Showing posts with label దర్భ. Show all posts
Showing posts with label దర్భ. Show all posts

Thursday, 9 June 2022

దర్భ, darbha.

 

దర్భ

   

"కుశాగ్రేచ సదావిష్ణుః కుశమధ్యే శివస్మృతః

కుశాంతేచ సదావిధిః కుశః త్రైమూర్తికోవిదుః


హిందువులకు శుభాశూభకార్యాలన్నింటీలో దర్భల  ఉపయోగం తప్పనసరి. దర్భమూలంలో బ్రహ్మ, మధ్యలో శివుడు, కొసలో విష్ణువు విరాజమానమైవుంటారని శాస్త్రంచెబుతున్నది. శ్రీరామునిస్పర్శచే దర్భలు పవిత్రతను సంతరించుకొన్నవని బుధు ఉవాచ. యజ్ఞయాగాదుల నుండి దేవతాప్రతిష్ఠలలోను, పితరులకుపిండప్రదానాలలోనూ, కుంభాభిషేకాది సందర్భాలలోనూ దర్భలు తప్పనిసరి. యాగశాలకలశాలకు బంగారు, వెండితీగలతోబాటు దర్భనుచేర్చిచుడతారు. వినాయకునికి ప్రీతిపాత్రమైనదిగా భావించి గణపతిపూజలో మిగతాపత్రితోబాటు దర్భనుచేర్చి పూజిస్తారు. కృష్ణయజుర్వేద పరాయతంలో దర్భపవిత్రత గొప్పగాచెప్పబడింది. వైదికకార్యాలలో "పవిత్ర" అన్నపేరుతో కుడి ఉంగరపువ్రేలికి దర్భను ఉంగరంగంగాచుట్టి ధరించి కార్యక్రం నెరవేరుస్తారు. ఉంగరంవ్రేలిగుండ కఫనాడి వెళుతుంది. ఆవ్రేలికి దర్భ ఉంగరం ధరించడంద్వారా కఫంనివారించబడి కంఠంశుభ్రపడి వేదమంత్రాలు స్వచ్ఛంగా పలుకగలుగుతారు. అందుకే వేదాభ్యాసంచేసే విద్యార్థులు దర్భ ఉంగరం తప్పక ధరిస్తారు. ప్రేతకార్యనిర్వహనలో ఒకదర్భను ఉంగరంగాచేసుకుంటారు. వివిధశుభకార్యాలలో రెండు, పితృకార్యాలలో మూడు, దేవకార్యాలలో నాలుగుదర్భలు ఉంగరంగా చుట్టుకుంటారు. అందువల్ల అపవిత్రవస్తువులను తాకినా, చెడువార్తలువిన్నావచ్చే దోషం దర్భదారణతో నివారణమౌతుంది, అంతేగాక వారి ప్రాణశక్తి హెచ్చింపబడుతుంది. దర్భలుకోసేటప్పుడు మంత్రపూర్వకంగా కోసుకరావడం మంచిది. ఆమంత్రం యిది

                        విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ

                           నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

 పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు దర్భలు తీసురావడం అత్యంతశ్రేష్టం. సర్వసాధారణంగా

దర్భలు ఆదివారం కోసితెస్తే ఒకవారంవరకు పనికివస్తాయి. అమావాస్యదినం తెచ్చుకుంటే ఒకమాసం, పున్నమినాడు తెస్తే ఒకపక్షం పనికివస్తాయి. అదే శ్రావణమాసంలో తెచ్చుకుంటే సంవత్సరమంతా వాడుకొనవచ్చును. భాధ్రపదమాసంలోతెచ్చుకుంటే ఒకపక్షంలోనే వాడుకోవాలి. శ్రాద్ధకర్మలకోసం తెచ్చిన దర్భలుమాత్రం యేరోజుకారోజే ఉపయోగించాల్సి ఉంటుంది.

 మత్స్య, కూర్మ, వరాహ, పద్మ, నారద, అగ్ని, స్కాంద పురాణాలలో దర్భలప్రస్తావన, పురాణగాధలూ ఉన్నాయి. వరాహావతారంలో హిరణ్యాక్షుని వధించినతర్వాత బ్రహ్మ అవతారపురుషుని చుట్టూ మూడుప్రదక్షణలు చేస్తాడు. అప్పుడు వరాహమూర్తి సంతోషంతో శరీరం విదిలిస్తాడు. అప్పుడు ఆయన శరీరంనుండి కొన్నిరోమాలు రాలి భూమిమీదపడ్డాయి. అవే దర్భలైమొలిచాయి. కూర్మపురాణం ప్రకారమైతే, మంథరపర్వతాన్ని కూర్మావతారమూర్తి వీపుపై అటూయిటూ కవ్వంగా దేవదానవులు త్రిప్పినపుడు అవతారమూర్తివీపుపైనున్న కొన్ని వెండ్రుకలు రాలి పాలసముద్రంలో పడిపోయాయి. అమృతం ఆవిర్భవించినతర్వాత కొద్దిఅమృతం ఆవెండ్రుకలతోకలసి ఒడ్డుకుచేరి, తర్వాత అవే దర్భలుగా మొలకెత్తాయి. మరోకథనంప్రకారం ఇంద్రుడు వృత్రాసురుని సంహరించడానికి సముద్రపుఒడ్డుకువచ్చాడు. వృత్రాసురుడు తడిపొడిగానివస్తువుతో తప్ప యితరంతో చావడు. ఆదివానికున్నవరం  తడిపొడిగాని సముద్రనురగను వజ్రాయుధానికిఅంటించి ఇంద్రుడు ప్రయోగించాడు. వృత్రాసురుడు, క్రిందపడిపోయాడు. ఆయాసంతో నీటికొఱకు తహతహలాడాడు. ఆసమయంలో అతనికి నీరుఅందకుండా చేయడానికి బ్రహ్మ దరిదాపుల్లోన్ని నీటిని గడ్డిమొక్కలుగా మార్చేసాడు. ఆగడ్డిమొక్కలే దర్భలు. మరోకథ ప్రకారం తల్లిబానిసత్వం బాపడానికి గరుడుడు అమృతకలశం స్వర్గమునుండి తెచ్చి నాగులుకోరినట్లు నేలపైవుంచాడు. ఆనేలపైదర్భలుండటంచేత ఆదర్భలు అమృతకలశస్పర్శచే అమృతగుణం పొందాయి.  పాములు స్నానంచేసి వచ్చేలోపల ఇంద్రుడు అమృతకలశాన్ని అపహరించుకపోయాడు. పాములువచ్చి కలశంవుంచిన చోటగల దర్భలను నాకాయి. అందువల్ల నాగులకు దీర్ఘాయువు గలగటమేగాక నాకేటప్పుడు వాటినాలుకలు తెగాయట, అందుకే పాములకు రెండుగాతెగిన నాలుకలున్నాయి.

దర్భలతోఅల్లిన చాపను దర్భాసనం అంటారు. ఈఆసనంపై కూర్చొని ధ్యానంచేయడంద్వారా ధ్యానంవల్లపొందిన శక్తి భూమిగ్రహించకుండా ఆపుతుంది. మంత్రపూరితజలప్రభావం తగ్గిపోకుండా ఉండటానికి ఆజలంలో దర్భవేసి ఉంచుతారు. పూజాసమయంలో సహోదరులూ, భార్యాపిల్లలతో అనుసంధింపజేయడానికి దర్భలను అందరికి తాకిస్తారు. హోమంచేసేసమయంలో నాలుగువైపులా దర్భలులుంచితే దుష్టశక్తులను పారద్రోలి యజ్ఞం నిరాటంకంగా జరిగేట్లు చేస్తాయి. బుధులు అష్టార్ఘ్యాలు చెప్పారు. వాటిలో దర్భకూడా ఉన్నది. అవి పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, పుష్పములు, దర్భలు. 12 రకాల గడ్డిమొక్కలను  దర్భలుగా పరిగణిస్తారు. అవి కుశలు, కాశములు(రెల్లు), దూర్వ(గరిక), వీహ్రీ(ఎఱ్ఱబుడమగడ్డి), యవలు, ఉసీరములు(వట్టివేరు), విశ్వామిత్రములు, బల్బజములు(మొలవగడ్డి), గోదుమగడ్డి, కుందరముగడ్డి, ముంజగడ్డి, పుండరీకములు. ముఖ్యముగా దర్భజాతులను అపకర్మలందు, కుశజాతులను పుణ్యకార్యములందు, బర్హిస్సుజాతులను యజ్ఞయాగాదిశ్రౌతక్రతువులందును, రెల్లుజాతులను గృహనిర్మాణకార్యములందును వాడుట మంచిది. దర్భలను విశ్వామిత్రసృష్టిగా కొందరుభావిస్తారు. పితృకార్యములకు దర్భలను సమూలంగా గ్రహించడం అవసరం. దర్భకొసలు పదునుగావుంటాయి. ఇటువంటి దర్భలు దేవతలఆవాహనుకు ఉపయోగిస్తారు.

 దర్భలలో ఆడా, మగ, నపుంసక దర్భలుంటాయి. మొత్తందర్భ  క్రిందినుండిపైవరకు సమంగావుంటే పురుషదర్భయని, పైభాగంమాత్రమే దళసరిగావుంటే స్తీదర్భయని, అడుగుభాగంమాత్రమే దళసరిగావుంటే నపుంసక దర్భయని పరిగణిస్తారు.

 గ్రహణకాలంలో దర్భలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. గ్రహణకాలంలో చంద్రుని లేక సూర్యుని కిరణాలరేడియేషన్ విషయుల్యమై కీడుచేసే ప్రమాదముంది. ముఖ్యంగా గర్భవతులు జాగ్రత్తగా కిరణాలుతమపై పడకుండా చూసుకోవాలి. అంటే ఇంట్లోనేవుండాలి. నీరు మరియు ఆహారపదార్తాలలోకూడా దర్భవేసి వుంచితే అవి దూషితాలుకాకుండా వుంటాయి. ఈవిషయంపై అధ్యయనంచేసి పదార్తాలు చాలాకాలం చెడిపోకుండా నిలువచేయగల గుణం దర్భలకుందని తెలుసుకున్నారు. కనుక ప్రిజర్వేటివ్‍లుగా దర్భలువాడవచ్చని నిరూపణయింది.

 దర్భలు ఆయుర్వేదంలోనూ, హోమియోపతిలోనూ ఔషదములుగా వాడుతున్నారు. దర్భలతోచేసినమందులు చలువచేస్తాయి. మూత్రం సాఫీగాజారీఅయ్యెట్లు చేస్తాయి. మంటతో మూత్రం బొట్లుబొట్లుగా రావడాన్ని నయంచేస్తాయి. పాలిచ్చేతల్లులకు క్షీరవర్ధినిగా పనిచేస్తాయి. ఉబ్బసము, బంకవిరేచనాలు, కామెర్లు, పైత్యప్రకోపాలు నయమౌతాయి. వీర్యవృద్దికితోడ్పడుతాయి. ఇలా దర్భలు అనేకసుగుణాలు కలిగియున్నాయి.                

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...