Friday, 26 July 2024

పోతన శ్రీరామ చరిత్రము

 

పోతన శ్రీరామ చరిత్రము






కర్త: పొలిచర్ల సుబ్బారాయుడు

                                                                  9966504951

 

ముందుమాట

 భారతీయసంస్కృతిలో వాల్మీకిభగవానులు రచించిన రామాయణమే ఆదికావ్యం. తదనంతరం అనేకమంది కవులు అనేకభాషలలో శ్రీరామచంద్రుని తమకు నచ్చినరీతిలో ఆదర్శపురుషునిగా తీర్చిదిద్దుతూ రామాయణాలను రచించారు. తెలుగులో రంగనాథ, భాస్కర, ఆధ్యాత్మిక, మొల్లరామాయణాది రామాయణాలెన్నో వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. భవిష్యత్తులో యింకా వస్తాయి. ఆధ్యత్మిక, ధార్మిక, కవిత్వ విషయాలన్నింటికి రామాయణ భారత భాగవతాలు మార్గదర్శకాలుగా నిలచాయి. చిత్రమేమిటంటే భారత భాగవతాల్లో కూడా రామకథ నిక్షిప్తమైవుంది. అయితే భారత భాగవత కథాగమనంలో రామాయణాన్ని వదలి పాఠకులు ముందుకు వెళుతుంటారు. అందుకు కారణం అవి సంక్షిప్తాలు కావడం కావచ్చు. లేదా ఆగ్రంథంలోని కథను కొనసాగించాలనే ఉత్సుకత కావచ్చు.

 భాగవత భారతాల్లోని రామకథలను ప్రక్కకుదీసి, ఒక ప్రత్యేకపుస్తకంగా ప్రచురిస్తే, వేరుగావుంటుంది కాబట్టి, పదిలో పదునొకండుగాగాక పాఠకులదృష్టి నాకర్శించవచ్చుననే సంకల్పంతో యీపనికి పూనుకోవడం జరిగిందిగాని ఇతర ఉద్ద్యేశ్య మేమియులేదు.

 భాగవతం ముఖ్యంగా భగవంతుని ప్రస్తుతించడమే పనిగా వ్రాయబడింది. వేదవ్యసులవారు వేదముల విభజించి, అష్టాదశపురాణాలు, ఉపపురాణాలూ చెప్పినప్పటికీ, పరమాత్మస్తుతి అంతగా లేకపోవుటవల్ల ఆయనకు మనశ్శాంతి కొరవడిందని, నారదమహర్షి సలహామేరకు ఆలోటు భాగవతరచన ద్వారతీరి, మనశ్శాంతి లభించిందని భాగవతంలోనే చెప్పబడింది. 

 కనుక తెలుగు పొతనభాగవతంలోని నవమస్కందంలో రామకథ వుంది. ఇందులోను పరమాత్మస్తుతికే ప్రాధాన్యమివ్వబడింది. పోతన అంత్యప్రాసల ఆనందాన్ని ఇందులోనూ పొందవచ్చు. రామకథ ప్రారంభంనుండే వేగంగా నడుస్తుంది. రావణసంహారం తర్వాత అయోధ్యకు రాముడు తిరిగివస్తూనే తాపిగా, నిదానంగ కథ నడుస్తుంది. రాముని గొప్పదనము, త్యాగము, సౌశీల్యము, రామరాజ్య వర్ణనము, వైభవములతో మనలను ముంచితేల్చి, ఆతర్వాతి ఉత్తరరమాయణకథ మరలా పరుగులుతీస్తుంది. భాగవతం సూర్య చంద్ర రాజవంశాల చరిత్రలకు ప్రధాన్యమిస్తుంది గనుక లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల సతాన్నాన్నిగూడా స్పృజించింది. లవకుశుల తర్వాతిరాజుల విషయం రావడంతో రామాయణం నుండి బయటపడి ముందుకు సాగుతుంది భాగవతం

 పోతన భాగవత రామాయణం కూడా చదువుకుందాం. అందుకోసం తొలుత పొతనరామకథను ఉన్నదున్నట్లు పొందుపరచి, సజావుగా రామాయణం వరుసగా చదువుకోవడానికి వీలుగా పోతన పద్య గద్యాలకు తాత్పర్యంవ్రాసి మీముందుచుతున్నాను.                   నమస్తే!

  

                                                                 మీ

                                                    పోలిచర్ల సుబ్బరాయుడు

                                                          9966504951

 

 

 

 

పోతన శ్రీరామ చరిత్రము

 

వ: అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహుండు, దీర్ఘబాహునకు రఘువు, రఘువునకుఁ           బృథుశ్రవుండుఁ, బృథుశ్రవునకు నజుండు, నజునకు దశరథుండును, పుట్టి; రా దశరథునకు సురప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి నాల్గువిధంబులై శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామంబుల నిజాంశ సంభూతుండై జన్మించె; తచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునులచేత వర్ణితంబైనది; యైననుం జెప్పెద సావధానమనస్కుండవై యాకర్ణింపుము.

మ: అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితుండై నట్లు నారాయణాం

     శమునం బుట్టె మదాంధ రావణశిరస్సంఘాతసంఛేదన

     క్రమణోద్దాముఁడు రాముఁ డా గరితకుం గౌసల్యకున్ సన్నుతా

     సమనైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్.

 

మ: సవరక్షార్థము దండ్రి పంపఁ జని విశ్వామిత్రుఁడుం దోడరా

     నవలీలం దునుమాడె రాముఁ డదయుండై బాలుఁడై కుంతల

     చ్ఛవిసంపజ్జితహాటకం గపటభాషావిస్ఫురన్నాటకన్

     జవభిన్నార్యమఘోటకం గరవిరాత్ఖేటకం దాటకన్.

 

క: గారామునఁ గౌశిక మఖ

   మా రాముఁడు గాచి దైత్యు ధికు సుబాహున్

   ఘోరాజిఁ ద్రుంచి తోలెన్

   మారీచున్ నీచుఁ గపటమంజులరోచున్.

 

మ: ఒక మున్నూఱు గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షుచాపంబు బా

     లకరీంద్రంబు సులీలమైఁ జెఱకుఁగోలం ద్రుంచు చందంబునన్

     సకలోర్వీశులు చూడఁగా విఱిచె దోశ్శక్తిన్ విదేహక్షమా

     పక గేహంబున సీతకై గుణమణిప్రస్ఫీతకై లీలతోన్.

 

క: భూలనాథుఁడు రాముఁడు

    ప్రీతుండై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం

    ఘాతన్ భాగ్యోపేతన్

    సీతన్ ముఖకాంతివిజిత సితఖద్యోతన్.

 

క: రాముఁడు నిజబాహుబల

    స్థేమంబున భంగపఱిచె దీర్ఘకుఠారో

    ద్దామున్ విదళీకృతనృప

    భామున్ రణరంగభీము భార్గవరామున్.

 

క: దరథుఁడు మున్ను గైకకు

    వశుఁడై తానిచ్చి నట్టి రము కతన వా

    గ్ద చెడక యడివి కనిచెను

    దశముఖముఖకమలతుహినధామున్ రామున్.

 

క: జకుఁడు పనిచిన మేలని

    జనకజయును లక్ష్మణుండు సంసేవింపన్

    పతి రాముఁడు విడిచెను

    జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్.

 

క: భతున్ నిజపదసేవా

    నిరతున్ రాజ్యమున నునిచి నృపమణి యెక్కెన్

    సురుచిర రుచి పరిభావిత

    గురుగోత్రాచలముఁ జిత్రకూటాచలమున్.

 

ఉ: పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా

    రణ్యముఁ దాపసోత్తమ శణ్యము నుద్దత బర్హి బర్హ లా

    వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటనప్రభూత సా

    ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

 

సి: ఆ వనంబున రాముఁ నుజ సమేతుడై-

      తితోడ నొక పర్ణశాల నుండ

    రావణు చెల్లలు తిఁ గోరి వచ్చిన-

     మొగి లక్ష్మణుఁడు దాని ముక్కు గోయ

    ది విని ఖరదూషణాదులు పదునాల్గు-

     వేలు వచ్చిన రామవిభుఁడు గలన

    బాణానలంబున స్మంబు గావింప-

      నకనందన మేని క్కఁదనము

 

తే:గి: విని దశగ్రీవుఁ డంగజ వివశుఁ డగుచు

       ర్థిఁ బంచినఁ బసిఁడిఱ్ఱి యై నటించు

       నీచు మారీచు రాముఁడు నెఱి వధించె

       నంతలో సీతఁ గొనిపోయె సురవిభుఁడు.

 

ఉ: ఆ సురేశ్వరుండు వడి నంబరవీథి నిలాతనూజ న

    న్యాయము చేసి నిష్కరుణుఁడై కొనిపోవఁగ నడ్డమైన ఘో

    రాయతహేతిఁ ద్రుంచె నసహాయత రామనరేంద్రకార్యద

    త్తాయువుఁ బక్షవేగపరిహాసితవాయువు నజ్జటాయువున్.

 

వ: అంతనా రామచంద్రుండు లక్ష్మణసహితుండై, సీత వెదక నరుదెంచి,     నిజకార్యనిహతుండైన జటాయువునకుఁ పరలోకక్రియలు గావించి, ఋశ్యమూకంబునకుం జని.

క: "నిగ్రహము నీకు వల దిఁక
     నగ్రజు వాలిన్ వధింతు"
 ని నియమముతో
     గ్రేసరుఁగా నేలెను
     సుగ్రీవుం జరణఘాతచూర్ణగ్రావున్.

     నగ్రజు వాలిన్ వధింతు" ని నియమముతో

     గ్రేసరుఁగా నేలెను

     సుగ్రీవుం జరణఘాతచూర్ణగ్రావున్.

 

క: లీలన్ రామవిభుం డొక

    కోలం గూలంగ నేసె గురు నయశాలిన్

   శీలిన్ సేవితశూలిన్

   మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మూలిన్.

 

క: ఇమీఁద సీత వెదకఁగ

   నలఘుఁడు రాఘవుఁడు పనిచె నుమంతు నతి

   చ్ఛవంతున్, మతిమంతున్,

   బలవంతున్, శౌర్యవంతు, బ్రాభవవంతున్.

 

క: అవాటు కలిమి మారుతి

    లలితామిత లాఘవమున లంఘించెను శై

    లినీగణసంబంధిన్

    జలపూరిత ధరణి గగన సంధిం గంధిన్.

 

వ: ఇట్లు సముద్రంబు దాఁటి సీతం గని, హనుమంతుండు దిరిగి చనుదెంచుచు నక్షకుమారాదుల వధియించి.

క: సముదగ్రత ననిలసుతుం

   డమరాహిత దత్త వాల స్తాగ్నుల భ

   స్మము చేసె నిరాతంకన్

   సముదాసురసుభటవిగతశంకన్ లంకన్.

 

వ: ఇట్లు లంకాదహనంబు చేసివచ్చి వాయుజుండు సీతకథనంబు చెప్పిన విని రామచంద్రుండు వనచరనాథ యూధంబులుం దానును చనిచని.

శా: ఆరాజేంద్రుఁడు గాంచె భూరివిధరత్నాగారమున్ మీన కుం

     భీరగ్రాహకఠోరమున్ విపుల గంభీరంబు నభ్రభ్రమ

     ద్ఘోరాన్యోన్యవిభిన్నభంగభవనిర్ఘోషచ్ఛటాంభఃకణ

     ప్రారుద్ధాంబరపారమున్ లవణపారావారముం జేరువన్.

 

వ: కని తనకుఁ ద్రోవ యిమ్మని వేఁడిన నదియు మార్గంబు చూపక మిన్నందిన నా రాచపట్టి రెట్టించిన కోపంబున.

క: మెల్లని నగవున నయనము

    లల్లార్చి శరంబు విల్లు నందిన మాత్రన్

    గుల్లలు నాఁచులుఁ జిప్పలుఁ

    బెల్లలునై జలధి పెద్ద బీడై యుండెన్.

 

వ: ఇట్లు విపన్నుండగు సముద్రుండు నదులతోఁ గూడి మూర్తి మంతుండయి చనుదెంచి రామచంద్రుని చరణంబులు శరణంబు జొచ్చి యిట్లని స్తుతియించె.

సా:" కాకుత్స్థకులేశ! యోగుణనిధీ! యో దీనమందార! నే

     నీ కోపంబున కెంతవాఁడ? జడధిన్; నీవేమి భూరాజవే?
     లోకాధీశుఁడ; వాదినాయకుఁడ; వీ
 లోకంబు లెల్లప్పుడున్
     నీ
 కుక్షిం బ్రభవించు; నుండు; నడఁగున్; నిక్కంబు సర్వాత్మకా!

     

క: ధాల రజమున దేవ

    వ్రాతము సత్త్వమున భూతరాశిఁ దమమునన్

    జాతులఁగా నొనరించు గు

    ణాతీతుఁడ వీవు గుణగణాలంకారా!

 

క: కట్టుము సేతువు; లంకం
    జుట్టుము; నీ బాణవహ్ని
 సురవైరితలల్
    గొట్టుము నేలంబడఁ; జే
    పట్టుము నీ యబల నధికభాగ్యప్రభలన్.

    

అ:వె: హరికి మామ నగుదు; టమీఁద శ్రీదేవి

       తండ్రి; నూరకేల తాగడింప?
       ట్టఁ గట్టి దాఁటు
 మలాప్తకులనాథ!
       నీ
 యశోలతలకు నెలవుగాఁగ"

     

 

వ: అని విన్నవించిన రామచంద్రుండు సముద్రునిం బూర్వప్రకారంబున నుండు పొమ్మని 

క: ఘ శైలంబులుఁ దరువులు

    ఘనజవమునఁ బెఱికి తెచ్చి పికులనాథుల్

    జలరాశిం గట్టిరి

    ఘనవాహప్రముఖదివిజణము నుతింపన్.

 

వ: ఇట్లు సముద్రంబు దాఁటి రామచంద్రుండు రావణు తమ్ముం డైన విభీషణుండు శరణంబు వేఁడిన నభయం బిచ్చి; కూడుకొని లంకకుఁ జని విడిసి వేడెపెట్టించి లగ్గలుపట్టించిన.

సీ: ప్రాకారములు ద్రవ్వి రిఖలు పూడిచి-

      కోటకొమ్మలు నేలఁ గూలఁ ద్రోచి

   ప్రంబు లగలించి వాకిళ్ళు పెకలించి-

      లుపులు విఱిచి యంత్రములు నెఱిచి

   నవిటంకంబులు ఖండించి పడవైచి-

      గోపురంబులు నేలఁ గూలఁ దన్ని

   కరతోరణములు హిఁ గూల్చి కేతనం-

     బులు చించి సోపానములు గదల్చి

 

అ:వె: గృహము లెల్ల వ్రచ్చి గృహరాజముల గ్రొచ్చి

      ర్మకుంభచయము పాఱవైచి

     రులు కొలను చొచ్చి లఁచిన కైవడిఁ

     పులు లంకఁ జొచ్చి లఁచి రపుఁడు.

 

వ: అంత నయ్యసురేంద్రుండు పంచినఁ గుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, సురాంతక, నరాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాకాయ ప్రముఖులగు దనుజవీరులు శర శరాసన తోమర గదాఖడ్గ శూల భిందిపాల పరశు పట్టిస ప్రాస ముసలాది సాధనంబులు ధరించి మాతంగ తురంగ స్యందన సందోహంబుతో బవరంబు చేయ సుగ్రీవ, పవనతనయ, పనస, గజ, గవయ, గంధమాదన, నీలాం గద, కుముద, జాంబవదాదు లా రక్కసుల నెక్కటి కయ్యంబు లందుఁ దరుల గిరులఁ గరాఘాతంబుల నుక్కడించి త్రుంచి; రంత.

క: ఆ యెడ లక్ష్మణుఁ డుజ్జ్వల

    సాయకములఁ ద్రుంచె శైలమకాయు సురా

    జేయు ననర్గళమాయో

    పాయు న్నయగుణ విధేయు య్యతికాయున్.

 

అ:వె: రామచంద్రవిభుఁడు ణమున ఖండించె

       మేటికడిమి నీలమేఘవర్ణు

       బాహుశక్తిపూర్ణుఁ టుసింహనాదసం

       కుచిత దిగిభకర్ణుఁ గుంభకర్ణు.

 

క: అవున లక్ష్మణుఁ డాజి

    స్థలిఁ గూల్చెన్ మేఘనాదుఁ టులాహ్లాదున్

    భేదిజయవినోదున్

    బలజనితసుపర్వసుభటభావవిషాదున్.

 

వ: అంత.

క: తవా రందఱు మ్రగ్గిన

    ననిమిషపతివైరి పుష్పకారూఢుండై

    నికి నడచి రామునితో

    ఘనరౌద్రముతోడ నంపయ్యము చేసెన్.

 

వ: అయ్య వసరంబున.

క: సుపతిపంపున మాతలి

    గురుతరమగు దివ్యరథముఁ గొనివచ్చిన, నా
    ణీవల్లభుఁ డెక్కెను
    ఖరకరుఁ డుదయాద్రి నెక్కు
 కైవడి దోఁపన్.

    

వ: ఇట్లు దివ్యరథారూఢుండయి రామచంద్రుండు రావణున కిట్లనియె.

మ: "చపలత్వంబున డాఁగి హేమమృగమున్ సంప్రీతిఁ బుత్తెంచుటో

      కపటబ్రాహ్మణమూర్తివై యబల నా కాంతారమధ్యంబునం

      దపలాపించుటయో మదీయశితదివ్యామోఘబాణాగ్ని సం

     తపనం బేగతి నోర్చువాఁడవు? దురంతం బెంతయున్ రావణా!

 

క: నీ చేసిన పాపములకు

   నీచాత్మక! యముఁడు వలదు నేఁడిట నా నా

   రాముల ద్రుంచి వైచెద

   ఖేచర భూచరులు గూడి క్రీడం జూడన్."

 

వ: అని పలికి.

మ: బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా

     బ్రళయోగ్రానలసన్నిభం బగు మహాబాణంబు సంధించి రా

     జలలాముండగు రాముఁడేసె ఖరభాషాశ్రావణున్ దేవతా

     బలవిద్రావణు వైరిదారజనగర్భస్రావణున్ రావణున్.

 

క: దరథసూనుండేసిన

    విశిఖము హృదయంబుఁదూఱ వివశుం డగుచున్

    కంధరుండు గూలెను

    దశవదనంబులను రక్తధారలు దొరఁగన్.

 

వ: అంతనా రావణుండు దెగుట విని.

సీ: కొప్పులు బిగి వీడి కుసుమమాలికలతో-

     నంసభాగంబుల నావరింప

   సేసముత్యంబులు చెదరఁ గర్ణిక లూడఁ-

     గంఠహారంబులు గ్రందుకొనఁగ

   దనపంకజములు వాడి వాతెఱ లెండఁ-

     న్నీళ్ళవఱద లంములు దడుప

   న్నపు నడుములు వ్వాడఁ బాలిండ్ల-

      రువులు నడుములఁ బ్రబ్బికొనఁగ

 

అ:వె: నెత్తి మోఁదికొనుచు నెఱిఁ బయ్యెదలు జాఱ

      ట్టు నిట్టుఁ దప్పడుగు లిడుచు

      సురసతులు వచ్చి ట భూతబేతాళ

      దనమునకు ఘోరదనమునకు.

 

వ: ఇట్లు వచ్చి తమతమ నాథులం గని, శోకించి; రందు మండోదరి రావణుం జూచి

ఉ: "హా! నుజేంద్ర! హా! సురగణాంతక! హా! హృదయేశ! నిర్జరేం

     ద్రాదుల గెల్చి నీవు కుసుమాస్త్రునికోలల కోర్వలేక సో

     న్మాదముగన్ రఘుప్రవరుమానిని నేటికిఁ దెచ్చి? తప్పుడేఁ

     గాదని చెప్పినన్ వినక కాలవశంబునఁ బొంది తక్కటా.

 

అ:వె: ఎండఁ గాయ వెఱచు నినుడు వెన్నెలఁ గాయ

       వెఱచు విధుఁడు గాలి వీవ వెఱచు

      లంకమీఁద; నిట్టి లంకాపురికి మాకు

      ధిప! విధవభావ డరె నేఁడు.

 

క: దురితముఁ దలపరు గానరు

    జరుగుదు రెటకైన నిమిష సౌఖ్యంబుల కై

    వనితాసక్తులకును

    బరధనరక్తులకు నిహముఁ రముం గలదే?"

 

వ: అని విలపింప నంత విభీషణుండు రామచంద్రుని పంపుపడసి, రావణునకు దహనాది క్రియలు గావించె; నంత రాఘవేంద్రుండు నశోకవనంబున కేఁగి, శింశుపాతరు సమీపంబు నందు.

శా: దైతేయప్రమదా పరీత నతిభీతన్ గ్రంథి బంధాలక

     వ్రాతన్ నిశ్శ్వసనానిలాశ్రుకణ జీవం జీవదారామ భూ

     జాతన్ శుష్కకపోల కీలిత కరాబ్జాతం బ్రభూతం గృశీ

     భూతం బ్రాణసమేత సీతఁ గనియెన్ భూమీశుఁ డా ముందటన్.

 

వ: కని రామచంద్రుండును దాపంబు నొంది, భార్యవలన దోషంబు లేకుంట వహ్నిముఖంబునం బ్రకటంబుజేసి, దేవతల పంపున దేవిం జేకొని.

ఉ: శోషితదానవుండు నృపసోముఁడు రాముఁడు రాక్షసేంద్రతా

    శేషవిభూతిఁ గల్పసమజీవివి గమ్మని నిల్పె నర్థి సం

    తోషణుఁ బాపశోషణు నదూషణు శశ్వదరోషణున్ మితా

    భాషణు నార్యపోషణుఁ గృపాగుణభూషణు నవ్విభీషణున్.

 

వ: ఇట్లు విభీషణసంస్థాపనుండయి రామచంద్రుఁడు సీతాలక్ష్మణ సమేతుండయి సుగ్రీవ హనుమదాదులం గూడికొని, పుష్పకారూఢుం డయి, వేల్పులు గురియు పువ్వులసోనలం దడియుచుఁ దొల్లి వచ్చిన తెరువుజాడలు సీతకు నెఱిఁగించుచు, మరలి నందిగ్రామంబునకు వచ్చె; నయ్యవసరంబున.

అ:వె: రామచంద్రవిభుని రాక వీనుల విని

       రతుఁ డుత్సహించి పాదుకలను

       మోచికొనుచు వచ్చి ముదముతోఁ బురజను

      లెల్ల గొలువ నన్న కెదురువచ్చె.

 

వ: వచ్చి పాదుకల ముందట నిడికొని, యెడనెడ సాష్టాంగదండప్రణామంబులు చేయుచు, మెల్లమెల్లన డాసి, రామచంద్రుని పాదంబులు దన నొసలం గదియించి, తచ్చరణరేణువులు దుడిచి, శిరంబునం జల్లికొని, తనివి చనక, మఱియు నప్పదకమలంబు లక్కున మోపి కొనుచు, సంతసంపుఁ గన్నీటం గడిగి, క్షేమంబు లరయుచుండె; నంత సీతాలక్ష్మణ సహితుండయి విభుండును, దన కెదురువచ్చిన బ్రాహ్మణ జనంబులకు నమస్కరించి, తక్కినవారలచేత మన్ననలు పొంది, వారల మన్నించె; నయ్యవసరంబున.

చ: నృపవర! పెక్కునాళ్ళఁగొలె నిన్ గనకుండిన యట్టి నేఁడు మా

     తపములుపండె నిందఱము న్యులమైతి మటంచుఁ బుట్టముల్

     చపలతఁ ద్రిప్పి పువ్వుల వసంతములాడుచుఁ బాడుచున్ గత

     త్రపులయి యాడుచుం బ్రజలు ద్దయుఁ బండుగ జేసి రెల్లెడన్.

 

సీ: కవ గూడి యిరుదెసఁ పిరాజు రాక్షస-

      రాజు నొక్కటఁ జామములు వీవ

    నుమంతుఁ డతిధవళాతపత్రముఁ బట్ట-

      బాదుకల్ భరతుండు క్తిఁ దేర

    త్రుఘ్ను డమ్ములుఁ జాపంబుఁ గొనిరాఁగ-

      సౌమిత్రి భృత్యుఁడై నువుచూప

    లపాత్రచేఁబట్టి నకజ గూడిరాఁ-

      గాంచనఖడ్గ మందుఁడు మోవఁ

 

అ:వె: బసిఁడి కేడె మర్థి ల్లూకపతి మోచి

       కొలువఁ బుష్పకంబు వెలయ నెక్కి

       గ్రహము లెల్లఁ గొలువఁ డు నొప్పు సంపూర్ణ

       చంద్రుపగిది రామచంద్రుఁ డొప్పె.

 

వ: ఇట్లు పుష్పకారూఢుండై, కపి బలంబులు చేరికొలువ. శ్రీరాముం డయోధ్యకుం జనియె; నంతకు మున్న యప్పురంబునందు.

సీ: వీథులు చక్కఁ గావించి తోయంబులు-

     ల్లి రంభా స్తంభయము నిలిపి

    ట్టుజీరలు చుట్టి హుతోరణంబులుఁ-

     లువడంబులు మేలుట్లుఁ గట్టి

    వేదిక లలికించి వివిధరత్నంబుల-

      మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి

    లయ గోడల రామథలెల్ల వ్రాయించి-

     ప్రాసాదముల దేవవనములను

 

తే:గి: గోపురంబుల బంగారు కుండ లెత్తి

       యెల్ల వాకిండ్ల గానిక లేర్పరించి

       నులు గైచేసి తూర్యఘోములతోడ

       నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు.

 

క: సద గజదానధారల

    దుమదుమలై యున్న పెద్ద త్రోవలతోడన్

    ణీయ మయ్యె నప్పురి

    రమణుఁడు వచ్చినఁ గరంగు మణియపోలెన్.

 

అ:వె: రామచంద్రవిభుని రాకఁ దూర్యములతో

       థ గజాశ్వ సుభటరాజితోడ

       మరెఁ బురము చంద్రుఁ రుదేర ఘూర్ణిల్లు

       జంతుభంగమిలిత లధిభంగి.

 

వ: ఇట్లొప్పుచున్న యప్పురంబు ప్రవేశించి, రాజమార్గంబున రామచంద్రు డరుగుచున్న సమయంబున.

మ: "ఇతఁడే రామనరేంద్రుఁ డీ యబలకా యింద్రారి ఖండించె న

      ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డా పొంతవాఁడే మరు

      త్సుతుఁ డా చెంగట నా విభీషణుఁ" డటంచుం చేతులం జూపుచున్

      సతులెల్లం బరికించి చూచిరి పురీసౌధాగ్రభాగంబులన్.

 

వ: ఇట్లు సమస్తజనంబులు చూచుచుండ రామచంద్రుండు రాజమార్గంబునం జనిచని.

 

సీ: పటికంపు గోడలు వడంపు వాకిండ్లు-

     నీలంపుటరుగులు నెఱయఁ గలిగి

   మనీయ వైడూర్య స్తంభచయంబుల-

     కరతోరణముల హిత మగుచు

    డగల మాణిక్యద్ధ చేలంబులఁ-

      జిగురుఁ దోరణములఁ జెలువు మీఱి

    పుష్పదామకముల భూరివాసనలను-

     హుతరధూపదీముల మెఱసి

 

తే:గీ: మాఱువేల్పులభంగిని లయుచున్న

      తులుఁ బురుషులు నెప్పుడు సందడింప

      గుఱుతు లిడరాని ధనముల కుప్ప లున్న

      రాజసదనంబునకు వచ్చె రామవిభుఁడు.

 

వ: ఇట్లు వచ్చి.

ఉ: తల్లులకెల్ల మ్రొక్కి తమ ల్లికి వందన మాచరించి య

    ల్లల్ల బుధాళికిన్ వినతుఁడై చెలికాండ్రను దమ్ములం బ్రసం

    పుల్లతఁ గౌగలించుకొని భూవరుఁ డోలిఁ గృపారసంబు రం

    జిల్లఁగఁ జాల మన్ననలు చేసె నమాత్యులఁ బూర్వభృత్యులన్.

 

వ: తత్సమయంబునఁ దల్లులు

చ: కొడుకులుఁ బెద్దకోడలును గొబ్బున మ్రొక్కిన నెత్తి చేతులం

    బుడుకుచు మోములుందలలుబోరన ముద్దులుగొంచునవ్వుచుం

    దొడలకు వారి రాఁదిగిచి తోఁగఁగఁ జేసిరి నేత్రధారలన్

    వెడలిన ప్రాణముల్ దగఁ బ్రవిష్టములయ్యె నటంచు నుబ్బుచున్.

 

వ: అంత వసిష్ఠుం డరుగుదెంచి. శ్రీరామచంద్రుని జటాబంధంబు విడిపించి, కులవృద్దులుం దానును సమంత్రకంబుగ దేవేంద్రుని మంగళస్నానంబు చేయించు బృహస్పతి చందంబున, సముద్రనదీజలంబుల నభిషేకంబు చేయించె; రఘువరుండును, సీతాసమేతుండై, జలకంబులాడి, మంచి పుట్టంబులు గట్టికొని, కమ్మని పువ్వులు దుఱిమి, సుగంధంబు లలందికొని, తొడవులు దొడిగికొని, తనకు భరతుఁడు సమర్పించిన రాజసింహాసనంబునం గూర్చుండి, యతని మన్నించి కౌసల్యకుఁ బ్రియంబు చేయుచు, జగత్పూజ్యంబుగ రాజ్యంబు జేయుచుండె; నప్పుడు.

సీ: కలఁగు టెల్లను మానెఁ లధు లేడింటికి-

      లనంబు మానె భూక్రమునకు;
    జాగరూకత మానె
 లజలోచనునకు-
      దీనభావము మానె దిక్పతులకు;
    మాసి యుండుట మానె
 మార్తాండవిధులకుఁ-
     గావిరి మానె దిగ్గగనములకు;
    నుడిగిపోవుట మానె
 నుర్వీరుహంబుల-
     డఁగుట మానె ద్రేతాగ్నులకును;

   

 

అ:వె: గడిఁది వ్రేఁగు మానెఁ రి గిరి కిటి నాగ

       మఠములకుఁ బ్రజల లఁక మానె;
      రామచంద్రవిభుఁడు
 రాజేంద్రరత్నంబు
      రణిభరణరేఖఁ
 దాల్చు నపుడు.

      రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు

      రణిభరణరేఖఁ దాల్చు నపుడు.

 

వ: మఱియును.

సీ: పొలఁతుల వాలుచూపుల యంద చాంచల్య-

     బలల నడుముల యంద లేమి;
    కాంతాలకములంద
 కౌటిల్యసంచార-
     తివల నడపుల యంద జడిమ;
    ముగుదల పరిరంభముల యంద పీడన-
      మంగనాకుచముల యంద పోరు;
    డఁతుల రతులంద
 బంధసద్భావంబు-
  తులఁబాయుటలంద సంజ్వరంబు;

    

 

తే:గీ: ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు

      లంద చౌర్యంబు; వల్లభు లాత్మ సతుల

      నాఁగి క్రొమ్ముళ్ళు పట్టుటం క్రమంబు;
      రామచంద్రుఁడు పాలించు
 రాజ్యమందు.

      రామచంద్రుఁడు పాలించు రాజ్యమందు.

 

క: తండ్రి క్రియ రామచంద్రుఁడు

   తండ్రుల మఱపించి ప్రజలఁ దా రక్షింపన్

తండ్రుల నందఱు మఱచిరి

తండ్రిగదా రామచంద్రరణిపుఁ డనుచున్.

 

వ: మఱియు, నా రామచంద్రుండు రాజర్షిచరితుండును, నిజధర్మనిరతుండును, నేకపత్నీవ్రతుండును, సర్వలోకసమ్మతుండును నగుచు ధర్మవిరోధంబు గాకుండఁ గోరిక లనుభవించుచుఁ ద్రేతాయుగంబైన గృతయుగధర్మంబుఁ గావించుచు, బాలమరణంబు మొదలగు నరిష్టంబులు ప్రజలకుఁ గలుగకుండ రాజ్యంబుచేయుచుండె; నయ్యెడ

అవె: సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి

      క్తిగల్గి చాల యముఁ గలిగి

      యముఁ బ్రియముఁ గల్గి రనాథు చిత్తంబు

      సీత దనకు వశము చేసికొనియె.

 

 వ:  అనిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

అ:వె: "భ్రాతృజనుల యందు బంధువులందును

         ప్రజల యందు రాజభావ మొంది

        యెట్లు మెలఁగె? రాఘవేశ్వరుం డెవ్వనిఁ

        గూర్చి క్రతువు లెట్లు గోరి చేసె?"

 

వ: అనిన శుకుం డిట్లనియె.

సీ: "గవంతుఁడగు రామద్రుండు ప్రీతితో-

      దేవోత్తముని సర్వదేవమయునిఁ

     నుఁదాన కూర్చి యధ్వరములు చేసెను-

      హోతకుఁ దూరుపు నుత్తరంబు

     సామగాయకునికి మనదిగ్భాగంబు-

      బ్రహ్మకుఁ గ్రమమునఁ డమ రెల్ల

    ధ్వర్యునకు శేష మాచార్యునకు నిచ్చి-

      సొమ్ములఁ బంచి భూసురుల కొసఁగి

 

తే:గీ: తనదు రెండు పుట్టంబులు నకు నయిన

      మెలఁత మంగళసూత్రంబు మినుకుఁ దక్క

      వినతుఁడై యుండె; నా రాము వితరణంబు

      పాండవోత్తమ! యేమని లుకవచ్చు?

 

వ: అంత నా రామచంద్రుని దానశీలత్వంబునకు మెచ్చి విప్రవరులు దమతమ భూములు మరల నిచ్చి యిట్లనిరి.

అ:వె: "రణి వలదు మాకుఁ పసుల కేల? నీ
        ఖిలలోక గురుఁడవైన హరివి;
        మా
 మనంబు లందు లయు చీఁకటిఁ బాపు
        వ దుదారరుచులఁ
 బార్థివేంద్ర!"

        

 

వ: అని పలికి బ్రహ్మణ్యదేవుండైన రామచంద్రుని వినయోక్తులం బూజించి మునులు చని; రిట్లు పెద్దకాలంబు రాజ్యంబుచేసి, రాఘవేంద్రుం డొక్కదినంబున.

సీ: వసుధపైఁ బుట్టెడు వార్త లాకర్ణించు-

     కొఱకునై రాముండు గూఢవృత్తి

    నడురేయి దిరుగుచో నాగరజనులలో-

     నొక్కఁడు దన సతి యొప్పకున్న

    "నొరునింటఁ గాపురంబున్న చంచలురాలిఁ-

     బాయంగలేక చేపట్ట నేమి

    తా వెఱ్ఱి యగు రామధరణీశ్వరుండనే-

     బేల! పొ"మ్మను మాట బిట్టు పలుక

 

అ:వె: నాలకించి మఱియు నా మాట చారుల

       వలన జగములోనఁ గలుగఁ దెలిసి

       సీత నిద్రపోవఁ జెప్పక వాల్మీకి

       పర్ణశాలఁ బెట్టఁ బనిచె రాత్రి.

 

వ: అంత; సీతయు గర్భిణి గావునఁ గుశలవు లనియెడి కొడుకులం గనియె; వారికి వాల్మీకి జాతకర్మంబు లొనరించె; లక్ష్మణునకు నంగదుండును, జంద్రకేతుండును భరతునకుఁ దక్షుండును, బుష్కలుండును శత్రుఘ్నునకు సుబాహుండును, శ్రుతసేనుండును సంభవించి; రయ్యెడ.

 

: బంధురబలుఁడగు భరతుఁడు

    గంధర్వచయంబుఁ ద్రుంచి కనకాదుల స

    ద్బంధుఁ డగు నన్న కిచ్చెను

    బంధువులును మాతృజనులుఁ బ్రజలున్ మెచ్చన్.

 

అ:వె: మధువనంబులోన మధునందనుం డగు

       లవణుఁ జంపి భుజబలంబు మెఱసి

       మధుపురంబు చేసె మధుభాషి శత్రుఘ్నుఁ

       డన్న రామచంద్రుఁ డౌ ననంగ.

 

వ: అంతఁ గొంతకాలంబునకు రామచంద్రుని కొమారులయిన కుశ లవులిద్దఱను వాల్మీకివలన వేదాదివిద్యల యందు నేర్పరులై పెక్కు సభల సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచు నొక్కనాఁడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుం జని.

 

మత్త: వట్టి మ్రాకులు పల్లవింప నవారియై మధుధార దా

       నుట్టఁబాడిన వారిపాటకు నుర్వరాధిపుఁడుం బ్రజల్

       బిట్టు సంతస మంది; రయ్యెడఁ బ్రీతిఁ గన్నుల బాష్పముల్

       దొట్ట నౌఁదల లూఁచి వారలతోడి మక్కువ పుట్టఁగాన్.

 

అ:వె: "చిన్నయన్నలార! శీతాంశుముఖులార!

         నళినదళవిశాలనయనులార!

         మధురభాషులార! మహిమీఁద నెవ్వరు

         దల్లిదండ్రి మీకు ధన్యులార? "

 

వ: అనిన వార లేము వాల్మీకి పౌత్రులము; రాఘవేశ్వరుని యాగంబు చూడ వచ్చితిమనవుడు; మెల్లన నగి యెల్లి ప్రొద్దున మీ తండ్రి నెఱింగెద; రుండుండని యొక్క నివాసంబునకు సత్కరించి పనిచె; మఱునాఁడు సీతం దోడ్కొని కుశలవుల ముందట నిడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునిం గని యనేక ప్రకారంబుల వినుతించి; యిట్లనియె.

 

అ:వె: "సీత సుద్దరాలు, చిత్తవాక్కర్మంబు

        లందు సత్యమూర్తి యమలచరిత

        పుణ్యసాధ్వి విడువఁ బోలదు చేకొను

        రవికులాబ్ధిచంద్ర! రామచంద్ర!"

 

వ: అని వాల్మీకి పలుక, రామచంద్రుండు పుత్రార్థి యై విచారింపఁ, గుశ లవులను వాల్మీకికి నొప్పగించి, రామచంద్రచరణధ్యానంబు చేయుచు నిరాశ యై సీత భూవివరంబు జొచ్చె; నయ్యెడ.   

             

 మ: "ముదితా! యేటికిఁ గ్రుంకి తీవు మనలో మోహంబు చింతింపవే

       వదనాంభోజము చూపవే మృదువు నీ వాక్యంబు విన్పింపవే

       తుది చేయం దగ" దంచు నీశ్వరుఁడునై దుఃఖించె భూపాలుఁ డా

       పదగాదే ప్రియురాలిఁ బాసిన తఱిన్ భావింప నెవ్వారికిన్?

 

 వ: అని వగచి, రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరియించి, పదుమూఁడువేల యేం   డ్లెడతెగకుండ నగ్నిహోత్రంబు చెల్లించి తా నీశ్వరుండు గావునఁ దన మొదలినెలవుకుం జనియె నివ్విధంబున.


 అ:వె: ఆదిదేవుఁడైన యా రామచంద్రుని

       కబ్ధి గట్టు టెంత యసురకోటి

       జంపు టెంత కపుల సాహాయ్య మది యెంత

       సురల కొఱకుఁ గ్రీడ జూపెఁగాక.


 చ: వశుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్

    దశదిగధీశమౌళిమణి దర్పణమండిత దివ్యకీర్తికిన్

    దశశతభానుమూర్తికి సుధారుచిభాషికి సాధుపోషికిన్

    దశరథరాజుపట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్.

 

ఉ: నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్

    విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ

    జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం

    జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.

 

అ:వె: రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ

       గదిసి తిరుగువారుఁ గన్నవారు

      నంటికొన్నవారు నా కోసలప్రజ

      లరిగి రాదియోగు లరుగు గతికి.

 

క: మంతనములు సద్గతులకు

    పొంతనములు ఘనములైన పుణ్యముల కిదా

    నీంతన పూర్వ మహా ని

    కృతనములు రామనామ కృతిచింతనముల్

 

v  

 

పోతన శ్రీరామ చరిత్రము

 

భాగవతం నైమిషారణ్యంలో నిఖిలపురాణ వ్యాఖ్యానవైఖరీ సమేతుడైన సూతమహర్షి మహనీయగుణగరిష్ఠులగు మునిశ్రేష్ఠులకు చెప్పిన భాగవతాన్ని, వారముదినములలో శాపవశుడై తక్షకసర్పముచేత కరువబడిమరణిచనున్న పరిక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుడు చెప్పినట్లు కథ నడుస్తుంది. ఇందులో భగవంతుని అవతారములుభక్తులచరిత్రలుసూర్య చంద్ర వంశపు రాజచరిత్రలు చెప్పబడ్డాయి. ఆవరుసలోనేసూర్యవంశపురాజులలో శ్రీరాముని గురించి చెప్పవలసి వచ్చినపుడుశ్రీరామచరిత్రము చెప్పబడింది. అంతేగాకఇది శ్రీహరి దశావతారాలలోని ఒక ముఖ్య అవతారఘట్టము కూడాఅందుకే ప్రత్యేకత సంతరించుకొన్నది.


 శ్రీరాముడు మదాంధరావణశిరస్సంఘాతసంఛేదన క్రమణోద్ధాముడు. నారాయ ణాంశమున సర్వోత్తమగుణవంతురాలైన కౌసల్యాదేవి సంసారసాఫల్యతగా జన్మించినాడు. రాముడు యువకుడుగా నుండగనేతండ్రియాజ్ఞవడసివిశ్వామిత్ర యాగరక్షణకువెళ్ళిబంగారువర్ణపు వెంట్రుకలుగలిగి మాయమాటలనేర్పరియైగుఱ్ఱములకున్న వేగముగలిగిచేతులతోనే సంహారంచేయగల దిట్టయైన తాటక యను రాక్షసిని యేమాత్రం దయచూపకుండా  సంహరించాడు. ఆవిధంగా తాటకనేగాదుబలాధికుడైన సుబాహునికూడా చంపిమోసపూరితమైన దేహవన్నెగల మారీచునిపారద్రోలి యగరక్షణగావించినాడు.

 

విదేహరాజైన జనకుని యింటమూడువందలమంది పట్టిననేగాని కదలనిశివ ధనుస్సున్నది. దానిని మపుటేనుగు చెరకుగడ విరచినంత సులువుగా విరచిగుణవంతురాలు, వెన్నెలలు కురిపించేముఖకాంతిగల సీతాదేవిని వివాహమాడినాడు. తనభుజబలతో దీర్ఘకుఠారధారిరణరంగభీముడురాజులనెందరినో వధించినవాడు నైన పరుశురాముని జయించినాడు.

 

పూర్వం దశరథుడు తనభార్య కైకకిచ్చిన వరములను మాటతప్పక నెరవేర్చడంకోసంకమలవదనుడైన రావణునికి చంద్రుడై అవతరించిన రాముని అడవికంపినాడు. తండ్రి యజ్ఞను తలదాల్చి రాముడు అడవికి బయలుదేరగాభార్యసీతతమ్ముడు లక్ష్మణుడు కూడా రామునిసేవించడానికి అడవికి వెంటనడిచారు. ఆవిధంగా శ్రీరాముడు తమ్ముడు భరతునికి రాజ్యాధికారమిచ్చిరత్నకాంతులతో వెలుగొందు చిత్రకూట కులపర్వతానికి వెళ్ళాడు. ఆతరువాత నెమళ్ళగుంపులతో నిండినదితాపసులకు నెలవైనది గోదవరీ విమలజలశీకరాలతో తేజరిల్లునది, పెరెన్నికగన్నదియైన దండకారణ్యానికి చేరుకున్నాడు. అక్కడొక పర్ణశాల నిర్మించుకొని సీతా లక్శ్మణులతోగలసి నివాస మున్నాడు.

 

ఆసమయంలో రావణునిచెల్లెలుసూర్పణఖ విమోహియైరామలక్ష్మణుల వద్దకు వచ్చింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుగోసి పంపాడు. అందుకు కోపించి ఖరదూషణులు పదునాల్గువేల రక్కసులసైన్యంతో రాముని దండించనెంచి వచ్చారు. వారినందారిని రాముడొక్కడే దునుమాడినాడు. విషయమంతెలిసిసీత చక్కదన్నాన్ని గురించి వినిమన్మదావస్థకు లోనైనీచమారీచుని బంగారు జింకరూపమున రామ కుటీరముచెంతకు పంపాడు. దానిని పట్టడానికి చాలాదూరంవెళ్ళి కడకు దాన్ని చంపేశాడు రాముడు. ఇంతలో రావణుడు సీతనపహరించుకొని వెళ్ళిపోయాడు. అన్యాయంగ దయావిహీనుడై ఆకాశమార్గాన సీతను గొనిపోతున్న రావణునిశ్రీరామ కార్యనిర్వహణాతలంపుగల వాడువాయువేగంతో పయనించగల సమర్థుడునైన జటాయువు అడ్డగించాడు. జటాయువును రెక్కలు నరికి క్రిందపడవేశాడు దశకంఠుడు.

 

సీతను వెదుకుచూ రామలక్ష్మణులు తమకోసం పోరాడి పడియున్న జటాయువునుగని, అతడు ప్రాణములు విడువగాఅంతిమక్రియలు నిర్వహించి,  అక్కడనుండి ఋశ్యమూక పర్వతానికి చేరుకున్నారు. తనకాలిబలంతో కొండలు పిండిచేయగల సుగ్రీవునితో స్నేహంచేసి, అతనికి అన్యాయం చేసిన, అతనిఅన్న వాలిని చంపెదనని మాటయిచ్చిశ్రీరాముడుఇచ్చినమాటప్రకారంఘనుడుశివారాధకుడుఇంద్రుడిచ్చిన పసిడి మాలను ధరించినవాడు, రావణగర్వాపహరుడు నైన వాలిని ఒక్కబాణంతో వధించాడు. 

            

ఈభూమిపైసీతను వెదుకుటకు అతిఛలవంతుడుభుద్ధిమంతుడుప్రతిభావంతుడుబలవంతుడు , శౌర్యవంతుడు నైన హనుమంయుని పంపాడు శ్రీరాముడు. అలలతో పోటెత్తియున్నదివిశాలమై తననీటితో ఆకాశాన్ని భూమిని కలుపుతున్నట్లున్న సముద్రాన్ని లలితమైన లాఘవము అలవాటు గల హనుమంతుడు, సులువుగాయెగిరి దాటి లంకలోనికిప్రవేశించి సీతను చూచివస్తూరావణుని కుమారుడైన అక్షకుమారాదులను చంపిఅసురబటుల కాపలలో నిర్భయముగానున్న లంకకు నిప్పంటించి కాల్చివచ్చిసీతవున్న విధానాన్నిచోటును శ్రీరామునకు  తెలియజెప్పాడు. శ్రీరాముడు వానరవీరులతోగూడివచ్చిఘనతరరత్నాగారముమొసళ్ళు సర్పాలు తిమింగలాలతో గంభీరముగానుండియెగిసిపడుతున్న పెద్దపెపెద్దఅలలతో భయంగొల్పుతున్న లవణసముద్రతీరం చేరుకున్నారు.

 

లంకచేరడానికి దారినిమ్మని శ్రీరాముడు సముద్రుని ప్రార్థించాడు. సముద్రుడు రాముని ప్రార్థనను మన్నించలేదు. రాముడు ఆగ్రహించాడు. అంతలోనే శాంతించిచిరునవ్వుతో కనురెప్పలల్లార్చిబాణాసనానికి శరందొడిగి సముద్రునిపైకెక్కుపెట్టాడు. అంతమాతానికే సముద్రమెండిపోయినత్తగుల్లలునాచుమొక్కలుఆల్చిప్పలు బయట పడ్డాయి. సముద్రుడు భయపడిపోయితానూ నదులు రూపధారులైరామచంద్రుని పదములకడ శరణమనిఓకాకుత్స వశోన్నతా! గుణనిధీ! దీనమందారా! నీవాగ్రహించిన నిలువ నేనెంతవాడను. జడుడనునీవసమాన్య రాజన్యుడవులోకాధీశుడవు. ఆదినాయకుడవు. లోకములన్నీ నీకుక్షిలోనే పుట్టి పెరిగి అంతమొందు చున్నవి. నీవు సర్వాత్ముడవు. ప్రజాపతులను రజోగుణులుగాదేవతలనుసత్వగుణులు గాజీవరాశిని తమోగుణులుగా విభజించి, పాలించు గుణాతీతుడవు. గుణగణా లంకారుడవు. నీకడ్డేమున్నదిసేతువునిర్మించులంకనుచుట్టుముట్టినీబాణపరంపరతో రాక్షసశిరస్సులను ఖండించు. అధికభాగ్యప్రభాశీలయగు సీతను చేపట్టుము. నేను శ్రీహరికి పిల్లనిచ్చిన మామను. శ్రీలక్ష్మికి తండ్రినినేను నీవాడను.


 ఆలస్యమెందులకు వారధి గట్టుములంకనుజేరుకొమ్మునీకీర్తిని హెచ్చింపుము. అనివేడుకున్న సముద్రుని, పూర్వప్రకారం నిండుజలములతో నుండుమని శ్రీరాముడు పంపించాడు.


 పెద్దపెద్దకొండలనువృక్షములను వానరయొధులు పెరికితెచ్చి ఇంద్రాదిదేవగణము ప్రశంశిస్తుండగాసముద్రంపై సేతువునిర్మించికపిసేనాసమేతంగా సముద్రందాటి లంకజేరుకున్నాడు రాముడు. అక్కడికివచ్చి రావణుని తమ్ముడు విభీషణుడు శ్రీరాముని శరణుజొచ్చాడు. అతనికి అభయమిచ్చిలంకముట్టడికిఅనుమతినిచ్చాడు రాముడు. వానరులు ప్రాకారాలు తవ్వారు. అగడ్తలుపూడ్చారు. కోటబురుజులు పడద్రోశారు. ద్వారబంధాలు పగులగొట్టితలుపులు విరగ్గొట్టారు. వాటికమర్చిన యంత్రాలను ధ్వంసంజేశారు. మకరతోరణాలను త్రుంచారు. కేతనములను చించిపారేశారు. మెట్లమార్గాలను పడగొట్టారు. ఇళ్ళుమేడలు పెగలించివేశారు. స్వర్ణకుంభాలను పెరికేశారు. ఎనుగులు సరస్సులోదిగిధ్వంసంచేసినట్లు లంకారాజ్యంలో భీబత్సం సృష్టించారు.

 

వార్తరావణునకు తెలిసికుంభనికుంభధూమ్రక్షవిరూపాక్షసురాంతకనరాంతకదుర్ముఖప్రహస్తమహాకాయులను పంపాడు. వారు ధనుస్సుతోమరగదఖడ్గశూలభిండిపాలపట్టిసముసలపరుశువులతో గజ,తురగ,రథారుఢులైసైన్యములతోవచ్చివానరులతోతలపడ్డారు. సుగ్రీవహనుమపనసగజగవయగంధమాధననీలకుముదజాంబవంతాదులు ఘనవృక్షములుకొండరాళ్ళతోపిడికిలిపోట్లతో ఆరాక్షసులను యెదుర్కొని హతమార్చారు.


 అతికాయుడు కొండాంత దేహం గలవాడు. మాయోపాయనిపుణుడు. దేవతలకుసైతం అజేయుడు. రావణునకు విధేయుడైన వీరుడు. అట్టి అతికాయుని లక్ష్మణుడు ఒక మహోజ్వల శరముచేత సంహరించాడు. అదే దినమున నల్లనిమేఘవర్ణశరీరుడుబాహుబలపూర్ణుడుభయంకరంగా చెవులుచిల్లులు బడేట్లు సింహనదంచెయగల మాయాధురంధరుడైన కుంభకర్ణుని, శ్రీరాముడు వధించాడు. ఆహ్లాదపరచేరూపం గలవాడుదేవేంద్రునిదేవతలను జయించిన వీరుడైన మేఘనాథుని, లక్ష్మణుడు పోరాడి వధించాడు. పేరుమోసిన రాక్షసవీరులు యుద్ధంలో మరణించగాదేవవైరిరావణుడు పుష్పకవిమానమెక్కి రణభూమికేతెంచి రామునితో యుద్ధంచేయబూనాడు. ఆసమయం లో దేవేంద్రుడుతనసారథి మాతలితో,  పేరొందిన దివ్యరథాన్ని రామునికొఱకు పంపాడు. ఉదయాద్రి నెక్కిన సుర్యునివలె శ్రీరాముడు ఆ రథమధిరోహించి యుద్ధంచేయ నారంభించిరావణా! బుద్ధిహీనుడవై మోసంతో బంగారు మయలేడిని ముందుపంపిబ్రాహ్మణవేషముగట్టిఅడవిలో ఒంటరిగా నున్న ఒక అబలను హరించుట గాదునా నిశిత దివ్యబాణాగ్నిని నోర్చుకొని నిలబడు. ఇది నీకసాధ్యం. అంటూ హెచ్చరించాడు రాముడు. భూమ్యాకాశాలపై నున్నవారందరూ వినోదంచుస్తున్నట్లు చూస్తుండగా నా శరములతో కూల్చేస్తాను కాచుకోమంటూ శ్రీరాముడుఖరభాషా శ్రవణుడుదేవతాబలవిద్రావణుడువైరిదారజనగర్భస్రావకుడు అయిన రావణునిపై శ్రీరాముడు దివ్యాస్త్రము సంధించి విడువగాఅది బ్రహ్మాండామంతా ప్రతిధ్వనించి, బీకరరూపందాల్చిరావణుని గుండెను చీల్చుకుంటూ వెళ్ళింది. రావణుడా ప్రళయకాలాగ్నిసమ రామబాణం ధాటికి నేలకొరిగి పదిముఖాలనుండి రక్తంగ్రక్కి పరమపదించాడు.

 

రావణుని మరణవార్త విని దుఃఖితులైన అసురకాంతల, కొప్పులు విడిపోయిధరించిన పూమాలలు భుజాలపై బడిపోయాయి. హారాలు తెగిపోయి ముత్యాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కర్ణాభరణాలు ఊడిపోయాయి. పసిడి కంఠహారాలు చిక్కుబడి పోయాయి. ముఖాలు వాడిపోయాయి. నోళెండిపోయాయి. కన్నీటితో దేహాలు తడిసి పోయాయి. సన్నని నడుములు వణకజొచ్చాయి. స్తనములు జారిపోయాయి. వివశులై తలలుబాదుకుంటూ పైటకొంగులు జారిపోతుండగా తప్పటడుగులు వేసుకుంటూ, భూతపిశాచాల నిలయమైన రణభూమికి వచ్చారు. వారు వారి నాథుల మృతశరీరాల పైబడి శోకించారు. మండోదరి రావణుని పార్థివశరీరాన్నిజూసిహా హృదయేశ్వరా! హా రాక్షస మహారాజా! హా సురగణాంతకా! దేవతల గెలిచితివిగానిమన్మథాస్త్రములకు తాళలేక, పిచ్చివాడవై రామునిసతినెందుకపహరించావు. నేను వలదని వారించినా వినక చావుకొనిదెచ్చుకున్నావు. మన లంకాపురిపై రవి యెండగాయాలన్నాశశి వెన్నెల గురిపించాలన్నావాయుదేవుడు గాలివీచాలన్న భయపడేవారు. నేడు నీవు లేకపోవడంతో లంక విధవగా మారిపోయింది. నిముషసౌఖ్యమునకు ప్రాకులాడి మంచిచెడ్డ ఆలోచించకుండా యెంతకైనా తెగిస్తారు. పరసతినాశించేవారుపరుల సంపదనన్యాయంగా బడయనెంచువారు ఇహపరాలు రెంటికి గాకుండా పోతారుగదా! అంటూ విలపించింది.

 

శ్రీరాముని ఆజ్ఞానుసారం విభీషణుడురావణునకు దహనాదిక్రియలు నిర్వహించాడు. తదనంతరం శ్రీరాముడు అశోకవనంలోని శింశుపావృక్షం వద్దకు వెళ్ళాడు. అక్కడ రాక్షసవనితల కాపలలాలో భీతిల్లియున్నదీతైలసంస్కారరహితమై అట్టగట్టిన వెంద్రుకలు గలదివేడినిట్టూర్పులతో వాడిపోయివేడిగాలులకు వాడుబారిన వృక్షము వలె నున్నదికృషించి చెక్కిళ్ళు లోపలికిపోయియున్నదిచెంపలు చేతులపై ఆనించి యున్నదీ యైన సీతదేవిని చూచాడు. ఆమె దురవస్థకు బాధపడ్డాడు రాముడు. అగ్నిదేవుడు సీతయందు యేదోషములేదని ప్రకటించడంవలన మరియు దేవతల మాటప్రకారం రాముడు సీతను పరిగ్రహించాడు. తదనంతరంసమంజసమైన కోర్కెలు తీర్చేవాడుపాపముల పరిహరించేవాడు యేవిధమైన నిందలు పడనివాడురోష రహితుడు శాంతుడుమితభాషిదయాహృదయుడుఆర్తజనరక్షకుడు అయిన విభీషణుని లంకకు రాజుగా పట్టాభిషిక్తునిజేసికల్పాంతం చిరాయువుగా వర్ధిల్లుమని దీవించినాడు శ్రీరాముడు. దానవాంతకుడురాజచంద్రుడునైన శ్రీరామప్రభువుతిరిగి వెళ్ళడానికి సమయమాసన్నమవ్వడంతో సీతాలక్ష్మణసమేతుడైసుగ్రీవ హనుమ దాదులను గూడికొనిదేవతలు పుష్పవర్షం గురిపిస్తుండగా పుష్పకవిమానమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. దారిలో తాను దర్శించిన ప్రదేశాలనుసీతకు వివరించి చెబుతూనందిగ్రామం చేరుకున్నాడు. శ్రీరాముడు మరలివచ్చిన విషయం తెలుసుకొనిఉత్సాహభరితుడై రామపాదుకలుతలనిడుకొనిపురజనులందరూ ప్రస్తుతిస్తుండగా అన్నకెదురేగినాడు భరతుడు. రాముపాదుకలు ముందుంచుకొని మాటిమాటికీ సాష్టాంగదండప్రమాణాలు చేస్తూరాముపాదములకు తన నుదిటినితాకించిపాద రజమును తనతలపై జల్లుకొనితనివిదీరక శ్రీరాముని పాదములను అక్కునమోపికునిఆనందబాష్పములతో కడిగిక్షేమసమాచరములడిగి తెలుసుకొని సంతోషపడ్డాడు భరతుడు. శ్రీరాముడు తనకోసం వచ్చిన బ్రాహ్మణులకు నమస్కరించితక్కినవారి మన్ననలనుగైకొనివారి యోగక్షేమాలను విచారించాడు. ప్రజలు రాముని శ్లాఘించి రామా! ఇన్నాళ్ళకు మళ్ళీ మీదర్శనంతో మా నిరీక్షణాతపములు ఫలించాయి. ధన్యుల మయ్యామంటూతమ పైపంచలు మైమరచి గాలిలో ద్రిప్పారు. పువ్వులతో వసంతము లాడుతూ పాడుతూ ఆనంతముతో పండువ చేసుకున్నారు.

 

సుగ్రీవ విభీషణులుశ్రీరామునకు ఇరువైపుల నిలచి వింజామరలు వీచారు. హనుమంతుడు తెల్లనిగొడుగు పట్టాడు. భరతుడుపాదుకలను భక్తితో తలదాల్చాడు. శత్రుఘ్నుడు రాముని విల్లు బాణాలు పట్టుకున్నాడు. లక్ష్మణుడు సేవకుడై చెంతనిలిచాడు. సీతాదేవి నిండుకలశంతో నీళ్ళు పట్టుకొన్నది. బంగారుఖడ్గం అంగదుడు పట్టుకున్నాడు. జాంబవంతుడు డాలు పట్టుకున్నాడు. చూస్తున్నవారికి గ్రహాలన్నీ సేవిస్తున్న పూర్ణచంద్రుని వలె వెలుగొందుతూ శ్రీరామచంద్రుడు పుష్పకంలో అయోధ్యకు పయనమయ్యాడు. రామునిరాక ముందుగనే తెలిసిన పురజనులువీధులన్నీ శుభ్రంచేసి నీళ్ళుజల్లిఅరటి స్తంబములు నిలిపి వాటికి పట్టువస్త్రములుగట్టితోరణములమర్చిరంగారుకలువ పూదండలు వ్రేలాడదీశారు. ముంగిళ్ళు అరుగులు అలికి రత్నకాంతులు విరజిమ్మే రంగురంగుల ముగ్గులుబెట్టారు. గోడలపై రామకథల బొమ్మలు గీయించారు. ఆలయాలపై మేడలపై బంగారుకలశాలు నిలిపారు. వాకిళ్ళపంచల రామప్రభువుకు సమర్పించడానికి కానుకలు సిద్ధంగావుంచారు. జనులు క్రొత్తదుస్తులు ధరించిఅలంకరించుకొనిమంగళవాద్యాలతో రామచంద్రునకెదురు వెళ్ళారు. రాజమార్గాలలో యేనుగులు మదజలాలుస్రవిస్తూరెండువైపులా నిలిచివున్నాయి. పురమంతా భర్తవస్తున్న సమాచారందెలిసి భార్యలు ఆనందంతో యెదురుచూస్తున్నట్లున్నది. ఆవిధంగా శ్రీరాముడు మంగళవాద్యాలతోరథాలుయేనుగులుగుఱాలుభటులతో పురప్రవేశంచేయగాచంద్రోదయంవేళ సముద్రుడు తలోనిజీవరాసులన్నింటితో కలిసి ఉప్పొంగి ఘోషపెడుతున్నట్లున్నది. శ్రీరాముడు వీధులగుండా వస్తుంటేఆయనను మేడలెక్కి చూస్తున్న స్త్రీజనాలుఈయనే సీతకొఱకు ఆరావణాసురుని ఖండించిన మన రాముడు. అడుగో అక్కడున్నవాడే లక్ష్మణుడు. ఆప్రక్కనున్నవాడే వానరరాజు సుగ్రీవుడు. అదిగో ఆప్రక్కనున్న వారే హనుమంతులవారు. ఆవైపునున్నరాజన్యుడే విభీషణుడు. చేతులతో జూపిస్తూఆనందిస్తున్నారు. స్ఫటికగోడలు పగడాలవాకిండ్లు,నీలాలుపొదిగిన అరుగులుఅందమైనస్తంభాలుమకరతోరణాలుచిగురుటాకులదండలు , పుష్పమాలలు పరిమళాలు వెదజల్లుచుండగాదీపాలవెలుగులలో దేవతలా? అన్నట్లు పురస్త్రీపురుషులుసందడి జేయుచుండగాసంపదలతో తులతూగుతున్న రాజగృహనికి శ్రీరాముడు వచ్చిచేరాడు. తల్లులకు మ్రొక్కాడు. కన్నతల్లి కౌసల్యాదేవికి వందన మాచరించాడు. పెద్దలకు నమస్కృతు లొనరించిమిత్రులను తమ్ములను సంతోషంగా కౌగిలించుకున్నాడు. భూపతులను మంత్రులను గౌరవంగా పలుకరించాడు. తొల్లింటి తన సేవకులను చిరునవ్వుతో యోగక్షేమాలు విచారించాడు శ్రీరాముడు.  

 

     కొడుకులుపెద్దకోడలు తమకు మ్రొక్కగా వారిని లేవనెత్తిబుగ్గలుపుణికి ముద్దులుబెట్టిసంతోషంతో వారిని ఒడిలో కూర్చొండబెట్టుకొనిపోయినప్రాణాలు తిరిగివచ్చినట్లు ఆనందపడుతూ కన్నీళ్ళతో వారిని తడిపారు తల్లులు. తదనంతరంకులగువులైన వసిష్ఠులవారు శ్రీరామచంద్రుని జటాబంధములు విడిపించికుల వృద్ధులతోగలసి దేవేంద్రునికి మంగళస్నానములు జేయించు బృహస్పతివలె సముద్రనదీజలాలతో అభిషేకించారు. శ్రీరాముడుసీతాదేవి స్నానాలాచరించినూతన వస్త్రములుధరించిపువ్వులు దురుముకొనిసుగంధములలందించుకొని ఆభరణములు ధరించిభరతున కిచ్చిన సింహాసనంపై ఆసీనుడై, భరతుని మన్నించి. కౌసల్యాదేవికి ప్రియంబు సేయుచూజగత్పూజ్యంబుగా రాజ్యమేలుచున్నాడు శ్రీరాముడు.

 

ఆరాజ్యంలో సముద్రాలు కల్లోలపడలేదు. భూకంపాలులేవు. శ్రీహరికి జగములను జాగరూకతతో గమనించవలసిన పనిలేకుండాపోయింది. దిక్పతులకు దిగులులేదు. సూర్యచంద్రుల కాంతులకు తరుగులేదు. దిక్తటములకు చీకట్లలుముకొనలేదు. వృక్షములు మంచిఫలాలనిచ్చాయి. త్రేతాగ్నులు ఆరిపోవుటెరుగవు. దిగ్గజాలకుకులపర్వతములకుఆదివరాహానికిఆదిశేషునకుఆదికూర్మమునకుబరువులు తగ్గి పోయాయి. ప్రజలలో కలహాలులేవు. సుఖశాంతులతో ప్రజాజీవనం గడుస్తున్నది. అంతే గాక రామరాజ్యంలోయువతుల వాలుచుపుల్లో చాంచల్యంవారిసన్నని నడుముల్లో లేమిముంగురులలో కుటిలత్వంనడకలలో మెల్లదనంకౌగిళ్ళలో ఒరిపిడికుచసంపదలో పరస్పరఘర్షణరతులలో చిత్రబంధాలుయెడబాటులో జ్వరార్తిప్రేయసీ ప్రియుల మనోచోరత్వంభర్తల శృగారచేష్టలతో కొప్పులువీడటం వంటి వాటిలో మాత్రమే అక్రమమనిపించేఆనందచేష్టలేతప్ప.ఇంకెక్కడాచపలత్వంలేమిపోకిరితనంమదగొడితనంపీడపోరుబంధనంతాపంచౌర్యంఅక్రమం అనేవి మచ్చుకైనా కానరాకుండా పోయాయి. శ్రీరామచంద్రుడు కన్నబిడ్డలవలె ప్రజలనుచూచుకుంటూ పాలించడంవలనప్రజలు తమ తండ్రులను మరచిపోయారు. రాముడే తమ తండిగా, ఆనందంగా జీవించారు. శ్రీరాముడు పూర్వీకులైన రాజర్షుల వలెనే మెలిగాడు. ధర్మాత్ముడై యున్నాడు. ఎకపత్నీవ్రతుడుసర్వలోకసమ్మతుడుధర్మపద్దతిలో ఇహలోకసౌక్యములనుభవించినవాడుగా పేరు గడించాడు. ఉన్నది త్రేతా యుగమేయైనా కృతయుగ ధర్మాలను నెలకొల్పాడు. బాలమరణాది అరిష్టాలు రామరాజ్యంలో లేవు. సీతమోములో సిగ్గులుఅందచందాలతో అలరారుతూ భక్తిభయమునయముప్రియము గల్గి రామచంద్రుని తనవానిగాజేసుకున్నది. శ్రీరాముడే భగవంతుడు గనుక తననిగూర్చేఅంటే శ్రీహరినిగూర్చే యజ్ఞయాగాదులు చేసినాడు. హోతకు తూపుదిక్కుసామగానంచేసేవారికి ఉత్తరందిక్కుబ్రహ్మస్ఠానం వహించిన వారికి దక్షిణందిక్కుఅధ్వర్యులకుపడమరదిక్కుమిగిలినది ఆచార్యులకుపాడి పశువులను బ్రాహ్మణులకు పంచి దానంయిచ్చేశాడు. తనకు రెండువస్త్రాలుసీతకు కాంతివంతమైన మంగళసూత్రాలు మాత్రమే వుంచుకున్నాడు. వినయసంపన్నుడై ఆదర్శజీవనం గడపసాగాడు శ్రీరాముడు. అయితే విప్రులు శ్రీరాముని దానశీలత్వం మెచ్చి తమభూములు తిరిగి శ్రీరామునకే యిచ్చివేశారు. రామా! మీరుఅఖిలలోకజనకులు. మా మానసాంధకారన్ని తొలగించి, మీ ఔదార్యకాంతిని మాపై ప్రసరింపజేయమని విన్నవించారు. శ్రీరామచంద్రుడు చాలాకాలం జనరంజకంగా రాజ్యమేలడు.

 

అలావుండగా ఒకదినంశ్రీరామచంద్రుడు తనరాజ్యస్థితిగతులను తెలిసుకునే నిమిత్తం మారువేషంలో దిరుగుచుండగా నగరవసులలో ఒకడు తనభార్యననుమానించినేను పరునింట కాపురమున్న చపలచిత్తను యేలుకోవడానికి మనరాజు రామునివంటి వాడనుగానని పలుకుచుండగా విన్నాడు. అంతేగాక అవే మాటలు రాజ్యంలో అందరూ అనుకోవడం, చారుల వలన దెలిసికొని చింతించిసీతనిద్రిస్తున్న సమయంలో ఆమెకు దెలియకుండా రాత్రికిరాత్రే వాల్మీకిఆశ్రమంలో బెట్టించాడు . సీత అప్పటికే గర్భిణి గనుక కుశలవులనే కొడుకులను వాల్మీకిఆశ్రమంలోనే గన్నది. వాల్మీకిమహర్షి ఆబిడ్డలకు జాతకర్మలు సక్రమంగా నిర్వహించాడు.   

 

ఇక్కడ అయోధ్యలో లక్ష్మణునకు అంగదుడుచంద్రకేతుడు అను కుమారులు కలిగారు. భరతునకు దక్షుడుపుష్కరుడుశత్రుఘ్నునకు సుబాహుడుశృతసేనుడు కలిగారు. మహబలుడైన భరతుడు గంధర్వులతో యుద్ధంచేసి గెలిచిమాతృజనములుబంధువులు ప్రజలు మెచ్చుకొనుచుండగా కనకాది సంపదలు రామునకిచ్చాడు. మృదుభాషి శత్రుఘ్నుడు రామాజ్ఞపై మధువనంపై దండెత్తి మధునందనుడగు లవణుని యుద్ధంలో హతమార్చి మధుపురాన్ని నిర్మించాడు.

 

కొంతకాలానికి లవకుశు లిద్దరు వాల్మీకిశిక్షణలో వేదాదివిద్యలు నేర్చిఅనేక సభలలో రామకథాశ్లోకములను శ్రుతిబద్ధంగా పాడుతున్నారు. ఒకదినం శ్రీరాముని యాగ శాలకు వచ్చి రామకథాగానంచేశారు. ఆగానం యెండిపోయినచెట్లు చిగురించేట్లుతేనెలు జాలువారేట్లు, మృదుమధురంగా వుంది. ఆగానంవిని రామచంద్రుడుప్రజలు అమితానందభరితులయ్యారు. వారి కళ్ళనుండి ఆనందబాష్పాలు రాలాయి. శ్రీరాముడు ఉత్సుకతతో బాలకులారా! మీరెవరి బిడ్డలని విచారించాడు. పిల్లలు రాజా! మేము వాల్మీకిపౌత్రులముశ్రీరాములవారి యాగంచూడటానికి వచ్చామన్నారు. రాముడు చిరునవ్వునవ్వియీపూటకిక్కడే విశ్రాంతి తీసుకోండిరేపటికి మీతల్లిదండ్రులెవరో నేనే తెలుసుకుంటాననివారిని సత్కరించి వెళ్ళాడుమరునాడు వాల్మీకిమహర్షియే సీతనుదోడ్కొని కుశలవులను ముందుబెట్టుకొని శ్రీరాములవద్దకు వచ్చిరాముని ప్రశంశించిరాజా! సీత పరిశుద్ధురాలుచిత్తములోను వాక్కులందును కర్మలందునూ (త్రికరణశుద్ధిగా) సత్యమూర్తిఅమలచరితపుణ్యసాధ్వివిడువదగనిది. గ్రహించమని హితవుబలికాడు. వాల్మీకి పుత్రార్థియై విచారింపగాకుశలవులు మీబిడ్డలేయని అప్పగించి వాల్మీకిమహర్షి వెళ్ళిపోయాడు. నిరాశయైన సీతశ్రీరామచరణధ్యానము చేయుచూభూమిలో కూరుకపొయింది.

 

శ్రీరామచంద్రుడుసీతా! యెందుకు భూమిలోనికి క్రుంగిపోయావుమనప్రేమను మరచావాపద్మమువంటి నీవదనము చూపవానన్ను విడిచి వెళ్ళటం భావ్యమానీమృదువైన మాటలు వినిపింపవాఅంటూ తాను భగవానుడేయైనా దుఃఖించాడు. ప్రియురాలిని గోల్పోయిన వారెకెవ్వరికైనా యీదుఃఖం తప్పదుగదా! శ్రీరామప్రభువు బ్రహ్మచర్యం పాటిస్తూపదమూడువేల సవత్సరములు నిత్యాగ్నిహోత్రుడై తానే భగవంతుడు గనుక తన మొదటిస్థానమైన వైకుంఠము చేరుకున్నాడు.

 

శ్రీరామచంద్రుడు  సాక్షాత్తు ఆదిదేవుడు. ఆయనకు సముద్రం దాటటంరాక్షసులను సంహరించడంకపులసహాయం బొందడం ఒక లెక్కలోని పనిగాదు. ఇది సాత్వి కస్వభావులదేవతల కొఱకు ఆయనచూపిన ఒక కీడమాత్రమే.

 

ఉప్పుసముద్రపు విజృభణము నణచినవాడుదశదిశల్లోని దిక్పాలకుల మకుటమణికాంతులవలెతనతనకీర్తిని ప్రకాశింపజేసినవాడువేయిమంది సూర్యులకాంతితో వెలుగొందువాడుఅమృతతుల్యములైన మధురవాక్కులవాడుసాధుజన పోషకుడుదశరథరాజ తయయుడురాక్షసరాజు దశకంఠుని దునుమాడిన వాడు నైన శ్రీరామునకు శరణమని మ్రొక్కుదును. నల్లనివాడుకమలముల వంటి కన్నులుగలవాడుమహత్తరమైన బాణములను విల్లును ధరించినవాడువిశాలమైన వక్షము గలవాడుశుభముల నిచ్చువాడుతనకీర్తిని దశదిశలా వ్యపింపజేసినవాడు అయిన రఘుతత్తముడగు శ్రీరాముడు మాకిష్టమైన కోరికలను తీర్చుగాక!

 

ఆకాలంలో శ్రీరామచంద్రునితో కలసిమెలసి తిరిగినవారుఆయనను తనివితీర దర్శించిన వారుఆయనతో సన్నిహితసంబంధం గలిగియుండినవారుఅయిన కోసల దేశప్రజలుఆది యోగులైనవారు చేరిన సద్గతికి చేరుకున్నారు. శ్రీరామచంద్రుని గురించి చేసిన యోచనలన్నీ ఉత్తమలోకాలకు దారిచూపుతాయి. ఆయనతో కల్పించుకున్న మైత్రి పుణ్యలోకాలకు చేరుస్తుంది. ఇప్పుడుచేసిన మరియు పూర్వముచేసిన మహాపాపము లనుసైతం నశింపజేయగల చింతనమీ శ్రీరామకథాచింతనము.  

                                                                     ఓం తత్ సత్.        

 

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...