శమీవృక్షం
(జమ్మిచెట్టు)
హిందువులు పూజించే వృక్షాలలో జమ్మి ముఖ్యమైనది. ఋగ్వేదకాలమునుండి శమీప్రస్తావనవుంది.
పాండవులు యీ వృక్షంమీదనే తమ
ఆయుధాలను దాచియుంచి అజ్ఞాతవాసానికి వెళ్ళారు. అజ్ఞాతవాసానంతరం తిరిగి తమ ఆయుధాలను జమ్మినుండి
గ్రహించేసమయంలో జమ్మిరూపంలోనున్న అపరాదేవిని పూజించి, ఆసీస్సులుపొంది
కౌరవుపై విజయం సాధించారు. శ్రీరాముడు పదితలల రావణుని భీకరరూపంచూసి భీతిల్లి
నిద్రించియున్న శక్తిని పూజించగా శమీరూప అపరాజితాదేవి మేల్కొని రాముని దీవించిందని
దేవీపురాణంలోవుంది. ఆదీవెనలతోనే రాముడు రావణసహారం చేశాడన్నది పురాణగాధ. లంకనుండి
అయోధ్యకు బయలుదేరేముందుకూడా రాముడు శమీపూజచేశాడు. శ్రీరాముడు, పాండవులు శమీపూజ
చేసినరోజు విజయదశమి. అమ్మవారు మూడుమూర్తుల శక్తులతో భీకరయుద్ధం తొమ్మిదిదినాలుచేసి
మహిషాసురుని సంహరించినదికూడా యీవిజయదశమి నాడే. దుర్గామాత తనకుమారులైన గణపతిని, కుమారస్వామిని
చూడటానికివెళ్ళి వారిసేవలుపొంది తిగివచ్చిన దినంకూడా యీ విజయదశమిననే. అందుకే నవరాత్రులతర్వాతి విజయదశమిరోజున అందరూ
శమీవృక్షరూపంలోనున్న అపరాజితాదేవిని యీ శ్లోకాలతో పూజిస్తారు.
శ్లో: శమీ శమయతే పాపం, శమీ
శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ,
రామస్య ప్రియదర్శినీ!!
శ్లో: కరిష్యమాణ
యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా
తత్ర నిర్విఘ్న కర్త్రీవం భవ శ్రీరామ పూజితా!
అనగా శమీవృక్షం పాపాలను శమింపజేస్తుంది.
శత్రునాశం గావిస్తుంది. అర్జునిని గాండీవన్ని ఓసంవత్సరం ధరించింది. శ్రీరామునికి
ప్రియాన్ని కలిగించింది. రామునిచే పూజింపబడింది . ఎడారియాత్రికులకు జైత్రయాత్రకు ( యుద్ధానికి) వెళ్ళేవారికి
సౌఖ్యావిజయాలనిస్తున్నది. సమస్తకార్యాలనూ
నిరాటంకంగానూ విజయవంతంగానూ కొనసాగింపజేస్తున్నది అని అర్థం.
శమీపూజానంతరం పై శ్లోకాలను, చీటీపై వ్రాసి జమ్మిచెట్టుకు కడతారు. అందువల్ల
అమ్మవారి అనుగ్రహంతోపాటు,
శనిగ్రహదోషం కూడా
తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. శమీపూజానంతరం పాలపిట్టనుచూడటం శుభకరమంటారు.
ఆతర్వాత ఇళ్ళకువెళుతూ, జమ్మిఆకులను
తీసుకవచ్చి పెద్దల చేతిలోపెట్టి బంగారం తీసుకోమంటారు. ఈబంగారం లక్ష్మీదేవికి
ప్రతీక. కర్నాటరాజ్యంలో దీనికిసంబంధించి ఒకకథ ప్రచారంలోవుంది. గురుమహానా అనే
గురువుగారి గురుకులంలో శమీవృత్ అనే పేదబాలుడు, వృక్షిత్ అనే
రాకుమారుడు విద్యనభ్యసించారు. గురువుకు గురుదక్షిణ సమర్పించి ఇళ్ళకు
వెళ్ళవలసిన సమయమొచ్చింది. గురువు యిప్పుడుకాడు మీరువెళ్ళి స్థిరపడండి, తర్వాత్ నేనే
వచ్చి మీనుండి దక్షిణ గ్రహిస్తానన్నాడు. అన్నట్లే గురువు తొలుత రాకుమారుడు
వృక్షిత్ దగ్గరకు వెళ్ళాడు. వృక్షిత్ ఎవ్వరూ యివ్వలేనంత ధనరాసులు,విరివిగా
బంగారునాణాలు సమర్పిచాడు. ఇతరవిద్యార్థులు యేమిస్తారో తెలుసుకోవాలని మారువేషంలో
గురువును అనుసరించాడు. గురువు పేదవాడైన శమీవృత్ యింటికెళ్ళాడు. అతడి పరిస్థితిచూసి గురువు
శిష్యా! నాకు నీ పెరటిలోని శమీమొక్కను (బన్నీమొక్కను ) దక్షిణగాయివ్వు అన్నాడు. వెంటనే దాన్ని
తీసుకెళ్ళి నాఆశ్రంలో నాటూ అన్నాడు. మారువేషం తీసేసి రాకుమారుడు వృక్షత్
పకపకానవ్వి, శమీవృత్‌ను
ఎగతాళిచేశాడు. గురువు ఏమీమాట్లాడకుండా శిశ్యులిద్దరినీ ఆశ్రమం తీసుకెళ్ళి ముందు
శమీమొక్కను నాటమన్నాడు. మొక్కనాటినవెంటనే శమీమొక్క ఒకప్రక్క ఆకులురాలుస్తూ
మరోప్రక్క చిగురించడం
మొదలుపెట్టింది. రాలిన ఆకులన్నీ బంగారునాణాలుగా మారసాగాయి. అవన్నీ
గుట్టలుగుట్టలుగా ప్రోగై రాకుమారుని గురుదక్షిణకన్నా ఎన్నోరెట్లు ఎక్కువయ్యాయి. రాకుమారుని దగ్గరకు
తీసుకొని గురువు శమీవృత్ తో స్నేహంగా మెలగమన్నాడు. గురువుచెప్పినట్లే యిద్దరూ
మంచిమిత్రులయ్యారు. అప్పటినుండి ఆప్రాంతంలో "బన్నీ బంగారు వాగోనా" అన్న
నానుడి ప్రచారంలోని కొచ్చింది. దీనికి రెండర్థాలు చెబుతారు. రండి మనం శమీదళాలవలె
బంగారంగా మారుదాం అని ఒక అర్థమైతే, రెండవ అర్థం మనం శమీవృత్‌వృక్షిత్‌లాగా (శమీవృక్షంలాగా) బంగారుబంధమై ఉందాం,అని
దేవదానవులు అమృతంకోసం సముద్రమథనం చేసినపుడు, ఆవిర్భవించిన
వృక్షాలలో శమీవృక్షంకూడా వుంది. వనవాస సమయంలో శ్రీరాముడు జమ్మివృక్షంక్రిందనే
సేదదీరినాడట. అంతేకాదు జమ్మికట్టెలతోనే కుటీరం
నిర్మించుకున్నాడట. వినాయకపూజలోకూడా శమీపత్రాలు ముఖ్యమైనవి. యజ్ఞసమయంలో జమ్మిని
స్త్రీకర్రగానూ, రావిని
పురుషకర్రగానూ భావించి, జమ్మికర్రపైన
రావికర్రను మర్థించి అగ్నిని రగిలిస్తారు. అందుకే జమ్మిని వైదికభాషలో
"అరణి" అని పిలుస్తారు.
జమ్మి బఠానీజాతిచెట్టు. అఫ్గనిస్తాన్, ఇరాన్, ఇండియా, ఒమన్, పాకిస్తాన్, సౌదీఅరేబియా యునైటెడ్అరబ్ఎమెరేట్స్ , యెమన్లలో పశ్చిమ్ఆసియా అంతటా యీ జమ్మి వుంటుంది. బెహరెయిన్ దేశం Tree of life గా దీన్ని గుర్తించింది . జమ్మి ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది.
ఎడారిలోకూడా పెరగడంవల్ల ఎండతాపంనుండి రక్షణనిస్తుంది. దీనిఆకులు ఒకవైపు రాలుతున్నా
మరోవైపు చిగురిస్తూనే వుంటాయి . వేళ్ళుచాలాదూరం
ప్రాకి నీటిని గ్రహిస్తాయి. చెట్టుగాలి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అందుకే చెట్టుచుట్టూ ప్రదక్షణలు చేయమంటారు.
చెట్టును ఇంటి ఆవరణలో నాటుకుంటే శుభకరమని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఇంటికిముందు తూరుపుదిక్కున శనివారమునాడు నాటుకోవడం మంచిది. ఇంటి ప్రధానద్వారం కుడివైపు కుండీలోకూడ పెంచుకోవచ్చు అలాచేస్తే
ఇంట్లోనికి సకారాత్మకశక్తులను రానిచ్చి నకారాత్మకశక్తులను యీమొక్క అడ్డుకొంటుంది. శమీ ముళ్ళచెట్టుగనుక యింట్లో నాటుకోవడంలేదు. ముస్లింలు దీన్ని హజరత్ అల్ హయాత్ అని పిలుస్తారు.
అరబ్ఎమిరేట్స్ దేశానికిది జాతీయవృక్షం. మన రాజస్తాన్, తెలంగాణా కుకూడా యిది రాష్ట్రవృక్షం.
ఆయుర్వేదరీత్యాకూడా
జమ్మి చాలా ఉపయుక్తమైన ఔషదమొక్క. జమ్మిఆకులపసరు పుండ్లకురాస్తే తొందరగా
మానిపోతాయి. జమ్మిపూలను పంచదారతో కలిపిసేవిస్తే గర్భస్రావం జరగదు. జమ్మిబెరడు దగ్గు
ఉబ్బసాన్ని నయంచేస్తుంది. విరేచనాలను అరికడుతుంది. నరాలకు బలాన్నిస్తుంది. మొలలను
తగ్గిస్తుంది. కండరాలలో యేర్పడిన గడ్డలను కరిగిస్తుంది. చెట్టునుండి స్రవించే
జిగురు (బంక) లో చాలా పోషకాలున్నాయి. గర్భవతులకిది అమృతం లాంటిది.