ్ళు,చిలుకలు, పద్మాలవంటి బొమ్మలనుసైతం అందంగా రంగులతో  తీర్చిదిద్దితున్నారు. సంక్రాంతిముగ్గుల పోటీలను సైతం నిర్వహించి స్త్రీలలోని సృజనాత్మకతను ప్రొత్సహిస్తున్నారు. పూర్వమునుండి ప్రత్యేకంగా రథంముగ్గును సంక్రాంతి ఆఖరురోజున వేసేవారు. ఆ రథం ఒకయింటినుండి మరోయింటిని కలుపుకుంటూ వీధిలోని అన్నియిండ్లకూ వ్యాపించేది. అవి యిప్పుడు రంగులమయమై అందంగా కన్నులకింపుగ వుంటున్నాయి. ముగ్గులకు ప్రత్యేకంగా పుస్తకాలే వచ్చేసాయి. వార్తాపత్రికల్లోనూ క్రొత్తక్రొత్త ముగ్గులు పోటీపడి ముద్రిస్తున్నారు. ముగ్గులపై వ్యంగచిత్రాలుకూడా హాస్యస్పోరకంగా పత్రికలలో దర్శమిస్తున్నాయి. సంవత్సరాదిన అదేపనిగా శుభాకాంక్షలు   తెలిపేముగ్గులువేసి ఇంటిముదుకువచ్చే వారిని  సంతోషపెడుతున్నారు. దీపావళికైతే రంగుముగ్గులలో దీపాలుంచి మరీ శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఈముగ్గులువేయడానికి మహిళలు తెల్లవారుజాముననేలేచి నడుమువంచి ముగ్గులువేస్తారు. తద్వారా  త్వరగానిద్రలేచే మంచియలవాటు అలవడుతుంది. అంతేగాక తేలికపాటి వ్యాయామంకూడా చేసినటౌతుంది. ఈవిధంగా ముగ్గులు ఆరోగ్యదాయినిలౌతున్నాయి.

ముగ్గులువేయడం తెలుగురాష్ట్రాలకే పరిమితంకాలేదు. దేశవిదేశాలలో కూడా ఈసంస్కృతి వర్ధిలుతున్నది. ఈముగ్గులువేయటాన్ని కర్ణాటకలో "హేసే" యని "రౌంగోలి" యని పిలుస్తారు. మహారాష్ట్రాలో "రంగోలీ" అంటారు. తమిళనాడులో "పుల్లికోలం" అంటారు. మిథాలీప్రాంతంలో "అరిపన్" అంటారు. ఇంకా కేరళ, గోవా ప్రాంతాల్లోకూడా రంగవల్లులు తీర్చిదిద్దే ఆచారమున్నది. ఇతర ఆసియాదేశాలయిన శ్రీలంక, ఇండోనేషియా థాయిల్యాండ్, మలేషియాలలోకూడా ముగ్గులు దర్శనమిస్తాయి. మనభారతదేశంలో ఉత్తరాదిన ప్రకృతిలోని అందమైన జంతువులు, పక్షులు, చెట్లు రంగవల్లులలో కనిపిస్తాయి. అదే దక్షిణాదిన వృత్తాలు, చుక్కలు, సరళరేఖలు ఎక్కువగా ముగ్గులలో కనబడతాయి.

 ఇవీ మనముగ్గుల ముచ్చట్లు.

 


 


 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...