Saturday, 22 August 2020

నివేదన

 నివేదన                                                   

    


తే:గీ.     త్రుంచ నెంచదు నా మది తుమ్మిపూలు

                 తలప నేరను మారేడు దళముగోయ

                 గాంచ నీ రూపె నిందందు గానిపించు

                 నేమి గొనివచ్చి పూజింతు నీశ నిన్ను

 

         తే:గీ.     గట్టి గుడిగట్టి నిన్నుంచ ఘనతయౌనె

                 ప్రతిమనింజేసి పూజింప ప్రతిభయౌనె

                 హృదయమందున నినునిల్పి ముదముతోడ

                 మానవత్వము వికసింప మనగ మేలు

 

 

         తే:గీ.     సగుణుడని నిన్ను నుతియింప సాహసింప

                 నిర్గుణుడవని భావింప నిజమదెరుగ

                 సగుణనిర్గుణ వాదమ్ము సాగనీక

                 హృదయమందు వెలుంగు నిన్ మదిని దలతు

 

         తే:గీ.     మోటు తిన్నని దయదల్చి మోక్షమిచ్చి

                 బాలు సిరియాలు కరుణించి ప్రాణ మొసగి

                 పాము నేనుంగుకైనను పరము గూర్చి

                 భక్త సులభుడ వైతివో పరమ పురుష

 

         తే:గీ.     నిరత మేకాగ్ర వృత్తిమై నిన్ను దలచి

                 కలిమి లేములు నీ మాయ కలుగ తొలగ

                 కొఱత యేమాత్రమున్ లేక కువలయమున

                 దేవ జీవింతు సర్వంబు నీవె యనుచు.

***

search : Nivedana

తెలుగు పలుకు

 తెలుగు పలుకు                                            


    మందార మకరంద మాధుర్యమొలుకు నా తెలుగు పలుకు

    కర్పూరపరాగ పాండు రుచి పూరితము నా తెలుగు పలుకు

    స్ఫురదరుణాంశు రాగ రంజితము నా తెలుగు పలుకు

    భారతీదేవి కెంజేతి చిలుక పలుకు నా తెలుగు పలుకు

 

    పదబంధ సద్గుణాస్పద బుధశబ్ధభ్రాజి నా తెలుగు పలుకు

    అలతి అలతి హృద్యపదలలిత నా తెలుగు పలుకు

    లలిత శిరీషపుష్ప మృదువునకు సాటి నా తెలుగు పలుకు

    ఆటవెలదుల తోడ గుద్ది బుద్ధులుచెప్పు నా తెలుగు పలుకు

 

    అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫురిత నా తెలుగు పలుకు

    ఆకులందున అణగి కూయు కోయిలకూత నా తెలుగు పలుకు

    తుంగభద్రా సముతుంగ రావము తోడ శ్రుతిగల్పు నా తెలుగు పలుకు

    కోనేటిరాయని పొడగన్న పద ప్రతిభ నా తెలుగు పలుకు

 

    మైలమభీముని ఖడ్గమునకు పదును నా తెలుగు పలుకు

    కోటిరతనాల మృదు వీణారవము నా తెలుగు పలుకు

    చిక్కనిపాలపై మిసిమి మీగడ తరక నా తెలుగు పలుకు

    తేటవేలుపులేటి పన్నీటిబొట్టు నా తెలుగు పలుకు

 

    కందువ మాటల పొందు వీనులకు విందు నా తెలుగు పలుకు

    విరిపొట్లమును విప్ప గుప్పుమనియెడు తావి నా తెలుగు పలుకు 

    కులుకులొలికే ఎంకి  కలికితనముల తళుకు నా తెలుగు పలుకు

    కదిలి కదిలించి మున్ముందునకు నడుపు నా తెలుగు పలుకు

 

    కృష్ణరాయలకీర్తి కమృతత్వము నొసగె నా తెలుగు పలుకు

    రాణ్మహేoద్రపురిన్ రాణకెక్కగజేసె నా తెలుగు పలుకు

    మనుమసిద్ధి గద్దె  కదలనీయక నిల్పె నా తెలుగు పలుకు

    మల్కిభరామునిపేరు చరిత పుటలను నిల్పె నా తెలుగు పలుకు

     

    తెలుగు వెలుగుకవితలెల్ల - వినుచు నానందించు

    శ్రోతలకు నివియె మా - వందనములుఅభివందనములు.


                ***

                    

                                    Telugu Paluku


కడపకు వందనం

కడపకు వందనం

    

    చరితపుటల తళుకులీను - కడపకిదే వందనం

    దేవునిగడపై వెలసిన -  మా కడపకు వందనం

 

    కడపరాయని రక్ష -విజయదుర్గ కటాక్షము

    అమీన్‌పీర్ ఆసీస్సులు - మరియాపుర యేసుకృపా

    తరగక యున్నట్టి మా - కడపే ఒక సుస్థలం.//చరితపుటల //

 

    అల్లసాని జిగి కవితలు - భట్టుమూర్తి సుశ్లేషలు

    బమ్మెర పరమాత్మగీతి - అన్నమయ్య ముద్దుపాట

    తెలుగు జాతి కందించిన - కడపమండల కీర్తికి

    మరీ మరీ వందనం -అభినందన చందనం. //చరితపుటల//

 

    వీరబ్రహం వేమన - కాశీనాయన పుల్లయ

    అవధూత, అరుళయ్య - స్వాముల దీవెనలతోడ

    పావనమైనట్టి కడప - కిదేయిదే వందనం. //చరితపుటల//

 

    మంజుమియా కడపగాంధి- కోటిరెడ్డి బసిరెడ్డి

    యాదాళ్ళనాగమ్మ - వంటి మహామహులనూ

    కన్నభూమి కడపకిదే - వందన నీరాజనం. //చరితపుటల//

 


                ***

   * kadapa ku vandanam

అన్నమయ్యా నీకు వందనం

అన్నమయ్యా నీకు వందనం

 


1,        ఇదిగాక సౌఖ్య మిదిగాక తపము

          మరి యిదిగాక వైభవంబింకొకటి గలదా!

          అని హృదయ పరిపాకశుద్ధితోచనువుతో

            శ్రీవేంకటేశ్వరుని శృంగార రససరసి

           ముంచి ముంపించుకొని ఓలలాడిన

          పదకవితాపితామహా-అన్నమయ్యా

           నీకు వందనం-అభివందనం 

 

2,         ఎంతమాత్రమున కెవ్వరు దలచిన

            అంతమాత్రమే హరిదయయని

            ఏకులజుడైననేమి హరిదయకు పాత్రులందురని

            దేవా! నీవలన కొఱతలేదు మరి నీరుకొలది తామెర యని

           ఎఱిగి భావములోన బాహ్యమునందును

            గోవింద గోవిందయని మనసార దలచిన

           పంచమాగమ సార్వభౌమా-అన్నమయ్యా

          నీకు వందనం అభివందనం

 

3.         పుట్టుటయు నిజము పోవుటయు నిజమని

          నట్టనడిమిపని నాటకమని ఎఱిగి

           ఆకటివేళల అలుపైన వేళల

           తేకువ హరినామమే గాక మరి ఏది దిక్కని

           నాతిలో రాతిలో అన్ని అవతారాలలో

           కోనేటిరాయని గని పరవశుడవైన ఓ

          సాహిత్య సంగీతసారజ్ఞతారూపా-అన్నమయ్యా

          నీకు వందనం-అభివందనం.

 

 

4.         నేరిచి మాపెద్దలిచ్చిననిధానమైయున్న

          మాకులస్వామి కొండలరాయుని గొలువ

           ముద్దులొలుకు మా పల్లెపలుకుల వెన్నముద్ద లనగ

           పదకవితలల్లి మమ్మాస్వాదింప జేసిన

            వాగ్గేయకార బహుదూరపు బాటసారీ

          అన్నమయ్యా! నీకు వందనం-అభివందనం.

కృష్నదేవరాయా! నీకు కేలుమోడ్తు.

                           ***

    Search:  Annamayya neeku vandanam


భూతలస్వర్గం కాశ్మీరం

 భూతలస్వర్గం కాశ్మీరం

 

ఉ.       శ్రీరమ పీఠమాయన విశేష విశాలతనొప్పి జాజువై

         నీరజ రాజకోటి యనునిత్యము పూచి వికాసవంతమై

         పారగజూచువారల కపార వినోదము గూర్చుచుండు కా

         కాసార నికాయ కాశ్మిరు విషాదపు నీడల నేడు నిండెపో.

 

చం.      త్రిదివము భూతలంబునకు దించి సజావుగ నిల్పినారనన్

          హృదయము దెల్పు కాశ్మిర మహీధర సీతతుషారమున్ గనన్

          ముదమును జెందు మానసము పోతవిహారము జేయుచో నిటన్

          వదలెను నేడు వైభవము వైదొలెగెన్ కళ కాశ్మిరంబునన్.

 

ఉ.      దూరము లెక్కసేయక కుతూహలమేర్పడ డెందమందునన్

         మేరలు దాటి జంటలుగ మేకొని వచ్చిన వారి తోషముల్

         చారుతరంబునై మెఱయు శాల్వల విక్రయశాల సందడుల్

          మారినవేమి దెల్పుదు రమారమి కాశ్మిరు మూగబోయెలే.

 

ఉ.      చల్లదరేల నిప్పులను చల్లని కాశ్మిర ధాత్రి మీదకున్

          ప్రల్లదనంబు మాని జనవాసము లోనికి శాంతి దాంతి తోన్

         వల్లె యటంచు వచ్చి సహవాసము చేయుడు సజ్జనాళి తోన్

         చెల్లవు ఉగ్రవాదములు శ్రేయము గూర్పవు తీవ్రవాదముల్

 

 

ఉ.       ఏమతమైన చెప్పునది ఈశ్వరుజేర్చెడు మార్గమేగదా!

          కోమలమైన భావముల కూరిమి పంచుట నేర్వలేరొకో

         క్షేమముగాదు వైరము వచింపరు పెద్దలు హింస మేలనన్

          ప్రేమలుపెంచి కాశ్మిరము పేరుగడింపగ జేయలేరొకో.

                    ***



Bhutalaswargam Kaashmiram

గండికోట

 గండికోట


   

    ఇదెగండికోట ఇదె గండికోట

    పెన్నకొట్టిన గండి గట్టునానిలబడి

    వీరచరితల సాక్షమై- నిలచె నీ కోట

    అరిరక్తసిక్త కరవాలములు గడుగ

    ఎఱ్ఱబారిన యట్టి కొలను గల కోట.  // ఇదెగండికోట // 

 

    స్వేతకిటియై హరి ప్రత్యక్ష మై పలుక

    కల్యాణిచాళుక్య రాజప్రతినిధియైన

    కాకరాజిచ్చట కట్టెనీ కోట

    జయపతాకలు యెగుర కాకతీయులు మరియు

    విజయనగరపు రాజులేలినారీ కోట. // ఇదెగండికోట//

 

    ప్రౌఢరాయలు మెచ్చి తిమ్మనాయుని కీయ

    నొచ్చుకొను పన్నులన్ తొలగించి ప్రజమెచ్చ

    పాలించినాడతడు ప్రభువన్న యితడన

    మృణ్మయంబైనట్టి యాకోట కుడ్యముల్

    తొలగించి కఠినమౌ రాళ్ళతోగట్టించి

    దుర్భేధ్య మీకోట యనగ నిలబెట్టె.  // ఇదెగండికోట//

 

 

    కాలక్రమమ్మునా రాజరికములు మారి

    రామ లింగనాయుడు మరియు బంగారు

    తిమ్మనయుడు రాజు లై  యేలిరీకోట

    ఆ వరుస క్రమమున్ చినతిమ్మనాయుడూ

    యేలికై కళలను కవుల పోషించె

    స్వాతంత్ర్యరాజునని ప్రకటించుకొని వెలిగె

    కాలమిట్టులగడవ సచివుడౌ లింగన్న

    శత్రుపక్షముజేరి అబ్డుల్ కుతుబుషా

    ఆంతరంగికుడైన మీర్జుమ్లతోగలసి

    రాజునకు విషమిచ్చి చంప రాజ్యమ్మును

    ముస్లిములు గైకొ న్  మీర్జుమ్ల యేలికై

    బెదిరించి హిందువుల పడగొట్టె గుడులను  // ఇదెగండికోట//

 

    మాధవుని గుడి మరి రఘునాధ శివ గుడులు

    శిధిలమై మిగిలెనా మీర్జుమ్ల ధాటికి

    ఇస్లాము ముల్లాల బోధవిని మీర్జుమ్ల

    ప్రజలమేల్గోరి ఒక ధాన్య గారముగట్టె

    ప్రార్థనల కనువుగా మస్జీదు గట్టించె

    పడగొట్టినా గుడుల బాగుచేయగ నెంచె

    కాని యప్పటి ఢిల్లిపరిపాలకుల ముదల

    లేక సాయముచేయ లేక వ్యధజెందె

    బదిలియై యస్సాము గారొ కొండలయందు

    ఆరోగ్యపతనమై యచ్చటనె మృతిచెందె.  // ఇదెగండికోట

***

Gandikota


పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...