Thursday, 30 March 2023

నైవేద్యం -ప్రసాదం

                           నైవేద్యం -ప్రసాదం


నైవేద్యం అంటే దైవానికి సమర్పించిన ఆహరపదార్తం. ప్రసాదమంటే పూజానంతరం అందరికీపంచి మనమూస్వీకరించే పదార్తం. సాదమంటే ఆహారం.ప్ర చేర్చడంవల్ల అది మహత్తరమైంది. మనం పరిశుభ్రులమై పరిశుభ్రంగా  తయారుచేసిన ఆహారపదార్తానే దైవానికి సమర్పిస్తాం. ఆపదార్తాన్నే ప్రసాదంగా స్వీకరిస్తాం. అదికూడా మనకిష్టమైన పదార్తాన్నే నైవేద్యంగా పెడతాం. నైవేద్యం ఎంగిలిపడుతుందని రుచికుడా చూడం.   అంత శుచిగాసమర్పిస్తాం. ఎలా ఆలోచించినా భక్తితో పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం, ముక్తిదాయకం. విగ్రహరూపంలోని దేవుడు తినడుకదా? ఆంటే, ఔను తినడు. కానీ పవిత్రభావనతో తయారు చేసి ప్రశాంతచిత్తముతో సమర్పించి, భక్తిభావంతో స్వీకరించిన ఆహారం అన్ని విధాలా మేలేచేస్తుందన్నది నిర్వివాదాంశం. గ్రామదేవతల యెదుట బలులు, కొన్నికథలలో రక్తమాంసాదులు సమర్పించిన విధులు వున్నాయి. అందులో భూతదయ లేదు. హింస ప్రత్యక్షముగా కనబడుతున్నది. కనుక అటువంటి వాటిని గురించి చర్చించదలచలేదు. సాత్విక సమర్పణలు స్వీకరణలు మాత్రము శ్రేష్ఠములన్న విషయము నిర్వివాదాంశము. సాత్వికములనునవి మాత్రము దైవసృష్టికాదా? దైవమిచ్చినవే తిరిగి దైవమునకు సమర్పించుట సక్రమమా? అన్నవాదనా ఉండనే ఉండనే వున్నది. నిజమే సర్వం దైవమయం అన్న మహోన్నత సత్యాన్ని అనుభవ పూర్వకంగా గ్రహించిన మహనీయులు తమ ఆకలితీరడానికి తిన్నదంతా ప్రసాదమే, త్రాగిన నీరమంతా  తీత్థమే. ఒకసాధ్వీమణి తనకీ జన్మకు భగవంతుడిచ్చిన భర్తకు, బిడ్డలకు, అత్తమామలకు, తల్లిదంద్రులకు, నేను ప్రసాదాన్ని చేస్తున్నాను, అని సంకల్పంచేసి చేసిన సంగటిముద్ద కూడా తన వారందరికీ ప్రసాదమే ఔతుంది. అది తిన్న కుటుంబసభ్యులందరి ప్రవర్తన సక్రమంగా వుంటుంది. అయితే అంతదూరమాలోచించలేని సామాన్యజనాలు దేవుడు, దైవమనే భావనతో తాత్కాలికంగానైనా దైవచింతనతో నైవేద్యానికి సరకులు సమకూర్చుకొంటూ, నైవేద్యం తయారుచేస్తూ, దైవానికి నివేదిస్తూ, ప్రసాదంస్వీకరిస్తూ, భక్తిభావంతో కొంత సమయం గడపటానికి యీప్రక్రియ ఉపయోగపడుతున్నది. ఇలా చేస్తూపోతే, వారే క్రమేణా మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు. చివరకు అర్పణలన్నిటికన్నా హృదయార్పణమే మిన్నయన్న మహోన్నతస్థితికి చేరుకుంటారు. అందుకు భగవంతుడే దారిచూపిస్తాడు. 

 దేవుడొక్కడే నంటూనే ఒక్కొకకోరిక నెరవేరడానికి, ఒక్కోదేవునికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. ఏపేరుతో ఏనైవేద్యం సమర్పించినా అంత నాకే చెందుతున్న గీతావాక్యానుసారం, “భక్తిగలుగు కూడు పట్టెడైననుచాలు” అన్న వేమన మాటప్రకారం, కొంతైనా మేలు జరుగకపోదు గదా! ఎందుకంటే ఇక్కడ కూడా దైవమన్నభావన వున్నదిగదా! అదే ముఖ్యం. భక్తిభావం చెదిరిపోకుండా ఉండేందుకు పండితులు కొన్ని విధివిధానాల నేర్పరచినారు. నైవేద్యం పెట్టేప్పుడు "ఓం సత్యం చిత్తేన పరిషించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి స్వాహా" అని నైవేద్యంచుట్టూ, నీటిబిందువులు చిలకరించి, తర్వాత "ఓం ప్రాణాయస్వహా. ఓం ఉదానాయస్వాహా. ఓం సమానాయస్వాహా. ఓం బ్రహ్మణే" అని కుడిచేత్తో నైవేద్యాన్ని దైవానికి చూపించాలి. "మధ్యే మధ్యే పానీయం సమర్పయామి" అని నైవేద్యం మీద మళ్ళీ నీటిబందువులు సంప్రోక్షించాలి. "నమస్కరోమి" అని సాష్ఠాంగదండ ప్రణామం చేసి ఆతర్వాత అక్కడున్నవారందరూ బయటికివెళ్ళి రెండునిముషాల తర్వాత తిరిగివచ్చి, మళ్ళీ దైవానికి నమస్కరించి, అక్కడున్న వారందరికి ప్రసాదంపెట్టి తనూస్వీకరించాలి. భగవంతునిముందు విస్తరిలో సంపూర్ణభోజనం నివేదిస్తే, అది మహానైవేద్యమౌతుంది. తీర్థస్వీకరణానంతరం ఇంటియజమాని దాన్ని భక్తితో  భుజించవచ్చును. ఇది సామాన్యులు సులువుగా చేయదగిన విధానము. ఇదికూడా పాటించకుండా, ఎందరుభక్తులు తమ యిష్టదైవానికి తమకిష్టమైన నైవేద్యంపెట్టలేదు? అంటూ కొందరు భక్తకన్నప్పను ఉదహరించవచ్చు. సరే అన్నింటికి మూలం భక్తి. భక్తిముఖ్యంగానీ విధివిధానాలంత ముఖ్యంగాదని చెప్పిన పెద్దలూ ఉన్నారు. సరే అలాగే ననుకున్నాం, "లొకో భిన్నరుచిహిః" అన్న నానుడి ఉండనేఉన్నది గదా!

 ఇక నైవేద్యం ఏమి సమర్పిస్తే, ఏఫలితం వస్తుందోకూడా పూజారులు తెలియజేశారు. అదీ సరేమరి! ఏదో ఫలితమాశించైనా దైవాన్ని తలచుకుంటున్నారు గదా! అదీ కొంతలోకొంత మంచిదేననుకున్నాం.  ఇక అవిషయానికొస్తే, కొబ్బరికాయ సమర్పిస్తే పనులు సానుకూలంగా నెరవేరుతాయట. అలాగే కమలాపండ్లు సమర్పిస్తే నిలచిపోయిన పనులలో కదలికవచ్చి సనుకూలంగా పూర్తౌతాయట. మమిడిపండు వల్ల పాతబాకీలు వసూలౌతాయట. చెల్లించవలసిన బాకీలు సకాలంలో చెల్లించగలుగుతారట. గణపతికి తేనె మామిడిపళ్ళరసం సమర్పిస్తే మోసంచేయడానికి వచ్చినవారు కూడా మారిపోయి మేలుచేస్తారట. సపోటాపండు సమర్పిస్తే, సంబంధాలు తొందరగా కుదిరి వివాహాలు శీఘ్రంగా జరుగుతాయట. చిన్న అరటిపండ్లు సమర్పిస్తే, పనులు వేగంగా పూర్తై, కార్యసిద్ధి కలుగుతుందట. అరటిగుజ్జు సమర్పిస్తే, శుభకార్యాలకు అడ్డంకులు తొలగిపోయి, నష్టాలనుండి బయటపడతారట. నేరేడుపండు భోజనంతోసహ నివేదిస్తే, అన్నపానాదులకు లోటురాదట. నేరేడుపండ్లు శనిదేవునికి సమర్పిస్తే, నడుము, మోకాళ్ళనొప్పులు నయమౌతాయట. ఈపండ్లు శివకేశవులకు సమర్పిస్తే, సమస్త శుభాలూ చేకూరుతాయట. ద్రాక్షపండ్లు సమర్పిస్తే, పక్షపాతం నయమౌతుందట. సుఖసంతోషాలు కలుగుతాయట, జామపండ్లు సమర్పిస్తే, ఉదరకోశవ్యాధులు నయమౌతాయట. వ్యాపారాభివృద్ధి జరుగుతుందట. ఈపండ్లు దేవికి సమర్పిస్తే, చెక్కెరవ్యాధి తగ్గుతుందట. దాంపత్యకలహాలు తొలగిపోయి, సంతానభివృద్ధి జరుగుతుందట. సంఘంలో  గౌరవం పెరుగుతుందట. గణపతి అనుగ్రహం కొఱకు ఉండ్రాళ్ళు వినాయకచవితినాడు సమర్పిస్తారు. శ్రీరామనవమికి వడపప్పు పానకం సమర్పిస్తారు. కృష్ణాష్టమికి వెన్నముద్దలు సమర్పిస్తారు. ఉట్టికొట్టేవేడుక జరుపుకుంటారు.

 అందరికీ తెలిసిన ప్రసాదాలు వుండనే వున్నాయి. తిరుపతి వేంకటేశ్వరునికి చాలాచాలా నైవేద్యాలే సమర్పిస్తారు. లడ్డూ, వడ మాత్రం చెచ్చుకోకుండా, పంచకుండా వుండలేరు. శబరిమల అయ్యప్ప ప్రసాదం అదోరకం. చిన్నచిన్న డబ్బలలో తెచ్చి పంచిపెడుతుంటారు. పేరుపొందిన దేవాలయాలన్నిటిలో రకరకాల ప్రసాదాలు యిస్తున్నారు, భక్తులు తెచ్చుకొని తాముస్వీకరించి, యితరభక్తులకూ పంచుతున్నారు.  ఏదియేమైనా సమర్పించేది, పత్రం, పుష్పం, ఫలం తుదకు తోయమైనా ( జాలమైనా) సరే, మనస్సులో సమర్పణభావం, శ్రద్ధ, భక్తి, ఉంటే అదిసార్థకమౌతుంది. శ్రీరాంచంద్రజీ తమ సహజమార్గ విధానంలో  నైవేద్య సమర్పణ మరొక పద్దతిలో చెప్పారు. వారు బూంది (లడ్డుపొడి) ని పెట్టి,  మానవ సమాజోద్ధరణకు పాటుబడిన మహనీయుల నావాహనజేసి, యీఆహార పదార్తమును శక్తివంతముజేసి, స్వీకరించిన వారందరికి ఆత్మోన్నతి  కలుగజేయు నట్టిదిగా జేయుడని వినమ్రతతో ప్రార్థించి, తొలుత పిల్లలకు పెట్టి, తర్వాత  మిగిలివారందరూ స్వీకరిస్తారు. ఈవిధానంలో దేవుడు తినడమన్నది లేదు. చాలాసమర్థనియముగా కుడా ఉన్నది.        

ఏదిఏమైనా,  కోరికలులేని, నిష్కామభక్తితో చేసిన సమర్పణ ఉత్తమోత్తమం. అలాకాక యాంత్రికంగా యెదోచేశాం, అయిపొయింది, అనే పద్దతిలోచెసే పూజలు, పెట్టే నైవేద్యాలు స్వీకరిచే ప్రసాదాలూ నిరుపయోగమని గ్రహించి, భక్తిని ఇష్టంగా పాటిద్దాం. భగవదనుగ్రహనికి పాత్రులమౌదాం.  కడకు హృదయార్పణకు మించిన సమర్పణ మరొకటిలేదన్న సత్యన్ని గ్రహించి, భగవంతుని శరణుజొచ్చి తరిద్దాం.                         

 

         

 

 

Saturday, 25 March 2023

దీపం,Dipam

 

దీపం


 


దీపంవెలిగించనిదే యేదైవారధన జరుగదు. అసలు దీపమే సర్వదేవత స్వరూపమని హిందువుల విశ్వాసం. దీపప్రమిద క్రిందిభాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, ప్రమిద శివుడు, వత్తులవెలుగు సరస్వతి, మండేభాగం (విస్ఫులింగం) లక్ష్మియని పడితులు వివరిస్తున్నారు.  విద్యుద్దీపాలు లేని పూర్వకాలంలో అసలు దీపాలే వెలుగుకు ఆధారమన్న విషయం అందరెరిగినదే. చీకటి అజ్ఞానానికి సంకేతం. వెలుగు జ్ఞానానికి ప్రతీక. కనుకనే దీపం జ్ఞానదాయినయింది. దీపం తొలిమలిసంధ్యల్లో వెలిగించి దైవరధనచేయటమొక సదాచారం. కనీసం మలిసంధ్యలోనైనా దీపరధనచేయటం శ్రేయస్కరం. దీపం పంచభూతత్మకమని కొందరి అభిప్రాయం. మట్టిప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తులు ఆకాశతత్వానికి, వెలగడానికి ప్రసరించేగాలి వాయుతత్వానికి. జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. విశ్వం కాంతిమయం. కాంతిశక్తిమయం. దైవాన్ని ప్రకాశంగా ఆరాధించే సంప్రదాయన్ని ఋషులు అనుష్టించారు. పూజను పారంభించడానికిముందు దైవానికి ప్రతిరూపమైన దీపాన్నివెలిగిస్తూ "దీపం జ్యోతి పరబ్రహ్మం. దీపం సర్వతమోపహం. దీపేన హరతే పాపం. దీపలక్ష్మీ నమోస్తుతే" అని శ్లోకం చెబుతూ దీపాన్నివెలిగించి ఇష్టదేవతాపూజలు యధావిధిగా కొనసాగించాలి. ఆలయంలోదీపం, వృక్షమూలంవద్ద దీపం. ఆలయధ్వజస్తంభంవద్ద దీపం, గృహంలోని దేవునిమూల దీపం, ఇంటిగుమ్మంవద్ద దీపం, తులసికోటవద్ద దీపం ముగ్గులమధ్య దీపం, పుష్పాలమధ్య దీపం,  ఇలా ఎక్కడ దీపంవెలిగించినా అసురశక్తులను, అసురగుణాలను నిలువరించి సత్వాన్నీ, సత్యాన్నీ ప్రతిష్టిస్తూ దీపశిఖవలె ఊర్ద్వముఖంగా భగవంతునివైపు మనస్సును మరల్చుతుంది. దీపంకొసనుండి వచ్చే మంటచుట్టూ ఒక కాంతివలయం ఏర్పడుతుంది. అది శక్తివంతమైన దైవానికి ప్రతిరూపం. సమస్త దోషాలను పరిహరించి వరుస విజయాయాల నివ్వగల శక్తిఅది. దీపాలను నేరుగా                                            

అగ్గిపుల్లతో వెలిగించరాదంటారు. ముందుగ ఒకదీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించి. ఆదీపంతోమిగిలిన దీపాలన్నీ వెలిగించి, అగ్గిపుల్లతో వెలిగించిన దీపాన్ని ఆర్పేయవచ్చు. దీపాలను ఆర్పేయాల్సివస్తే, నోటితో ఊదరాదు. ప్రమిదలో ముందుగా నూనెపోసినతర్వాతే వత్తులు వేయాలి. నేయివేసిన ప్రమిదలోగానీ దీపస్తంభంలోగానీ ఐదు వత్తులు కలిపివేసుకొని స్త్రీలు వెలిగిస్తే ,మొదటివత్తి వలన భర్త, రెండవవత్తివలన అత్తామామలు, మూడవవత్తివలన తోబుట్టువులు క్షేమంగవుంటారు, నల్గవది గౌరవ మర్యాదలు హెచ్చిస్తుంది. ధర్మవర్తనాన్ని ప్రోత్సహిస్తుంది. ఐదవవత్తివలన వంశాభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడుకూడా ఒకవత్తిదీపం వెలిగించరాదు. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి వెలిగిస్తే విశేష ఫలితాలుంటాయంటారు. పైవాటిలో ఏదోఒకదానితో దీపం వెలిగించవచ్చు. ఆముదం. కానుగనూనె కొబ్బరినూనెతో కూడా దీపాలు వెలిగించుకోవచ్చును. కానుగనూనెదీపాలు కంటికి చలువచేస్తాయి. ప్రమిదక్రింద మరొకప్రమిదగానీ తమలపాకుగాని, బియ్యంగానీపోసి దీపంపెట్టుకోవాలి. దిపాస్తంభానికైతే  క్రింద బియ్యంపోయడం  ఉత్తమం .

ఒకసారి ఐరావతంపై వెళుతున్న ఇంద్రునికి దూర్వాసమునీంద్రుడు పారిజాతసుమమాలను ఇచ్చాడు. ఇంద్రుడు నిర్లక్ష్యంగా మాలను ఐరవతంపై వేశాడు. ఆఏనుగు క్రిందవేసి కాలితోత్రొక్కి నలిపేసింది. దుర్వాసముని కోపించి ఇంద్రుని శపించాడు. అంతటితో ఇంద్రుడు సర్వంకోల్పోయాడు. దిక్కుతోచక ఇంద్రుడు శ్రీహరిని శరణుజొచ్చాడు. శ్రీహరి దీపరూపంలో లక్ష్మినిపూజింపమన్నాడు. ఇంద్రుడు శ్రీహరి చెప్పినట్లుచేసి, పూర్వవైభవాన్ని తిరిగిపొందాడు. దీపం దేవుని ఎదురుగాపెట్టరాదు. శివునిపూజలో ఎడమవైపు, శ్రీహరిపూజలో కుడివైపు పెట్టుకోవాలి. శనిదోషం పొవాలంటే, అరచేతిలో నల్లని వస్త్రంపెట్టుకొని అందులో నల్లనువ్వులు కొన్ని పోసిచుట్టి నువ్వులనూనె లోతడిపి నువ్వులనూనెదీపం పెడితే ,శనిదేవుడుకూడా అనుకూలఫలితాలనిస్తాడు. కార్తీకమాసం శివకేశవులకిద్దరికి ఇష్టమైనమాసం. ఈనెలలో దీపాలతో వారిని పూజిస్తే తెలియకజేసినపాపాలు హరించుకపోతాయి. కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీకమాసదినం దీపారాధనకు మరింత శ్రేష్ఠమైనది. కర్తీకపౌర్ణమినాడు 365 వత్తుల దీపారధనచేస్తే, ఏడాదిపొడవునా దీపారాధనచేసిన పుణ్యం లభిస్తుంది. కార్తీకమాసంలో ఆలయాల్లో ఆకాశదీపాలు వెలిగిస్తారు. చిన్నచిన్న రంధ్రాలుగలిగిన ఇత్తడిపాత్రలో నూనెపోసి దీపాలు వెలిగించి తాడుసహాయంతో ధ్వజస్తంభం పైకి పంపి వ్రేలాడదీస్తారు. ఈదీపాలు పితృదేవతలు మనలను దీవించి వెళ్ళేటప్పుడు వారికి దారిచూపిస్తాయని పండితుల అభిప్రయం. మార్గశిరపాడ్యమినాడు అరటిదొప్పలలో దీపాలువెలిగించి, పోలిఅనే ఒకభక్తురాలు ఉత్తమలోకాలకు పోతున్నట్లు భావించి నీటిలో వదులుతారు. ఈపోలి మహాభక్తురాలు. ఈమెను కార్తీకమాసంలో దీపారాధన చేయనీయకుండా, అత్తాతోడికోడళ్ళు, పూజవస్తువులు ఇంట్లోవుంచకుండా తవెంటతీసుకొని నదీస్నానానికి వెళ్ళేవారు. పోలి ఉపాయంగా పెరటిలోని ప్రత్తిచెట్టునుండి దూది సేకరించుకొని వత్తులుచేసుకొని, కవ్వానికంటుకొనివున్న వెన్నతీసి, వత్తులకు పట్టించి దీపారాధన సక్రమంగాచేసుకొని, అత్తా తోడికోడళ్ళు తిరిగివచ్చేసరికి ఒకబుట్టక్రింద దీపాలను దాచేసేదట. ఈమె భక్తికిమెచ్చి దేవతలు విమానంలో వచ్చి ఆమెనెక్కించుకొని ఉత్తమలోకాలకు బయలుదేరారు, వెంటనే అత్తాతోడికోడళ్ళు వచ్చి, ముందు అత్త పోలికాలు పట్టుకొని వ్రేలాడిందట, ఆమెకాలు కాలుపట్టుకొని మొడటికోడలు, ఆకోడలుకాలుపట్టుకొని రెండవకోడలు, అకోడలుకాలుపట్టుకొని మూడవకోడలు వ్రేలాడసాగారట. అప్పుడు అదిగమనించి దేవతలు అత్తను అనర్హురాలని క్రిందకుతోసేశారు. ఆమెతోపాటి వ్రేలాడుతున్న ఆమె కోడాళ్ళూ క్రిందపడిపోయరు. పోలినిమాత్రమే విమానంలో ఆకాశ గమనాన పరంథామానికి కొనిపోయారు దేవతలు. ఇదీ పోలిపాడ్యమికథ. ఈమార్గశిర పాడ్యమినాడు అరటిదొన్నెలలో దీపాలు వెలిగించి నీటిలో వదిలితే, తామూ పోలివలె పుణ్యలోకాలకు వెళతామని. బ్రతికినన్నాళ్ళు పసుపూకుంకుమలో సుమంగళిగా గౌరవంగా జీవిస్తామని నమ్ముతారు. దీపావళినాడు ఇంటింటా దీపాలవరుసలు దర్శనమిస్తాయి. నరకాసుర వధతో దూర్తపాలన అంతమంది, ప్రజలజీవితాలలో వెలుగులు నిండాయన్న శుభసంకేతంగా అమావాస్యచీకటి కనరాకుండా ఆనాడు దీపాలుపెట్టి ఆనందిస్తారు. ఇదీ దీపమహాత్మ్యం.  

 

 

మామిడాకులు,mango leaves

 

మామిడాకులు



మామిడాకుల తోరణాలు కట్టనిదే హిందువుల యే శుభకార్యమూ జరగదు. పండుగల్లో, వ్రతాల్లో, యాజ్ఞయాగాదుల్లో, ఆలయద్వజారోహణల్లో, వివాహాదిశుభకార్యాల్లో, పందిళ్ళకు, మంటపాలకు, తలవాకిళ్ళకు మామిడితోరణాలు కట్టవలసిందే. కలశంలో కూడా మామిడాకులుంచడం సర్వసామాన్యం. మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువుంటుందని మనవారి నమ్మకం. అందుకే మామిడాకుల మంగళతోరణాలు కట్టిన ఇంట్లోగానీ మంటపాల్లోగానీ లక్ష్మీదేవిఅనుగ్రహం మెండుగా వుంటుంది. మామిడాకుల ప్రస్తావన భారత రామాయణాల్లోకూడావుంది క్రీ.పూ 150 సంవత్సరాల నాడే సాంచీస్తూపంపై ఫలించిన మామిడి వృక్షం చెక్కబడింది. ఉగాది పచ్చడిలో మామిడికాయముక్కలు తప్పనిసరి. మామిడిచెట్టు భక్తి ప్రేమలకు ప్రతీక. ఈచెట్టు సృష్టికర్త బ్రహ్మకు సమర్పింబడినదని, దీని పువ్వులు చంద్రునికి సమర్పింపబడ్డాయని హైందవవిశ్వాసం. కాళిదాసు దీన్ని మన్మథుని బాణాల్లో ఒకటిగా వర్ణించారు. శివపార్వతుల వివాహం ఒక ఇతిహాసానుసారం మామిడిచెట్టు క్రిందేజరిగింది. హనుమంతునివల్ల మామిడి భారతావనిలో వ్యాప్తిజెందిందని పండితులు చెబుతున్నారు. హనుమ మామిడి సువాసనకు ఆకర్షితుడై మామిడి ఫలాలను భుజించి, ముట్టెలను సముద్రంలో విసిరేశాడట, అవి బారతభూభాగానికి కొట్టుకవచ్చి చెట్ట్లుమొలిచి వ్యాపించాయట. మామిడాకులు కట్టినయింటికి వాస్తుదోషం తగలదు. సకారాత్మకశక్తుల ప్రవేశం, నకారాత్మకశక్తుల తిరోగమనం జరిగితిరుతుందంటారు.  కనుక పట్టిందల్ల బంగారమౌతుంది. మామిడాకులు తోరణం కట్టినచోట మనస్సుకు ప్రశాంతత జేకూరుతుంది. ఆప్రదేశంలో ప్రాణవాయువుశాతం పెరిగి స్వచ్ఛత నెలకొంటుంది. ప్రతిదీ శుభప్రదమౌతుంది. రోగకారక సూక్ష్మజీవులు నశించించడంవల్ల ఆరోగ్య పరిరక్షన జరుగుతుంది. మామిడాకులు యేకారణంచేతనైనా దొరక్కపోతే రాగి, జివ్వి, మర్రి ఆకులతో తోరణాలు కట్టూకోవచ్చు. మామిది, జివ్వి, రాగి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. వీటన్నిటినీ హిందువులు పవిత్రంగా భావిస్తారు. పూర్వకాలంలో పెళ్ళికిముందు వరుడు మామిడిచెట్టుకు పసుపుకుంకుమలతో పూజించి ప్రదక్షిణచేసి చెట్టును కౌగలించుకొని తర్వాత పెళ్ళిమంటపం ప్రవేసించే వాడట.

 ఆయుర్వేదంలోను, చైనావైద్యవిధానంలోనూ మామిడాకులు ఉపయోగపడుతున్నాయి. లేతమామిడాకులను నీడలో రెండబెట్టి చూర్ణం చేసుకొని రోజూ ఒకచంచా సేవించవచ్చు. లేదా ఆకులను సాంయంత్రం కషాయంకాచుకొని మరునాడు ఉదయం వడగట్టి త్రాగవచ్చు. అది రక్తంలో చెక్కెరను అదుపుచేస్తుంది. మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. రక్తనాళాలు బలాన్నిపుంజుకొని రక్తపోటు అదుపులో వుంటుంది. ఈకషాయంతో గాయాలుకడిగితే తొందరగా మానిపోతాయి. చెవిలోవేస్తే చెవిపోటు తగ్గుతుంది. కేరళలో ఆకులబూడిదతో పళ్ళపొడి తయారు చేస్తున్నారు.  మామిడిచెట్టుబెరడు వేళ్లుకూడా ఆయుర్వేదం మరియు చైనా వైద్యవిధానంలో ఉపయోగిస్తుంన్నారు. ఊబకాయం, గుండెసమస్యలు, క్యాన్సర్‍వంటిరోగాలకు, కణుతులు, అజీర్ణం, నిద్రలేమి, మతిమరుపు, వణుకుడు, క్రొవ్వుపేరుకపోవడం, గర్భాశయవ్యాధులు, పోస్ట్రేటుగ్రంధి వాపు, కడుపులో పూతలకు మందులు తయరౌతున్నాయి. జుత్తుసంరక్షక ఔషదాల్లోనూ, తైలాల్లోనూ మామిడాకుల రసాన్ని వాడుతున్నారు. లేతమామిడిఆకుల్లో విటమిన్ ఎ, బి, సి, రాగి, పొటాషియం, మెగ్నీషీయం, మరియు జీర్ణశక్తిని మెరుగుపరిచే ఎంజైములు ఉన్నాయి.కనుక పచ్చిచిగుళ్ళు నమిలి మ్రింగినా మంచిదే నంటున్నారు .అందువల్ల నోటిదుర్వాసన కూడా తగ్గుతుంది. మామిదాకులు నీళ్ళతో పేస్టుగానూరి కాస్తాతేనెకలిపి ముఖానికి మాస్కుగా వాడితే ముఖం కాంతివంత మౌతుంది. తేనెకలపని పేస్టును వెంట్రుకలకు (తలకు) పట్టించి ఓ 15 నిముషాల తర్వాత తలస్నానంచేస్తే జుత్తు బాగపెరిరుగుతుంది, వెంట్రుకలు రాలవు, తెల్లబడవు. ఎండిన మమిడాకులు కాల్చి ఆపొగ పీలిస్తే గొంతు సంబంధవ్యాధులు నయమౌతాయి. ఇలా మామిడాకులు చాలా ప్రతిభావంతములై వున్నవి.                      

 

Wednesday, 22 March 2023

సాంబ్రాణి,Benzoin

 


సాంబ్రాణి



సాంబ్రాణిచెట్టునుండి వచ్చే జిగురు (బంక) నుండి సాంబ్రాణి తయారౌతుంది. దీన్ని నిప్పులపై వేస్తే తెల్లటి సువాసనగలపొగ వస్తుంది. దైవం ముందు సాంబ్రాణి పొగవేయడం హిందువుల ఆచారం. ముస్లింలు, క్రైస్తవులు కూడా దీన్ని పవిత్రంగా భావిస్తారు. ముస్లింఫకీర్లు నిప్పులపళ్ళెరాన్ని పట్టుకొని తిరుగుతూ యీపొగను వేసి నెమలీకలకట్టతో పొగ మనవైపుకు త్రిప్పి, దీవిస్తారు. క్రీస్తుజననం సమయంలో తూర్పుదేశపు జ్ఞానులు ఆయనను సమీపించి ఇచ్చిన కానుకలలో సాంబ్రాణికూడా వుంది. రోమన్‍క్యాథలిక్  తెగవారు ప్రార్థనాలయాల్లో (చర్చీల్లో) సాంబ్రాణిని వాడటం యిప్పటికి జరుగుచున్నది. దర్గాలలోకుడా ముస్లింలు సాంబ్రాణిపొగవేయడం చేస్తున్నారు. దైవకైంకర్యంగా సాంబ్రాణిపొగలు వేయడం దాదాపు అన్ని మతాలవారు ఇష్టంగా చేస్తున్నారు. సొమాలియా, అరేబియా, ఓమన్, ఇండోనేషీయా, జోర్డాన్, ఆఫ్రికా, భారత్ లలో యీసాంబ్రాని చెట్లనుపెంచి, విరివిగా వ్యాపారంకూడా చేస్తున్నారు. దేవునిపూజకేగాకుండా చనిపోయిన వారికికూడా సాంబ్రాణిధూపం వేస్తారు. వ్యక్తిచనిపోయినతర్వాత 12 రోలుజులవరకు ఇంట్లోసాంబ్రాణి ధూపం వేస్తారు. దివసాలలో, తద్దినాలలో, ముఖ్యంగా మహాలయ అమావాస్యనాడు, సాంబ్రాణిధూపంవేసి పరమపదించిన తమపూర్వీకులను తలచుకుంటారు. సాంబ్రాణిపొగలు తమపితృదేవుళ్ళను చేరి, వారిదీవనలు మనకందేట్లు చేస్తుంని విశ్వసిస్తారు. దీనియందు నమ్మకమున్నా లేకపోయినా సాంబ్రాణిపొగలు ఇల్లంతా అలముకొని, సువాసనను వెదజల్లడమేగాకుండా, సూక్ష్మక్రిములను, దోమలను, కీటకాలను పారద్రోలుతాయి. దుష్టశక్తులను అడ్డుకొని నకారాత్మక శక్తులను పారదోలి సకారాత్మక శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తాయన్నది పురోహితుల ఆభిప్రాయం. జ్యోతిషశాస్త్రజ్ఞులు సాంబ్రాణిధూపం యేరోజు వేస్తే యేఫలితం సమకూరుతుందో యిలా వివరించారు. ఆదివారం సాంబ్రాణి గుగ్గిలం కలిపినిప్పులపై పొగవేయడంద్వార సిరిసంపదలు, కీర్తి, దైవానుగ్రహం కలుగుతుంది. అదే సోమవారమైతే ఆరోగ్యం, ప్రశాంతత, దేవీకటాక్షం కలుగుతాయి. మంగళవారమైతే శత్రుభయం, అసూయ, ఈర్షా తొలగిపోయి, కంటిసమస్యలు, అప్పులబాధ వైదొలగుతాయి. బుధవారమైతే నమ్మకద్రోహులు, కుట్రదారులనుండి వచ్చే ఆపదలను పరిహరించి, వరుసగా శుభాలు కలుగుతాయి. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. గురువారమైతే సర్వకార్యములలో విజయం లభిస్తుంది. శుక్రవారమైతే లక్ష్మీప్రసన్నతతో నిర్విఘ్నంగా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. అదే శనివారమైతే ఈతిబాధలు తొలగిపోతాయి. శనీశ్వరుని అనుగ్రహం లభించి, సోమరితనం, అలసత్వం వదలిపోయి, తేజస్వంతులై వెలుగొందుతారు.

 ప్రస్తుతం సాంబ్రణికడ్డీలు, దిమ్మెలు విరివిగా లభిస్తున్నాయి. పూర్వం  ఆవుపేడతో చేసుకొన్న పిడకకు నిప్పంటించి దానిపై సాంబ్రాణి, గుగ్గిలం, శుద్ధచందనం కలిపివుంచుకొన్న పొడిని వేసిపొగను ఇల్లంతా వ్యాపింపజేసుకొనేవారు. కానీ యిప్పుడు కొన్నిరసాయనాలు కలిపిచేసిన సాంబ్రాణిదిమ్మెలు, బత్తీలు వస్తున్నాయి. వీటిపొగ మంచిదికాదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.  కనుక బాగాపరిశీలించి కొనాలి. శుద్ధ సాంబ్రాణిపొగ పీల్చడంవల్ల శ్వాససంబంధిత వ్యాధులు నయమౌతాయి. తలస్నానానంతరం శిరోజాలకు సాంబ్రాణి పొగవేసుకుంటే త్వరగా తల ఆరిపోవడమేగాకుండా, వెంట్రుకల కుదుళ్ళు బలపడతాయి. చంటిబిడ్డలకు యిలాచేస్తే రోగాలు దరిచేరవు. మంచినిద్రపడుతుంది. పిల్లలు చలాకీగావుంటారు. జుత్తు ఒత్తుగావున్న స్త్రీలకు తలస్నానానంతరం సాంబ్రాణిపొగపట్టడం సర్వదా స్రేయస్కరం.

 సాంబ్రాణి వైద్యపరంగానూ చాల ఉపయోగకారి. శరీరంలోని నీరసాన్ని పోగొట్టి నరాలను ఉత్తేజపరుస్తుంది. అనేక మానసికరుగ్మతలకు సాంబ్రాణిధూపం మంచిఔషదం. కీళ్ళనొప్పులకు అజీర్తికి చర్మవ్యాధులకు ఉబ్బసం అల్సర్ వ్యాధుల మందుల్లో సాంబ్రాణిని వాడుతారు. సాంబ్రణిపొగలు నాడీమండల వ్యవస్థను ప్రేరేపించి క్రమబద్దీకరిస్తాయి. సాంబ్రాణినుండి నూనెనుకూడా తీస్తారు. ఈనూనె సబ్బులు, బాడీలోషన్‍లు, పర్ఫ్యూమ్‍సు టూత్‍పేస్టులలో మరియు నొప్పినివారణ ఆయిట్‍మెంట్లలో వాడుతున్నారు.

  గుగ్గిలం, మైసాక్షి కూడా సాంబ్రణితో కలిపిగానీ వేరుగగానీ పొగవెయ్యడానికి ఉపయోగిస్తారు. ఇవికూడా వాటి చెట్లజిగురు నుండే తయారుచేస్తారు. మైసాక్షి (మహిషాక్షి) గుగ్గిలంలో మేలైన రకం.  ఇవికూడా ధూపానికేగాక ఆయుర్వేదమందుల్లో విరివిగా వాడుతారు. గుగ్గిలంతో తయారుచేసే యోగరాజగుగ్గులు అనే మాత్రలు ఆయుర్వేదంలో చాలా పసిద్ధిపొందాయి. ఇవి కీళ్ళనొప్పులను. వాతపునొప్పులను నయంచేస్తాయి. సాంబ్రాణిధూపం అనుదినం దైవంముందు వేద్దాం, ఇల్లంతా పొగలు వ్యాపింపజేద్దాం ఆనందంగా హుషారుగా వుందాం.         

 

 

 

 

 

 

 

 

 

 

 

Tuesday, 21 March 2023

కర్పూరం,camphor

 

కర్పూరం



కర్పూరాన్ని  కపురం, కప్పురం అనికూడాఅంటారు. కర్పూరంచెట్లు చైనా, జపాన్, దేశాల్లోను, భారత్‍లోని నీలగిరికొండల్లోనూ, మైసూర్, మలబార్ ప్రాంతాలలోనూ ఎక్కువగా  పెంచుతున్నారు.  హారతికర్పూరం, పచ్చకర్పూరం అందరికితెలిసిన కర్పూరాలు.  కర్పూరంలో చాలారకాలున్నాయి. ఘనసారం, భీమసేనం, ఈశానం, ఉదయభాస్కరం, కమ్మకర్పూరం, ఘటికం, తురుదాహం, తుషారం, హిమరసం, హారతికర్పూరం, శుద్ధం, హిక్కరి, ప్రోతాశ్రయం, పోతాశం, సితాభ్రం, యీ కర్పూరరకాలు. కర్పూరంచెట్టు వేళ్ళు,కొమ్మలు, ఆకులు నీళ్ళలో మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరమంటారు. దీన్ని ముఖ్యంగా లడ్డూలాంటి తీపిపదార్తాల్లోను  ఔషదాల్లోనూ, కాటుకలు, అంజనాలు తయారుచేయడానికి వాడుతారు. బీమసేనికర్పూరం, చెట్టుకొమ్మలకు గాట్లుపెట్టి, వాటినుండి స్రవించే పాలతో తయరుచేస్తారు. కనుక దీన్ని అపక్వకర్పూరం అనికూడా అంటారు. ఇది ఔషదాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హారతికర్పూరం టర్‍పెంటైన్ నుండి రసాయనిక ప్రక్రియద్వరా తయారుచేస్తారు. ఇది కృత్రిమకర్పూరం. దీన్ని ఔషదాలలో వాడరు. రసకర్పూరమని మరొకటున్నది. దీన్ని ఆముదంతో కలిపి చిన్నపిల్లలకు కడుపులోనికిస్తారు. శరీరంలోని దోషాలన్నిటిని ఇది  పోగొట్టి దేహరక్షణ గావిస్తుంది.

 కర్పూరం, పూజానంతరం దేవునివద్ద మంగళహరతిపాటపాడి   హారతినివ్వడానికేగాకుండా, వాస్తుదోష పరిహారణకూ, దిష్టిదోష నివారణకు సైతం కర్పూరముపయోగపడుతుంది. ఇంట్లో కర్పూరం వెలిగించడంవల్ల మానవసంబంధాలు మెరుగుపడతాయి. అపార్థాలు తొలగిపోయి మానసిక‍ఆంధోళనలు శాంతించి, నకారాత్మకశక్తులు నశిస్తాయి. పడకగదిమూలలలో వెండిలేక ఇత్తడి గిన్నెలో కర్పూరంవేసి వుంచితే భార్యాభర్తల మధ్య గొడవలుపోయి సమన్వయం కుదురుతుంది. ఇంటి ఆగ్నేయంలో కర్పూరం నెయ్యి కలిపి సాయంత్రాలు దీపాలు వెలిగిస్తే, గ్రహదోషాలు తొలగి, చేపట్టినపనులు సక్రమంగా జరుగుతాయి. అదృష్టం వరిస్తుంది. కర్పూరంపొడి లవంగాలపొడి కలిపి వెలిగించి ఇల్లంతా త్రిప్పితే, ఇంటికిపట్టిన చీడలు, పీడలు, పిశాచాలు వదలిపోతాయి. ముఖ్యంగా యిలా దీపావళిరోజునచేస్తే మరింతమంచిది. అనారోగ్యంనుంచి కోలుకొని ఆసుపత్రినుండివచ్చి గృహప్రవేశం చేసేటప్పుడు పళ్ళెరంలో ఎఱ్ఱనీళ్ళుపోసి అందులోనే కర్పూరం వెలిగించి దిష్టితీసి,  ఎఱ్ఱనీళ్ళు వాకిలి రెండుపంచలా పారబోయాలి. ఇలాచేసి ఇంట్లోకి వెళితే దృష్టి దోషాలుపోయి, ఆయురారోగ్యాలు సమకూరుతాయి తొందరగా మాములు స్థితికివచ్చేస్తారు. కర్పూరంపొడి లావెండర్‍ఆయిల్‍తో కలిపి గానీ లేక మంచినీళ్ళలోకలిపిగానీ ఇల్లుశుభ్రంచేస్తే క్రిములు నశించి, ఇల్లు సువాసనలతో శుభకరంగా వుంటుంది.  

    వైద్యపరంగా కర్పూరపు ప్రయోజనాలు చాలాఎక్కువ. కర్పూరం ఎక్కువమోతాదులోకాకుండా కొద్దిమాత్రమే సేవించాలి. లేకపోతే దానిఘాటువల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదంవుంది. కర్పూరం సేవిస్తే స్వల్పహృదయసమస్యలు, అలసట తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు, నరాల నొప్పులు, బలహీనత, వీపు నడుంనొప్పులకు నూనెలో కర్పూరం కలిపి మర్థన చేయడంద్వారా ఉపశమనం కలుగుతుంది. అందుకే చాలారకాల నొప్పినివారణ ఆయింట్‍మెంట్లలో దీన్ని వాడుతున్నారు. పుండ్లుమానడానికి, పిల్లల్లోవచ్చే గజ్జి తామర నయంచేయడానికి కూడా యీనూనెను ఉపయోగిస్తారు. కుష్ఠురోగుల పుండ్లను కూడా యీనూనె మాన్పుతుంది. కర్పూరం వాసనచూస్తే నాశికాసమస్యలు, ఊపిరితిత్తులసమస్యలు తొలగిపోతాయి. రెండుపలుకుల కర్పూరం నోటిలోవుంచుకుంటే, దప్పిక తగ్గుతుంది. నోటిదుర్వాసనా తగ్గుతుంది. సారాయిలో కర్పూరం కలిపి సంతృప్త ద్రావణంగా తయారుచేసుకొని చితికెడుచెక్కెరలో రెండు చుక్కలు యీ ద్రావణం వేసుకొని సేవిస్తే, నీళ్ళవిరేచనాలు తగ్గుతాయి. కలరావ్యాప్తి సమయంలోకూడా దీన్ని నివారణమందుగా వాడుకోవచ్చు. కర్పూరసువాసన కామకోరికలను అదుపులోవుంచుతుంది. అంతేగాక పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఎండుద్రాక్ష సమభాగాలుగాతీసుకొని కలిపినూరి బఠాణీలంత మాత్రలు చేసుకొని రాత్రిపడుకోబోయే ముందు ఒకగ్లాసు పాలతో సేవిస్తే మగవారిలో లైంగికశక్తి పెరుగుతుంది. కర్పూరం రోజ్‍వాటర్‍తో కలిపి మర్మావయాలకు పట్టించి 15 నిముషాల తర్వాత కడిగేస్తే మర్మాయవాలదురదలు తగిపోతాయి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే సరిపోతుంది. ఉబ్బసం తీవ్రంగావుంటే బెల్లం కర్పూరం సమపాళ్ళలోకలిపి కొద్దికొద్దిగా సేవిస్తే తీవ్రాత తగ్గుతుంది. నీళ్ళలో కాస్తా కర్పూరంపొడి చల్లి ఆనీళ్ళతో స్నానంచేస్తే శరీరంపైనుండే బ్యాక్టీరియా నశించి, చర్మంశుభ్రంగా వుంటుంది. కర్పూరంపొడిని కొబ్బరినూనెలో నానబెట్టి తలకుపట్టిస్తే చుండ్రు పోతుంది. ఉతికిన బట్టలమధ్య కాస్తా కర్పూరం వేసి పెడితే రిమటలు దరిదాపుల్లోకి రావు. కర్పూరం రెండుభాగాలు, వాముపువ్వు ఒకభాగం, మెంథాల్ (పెప్పరమెంటుపువ్వు) ఒకభాగం సీసాలోవేసేస్తే  అదే ద్రవమై పోతుంది. దీన్ని అమృతధార అంటారు. రెండుచుక్కలు అమృతధార చిటికెడుచెక్కెరలో వేసుకొని కడుపులోకి సేవిస్తే, ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. దగ్గుతగ్గుతుంది. నీళ్ళవిరేచనాలు తగ్గిపోతాయి. తలనొప్పులకు, వాపులకు బెణికిననొప్పులకు, పైపూతగా బాగా పనిచేస్తుంది. ముక్కుపైన వీపుపైన మాటిమాటికి పట్టిస్తూవుంటే, జలుబు రొంప రొమ్ముపడిశం తొందరగా తగ్గుతుంది. కడుపుపైన రుద్దుతే, ఉబ్బరం తగిపోతుంది. దెబ్బతగిలినవెంటనే గాయంపైన దూదిపై నాలుగుచుక్కలు అమృతధార వేసి పెడితే రక్తంకారడం వెంటనే తగ్గిపోయి, తొందరగా పక్కుగట్టి మానిపోతుంది. చిటికెడుబీయ్యంలో కాస్త కర్పూరమేసి చేతిగుడ్డలో  ఒకకొసన మూటగాకట్టి జలుబు పడిశంలో ఇన్‍హేలర్‍గా వాడుకొనవచ్చు. ఇలా చాలా ఉపయోగాలున్నాయి కర్పూరంతో-       

 

Tuesday, 14 March 2023

పటిక,Allum

 పటిక


పటిక స్ఫటికాకారంలో వుండే పారదర్శకమైన ఉప్పువంటి ఖనిజం. దీన్ని పటికారం అనికూడ అంటారు. నీళ్ళలో పటికపొడి చల్లడంవలన, పటిక నీటిలోని మురికిని గ్రహించి, నీటిఅడుగుకు చేరిపోతుంది. మంచితేటనీరు పైనవుంటుంది. కనుక త్రాగునీరు సరఫరాసమయంలో  ప్రభుత్వము ట్యాంకుల్లో పటికను వాడతారు. ఏటిగట్టుపల్లెల్లో చెలిమెలలోకూడా దీన్నివాడుకుంటారు. పటికకుబదులు, చిల్లగింజలు అరగదీసి ఆగంధం నీటిచెలిమెల్లో వాడుకుంటారు.

 పటికరాయిని నల్లవెంట్రుకల తాడుతోగాని, ఎఱ్ఱలేక నల్లగుడ్డలో కట్టి దుకాణాలగుమ్మాలలోను కొన్నియిళ్ళ తలవాకిటికి, నూతనవాహనాలకు ముందువైపు యీ పటికను కట్టివుండటం గమనిస్తుంటాము. కారణం యీ పటికవున్న చోటికి నకారాత్మకశక్తులు ప్రవేసింపలేవని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతుంటారు, వాస్తుదోషంవుండి, దాన్ని సరిదిద్దలేని పరిస్థితుల్లో యీ పటిక కట్టుకుంటే, వున్న వాస్తుదోషం, దిష్టిదోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. ప్రతిగదిలో ఉత్తరందిక్కున ఒక చిన్నగాజుగ్లాసులో పటికవేసిపెట్టినా, దేవునిగూట్లో ఒకచిన్న గాజుగిన్నెలో పటికపలుకులు వేసివుంచినా, ఇంటి ద్వారబంధానికి పటికరాయి ఎఱ్ఱగుడ్డలో మూటగట్టి ద్వారబంధానికి కట్టుకున్నా ఆఇల్లు సుఖసంతోషాలతో సమృద్ధితో కళకళలడుతూ వుంటుందని, అది లక్ష్మీనివాసమౌతుందని అనేకుల ప్రగాడ విశ్వాసం. పటికనీటితో అప్పుడప్పుడు ఇల్లుగాని, కార్యాలయంగాని, వ్యాపారస్థలంగాని శుభ్రంచేసినా శుభాలు వెల్లివిరుస్తాయంటారు. ఇందువల్ల క్రిమినివారణకూడా జరుగుతుంది. ఇలాగే దిష్టిదోషంపోవడానికి నిమ్మకాయలు మిరపకాయలు ఒకకడ్డీకిగాని, దారానికిగాని గ్రుచ్చి, దిష్టిదోషనివారణకు కట్టుకోవడం మనం అనేకచోట్ల చూస్తూవుంటాం. ఇదికొందరు మూఢనమ్మక మనుకోవచ్చుగానీ, నిమ్మకాయలు మిరపకాయలూ కలిపి కట్టడంద్వారా వాటికలయికతో రసాయనికచర్య జరిగి, అందుండి వెలువడే వాయువు ఆరోగ్య ప్రదాయినియని శాస్త్రజ్ఞులు చెప్పడం గమనార్హం. పటికపైనుండి వీచేగాలికూడా ఆరోగ్యప్రదాయినియే. అయినా పటిక మాటిమాటికి మార్చవలసిన అవసరంవుండదు. మిరప కాయలు నిమ్మకాయలు పచ్చివిగనుక ఎండిపోతాయి. అందువల్ల వారానికొకసారైనా మార్చుకోవలసివస్తుంది.

 పటిక ఆయుర్వేదం, హోమియోపతి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. స్ఫటికాదిచూర్ణం పేర ఆయుర్వేదంలో ఒకమందు దొరుకుతుంది. అది పంటిచిగుళ్ళనుండి రక్తంరావటం, నాలుకపైపుండ్లకూ బాగా పనిచేస్తుంది. టాన్సిల్స్ వాపు నొప్పి తగ్గుతాయి. 15  గ్రాముల పటిక, 600 మిల్లీలీటర్ల నీటితోకలిపిన ద్రవంలో రెండు శుభ్రమైన గుడ్డలుతడిపి ఒకదానొతో యోనిని శుభ్రపరచి రెండవది యోనిలో   కొద్దిసేపుంచాలి.  ఇలా కొద్దిరోజులు చేస్తే తెల్లబట్ట, యోనివ్రణాలు, దురదలు తగ్గిపోతాయి. పటికనీటిని రెండుచుక్కలు కళ్ళలోవేస్తే, కలకలు నయమౌతాయి. నిప్పులపై పెంకుపెట్టి దానిపై పటికవేసి పేల్చాలి, చల్లారినతర్వాత చనుబాలు కలిపి చెవిలోవేస్తే చవిలోని గుల్లలు మాని, చీముకారడం తగ్గిపోతుంది. పటికకలిపిన నీటితో మొలలను కడగడంద్వారా మొలలపిలకలు ఎండిపోయి రాలిపోతాయి. 200గ్రాముల ముల్లంగిరసం 10 గ్రాముల పటికపొడికలిపి సన్ననిమంటపై ముద్దకట్టేవరకు వండి, రేగుపండంత మాత్రలు చేసుకొని ఆరనిచ్చి, రోజూఉదయం ఒకమాత్ర చొప్పున సేవిస్తే మొలలవ్యాధిలో నొప్పి, దురద, రక్తంకారడం తగ్గిపోతాయి. ఇదే మాత్ర మూత్రపిండాలలో నొప్పినికూడా నయంచేస్తుది. ఐదుగ్రాముల పటికపొడి 100 మిల్లీలీటర్ల పాలలోవేసి వడగట్టి రోజూ మూడుపూటలా త్రాగితే నోరు, ముక్కు, మలమూత్ర ద్వారాలనుండి రక్తంస్రవించడం, రక్తవిరేచనాలు, స్త్రీలలో బహిష్టు వ్యాధులు నయమౌతాయి. పటిక హారతికర్పూరం దానిమ్మపెచ్చులు నీటితోనూరి రాత్రి రొమ్ములకు పట్టించి బట్టకట్టుకొని ఉదయం కడిగేస్తూవుంటే, స్తనాలు దృడత్వం సంతరించుకుంటాయి. పటిక కోడిగ్రుడ్డుపచ్చసొన కలిపి పట్టిస్తే పడకపుండ్లు మానిపోతాయి. పొంగించిన పటికపొడికి పదిరెట్లు బెల్లంకలిపి రోజూ ఒకటిరెండుసార్లు సేవిస్తే మొండిదగ్గులు తగ్గిపోతాయి. 200 గ్రాముల కొబ్బరినూనె, 50 గ్రాముల తేనెమైనం కలిపి వేడిచేసి గోరువెచ్చగానున్నప్పుడు 30 గ్రాముల పటికపొడి కలిపి వుంచుకొని, తారాగుండంత ఉదయం సాయంత్రం సేవిస్తే ప్రేగుల్లోపూత, వ్రణాలు, నోటిపూత బాగౌతాయి. పటికపొడి బొగ్గుపొడికలిపి పళ్ళుతోముకుంటే పంటిజబ్బులురావు. నోరుబాగా శుభ్రమౌతుంది నోటిడుర్వాసన తగ్గిపోతుంది . పటికపొడి కొద్దిగా నీళ్ళలోకలిపి స్నానాంచేస్తే ఎక్కువగా చెమటలుపట్టడం తగ్గిపోతుంది. తలస్నానంచేస్తే పేలుపడవు. గాయాలు పటికనీటితో కడిగితే క్రిమిసంహారినిగా పనిచేసి రక్తస్రావం తగ్గి, తొందరగా గాయాలుమాని పోతాయి. మంగలిషాపుల్లో షేవింగ్ తర్వాత నీళ్ళతోతడిపి పటికబిళ్ళతో రుద్దుతారు. అందువల్ల చర్మవ్యాధులు వ్యాపించవు. ముఖంపై గుల్లలు నయమౌతాయి. వాపులు, తిమ్మెర్లు, మంటలువున్న శరీరభాగాలపై నీళ్ళుజల్లి పటికతో రుద్దితే, ఉపశమనంకలుగుతుంది. పటికనీటితో ముఖంకడుక్కొనే అలవాటుచేసుకుంటే, ముఖంపై ముడుతలు తొందరగాపడవు. అవాంచిత రోమాలు మొలవవు. మొటిమలురావు. వచ్చినతర్వాత పటికనీటితో ముఖంకడుక్కుంటూవుంటే, తొందరగా పోతాయి. మచ్చలుయేర్పడవు. కరోనావంటివైరస్ వ్యాధులు ప్రబలినపుడు శానిటైజర్లకు బదులు పటికనీటితోచేతులు కడుక్కోవచ్చు. ఇదిచౌక. రెండుపలుకులు జోబులో వేసుకుంటేకూడా మంచిదే. బియ్యంలో పురుగులు పడకుండా పటిక పలుకులు కలుపుకుంటే సరిపోతుంది. వండుకునేప్పుడు యీపలుకులు తీసేసుకోవచ్చు. ఒకటిఅర బియ్యంలోవున్నా కడిగేప్పుడు నీటిలో కరిగిపోతాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి మరి పటికతో

Friday, 10 March 2023

గుమ్మడికాయ,కూష్మాండం,Ash gourd

 

        

      

బూడిద గుమ్మడికాయ



గుమ్మడికాయ రెండురకాలు. ఒకటి పసుపు ఎఱుపుకలిసినరంగులోనుండి కూరల్లో ఎక్కువగా వాడుకుంటారు. రెండవది బూడిదగుమ్మడికాయ. ఇది తెల్లటికాయ. పైన బూడిదపూసినట్లుంటుంది. సంస్కృతంలో గుమ్మడి కాయను  కూష్మాండం అంటారు. పుచ్చజాతిలోని ప్రత్యేకమైన కాయయిది. ఐదారు కిలోలవరకు బరువుంటుంది. దీన్ని కూరగాయగా గానేగాక వైద్యంలోనూ, దిష్టి నివారిణిగానూ ఉపయోగిస్తారు. నరదృష్టి తగిలితే నాపరాయైనా పగిలిపోతుందన్న సామెత వుండనేవుంది. అట్టి దృష్టిదోషనివారిణి యీ గుమ్మడికాయ. సాధారణంగా గృహప్రవేశంనాడు, కూష్మాండపూజ తెలిసిన పూజారిచేత కూష్మండపూజ చేయించి గుమ్మంముందు ఉట్టిగట్టి వ్రేలాడదీస్తారు. కార్యాలయాలకు, వ్యాపారసంస్థలకు సహితం దిష్టిదోషం పోవడానికి గుమ్మడికాయ కట్టుకుంటారు. మనపైన, మనయింటిపైన దిష్టిదోషం వుంటే, ఆదోషాన్ని గుమ్మడికాయ తనవైపుకు లాక్కొని అది చెడిపోతుంది. లేదా సూతకదోషం, అంటే, ఇంట్లో ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, మైలపడినప్పుడు, లేదా గ్రహణప్రభావం సోకినపుడు గుమ్మడికాయ చెడిపోవచ్చు. లేకుంటే గుమ్మడికాయ సంవత్సరకాలం చెడిపోకుండావుంటుంది. దీన్ని యితరకూరగాయల వలె  ప్రిజ్‍లో పెట్టనవసరంలేదు. సూతకం రోజుల్లో సూతకం పోయినతరువాత కాయ మార్చుకోవాలి. ఏకారణంతో కాయచెడిపోయినా వీలైనంత తొందరగా కాయమార్చుకోవాలి. ఒకరోజుముందే గుమ్మడికాయతెచ్చి ఇంట్లో వుంచుకొని, మరునాడు సూర్యోదయసమయంలో కాయకు పసుపుకుంకుమలు రాసి, ధూపంగానీ అగరువత్తులుగానీ వెలిగించి, పూజచేసి మళ్ళీ కాయను ఉట్టిలో వుంచుకోవాలి. చెడిపోయినకాయను నదిలో విడిచిపెట్టాలి. గుమ్మడికాయ కట్టుకోవడానికి  ఆది, గురువారాలు మంచివి. కారణం ఆరోజులకు భూతప్రేత పిశాచాలను తరిమివేసే గుణంవుంది. ఇంట్లో పూజచేసినప్పుడల్లా అగరువత్తులు గుమ్మడికాయ వద్దకూడా వెలిగించాలి. ఇలాచేస్తే నకారాత్మకశక్తులు ఇంట్లోకి రాలేవు. గుమ్మడికాయపైనుండివీచేగాలి ఇల్లంతా వ్యాపిస్తే, గుమ్మడిలోవుండే ప్రాణశక్తివల్ల ఇంట్లోనివారందరూ క్షేమంగా వుంటారు. గుమ్మడికాయ లోలోపలికి ముడుచుకపోయి, ఓసంవత్సరానికి మామూలుగా ఎండిపోతుంది. కనుక అది మంచిపరిణామమే. అందువల్ల ఏడాదికోసారి గుమ్మడికాయ మార్చుకోవడం మంచిది. గృహప్రవేశంరోజున కొందరు బలియిస్తుంటారు. అది అహింసా వాదులకు నచ్చదు. వారు గుమ్మడికాయకు రంధ్రంవేసి దానిద్వార ఎఱ్ఱటి కుంకుమ లోపలికి పోనిచ్చి, ఆగుమ్మడికాయను పగులగొడతారు. ఇది నూరు మేకపోతుల బలితో సమానమని శాస్త్రం చెబుతున్నది. బాడుగింట్లో వున్నవారు సైతం గుమ్మడి కాయ ఇంటిగుమ్మానికి కట్టుకోవచ్చును. ఎఱ్ఱగుమ్మడి చరకిదేవతా, బూడిదగుమ్మడికాయ విదారిదేవతానివాసం. ఈదేవతలు కష్టనష్టాలను పిశాచాలను తొలగించి మేలుచేకూరుస్తారు. కొందరు గుమ్మడికాయను కాలభైరవుడనికూడా దోషనివృత్తికోసం పూజిస్తారు. తెలిసినపండితులు సమయానికి దొరకని పక్షంలో "హే కూష్మాండదేవతా ఇయంగృహే శాకిన్యాదిదేవాః పరతంత్రాది సర్వదోషాన్ నివృత్తయ నివృత్తయ గృహే సర్వకార్యాదిన్ రక్ష రక్ష హోంఫట్ స్వాహా" అని మూడుసార్లు జపించి ఇంటివారే కట్టుకొనవచ్చును. దుర్గాష్టమినాడు (దశరాలో) శాకాహారులు దేవత ముందు జంతుబలికిమారుగా గుమ్మడికాయకుబెజ్జంవేసి అందులో ఎఱ్ఱటికుంకుమపోసి కూష్మాండం పగులగొట్టి దేవీఅనుగ్రహానికి పాత్రులౌతారు.

 

వంటలో రెండురకాల గుమ్మడికాయల ఉపయోగమూ ఎక్కువే. గుమ్మడికాయ మేద్జోశక్తిపెంచుతుంది. ఔషదరూపంలో మాత్రం బూడిదగుమ్మడినే ఉపయోగిస్తారు. ఈగుమ్మడి పచ్చితురుమును పెరుగులోవేసుకొని సేవిస్తే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మొలలవ్యాధిని నివారిస్తుంది. గింజలతో పోస్త్రేటు సమస్యలు నయమవుతాయి. గ్రుడ్లువాడమనేవారికోసం, గుమ్మడితురుమువాడి పాన్‍కేకులు తయారుచేస్తున్నారు. గుమ్మడివడియాలు అందరికీ తెలిసినవే. ఆగ్రాపేడా అని పిలుచుకొనే మిఠాయిలో ఎక్కువగా బూడిదగుమ్మడితురుమునే వాడతారు. పండుగరోజుల్లో బూడిదగుమ్మడిహల్వా చేసుకొంటాము. సాంబారులో గుమ్మడిముక్కలు వేసుకుంటాము. పైచెక్కుతీసి ముక్కలుముక్కలుగాతరిగి మిక్సీలోవేసి బూడిద గుమ్మడిరసం తీసుకొని అందులో కొద్దిగా సైంధలవణం మరియు నిమ్మరసం కలిపి, ఆరసం త్రాగడంవల్ల శరీరవేడి తగ్గుతుంది. ఆంటీయిన్‍ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మబద్దకం తొలగి పోతుంది. కడుపులోమంట, ఉబ్బరం, అధికదాహం, ఉదరకోశవ్యాధులెన్నో బాగౌతాయి. కడుపులో పురుగులు నశిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవు. కంటిచూపు పెరుగుతుంది. గుమ్మడికాయలో పీచుపదార్తం, పొటాషియం, ఇనుము వుండి రక్తపోటును తగ్గించి రక్తహీనతను పోగొట్టి రక్తంలో చెక్కరను నియంత్రిస్తుంది. సంతానసాఫల్యతకుకూడా తోడ్పడుతుంది. గింజలల్లో సూక్ష్మపోశకాలున్నాయి. వీటినివేయించి తినవచ్చును.  ఇవి హార్మోన్లను సమతుల్యంగా వుంచుతాయి. బూడిదగుమ్మడికాయలో 99% నీరేవుంటుంది. అందువల్ల కార్బోహైడ్రేట్లు క్రొవ్వులు అతితక్కువగావుంటాయి. డైటించేసి బరువుతగ్గాలనేవారికి గుమ్మడితోచేసిన ఆహారాలు, జూసులు చాలామంచివి. గుమ్మడితీగరసం రక్తపోటుకు, నిద్రలేమికి మంచిమందుగా పనిచేస్తుంది. చెడుక్రొవ్వును చేరనివ్వదు. విత్తనాలనూనె చర్మవ్యాధులను మాన్పుతుంది. కాయపైచెక్క, గింజలు కొబ్బరినూనెలో వేసికాచుకొని తలనూనెగా ఉపయోగించవచ్చును. ఈనూనె వెంట్రుకలు బాగాపెరగడానికి తోడ్పడుతుంది. సిద్ధవైద్యంలోనూ ఆయుర్వేదవైద్యంలోనూ బూడిదగుమ్మడితో ఔషదాలు తయారుచేస్తారు. ఆయుర్వేదంలో కూష్మాండలేహ్యం పేరుకెక్కినది. ఇదిమంచిపుష్టినిస్తుంది. క్షయ, రక్తహీనతలలో మంచిగుణకారి. కేరళవైద్యంలోకూడా కూష్మాండరసాయనం పేరుతో బలవర్ధకరఔషదం తయారుచేస్తున్నారు. గుమ్మడికాయలో విటమిన్ ఏ, బి6, సి, , మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, ఫ్లోలేట్, నియాసిన్, థయామిన్. కెరొటిన్, ల్యూటేయిన్, జియాక్యాంథిన్ వంటి పోషకాలున్నందున ఆరోగ్యదాయినిగా గుర్తింపుపొందింది.                

      

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...