Friday, 11 October 2024

ఒక తిక్కన భారత సన్నివేశం



ఒక తిక్కన భారత సన్నివేశం
ధృతరాష్ట్రునిరాయబారి సజయునితో శ్రీకృష్ణపరమాత్మ యిలా అంటున్నారు.

 

ఉ:  ఎందును నెవ్వరుం బడని యెంతయుఁ గష్టముపాటు వచ్చినం
     గొందల మంది పాండువిభుకోడలు దవ్వుల నున్న నన్ను ‘గో
            విందుఁడ ! కావు’ మంచుఁ బలవించుట యీఁగఁగరాని యప్పుఁ బో
            లెం దలపోయ వ్రేఁగయి చలింపకయున్నది యెప్పుడున్‌ మదిన్‌.    129


            తే:  ఇట్టి యేఁ దేరు గడపంగ, నెందు నుతికి
                 నెక్కు గాండీవ మేడ్తెఱ నెక్కు వెట్టి
                 రెండు దొనలను బూని కిరీటి యనికి

                 వచ్చు నేఁ డెల్లి; యెందుఁ బోవచ్చు మీకు?   130

(మహాభారతం ఉద్యోగపర్వం ద్వితీయాశ్వాసం 129 & 130 పద్యాలు )


సంజయా! ఎప్పుడూ ఎవ్వరూకూడా పడనటువంటి కష్టానెదుర్కోవలసి వచ్చింది ద్రౌపదికి. నిండుసభకు వెండ్రుకలుబట్టి యీడ్చుకరాబడింది. వస్త్రాపహరణకు గురికానున్న సమయంలో, ఆసభలోని వారినెవరినీ రక్షింపమని అర్థించలేదు. నేను వాస్తవానికక్కడ లేను. చాలాదూరంగా ద్వారకలో వున్నాను. ఎవరైనా నేనామెను ఆదుకోగల  నను కుంటారా? ఆదుకోలేననే అనుకుంటారు. అయితే ద్రౌపది గోవిందా! కాపాడుమని విల పించింది. ఆమె కాపాడబడింది. ఆమెకు నాపై యెంతవిశ్వాసమో చెప్పనలవికాని విషయమది. ఆనాటినుండి నాపరిస్థితి యెట్లున్నదంటే, దారుణంగా అప్పులలో కూరుకపోయి, తీర్చేమార్గంగానక యేవిధంగా మనిషి ఊపిరిసలపని విధంగా వ్యధకు లోనౌతాడో ఆవిధంగా నామనస్సు తీవ్రమైన వ్యధకు లోనై వున్నది. కనుక సజయా! నేనేదోఒకటి చేసి నావ్యధకు ఉపశమనం కనుగొనాలి. అందుకు మార్గం నేను అర్జునరథసారధినై ముందుకు నడిపించుచుండగా, అర్జునుడు తనరెండు భుజాలవెనుక అక్షయతూణీరములు దాల్చి, పేరెన్నికగన్న గాండీవ చాపము ధరించి త్వరలో రణరంగ ప్రవేశంచేసి శశత్రువులనుచీల్చి చెండాడుతాడు, అప్పటికీగానీ నాపరితాప మారదు. అప్పుడు మీకౌరవులెక్కడికి పారిపోతారు? ఆపద ముంచుకొస్తున్నది సుమా! అన్న శ్రీకృష్ణునిమాటలు సభాముఖంగా ధృతరాష్రునకు యదాతథంగా సంజయుడు వినిపించాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అదివేరు విషయం.  

 ఈపద్యాలు చూడటానికి సామాన్యసంగా కనబడినా, ఒకగొప్ప ఆధ్యాత్మికానుభవ రహస్య మిందులో యిమిడివుంది. మనం దైవసన్నిధికెళతాం. దర్శనంచేసుకుంటాం. ప్రార్థిస్తాం. మంచిదే, యిది సర్వసామాన్యం. కానీ మహాత్ముల ప్రవచనమేమంటే, మనంచూడ్డం సరే! కానీ దైవం మనలను చూడాలి. దైవందృష్టి మనపైబడాలి. అందులకేదో మనం చేయాలి, తత్ఫలితంగా దైవందృష్టి మనవైపునకు మరలాలి. ఆపనిచేసేసింది ద్రౌపది. ఏమాత్రం సంశయంలేని విశ్వాసం కృష్ణపరమాత్మపై వుంచింది. కేవలం మాటవరుసకుగాక "నీవేతప్ప యితఃపరంబెరుగ" అని సంపూర్ణ శరణాగతినొంది, పరమాత్మ యేదో ఒకచోటుకు పరిమిత మైయున్నాడనిగాక, పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని పూర్తిగా నమ్మి వేడుకొంది. అంతటితో ఆమెపని పూర్తిచేసేసింది. ఇక పరమాత్మకు ఆమెరక్షణ తప్పనిసరైపోయింది. ఆమెభారం పూర్తిగా పరమాత్మకు బదలాయించేసింది. అదీ భగవంతుని విషయంలో నిజమైనభక్తులు చేయవలసినపని. యిదీ యీపద్యాలద్వారా మనకందుతున్న  సందేశం.

 

భగవంతుడు తనవాడైపోవడానికి యెన్నోమార్గాలున్నాయ్. ఈవిషయంలో యెవరి ఉపాయం వారిది.చక్రధారి సినిమాలో ఒకగీతమున్నది. "నీవెవరయ్యా నేనెవరయ్యా నీవునేను ఒకటేనయ్యా " అదెలాగంటె "నేను కుండలుచేసే కుమ్మరినయ్యా నీవు బ్రహ్మను చేసిన కుమ్మరివయ్యా నువవునేను ఒకటేనయ్యా " అని ఒకకుమ్మరిభక్తుడైన గోరాకుంబర్ త్రికరణశుద్ధిగా నమ్మి భగవంతుని తనవానిగా చేసుకున్నాడు. అంతే, కృష్ణపరమాత్మ భక్తపోషణకై గోరాకుంబరునియింట మట్టిద్రొక్కి కుండలుజేయాల్సి వచ్చింది. భక్తపరాధీనత భగవంతుని లక్షణం. నమ్మండి. "నమ్మినవానికి ఫలముంది, నమ్మనివానికి యేముంది? (యేమీలేదు) నమ్మీనమ్మని మూఢజనానికి స్వర్గం (సద్గతి) దూరంగా వుంది"  ఆలోచించండి. నమ్మి ఫలితంపొందండి.

                                                                            ఓం తత్ సత్   


Thursday, 10 October 2024

కణికుడు

 

కణికుడు



మహాభారరములోని ఒక పాత్ర కణికుడు. తెలుగుభారతం ప్రకారం ఇతడు శకునికి ఆప్తుడైన మంత్రి. చాలాతెలివైనవాడు.రాజధర్మాలను కూలంకుశంగా నెరిగినవాడు. సంస్కృతభారతంలో యితడు ధృతరాష్ట్రునకు ముఖ్యసలహాదారులలో ఒకడు. ధృతరాష్ట్రునకు 90 శ్లోకాలలో రాజనీతిని తెలిపాడు. పాండవుల ఉన్నతికి క్రుంగి, తనకుమారులకు రాజ్యాధికారం దక్కదనే చింతతో యీ కణికుని పిలిపించుకొని రాజనీతిలోని రహస్యాలను తెలిసికొన్నాడు ధృతరాష్ట్రుడు. అధికారం యెలా హస్తగతం చేసుకోవాలి, తన అధీనంలోనికి వచ్చిన అధికారాన్ని యెలా నిలుపుకోవాలి, శత్రునిర్మూన కనుసరించాల్సిన వ్యూహాలెలావుండాలి, ప్రజలతో యెలా వ్యవహరించాలి, ప్రభుత్వవ్యవ స్థలనెలా రాజ రక్షణకుపయోగించులోవాలి అన్న అంశాలెన్నో యీ కణికుడు ధృతరాష్ట్రుని కెరింగించాడు. ధృతరాష్ట్రుడు ధర్మాత్ములైన తన తమ్మునికొడుకులను అడ్డుతొలగించుకొనుటకీ కణికనీతి నుపయోగించి భంగపడ్డాడు. ప్రజాశ్రేయస్సుకొఱకు, తనరక్షణకొఱకు గాక అయోగ్యులైనాసరే తనకొడుకులకే రాజ్యాధికారం దక్కాలని, తనకేమాత్రం హాని తలపెట్టని పాండవుల సంహారం కొఱకు యీ కణికనీతి నుపయోగించి, రాజలోక విపత్తుకు కారణమైనాడు. శత్రువులపై ఉపయోగించాల్సిన మంత్రాంగాన్ని, హితులపై ప్రయోగించి, వినాశానికి హేతువైనాడు. కణికనీతి పదునైన కత్తిలాంటిది. మంచీచెడులు ఆకత్తిని వాడుకునే తీరులో వుంటుందని అర్థమౌతున్నది.

సంస్కృతభారతంలో కణికుడు, తన రాజనీతిలో భాగంగా పంచతంత్రంలోవలె మాట్లాడే జంతువులతో ఒక కథను 24 శ్లోకాలలో చెప్పాడు. ఒక‍అడవిలో బాగా బలసిన జింక ఒకటి, తిరుగుతూవుంది. అది బలంగా వుండటంవల్ల యితర కౄరజంతువులకు చిక్కేదికాదు. ఒకనక్క దాన్ని తినాలని ఆశపడి ఉపాయం పన్నింది. పులి, తోడేలు, ముంగిస, ఎలుకతో స్నేహంచేసి, మనం ఆజింకను తిందాం. అది బలిసి వేగంగా పరుగిడుతూంది. కనుక మనమెవ్వరం దాన్ని ఒంటిగా పట్టలేం. నేనొక ఉపాయంచెబుతాను, ఆప్రకారంచేస్తే, దాని రుచికరమైన మాంసం మనంతినొచ్చు అన్నది నక్క. సరే చెపమన్నాయి స్నేహితులు. జింక పచ్చిక కడుపునిండామేసి నిద్రపోతుంది. అప్పుడు ఎలుకపోయి దానికాళ్ళు కొరకాలి. ఆగాయాలకి అది వేగంగా పరుగిడలేదు. ఆసమయంలో పులి దాడిచేసి చంపేయాలి. అంతే, జింకమాంసం మనకాహారమైపోతుందన్నది. ఉపాయంనచ్చి, నక్కచెప్పినట్లు చేసి జింకను చంపేశాయి జంతువులు. నక్క, యితరజంతువులతో, మీరు దుమ్ముధూళి పట్టి అలసట తోవున్నారు. వెళ్ళి నదీస్నానంచేసి రండి. హాయిగా జింకనుతిందాం, అప్పటిదాకా నేను యిక్కడే కావలిగావుంటాను, వెళ్ళి రండి అన్నది. అలాగేనంటూ అవి స్నానానికి వెళ్ళిపోయాయి.

తొలుత నదినుండి పులివచ్చింది. పులినిచూసి నక్క యేడుస్తూ, మిత్రమా! ఆ ఎలుక యింతకుముందే వచ్చి నిన్ను అనరానిమాటలన్నది. ఆపులి నాసహాయంలేకుండా జింకను చంపలేకపోయింది. తినడానికిమాత్రం ఆత్రపడుతున్నది, అంటూ నిన్ను ఎగతాళిచేసింది, అన్నది. పులి, నిజమే నాకు బుద్ధివచ్చింది. నేను సొంతంగా వేటాడిన జంతువులనే తింటాను, అంటూ అక్కడనుండి వెళ్ళిపోయింది. తర్వాత ఎలుకవ చ్చింది. ఎలుకతో నక్క, ఎలుకబావా! యింతకుముందే, ముంగిసవచ్చి, జింకనుచూసి, యిది పులికరవడంవల్ల విషపూరితమైపోయింది, కనుక నేనుతినను. ఆకలిగావుంది ఎలుకను తినేస్తా నని నీకోసం వెతుకుతున్నట్లుంది అన్నది. ఎలుక భయపడి పరుగుపరుగున వెళ్ళి యెక్కడో కలుగులోనికివెళ్ళి దాక్కుంది. ఆతర్వాత వచ్చింది తోడేలు. తోడేలునుచూడగానే నక్క, అన్నా! నీమీద పులి యెందుకో చాలాకోపంగావుంది. వెళ్ళి నాభార్యను పిలుచుకొనివస్తా, యిద్దరం తోడేలు పనిపడతాం అంటూ వెళ్ళింది. జాగ్రత్త! అన్నది నక్క. అంతే, మాటముగియకముందే అక్కడనుండి పారిపోయింది తోడేలు. ఆఖరుగా ముంగిస వచ్చింది, నక్క ధైర్యంగా యెదురునిలిచి, ముంగిసా! రా! ఇప్పుడే పులి తోడేలు ఎలుకతో పోరాడి ఓడించా, నాదెబ్బకవి పారిపోయాయి. ఇక నీవంతు రా! అంటూ గద్ధించింది. అమ్మో! పులీ తోడేలే యీనక్కముందు ఆగలేకపోయాయంటే యిక నేనెంత అనుకుంటూ ముంగిసా పారిపోయింది. నక్క హాయిగా తానొక్కటే, జింకను సొతంజేసుకొంది.

ఇలాంటి కూటనీతితో యెంతటి వారినైనా అడ్డుతొలగించుకొని రాజరికం నిరాటంకంగా నిలుపుకొని, హయిగా అనిభవించవచ్చునని సోదాహరణంగా కణికుడు ధృతరాష్ట్రమహారాజుకు వివరించాడు.

 తెలుగుభారతంలోని ఆదిపర్వం షష్ఠమాశ్వాసంలో యీ కణికనీతి ధృతరాష్త్రునికి గాక దుర్యోధనునికి చెప్పినట్లున్నది. రణవిద్యలలో ఆరితేరినారు పాండవులు. వారికా విద్యాప్రదర్శన శ్రమతో గూడినది కాదు. వారు నిరంతర ఉత్సాహం కనబరుస్తున్నారు. దానికితోడిపుడు ధర్మరాజు యువరాజయ్యాడు. మాతండ్రిగారతనిని యువరాజుగా చేయకతప్పలేదు. ఈపరిస్థితులలో నేనేమి చేయాలి. రాజనీతి యేమని చెబుతున్నది, నాకు వివరంగా చెప్పమన్నాడు దుర్యోధనుడు. ఈసందర్భంలో నన్నయ కణికనీతి అన్నమకుటంతో ఓ 19 పద్యాలు ఒక వచనంతో ముగించాడు. ఈనన్నయ కణికనీతిని వివరంగా తెలుసుకుందాం.

కణికనీతి

(ఆంధ్ర మహాభారతం - ఆదిపర్వం - షష్ఠాశ్వాసము)

సీ : ‘ఆయుధవిద్యలయందు జితశ్రము
                   లనియును రణశూరు లనియు సంత
      తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును
                  భయమందుచుండుదుఁ బాండవులకు;
    దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుఁ
                   జేసె రా; జే నేమి సేయువాఁడ?
    నృపనీతి యెయ్యది? నిరతంబుగా మీర
                   నా కెఱిఁగింపుఁడు నయముతోడ’


ఆ:  ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు, సౌబలు
                     నాప్తమంత్రి, నీతులందుఁ గరము
                     కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు
                    నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె. 101

ఈపద్య తాత్పర్యం పైపేరాలో వివరంగా యివ్వబడింది.

తరువోజ: ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచిత దండవిధానంబుఁ దప్పక ధర్మ
            చరితులఁగా మహీజనుల రక్షించి సద్వృత్తుఁ డగునది; సర్వవర్ణములు
            వరుసన తమతమ వర్ణధర్మముల వర్తిల్లుదురు గడవక దండభీతి
            నరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి యగు మహీవల్లభు ననుశాసనమున.      102

 రాజుచేతిలోని రాజదండం అత్యంతముఖ్యమైనది. దండనీతి విస్మరింప రానిది. తద్వారానే రాజు తన ప్రజలను ధర్మమార్గంలో నడిపింప గలుగు తాడు. అందుకు రాజుకూడా ధర్మాత్ముడై వుండాలి. దండించేటప్పుదు స్వపరభేదము లస్సలుండరాదు. అలావుంటే, రాజ్యంలోని అన్నివర్ణముల వారు అన్నిజాతులవారు రాజాజ్ఞలను ధిక్కరించక, తమతమ జాతి ధర్మాలను సక్రమంగా పాటిస్తూ ప్రభువునెడ భయభక్తులతో మెలగుతారు. రాజ్యం శాంతిసౌభాగ్యాలకు నెలవౌతుంది.

క:  గుఱుకొని కార్యాకార్యము
     లెఱుఁగక దుశ్చరితుఁ డై యహితుఁ డగు నేనిన్‌
     మఱవక గురు నైనను జను
     లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుద్ధిన్‌. 103

 రాజు వివేకంతో మెలగాలి అందరికితెలిసేటట్లు మంచిచెడులను విచక్షణతో గ్రహించి చెడుమార్గంలో నడిచేవారిని వదలకుండా దండించితీరాలి.

 

క:  ధీరమతియుతులతోడ
     విచారము సేయునది మును, విచారితపూర్వ
     ప్రారబ్ధమైన కార్యము
     పారముఁ బొందును విఘాతపదదూరం బై. 104

 చేయదలచుకొన్న పనిని ముందుగా బుద్ధిమంతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అటువంటప్పుడాపని నిర్విఘ్నంగ నెరవేరుతుంది.

క:  జనపాలుఁడు మృదుకర్మం
    బున నైనను గ్రూరకర్మమున నైనను నే
   ర్పున నుద్ధరించునది త
   న్ననపాయతఁ బొంది చేయునది ధర్మంబుల్‌. 105

రాజు ధరమార్గపాలకుడుగా  వుండాల్సిందే, గాని ముందు తనరక్షణకు ప్రాధాన్యమివ్వాలి. అది తప్పనిసరి. ఆకార్యనిర్వహణ మృదువగు పద్ధతిలోనా లేక కఠినమైన దండనద్వారానా అన్నది కాదు ముఖ్యం  పద్ధతేదైనా, ప్రభువుకు తన రక్షణ ముఖ్యం. తన్నుమాలిన ధర్మం పనికిరాదు

క:  అమలినమతి నాత్మచ్ఛి
    ద్రము లన్యు లెఱుఁగకుండఁ దా నన్య చ్ఛి
    ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే
            శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై.    106

నిర్మలమైన బుద్ధితో రాజు మెలగాలి. తనలోగల లోటుపాట్లను బయటికి కనబడనీయరాదు. కానీ యితరుల లోపాలను మాత్రం పసిగట్టగలగాలి. అలా చాకచక్యంగా మెలగుతూ మిత్రబలంతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగ వ్యవహరించాలి.

క:  బలహీను లైనచో శ
    త్రులఁ జెఱచుట నీతి, యధిక దోర్వీర్య సుహృ
    ద్బలు లైన వారిఁ జెఱుపఁగ
    నలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీఁదన్‌. 107

శత్రువులు భుజబల సంపన్నులు,గుండెధైర్యం గలవారైతే వారినియేమీ చేయలేము. వారు బలహీనులైతే చంపడం సులభం. అంటే శత్రువులు బహీనులుగా వుండగానే దెబ్బతీయాలి. వారిని తక్కువ అంచనా వేసి బలపడనీయ్యరాదు.

క:  అలయక పరాత్మ కృత్యం
    బులఁ బతి యెఱుఁగునది దూతముఖమునఁ, బరభూ
    ముల వృత్తాంతము లెఱుఁగఁగఁ
            బలుమఱుఁ బుచ్చునది వివిధ పాషండ తతిన్‌. 108

శతువులకార్యకలాపాలు, తనపాలనపై ప్రజల అభిప్రాయాలు రాజు నిర్లక్ష్యముచేయక దూతలద్వారా యెప్పటికప్పుడు తెలుసుకుంటూ వుండాలి. శత్రువుల విషయాలు తెలుసుకోవడానికి కఠినులు నిర్మొగమాటస్తులైన గూడచారులను నియమించుకోవాలి.

క:  నానావిహార శైలో
    ద్యాన సభా తీర్థ దేవతాగృహ మృగయా
    స్థానముల కరుగునెడ మును
    మానుగ శోధింపవలయు మానవపతికిన్‌. 109

జనులు గుమిగూడే విహారస్థలాలైన పర్వతాలు, ఉద్యానవనాలు, సభలు సమావేశాలు జరిగే చోట్లు, తీత్థస్థలాలు, గుడులు వేటాడే ప్రదేశాలు, రాజుచూడాలనుకుంటే, తాను బయలుదేరకముందే ఆస్థలాలు సురక్షితమో కాదో ముందే గూఢచారులద్వారా తెలుసుకొని జాగ్రత్తవహించాలి.

తే:  వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ
     దగరు నాకు నా వలవదు; తత్త్వబుద్ధి
     నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు
     నాత్మరక్షాపరుం డగు నది విభుండు. 110

 

వీరిని నమ్మవచ్చు, వీరిని నమ్మరాదనే నిర్ణయానికి రాకుండా, అందరినీ నమ్మరానివారిగానే గమనిస్తూ, తన రక్షణ విషయంలో రాజు సదా జాగరూకుడై వుండాలి.

ఉ:  ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య
     త్నమ్మునఁ జేయఁగావలయుఁ; దత్పరిరక్షణశక్తి నెల్ల కా
     ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము; మంత్రవిభేద మైనఁ గా
     ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికైనను నేరఁబోలునే.      111

తననుతాను రక్షించుకొనుటలో చూపే శ్రద్ధనే, తనఆలోచనా విధానాన్ని రహస్యంగా వుంచుకొనుటలోకూడా చూపాలి. రహస్యాలోచన బయటికిపొక్కకుండా జాగ్రత్తవహించేరాజు కృతకృత్యుడౌతాడు. లేకుంటే బృహస్పతివంటి మేఋధావియైనా కార్యసాఫల్యత పొందలేడు.

క:  పలుమఱు శపథంబులు నం
    జలియును నభివాదనమును సామప్రియభా
    షలు మిథ్యావినయంబులుఁ
    గలయవి దుష్టస్వభావకాపురుషులకున్‌. 112

అవసరమున్నా లేకున్నా మాటిమాటికి శపథాలుచెయ్యడం, అధికంగా వంగివంగి దండాలుపెట్టడం, అతివినయం కనబరచి, యింపైన మోసపూరిత మాటలతో యెదుటివారిని బురిడీ కొట్టించడం, యివన్నీ దూర్తుని స్వభావాలు. వీరియెడ అప్రమత్తత అవసరం.

క:  తన కిమ్మగు నంతకు దు
    ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
    దన కిమ్మగుడును గఱచును
    ఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రములన్‌.   113

దుర్మార్గుడు తనపని సానుకూలమయ్యేదాకా ప్రియమైనవాడుగా నటిస్తాడు. సమయం అనుకూలించగానే భయంకర విషసర్పమై కాటువేఋస్తాడు. కనుక తస్మాత్ జాగ్రత్త. 

క:  కడునలుకయుఁ గూర్మియు నే
    ర్పడ నెఱిఁగించునది వాని ఫలకాలమునన్‌
    బిడుగును గాడ్పును జనులకుఁ
    బడుటయు వీచుటయు నెఱుకపడియెడుభంగిన్‌. 114

అధికమైన కోపంగానీ ప్రేమగానీ తగినసమయంలోనే బహిర్గతం చేయాలి. అది పిడుగుపడటం, సుడిగాలిరేగటంవలె ఊహ కందనివిధంగా చటుక్కున రావాలి. అంటే రాజుమనస్సులోని అనుకూల ప్రతికూల భావాలు ముందుగా వ్యక్తముకారాదు.

క:  తఱియగునంతకు రిపుఁ దన
    యఱకటఁ బెట్టికొనియుండునది; దఱియగుడుం
    జెఱచునది ఱాతిమీదను
    వఱలఁగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్‌. 115

సమయం అనుకూలించేవరకు శత్రువునకు తెలియనిరీతిలో వారిని సమాదరించాలి. ఆతర్వాత అంతవరకు భుజానమోసిన కుండను రాతిపై విసరికొట్టినట్లు శత్రువును నాశనంచేయాలి.

క:  తన కపకారము మునుఁ జే
    సిన జనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
    జన; దొకయించుక ముల్లయి
    నను బాదతలమున నున్న నడవఁగ నగునే. 116

తనకపకారము చేసినవాడు అల్పుడు, వాడేమిచేయగలడని అనుకోకూడదు. ముల్లు చిన్నదైనా సరే కాలిలోదిగబడివుంటే, నడవలేము. అది అపకారే! శత్రువు అల్పుడని వదలక అంతం  చేసితీరాలి.

క:  బాలుఁ డని తలఁచి రిపుతో
    నేలిదమునఁ గలిసియునికి యిది కార్యమె? యు
    త్కీలానలకణ మించుక
   చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్‌. 117

పిల్లకుంక వాడెంత, వాడేమిచేయగలడని యేమరరాదు. శత్రువును నాశనంచేసితీరాలి. అగ్నికణం చిన్నదేయైనా నిర్లక్ష్యంచేస్తే దావానలమై అడవిమొతన్ని దహించివేస్తుంది.

క:  మొనసి యపకారిఁ గడ నిడి
    కొనియుండెడు కుమతి దీర్ఘకుజశాఖాగ్రం
    బున నుండి నిద్రవోయెడు
    మనుజునకు సమాన మగుఁ బ్రమత్తత్వమునన్‌.   118

తనకపకారము చేసినవాడిని నిర్భయంగా చెంతనుంచుకోవడం ప్రమాదం.చెట్టుకొమ్మచివర యెత్తైనచోట బుద్ధిహీనుడు శయనించినదానితో అది సమానం.

చ: తడయక సామభేదముల దానములన్‌ దయతోడ నమ్మఁగా
    నొడివియు సత్యమిచ్చియుఁ జనున్‌ జననాథ! కృతాపకారులం
    గడఁగి వధింపఁగాఁ గనుట కావ్యుమతం బిది; గాన యెట్టులుం
    గడుకొని శత్రులం జెఱుపఁగాంచుట కార్యము రాజనీతిమైన్‌.   119

సామదానభేదములను ఉపాయములచేతగాని లేదా దయచూపి నమ్మకంకలిగించి గానీ, తనతీరు సత్యమని నమ్మింపజేయాలి. తదనంతరం సమయంచూసి దెబ్బతీయాలి. చంపేయాలి. ఇది శుక్రాచార్యుల రాజనీతి. ప్రతిరాజు పాటించదగ్గది.

 

వ: ‘కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది’ యనినఁ గణికుమతంబు విని దుర్యోధనుండు చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కేకాంతంబున ని ట్లనియె."

అందుచేత రాజున కపకారముచేసినవారు శత్రువేకానక్కరలేదు, బంధువులలోకూడా అపకారులుండవచ్చును. వారినికూడ వదలిపెట్టకూడదు. యెవరినైనాసరే ఆత్మరక్షణకై వధించితీరాలి. అంటూ కణికుడు చెప్పిన రాజనీతిని శ్రద్ధగా విన్నాడుదుర్యోధనుడు . ఒకదినం చింతాక్రాంతుడైన దుర్యోధనుడు తండ్రిధృతరాష్ట్రుని యేకంతంగాకలుసుకొని తను శత్రువులుగా భావిస్తున్న పాండవులను తనదారికడ్డుతొలగించుకొను ఉపాయముల గురించి చర్చించాడు.

2013 వ సంవస్తరంలొ ఏక్తాకపూర్ బాలాజీ ఫిలిమ్స్  పతాకంక్రింద హిందీలో "కహానీ హమారా భారత్‌కీ" అనేపేరుతో మహాభారత్ ధారావాహికం నిర్మించారు. అది 75 ఎపిసోడ్స్ తరువాత ఆగిపోయింది. ఆకథలో కణికుడు అడవిలో ఒంటరిగా ఒకకుటీరంలో వుంటున్న బ్రహ్మణమేధావి. అతనివద్దకు రహస్యంగా శకునితోకలసి ధృతరాష్ట్రుడు వెళ్ళికలుస్తాడు. అతని కూటనీతిబోధతోనే ధర్మజుని యువరాజుగా ప్రకటించాడు ధృతరాష్ట్రుడు. అందువల్ల పాండవులు సంతోషంతో సబరారు చేసుకుంటూవుంటారు. పెద్దలెవరికీ కౌరవులపై అనుమానంరాదు. కనుక నిఘావుంచరనుకుంటాడు ధృతరాష్ట్రుడు. కుట్రలుపన్నడానికి బాగాసమయందొరికిందనుకొని ఒకకుట్రపన్నారు. పాడవులను కుంతితోసహా వారణావతం పంపి, అక్కడ లక్కయింటిలో దహించేసే వ్యూహంసిద్ధంచేసుకున్నారు, కానీ అలా జరుగలేదు. విదురమహాశయుని అప్రమత్తతతో పాడవులు గండంగడచి బ్రతికిపోయారు. అది తరువాతి కథ. నన్నయవలెగాక యిక్కడ కణికుని పూర్తి కూటనీతజ్ఞునిగా చూపించారు.

కనుక పరిశీలనగాచూస్తే కణికనీతి ఆనాటికేగాదు, ఈనాటికిగూడా రాజకీయధురంధరులచే, కణికునికథ తెలిసియో తెలియకనో, యేమైననేమి అమలౌతున్నట్లే గనపడుచున్నది.

 

 

Tuesday, 3 September 2024

శఠకోపం

 

శఠకోపం

                            

 శఠకోపమును శఠగోప్యము శఠారి అనికూడా పిలుస్తారు. ముఖ్యంగా వైష్ణవాలయాలలో తీర్థమిచ్చినతర్వాత శఠకోపం తలకు తగిలిస్తారు పూజారి. అందుకే తీర్థసేవనం తర్వాత చేతిని తలకు రుద్దుకోగూడదంటారు. ఎందుకంటే, యెంగిలియైన తీర్థం  పవిత్రమైన శఠకోపానికి తగలరాదు. శఠకోపం పైభాగాన భగవంతుని పాదుకలుంటాయి. కనుక వాటిని మైలపరచడం పాపం. అందుకే అలాచెబుతారు.


  ఈశఠకోపం వెనుక ఒకమహనీయుని జీవితచరిత్ర వున్నది. అదేమిటో తెలుసుకుందాం. శివమహాభక్తులను నయనార్లంటారు. అలాగే విష్ణుమహాభక్తులను ఆళ్వార్లంటారు. వారు పన్న్రెండుగురున్నారు. వారిలో నమ్మాళ్వారొకరు. నమ్మాళ్వారంటే మనఆళ్వారు. మనకు సన్నిహితుడైన విష్ణుభక్తుడని అర్థం. ఆయన్ను హరిసేనానాయకుడైన విష్వక్సేనుని అవతారమని నమ్ముతారు. ఆయన మొదటిపేరు "మారన్". శఠగోపన్ అనికూడా ఆయన్ను పిలిచేవారు. ఈయన పేరుమీదనే శఠకోపం వచ్చింది. నమ్మాళ్వార్ తలపైదాల్చిన విష్ణుపాదుకలే శఠకోపమని వైష్ణవులు భావిస్తారు. మరికొందరు ఆళ్వార్లందరూ శ్రీవారి పాదుకల వంటివారేనని విశ్వసిస్తారు. నమ్మాళ్వార్ నాలుగు రచనలు, పాశురాలన్న పేరున గ్రంథస్థం చేశారు. వాటిని తమిళవేదాలుగా శ్రీవైష్ణవులు గుర్తిస్తారు. నల్లాని వేంకట రాఘవాచార్యులు "శఠకోప గీతామృతము" అన్న పేరుతో ద్రవిడ (తమిళ) వేదాలను పద్యగ్రంథంగా తెనిగించారు.

 శఠకోపమన్న పదానికి ఒకమంచి అర్థమున్నది. "శఠానాం బుద్ధిదూషణం" అన్న సంస్కృతవాక్యాన్ని బట్టిచూస్తే, శఠులు అంటే వంచకులు. వంచకుల మాటలను తనవాక్కులతో ఖండించువారు శఠకోపులని అర్థం. వీరే స్వామిపాదుకలకు ప్రతీకలైన ఆళ్వార్లు. ఆస్వామి పాదుకలే శఠకోపంపై ముద్రించి యున్నవి. శఠకోపం తలకు పూజారి తగిలించగానే భక్తుడు దేవా! అరిషడ్వర్గాలకు నన్ను దూరంగా వుంచుమని ప్రార్థించాలి. అప్పుడు ఒక తెలియని ఆత్మానుభూతి గలిగి, చెడుగుణాలు తొలగి స్వచ్ఛమైన జీవితం గడపగలిగే శక్తి లభిస్తుంది. ఇది ఉత్తమమైన ప్రార్థన. సామాన్యంగా జనులు వారి కోరికలు భగవంతునికి విన్నవించి, తీర్చమని వేడుకుంటారు. అట్టివారి కోరికలూ నెరవేరుతాయని నమ్ముతారు. "యద్భావం తద్భవతి" అన్న సూక్తి వుండనేవున్నదిగదా!

 శఠకోపం ముఖ్యంగా వెండితో చేయిస్తారు. రాగి, కంచుతోకూడా చేసినవి, కొన్ని దేవాలయలయాలో కనిపిస్తాయి. శఠకోపలోహం తలపై తగలగానే, మనిషిలోని విద్యుత్తులో, ఒకవిధమైన విద్యుదావేశం జరిగి అవసరంలేని అధికవిద్యుత్తు బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా మనిషిలోని ఆందోళన, ఆవేశం తగ్గి, శాంతినెలకుంటుం దని శాస్త్రంతెలిసిన పెద్దలు తెలియజేస్తున్నారు.

 నెత్తిన శఠకోపం పెట్టినాడంటే నమ్మించి మోసగించాడని, వ్యంగార్థప్రయోగం లోకంలోవుంది. ఇది వ్యంగమే. నిజార్థంలో శఠకోపం దేవాలయంలో పెట్టించుకోవడం యెంతో శుభకరం. 

 ❤❤❤ 

Friday, 26 July 2024

ఎఱ్ఱన రామాయణం

 

ఎఱ్ఱన రామాయణం




 కర్త: పోలిచర్ల సుబ్బారాయుడు  

9966504951


ముందుమాట

 ఎఱ్ఱనకవీంద్రుడు రామాయణాన్ని వ్రాసినాడను ప్రతీతి యున్నది. గానీ ప్రత్యేకముగా వ్రాసిన ఆ రామాయణ మిప్పుడు అలభ్యము. కానీ మహాభారత అరణ్యపర్వంలో మాత్రము, ఎఱ్ఱనవ్రాసిన రామాయణమున్నది. ద్రౌపది సైంధవునిచేత అపహరింపబడింది. వానినోడించి ద్రౌపదిని రక్షించుకోగలిగారు పాండవులు. ఆసమయంలో ధర్మరాజును కలుసుకున్న మార్కండేయమహర్షి, ధర్మరాజును ఓదారుస్తూ, చెప్పిన రామకథ యిది. ఒకవిధంగా దీనినిమార్కండేయరామాయణమని కూడా అనుకోవచ్చు. ఇతరర రామాయణాలలో వలెనే యీరామాయణం లో కూడా అనేక అవాల్మీకములున్నవి. ఈరామాయణంలో దశరథుని పుత్రకామేష్టి యాగం, విశ్వమిత్ర యాగసంరక్షణము లేవు, తాటక, సుబాహు సంహారము, సీతాకల్యాణము కూడాలేవు. ఇందులో మంథర బ్రహ్మలోకంనుండి అవతరించిన కారణనన్మురాలు. రాముడు అంగుళీయకం హనుమకియ్యలేదు అవింధ్యుడనే రామభక్త వృద్ధరాక్షసుడు త్రిజటద్వారా పంపిన శ్రీరామ క్షేమసమాచారంవల్ల హనుమంతుని, సీత సులభంగా నమ్మేస్తుంది. కైకేయి అలిగికాదు, ప్రేమతో వరాలు సాధింకుంటుంది. లక్ష్మణరేఖలులేవు, శబరిలేదు. హనుమ సంజీవినీ పర్వతం చెచ్చే అవసరం పడలేదు. కుంభకర్ణుని రాముడుకాదు లక్ష్మణుడు సంహరిస్తాడు. పంచ భూతాలసాక్ష్యంతో, బ్రహ్మదేవుని అనునయంతో సీత అగ్నిప్రవేశం చేసే అవసరంలేకుండాపోయింది. ఇటువంటివెన్నో. మనం క్రితంచదివిన రామయణాలకు భిన్నంగా యీ రామాయణం నడిచింది. శ్రీరాముని కష్టాలను వివరించి, ధర్మరాజును ఓదార్చాలనుకున్నాడు కాబట్టి మార్కండేయమహర్షి, శ్రీరాముని వైభవ చరిత్రను చెప్పలేదనుకోవచ్చును. అయితే యిందులో ఎఱ్ఱాప్రగ్గడ కవితాపటిమను దర్శించవచ్చును. శ్రీరామవర్ణన నాస్వాదించవచ్చు. అరణ్యవాసముననున్న శ్రీరాముని భరతుడు దర్శించినప్పుడు, ఎఱ్ఱనకవీంద్రుడు శ్రీరాముని భస్మంగరాగుని జేసి చూపినాడు. ఇది ఎఱ్ఱన మతాభిమానమో? లేక శ్రీరాముని శివలింగారాధనా తత్పరతయో? అదీకాకపోతే తిక్కన హరిహరనాథతత్త్వమో? ఏమైననేమి విబూదిరేఖల శ్రీరామమూర్తిని ఊహిచుకొనుటకు రమ్యముగనున్నది. పంపసరోవర హృద్యవర్ణనము, సరోవర అతిథిసత్కారతత్పరత ప్రహ్లాదముగనున్నది. యుద్ధఘట్టములు పట్టుసడలని గంభీరతను సంతరించుకున్నవి. గమనింతముగాక!  పాఠకులనేక
రామాయణములను చదివియేయుందురు, ఎఱ్ఱనకవీశ్వర రామాయణంకూడా చదివేద్దాం. మహాభారతం అరణ్యపర్వంలోని ఆరు,యేడు ఆశ్వాసాలలో వ్రాయబడిందీ రామకథ.

  సౌలభ్యంకోసం ఎఱ్ఱన రామాయణం ఉన్నదున్నట్లు, ముందుగా పాఠకుల ముందుంచి, తర్వాత వచనంలో పద్యాలభావాన్ని సులభశైలిలో, వరుసగా రామాయణం చదువుతున్న భావన గలిగేట్లు వ్రాయడం జరిగింది.

-నమస్తే!

                                                          మీ

                                                                పోలిచర్ల సుబ్బారాయుడు.

                                                                      996650495. 


విషయసూచిక

ధర్మజునకు మార్కండేయుఁడు రామాయణకథ సెప్పుట

బ్రహ్మ రావణ కుంభకర్ణ విభీషణులకు వరంబు లిచ్చుట

దశరథుఁడు రామవిశ్లేషముచే సురలోకగతుం డగుట

మారీచుండు మాయామృగంబై చనుదెంచుట

రావణుఁడు సీత నెత్తికొని లంకకుఁ బోవుట

శ్రీరాముఁడు కబంధుఁ డను రాక్షసుం జంపుట

వాలిసుగ్రీవుల యుద్ధము

త్రిజట తన స్వప్నవృత్తాంతము సీతతోఁ జెప్పుట

శ్రీరాముఁడు లక్ష్మణుని సుగ్రీవునొద్దకు బంపుట 

హనుమంతుఁడు రామునితో సీతం జూచిన వృత్తాంతంబు సెప్పుట

వానరవీరులు నానాదేశంబులనుండి సుగ్రీవునొద్దకు వచ్చుట

రాముఁడు దర్భశయనుండై సముద్రుం బ్రార్థించుట

అంగదు రాయబారము

ప్రహస్త ధూమ్రాక్షుల యుద్ధము

కుంభకర్ణుండు యుద్ధము సేయుట

ఇంద్రజిత్తు లక్ష్మణునితోడ యుద్ధము సేయుట

ఇంద్రజిత్తు లక్ష్మణునిచేతఁ జచ్చుట

శ్రీరాముఁడు రావణాసురుని సంహరించుట

     


 

 

ఎఱ్ఱన రామాయణం

(మహాభారతం అరణ్య 6-267 నుండి 7-168)


ధర్మజునకు మార్కండేయుఁడు రామాయణకథ సెప్పుట

వ.

అనిన విని ధర్మజుండు మునీంద్రా! రాముఁ డెవ్వనివంశంబున వాఁడు? రావణుం డెవ్వని తనయుం? డేమి నిమిత్తంబున సీతాపహరణంబు సేసె? రామరావణులకు సంగ్రామం బెట్లు వర్తిల్లెం? జెప్పవే!యని రామాయణ కథాశ్రవణకుతూహలియై యడిగిన నమ్మహాముని యి ట్లనియె.

క.

విను మిక్ష్వాకుకులంబున | జనియించె నజుండు నాఁ బ్రశస్తచరితుఁ డా
తని కొడుకు దశరథుఁడు; ముద | మున నాతఁడు పెండ్లియయ్యె మువ్వురు సతులన్‌.

వ.

అందుఁ గౌసల్య కురాముండును, గైకేయికి భరతుండును, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులును జనియించి; రందు రామునకు విదేహరాజనందన యైన సీత ప్రియాంగన యయ్యె; నిఁక రావణుజన్మంబు సెప్పెద వినుము.

ఆ.

అఖిలలోకకర్త యగు విరించికిఁ బుల | స్త్యుండు నాఁగ మానసుఁడు దనూజుఁ
డుద్భవించె; నతని కుదయించె వైశ్రవ | ణాభిధానుఁడైన యాత్మజుండు.

వ.

ఆ వైశ్రవణుండు దన తండ్రి యగు పులస్త్యుని విడిచి, తాత యగు చతుర్ముఖునకుం దపంబు సేసి నలకూబరుం డను కొడుకును లోకపాలకత్వంబును ధనేశ్వరత్వంబును లంక యను పురంబును శంకరుతోడి సఖ్యంబును వరంబులుగాఁ బడసి, మహావిభూతితో వర్తిల్లుచున్నంగని, యలిగి, పులస్త్యుండు నిజశరీరంబునం దర్ధంబున విశ్రవసుం డను వాని సృజియించి, యా వైశ్రవణున కహితంబు సేయు మని పనిచిన నెఱింగి, కిన్నరేశ్వరుండు విశ్రవసుపాలి కరుదెంచి మహాత్మా! యేను నీకుం బుత్త్రుండ నయ్యెద; నాకుం గరుణింపుమని యతనిం బ్రసన్నునిం జేసి నృత్తగీతవిద్యావిశారద లయిన రాక్షసస్త్రీలం బుష్పోత్కటయు, మాలినియు, బకయు నను వారి మువ్వుర నవ్వి ప్రవరునకుఁ బరిచారికలంగా నిచ్చిన.

క.

పురుడున నయ్యువతులు నొం | డొరులం గడవంగ విలసదుపచారసమా
చరణప్రవీణభంగులఁ | బరితోషితుఁ జేసి రా తపస్వివరేణ్యున్‌.

వ.

ఇట్లు ప్రీతుండై యతండు వారలకుఁ బుత్త్రదానంబు సేసిన నందుఁ బుష్పోత్కటకు రావణ కుంభకర్ణులును, మాలినికి విభీషణుండును, బకకు ఖరుండును శూర్పణఖ యను కన్యకయు మిథునంబై ప్రభవించి; రక్కుమారులకు నలువురకుఁ దజ్జనకుండు జాతకర్మాదిసంస్కారంబు లొనరించి సగౌరవంబుగాఁ బెనిచి యుపనీతులం జేసె; నందు.

ఉ.

ఆతతతేజుఁ డున్నతభుజాగ్రుఁడు లోకభయంకరుండు వి
ఖ్యాతపరాక్రముండు దశకంఠుఁడు సంతతరోషమానసుం;
డాతనియట్ల దుర్మదమయాత్ముఁడు క్రూరుఁడు గుంభకర్ణుఁడున్‌;
భీతివిదూరుఁ డార్యుఁడు విభీషణుఁ డుత్తమచిత్తుఁ డారయన్‌.

క.

ఖరుఁడు ఖరతేజుఁ డవనీ | సుర పరిభవకారి మాంసశోణితభుజుఁ డు
ద్ధురచిత్తుఁడు శూర్పణఖయు | దురితచరిత ధర్మకర్మదూషిత యెపుడున్‌.

వ.

ఆ రాక్షసకుమారులు దండ్రివలన నఖిలవేదవేదాంగ ధనుర్వేదపారగులై గంధమాదన గిరియందు సుఖం బుండి యొక్కనాఁ డతనికి మ్రొక్కవచ్చువాని నధికవిభవసమన్వితు వైశ్రవణుం జూచి తత్ప్రభావంబు తపోలబ్ధం బగుట విని జాతమత్సరు లయి తారును బితామహు నుద్దేశించి తపంబు సేయం దొడంగిరి; తత్ప్రకారంబు వినుము.

తే.

మండు వేసవిఁబంచాగ్ని మధ్యమున, | నాగమంబున బయల, నత్యంత తుహిన
సమయమున నీరియందు, నిశ్చలత నిలిచి | దశముఖుఁడు వాయుభక్షుఁ డై తప మొనర్చె.

మ.

నియతాహారుఁడు నిర్జితేంద్రియుఁడు నై నిష్కంపవృత్తిన్‌ మహీ
శయనుండై వ్రతముల్‌ చరించె నధికేచ్ఛం గుంభకర్ణుండు ధై
ర్యయుతుండై; ఘనుఁ డవ్విభీషణుఁడు పర్ణాహారవృత్తిన్‌ జపా
ధ్యయనాసక్తిఁ దపంబు సేసె మది నత్యంతంబు సంశుద్ధితోన్‌.

వ.

ఖరుండును శూర్పణఖయు వారికిం దగిన పరిచర్యలు సేయుచుండి; రంత సహస్రవర్షంబులు నిండినం బంక్తివదనుండు దనమస్తకం బొక్కటి ఖండించి మండెడు నగ్నియందు వేల్చి మఱియు వేయేండ్ల కొక్కటిగాఁ దలలు తొమ్మిదియుం దఱిగి వేల్చిధైర్యంబు దఱుఁగక పదియగు తలయును ద్రెంప సమకట్టినఁ బితామహుండు ప్రత్యక్షంబై వారించి, వాని శిరంబు లెప్పటి యట్ల కలుగ నొసంగి యమరత్వంబు దక్కనొండు నీ కభిమతం బగునది యెయ్యది యైనను నడుగుమనుటయు నన్నిశాచరుండు.

శా.

దేవా! యేను సమస్త దేవ పితృదైతే యాహి గంధర్వ ర
క్షో విద్యాధర యక్షజాతులకు నక్షోభ్యుండఁగాఁ బ్రీతితో
నీ విశ్వంబునఁ గామరూపగతి నాత్మేచ్ఛావిహారుండఁగా
నీవేనావుడు వాని కవ్వర మజుం డిచ్చెం గృపాలోలతన్‌.

బ్రహ్మ రావణ కుంభకర్ణ విభీషణులకు వరంబు లిచ్చుట

వ.

మనుష్యజాతి యొక్కండుదక్క నీ చెప్పిన యందఱవలనను నీకు మరణభయంబు లేదని పలికి, పరమేష్ఠి గుంభకర్ణుం జూచి వరం బడుగుమనిన వాఁడు దైవోపహతుండై తనకు నాత్యంతికం బయిన నిద్ర యడిగిన నట్ల యగు నని, విభీషణున కభిముఖుం డగుటయు నతండు కృతాంజలియై జలజాసనుఁ బ్రస్తుతించి.

క.

పరమాపద యైనపుడును | దురితంబులు నా మనంబు దొడరమియును భా
సుర మగు బ్రహ్మాస్త్రమ్మును| గరుణింపవెయనిన నిచ్చి కమలజుఁ డనియెన్‌.

క.

నిరతము రాక్షసభవమును | బొరసియు నీ విట్లు ధర్మబుద్ధి వగుట య
చ్చెరు విది గావున నీకును | దిరముగ నమరత్వ మిచ్చితిం గృప వత్సా!

వ.

అని పలికి పితామహుం డంతర్హితుం డయ్యెఁ; దదనంతరంబ.

మ.

వరగర్వోన్నతుఁ డై దశాననుఁడు దుర్వారోద్ధతిన్‌ దాడిమై
నరిగెం గిన్నరనాథుపై; నతఁడు కార్యం బాత్మ నూహించి సం
గరసన్నద్ధుఁడు గాక కింపురుష యక్షశ్రేణితోఁ గూడఁ దా
నరిగెన్‌ లంకఁ బరిత్యజించి రభసోద్యత్పుష్పకారూఢుఁడై.

వ.

ఇ ట్లతండు గంధమాదనంబునకుం జనునెడ వెన్నడిం దగిలి దానవుండు వాని మానంబుతోన విమానంబు నపహరించినం గనలి యక్షేశ్వరుండు గురుండ నగు నన్ను నవమానించితివి గావున నివ్విమానంబు నీ పగతు పా లయ్యెడుమని శపించె నంత.

క.

రాక్షసలక్ష్మీమహిమకు | రక్షకుఁడుగఁ బంక్తిముఖుని రాక్షసమాయా
దక్షు నభిషిక్తుఁ జేసిరి | రాక్షసబేతాళవరులు రాగం బెసఁగన్‌.

వ.

వాఁడును బలదర్పమోహితుండై కడంగి యింద్రాదిదేవతల నొడిచి తత్పదంబు లాక్రమించి, యీసు మిగిలి జగద్రావణంబు సేయుటం జేసి, రావణుం డను పేరం బ్రఖ్యాతి వహించి సకలభూత భయంకరుం డయ్యె; నట్టియెడ దేవర్షులును, రాజర్షులునుం గూడి చని తత్ప్రకారం బగ్నిదేవునకుం జెప్పిన, నతండు వారిం దోడ్కొని వారిజాసనుపాలికిం జని యి ట్లనియె.

ఉ.

భూరిభుజుండు విశ్రవసుపుత్త్రుఁడు పంక్తిముఖుండు దర్పదు
ర్వారుఁడు రాక్షసేంద్రుఁడు భవద్వరశక్తి నవధ్యుఁ డై మహా
ఘోరముగాఁ ద్రిలోకములకుం గడుఁ బీడ యొనర్పఁ జొచ్చె వృ
త్రారి పురోగమత్రిదశు లందఱుఁ గింకరు లైరి వానికిన్‌.

ఉ.

దానవుచేతఁ గష్టపడి దైన్యము నొందుట కోర్వలేక నీ
దైన పదాంబుజంబు లభయం బని చేరితి; మింక మమ్ము నె
ట్లైనఁ గృపార్ద్రమానసుఁడ వై తగఁ జేకొనవయ్య! మాకు ది
క్కైనను గాకయున్నఁ గమలాసన! నీవ కదయ్య యెయ్యెడన్‌.

వ.

అనినంబరమేష్ఠివారల కిట్లను; నిక్కార్యంబునకు నేను మున్న తగిన యుపాయంబు నిశ్చయించి నారాయణుం బ్రార్థించితి; నద్దేవుండు మనుష్యభావంబున నవతరించి, యా రాక్షసు వధియించువాఁ డయ్యె; నింద్రాది సురులునుం దమ తమ యంశంబులంజేసి ఋక్షవానరజాతులయందు జనియింపఁగలవారు; మీకు భయంబు వలవదని యగ్నిప్రముఖు లైన యమ్మహామునుల సమ్ముఖంబున దుందుభి యను గంధర్వ కామినిం బిలిచి నీవు కుబ్జరూపంబున మంథర యను పేర భూలోకంబున నుద్భవించి నీ నేర్చు విధంబున దేవకార్యంబులు నిర్వహింపుమని పనిచి వారి వీడ్కొలిపెఁ; బదంపడి దివిజుల యంశావతారంబులం. జేసి.

మ.

గురుశైలోన్నతగాత్రు లుద్ధత భుజో గ్రుల్‌ వజ్రపాషాణ క
ర్కరు లర్కప్రతిమానతేజులు, గుణాకల్పుల్‌, మహాకల్పభీ
కరకాలాంతకకల్పు లాజినిపుణుల్‌ గర్వోన్నతుల్‌ ఋక్షవా
నర వీరుల్‌ జనియించి రెల్లయెడలన్‌ నాగాయుతప్రాణులై.

క.

అన విని యుధిష్ఠిరుం డ | మ్మునివరుతో ననఘ! ధర్మమూర్తిని నా రా
ముని నేల యరణ్యంబున | కనిచెను దశరథుఁడు సెపుమ యక్కథ నెల్లన్‌’.

వ.

అని యడుగుటయు మార్కండేయుం డిట్లనియె: దశరథుండు నిజ సుకృత పాకంబునం జేసి రామ ప్రముఖులయిన కొడుకుల నలువురం గని, త్రైలోక్యరాజ్యంబు సంప్రాప్తం బయినయట్లు సంతసిల్లె; నక్కుమారులు క్రమంబున నుపనీతులు నఖిలవేదవేదాంగవినీతులు, యథాక్రమ పరిణీతులు నై విలసిల్లి రంత.

సీ.

అభినవపద్మదళాక్షు నక్షీణవి | స్తృతవక్షు నాజానుదీర్ఘబాహు
మధురస్మితానను మదగజగమను నా | రూఢయౌవను నభిరూపతేజు
శ్రీరమణీయుఁ బ్రసిద్ధయశోరమ్యు | నిఖిలవిద్యాగమనిపుణచిత్తు,
నింద్రసమాను జితేంద్రియు ధర్మజ్ఞుఁ | బౌరబాంధవజనప్రార్థనీయు

ఆ.

దుష్టనిగ్రహైకధుర్యు విశిష్టసం | రక్షణాభిలోలు రామభద్రుఁ
గులపవిత్రుఁ బెద్దకొడుకుఁ గనుంగొని | రాజవరుఁడు గరము రాగ మెసఁగ.

వ.

యౌవరాజ్యపదంబునకు నతని నభిషేకం బాచరింపం గోరి యాప్తమంత్రిజనసమ్మతంబునఁ బురోహిత నిరూపితం బైన శుభదినంబున నక్కార్యంబునకు సమకట్టునెడ భరతు దాది మంథర యనునది యమంద గతిం గైకేయిపాలికిం జని యిట్లనియె.

ఉ.

అక్కట నీదెసం బతికి నాఱడి కూరిమి యయ్యె; మాయపుం
జొక్కులు నీవు నిక్కముగఁ జూచి మనంబున మోసపోయి; తా
టక్కరి కోసలాత్మజయెడం బ్రియుఁడై యదె తత్తనూజు నిం
పెక్కఁగ యౌవరాజ్యమున నిప్పుడ పట్టము గట్టఁ బూనెడున్‌.

ఆ.

పుడమిఱేని మదికి నెడ యైతి నీ వింక; | నేమి సెప్పఁగలను వామనయన!
కడఁగి నిన్నుఁ గొడుకుఁ బెడవడ వైచి యా | సవతికొడుక యేలు నవని యింక’.

క.

అనిన నుదరిపడి కేకయ | తనూజ గడుసంభ్రమమునఁ దత్‌క్షణమ నరేం
ద్రునిపాలికిఁ జని యేకత | మున నిట్లనుఁ బ్రణయపూర్వముగ నాతనితోన్‌.

క.

ధరణీశ! తొల్లి నాకుం | గరుణించిన వర మొకండు గల; దది మదిలోఁ
బరికించి యిప్పు డొసఁగుము; | చిరముగ సత్యవ్రతంబు సెల్లింపు తగన్‌.

వ.

అనిన నతం డయ్యతివం గనుంగొని యవధ్యుల వధియించుటయును, వధ్యులం గాచుటయును, బ్రాహ్మణ ధనంబులు దక్క నన్యులధనం బపహరించుటయును, నభీష్టధనంబు నిచ్చుటయును మొదలుగా నతి దుష్కరంబులైన వాని నైనను భవత్ప్రియార్థము సేసెద; నెయ్యది సెప్పుమనిన ప్రీత యై భరతమాత యి ట్లనియె.

తే.

యౌవరాజ్యపదంబునయందు భరతు | నధిప! యభిషేక మొనరింపు; మడవిలోన
నొలసి పదునాల్గువర్షంబు లుండ నాన | తిమ్ము రాముని; నురువర మ్మిదియ నాకు’.

క.

అనవుడు వీనులు గొఱవిం | గొని చూఁడిన యట్టు లైనఁ గువలయపతి పె
ల్చన పిడు గడఁ చిన క్రియఁ జే | తనరహితుం డగుచు ధరణితలమునఁ బడియెన్‌.

వ.

అంతయు నెఱింగి రాఘవుండు నిజజనకుండు సత్యప్రతిజ్ఞుండు గావుత మని యాక్షణంబ సీతాసమేతుండయి వనంబునకు వెడలె; నతని పిఱుందన లక్ష్మణుండునుం జనియెఁ; దదనంతరంబ.

దశరథుఁడు రామవిశ్లేషముచే సురలోకగతుం డగుట

క.

రాముఁడు సనుట విని మహో | ద్దామం బగు శోకవహ్ని దరికొనఁగను హా
రామ! గుణధామ! యని యని | భూమీశ్వరుఁ డసువియోగముం బ్రాపించెన్‌.

వ.

ఇట్లు దశరథుండు సురలోకగతుం డగుటయుఁ, గైకేయి దనకొడుకు రావించి భూవల్లభుండు దేవభావంబు నొందె, రాముండును వనంబున కరిగె, నింక నర్హుండవు నీవ కావున నఖిలమహీరాజ్య రక్షణంబు సేయుమనిన నక్కుమారుండు క్రోధశోకదందహ్యమానమానసుం డగుచుఁ దల్లి కి ట్లనియె.

సీ.

దురితంబు లెన్నండుఁ బొరయక వెలుఁగొందు | కమలాప్తకులమునఁ గసటు గలిపి,
పరమధర్మాత్మకుఁ బురుహూతసన్నిభుఁ | బతి మ్రింగికొని, కృపఁ బాఱవైచి
యాయతబాహుఁ దేజోయుక్తు మాయన్నఁ | బటుధైర్యు నడవులపాలు వఱిచి,
జీవితహంత్రివై త్రోవంగరాని దు | ష్కీర్తి నా యౌదలఁ గీలుకొల్పి,

 

ఆ.

శ్రీకి నెడలి సకలలోకంబుచేతను | దిట్టు గుడిచి కోర్కి దీర్చుకొంటి
పాపజాతురాల! యీ పాతకం బేమి | సేయ? దింక నేమి సేయువాఁడ?’

వ.

అని దుఃఖించి, భరతుండు దండ్రికి నుచితక్రియలు నిర్వర్తించి, యనంతరంబ సమస్త మంత్రి సామంత భూసుర పౌర జానపద సహితుండై కదలి, మువ్వురు దల్లులను వసిష్ఠ వామదేవులనుం బురస్కరించుకొని తానును శత్రుఘ్నుండును రామానునయార్థంబు చిత్రకూటశైలంబున కరిగి యందు.

మ.

కనియెం గోమలనీలమేఘసుభగాకారున్‌, జటావల్కలా
జినధారున్‌, సితభూతిభూషితుని, రాజీవాక్షుఁ, గల్యాణ కీ
ర్తనుఁ, గాకుత్‌స్థకులప్రదీపకుని, సీతాలక్ష్మణోపేతు,
న్మునిలోకార్చితు, సత్కృపాభరణు, రామున్‌, రాజచూడామణిన్‌.

వ.

కని యంతంత నాక్రందన పరుం డగుచుం జని తదీయచరణంబులపయిం బడి పితృమరణప్రకారం బంతయు నెఱింగించి, ‘దేవా! సకలసామ్రాజ్యధురీణుండ వై మమ్మందఱ ననుశాసింపవే!యని యర్హజన సహితంబుగా నతనిం బ్రార్థించిన.

క.

గురువాక్యరక్షణైకా | దరచిత్తుం డైన యయ్యుదాత్తచరితుఁ డె
ప్పరుసున నొడఁబడఁ డయ్యెను | సరసమహీరాజ్యసమనుశాసనమునకున్‌.

వ.

భరతుండును రాముచేతఁ బ్రత్యాఖ్యాతుండై తదీయపాదుకంబులు గొని చని, వాని నర్చించుచు నంది గ్రామంబునందు వసియించి రాజ్యానుసంధానంబు సేయుచుండె; నిట రాఘవుం డయోధ్యాపుర సమీపం బగుటం జేసి క్రమ్మఱ భరతాగమనంబు శంకించి, చిత్రకూటంబు వాసి శరభంగుపాలికిం జని, యతని చేత సత్కృతుండై దండకారణ్యంబు సొచ్చి, యందు గోదావరీతీరంబున ననుజవధూసహితంబుగాఁగృత నివాసుండై యున్నంత; దశగ్రీవుచెలియలు శూర్పణఖ సనుదెంచి, వారికి నపకారంబు సేయ మొనసినం గినిసి, యా రాజపుత్త్రులు దత్కర్ణనాసికావైకృతం బొనరించినం బదంపడి.

ఉ.

శూర్పణఖానిమిత్తమున శూరు లనేకులు రక్కసుల్‌ మహో
త్సర్పితరోషులై బహుళ సైన్యయుతంబుగ నెత్తి వచ్చుడున్‌
దర్పితవైరిభంజనుఁ డుదారుఁడు రాఘవుఁ డస్త్రవిద్య నే
ర్పేర్పడఁ గేలిఁ బోలె సమయించె రణాంగణభూమి నందఱన్‌.

వ.

ఇట్లు ఖరదూషణాదులం గొట్టి పదునాలుగువేలరాక్షసులం జంపి దండకారణ్యంబు విగతకంటకంబు గావించె; నంత శూర్పణఖయు రయంబున రావణుపాలికిం జని తచ్చరణంబులపయిం బడి యేడ్చినం, జెలియలి కైన వైకృతం బేర్పడం జూచి యన్నిశాచరనాథుం డి ట్లనియె.

సీ.

ఎఱిఁగి యెఱింగి నేఁ డెవ్వాఁడు నిశిత వి | స్ఫారశూలాగ్రంబుపయికి నుఱికెఁ?
దలయంపియం దగ్గి దరికొల్పి యెవ్వండు | నేఁడు నెమ్మది శయనింపఁ జూచె?
నుగ్రవిషానలం బుమియుచున్న యహీంద్రుఁ | గడఁగి నేఁ డెవ్వండు గాలఁ దన్నె?
హుంకారఘోరమై యుదరు బెబ్బులి మీస | లుఱక యెవ్వాఁడు నేఁ డూఁచికొనియె?

 

ఆ.

నిన్ను నెవ్వఁ డకట! నేఁ డిట్లు గడు భంగ | పఱిచెఁ జెపుమ నాకుఁ బద్మనయన!
యాయువును సిరియును నవశంబు లయ్యె నేఁ | డెవ్వనికొ తలంప నిజ్జగమున.

క.

అని పలుకునప్పు డాతని | ఘనతరముఖనేత్రనాసికాకర్ణములం
దనవరతరోషపావక | జనితశిఖావితతు లక్కజంబుగ వెడలెన్‌.

వ.

శూర్పణఖయు నతనికి రాఘవు లున్న తెఱంగును, నిజపరిభవంబు దత్కృతం బగుటయు, ఖరదూషణాది రాక్షసవధయునుం జెప్పిన విని, ధనదానుజుం డాక్షణంబ పురసంరక్షణంబునం దాప్తజనంబుల నియోగించి, సన్నద్ధుండై యొక్కరుండ వెలువడి త్రికూటకాలపర్వతంబులు గడచి సముద్రతీరంబునఁ బరమేశ్వరనివాసం బైన గోకర్ణస్థానంబునకుం జని, యచ్చటం దొల్లి రామువలనం బ్రాప్తపరాభవుండై ప్రవ్రజనంబు నొంది తపంబు సేయుచున్నవానిం దనపూర్వామాత్యు మారీచుం గనిన, నతండును బ్రియసంభ్రమంబులతోడ నతనిం బూజించి కుశలం బడిగి, ‘భవదాగమన నిమిత్తం బేమి?’ యని యడిగిన నసురేశ్వరుం డి ట్లనియె.

ఉత్సాహము

వినవె రాముఁ డనఁగ నొకఁడు విపులదర్పహృదయుఁ డై
మన ఖరుండు లోనుగా సమగ్రశౌర్యు లైన య
ద్దనుజవరులఁ దునిమి, యిపుడు దండకస్థలంబునం
దొనర నిర్భయత్వ మొప్ప నున్నవాఁడు మేటి యై.

ఆ.

వానిఁ బరిభవింపవలయు నప్పనికి సా | హాయ్యకం బొనర్పు మనఘ! నాకు
ననిన నధికభయసమావిష్టహృదయుఁడై | యమరవైరి కిట్టు లనియె నతఁడు.

చ.

ఎఱుఁగవు గాక రాఘవు నుదీర్ణభుజాబలరూఢి నాజిలో
నుఱక తదీయబాణరయ మోర్వ వశంబె పినాకికైన? ను
క్కఱ మఱి నీకు నిత్తెఱఁగు గాదన కే ఖలుఁ డొక్కొ బుద్ధిగాఁ
గఱపినవాఁడు సేటునకుఁ గాలము సేరెనొ గాక యిమ్మెయిన్‌.

ఆ.

రాముతోడఁ దొల్లి రణమునఁ గడు భంగ | మొంది కాదె దైన్యయుక్తి నిట్లు
దపసి నైతి; నేఁడు తగ దమ్మహాత్ముని | యందు వైరబుద్ధి యధిప! నీకు.

వ.

అనినం గలుషించి లంకేశ్వరుండు వానిం జూచి నా పనుపు సేయ వైతివేని నిన్నిప్పుడ కృతాంతగోచరుం జేయుదుననిన, వాఁడును దనమనంబున వీనిచేతం జచ్చుటకంటెను రాఘవకృతం బైన మరణంబు మేలని తలపోసి, ‘మహాత్మా! నీకు హితంబుఁగోరి చెప్పితి; నిది యిష్టంబు గాదేని భవదీయశాసనంబు గైకొని చేసెదం; బనుపుమనినఁ బౌలస్త్యుం డిట్లను; ‘నీవు రత్నమయతనూరుహం బగు కనకమృగంబ వై చని, జానకిం బ్రలోభింపవలయు; సీతాచోదితుండై రాముండు నిన్నుం బట్ట సమకట్టి నీ చేత నతిదూరంబు గొనిపోవంబడు; నప్పు డేను దద్భామిని నపహరించెదఁ; బ్రియావిరహదుర్మనస్కుండై యతండు చెడిపోవుననిన నట్ల కాకయని మారీచుండు.

మారీచుండు మాయామృగంబై చనుదెంచుట


క: కనకమృగరూపమునఁ జని | యినవంశ్యుఁడు సతియు నున్నయెడ మెలఁగుటయుం
    గని జానకి కౌతూహల | మునఁ బ్రియుఁ బ్రార్థించె హరిణపుంగవుఁ బట్టన్‌.

ఆ.

ధరణిసుతయు విధియుఁ దన్నుఁ బ్రేరేపంగ | వివశబుద్ధి యగుచు నవనివిభుఁడు
మృగముఁ బట్టఁ దివిరె మృగనేత్రఁ గావ స | ద్వినుతబలు సుమిత్రతనయు నునిచి.

క.

అసదృశకార్ముకధరుఁడై | మసలక యామృగము వెనుక మర్దితరిపుఁ డే
పెసఁగంగ నరుగఁ దొడఁగెను | వెస రుద్రుఁడు యజ్ఞమృగము వెనుకొనుమాడ్కిన్‌.

వ.

అట్టి యవసరంబున.

మ.

పఱచున్‌ దవ్వుగఁ, జేయలంతి నిలుచుం, బట్టీక యాసాసలం
బిఱువోవుం, బొదలందు డిందుఁ, బొడమున్‌, బిట్టుల్కి వే దాఁటుఁ, గ్ర
మ్మఱి చూచుం, జెవి దార్చి నిల్చు, మలయున్‌, మట్టాడు, గోరాడు, నే
మఱినట్లుండుఁ దృణంబు మేయు నెలయున్‌ మాయామృగం బిమ్ములన్‌.

వ.

ఇ ట్లతిదూరంబుగా నెలయించి యలయించిన నది రాక్షసమాయగా నూహించి రాఘవుం డమోఘబాణంబు దొడిగి తడయక యమ్మృగంబు నేసిన.

క.

వాలమ్ము దాఁకి యొఱలుచు | నాలోనన రాము నెలుఁగునట్టి యెలుఁగు గా
హా! లక్ష్మణ! సీతా!యని | కూలి కపటమృగము తన్నికొనుచుం జచ్చెన్‌.

తరువోజ

ఆ యెలుఁ గేర్పడ నవనీతనూజ | యాలించి తల్లడం బడరు చిత్తమున
నోయన్న! లక్ష్మణ! యొలసి మీయన్న | యుగ్రరాక్షసబాధ నొందంగఁ బోలు;
నాయతభుజ! వింటె యమ్మహాభాగుఁ | డత్యంతదుఃఖార్తుఁ డై నిన్నుఁ జీరె;
బోయి వే కావు విస్ఫురితపుణ్యైక | భూషణోదార! యప్పురుషరత్నంబు’.

వ.

అనిన నతం డా మానిని కి ట్లనియె.

ఆ.

అబల! వెఱవకుండు; మఖిలలోకములను | రాఘవేశ్వరునకు రణములోన
నెదురఁ గలఁడె శూరుఁ డెవ్వాఁడు? నతనికి | నెట్టియెడల దురిత మేల పొందు?

క.

ఇనవంశోత్తముఁ డిప్పుడ | చనుదెంచుఁ బ్రియంబు నొందు జలజానన!నా
విని జానకి లక్ష్మణు నెడ | జనితాశంక యయి క్రోధసంభ్రాంతమతిన్‌.

సీ.

నీతలం పెఱుఁగుదు; నీ కేల వలవని | జాలి నీ కి ట్లేల సంభవించె?
నతిఘోరశస్త్రవిషాగ్నులయం దొంట | వేగంబ ప్రాణముల్‌ విడుతుఁగాక
యే నేల నిను వరియింతు? బెబ్బులికాంత | యక్కట! నక్కపొం దాస పడునె?’
యని యిట్లు సత్పురుషాగ్రణి సౌమిత్రిఁ | బడఁతి యప్రియములు వలుకుటయును,

 

ఆ.

జెవులు మూసికొనుచుఁ జిత్తంబు గలఁగ ల | క్ష్మణుఁడు దత్‌క్షణంబ మహిత శౌర్యుఁ
డతులబాణచాపహస్తుఁడై తనయన్న | చనిన చొప్పునంద చనఁ దొడంగె.

వ.

అయ్యవసరంబున దశాననుండు.

మ.

కమనీయం బగు జన్నిదంబు శిఖయుం గౌపీనమున్‌ ధాతువ
స్త్రము దండంబును గుండియుం గుశపవిత్రంబుం గడున్‌ వృద్ధభా
వము సంధిల్లఁ ద్రిదండివేషధరుఁడై వచ్చెం బథిశ్రాంతి దే
హమునం దోఁపఁగ సీతయున్నెడకు మాయాదక్షుఁ డక్షీణతన్‌.

తే.

వాని నిక్కంపుమునియ కా వగచి రాము | వనిత గడుభక్తిఁ బూజించి వన్యఫలము
లొసఁగుటయు వానిఁ జేకొననొల్ల కసుర | మదనవివశుఁడై యిట్లను మగువఁజూచి.

మత్తకోకిల

ఏను దానవనాయకుండ నహీనసత్త్వుఁడ రావణా
ఖ్యానిరూఢుఁడ లంక నాఁగ జగత్ప్రసిద్ధము మత్పురం
బానతాంగి! మదీయవల్లభ వై భజింపఁగ రాదె ది
వ్యానుభోగము లిష్టచేష్టితహారియౌవనలీలలన్‌.

క.

ఎక్కడి రాఘవుఁ డక్కట! | తక్కువ యగు పేదమనుజుఁ దగిలి వనమునం
బెక్కిడుమలఁ బడఁ దగునే! | తక్కుము మది నింక నొండుదలఁపులు తరుణీ!

వ.

అనిన విని వైదేహి భయకంపిత దేహ యగుచు నతని కి ట్లనియె.

సీ.

ఇట్లాడ నర్హమే యే నేడ? నీ వేడ? | నక్షత్రతారాగణంబుతోడ
నాకసం బంతయు నవనిపైఁ గూలిన | వసుమతి వ్రస్సిన, వనధు లెల్ల
నింకినఁ, జంద్రదినేశ్వరు లన్యోన్య | విపులతేజంబులు వీడుపడిన
నే నేల యన్యుని నెడలోనఁ గామింతుఁ? | గరిణి యేనాఁట సూకరముఁ గలయు?

 

ఆ.

మహితకమలమధురమధురసాస్వాదన | పరవశాత్మ యైన భ్రమరకాంత
రిత్తబుద్ధి నకట! రేఁగుఁబువ్వుల రసం | బాను నెట్లు? బేలవైతి గాక.

రావణుఁడు సీత నెత్తికొని లంకకుఁ బోవుట




వ.  అని పలుకుచు నొయ్యనొయ్యన తొలంగం జనిన నద్దురాత్ముఁ
     జంకించి యమ్మగువం బట్టికొని గగనంబున కెగసి
     లంకాపురాభిముఖుండై యరుగఁ దొడంగిన నయ్యింతి
     యెంతయుం దలరి యిట్లని విలాపంబు సేసె.

ఉ.

దేవతలార! యో ధరణిదేవతలార! జగత్త్రయోన్నతుం
డై వెలుఁగొందు రామునికులాంగన జానకి నేను; నన్ను మో
హావిలుఁ డొక్క రక్కసుఁ డనర్గళుఁడై కొనిపోయెడుం; గృపం
గావరె! పుణ్యమున్‌ యశముఁ గైకొనరే! యిదె మీకు మ్రొక్కెదన్‌’.

క.

అని యేడ్వఁగఁ దద్వచనము | లనఘుఁడు గిరిగహ్వరాంతరాలయగతుఁడై
విని యరుణసుతుఁడు తేజో | ఘనుఁడు జటాయు వను పక్షి కారుణ్యమునన్‌.

క.

ఎఱకలు గల కులశైలము | తెఱఁగు మెయిన్‌ రయము మెఱయ దివికి నెగసి బె
ట్టుఱుము జలధరముక్రియ ను | క్కఱి భువనం బెల్ల నద్రువ నార్చుచుఁ గడిమిన్‌.

ఉ.

ఓరి దురాత్మ! యీ యబల నోడక యేటికిఁ బట్టినాఁడ? వం
భోరుహనేత్ర విడ్వు; మెట వోయినఁ బ్రాణముఁ గొందు నింక; ను
గ్రారివిభేదివిక్రము జటాయు నెఱుంగవె?’ యంచు దర్పదు
ర్వారుఁడు వీఁకఁ దాఁకె సురవర్గవిఘాతకు నద్దశాననున్‌.

మ.

ఘనపక్షాహతులం బ్రకాండపరిఘాఘాతంబులం దీవ్రశా
తనఖోచ్ఛేదములం బ్రదీప్తశరవేధక్రీడలం గ్రూరచం
చునిపాతంబులఁ బ్రౌఢకుంతముఖవిస్ఫోటంబులం దత్ఖగేం
ద్రనిశాటేంద్రుల పోరు సాధనసమత్వస్ఫూర్తి నొప్పెం గడున్‌.

చ.

పటుతరపక్షిపక్షముఖపాదనఖప్రవిఘాతఖండిత
స్ఫుటితశరీరుఁడై బహుళశోణితధారలు మేనఁ గ్రమ్మఁగాఁ
దటసముపాంతనిర్గళితధాతురసారుణసాంద్రనిర్ఝరో
త్కటకులశైలలీల దశకంఠుఁడు నిల్చె నకుంఠితస్థితిన్‌.

వ.

తదనంతరంబ.

క.

తెఱపి గని దానవేశ్వరుఁ | డుఱక కృపాణమున నాఖగోత్తము నెఱకల్‌
నఱకినఁ గూలె నతం డిల | నఱవఱలై పవనహతమహాభ్రమ పోలెన్‌


వ. ఇట్లు జటాయువుం గూల్చి రావణుం డధికరయంబున
నరుగునెడజానకితనకు దిక్కెవ్వరు లేమిం జేసి నిరాశయై
యొక్కశైలశృంగంబునందుఁగొందఱువానరులు
మెలంగుచున్నంగని, న కట్టిన పుట్టంబుకొంగు సించి
భూషణంబులు ముడిచి తత్ప్రదేశంబున వైచెం;
త బంక్తివదనుండునులంకాపురంబునకుం జని
యందశోకవనమధ్యంబున నాసుమధ్యనునిచి,
తదీయరక్షణార్థంబు రాక్షసీనివహంబు నియోగించె;
నిటరాఘవుండు మాయామృగంబు వధియించి
మగుడం జనుదెంచువాఁడు దన కెదురుగా వచ్చు
లక్ష్మణుం గని ‘రాక్షస గోచరం బైనవనంబున
జానకి నొంటి యునిచి వచ్చి తప్పుసేసి’ తని
పలుకుటయు, సుమిత్రానందనుండు
ధాత్రీతనయ తన్నునవమానించి పలికిన
తెఱంగు సెప్పిన.

మధురాక్కర

కనకమృగ మట్లు దను దవ్వుగాఁ ద్రిప్పి తెచ్చుటకు,
వనజముఖి నేకతమ శూన్యవనమునయం దునిచి
వెనుక ననుజుండు వచ్చిన విధమునకు, మదిలోన
ననఘుఁ డెంతయు వగచుచు నరిగె నాశ్రమమునకు.


వ.

అట్లు సని చేతనారహితం బైన శరీరంబునుంబోలె 

సీతావిహీనంబయి యున్న పర్ణగృహంబుం గనుంగొని

 రాఘవుండు మూర్ఛితుండై, లక్ష్మణ ప్రయత్నంబునఁ

 గొండొకవడికిఁ దెలివొందె; నంత నయ్యన్నయుం

 దమ్ముండును దత్ప్రదేశంబులయందు సుందరిం

 దడవుచుం జనువారు ముందట.

  

తే.

కులిశపాతభంగుర మైన కులనగంబు | కరణిఁ బడియున్న గృధ్రంబుఁ గాంచి బుద్ధి
నదియు రాక్షసమాయయౌ నని తలంచి | యేయ సమకట్టుటయు విహగేంద్రుఁ డెఱిఁగి.

క.

ఓయయ్యలార! యేను జ | టాయు వనంబరఁగు పక్షి నరుణతనయుఁడన్‌
మీయయ్య దశరథక్షితి | నాయకునకుఁ బ్రియసఖుండనావుడు వారల్‌.

వ. డాయ నరుగుదెంచుటయు నతండు వారితో రావణుండు
వైదేహిం గొనిపోవుటయుఁ, దదర్థంబై తాను నద్దనుజుం
దొడరి పెనంగుటయుం జెప్పి, యావల రావణుం డరిగినదెస
నెఱింగించి విగతజీవుం డయ్యె; నయ్యిరువురు
నప్పులుఁగుఱేనికి నతిగౌరవంబున నగ్నిసంస్కారాది
కరణీయంబులు నిజజనక నిర్విశేషంబుగా
నాచరించి దక్షిణాభిముఖులై చని చని.

చ:  ఉరమునయందుఁ గన్నులుఁ బృథూదరదేశమునందు నోరుఁ బ్ర
     స్ఫురితభుజద్వయంబుఁ గులభూమిధరోన్నతభావముం గరం
     బరుదుగ నుగ్రమైన వికృతాకృతితోడ నశేషసత్త్వఘ
    స్మరుఁ డగుచున్నవానిఁ బటుసత్త్వుఁ గబంధునిఁ గాంచి రచ్చటన్‌.

ఆ: అక్కబంధుఁ డామిషార్థియై లక్ష్మణుఁ | బట్టికొనియె బాహుబల మెలర్ప;
నతఁడు గడువిషణ్ణుఁడై ‘యన్న! ననుఁ జూడు’ | మనుచు రాముఁ జూచి యనియె మ

 శ్రీరాముఁడు కబంధుఁ డను రాక్షసుం జంపుట

సీ.

మహనీయసామ్రాజ్యమహిమ వాయుటయును, | బితృమరణంబు, నాభీలవిపిన
భూములఁ గడుదుఃఖమునఁ జరించుటయు,
 వై | దేహిఁ గోల్పడి వగఁ దిరుగుటయును,
దుదిఁ బోయి యే నిట్టు దొడరి యీ దానవు
 | వాతఁ జిక్కుటయును వగవ నీకుఁ
బైపయిఁ బెక్కులాపద లయ్యె నక్కట!
 | ధరణీశ! నీవు నా ధరణిసుతయుఁ

 

ఆ.

గలసి పూజ్యరాజ్యగౌరవంబున వెలుఁ | గంగ నెలమిఁ జూడఁ గాన నైతి
నేను దలఁప నెట్టి హీనభాగ్యుండనో!’ |
 యనుచు ననుజుఁ డార్తి నడలుటయును.

తే.

విగతసంభ్రముఁ డై రామవిభుఁడు గడఁగి | ‘యన్న! లక్ష్మణ! యోడకు మన్న, యేను
గలుగ నీ కేల యాపద గలుగనేర్చు? |
 ననుచు గ్రక్కున నిశితమహాసి వెఱికి.

వ.

ఆ రక్కసు డాచేయిఁ దునియ వ్రేసిన లబ్ధమోక్షణుండయి లక్ష్మణుండు

 ప్రకటసైంహికేయ దంష్ట్రాయంత్ర విముక్తుండయిన

 తిగ్మభానుండునుంబోలెఁ బ్రదీప్తుండయి తీక్ష్ణకౌక్షేయకంబునఁ 

దదీయ దక్షిణబాహు ఖండనంబు సేసి పార్శ్వద్వయంబు

 భేదించిన నాక్షణంబ కబంధుఁడు దివ్యరూపధరుం 

డగుటయుం గని రాఘవుండు విస్మితుండై.

క.

ఈవనమునందు రాక్షస | భావంబున నున్న నీకుఁ బ్రకటితదివ్య
త్వావాప్తి యైన కారణ
 | మేవిధ?’ మనుటయును నాతఁ డిట్లని చెప్పెన్‌.

వ.

ఏను విశ్వావసుం డను గంధర్వుండ; బ్రహ్మశాపంబునం జేసి

 రాక్షసత్వంబు నొంది మీవలన శాపమోక్షంబు వడసితి;

 రావణుం డను రక్కసుండు జానకిం గొనిపోయి,

 లంకానగరంబున నునిచినవాఁడు; మీకు

 హితోపదేశంబు సేసెద; నిట పోవంబోవఁ

 బంపాభిధానం బయిన సరోవరంబు గలదు;

 దాని యావల ఋశ్యమూకం బనుశైలంబునందు

 వాలిసహోదరుండు సుగ్రీవుం డను వానరుండు సచివ

 చతుష్టయ సహితుండై యుండు; నతనితోడ

 సఖ్యంబు సేయుము; దానం జేసి నీకుఁ గార్యసిద్ధి

 యగు నని పలికి గంధర్వుండు వారి వీడ్కొని నిజేచ్ఛం

 జనియెఁ; దదనంతరంబ యట చని చని.

సీ.

కమనీయకమలినీకహ్లారదళకేస | రాన్వితజలముల నర్ఘ్యవిధియుఁ,
దరళతరంగహస్తములఁ బాద్యంబు,
 ను | న్మద చక్రసారసమధుపహంస
రుతులఁ బ్రియోక్తులు,
 రుచిరవానీర ని | వేశనచ్ఛాయల విశ్రమంబు
మందసంచారితమారుతంబుల నురు
 | తాపనోదనమును దగిలి యెపుడు

ఆ.

నాచరించుచును సమంచితాతిథి జన | సేవనమునఁ దనదుజీవనంబు

ఫలము నొంద నొప్పు పంపాసరోవరం | బెదురఁ గాంచి రన్నరేంద్రసుతులు.

వ.

ఆ సరోవరతీరంబునం గౌసల్యానందనుండు

 తత్తద్విషయవిశేషోల్లాసంబులవలనం గ్రొత్తయై

 చిత్తజానలంబు దరికొని చేతోవృత్తంబు నెరియింపం

 దొడంగినఁ దాల్మి దొఱంగి జానకిం బేర్కొని

 యాక్రందనవచనవివశుం డగుటయు, నతనికి లక్ష్మణుం డి ట్లనియె.

చ.

పురుషవరేణ్య! యిట్లు మిముబోఁటులకుం జనునయ్య? యాపదల్‌
వొరసినచోఁ గలంగుట;
 ప్రభుత్వ మెలర్పఁగఁ దాల్మి యూఁది దు
స్తరతరమానసవ్యథలు దల్గుము;
 సంభృతపౌరుషుండ వై
యరయుము దేవి యున్నయెడ యారసి కార్యము దీర్పు నేర్పునన్‌.

ఆ.

అధిప! శిష్యుఁడను సహాయుండు భృత్యుండ | నైన యేను గల్గ నాత్మ నీకు
నేల వగవ?’
 నని మహీపతిచిత్తంబు | నలఁత డిందుపఱిచె నవరజుండు.

వ.

తదనంతరంబ యయ్యిరువురుం బంపాసరోవరంబునం

 గృతస్నాను లయి దేవపితృతర్పణంబులు సేసి చని

 ముందట నతిబహుళబలాహకవ్యూహసన్నాహ

సమున్నతంబు లైన యభంగోత్తుంగ 

ఋశ్యమూకశైలంబుఁశృంగసముదయంబుల నఖిలగగన

 క్రోడపీడనంబు సేయుచున్న దాని జేరి 

తదుపకంఠప్రదేశంబున విశ్రమించి యున్నంత.

సీ.

ఆ రాజపుత్త్రుల నారూఢతేజుల | వీరుల నున్నతోదారభుజులఁ
గనుఁగొని సుగ్రీవుఁ డనఘుఁ డగ్గిరిశృంగ
 | ముననుండి తానును దన సచివులుఁ
జింతించి వారివృత్తాంతము నెఱుఁగంగ
 | సంతతోత్సాహు ధీమంతు శౌర్య
వంతు నుత్తము హిమవంతునిఁబోని య
 | త్యంతసుస్థిరు హనుమంతుఁ బనిచె;

ఆ.

నతఁడు నరిగి నృపతిసుతులతెఱం గెల్ల | నెఱిఁగి వనచరేంద్రు నెఱుఁగఁ జెప్పి
యుగ్రతేజుఁ డైన సుగ్రీవుతోఁ జెల్మి
 | యొనర సంఘటించె మనుజపతికి.

వ.

సుగ్రీవుండును మున్ను సీతాపరిత్యక్తంబై తమ ముందటం

 బడినం దారు గైకొని సంగ్రహించియున్న

 భూషణ నిచయంబు రామునకు నివేదించినంజూచి, 

యతండు సముత్సుకుండై వానికి వానరైశ్వర్యంబు

 ప్రతిశ్రుతంబు సేసి తదీయశత్రుం డైన వాలిం జంపఁ 

బ్రతిజ్ఞ సేసెఁ; గపీశ్వరుండును జానకిం దెచ్చుటకు

 సహాయంబుగా నొడంబడియె; నంతట 

నందఱుం గూడికొని వాలి నివాసం బైన

 కిష్కంధానగరంబున కరిగి; రప్పుడు భానుసూనుండును.

క.

వాలిగృహద్వారంబున | వాలి మదం బెసఁగ నార్చి వారక బాహా
స్ఫాలనము సేయుటయు విని
 | వాలి మహారోషదుర్నివారోద్ధతుఁ డై.

వ.

సమరసన్నాహం బమర వెలువడంబోయినఁ దదీయవల్లభ

 యగు తార యతని వారించి యిట్లను; ‘నేఁటిచందంబు

 సూడ సుగ్రీవుండు బలవత్సహాయుండై వచ్చినవాఁ; డది

 యెట్లనిన దశరథనందనుం డైన రాముండు రావణుచేత 

నపహృతదారుం డయి, నిజసహోదరుం డగు

 లక్ష్మణుండును దానును సుగ్రీవ సహాయత్వం

 బపేక్షించి యతనికార్యంబు దీర్పంబూనె నని వింటి; 

నదియునుంగాక మహాబలు లైన మైందద్వివిదులు 

నతిలోకపౌరుషుం డయిన హనుమయు బ్రసిద్ధబుద్ధి

 యగు జాంబవంతుండును వానికి మంత్రులై

 యుండుదురు; గావున నీ విప్పుడు గయ్యంబునకుఁ

 బోక నా కిష్టంబు గా దనిన, నవ్వుచు నవ్వనచరవీరుండు.


క.

ఆ వనిత వచనములు సు | గ్రీవవిషయపక్షపాతకృత్రిమములుగా
భావించి యాదరింపక
 | తా వెడలె ననూనబాహుదర్పం బెసఁగన్‌.

ఇట్లు వెడలి కట్టెదుర నున్న సుగ్రీవుం జూచి యి ట్లనియె.

 


   వాలిసుగ్రీవుల యుద్ధము

తే.

ఓరి దుష్టాత్మ! యే నిట్లు పోరఁ బెక్కు | మాఱు లెగువంగ సిగ్గఱి పాఱుచుండు
నట్టి నీ కున్న యునికిన యిట్టలముగ | నిట్టి బీర మెక్కడనుండి పుట్టెఁ జెపుమ!

వ.

అనినఁ బ్రహసితముఖుం డగుచు నబ్బలిముఖుం డి ట్లనియె.

క.

ఆలిని రాజ్యముఁ గోల్పడి | యాలంబునఁ దూలపోయి యక్కట బ్రదు కిం
కేలా యని తెగువమెయిన్‌ | వాలి! రణము సేయ నమరి వచ్చితి నీతోన్‌.

తే.

చక్కఁ గమ్మింక ముందటి చంద మొందఁ | గలదె? తొంటి సుగ్రీవుండు గాఁడు నేఁడు;
నిన్నుఁ బొరివుచ్చి కాని పోనేర్చు నెట్లు?’ | ననుచు నుగ్రుఁడై యవ్వీరు నార్చి కవిసె.

వ.

ఇవ్విధంబున.

ఉ.

భూవినుతప్రభావులు ప్రభూత బలోద్ధతు లుగ్రవైరితే
జోవిజయుల్‌ నిరంతరయశోజయకాంక్షులు భూరిభూరుహ
గ్రావనఖాయుధుల్‌ బలిముఖప్రవరుల్‌ గడుఁ బొంగి వాలిసు
గ్రీవులు దాఁకి రొండొరు లకృత్రిమరోషకషాయవక్త్రులై.

మ.

తరుసంఘంబులు పూన్చి యొండొరుల నుద్యద్బాహులై వ్రేయ ని
ష్ఠురవక్షస్థ్సలపాతవేగవిరళస్తోకంబులై పోయె న
త్తరుసంఘంబులు; వెండియుం గడఁగి యుద్యల్లీల నయ్యిద్దఱుం
బరుషానేకశిలాప్రయోగముల నొంపం జొచ్చి రన్యోన్యమున్‌.

క.

అతులితశిలావితానం | బితరేతరతనునిపాతహేలా సంచూ
ర్ణిత మగుటయు, వారలు పటు | గతిఁ గవిసిరి బాహుయుద్ధకౌతుకమతులై.

ఉ.

ఒండొరుఁ బట్టుచుం దిగుచు చొండొరుఁ బాయుచు వ్రేయుచున్‌ మహో
ద్దండత నొండొరుం దొలఁగఁ దాఁకుచు నీఁగుచు లోఁగుచుం జలం
బొండొరు మీఱు చొండొరుల యుద్ధతి సైఁపక వీఁకఁ బోరి రా
ఖండలభానుసూను లవిఖండిత చండభుజాప్రచండతన్‌.

శా.

దేహోత్సాహ మెలర్ప నుద్ధతమదాంధీభూతులై యాహవో
త్సాహవ్యగ్రులు విగ్రహంబు మిగులన్‌ సంరంభశుంభద్గతిన్‌
బాహాబాహిఁ బెనంగ నప్పు డమరెం బ్రౌఢద్విపద్వంద్వహే
లాహస్తద్వయగాఢకర్షణరణోల్లాసంబు విస్పష్టమై.

వ.

మఱియు నన్యోన్యదంతనఖముఖవిఖండితశరీరులై హరివీరులు రుధిరధారలం దడిసి పుష్పితంబు లగు నశోకంబులుం బోలె నొప్పి చలంబులు మెఱయం బెనంగునెడం దుల్యబలరూపవిక్రములై యున్న యయ్యన్నదమ్ముల నిరువుర నేర్పడ లక్షింపనేరక లక్ష్మణాగ్రజుండు విలక్ష్యహృదయుండై వీక్షించుచున్న నాంజనేయుండు రాఘవునకు నభిజ్ఞానార్థంబుగా నొక్కపల్లవదామంబు సుగ్రీవునఱుతం బెట్టఁదదనంతరంబ రాఘవుం డమోఘబాణంబు దొడిగి వాలియురంబు వగుల నేసినం, బడి యవ్వానరుండు దశరథనందను నిందించుచుఁ బ్రాణవియోగంబు నొందె; నిత్తెఱంగున.

ఆ.

వాలిఁ జంపి యతనివనిత సుగ్రీవుని | వశము సేసి నిఖిలవనచరేంద్ర
పదవియందు నెమ్మిఁ బట్టంబుఁ గట్టె వి | స్ఫారయశుఁడు రామభద్రుఁ డెలమి.

వ.

ఆ వనచరుండును రామునకుఁ గృతాంజలియై దేవా! యీఘర్మసమయశేషంబును ఘనసమయంబునుం గడపి మఱి సీతాన్వేషణంబునకు నుత్సహించుట లెస్సయని యయ్యిరువురకును మాల్యవత్కూటంబున నివాసంబు గావించి తానును గిష్కింధాపురంబున నుండె; నంత.

మ.

ఉరుఘర్మౌఘవిఘాతసంవిహితవిశ్వోల్లాసమై సంచల
త్సరసాంభోదనినాదతూర్యరవమై చంచద్బలాకాగరు
ద్భరలీలానవచామరస్ఫురణమై పర్జన్యసామ్రాజ్యమొ
ప్పె రమామందిరమై యుదగ్రశిఖినీపింఛాతపత్రంబులన్‌.

వ.

ఆ సమయంబున నక్కడ.

క.

దానవనాయకు చెఱఁ బడి | జానకి యురిఁ బడిన హరిణశాబమ పోలెన్‌
మానిని సంతత భర్తృ | ధ్యానవివశ యగుచు నుండెఁ దాపం బెసఁగన్‌.

వ.

అమ్మగువ కాపున్న దనుజాంగనలు త్ర్యక్షియు లలాటాక్షియుఁ ద్రిస్తనియు నేకపాదయు దీర్ఘజిహ్వయు నజిహ్వయుఁ ద్రిజటయు నేకలోచనయు మొదలయిన వారు పెక్కండ్రు వికృతాకారంబులతోడ నయ్యబలం బరివేష్టించి యహర్నిశంబును నుఱక యదల్చువారును బెలుచం దిట్టువారును ఖరోష్ట్రనిస్వనంబులు సెలంగ వెఱపించువారును ద్రిభువనాధిపతియైన మన దశగ్రీవునొల్లని యీ దుష్టమానుషిఁబట్టి చెండి కండలు దిందు మనువారునునై యున్న నయ్యుగ్మలి గళద్బాష్పయు గద్గదకంఠియు నగుచు నారాక్షసస్త్రీల కిట్లనియె.

తే.

అమ్మలార! మీవలసినయట్ల చేయుఁ | డింక నేటికిఁ దడయంగఁ? నేను రాముఁ
దప్ప నొండొకపురుషుఁ జిత్తమునఁ దలఁప | నింత నిజము; నాకును జీవితేచ్ఛ లేదు’.

వ.

అనిన నజ్జానకితెగువ రావణున కెఱింగింపఁ గొందఱు సనిరి; మఱియు సంతతప్రియవాదినియు ధర్మజ్ఞయు నైన త్రిజట యను రక్కసి రామాంగనం జేరంజని యి ట్లనియె.

త్రిజట తన స్వప్నవృత్తాంతము సీతతోఁ జెప్పుట

సీ.

అమ్మ! నీ కెంతయు హర్షంబుగా నొక | వార్త నే నెఱిఁగింతు వనజవదన!
నామాట నిజముగా నమ్ముము వినవె! య | వింధ్యుఁడు నా నొక్కవృద్ధదైత్యుఁ
డనఘుండు రామహితాన్వేషి యై నీకు | నాశ్వాస మొనరింప నబల! నన్ను
బనిచెను; విను, నిన్నుఁ బాసిన పిదప ల | క్ష్మణుఁడును దాను సేమమునఁ గలసి

 

ఆ.

యఖిలవానరేంద్రుఁ డైన సుగ్రీవుతోఁ | జెలిమి సేసి, యిపుడు శీఘ్రమునన
వీరవరుఁడు నిన్ను విడిపించు పనికినై | యొదవి యుత్సహించి యున్నవాఁడు.

వ.

రావణునకు రంభానిమిత్తం బయిన నలకూబరు శాపంబుగలదు గావున నీయందు బలాత్కారంబు సేయరాదు; నీకు వీనివలని భయంబు వలదు; మఱి యిద్దురాత్మునకుం జేటు దెలుపునట్టి దుస్స్వప్నంబు గలిగె; నది యాకర్ణింపుము.

క.

ఖరములఁ బూనిన రథమున | విరిసిన వెండ్రుకలు వెంట వ్రేలఁగ దశకం
ధరుఁడు బహుళతైలాప్లుత | శరీరుఁడై దక్షిణంబు సనఁ గలఁ గంటిన్‌.

తే.

అతని చుట్టును గుంభకర్ణాదు లెల్ల | నరుణమాల్యానులేపనులై వికీర్ణ
పతితకేశులై నగ్నులై పరఁగఁ బ్రేత | పతిదిశకు నేఁగు గతి గానఁబడియె నాకు.

ఉ.

చారుసితోష్ణ వారణలసత్సితమాల్యసితాంగరాగుఁడై
ధీరగుణోత్తరుం డధికధీనిలయుండు విభీషణుండు వి
స్ఫారసితాద్రిశృంగమున భవ్యుఁడు మంత్రిచతుష్టయాన్వితుం
డై రమణీయలక్ష్మిఁ బొలుపారఁగ నేఁ గలగంటి నుగ్మలీ!

చ.

తన సిత కీర్తి విశ్వవసుధా గగనాంతరపూరితంబుగా
ఘనభుజుఁ డున్నతద్విరదకంధరసుస్థితుఁడై ముదంబుతో
ననుజుఁడు దాను రాఘవకులాగ్రణి సన్మధుసిక్తపాయసం
బొనర భుజింపఁ గంటి వికచోత్పలలోచన! నిక్కమింతయున్‌.

క.

పులిచేత వ్రేటువడి మైఁ | గలయఁగ నెత్తురులు గ్రమ్మఁగా నేడ్చుచు ని
మ్ముల నుత్తరాభిముఖి వై | కలుషితగతి నరుగ నిన్నుఁ గనుఁగొంటిఁ గలన్‌.

క.

నా కల నిక్కల యయ్యెడు | శోకింపకు మమ్మ యింక సుందరి! పుణ్య
శ్లోకు జితలోకు నతులవి | వేకుం బ్రియుఁ బొందఁగలుగు వేగమ నీకున్‌’.

ఆ.

అనినఁ ద్రిజటపలుకు లవి నిక్కములు గాఁగ | వగచి సీత గొంత వనట దక్కి
యాసతోడ నుండె; నట దశవదనుండు | సీతఁ దలఁచి వివశచిత్తుఁ డగుచు.

వ.

తాను దేవదానవ గంధర్వాది భూతవర్గంబుల నెల్ల జయించియుం గందర్పదర్పంబు వారింప నోపక యాక్షణంబ దివ్యమాల్యాంబరాభరణ భూషితుండై సంచారశీలం బైన కల్పపాదపంబునుంబోలె నొప్పియుఁ దనయొప్పుఁ బితృపనంబునందలి వటభూరుహంబుసొంపునుంబోలె నతిభీషణం బగుచుండ నశోకవనమధ్యంబు సొత్తెంచి రోహిణీసమీపంబునకు వచ్చు శనైశ్చరుండునుంబోలె జానకిం జేరం జనుదెంచి ప్రణయపూర్వకంబుగా నిట్లనియె.

క.

ఏల మదిరాక్షి! వలవని | జాలింబడి నవసెదవు లసద్భూషణ లీ
లాలంకృతవై ననుఁ గృప | నేలికొనం గదవె వేయు నేటికి నింకన్‌.

చ.

అనిమిష యక్ష రాక్షస వియచ్చర కిన్నర పన్నగాసురాం
గనలఁ గరంబు చిత్తమునఁ గైకొన కే ననురాగలీలమై
నిను మది నాదరించు టిది నీదగుభాగ్యము గాదె? యింతయున్‌
వనిత! యెఱుంగ వైతి; గరువంపువిచారము లేల నీయెడన్‌.

ఉ.

రాముఁ డనంగఁ బేర్మియును రాజ్యముఁ గోల్పడి కానలోన దుః
ఖామయ మగ్నుఁ డైన యొకయల్పమనుష్యుఁడు వానిపైఁ గడుం
బ్రేముడి సేయుచున్‌ వగపుపెల్లునఁ జిత్తము దల్లడిల్లఁగా
నీ మెయి నుండు నీయునికి యేసుఖ మండ్రు లతాంగి చెప్పుమా!

వ.

ఏను సకలలోకేశ్వరుండ; నాకుం గింకరులై పదునాలుగుకోట్లు నిశాచరభటులును, నిరువది యెనిమిదికోట్లు రాక్షసులును, నెనుబదియాఱుకోట్లు యక్షులును వర్తిల్లుదురు; నిఖిలధనాధ్యక్షుండయిన యక్షేశ్వరుండు నాయగ్రజుండు; బ్రహ్మసమానుం డగు విశ్రవసుండు మదీయజనకుండు; గుబేరునకు వినోదపాత్రంబు లైన గంధర్వాప్సరోగణంబులు నన్ను సేవించుఁ; బంచమలోకపాలుం డని నన్నుఁ ద్రిభువనంబులుఁ గీర్తించు; భక్ష్యభోజ్యాది వస్తువులును సురేశ్వరగృహంబునం దెట్లట్లనాగృహంబున నక్షయంబు; లిట్టినావిభవం బింతటికిని మదీయజీవితంబునకు నధీశ్వరివై సుఖంబున భోగింపుమనిన విని, వైదేహి క్రోధశోకవ్యాకులహృదయ యగుచు వానిదెసం జూడక యొక్కతృణాంకురం బుపలక్షించి యి ట్లనియె.

సీ.

అకట! పరాంగన, నబలఁ, బతివ్రతఁ, | బరికింపఁగా మర్త్యభామ నేను,
రాక్షసుండవు నీవు; రాగంబు మది నించు | కయు లేని నాదు సంగమమునందుఁ
గలిగెడు నట్టి సౌఖ్యం బెంత? యదియును | గాక యాద్యుం డైన కమలగర్భు
పౌత్త్రుఁడ నని లోకపాలతుల్యుఁడ నని | హరసఖుం డైన ధనాధినాథు

ఆ.

భ్రాత నని భవత్ప్రభావంబు సెప్పితి; | విట్టి నీవు ధర్ము వెఱిఁగి దురిత
వర్తనంబు విడువవలదె? సిగ్గేది యి | ప్పగిదిఁ బ్రల్లదములు వలుకఁ దగునె?’

వ.

అని పలికి జానకి యుత్తరీయసంవృతవదనయై యతికరుణంబుగా నేడ్చిన నద్దురాత్ముండు వెండియుఁ గొన్ని దుర్వచనంబులు పచరించి యనంతరంబ యంతర్ధానంబు నొందె; నప్పొలఁతియు నెప్పటియట్ల రాక్షసీరక్షిత యై యుండె నని మార్కండేయుండు ధర్మరాజునకు నిర్దేశించిన తెఱఁగు వైశంపాయనోక్తం బైన యాఖ్యానంబు విఖ్యాతమాధుర్య మనోహరంబుగా.

రాముఁడు లక్ష్మణుని సుగ్రీవునొద్దకుఁ బంపుట

వ.

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె; నట్లు పరమ తపోనిలయుండయిన మార్కండేయుండు పాండవులతో మఱియు నిట్లనియె; నంతమాల్యవత్కందరమందిరుండైన దశరథాగ్ర నందనుండు నవకందళిత సుందరంబులును జనకనందినీవియోగదుస్సహంబులు నగు ఘనసమయదివసంబుల నెట్టకేనియుం గడపి, నిరతిశయసాంద్రచంద్రాతప స్నపనశీతలసమీర వాహ్యమాన వినిద్రకుముదకేదారసౌరభ్య నిర్భరంబులు నతిదీర్ఘయామంబులు నైన శారదయామినులు సైఁపనోపక యొక్కనాఁడు దమ్మునిం జూచి యి ట్లనియె.

సీ.

చూచితే లక్ష్మణ! సుగ్రీవు కొఱగామి | యమ్మెయిఁ దనపగ యడఁచి మనము
కపిరాజ్య మిచ్చినఁ గైకొని యింద్రియ | సుఖముల నెంతయుఁ జొక్కి నేఁడు
మనదిక్కుదలఁపఁడు; మనతోడఁ బల్కిన | సమయంబుఁ జెల్లింపఁ జనదె తనకు?
గడుఁ గృతఘ్నత సేసెఁ గపికులాధముఁడు; నీ | వనఘ! కిష్కింధకు నరుగు మిపుడ;

ఆ.

యద్దురాత్ముఁ గృపణు నాత్మీయ కార్య త | త్పరుని నధికరాగపరవశాత్ముఁ
దొడరి వాలి చనిన త్రోవన యనిచి ర: | మ్మేల తడయ మనకు నింక నిచట?

ఆ.

నీవు సనకమున్న నెఱితోడ మన కార్య | మునకుఁ దగిన యత్నములు ఘటించి
యుండెనేని వాని నొండేమియుం జేయ | వలదు; తోడితె మ్మవార్యశౌర్య!

చ.

అనుడుఁ దదాజ్ఞఁ బూని యతఁ డాతతకార్ముకహస్తుఁడై రయం
బునఁ జనియెం గపీశ్వరునిప్రోలికి; వాఁడును సంభ్రమంబుతో
ననుఁగులుఁ దాను రాజసుతు నర్థి నెదుర్కొని మ్రొక్కి యర్హపూ
జన మొనరించుడున్‌, విభునిశాసన మాతఁడు సెప్పె వానికిన్‌.

వ.

చెప్పిన విని భయకంపితగాత్రుం డగుచుఁ గమలమిత్త్రపుత్త్రుండు సుమిత్త్రాపుత్త్రున కిట్లనియె; ‘నయ్యా! యే నేల కృతఘ్నుండ నగుదు? జానకి నన్వేషించుటకునై బలవంతులు బుద్ధిమంతులు నగువానరుల ననేకుల నలుదెసలకుం బనిచితి; వారును సకలవనశైలసాగరనగరగ్రామనదీసహితం బైన భూచక్రంబునం దెల్ల రోసి, యొక్కమాసంబులోనం గ్రమ్మఱివచ్చువారై సమయంబు సేసిపోయి; రింక నైదుదినంబులు గొఱంత; యింతియ; యటమీఁద వైదేహివార్త గొనుచు దేవరం గొలువవచ్చువాఁడనై యున్నవాఁడననినం బ్రీతుండై లక్ష్మ ణుండు.

క.

వానిం దోడ్కొని చని యా | భూనాథునిఁ గానుపించి పొందుగఁ దత్కా
ర్యానుష్ఠానవిశేషము | దా నెఱిఁగించుటయు విభుఁడు దద్దయు నలరెన్‌.

వ.

పదంపడి కొన్ని దివసంబులకుఁ బూర్వపశ్చిమోత్తరదిక్కులకుం జనిన వనచరు లరుగుదెంచి రాఘవుం గని దేవా! సకలసాగరమేఖలావలయితం బైన భూవలయంబంతయు వెదకితిమి; దేవిం బొడగానమని చెప్పిన నతండు దుఃఖితుండయి, దక్షిణదిశకుఁబోయిన వానరులవలన వైదేహితెఱం గెఱుంగుదు నను నాసం జేసి ప్రాణంబులు ధరియించి యుండె; నంత వెండియు నొక్కమాసంబు సెల్లినఁ గొందఱువనచరులు పఱతెంచి సుగ్రీవుం గని యి ట్లనిరి.

సీ.

నీవును వాలియు నేఁడును నాఁడునుఁ | బ్రియమునఁ బాటించు పెద్దతోఁట
మధువనం బదె నేఁడు మనయంగదుండును | హనుమంతుఁడును మొదలైనవారు
బలువిడిఁ జూఱాడి ఫలము లానెదరు త | ద్రక్షకు లగు మమ్ము రయము మీఱ
భంగించిరనవుడు భానునందనుఁ డాత్మ | ‘నంగదప్రముఖులు యామ్యదిశకుఁ

తే.

జనినవారలు గావున జనకపుత్త్రిఁ | గనిన యుబ్బిది గాఁబోలుఁ గాక; యిట్లు
సేయ వెఱవరె? పతికార్యసిద్ధి సలుపు | జనుల కీ చన వెందును జనున కాదె!

వ.

అని యూహించి తత్ప్రకారంబు రఘుపతికిం జెప్పె; నంత.

ఉ.

తేనెలు గ్రోలి క్రోలి కడుఁదియ్యని కమ్మనిపండు లింపు సొం
పానఁగ నాని యాని పరపందిన నీడలు మెచ్చి మెచ్చి మం
దానిలశైత్యసౌరభసమగ్రతకుం గడుఁ జొక్కి చొక్కి యు
ద్యానమునందు మారుతసుతప్రముఖుల్‌ విహరించి తృప్తులై.

వ.

అందఱుం గూడుకొని చని సుగ్రీవలక్ష్మణసహితుండై యున్న జననాథుం గని దండప్రణామంబులు సేసినం గాకుత్‌స్థకులప్రదీపకుండు వారల ముఖవర్ణవిశేషంబు లుపలక్షించి సీతం గనినవార కా నిశ్చయించె; నప్పు డత్యంతమతిమంతుం డయిన హనుమంతుండు రాఘవునకుఁ గృతాంజలి యై యిట్లనియె.

క.

దేవిఁ బొడగంటి నేను ధ | రావల్లభ! శైలసరిదరణ్యనగరపా
రావారకలిత మగు వసు | ధా వలయము వెదకి వెదకి దక్షిణపుదిశన్‌.

హనుమంతుఁడు రామునితో సీతం జూచిన వృత్తాంతంబు సెప్పుట

తే.

అవధరింపుము దేవ! మే మందఱము న | నేకముఖమునఁ దొలి తొలి యిందు నందు
నరయుచును బోయి యొక్కెడ నతివిశాల | మైన భూవివరముఁ గంటి మద్భుతముగ.

వ.

కని దానిం బ్రవేశించి, నిరంతరతిమిరసంవృతంబును, బహుకీటసంకులంబును నైన మార్గంబున ననేకయోజనంబులు సనునెడ ముందట నర్కప్రకాశం బైన పురంబు గానంబడియె; నందొక్కతాపసాంగన యుండి మమ్ము నాదరించి, తనపేరు ప్రభావతి యనియును, నప్పురంబు మయునిపురం బనియునుం జెప్పి, మధురంబు లయిన భక్ష్యభోజ్యంబు లొసంగినం దృప్తులమై తదుపదిష్టమార్గంన మహీవివరంబు నిర్గమించి సహ్యదర్దురశైలంబులు గడచి మలయశైలశిఖరం బెక్కి.

స్రగ్ధర

లీలం గల్లోలమాలోల్లిఖితగగనమై, లీననానాకుళీర
వ్యాలోగ్రగాహమీనావళుల నెసఁగి, దుర్వారవారోఘగంభీ
రాలంఘ్యప్రౌఢవేగం బగుచు బహుతరాయామవిస్తారమై బి
ట్టాలోకింపంగ నుగ్రం బగు జలనిధి నంతంతటం గంటి మంతన్‌.

క.

కని, యిది రత్నాకర; మి | వ్వననిధిసీమమునఁ గల్గు వసుమతిలోనన్‌
జనకసుత వెదకి కానమ; | చన దివ్వారాశి దాఁటి చన నెవ్వరికిన్‌.

ఉ.

భూమితనూజఁ గాన మని పోయి రఘూద్వహుతోడఁ జెప్పి,
బ్భూమిపుచిత్త మాతురతఁ బొందఁగఁ జేయుటకంటెఁ, జూడఁగా
నీమెయిఁ జావు మేలు; మన కేల విచారము లింక?’నంచు నం
దేము గడంగి యందఱము నేకతమం బగు నిశ్చయంబుతోన్‌.

వ.

అనశనవ్రతంబు సంకల్పించి నియతచిత్తుల మై యుండి రాఘవుకార్యార్థంబై తెగిన జటాయువు గృతార్థుం డయ్యె; మనము నట్టి పుణ్యలోకంబు వడయుదమని పలుకుచున్నయెడ.

క.

గిరిశృంగతుంగవిగ్రహుఁ | డురుతరసత్త్వుఁడు విహంగమోత్తముఁ డం దొ
క్కరుఁ డొయ్యన మా యున్నెడ | కరుదుగఁ జనుదెంచి విగళితాశ్రుం డగుచున్‌.

సీ.

అయ్యలార! జటాయు వని పల్కెదరు మీర | లెవ్వరు? సెప్పరే! యేను వాని
కగ్రజుండ; ననూరునాత్మజన్ముల మేము; | సంపాతి నాపేరు; సమ్మదమున
నేనును దమ్ముఁడు నినమండలమునకుఁ | జనువేడ్క నొకనాఁడు చదల నెగసి
చనఁ జనఁ దీవ్రాంశుసంతాపమునఁ జేసి | కమరె నా ఱెక్కలు; గమర వయ్యె

తే.

ననుజుపక్షమ్ము; లే నిమ్మహాచలమున | నాఁటఁగోలె నెచ్చటికిఁ జనంగ నేర
కున్నవాఁడ; నాతమ్ముఁ డెట్లున్నవాఁడొ? | యెఱుఁగ నెఱిఁగింపరే నాకు నిష్ట మెసఁగ.

వ.

అనిన నే మతనికి భవదీయవృత్తాంతంబును, రావణుండు దేవిం గొనిపోవుటయుఁ, దదర్థంబై రావణునితో జటాయువు సమరంబు సేసి యీల్గుటయుఁ జెప్పిన విని దుఃఖితుండై సంపాతి యస్మదీయ ప్రవర్తనం బేర్పడ నడిగి మా కిట్లనియె.

ఉ.

రావణు నే నెఱుంగుదుఁ; బరాక్రమదుస్సహుఁ డన్నిశాచరుం;
డీవనరాశిమధ్యమున నిచ్చటికిన్‌ శతయోజనంబులన్‌
భూవిదితంబు లంక యను ప్రోలు తదీయనివాస; మచ్చటన్‌
భూవరుదేవిఁ గాన నగుఁ బొం; డరయుండు కృతప్రయత్నులై.

క.

అని యతఁడు సనిన నందఱ | మును సాగరతరణకార్యమునకు నుపాయం
బొనరఁ దలపోయునెడ నే | నని యుత్సాహంబు సేయఁ డయ్యె నొకండున్‌.

మ.

జననాథోత్తమ! యేను బూని భవదాజ్ఞాలీల చెల్వంబు మ
జ్జనకుం డైన సమీరదేవుకృపయున్‌ సత్త్వోన్నతుం జేయఁగా
ఘనవాస్తుంగతరంగసంగతమహాగ్రాహోరగాత్యుగ్రద
ర్శనమై పేర్చు పయోధి దాఁటితి జనాశ్చర్యైకసంపాదినై.

ఉ.

ఆ లవణాబ్ధిమధ్యమునయందుఁ ద్రికూటనగంబుమీఁద ను
త్తాలవిశాలహేమమణిధామసముజ్జ్వల మైన లంక యన్‌
ప్రో లొగిఁ గంటి; నెంతయు నపూర్వము దద్విభవంబు; దేవ! య
చ్చో లలితాంగి నారయుచుఁ జొచ్చి యనేకవిధంబులం దగన్‌.

వ.

అరసి యొక్కెడ రావణాంతఃపురం బైన యశోకవనంబునందు.

సీ.

కన్నీరు జడిగొని క్రమ్మఁ బ్రాఁ కెక్కిన | కమ్రకపోలభాగములు గలిగి
యవశమై యొఱఁగిన యంగవల్లిక పొంత | నున్న భూమీరుహం బూఁత గాఁగ
వెడలు నిట్టూర్పులవేఁడిమిఁ బగిలిన | యధరపల్లవము గారాకుఁ బోలఁ
దలఁపులసందడి దందడించిన తాల్మి | గదిరి శిరఃకంపగతుల బెరయ

ఆ.

నున్న పుణ్యమూర్తి నుత్తమసౌందర్య | నవనతాస్య నార్త యైన దానిఁ
గని విదేహతనయఁ గా నెఱింగితి నేను | హా! రఘుప్రవీర! యనుచు నడల.

క.

వినయమున దేవిఁ జేరం | జని యభివాదనము సేసి జానకి రఘునం
దనుదూత నేను మారుత | తనయుఁడ వానరుఁడ నిన్నుఁ దడవ నిచటికిన్‌.

వ.

అరుగుదెంచితి; రామలక్ష్మణు లత్యంతకుశలంబున నున్నవారు; వానరేశ్వరుం డయిన సుగ్రీవుండు వారితో సఖ్యంబు సేసి, తత్కార్యంబు దీర్పం బూనె; నింక మసలక నీహృదయేశ్వరుండు సనుదెంచు; నూఱడిల్లుము.

క.

రక్కసుఁడఁ గాను జుమ్మీ! | నిక్కము వానరుఁడ నేను; నీమదిలోనం
దక్కు మనుమానమనవుఁడు | నొక్కింత దలంచికొని సముత్సుక యగుచున్‌.

వ.

అద్దేవి నా కిట్లనియె; ‘నన్నా! ని న్నెఱింగితి; నది యెట్లనిన రామహితాన్వేషి యగువాఁ డవింధ్యుం డను వృద్ధరాక్షసుండు మున్న యింతయుం ద్రిజటచేత నా కెఱింగించె; నతని పలుకులు దప్పవు; రాఘవుండు సుగ్రీవసహాయుం డయి యునికి గలిగెం గావున నింకఁ దడయక యవ్వీరవరుం దోడ్కొని వచ్చి నాకుం బ్రియంబు సేయుము; నీకుఁ గార్యసిద్ధి యయ్యెడు; మరుగుమని తనశిరోభూషణం బయిన యీ రత్నంబు మీకు నభిజ్ఞానార్థంబుగా నాచేతి కిచ్చి, మఱియుఁ జిత్రకూటచరితం బైన కృతకవాయసకథయునుం జెప్పి వీడ్కొల్పిన, నేను లంకాపురదాహంబుసేసి, యిట దేవర కింతయు విన్నవింపవచ్చితినని చెప్పి హనుమంతుండు జానకి హృదయంబు మూర్తిమంతం బైన పగిది నున్న యమ్మహామణి రాజచూడామణికి సమర్పించిన.

ఆ.

అమ్మనోజ్ఞరత్న మక్కునఁ గదియించి | పులక లెగయఁ గొంతప్రొద్దు విభుఁడు
జానకీకుచాగ్రసంగమసుప్తుఁ డై | నట్ల యుండె ముకుళితాక్షుఁ డగుచు.

వ.

ఇట్లు రాఘవుండు సీతావృత్తాంతంబు విని తత్సమాగమకుతూహలవ్యగ్రుండై, సుగ్రీవుం జూచి దండయాత్ర కాయితంబు సేయుమనినఁ బ్రసాదంబని యతండు నలుదిక్కులం గల వానరనాయకులం బిలువం బంచిన.

వానరవీరులు నానాదేశంబులనుండి సుగ్రీవునొద్దకు వచ్చుట

క.

శతకోటిద్వయహరిపరి | వృతులై చనుదెంచి రతులవీరులు ధీరో
ద్ధతులు గజుఁడు గవయుఁడు వి
 | శ్రుతముగ రఘుపతికిఁ దోడు సూపిరి గడఁకన్‌.

క.

అఱువదికోటులు గపివరు | లుఱక జగత్త్రయముఁ బెలుచ నువ్వెత్తు గొనం
దఱిగొన్నయట్లు నడవఁగ
 | నెఱసి కుముదుఁ డరుగుదెంచి నృపవరుఁ గనియెన్‌.

ఉ.

కోటిసహస్రసేన తనుఁ గొల్వఁగ వానరకోటి కెల్లఁ దా
మేటి మహాబలుండు నిరమిత్త్రుఁడు మిత్త్రసహాయుఁడై తగన్‌
వీటికి నుబ్బుగాఁ జటులవేగసముచ్ఛ్రితపుచ్ఛగుచ్ఛవి
స్ఫోటితదిగ్విభాగుఁ డగుచుం జనుదెంచె సుషేణుఁ డత్తఱిన్‌.

క.

గణుతింపరాని వానర | గణములతో దధిముఖుండు కాకుత్‌స్థకులా
గ్రణికిఁ బ్రియంబుగ వచ్చె ధ
 | రణి భాగము వాహినీచరణదళితముగన్‌.

ఆ.

శతసహస్రకోటిసంఖ్యల యెలువులు | గొలువ జలదనీలఘోరమూర్తి
జాంబవంతుఁ డతులసత్త్వుఁ డేతెంచె నా
 | భూపవరునికార్యమునకుఁ బూని.

వ.

మఱియు, ననేకు లనేకసహస్రసంఖ్యల బలంబులతోడం జనుదెంచి; రిట్లు గూడిన కపివీరులు వివిధాకారు లపారబలశౌర్యసారు లతిఘోరంబుగాఁ బేర్చి నిగుడుచు, మగుడుచుం, దాఱుచుఁ బాఱుచుం, దిరుగుచు, సురుఁగుచు, మలయుచుఁ, బొలయుచు, మత్తిల్లి గిరిగుహలయందును దరువనంబులయందును, సరి దుపాంతంబులయందును నానందంబున విహరించుచుండిరి; తదనంతరంబ.

మ.

ప్రభ నొప్పారి యనుంగుఁదమ్ముఁడు మహాభాగుండు సౌమిత్రి వీ
తభయుండై కొలువం గపీంద్రబలసంతానంబుతో నుద్ధతిన్‌
శుభలగ్నంబున రాఘవుండు గదలెన్‌ సుగ్రీవసాహాయ్యసం
ప్రభవోత్సాహ మెలర్ప దర్పితరిపుప్రాలేయతిగ్మాంశుఁ డై.

ఉ.

ఆ హరివీరవాహినుల కన్నిటికిన్‌ మొగమై మరుత్సుతుం
డాహవదోహళుం డమరె నంగద నీల నలాది వీరు లు
త్సాహము మీఱ నయ్యయి దెసం దగు కావలి యై సమగ్ర స
న్నాహమహోగ్రతం జనిరి నాకవిరోధివధాభిలాషులై.

వ.

ఇట్లు నడచి యెడనెడం బ్రభూతవన్యఫలజలాశయంబు లగు ప్రదేశంబుల విడియుచుం గపిసైన్యంబు గతి పయదినంబులకు దక్షిణోదధితీరంబు సేరి రెండగు వారాశియుంబోలె ఘూర్ణిల్లుచుండె; నంత రాఘవుండు రవితనయుం జూచి యి ట్లనియె.

క.

మనబలమును నతిబహుళము | వననిధియును దుస్తరంబు వానరవర! యి
వ్వననిధిఁ గడచు నుపాయము
 | మన కొక్కటి నిశ్చయింపుమా తగుభంగిన్‌.

తే.

అని విచారించునెడ కొంద ఱధిపుఁ జూచి | ‘జడధి బలితంపుఁ దెప్పలఁ గడత మనిరి;
ఘనపుఁ గలముల సమకట్టి గడత
 మనిరి | కొంద; ఱంతయు విని రఘునందనుండు.

సీ.

అల్లన నగుచు నిట్లనియె: మీ చెప్పుటల్‌ | దగిన యుపాయంబు లగున; యయిన
నగణితం బైన యీ హరిసైన్యముల కెల్లఁ
 | గలములుఁ దెప్పలు వలయునన్ని
సమకట్టు టరయ నశక్యంబు;
 శతయోజ | నంబుల పరపైన యంబురాశిఁ
గలములఁ దెప్పలఁ గడచుచో రిపుకోటి
 | యెడరునఁ బైఁబడి పొడువకున్నె?

ఆ.

యదియుఁగాక యల్పులగు వణిగ్జనముల | యోజ శూరతతికిఁ దేజ మగునె?
కాన నాదుమతము గా దివ్విధంబు;
 నా | మనసు నిశ్చయంబు వినుఁడు మీరు.

చ.

వ్రతము ధరించి నిష్ఠ నుపవాసవిధిం గొలుతున్‌ సముద్రు; నా
కితఁడు ప్రసన్నుఁడై తెరువు నిచ్చుట యంతయుఁ గల్గెనేని మే;
లితరునిఁగా ననుం దలఁచెనేని నమానుషరోషవేగదీ
పితశరవహ్ని నిజ్జలముఁ బీల్చెదఁ బ్రేల్చెద నొక్క వ్రేల్మిడిన్‌.

రాముఁడు దర్భశయనుండై సముద్రుం బ్రార్థించుట

వ.

అని పలికి దశరథాగ్రసూనుండు దానును దమ్ముండును నుపవసించి దర్భశయను లై జలధీంద్రు నుపాసించి యున్నంత సముద్రుండు సకలజలచరప్రకరపరివారుండై రాఘవునకుం బొడసూపి యయ్యా! నీవలనఁ బ్రీతుండ నైతి; నీ కెయ్యది ప్రియంబు సేయుదుఁ? జెప్పు మనిన నతండు నాకు లంకపై నరుగం దెరు విచ్చునది; యీనినాఁడు సూర్యనిభంబులైన మదీయదివ్యాస్త్రంబుల నిన్ను శోషింపం జేయుదు ననిన విని సరిత్పతి రఘుపతి కి ట్లనియె.

 

సీ.

జననాథ! నీ కార్యమునకు నే విఘ్నంబు | గావింప నోడుదు నే విధమున;
వినుము! నా వాక్యంబు;
 జను లెల్ల నెఱుఁగ నీ | కిత్తఱి నేఁ దెరు విత్తునేని
నిల నెల్లవాఁడును విలసిత దివ్యాస్త్ర
 | బలమున సాధింపఁ దలఁచు నన్ను;
మీయందుఁ గపివీరుఁ డాయతమతి విశ్వ
 | కర్మసూనుఁడు శిల్పికర్మవిదుఁడు

 

 

ఆ.

నలుఁడు నాఁగ నొకఁడు గలఁడు; వాఁ డొలసి నా | యందుఁ దరులు గిరులు నొంద వైవ
నవి ధరింతు నేను;
 దివిరి నీ కది సేతు | వుగఁ గడంక నరిగి పగఱ గెలుము.

 

వ.

అని యతని నొడంబఱిచి సముద్రుండు సనుటయు, నమ్మహీపతి నలు రావించి సేతుబంధనంబు సేయ నియోగించిన, ననేకవానరసహస్రంబులు నలుదిక్కులకుఁ బఱచి గిరిశిఖరంబులుఁ దరునికరంబులు విఱిచి తెచ్చియిచ్చుచుండ నన్నలుండు మున్నీటి యందు శతయోజనాయామంబును దశయోజనవిస్తారంబునుంగా నతిదృఢం బగు సేతుబంధనంబు నిర్మించె నయ్యవసరంబున.

 

ఆ.

అన్నతోడ నలిగి యాప్తులుఁ దాను వి | భీషణుండు వినయభూషణుండు
నెమ్మి నరుగుదెంచి నృపశిరోమణి రాము
 | శరణుఁ జొచ్చె భక్తిభరితుఁ డగుచు.

 

క.

ఆ రాక్షసవృషభుని యా | కారము నింగితముఁ జూచి కాకుత్‌స్థకులో
ద్ధారుఁ డతని నతిధార్మికుఁ
 | గా రూపించి ముద మొప్పఁ గైకొనియెఁ దగన్‌.

 

ఉ.

వానికి దానవేంద్రువిభవంబు సమస్తము నిచ్చువాఁడు గాఁ
బూని ప్రతిజ్ఞ సేసి కృతపుణ్యుఁడు లక్ష్మణుతోడి చెల్మియున్‌
వానికి నిచ్చెఁజెచ్చెర నవారితవానరసైన్యయుక్తుఁడై
వానిఁ బురస్కరించుకొని వారిధి దాఁటె మహోగ్రలీలతోన్‌.

 

వ.

ఇట్లు సేతుమార్గంబున సాగరరోత్తరణం బాచరించి త్రికూటపర్వతం బెక్కిలంకానగరంబు చుట్టును శిబిరంబులు సంఘటింపం బంచిన.

 

క.

తాలైలాగరు సాల ర | సాల తమాలామ్ర నింబ జంబూ జంబీ
రాలంకృత లంకావన
 | జాలంబుల విడిసె వృక్షచరసైన్యంబుల్‌.

 

వ.

తదనంతరంబ రావణచారులైన శుకసారణు లనువారలు వానరాకారంబులు దాల్చి శిబిరంబునఁగ్రుమ్మరుచున్న నెఱింగి, విభీషణుం డా రాక్షసులం బట్టించి రామునకు సమర్పించిన, నతండు వారికి నిజసైన్యం బంతయుం జూప నియోగించి విడిచి పుచ్చినఁ, జని యయ్యిరువురు నమరవైరిం గని కపిసైన్యంబు దుర్జయం బనియును, రామలక్ష్మణుల తేజోమూర్తివిశేషంబులును నెఱింగించిన, నతండు దాని సరకు సేయక సమరంబునకు మోహరించి.

 

సీ.

బద్ధశిలాయంత్రబహుళమై యుత్తాలి | తాట్టాలకాభీలమై యుదగ్ర
కేతుపతాకాప్రకీర్ణమై తోమర
 | ముద్గరాలాతక ముసల శూల
శర శతఘ్నీముఖ సాధనోపేతమై
 | యుగ్రవిగ్రహధీరయోధవీర
సంకులంబై హయస్యందనవేదండ
 | చండమై సముదిత సప్తసాల

 

మై యలంఘ్యపరిఖమై తృణకాష్ఠజ | లాది వస్తుభరిత మైన లంక
కధికరక్షఁ జేసి దుర్నివార గమనోల్లాసంబునం జొచ్చి ని
శ్శంకుండై సురశత్రుసైనికసహస్రంబుల్‌ దనుం జూచి యా
శంకం బొందఁగ లీలమైఁ జని సుహృత్సంఘంబు గొల్వన్‌ నిరా
తంకుండై కొలు వున్న దైత్యుఁ గని యుద్యన్మూర్తియై యిట్లనున్‌.యప్రమాదంబున
 | నుండె రిపుజిగీష నుదితబలుఁడు.

 

ఇట రాఘవుండును సుగ్రీవసహితుండై యుండి యంగదుం జూచి నీవు రావణుపాలికిం జని యతనికిం దగినతెఱంగున బుద్ధిగాఁ జెప్పి, జానకి విడుచుట మే లని చెప్పు మని పనిచినం బని పూని యవ్వీరుండు.

 

శా.

లంకాద్వారము దుర్నివార గమనోల్లాసంబునం జొచ్చి ని
శ్శంకుండై సురశత్రుసైనికసహస్రంబుల్‌ దనుం జూచి యా
శంకం బొందఁగ లీలమైఁ జని సుహృత్సంఘంబు గొల్వన్‌ నిరా
తంకుండై కొలు వున్న దైత్యుఁ గని యుద్యన్మూర్తియై యిట్లనున్‌.


అంగదు రాయబారము

క.

ఇనకులతిలకుఁడు బాణా | సనవిద్యాగురుఁడు రామచంద్రుఁడు నీతో
నను నిట్లను మని పనిచెను; | వినుము తదీయోక్తిభంగి విస్పష్టముగన్‌.

సీ.

అనపరాధులఁ గాననాంతరమున నున్న | పేదతాపసులఁ జంపితి పలువుర
నమరుల యీలువుటాండ్రను జెఱవట్టి | యఖిలలోకములకు నలఁత సేసి;
తిదియెల్ల నొక తల; యేపుమీఱఁగ నన్నుఁ | జెనకుట యొక తల; సెప్ప నేల?
బలిమి యొప్పఁగ మంచి బంటవై వెడలుము | కయ్యంబునకు; నట్లు గాక యున్న

ఆ.

శరణుఁ జొచ్చి నాకు జానకి నొప్పింపు; | మొండు వెంట బ్రతికి యుండఁ దీఱ;
దస్మదీయశితశరాశీవిషంబుల | కెరయ నీదుప్రాణ మింత నిజము.

క.

మనుజుండ నైన నా తెఱఁ | గనుమానము వాయఁ జూడు మాహవభూమిన్‌;
విను, రాక్షసులను నామం | బును నడఁపక యేను రిత్త వోనిచ్చెదనే?’

వ.

అని పలుకుచున్న యంగదు పరుషభాషణంబులకు రోషించిన

 యసురపతి కన్నెఱింగి నలువురు రక్కసులు గ్రక్కున నవ్వాలి 

 నందనుం బొదివి పట్టిన బిట్టెగసి హర్మ్యశిఖరంబు పైకి

 దాఁటుటయుఁ, దదాక్షేపవేగంబున నన్నిశాచరులు

 ధరణీతలంబున జర్జరిత శరీరు లై పడిరి; హరివీరుం 

 డచ్చటినుండి శిబిర మధ్యంబునకు లంఘించి భూనాథునకుఁ

 దన పోయివచ్చిన తెఱంగు విన్నవించెం; దదనంతరంబ

 రాఘవు ననుమతంబున.

మత్తకోకిల

తాలసాలశిలాగ్రహస్తు లుదగ్రగోత్రమహీధరో
త్తాలదేహు లనేకవర్ణులు దారితాఖిలదిఙ్ముఖా
భీలవాలశిఖాగ్రు లుగ్రగభీరసత్త్వులు వానరుల్‌
గాలకల్పులు పేర్చి సంతనకట్టి రాహవకేళికిన్‌.

క.

పరువడి మొత్తములై బం | ధురఘోషం బెసఁగఁ బొంగి తోఁతెంచు హరీ
శ్వర బలమునందు ఘనసా | గరవీచి వికాసరేఖ గానఁగ నయ్యెన్‌.

మత్తకోకిల

కోటఁ బన్నిన ఘోరదానవకోటిఁ జుల్కనఁ దోలి య
క్కోట నల్గడలన్‌ మహోగ్రతఁ గూలఁ ద్రోచి సమున్న మ
త్కూటతోరణయంత్ర కేతన గోపురాట్టకసంహతుల్‌
వీటతాటము సేసి రక్కపివీరు లొక్కట మాత్రలోన్‌.

వ.

మఱియుఁ బ్రాకారంబుపై నున్న గదాపరిఘకుంత ప్రముఖంబులు గైకొని లంకామధ్యంబున వైవం దొడంగిన నాబాలవృద్ధం బగు పౌరలోకంబుహాహాకారవ్యాకులంబై కలంగంబడియె; నంత రావణచోదితు లైన దానవులు నానాకోటిసహస్రసంఖ్య లరిగి యెక్క డెక్కడ యని తలపడి కపిసముదయంబులం దోలి యెప్పటియట్ల ప్రాకారంబుం గైకొని నిల్చి; రప్పుడు.

క.

మును మర్కటబలములచే | ననయంబును గపిలవర్ణమైనది మగుడన్‌
దనుజబలసంవృతంబై | ఘనపటలచ్ఛాయఁ గోట కర మొప్పారెన్‌.

క.

వనచరసేనలు దెరలిన | నినవంశోత్తములు నృపతు లిద్దఱుఁ గయ్య
మ్మునకుఁ గడంగుటఁ గ్రమ్మఱ | గొనకొని కపిసేన యెల్లఁ గోటకుఁ గవిసెన్‌.

వ.

ఇట్లు గవిసినం బ్రాకారరక్షకులైన రాక్షసవీరులు వారలం జేరనీక శిలాశూలపరశుతోమరాలాతశరకుంత ప్రముఖంబులు ప్రయోగించినం గయికొనక వనచరులు వృక్షశిలాప్రకరంబులు పఱఁగించుచుం గడంగి ప్రాకారంబుఁబ్రాఁకుటయు నయ్యిరుదెఱంగులవారికిం గేశాకేశి యగు సమరం బయ్యెఁ; బదంపడి రావణుండు వనుపఁ బర్వతుండును బ్రఘసుండును ఖరుండును గ్రోధవశుండును బ్రరుజుండును నను రాక్షసు లేవురు ననేకరాక్షసపిశాచసేనాపరివృతు లయి పురంబు వెలువడి మాయ గావించి యదృశ్యాకారులై కపిసైన్యంబు నొప్పింపం దొడంగినం గని.

ఉ.

దారుణవిక్రముండు రిపుదర్పవిభేది మహాస్త్రవేది మా
యారణకోవిదుండు గడు నల్గి విభీషణుఁ డేఁగుదెంచి య
వ్వీరుల మాయయుం జలము వ్రేల్మిడిలోఁ గుదియించి వీరకే
ళీరసికుండు వారి నవలీలమెయిం దునుమాడె నందఱన్‌.

క.

ఆతని శరపాతంబుల | చేతం గడు నొచ్చి దైత్యసేన సగము ధా
త్రీతలపతితం బయ్యె; వి | భీతిఁ బఱచి పురము సొచ్చెఁ బెఱసగము వెసన్‌.

క.

అది యెల్ల విని దశాననుఁ | డుదితక్రోధుఁ డయి మంత్రియుతముగ వెడలెన్‌
మదగజ ఘోటక సైనిక | పదభర భగ్నావనీ విభాగుం డగుచున్‌.

వ.

ఇట్లు వెడలి, యభేద్యం బగు నౌశనసవ్యూహంబు సంఘటించి 

వనచరబలంబుపయి నడచినం గని, రాఘవుండును 

 బార్హస్పత్యవ్యూహంబు దీర్చి పేర్చి యెదురుకొనియె

నా సేనలు రెండు నకాండక్షుభిత సాగరయుగళంబు తెఱంగు

 దోఁప నొండొంటిం గవిసె; నప్పుడు రాముండు రావణుం

 దలపడియె, లక్ష్మణుం డింద్రజిత్తును, సుగ్రీవుండు 

విరూపాక్షునిఁ, దారుండు నిఖర్వటుం దాకి; రిట్లిరు

వాఁగునకును దేవాసురులకుం బోలె నాభీలసమరం బయ్యె; నందు.


క.

సౌమిత్రి నిశితవిశిఖ | స్తోమంబుల నసురపతిసుతుం బొదివిన సం
గ్రామమునకుఁ దొలఁగక యతఁ | డామనుజోత్తముని ముంచె నాశుగవృష్టిన్‌.

ఉత్సాహము

అమరవైరివిభుఁడు దశరథాగ్రసుతుఁడు నేపునన్‌
సమరసత్ప్రతాపకోప జాజ్వలచ్ఛరీరులై
తుములబాణపటలవృష్టిఁ దొప్పదోఁగి యిర్వురుం
దమక మేది తమక తమక తనిసి రాహవంబునన్‌.

వ.

తదనంతరంబ.

క.

ఆ రావణుండు నిజదో | స్సారమునకు రాముబాహుసారం బతి దు
ర్వారంబగు టేర్పడఁ గని | వీరారంభంబు కడఁక విడిచి రయమునన్‌.

క.

మగిడి నగరంబు సొచ్చిన | బెగడి నిశాచరబలంబు పెల్లగిలుటయున్‌
విగతభయుండు ప్రహస్తుఁడు | దగఁ గోల్తల సేసె నత్యుదగ్ర స్ఫురణన్‌.

ప్రహస్త ధూమ్రాక్షుల యుద్ధము

మ: కృతహస్తుండు ప్రహస్తుఁ డాహవకళాకేళీవిదగ్ధుండు ద
     ర్పితుఁడై తాఁకె విభీషణుం గడఁకమైఁ బెంపారి వారిద్దఱున్‌
     శితశల్యోగ్రమయూరపత్త్రవిశిఖశ్రేణీశతచ్ఛన్నులై
     ధృతి నొప్పారిరి చిత్రవారిధరపంక్తిచ్ఛన్న శైలాకృతిన్‌.

 

చ: కదిసి ప్రహస్తుఁ డార్చి పరిఘంబు రయంబున నెత్తి భీకరో
    న్మద కరిహస్త తాడనము మాడ్కి దలిర్పఁగ వ్రేసె నీసుమై
    నదయత రావణానుజుని నాతఁడు వ్రేటున కించుకంతయుం
    గదలక హేమకూటగిరికైవడి నిల్చి యుదీర్ణకోపుఁడై.

 

మ: శతఘంటాపరిభూషితంబును జగత్సంహారఘోరానలో
     త్థిత కీలాసదృశంబునై మెఱయు శక్తిం బూన్చి మంత్రించి యు
     ద్ధతతేజుండు ప్రహస్తు వైచిన వెసం దత్క్రూరసంపాత పా
     టితవక్షుం డయి కూలె వాఁడు శతకోటిచ్ఛిన్నశైలాకృతిన్‌.


 

.

వ: ఇట్లు ప్రహస్తుండు వడినం దత్సైన్యంబులు విముఖంబు

 లగుటయు, ధూమ్రాక్షుండు రోషతామ్రాక్షుం డగుచు

 నతినిబిడబలాహకానీకభీకరంబై కాఱుకొనుచున్న

 నిశాచరచక్రంబుతో నురలం బఱతెంచినం జలించి 

 బలీముఖబలంబులు దుర్బలంబులై తొలంగినం జూచి

 యాంజనేయుం డజయ్యుండై నిల్చినం బెల్చన

 యెప్పటియట్ల యూధపతులుం గూడుకొని; రప్పుడు.

 

సీ: అనిలతనూజ ధూమ్రాక్ష రక్షిత సైన్య | యుగ్మంబునకు నయ్యె నుగ్రసమర;
   మందు నిష్ఠురచరణాఘాతముల డొల్లు | నరదంబులును, శిలాహతులఁ దూలి
   యొఱలు నేనుంగులు, నుత్తాలతరుహతిఁ | ద్రెళ్లు ఘోటకములు, దీవ్రనఖర
   దంతక్షతంబుల దళితాంగులై నేలఁ | బడి తన్నికొను వీరభటులు నగుచు

 

 

 


ఆ:వె: నధిక శౌర్యసారులగు కపివీరుల
        చేత నొచ్చి దైత్యసేన భీతిఁ
        బఱచెఁ గొంత, బెండువడి యుండెఁ గొంత, ధూ
        మ్రాక్షువెనుక కొదిఁగె నంతఁ గొంత.


 

 మహాస్రగ్దర: కని ధూమ్రాక్షుండు విశ్వ | గ్రసన రయలసత్కాల మేఘంబ పోలెన్‌
                    ఘన గర్జాఘోష మొప్పం | గడఁగి శరశతాకల్పితాసారదుర్ద
                   ర్శన వీరారంభుఁడైనన్‌ | సకల హరిచమూసంఘమున్‌ విహ్వలంబై
                   చనెఁ దూలెం గూలె లావుం | జలమును జెదరన్‌ సంగడిన్‌ విచ్చె నొచ్చెన్‌

 

తే:గీ: అతనియుద్ధతి సైఁపక యనిలసూనుఁ | డనిలవేగుఁడై పఱతెంచి యార్చి తాఁకెఁ
       బ్రధన మయ్యిద్దఱకు నుగ్రభంగి నమర | పతికిఁ బ్రహ్లాదునకుఁ బోలెఁ బ్రకట మయ్యె.

 

.

 క: పరిఘంబులు గదలును బె | క్కరుదుగ రక్కసుఁడు వైచె నమ్మారుతిపై
    నురుగండశైలములు ఘన | తరువులు హరివరుఁడు గురిసె దానవుమీఁదన్‌.

 

 వ: ఇబ్భంగిం బెనంకువ సెల్లుచుండఁ గొండొక సేపునకు.

 

 స్రగ్దర: లంకాలుంటాకుఁ డుద్య | ల్లఘుతరగమనోల్లాసియై డాసి వీఁకం
         బొంకం బేపారఁ జంచ | ద్భుజరచిత మహాభూరుహం బెత్తి వైచెం
       గింకన్‌ ధూమ్రాక్షు; వాఁడుం | గెడసెను వదనోద్గీర్ణకీలాలధారా
       పంకప్రాగ్భాగమగ్నా | పఘనవిఘటితప్రాణుఁడై యాహవోర్విన్‌.

 

 వ: ఇత్తెఱంగున ధూమ్రాక్షుండు తెగినఁ గపిసైనికు లార్చి 

 హనుమంతుని ననేకభంగులం  బ్రస్తుతించుచు రజనిచరులం

 గనుకనిం దోలినం దూలి యందఱుం బఱచి పురంబు

 సొచ్చిదనుజేంద్రునకుం బ్రహస్తధూమ్రాక్షుల 

మరణప్రకారంబు లెఱింగించినఁ, బ్రకటబాష్పనిశ్వాసవివర్ణవదనుం

 డగుచుఁ బంక్తివదనుండు.

 

 క: కలవా రెల్లను మడిసిరి; | కలిగియు లేఁడయ్యెఁ గుంభకర్ణుఁడు; వీనిం
    దెలుపుదునొ? యేను గొడుకుం | జల మెడపక రిపులతోడ సరిఁ బెనఁగుదుమో?’

 

 వ: అని వితర్కించి యప్పటికిఁ గుంభకర్ణప్రబోధంబు గార్యంబుగా  నిశ్చయించి, తదీయశయ్యాగృహంబునకుం జని వానిం దెలుపం

 బరిజనంబులం బనిచిన.

 

 సీ: భేరీమృదంగగంభీరనాదంబులుఁ | గాహళఘంటికాకలకలములు,
    దారుణసింహనాదంబులు నొనరింపఁ | గడుఁ బెద్దవడికి నంగము గదల్చి
    యొదిఁగిలి కను విచ్చి హూ యని బిట్టావు | లించి కొండొక దేఱి లేచి నీల్గి
    కలయఁ జూచుటయును గట్టెదురున యున్న | యన్న నవ్వుచుఁ దన     యనుఁగుదమ్ముఁ

 

 

ఆ:వె: జూచి యనియె నిట్టి చోద్యంపునిద్రలుఁ | గలవె? యేరికిని జగంబులోన?
        నెవ్వ రేమి యైరొ యెఱుఁగవు, ధన్యుఁడ; | వీవు మనకు నైన యెడరు వినవె?


 

 వ: దశరథ నందనుం డయిన రాముండు నాచేత నపహృతభార్యుండై 

కలుషించి  యనేకవానరయూథంబులం గూర్చికొని వచ్చి వనధి 

బంధించి మనవీటిపై విడిసి, మమ్మెల్లను    నేలకుం గోలకుం

 దెచ్చుచున్నవాఁడు; ప్రహస్తాది వీరులు వానిచేతం బెక్కండ్రు

 సిక్కిరి; నీవ కాక వాని జయింప నన్యుండు శక్తుండు గాఁడు;

 కావున లెమ్ము; గ్రక్కునం బగతుపై నడచి, పొడిచి, గెలువుము;

 దూషణానుజులు వజ్రవేగ ప్రమాథులు నీకుం దోడ్పడియెద

 రనిన నట్ల కాక యని కుంభకర్ణుండు విహితపరికరబంధుండై

 సమరసన్నద్ధులయిన పరిజనంబుల తోడం గూడి వెల్వడి నడతెంచిన.

 

కుంభకర్ణుండు యుద్ధము సేయుట

లయగ్రాహి

దారుణదవానల శిఖారుణ శిరోరుహు, | భీరఘనకర్బురశరీరుఁ, బటురోష
క్రూరనయనాంతగళితోరుతరవహ్నికణ | ఘోరముఖు, దంతవలయారభసదంశో
ద్గారి రుధిరాధరు, నుదారభుజసారణ వి | దూరితదిగంతుఁ, బదభారవినమద్భూ
భారుఁ, ద్రిజగద్విజయభూరిబలు, నద్దనుజ | వీరుఁ గని రచ్చెరువు గూరఁ గపివీరుల్‌.

క.

రక్కసుఁడును దనమదిలో | నక్కపివీరులను జీరికైనఁ గొనక పే
రుక్కున రఘుకులవీరుల | దిక్కునకుం గవియుదెంచెఁ దీవ్రస్ఫురణన్‌.

మ.

వడి నడ్డం బరికట్టె నెట్టన హరివ్రాతంబు పెన్‌మ్రాఁకులం
బిడుగుల్వోని మహోద్ధతాశ్మముల నాభీలంబుగా దైత్యు బి
ట్టడువన్‌ వైవఁగఁజొచ్చెఁ గొందఱు బలంబారంగ వే డాసి దం
దడి తత్కాయము సించి రుగ్రనఖదంతన్యాససంక్రీడలన్‌.

ఉ.

కన్నుల నిద్ర దేఱఁగ నకంపితుఁ డై యతఁ డెంత సేసినం
దన్ను నెఱుంగ కొక్కమొగిఁ దత్కపిసైన్యచయంబుఁ బోర బే
రన్నున మ్రింగఁ జొచ్చె విలయాగమసంభృతదర్పరోషవే
గోన్నతలీలఁ గాలుఁడు జనోత్కరమున్‌ గ్రసియించుచాడ్పునన్‌.

వ.

ఇట్లు బల చండబల వజ్రబాహులు లోనుగాఁ బెక్కండ్ర యూథపతులను బహుసహస్రసంఖ్యల వానరయూథంబును మ్రింగియు గొదగొని వచ్చుచున్న యన్నిశాచరుని మార్కొన నోడి తారప్రముఖు లైన బలీముఖులు నలువంకలం జెదరి పఱచిన.

మ.

కని సుగ్రీవుఁడు బిట్టదల్చుచును వేగంబార దైత్యేంద్రు మా
ర్కొని సాలంబున వాని యౌఁదలఁ గడున్‌ ఘోరంబుగాఁ బూన్చి వ్రే
సిన నా వ్రేటున నిద్రదేఱి కడఁకం జేదోయి సారించి య
మ్మనుజాశుండు గపీంద్రుఁ బట్టె రభసోన్మాదంబుమై నార్చుచున్‌.

క.

పట్టువడిన సుగ్రీవునిఁ | గట్టెదురం గాంచి యధికకలుషిత మతియై
దట్టుఁడు లక్ష్మణుఁ డసురన్‌ | బిట్టేసెన్‌ బిడుగుఁ బోని పృథుబాణమునన్‌.

సీ.

ఉరమాడి యాశరం బుచ్చిపోవుటయును, | గడు నొచ్చి యా కుంభకర్ణుఁ డలిగి,
వెస వాలితమ్ముని విడిచి తోరపుశిలఁ | గొనుచు నుక్కున రాముకూర్మితమ్ము
దెసఁ బాఱుతెంచిన, ధీరుండు సౌమిత్రి | భల్లయుగ్మమునఁ దద్బాహు యుగము
నఱక, మాయాబలోన్నతుఁడు దైత్యుఁడు చతు | ర్బాహుఁడై తోఁచిన, భానుకులుఁడు

ఆ.

చేతు లెల్లఁ దునిమె శితభల్లముల; వాఁడు | మఱియనేకహస్తమస్తకాంఘ్రి
భాగుఁ డైనఁ గినిసి బ్రహ్మాస్త్ర మేసినఁ | గూలె నసుర కొండ గూలినట్లు.

వ.

ఇట్లు కుంభకర్ణుండు దెగటారినం జూచి దూషణానుజులు వజ్రవేగుండును, బ్రమాథియు రాఘవానుజుం దలపడి నిబిడబాణౌఘనిర్మగ్నుం జేయుటయు, నతండును వారి నతిబహుళశరజాలంబులం బొదివినఁ గయ్యం బొక్క ముహూర్తంబు చూపఱకు రోమహర్షణంబై చెల్లెఁ; దదనంతరంబ.

చ.

అనిలసుతుండు నీలుఁడు రయం బెసఁగం బఱతెంచి యమ్మహా
దనుజులమీఁద నేపున నుదగ్రనగాగ్రయుగంబుఁ బూన్చి వై
చినఁ గడు రూపఱం జదిసి చెప్పఁగఁ జూపఁగ లేక పోయి ర
ద్దనుజులు వానరోత్కరముఁ దద్దయు నుబ్బున నార్చె నత్తరిన్‌.

క.

ఆకులపడి నలుదెసలం | గాకులక్రియఁ జెదరి కడు వెగడుపడి రక్షో
నీకములు లంక యెనిమిది | వాకిళ్లను దూఱెఁ బౌరవర్గము దలఁకన్‌.

క.

అంతఁ దనకూర్మితమ్ముం | డంతకుఁ గూడుటయు, దూషణానుజమృతి వృ
త్తాంతంబును విని యెంతయు | వంతఁ దలరి యఱచెఁ బంక్తివదనుఁ డవశుఁడై.

వ.

అయ్యవసరంబున నాముక్తకవచుండును, నాబద్ధతూణీరుండును, బ్రచండకోదండుండును, గృపాణబాణాసనాది వివిధ సాధనోపేత సన్నిహిత స్యందనుండును, బురందర హృదయ సాగర మందరుండును నైన మేఘనాదుండు తండ్రిం జేరం జనుదెంచి, వినయంబున నిట్లనియె.

చ.

వగవఁగ నేల దైత్యకులవల్లభ! యేఁ గలుగంగ నెమ్మెయిన్‌
జగముల నీదుశత్రులకు శౌర్యము సెల్లునె? వృత్రవైరిలో
నగు సురకోటి యే పడఁచి యప్రతిమోన్నతి నున్న నీకుఁ గ్రోఁ
తి గముల నోర్చు టెంతపని దేవ! ననున్‌ గృపఁ బంపు మాజికిన్‌.

ఉ.

కూడిన కొండమ్రుచ్చులను గ్రోఁతుల నుగ్రత ముట్టి కిన్కఁ జెం
డాడెద; నుజ్జ్వలోగ్రవివిధాంబకచుంబితదిఙ్ముఖుండ నై
యాడెద వీరనృత్యము; రయంబునఁ బార్థివసూమ లిద్దఱం
గ్రీడయపోలెఁ గిట్టి పెడకేలుగఁ గట్టెదఁ, బట్టి తెచ్చెదన్‌.

వ.

అనినఁ దెలివొంది మందోదరీసుందరుండు ప్రియనందనున కి ట్లనియె.

సీ.

నీ పరాక్రమలీల నిక్కమే నెఱుఁగనే | పుత్త్ర! నీ భుజబలస్ఫురణమునన
కాదె నా కిట్టి విఖ్యాతియు సిరియును | గలిగె; గీర్వాణసంఘంబుతోడఁ
గూడ నయ్యింద్రునిఁ గొనివచ్చి నా బంటుఁ | గా నొనరింపవే గర్వ మెసఁగ;
మాయావిదుండవు మహితదివ్యాస్త్రవి | శారదుండవు నీవు; సంగరమునఁ

ఆ.

బగతు రెల్ల వెఱఁగుపడఁగ దృశ్యాదృశ్య | దుర్నిరూపభంగిఁ దొడరి చిక్కు
వఱుచు నీ మహోగ్రబాణ పాతంబులు | దశరథాత్మజులకుఁ దరమె యోర్వ?

ఆ.

నిఖిలశత్రుచయము నిశ్శేషముగఁ జంపి | యనఘ! సమరనిహతు లైన యస్మ
దీయ జనులఋణము దీర్పుము; మసలక | పోయి రమ్ము; పోరఁ బొడిచి గెలుము’.

వ.

అని కౌఁగిలించుకొని వీడుకొల్పిన నింద్రజిత్తు సత్వరుండై యరదం బెక్కి లంకాపురంబు వెలువడినం గని వనచరానీకంబు లార్చుచు నెదురు నడచుటయు, నతండు వారి నించుకయు సరకుగొనక కరతలం బెత్తి లక్ష్మణునిం బిలిచిన.


ఇంద్రజిత్తు లక్ష్మణునితోడ యుద్ధము సేయుట

క.

విని యాతండును మౌర్వీ | నినదంబున గగనధారుణీమధ్యం బె
ల్లను మ్రోయ మత్తగజముం | గనిన మృగేంద్రుండపోలెఁ గడఁగెం బెలుచన్‌.

వ.

అంత.

ఉ.

జైత్రులు గోత్రభూమిధరసారులు సాగరధీరు లుల్లస
చ్చిత్ర ధనుఃకళావిదు లజేయులు భూరిజయార్థు లప్డు సౌ
మిత్రియు మేఘనాదుఁడు నమిత్రవిభేదులు దాఁకి రార్చి లో
కత్రయ భీకరప్రథనకౌతుక వేగిత చిత్తవృత్తులై.

క.

మచ్చరము మీఱ నొండొరుఁ | జిచ్చఱ పిడుగులను బోని శితవిశిఖములం
జెచ్చెర నొంపఁగ విలు నే | ర్పచ్చటఁ దుల్యంబు లయ్యె నయ్యిరువురకున్‌.

క.

తనకంటె నపుడు రావణ | తనయుం డని మీఱఁ జూచుఁ, దా నాతనికం
టెను మున్న రాఘవానుజుఁ | డనుపమశరలీల నతిశయంబుగ మెఱయున్‌.

క.

అంతఁ బటుతోమరంబుల | నెంతయు వెస నృపతనూజు నింద్రజి వైవన్‌
సంతతశరముల నన్నిటి | నింతింతలు శకలములుగ నేసె నతండున

వ: అట్టియెడ నంగదుండు గడంగి లక్ష్మణునకుం దలకడచి 

యమందవేగంబున మందోదరీనందనుం గదిసి 

ఘనమహీరుహంబునఁ దన్మస్తకంబు వ్రేసినఁ, జలింపక

 నిలింపవైరి నిశితప్రాసంబు వాసవపౌత్త్రుం జంప నెత్తుటయు,

 లక్ష్మణుండు దానిం దునియ నేసిన, నయ్యసురయు 

గదాదండంబుఁదీర్చి యంగదువక్షంబు వ్రేసినం, దొలంగక

 చెలంగి వాలిసూనుండు సాలవృక్షంబున నా రాక్షసురథంబు

 రథ్యసారథి సహితంబుగాఁ జదియనడిచె; నట్లు విరథుండయి

 యచ్చోటన యంతర్ధానంబు నొంది గగనగతుండయ్యెఁ; బదంపడి.


.

 

క.

ఎవ్వలన నుఱుకునో యతఁ | డెవ్వరి నెటు సేయునొక్కొయిందనుచుఁ గడున్‌
నివ్వెఱపడి కపిసేనలు | గ్రొవ్వుసెడం బంక్తివదనుకొడు కుద్ధతుఁడై.

చ.

ఉఱుముచు నంత్యకాలచలితోగ్రబలాహకలీల దోఁపఁగాఁ
దఱచగు ఘోరపుంబిడుగుతండము వోని శరప్రతాన ము
క్కఱఁ దొరఁగించుచుం గపిబలావళిఁ ద్రుంచి కలంచె నేపునన్‌
నెఱఁకులు నొంచి బాణమయనీరధి ముంచె రఘుప్రవీరులన్‌.

క.

మాయాధికు నంతర్హిత | కాయుఁ బురందరవిరోధిఁ గాకుత్‌స్థులు క్రో
ధాయత్తు లగుచు నేసిరి | ధీయుక్తులు శబ్దభేదిదివ్యాస్త్రములన్‌.


వ.

వానికి నలిగి సుగ్రీవాది వానరులు వృక్షశిలాప్రకరంబులు గైకొని యాకసంబున కెగసిన

 నద్దానవుండు వారి నందఱ వెఱచఱవ నేయుటయుఁజేవ సెడి మగుడి పుడమి కెఱఁగిరి;

వాఁడంత నిలువక వాఁడి తూపులు వఱపి రామలక్ష్మణులఁ గరంబు నొప్పించినం

 జెయ్వేది యయ్యన్నయుం దమ్ముండును గపిబలంబు లడల ధరణీతలంబునకు

 నొరగి విలయకాలపతితు లైన సూర్యేందుల చందంబున నున్నంగని సింహనాదంబుసేసి.


మ.

పరమోదాత్తులఁ బార్థివోత్తముల శుంభద్విక్రమారంభులన్‌
సురసంకాశులఁ గోసలప్రభుల నస్తోకప్రభోద్దాములన్‌
వరలాభోన్నతుఁ డన్నిశాచరుఁడు గర్వం బొప్ప దుర్వార ని
ర్భరనాగాస్త్రములం దదాహవమహిన్‌ బంధించె నయ్యిద్దఱన్‌.


వ.

తదవసరంబున సుగ్రీవసుషేణ జాంబవత్ప్రముఖు లైన కపివీరులు రామలక్ష్మణు 

లున్నయెడకుం జనుదెంచి, యెయ్యదియునుం జేయునది నేరక దుఃఖితు లగుచుండ

 నవ్విభీషణుండు వారి నాశ్వాసించి, బ్రహ్మాస్త్ర ప్రయోగంబున నారాజకుమారులకు

 బంధమోక్షంబు గావించె; సుగ్రీవుండు విశల్యకరణి యను నౌషధంబున వారల

 విశల్యదేహులఁ జేసె; నిట్లు ప్రబుద్ధులై రాఘవులు గ్రమ్మఱఁ గయ్యంబునకుం గడంగి;

రప్పుడు రావణానుజుండు రామునకుఁ గృతాంజలి యై యి ట్లనియె.


సీ.

నరనాథ! కిన్నరనాథుని పనుపున | శ్వేతుండు నాఁగఁ బ్రసిద్ధుఁ డైన
గుహ్యకుఁ డిదె మీకుఁ గొనివచ్చె దివ్యతో | యంబు; లీ జలముల నంబుజాక్ష!
నయనపద్మక్షాళనము సేయుఁ; డిప్పు డ | దృశ్యభూతము లెల్లఁ దెల్లముగను
గానఁగఁ బడునన్నఁ గైకొని రాఘవుం | డనుజసహాయసమన్వితముగ

ఆ.

నట్ల చేసి, కనియె నంబరమధ్య సం | చారుఁ గృతవిపక్షసంప్రహారు
నింద్రజాలశీలు నింద్రవిద్రావణు | రావణాగ్రతనయు రహితవినయు.


వ.

ఆ రక్కసుండునుందన చేసిన పౌరుషంబు ప్రతిహతంబగుటకు విస్మయం బంది,

మగుడి హోమకార్యంబునకుం బోవం దొడంగిన నెఱింగి, విభీషణుండు లక్ష్మణుం 

జూచియన్నీచునకు హోమసమాప్తి యయ్యె నేని నెవ్వరికిం గెలువ నశక్యంబు

వీని వెన్నడిం దగిలి తెగటార్పుమనిన నతండు.


ఆ.

ఆర్చి వెనుకఁ దగిలి యశనికల్పము లైన | శరము లేయుటయు, నిశాటవరుఁడు
గినిసి వడి నెదిర్చి కీలించె లక్ష్మణు | నంగకముల నుజ్జ్వలాంబకములు.


వ.

ఇట్లు దలపడి యవ్వీరు లిరువురు నిశాచరవనచరబలంబులు రణం బుడిగి 

వెఱఁగుపడి తమపోరు సూచుచుండ నుద్దండవేదండ యుగళంబు పోలిక 

నాభీలశార్దూలద్వయంబు కరణి నసహ్యసింహ యమళంబు 

కైవడి నతిఘోరయుద్ధంబు సేయం దొడంగి; రంత.


క.

వడి నొక్కపెట్ట లక్ష్మణుఁ | డడరించె నిశాతశరము లా రక్కసుపైఁ
గడఁగి యతఁడు నాతనిపై | నెడపక నాటించెఁ గలయ నెనిమిది యమ్ముల్‌.

ఆ.

వాఁడితూపు లొడల వడి నాటుటయు నొచ్చి | తోన కలుషరోషధూమకేతుఁ
డతిశయిల్ల రాఘవానుజుం డురుచాప | శింజినీరవంబు సెలఁగఁ గవిసి.

 

    ఇంద్రజిత్తు లక్ష్మణునిచేతఁ జచ్చుట

మ.

శితభల్లద్వితయంబునం గడువెసం జేదోయి ఖండించి ఖం
డితగోత్రాచలతుంగశృంగశతకోటిస్ఫారఘోరానల
ద్యుతిసాంద్రం బగు శాతభల్ల మొకటం ద్రుంచెం గనత్కుండలా
న్వితమై యొప్పు నిశాచరేంద్రుశిరమున్‌ వీరక్రియాదక్షుఁడై.

ఆ.

భగ్నశాఖ మైన పాదపంబును బోలె | నిట్లు సంగరమున నింద్రజిత్తు
పడినఁ జూచి దైత్యబలములు భయమంది | పఱచెఁ; జెలఁగి యార్చెఁ బ్లవగబలము.

క.

తనయునిమరణం బేర్పడ | విని దశకంధరుఁడు శోకవివశుం డై బో
రన బాష్పము లొలుకఁగ హా! | యనుచుం బదినోళ్ళుఁ దెఱచి యఱచెం బెలుచన్‌.

క.

శోకంబు సైఁప లేక య | శోకవనంబునకు నరిగి సురశత్రుఁడు రో
షాకులుఁడై జానకిఁ బు | ణ్యాకారం జంపఁ జంద్రహాసము వెఱికెన్‌.


వ.

అప్పుడు వయోవినయవృద్ధుం డయిన యవింధ్యుం డతని వారించి, యిట్లనియె.


చ.

ఇది తగునే దశానన! మహేంద్రుఁడు లోనగు దేవతాతతిం
గదనములో జయించి త్రిజగంబులఁ బేర్కొనియున్న నీకు ని
మ్ముదిత వధింతు నంట గడుమోసము గాదొకొ! యోపుదేని నే
పొదవఁగ రాఘవున్‌ గెలువు; ముగ్మలిఁ జంపినఁ బెంపు గల్గునే?’


వ.

అనినం దద్వచనంబుల నుపశమితకోధుండై దోషాచరేశ్వరుండు 

 సమరసన్నాహం బమర రథం బెక్కిమిక్కిలి బీరంబు సొంపార 

నఖిలసేనాసహితంబుగాఁ బురంబు వెల్వడి నడతెంచె; నంత.


శా.

సుగ్రీవాదిసమస్తవానరులుఁ బ్రస్ఫూర్జన్మహావిగ్రహ
వ్యగ్రాకారతఁ బేర్చి భూరుహశిలావ్రాతంబులం దాల్చి వా
లాగ్రవ్యాచలనంబు లొప్ప దశకంఠాగ్రేసరోదగ్ర దై
త్యగ్రామంబు నెదిర్చినన్‌ సమర మత్యంతోగ్ర మయ్యెన్‌ వడిన్‌.


వ.

ఆ సమయంబున నఖిలమాయాకుశలుం డైన దశముఖుండు మాయ గావించిన.


క.

ఆ రావణుదేహంబున | ఘోరగదాశక్తిఖడ్గ కోదండధరుల్‌
వీరులు సహస్రసంఖ్యల | వారలు జనియించి రసురవరు లుద్ధతులై.


వ.

వారి నందఱఁ గౌసల్యానందనుండు సాంద్రశరజాలంబుల నవలీలం దునిమి

 తూఁటాడిన నమ్మేటి రక్కసుండు మఱియు నొక్కమాయ ప్రయోగించి

 రామలక్ష్మణ ప్రతిరూపంబు లనేకంబు లుత్పాదించుటయు, నయ్యన్నయుం

 దమ్ముండును వెఱఁగు పడియునుం జిడిముడివడక 

యమ్మాయారూపంబు లన్నియుం దునిమి, తదనంతరంబ.


చ.

అభినవభానుబింబరుచిరాకృతియున్‌ హరియుక్తమున్‌ మహా
రభసదురాసదంబును విరాజితకేతన వైజయంతికా
ప్రభయును నైన తేరు సురపాలకుపంపునఁ జేసి రాఘవ
ప్రభునకుఁ దెచ్చి మాతలి సభక్తికుఁడై ప్రియమొప్ప నిట్లనున్‌.

మ.

ధరణీనాథ! సురేంద్రుతే రిది; మహాదైత్యేంద్రులం దొల్లి యీ
యరదం బెక్కి యనేకులం దునిమె జంభారాతి ఘోరాజి; నీ
యరదం బెక్కివధింపు నీవును మదీయస్ఫార సారథ్య ని
ర్భరభంగిన్‌ దశకంధరుం ద్రిభువనీభంగోన్నమత్కంధరున్‌.

మ.

అనినన్‌ మాతలి నాదరించి యరదం బా రాఘవుం డెక్కియు
క్కున మీఱెన్‌ రిపుకోటిమీఁద విలసత్కోదండమౌర్వీమహా
స్వనభిన్నాఖిలదిగ్విభాగుఁ డగుచున్‌ శాతాస్త్రధారాభిషే
చనపూతప్రతిపక్షసైన్యుఁ డగుచున్‌ సంరంభదుర్వారతన్‌.

ఉ.

అత్తఱి రావణుండు విలయానలదుస్సహమూర్తియై నరేం
ద్రోత్తముమీఁదఁ దేరు గడు నుగ్రగతిం బఱపించి సంతతో
ద్వృత్తశరప్రవాహపరివీతదిశాముఖుఁ డైనఁ జూచి పే
రుత్తలమంది రాతనిసముద్ధతికిన్‌ దివినుండి నిర్జరుల్‌.


వ.

ఇట్లు దలపడి రామరావణు లతిఘోరంబుగాఁ బోరం దొడంగి; రంతఁ

 బంక్తివదనుండు నిబిడజ్వాలాకరాళం బగు శూలంబు రాఘవుమీఁదం

 బ్రయోగించిన, నతండును నడుమన దానిఁ దునియలు సేసిన, నీసునం

 బెరిఁగి సురవైరి మఱియునుం దరతరంబ శతసహస్రసంఖ్యల శూలంబులు

 భిండివాలంబులుఁదోమరంబులు శరంబులుం బఱఁగించి యంబరంబెల్ల

 నస్త్రమయంబుఁ గావించిన నఖిలభూతంబులును హాహాకారవ్యాకులంబు లయ్యె

నసురసైన్యంబున భేరీప్రముఖతూర్యనినదంబులు సింహనాదంబులు సెలంగెఁ;

గొండొకసేపునకు రావణప్రయుక్తం బయిన శస్త్రాస్త్రదహనం బంతయు

 నిరంతరవిశిఖధారాసారంబునం గబళించి రామజలధరంబు గంభీరసారంబునం

 బొదలుటయు సకలప్లవంగసముదయంబును బ్రహర్ష కోలాహలబహుళం బయ్యెఁ; బదంపడి.

శ్రీరాముఁడు రావణాసురుని సంహరించుట

సీ.

కమనీయకనకపుంఖప్రభాభాసియుఁ | దీక్ష మ్ణుఖంబును దివిజయక్ష
మునిసిద్ధసాధ్యసమ్మోదావహంబు నై | విలసిల్లు బాణ మవ్వీరవరుఁడు
గైకొని బ్రహ్మాస్త్రకలితమంత్రాభియు | క్తంబుగా నొనరించి కార్ముకమున
సంధించి జగములు జయపెట్టఁ జెచ్చెరఁ | దివిచి యేయుటయును దీవ్రభంగిఁ

 

ఆ.

గడఁగి యాశరంబు గల్పాంతవహ్నియ | పోలెఁ బంక్తికంఠుఁ బొదివి నీఱు
గా నొనర్చె సూతఘన రథరథ్య స | మన్వితముగ నొక్కమాత్రలోన.


వ.

అప్పు డంబరంబున దివ్యతూర్యనాదంబులు సెలంగం గలంగి యసురు లెల్లఁ

 దొలంగిరి; గంధర్వగానంబులు నప్సరోనర్తనంబులుఁబ్రవర్తిల్లె; నింద్రాదిదేవోత్తము

 లన్నరదేవోత్తముం బ్రస్తుతించుచుం బ్రమోదంబు నొందిరి.

క.

ఏకోత్సవంబు లయ్యెఁ ద్రి | లోకంబులు నఖిలలోకలుంటాకుఁడు ఘో
రాకారుఁడు దశవదనుఁడు | గాకుత్‌స్థనిశాతశరముఖంబునఁ బడినన్‌.

ఉ.

అంత ననంతకీర్తి శరణాగతరక్షణశాలి రాఘవుం
డెంతయు వేడ్కతోడ నసురేంద్రుపదంబున నవ్విభీషణున్‌
సంతతపుణ్యుఁ బుణ్యజనసంతతివర్ధనుఁ గట్టెఁ బట్ట మ
త్యంతదయాంతరంగుఁడు గృతాహితభంగుఁడు దానుఁ దమ్ముఁడున్‌.


వ.

తదనంతరంబ యవింధ్యుండు విభీషణసహితుండై జానకి నుచితయానంబున 

నునిచికొని రామదేవు పాలికిం దెచ్చి దేవా! దేవిం బరిగ్రహింపుమని విన్నవించిన నతండు.


చ.

అతిమలినాంగి జీర్ణమలినాంబరధారిణి సంతతాశ్రుపం
కితవిలసత్కపోలఁ బరికీర్ణజటాయితకేశభార నా
యతఘనదుఃఖదూషితఁ బ్రియాంగనఁ గన్గొని యప్రియాత్ముఁడై
నుతచరితుండు దద్దయు మనోవ్యథ సేయుచు నింతి కిట్లనున్‌.

సీ.

అధికదుష్టాచారుఁ డైన దశాననుఁ | డింతకాలము తనయింటఁ బెట్టి
కొనియున్న నిన్నుఁ గైకొనిన నస్మచ్చరి | త్రమునకుఁ దొడరదే ధర్మహాని?
పరిభవంబునకునై ప్రతికారముగ వైరిఁ | గూల్చితిఁ గాని నీకొఱకుఁ గాదు;
మెలఁత! నీ చరితంబు మేలైనఁ గీడైనఁ | గానిమ్ము, నిన్ను నిక్కముగ నొల్లఁ;

ఆ.

బరఁగఁ గుక్కవాతఁ బడిన హవ్యముభంగి | యయ్యె నీ తెఱంగు నరయ నిపుడు;
గాన యిచటఁ దడయఁ గాదు; చెచ్చెర నీకు | నిష్టమయిన యెడకు నేఁగు మతివ!

ఆ.

అనినఁ జెవులఁ గొఱవి గొని చూఁడినట్లైనఁ | దాల్మి పెల్లగిల్లఁ దరళనయన
మొదలు నఱక నొఱగు కదళిచందంబున | నెలఁత దల్లడమున నేల వ్రాలె.

క.

వెఱఁగుపడి హర్షరాగము | తఱిఁగిన వెలువెల్లనై వదనములు వ్రాలం
దెఱఁగేది ఱిచ్చపడి ర | త్తఱిఁ దత్పరిజనము లెల్లఁ దద్దయు వంతన్‌.

తే.

పడఁతి యల్లన మఱికొంతవడికిఁ దెలిసి | యలసమూర్తియై దందడి నశ్రు లురులఁ
గేలు ముకుళించి వసుమతీపాలుఁ జూచి | యెలుఁగు గుత్తుకఁ దగులంగ నిట్టు లనియె.

క.

నినుఁ గీడు వొరయకుండఁగ, | జనులకు నా నిక్క మెక్క జననాయక! యే
ననలంబుఁ జొచ్చి వెడలెదఁ; | గనుగొను; మిచ్చనవు నాకుఁ గరుణింపు దగన్‌.

ఉ.

నాదగుబుద్ధి నీదు చరణస్మరణంబ యొనర్చుఁ గాని యొం
డేదియు నెన్నఁడుం దలఁప; దిట్టిద; యొండొకచందమైన ని
మ్మేదినియుం గృశానుఁడు సమీరుఁడు శీతకరుండు నర్కుఁడుం
గా దన కీక్షణంబ ననుఁ గాల్పరె; వేల్పులు చెట్ట సైతురే?’

వ.

అని పలుకుటయు నప్పుడు పృథివ్యాదిభూతంబు లెలుంగులు సెలంగ నెల్లవారును వినం దమదమ నామంబు లెఱింగించి యి ట్లనిరి.

క.

విను ముత్తమురాలు సుమీ | జననాయక! జనకతనయ; సందేహపడం
బనిలేదు మాకుఁ దెల్లము; | జనులకు మము మొఱఁగరాదు సకలక్రియలన్‌.

వ.

అనిన యనంతరంబ సకలసురముని గణసహితంబుగాఁ బితామహుండు సనుదెంచి రాఘవుచేత సత్కృతుం డై యిట్లనియె: నయ్యా! నీవు సకలభూతదుస్సహుండైన రావణుం బరిమార్చి లోకహితంబు సేసితివి; వినుము! నలకూబరుశాపంబునంజేసి దశగ్రీవునకుఁ బరస్త్రీలయందు బలాత్కారంబు సెల్లదు; గావున నీధర్మపత్నియం దొక్క దురితంబును బొరయదు; నీవు నిర్విచారుండ వై యిప్పతివ్రతం బరిగ్రహించి నెమ్మదిఁ బురంబున కరుగుమని పలికి, యతనికిఁ బ్రియంబుగాఁ దత్సమరనిహతు లైన వానరులఁ బ్రాప్తజీవులం జేసి పరమేష్ఠి సనియెఁ; బురందరసారథియును దాశరథి వీడ్కొని హరిసహస్రయుక్తం బైన రథంబు గొని నాకలోకంబున కరిగె; నంత.

మ.

అవిరోధంబుగ జానకీసహితుఁడై యాబద్ధరత్నప్రభా
నవపుష్పంబగు పుష్పకం బను విమానం బెక్కి యర్కాన్వయ
ప్రవరుం డిమ్ముల నేఁగె సమ్మదభరప్రాగ్భాగవారాకర
ప్లవమానుం డగుచుం బురంబునకుఁ బ్రాప్తశ్రీవిశేషోన్నతిన్‌.

వ.

ఇ ట్లరిగి భరతాదిబంధుజనంబులు నఖిలపరిజనంబులు నభినందింప వసిష్ఠవామదేవవిహితం బయిన యభిషేకశోభనంబు వహించి రాముండు సుగ్రీవవిభీషణాది సుహృజ్జనంబులం బ్రకటబహుమానవిశేషంబుల నాదరించి వీడ్కొలిపి, యభిమతభోగంబుల నిరంతరత్యాగంబులఁ బ్రభూతయాగంబులఁ బ్రసిద్ధుం డయి బహుసహస్రసంవత్సరంబులు వసుమతీరక్షణం బొనర్చె; నిది రాఘవుచరిత్రంబు.

ఉ.

వారక యిట్లు పూని వనవాసనిరంతర దుఃఖమున్‌ మహా
వైరికృతాపకారదురవస్థయు నోర్చి శుభంబు నొందఁడే
యారఘురాముఁ; డట్లు వసుధాధిప! నీవును దుఃఖ మింతయున్‌
సైరణ నోర్చి పొందెదవు సర్వమహీవలయాధిరాజ్యమున్‌.

 

 

ఎఱ్ఱన రామాయణము

(మహాభారతం అరణ్య-6-267 నుండి7-168)


ధర్మజునకు మార్కండేయుఁడు రామాయణకథ సెప్పుట

 ధర్మరాజా! శ్రీరాముడు మీకంటే అధికంగా వనవాసక్లేశములను అనుభవించాడు. అంటూ మార్కండేయమహర్షి, ధర్మరాజునోదారుస్తూ  చెప్పాడు. అప్పుడు....

 ధర్మరాజు, మహర్షీ! శ్రీరాముడు యేవంశంలో జన్మించాడు? అలగే రావణుని వంశక్రమమేమి? రావణుడెందుకు సీతదేవిని అపహరించాడు? రామరావణయుద్ధం జరిగిన విధానమేమి? వివరించి చెప్పమని ప్రార్థించాడు. మార్కండేయమహర్షి, రామకథనిలా ప్రారంభించాడు. 

 ఇక్ష్వాకువంశంలో ఘనుడగు అజమహారాజు జన్మించాడు. అతనికి దశరథ మహరాజు పుట్టాడు. దశరథునికి మువ్వురుభార్యలు. దశరథుని భార్య కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుజ్ఞుడు కలిగారు. రాముడు విదేహరాజు జనకుని కుమార్తె సీతను వివాహమడాడు.

 ఇక రావణుని వంశచరిత్రను చెబుతాను వినుమని, చెప్పనారంభించాడు మార్కండేయమహర్షి. అఖిలలోక సృష్టికర్త బ్రహ్మకు మానసపుత్రుడై పులస్యుడు పుట్టాడు. అతనికి వైశ్రవణుడు (కుబేరుడు) జన్మించాడు. వైశ్రవణుడు బ్రహ్మనుగూర్చి తపస్సుచేసి నలకూబరుడను అందమైన కుమారుని, లోకపాలకత్వము, ధనాధిపత్యము, లంకారజ్యము, శివునితో మిత్రత్వము వరములుగాబొంది, వైభవజీవనం గడుపుతున్నాడు. తండ్రియైన తనను గాదని పితామహుడైన బ్రహ్మనుగూర్చి తపస్సుజేసి వరములబొందటం సహింపక కోపంతో తన సగందేహంనుండి విశ్రవసుడనే వానిని సృష్టించి కుబేరుని దండించమని పంపాడు పులస్యుడు. విషయంతెలిసిన కుబేరుడు, విశ్రవసుని దగ్గరకువచ్చి, నమస్కరించి, నేను నీకుమారునివలె నిన్ను సేవిస్తాను, నాయందు కృపతోమెలగుమని ప్రార్థించి, పుష్పోత్కట, మాలిని, బక అను నాట్య సంగీత విద్యాపారంగతులైన రాక్షసస్త్రీలను విశ్రవసునికి సేవికలుగా నియమించి, మంచిచేసుకొని వెళ్ళాడు. ఆ రాక్షసస్త్రీలు ఒకరిని మించినవారు మరొకరు కావడంచేత, విశ్రవసుని మెప్పించి, ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆయనవలన పుష్పొత్కటకు దశకంఠ కుంభకర్ణులు, మాలినికి విభీషణుడు, బకకు ఖరుడు శూర్పనఖ కవలలుగా జన్మించారు. విశ్రవసుడు బిడ్డలందరికీ జాతకర్మలు, కుమారులకు ఉపనయనములు ఘనంగా జరిపించాడు. వారు యుక్తవయస్కులయ్యారు.

 దశకంఠుడు మహాతేజస్సుతో ఉన్నతమైన భుజాలతో గొప్పపరాక్రమవంతుడై, లోకభయంకరుడుగా పేరుగాంచాడు. అతనివలెనే, దుర్మదముతో విర్రవీగజొచ్చాడు కుంభకర్ణుడు. విభీషణుడు నిర్భయుడు, సుగుణుడు, మంచిమనస్సుగలవాడుగా కీర్తిమంతుడయ్యాడు. ఖరుడు తీక్షణమైన తేజస్సుతో సురభయంకరుడుగా వృద్ధిజెంది, రక్తమాంసముల భక్షిస్తూ కౄరమనస్కుడయ్యాడు. ఇక శూర్పనఖ ధర్మకర్మను ద్వేషిస్తూ, దుర్మార్గురాలుగ చెడుగుణాలుగలిగి మెలగసాగింది.

 రక్షసులైన కుమారులకు, విశ్రవసుడు వేదవేదాంగాలు, ధనుర్విద్య నేర్పి, నిష్ణాతులను గావించినాడు. వారు గంధమాదన పర్వతస్థాణువుల్లో సుఖసంతోషాలతో జీవించసాగారు. ఒకనాడు కుబేరుడు విశ్రవసుని వద్దకువచ్చి దండప్రణామములాచరించి వెళ్ళాడు. అప్పుడతని వైభవంచూచి, అదంతా బ్రహ్మవరప్రభావమని, రావణాదులు గ్రహించి, వారుకూడా బ్రహ్మనుగూర్చి తపమాచరించ నిశ్చయించుకొని, గోకర్ణప్రాంతమున తపమచరించ బూనుకున్నారు.    

 మండుటెండలో పంచాగ్నులనడుమ నిలబడి దశకంఠుడు తపస్సుచేశాడు. వానలో తడుస్తూ, మంచుకురిసే కాలంలో చన్నీటి కొలనులో నిల్చొని అన్నాహారాలుమాని గాలిమాత్రమే గ్రహిస్తూ, కఠినమైన తపస్సు చేస్తున్నాడు. కుంభకర్ణుడు మితాహారం సేవిస్తూ, ఇంద్రియనిగ్రహంతో యేమాత్రం చలించక, నేలపై శయనిస్తూ, ధైర్యంకోల్పోకుండా తపస్సు సాగిస్తున్నాడు. ఇక విభీషణుడు ఆకులుమాత్రమే సేవిస్తూ, మంత్రజపంచేస్తూ, నిర్మలమనస్సుతో పవిత్రభావంతో తపస్సు చేస్తున్నాడు. ఖరుడు, శూర్పణఖ మాత్రం తపస్సుచేస్తున్న తమసోదరులకు పరిచర్యలు చేస్తూ కాలంగడుపుతున్నారు. అలా తపస్సుచేస్తుండగా, వెయ్యిసంవత్సరాలు గడిచాయి. దశకంఠుడు ఒకతలను ఖండించి అగ్నిలోవేల్చాడు. అలా వెయ్యిసంవత్సరముల కొకటిగా తొమ్మిది తలలను ఖండించి అగ్నికుండంలో పడేశాడు. ఇక మిగిలింది ఒక్కతలమాత్రమే. అదికూడా త్రెంచుకోబోతుండగ, బ్రహ్మప్రత్యక్షమయ్యాడు. దశకంఠుడు బ్రహ్మకృపతోతిరిగి పదితలల వాడయ్యాడు. బ్రహ్మ అమరత్వంతప్ప యింకేవరమైనా కోరుకో నీతపస్సు మెచ్చానన్నాడు. అపుడు దశకంఠుడు దేవా! దేవ పితృదేవ దైత్య నాగ గంధర్వ రాక్షస యక్ష విద్యాధరులచేత నాకుఓటమి లేకుండవలెను. కామరూపుండనై ముల్లోకములలో సంచరించు శక్తికావలెను. అని కోరుకున్నడు. బ్రహ్మ నీవడిగిన వరములనిచ్చితిననిచెప్పి మరల యిట్లన్నాడు.

 బ్రహ్మ దశకంఠ కుంభకర్ణ విభీషణులకు వరంబులిచ్చుట  

మనుష్యజాతి వలనతప్ప యింకెవ్వరిచేత మరణముండదని దశకంఠునకు వరమిచ్చి, కుంభకర్ణునిజూచి వరమడుగుమన్నాడు బ్రహ్మ. అతడు దైవోపహతుడై తనకు మంచినిద్రను ప్రసాదించమన్నాడు. తదాస్తు అన్నడు బ్రహ్మ. ఇక విభీషణుని కోరుకోమనగా, అతడు బ్రహ్మను స్తుతించి, వందనమాచరించి, దేవా! ఎంతటి ఆపదసంభవించినా నామనస్సున చెడుఆలోచన రానీకుము, బ్రహ్మస్త్రాన్ని ప్రసాదింపుమని కోరుకున్నాడు. ఇచ్చితి ననుటయేగాక, విభీషణుని మెచ్చుకొని, రాక్షసుడవైయుండి ధర్మబుద్ధి తోనున్న నిన్నుగని ఆశ్చర్యమగుచున్నది, నీకు అమరత్వముగూడా ప్రసాదించుచున్నానని ప్రశంశించి, వరములనిచ్చి బ్రహ్మ అంతర్హితుం డయ్యాడు.

 దశకంఠుడు బ్రహ్మవరములతో గర్వోన్నతుడై కుబేరునిమీదకు దండయాత్రకు బయలుదేరాడు. కుబేరుడు ఆలోచించి, దశకంఠునితో పోరలేనని గ్రహించి, కింపురుష యక్షులతోసహా లంకనువదలి గంధమాదనగిరులవైపు పుష్పకవిమానంలో పోవువుండగా దశకంఠుడు వెంబడించి పట్టుకొని అవమానించి పుష్పకవిమనన్ని లక్కున్నాడు. కుబేరుడు బాధపడి పెద్దవాడినైన నన్ను పీడించి అవమానిచితివి, యీవిమానము నీ శత్రువులపాలై పోతుందని శపించి వెళ్ళిపొయాడు.

 దశకంఠుని విజృంభణమునకు సంతసించి రాక్షసులు, భేతాళవీరులు, మాయలలో అరితేరిన దశకంఠుని రాక్షససంపదకు రక్షకునిగా, తమకురాజుగా నియమించుకున్నారు. దశకంఠుడు బలదర్పములతో విర్రవీగుతూ, ఇంద్రాదిదేవతలనోడించి, వారి రాజ్యముల నాక్రమించి, సకలలోక భయంకరుడుగామారి జగద్రావణుడై రావణుడనుపేరన ప్రఖ్యాతుడయ్యాడు. అతనిధాటికి తాళలేక దేవర్షులు రాజర్షులు అగ్నిదేవుని వద్ధకువెళ్ళి యేమిచేయుదమని చింతించిరి. అగ్నిదేవుడు వారిని తోడ్కొని బ్రహ్మదేవుని వద్దకువెళ్ళి మొరపెట్టుకున్నారు.   

 మహాభుజబలసంపన్నుడు భరింపరాని దర్పం గలవాడు నైన విశ్రవసుపుత్రుడు రావణుడు మీరిచ్చిన వరములచేత ఓటమిలేనివాడై, ముల్లోకములకు ఒకపీడై పట్టుకున్నాడు. వానిధాటికి దేవతలంతా దాసులైపోయారు. వానిబాధలకు తాళలేక నీశరణు జొచ్చినాము. మమ్ములను కాపాడినా కాపాడకపోయినా మాకు వేరొకదిక్కులేదు. అంటూ బ్రహ్మకు విన్నవించుకున్నారు. బ్రహ్మ వారిని ఓదారుస్తూ, యిలా ఔతుందని తెలిసి నేను శ్రీహరిని ప్రార్థించాను. ఆయన మనవుడై అవతరించి రాక్షససంహారం చేయనున్నారు. ఆయనకు అండగానుండుటకు దేవతలు భుమిపై వానరులుగా, ఎలుగుబంట్లుగా పుట్టండి. అని ఆజ్ఞాపించి, వారియెదుటనే దుంధుభి యను యక్షస్త్రీని పిలిపించి ఆమెను దైవకార్యం నిర్వహించుటకు మంథరపేరుతో కుబ్జయై భూమిపై జన్మించమని ఆజ్ఞాపించి పంపాడు. అలావారికి జరగనున్న విశేషాలను చెప్పిపంపాడు బ్రహ్మ.

 కొండలంతదేహాలతో వజ్రాలు రాళ్ళవంటి కఠినశరీరాలతో, సూర్యునివంటి తేజస్సుతో, సత్ప్రవర్తనతో ప్రళయకాల కాలునివలె నున్న కోతులుగా, ఎలుగుబంట్లుగా దేవతలు భుమిపై ఉద్భవించారు. వారు పదివేలయేనుగుల బలంతో దైవకార్యానికి తోడ్పడతానికి సిద్ధంగా వున్నారు. అని మార్కండేయముని చెప్పగా, ధర్మరాజు మహాత్మా! ధర్మాత్ముడగు శ్రీరాముని దశరథమహారాజు అరణ్యాలకేల పంపారు? ఆకథ వివరంగాచెప్పుమని ప్రార్థించాడు. మార్కండేయమహర్షి అవతలికథ చెప్పనారంభించాడు. 

 దశరథమహారాజు చేసిన పుణ్యాలఫలితంగా, రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులను నలుగురు కొడుకులనుగని, ముల్లోకాల యేలికయైనంత సంతోషంగా వున్నాడు. కొడుకులు దినదినప్రవర్థమానులై, ఉపనయనాది జాతకర్మలు జరిగి, వేదవిద్యాది విద్యలభ్యసించి వివాహితులయ్యారు. పెద్దకుమారుడైన రాముడు చూడముచ్చటగానున్నాడు. నవ్యకమలదళాలవంటి కన్నులు, విశాలవక్షము, చిరినవ్వులొలుకు మొగము, మదగజగమనము, యవ్వనుడై తేజస్సుగలిగి, ఆజానుబాహుడై సిరిసంపదలతో తులతోగుతూ, కీర్తిమంతుడై వేదవేదాంగవిద్యనెల్ల నేర్చి, దేవేంద్రసమాన వైభవోపేతుడై, ఇంద్రియజయుడై, ధర్మసూక్ష్మములనెరిగి సజ్జనమిత్రుడై, దుర్జనశిక్షకుడై, రఘువంశతిలకుడై వెలుగొందుచున్నాడు. దశరథుడు శుభలక్షణుడైన రాముని యువరాజును చేయ నిశ్చయించి, ఆప్తులైన మంత్రులను, పురోహితులను సంప్రదించి శుభముహూర్తము నిర్ణయించి, తగు కార్యక్రమములలో నిమగ్నమయ్యాడు. అదితెలిసి భరతునిదాదియైన మంథర వెంటనే కైకేయివద్దకు వెళ్ళి, అమ్మా! మహారాజుకు నీపై నున్నది కపటప్రేమయని తేలిపోయింది. నీవుమోసపోయావు తల్లీ. నీభర్త ఆటక్కరి కౌసల్యకొడుకును యువరాజునుచేయ నున్నాడు. ఇకనీకు నీకుమారునకు అధోగతే, నని మంథర దుర్బోధ చేసింది. ఆమాటలకు కైకేయి చింతించి, వెంటనే దశరథుని యేకాంతముగ కలుసుకొని ప్రేమతో పలుకరించి, అసలువిషయం చెప్పింది. రాజా! పూర్వం నన్నుమెచ్చి, అడిగినప్పుడు వరమిస్తానని మాటయిచ్చారు. ఇప్పుడావరం యిచ్చి మాటనిలుపుకోండి అన్నది. తప్పక యిచ్చెదను, అది అపరాధంచేయని వానిని చంపుట, అపరాధినిగాచుట, బ్రహ్మణులధనం తప్ప యితరుల ధనము నపహరించుట, ఇష్టమైనసంపద నిచ్చివేయుట వంటి అసాధ్యములైనవైనను సరే! నీసంతోషంకోసం యిచ్చేస్తాను, కోరుకో వరమన్నాడు దశరథుడు. ప్రభూ! భరతుని యువరాజుగా అభిషేకించండి, రాముని పదునాలుగుసంవత్సరములు అరణ్యవాసానికి పంపించండి, ఇదే నేనుకోరుకునే వరమన్నది కైకేయి. ఆమాట కొరవి చెవిలో పెట్టినట్లుగను, పిడుగుమీద బడినట్లుగనునై మూర్చిల్లి నేలపై బడిపోయాడు దశరథుడు. విషయందెలిసి రాముడు, మాటదప్పినవాడు కాకూడదు తండ్రియని తలంచి, తక్షణం సీతనుతోడ్కొని వనవాసానికి బయలుదేరాడు. లక్ష్మణుడుకూడా అన్నవెంట అడవికి బయలుదేరాడు.

 దశరథుడు రామవిశ్లేషముచే సురలోకగతుండగుట

 రాముడు అడవికెళ్ళెనను విషయందెలిసి, భరింపరాని ఆవేదనకు గురియై, శోకవహ్నికి మనస్సు దహించుకపోగా, హారామా! గుణధామా! అంటూ దశరథుడు ప్రాణాలు విడిచాడు. కైకేయి కుమారుడైన భరతుని పిలిపించి కుమారా! రాజైన మీతండ్రి మరణించాడు. మీయన్న రాముడు అడవులకు వెళ్ళిపోయాడు. ఇక నీవే యీరాజ్యమేలదగిన వాడవు. కనుక రాజ్యరక్షణకర్తవ్యాన్ని స్వీకరించమన్నది. భరతుడు దుఃఖితుడై ఆగ్రహించి, యేనాడు దూర్తవర్తనమెరుగని స్వచ్ఛమైన సూర్యవశాన్ని మలినపరచావు. దేవేంద్రసమానుడైన భర్తను మ్రింగినావు. ఏమాత్రం కరుణలేకుండా, ఆయతబాహుడు, ధైర్యశాలి, తేజోమూర్తియైన మాఅగ్రజుని అడవులపాల్జెసినావు. నీవు భర్తనుజంపిన హంతకురాలివి. తొలగించుకోలేని అపకీర్తిని నాతలబులిమి, అశుభకారిణివై లోకాలన్నీ నిన్ను తిడుతుంటే, నీవుమాత్రం కోరికదీర్చుకున్న అదృష్టవంతురాలివిగా  సంబరపడిపోతున్నావు. నీవు పాపిష్టివి. ఈపాపం తొలగు మార్గమే లేదుగదా! నేనేమీ చేయలేనివాడనయ్యానని దుఃఖించాడు. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి, మంత్రులను, సామంతులను, ప్రజలను, ముగ్గురుతల్లులను, వసిష్ఠవామదేవులను, తమ్ముడు శత్రుఘ్నుని  వెంటనిడుకొని భరతుడు చిత్రకూటపర్వతానికి వెళ్ళి రాముని ప్రార్థించి, ఒప్పించి వెనక్కుతీసుకరావటానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్లి రాజశిరోరత్నమైన శ్రీరాముని దర్శించుకున్నారు. ఆప్పుడు కాకుత్సవంశ దీపకుడై కోమలనీలమేఘవర్ణుడై జడలు ముడి గట్టుకొని, నారచీరలుధరించి తెల్లని విభూదిధారుడై  తామరలవంటి కన్నులుగలిగి, మునిజన సేవితుడైనరాముడు సీతాలక్ష్మణులతో కృపాళువై వెలుగొందుచున్నాడు.      

 భరతుడు దుఃఖభరియుడై వెళ్ళి అన్నపాదములపైబడి, తండ్రిమరణవర్త దెలిపి, అయోధ్యకు తిరిగిరమ్మని వేడుకొని, సకలసామ్రాజ్యధురీణుడవై మమ్ములనందరిని పాలింపుమని ప్రార్థించాడు. భరతుని వెంటవచ్చిన వారందరూ భరతుని ప్రార్థనను అంగీకరించుమని వేడుకున్నారు. కానీ తండ్రిమాటత్రోసిపుచ్చలేనని, ఉదాత్తచరితుడైన రామచండ్రుడు రాజ్యపాలన చేయలేనన్నాడు. భరతుడు అన్నమాటను యెదిరింపలేక, రామపాదుకలనడిగి తీసుకొని, నందిగ్రమమునకు వచ్చి, అక్కడ పాదుకలనర్చిస్తూ, శ్రీరామప్రతినిధిగా, పాలనసాగిస్తూవచ్చాడు. చిత్రకుటం అయోధ్యకు సమీపప్రదేశం. ఇక్కడుంటే తిరిగి భరతుడు వచ్చి తన వనవాసదీక్షకు భంగం కలిగించవచ్చని తలంచి శరభంగుమహర్షి ఆశ్రమం జేరి మహర్షిచేత సత్కారములందుకొని, అక్కడనుండి దండకారణ్యం చేరాడు రాముడు. అచ్చట గోదావరీతీరంలో కుటీరంనిర్మించుకొని సీతాలక్ష్మణులతో కలసి కాలంగడుపుతున్నాడు. రావణుని చెల్లెలు శూర్పణఖ అక్కడవారికి అపకారం తలపెట్టింది. శుర్పణఖ ముక్కుచెవులుకోసి పంపారా రాకుమారులు. శూర్పణఖపరాభవానికి కోపించి శూరులైన అనేకమంది రాక్షసులు సైన్యసమేతంగ, దాడిచేశారు. అస్త్రవిద్యానిపుణుడైన రాముడు వారిదాడిని బాల్యక్రీడవలె త్రిప్పిగొట్టాడు. ఆయుద్ధంలో ఖరదూషణాదులతోసహా, పదునాల్గువేల రాక్షససైన్యాన్ని రాముడొక్కడే హతమార్చాడు. ఆవిధంగా దండకారణ్యాన్ని రాక్షసులబారినుండి విముక్తం గావించాడు. శూర్పణఖ రావణుచెంతకువెళ్ళి కాళ్ళపైబడి యేడ్చింది.  చెల్లెలికి జరిగిన పరాభవాన్ని కళ్ళారజూసిన రావణుడు ఆగ్రహంతో ఔరా! ఎవడురా త్రిశూలపు వాడిమొనలపై నురకనెంచినవాడు? తలగడపై నిప్పులుజల్లుకొని హయిగా నిద్రించనెంచిన వాడెవడురా? విషాగ్నివిరజిమ్ముతున్న నాగేంద్రునికెదురు నిలచి కాలదన్నదలచినవాడెవడురా? రౌద్రబెబ్బులి దరిజేరి దానిమీసములబట్టి నూగనెంచినవాడెవడురా? చెల్లీ! నిన్నవమానించినవాడెవ్వడు? వాని ఆయువు, సంపద, యస్సస్సు యింతటితోసరి. ఎవడువాడు? చెప్పుచెల్లీ! అంటూ గర్జించాడు, అకోపంలో వాని దశముఖాలనుండి, కన్నులనుండి, ముక్కులనుండి కోపాగ్నిశిఖలు వెలువడ్డాయి. శూర్పణఖ తనకుజరిగిన పరాభవము, ఖరదూషణాదులవధ, రాముడున్న ప్రదేశము తెలియజెప్పింది. రావణుడు వెంటనే పురరక్షణకు ఆప్తులనియమించి, ఒక్కడే పయనమై త్రికూటపర్వతందాటి, సముద్రతీరంలో నున్న పరమేశ్వరుని నివాసమైన గోకర్ణస్థానమునకు వెళ్ళి, అక్కడపూర్వపు రావణమంత్రి మరియు తొల్లి రామునిచేత పరిభవింపబడిన మారీచుడు శివునిగూర్చి తపమచరిస్తున్నవానిని కనుగొని పలుకరించాడు. వాడు రావణునిరాకకు సంతోషించి, మర్యాదలుచేసి, ఏందుకక్కడకు రావలసివచ్చిందో తెలుపమన్నాడు. ఎవడో రాముడట గొప్పదర్పంతో మన ఖరునితోసహా పరాక్రమవంతులైన అనేక రాక్షసవీరులను చంపాడు. ఏమాత్రం భయంలేకుండా, దండకారణ్యంలో పెద్దవీరునివలె విర్రవీవిగుచున్నాడు. వానికెలాగైనా బుద్ధిచెప్పదలచాను. నీవునాకు సహాయపడవలె నన్నాడు రావణుడు. మరీచుడు ఆమాటవినగానే భయపడి దిగాలుపడిన ముఖంపెట్టి, రావణా! ఆరామునిగూర్చి నీకు సరిగ్గా తెలియదు. మహాభుజబల సంపన్నుడాతడు. అతని విజృంభణమునకు శివుడైననూ నిలువలేడు. ఎవడునీకీ దుర్బుద్ధి గరపినాడు? నీకు కానికాలం దాపురించింది కాబోలు, లేకుంటే నీవెందుకీ సాహసానికొడిగడతావు? తొల్లి నేనతనితోపోరి యెదిరించలేక పారిపోయివచ్చి యిక్కడ తపమాచరించుకొంటున్నాను. అతనితోవైరం వద్ధు. నామాటవిని లంకకు మరలిపో అన్నాడు మారీచుడు. రావణుడు కోపంతో చెలరేగిపోయి, నేనుచెప్పినట్లుచెయ్యి. లేకపోతే యిప్పుడేనీకు యమదర్శనమౌతుంది వినబడిందా! అని గద్దించాడు. మారీచుడు ఆలోచించి వీనిచేతజచ్చుటకంటే ఆరామునిచేత జచ్చుటేమేలని దలచి, రావణబ్రహ్మా! నీమేలుగోరి నీకిదంతా జెప్పితిని. నీకు నచ్చకపోతే పోనిమ్ము, నేను నీవుచెప్పిన పనిచేస్తాను చెప్పుమన్నాడు మారీచుడు. అయితే విను, రత్నమయమైన రోమములుగల బంగారుజింకవై రామునిభార్యసీతనకర్షించు, సీత జింకరూపమున నున్న నిన్ను పట్టితెమ్మని కోరుతుంది. రాముడు పట్టుకోవడానికి నిన్ను వెంబడిస్తాడు. చాలాదూరం రాముని నీవు గొనిపొమ్ము. ఆసమయంలో నేను సీతనపహరిస్తాను. రాముడు భార్యావియోగంతో దుఃఖితుడై చెడిపోతాడు. అని రావణుడనగా సరే! నాకప్పజెప్పిన పని నేనుచేస్తానన్నాడు మారీచుడు.

 మారీచుడు మాయామృగంబై చనుదెంచుట

 మారీచుడు బంగారుజింకయై సీతరాములున్న ప్రదేశమున సంచరించసాగాడు. సీత ముచ్చటపడి కుతూహలమానసయై బంగారులేడిని పట్టితెమ్మంది భర్తను. సీతాదేవి, విధి తన్ను ప్రేరేపించగా కాదనలేక రాముడు, బంగారుజింకను పట్టడానికి ధనుర్బాణాలతో వెళుతూ, లక్ష్మణుని సీతకు రక్షణగా నిలిపి, ఒకప్పుడు శివుడు యజ్ఞమృగాన్ని వెంబడించి వెళ్ళినట్లు, జింకను వెంబడించాడు రాముడు. అది మాయాలేడి గనుక చిక్కినట్లేచిక్కి తప్పించుకపోతున్నది. పొదల్లోదూరి కానరాకుండా పోతుంది, మరలాదూరాన కనబడుతుంది. భయపడినట్లు నిలబడిపోతుంది. అంతలోనే వేగంపెంచి దూరమౌతుంది. కొంతదూరం పగెత్తి వెనక్కుదిరిగి చెవులురిక్కించి నిలిచిచూస్తుంది. కాళ్ళతో నేలనుగీరి దుమ్మురేపుతుంది. కొమ్ములతో చెట్లను రాసుకుంటుంది. పరాకుగావున్నట్లు కనబడుతుంది. అంతలోనే పైకెగిరి దూరందాటుకుంటుంది. ఈవిధంగా చేస్తున్న దానివాలకం గమనించి అది రాక్షసమాయగానెఱిగి రాముడొక అమోఘబణంతో లేడిని పడగొట్టాడు. ఆలేడిరూపంలోనున్న మారీచుడు రామునిస్వరంతో హాలక్ష్మణా! హాసీతా! అని అరుస్తూ గిజగిజతన్నుకొని చచ్చాడు. రామునిస్వరంతో మారీచుడు అరచిన మాటలువిని సీత భయపడి అన్నా లక్ష్మణా! మీయన్న రాక్షసులబారినబడి మనలను పిలుస్తున్నాడు. వెళ్ళి రక్షించు, నీవు పరాక్రమశాలివి, పుణ్యమూర్తివి లక్ష్మణా! జాగుసేయక వెళ్ళుమని తొందరపెట్టింది. లక్ష్మణుడు అమ్మా! భయపడకు, రామునెదిరించగల ధీరుడీలోకంలోనేలేడు. నీవుచూస్తూవుండగానే అన్న వచ్చేస్తాడు. అన్నాడు లక్ష్మణుడు. భయకంపితయైన జానకి, లక్ష్మణుని శంకించి, అపోహపడి కోపంతో లక్ష్మణా! నీఆంతర్యంతెలిసింది. నాపై నీవుచూపేజాలికర్థం తెలిసిపోయింది. పదునైన ఆయుధములున్నాయి, విషందొరకనిదికాదు, యేవీలేకున్నా అగ్నిలోదూకి చస్తాను గానీ నీకుమాత్రం దక్కను. రాముడు లేనిజీవితం నాకు తృణప్రాయం. పెద్దపులివంటిదానను, గుంటనక్కవంటినీకు లోబడను, అంటూ సత్పురుషులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుని కఠినంగా దూషించింది. ఆమాటలు వినలేక లక్ష్మణుడు చెవులుమూసుకొని దుఃఖితుడై ధనుర్బాణములనుగొని అన్నవెళ్ళిన దారిన తనూ వెళ్ళాడు. 

  సమయంకోసం వేచియున్న రావణుడు తనకైతాను త్రిదండిసన్యాసి రూపానికి మారిపోయాడు. చక్కనిజంద్యం ధరించి, జుట్టుగట్టి కౌపీనము ధాతువస్త్రము ధరించి, కమండలువు మూడువెదుర్లు చేర్చికట్టిన త్రిదండికర్ర చేతబూని ధర్భలవుంగరం దాల్చి ముసలితనంవల్ల అలసినట్లు కనబడుతూ, సీతవున్నకుటీరం వద్దకు చేరుకున్నాడు. సీత మాయలలో ఆరితేరిన ఆరావణుని నిజమైన సన్యాసిగా నెంచి, భక్తితోపూజించి, అడవిలో సేకరించి పెట్టుకున్న ఫలాలను సమర్పించింది. మాయాసన్యాసి వాటిని వద్దని, తననితాను బహిరంగ పరచుకుంటూ, నేను దానవనాయకుడను, మహాశక్తి సపన్నుడను, రావణనామధేయుడను, జగత్ప్రసిద్ధమైన లంక నారాజ్యము. నన్ను ప్రియునిగా అంగీకరించి స్వర్గసుఖముల ననుభవించుము. నన్ను నీపొందుతో సుఖపెట్టుము. రాముడొక పేదమనుజుడు. అతనితో యెందుకీ అడవిలో కష్టపడతావు. ఇక నీవాలొచించవలసిన పనిలేదు, నామాటవిని పద లంకకు అన్నాడు. ఆమాటవింటూనే సీత భయంతో కంపించిపోయింది. కొద్దిసేపటికి తేరుకొని, రావణా! నీవెక్కడ నేనెక్కడ, నక్షత్రాలతోసహా ఆకాశం విరిగి నేలబడుగాక, భూమి బ్రద్ధలగుగాక, సముద్రములింకిపోవుగాక, సూర్యచంద్రులు కాతివిహీనులగుదురుగాక నేను పరపురుష తలంపునైనా రానివ్వను. ఏనుగు పందిని కోరుకుంటుందా? పద్మములమకరందము గ్రోలి పరవసించు తుమ్మెద రేగుపువ్వులపై వ్రాలునెట్లు? బేలవై వాగకు మంటూ ధిక్కరించింది.

 రావణుడు సీతనెత్తుకొని లంకకుబోవుట

 ఆవిధంగా రావణుని తిరస్కరించిన సీత యెదుట భయంకరంగా గర్జించి, సీతనెత్తుకొని ఆకాశమునకెగసి లంకవైపునకు పయనమయ్యాడు రావణుడు. సీతభితినొంది, దేవతలారా! విప్రులారా! ముల్లోక మహోన్నతుడైన శ్రీరామునిభార్య జానకినినేను. నన్ను మోహాంధుడై ఒకరాక్షసుడు అపహరించుకపోతున్నాడు. దయచేసి కాపాడండి. నేనుమీకు మ్రొక్కుచున్నాను. నన్నురక్షించి పుణ్యముగట్టుకోండి. కీర్తిమంతులుకండి అంటూ విలపించింది. కొండగుహలలో నివసిస్తున్న అరుణుని కుమారుడు, తేజోమూర్తి పుణ్యాత్ముడు నైన పక్షిరాజు జటాయువు సీతయెలుగువిని, రెక్కలతోయెగురు కులశైలంవలె యెగురుతూవచ్చి ఉరుములతో గర్జిస్తున్న మేఘంవలె జగములుమొత్తం అదిరిపోయెట్లు, భీకరరావంచేస్తూ, రావణునికెదురువచ్చి దురాత్మా! అబలనేల పట్టుకొనిపోతున్నావు. వెంటనే వదలిపెట్టు. ఈజటాయునే యెరుగవా? భయంకర శత్రుసంహార విక్రముడ, నీఅక్రమాన్ని సాగనివ్వను, అంటూ సురభయంకరుడగు రావణుని అడ్డుకున్నాడు. తనవిశాలమైన రెక్కలతో దాడిచేశాడు. రావణుడు తన యినుపకట్ల గుదియలతో మోదాడు పక్షిని. జటాయువు తిరిగి రావణునిపైబడి తనవాడి గోళ్ళతో రక్కింది. వాడు తనబాణాలతో యెదుర్కొన్నాడు పక్షిని. జటాయువు విడువక తనముక్కుతో పొడిచి రావణుని గాయపరిచింది. రక్కసుడు పొడవాటియీటెను పక్షిపైవిసరాడు. అలా జటాయువు రావణుల పోరు భీకరంగాసాగింది. ఆపోరులో కొంత తెరపి దొరకబుచ్చుకొని రావణుడు తనఖడ్గంతో జటాయువు రెక్కలను నరికేశాడు. ఆదెబ్బతో జటాయువు తీవ్రమైనగాలికి చెదరిపోయిన మేఘంవలె, తెగినరెక్కలతో నేలపైబడిపోయాడు. ఇక నిరాటంకంగా ఆకాశమార్గాన వేగంగా పయనమయ్యాడు రావణుడు . సీతనిస్సహాయయై తనచీరకొంగును చించి తనఆభరణాలను అందులో మూటగట్టి, ఒకకొండప్రాంతమున కోతులకదలికలుగని మూటను జారవిడచింది. రావణుడు లంకజేరి, అక్కడి అశోకవనంలో సీతనుదించి కావలిగా రాక్షసస్త్రీలను నియమించాడు.  

  ఇక్కడ రాముడు మాయామృగాన్ని వధించిన వెంటనే వెనక్కు తొందరతొందరగా వచ్చేస్తూ, దారిలో లక్ష్మణుని చూసి లక్ష్మణా రాక్షససంచారంగల అడవిగదా! సీతను ఒంటరిగా వదలి యేల వచ్చితివి? తప్పుగదా! అన్నాడు. సీత తననన్న నిష్టూరపుమాటలు  అన్నకుజెప్పి బాధపడ్డాడు లక్ష్మణుడు. రాముడు ఆలోచించాడు. ఆమాయామృగం తనను శ్రమకు గురిచేసి, దూరంగా అడవిలోనికి తిసుకెళ్ళటం., లక్ష్మణుడు సీతను వదలి రావటం, అంతావ్యూహరచనగా అనుమానిస్తూ, దుఃఖితుడై పరుగుపరుగున తమ్మునితోగలసి తమకుటీరంచేరుకున్నారు. కుటీరం చైతన్యరహిత శరీరంవలె సీతలేకుండా దర్శనమిచ్చింది. రాముడు మూర్చితుడయ్యాడు. లక్ష్మణుని సపర్యలతో తేరుకొని, సీతనువెదుకుతూ, బయలుదేరారు. వారికి వజ్రాయుధందెబ్బకు రెక్కలుతెగి కూలిన కొండవలె నున్న పక్షీంద్రుని కనుగొన్నారు. అదికూడా రాక్షసమాయయేయని శంకించి ఆయుధాలు తీయబోగా, ఆపక్షి అయ్యలారా! నేను జటాయువును. అరుణుని కుమారడను. నేను మీతండ్రి దశరథుని మిత్రుడను. అన విని పక్షిదగ్గరకువెళ్ళారు. జటాయువు, సీతను రావణుడు అపహరించుకొని పోవడము తను యెదిరించి పోరాడడము, కడకు రావణునిచేత దెబ్బతిని కూలిపోవడము చెప్పి, రావణుడు వెళ్ళిన మార్గాన్ని చూపి, ప్రాణాలు విడిచాడు జటాయువు. రామలక్ష్మణులు జటాయువును తమతండ్రితో సమానంగా భావించి, అగ్నిసంస్కారాలుచేసి, అంత్యక్రియలు నిర్వహించి, తదనంతరం అన్నదమ్ములిరువురు దక్షిణదిశగా పయనం సాగించారు. దారిలో వారికి ఒకవింతరూపంలోనున్న కబంధుడు కనిపించాడు. వానికి కన్నులు వక్షస్థలంలోను, నోరు కడుపుభాగంలోను కలిగి, కొండంత ఆకారంతో పెద్దపెద్దచేతులుగలిగి యున్నాడు. వాడు తిండిపోతై పొడవైన తనచేతులతో పశువులను పట్టి తింటూ వుంటాడు. వానిచేతులకు లక్ష్మణుడు చిక్కాడు. లక్ష్మణుడు వాని పట్టువిడిపించుకొనలేక అన్ననుపిలిచి, అన్నా! నీకు ఆపదలమీదఆపదలు చుట్టుముట్టాయి. రాజ్యసంపదలు దూరమయ్యాయి. అడవులపాలయ్యావు. తండ్రిగతించాడు. భార్యనుపోగొట్టుకున్నావు. నీకు తోడుగావుండవలసిన నేను యీకబంధునికి ఆహారంకాబోతున్నాను. నీ కష్టములుతీరి, తిరిగి అయోధ్యరాజువై సతీసమెతంగా వైభవజీవితం గడిపే శుభదినాలు సంతోషంగా చూడాలనుకున్నాను. కానీ నాకా ప్రాప్తంలేదని దుఃఖించాడు.

 శ్రీరాముఁడు కబంధుఁ డను రాక్షసుం జంపుట

 తమ్ముడా నేనుండగా నీకేల ఆపదగలుగునని ధైరముచెప్పి, తనకరవాలముతో కబంధుని యెడమచేతిని ఖండించాడు రాముడు. పట్టువదలి లక్ష్మణుడు వెంటనే వాని కుడిచేతిని ఖడ్గంతో నరికి పొట్టనుచిల్చేశాడు. అప్పుడా కబంధుని దేహంనుండి ఒకదివ్యరూపంవెలువడి, రాకుమారులారా? నేనొక గంధర్వుడను, బ్రహ్మశాపమున వికృతరూపుడగు కబంధునిగా పడియుంటిని, మీవలన నాకు శాపవిముక్తి కలిగినది. మీకునేను దారిచూపు సహాయము మాత్రమే చేయగలను. రామా! నీసతిని రావణుడపహరించి లంకకుపోయాడు. మీరు దక్షిణదిశగానే వెళ్ళిండి. మీరు పంపాసరోవరం చేరుకుంటారు. అక్కడికి కొంతదూరంలోనే ఋశ్యమూక పర్వతమున్నది. అక్కడ వాలితమ్ముడు సుగ్రీవుడు అతని నలుగురు మంత్రులు నివాసమున్నారు. మీరువెళ్ళి సుగ్రీవునితో స్నేహంచేయండి, తదనంతరం మీకు కాలంకలిసిరానున్నది. అనిచెప్పి గంధర్వుడు తనదారిన తాను వెళ్ళిపోయాడు. గంధర్వుని సూచనమేరకు బహుదూరం పయనించి పంపాసరోవరం చేరుకున్నారు రామలక్ష్మణులు. పంపాసరోవర ప్రాంతం మనోహరంగావుంది. కమనీయమైన పద్మపరాగముతో పరిమళభరితమై వెలుగొందుతున్న జలముతో అర్ఘ్యమిస్తూ, మెఱుస్తున్న తరంగకరములతో పాదములను కడుగుతూ, జలాశయాశ్రితచక్రవాకముల, హంసల వినసొంపైన ధ్వనులతో ఆహ్వానంపలుకుతున్నాయి. తీరప్రాంత పొదరిండ్లు అతిథులకు విశ్రాంతిస్థలాలై, సరస్సుపైనుండి వీచు మందమారుతము హయిగొల్పుతూ, నిరంతర అథిదిసేవాతత్పరియై భాసిల్లుచున్నదీ సరోవరప్రాంతమనునట్లు కడురమణీయముగ నున్నది.          

 శ్రీరాముడు పంపాసరోవర మనోహర పరిసరాలనుతిలకించి, మదనబాణాగ్నికి గురియై, జానకి జ్ఞాపకంరాగా ధుఃఖితుడై వివశత్వం జెందినాడు. లక్ష్మణుడు అన్నతో పురుషోత్తమా! మీవంటి ధీరులు కలతజెందదగదు. నిగ్రహం, సహనంతో మనస్సులోని వ్యధను అధిగమించాలి. అదే పౌరుషవంతుల లక్షణం. కనుక ధైర్యంవహించి సీతాదేవి వున్నచోటును కనుగొందము. నేర్పుతో కార్యంనిర్వహింత మని అన్నను ఓదారుస్తూ, రాజోత్తమా! నేను నీకు శిష్యుడను. అంతేకాదు నీకు అండగావున్న సేవకుడను. నేనుండగా మీరు చింతించవలసిన అవసరంలేదు. అంటూ అన్నకు ధైర్యం చెప్పాడు లక్ష్మణుడు. అన్నదమ్ములిద్దరు పంపాసరోవరంలో స్నానమాచరించి, దేవపితృతర్పణములు విడిచారు. ముందట యెత్తైన ఋశ్యమూక పర్వతాలు గగనవక్షస్థలం తాకుతున్నట్లుగా వారికి కనబడ్డాయి. తామువెళ్ళవలసిన ప్రదేశమదేనని నిర్ణయించుకొని, వెళ్ళి పర్వతారోహణం గావించి, అచ్చట అలసటదీరుటకోసం విశ్రమించారు. అదేపర్వతం నాశ్రయించియున్న సుగ్రీవుడు, తనసచివులతోగలసి రామలక్శ్మణునులను చూశారు. మహాతేజోవంతులు, భుజబలసమన్వితులునైన  యీరాకుమారులెవరు? ఇక్కడికెందుకెందుకరుదెంచారో? నని అనుమానిచి. వారి వివరాలు తెలుసుకొనిరమ్మని, బుద్ధిమంతుడు, ఉత్సాహవంతుడు, హిమవత్పర్వతమంత స్థిరత్వంగలవాడునైన హనుమంతుని పంపారు. హనుమంతుడు విషయంతెలుసుకొనివచ్చి, వారు ఉపకారులేగాని అపకారులు కారని సుగ్రీవునకు తెలియజెప్పి  , రామలక్ష్మణులను సుగ్రీవుని, కలిపి స్నేహంఘటింప జేశాడు. ఒకప్పుడు ఆకొండశిఖరంపై బడిన నగలమూటను, రామునికి చూపించాడు సుగ్రీవుడు. అవి సీతయేనని గుర్తించి కృతజ్ఞతగా, సుగ్రీవా! వానరరాజ్యానికి నిన్ను రాజునుచేస్తాను. నీకన్యాయంచేసిన వాలిని సంహరిస్తానని మాటయిచ్చాడు రాముడు . సుగ్రీవుడు ప్రతిగా సీతజాడ తెలుసుకొని, రావణుని చెరనుండి విడిపించడానికి వలసిన సహయమందిస్తానని, రామునకు మాటిచ్చాడు. ఇక జరగవలసిన కార్యానికి శ్రీకారంచుడుతూ, కిష్కిందలోని వాలి గృహం తలవాకిటిముందుకు వారు చేరుకున్నారు. శ్రీరాముని అండచూసుకొని సుగ్రీవుడు, తనబలమైన చేతులతో జబ్బలుచరిచి, తనరాకను వాలికి తెలియపరచాడు. వాలి తనవాకిట నిలుచున్న సుగ్రీవుని సాహసానికి ఆగ్రహించి, దండించడానికి సిద్ధమౌతుండగా, అతనిభార్యతార, వాలిని హెచ్చరిస్తూ, యీసారి మీతమ్ముని వాలకం వేరుగనున్నది. నాకుతెలిసి దశరథకుమారులు మీతమ్మునితో స్నేహంచేసి, వారి అండతో ఉత్సాహం ప్రోదిచేసుకొని విర్రవీగుతూ వచ్చినట్లున్నాడు. అంతేగాదు, మైందుదు, ద్వివిదుడు, మహాబలశాలి హనుమ, అతనికి బాసటగా నున్నారు. మేటిమేధావి జాంబవంతుని వ్యూహరచన సామాన్యమైనదిగాదు. ప్రస్తుతం మీరు వెనకముందు చూసుకోకుండా, రణరంగంలో దూకడం మంచిదికాదని, హితవుచెప్పింది. తారమాటను సరసుగొనక నవ్వి, యీతార నాతమ్మునిమీదగల అభిమానముతో యెదోవాగుచున్నది గాని, నాముందు వాడెంత? అని బలగర్వముతో పోరాడటానికి గృహంనుండి బయటపడ్డాదు. బయట తనతో పోరాడటానికి సిద్ధంగానున్న సుగ్రీవుని హేళనజేశాడు.

 వాలిసుగ్రీవుల యుద్ధము

 ఒరే దురాత్మ! ఎన్నిసార్లని వచ్చి, నాతో దెబ్బలుతిని వెళతావురా! సిగ్గులేదా? మళ్ళిరావడానికి నీకు ధైర్యమెలావచ్చిందిరా పిరికిపందా! అని తనను హీనపరుస్తూ, పలికిన వాలిమాటలకు బదులిస్తూ, సుగ్రీవుడు, నేను రాజ్యబ్రష్టుడనయ్యాను, భార్యనుగోల్పోయాను, ఇంకెందుకీ బ్రతుకని తెగించి వచ్చాను. ముందిటి సుగ్రీవుడు గాడువీడు. నిన్నీరోజు మట్టిగరిపించిగాని విడువను. అంటూ వాలితో కలియబడ్డాడు. యుద్ధం భీకరంకాబోతున్నది. ఇద్దరూ పేరుమోసిన యోధులే. శత్రువిజయంతోగాని వెనుదిరగని వీరులు. ఓటమిసహించని ధీరులు. ఘనవృక్షాలు, రాళ్ళు గోళ్ళు ఆయుధాలుగా ప్రయోగించగల సమర్థులు. ఎవరు యెవరికీ తిసిపోని విధంగా పోరాడజొచ్చారు. అనుకున్నట్లుగానే, వృక్షాలను బెరికి కొట్టుకున్నారు. చెట్లు వాళ్ళరొమ్ములకు దగిలి తునాతునకలైపోయాయి. కొండరాళ్ళతో కొట్టుకున్నారు. పిండిపిండైపోయాయి రాళ్ళు. ఇలాకాదని ముష్టియుద్ధానికి దిగారు. అయినా గెలుపు యెవరినీ వరించలేదు. ఇకబహాబహి బలంగా పోరాడజొచ్చారు. రెండు మదగజాలు ఒకదాని తొండం మరొకదాని తొండంతో పెనవేసుకొని లాగుతున్నట్లనిపిస్తున్నది వారిమల్లయుద్ధం. అయినా పోరుముగియలేదు. గొళ్ళతో రక్కుకున్నారు. పండ్లతో ఒకర్నొకరు కరచారు.  శరీరాలు విరగబూసిన అశోకాలవలె యెఱ్ఱగా రక్తసిక్తమయ్యాయి. ఇద్దరూ ఒకేరూపంలో వున్నందున వాలియెవరో సుగ్రీవుడెవరో తెలియక చేసేదేమీలేక చూస్తూ వుండిపోయాడు రాముడు. అది గమనించి హనుమంతుడు ఒకచిగురుటాకుల మాలను గూర్చి, సమయంచూసుకొని సుగ్రీవుని మెడలోవేశాడు. వెంటనే మాలధారుడు  సుగ్రీవుడని గుర్తించి, వాలివక్షం దుసుకొని పోయేట్లు, ఒకదివ్యబాణం సధించి వదలాడు రాముడు. అదెబ్బకు వాలి నేలపైబడి రాముని నిందిస్తూ ప్రాణాలు వదిలాడు. రాముడు సుగ్రీవుని వానరరాజ్యానికి రాజునుచేశాడు. వానరుల అచారం ప్రకారం తార సుగ్రీవుని సతియైయ్యింది. ఇవి యెండాకాలం ముగియనున్నరోజులు. వచ్చేది వర్షాకాలం. అన్వేషణకు అనుకూలంకాదు. వానాకాలం ముగియగానే సీతాన్వేషణకు కపులను పంపుతానన్నాడు సుగ్రీవుడు. అంతవరకు రామలక్ష్మణులకు మాల్యవంతశిఖరంమీద విడిదిగల్పించి, తనుకిష్కిందలో హయిగా కాలంగడుపుతున్నాడు సుగ్రీవుడు.

 చెమటలుగ్రక్కే శరీరతాపోపశమనం గలిగిస్తూ, సంతోషదయకంగా, ఘనమేఘాలు తూర్యనాదాలన్నట్లు గర్జనలు వినిపిస్తూవచ్చాయి. బెగ్గురుపక్షులరెక్కలు వింజామరలై వీస్తున్నాయి. నెమళ్ళు గొడుగులవలె తమ పించ్ఛాలను విప్పి ఆడుతూ మనసుకు ఆనందాన్నిస్తున్నాయి. అలా వచ్చిన మేఘపంక్తులు తమసామ్రాజ్యపాలనను లక్ష్మీకళతో నింపుతున్నాయి.

 లంకలోని సీత వలలోచిక్కిన లేడిపిల్లవలె వివశయై, నిరంతర రామధ్యాసతో దుఃఖితయైయున్నది. ఆమెకు కావలిగా రాత్రింబవళ్ళు రక్షసస్త్రీలున్నారు. వాళ్ళలో త్ర్యక్షి, లటాలాక్షి, త్రిస్తని, ఏకపాద, దీర్ఘజిహ్వ, అజిహ్వ, త్రిజట, ఏకలోచన మొదలైన వికారాకారులున్నారు. వారు సీతను దుర్భాషలాడుతూ, ఒంటెలవలె, గాడిదలవలె అరుస్తూ, అల్లరిచేస్తున్నారు. ఏమియీ ఆడదాని పొగరు? మనరాజు రావణబ్రహ్మనే కాదనుచున్నది. ఏమనుకొంటున్నదిది, ఈ నీచురాలి కండలుకొరికి తిందాం, అంటూ విసిగిస్తున్నారు సీతను. విసిగిపోయిన సీత అమ్మలారా! నాకు ప్రాణాలపై ఆశలేదు. నేను నాభర్త రామునితప్ప యితరుని చిత్తమునకు కూడా రానివ్వను. ఇక మీఇష్టం. యెమైనా చేసుకోండి, అని తెగేసి చెప్పింది. సీత మాటలను రావణునికెరిగింప రాక్షసస్త్రీలు రావణమందిరానికి వెళ్ళారు. అయితే త్రిజట‍అనే రాక్షసస్త్రీమాత్రం సీతను సమీపించి కొన్ని మంచిమాటలు చెప్పింది.

 త్రిజట స్వప్నవృతాంతము సీతతో జెప్పుట

 అమ్మా! సీతాదేవి! రాముని మేలుగోరు అవింధ్యుడనే వృద్ధరాక్షసుడు నీతో ఒక మాట చెప్పమన్నాడు. అంటూ చెప్పసాగింది త్రిజట, నిన్ను యెడబాసిన రాముడు లక్ష్మణునితో కలిసి వెదుకుతూవచ్చి సుగ్రీవుడనే వానరరాజును కలుసుకొని స్నేహంచేశాడు. రాముడిక వానరసేనతో వచ్చి నిన్ను రావణుని చెరనుండి విడిపించుక పోతారు. భయపడకు, రావణునికి రంభప్రియుడైన నలకూబరుని శాపమున్నది. ఆశాపంవల్ల అతడు ఇష్టంలేని స్త్రీలను బలాత్కరింపలేడు. మరొక విశేషము తల్లీ! నాకొక కలవచ్చింది. ఆకలలో రావణుడు వెంట్రుకలు విరబోసుకొని, తైలం శరీరమంతా పులుముకొని, గాడిదలుపూన్చిన రథంలో దక్షినంవైపునకు వెళుతున్నాడు. కుంభకర్ణాదులు అతనిచుట్టూ యెఱ్ఱనిమాలలు ధరించి, యెఱ్ఱనిలేపనములలుముకొని వెంట్రుకలు విరబోసుకొని, యముడున్న వైపునకు వెళుతూవున్నట్లు చూశాను. విభీషణుడు తెల్లని గొడుగునీడన, స్వేతపుష్పమాలను ధరించి ధైర్యంగా, సితశైలశిఖరంపై తన నలుగురు మంత్రుతోకలసి చిరునవ్వులతో ఆసీనులైవుండటం చూశాను. శ్రీరాముడు తన సితయశస్సు దిక్కులలుముకొనుచుండగా, ఒక మహాగజముపై లక్ష్మణునితో గలసి తేనెగలిపిన 

పాయసాన్నాన్ని సేవిస్తూ వస్తున్నట్లు కలలో దర్శించాను. సీతాదేవి! నీవు పులిచే గయపరచబడి రక్తముస్రవిస్తుండగా శోకిస్తూ, ఉత్తరదిశకు తొట్రుపాటుతో నేరుగా వెళ్ళడం కలలో చూశాను. అమ్మా! నాకల నిజమౌతుంది. నీభర్త పరాక్రమం ప్రదర్శించి నిన్ను వేగమే విడిపించుకొని పోగలడు. అని తనస్వప్న వృత్తాంతం త్రిజట, సీతకు తెలిపింది. త్రిజటమాటలు విని సీత కొంతఊరటజెందింది.

 రావణుడు సీతమీది వ్యామోహంతో వశందప్పి వికలమనస్కుడై వ్యవహరిస్తున్నాడు. దేవ దానవ గంధర్వాదిభుతవర్గాన్ని మొత్తం జయించాను. కానీ మన్మథబారినుండి తప్పించుకొనజాలకున్నానని వంతజెందుతూ, కల్పవృక్షం కదలివస్తున్నదా అన్నట్లు అశోకవనం ప్రవేశించాడు రావణుడు, కానీ చూపరులకతడు, మరుభూమిలోని మర్రిచెట్టువలె భీతిగొల్పిస్తున్నాడు. రోహిణినక్షత్రం దాపునకు శనిగ్రహంవచ్చి చేరినట్లు, సీతదగ్గరకు వచ్చిచేరుకున్నాడు రావణుడు. తనప్రేమ నొలకబోస్తూ, సీతా! అనవసరంగా దుఃఖించి కృషిస్తున్నావు. నాపై దయచూపించు. మాటలువేయేల రా! భూషణములలంకరించుకొని నన్నేలుకోమంటూ బ్రతిమలాడటం మొదలుపెట్టాడు. ఇంకా మాట్లాడుతూ  ఓసీతా! యక్షరాక్షస వియచ్చర కిన్నెర నాగ దేవతాకాంతలెందరినో కాదని, నిన్ను నేనుకోరుకోవడం నీ అదృష్టమని తెలిసుకోలేక పోతున్నావు. ఈవింకా బెట్టుచేయడం భావ్యమా? రాముడు తనఘనతను, రాజ్యాన్ని పోగొట్టుకొని, అడవులపాలైన అల్పమానవుడు. అతనికై దుఃఖభాజనవై పరితపించడం నీకు సుఖమనిపిస్తున్నదా? ఇకనైనా మాను మారామునిపై ధ్యాస. నేను సకలలోకేశ్వరుడను. నాకు దాసులై పదునాలుగుకోట్ల నిశాచరులున్నారు. ఇరువదియెనిమిదికోట్ల రక్కసులున్నారు. ఎనుబదియారుకోట్ల యక్షులున్నారు. దనాధ్యక్షుడైన కుబేరుని తమ్ముడను. బ్రహ్మకుదీసిపోని విశ్రవసుబ్రహ్మ నాకన్నతండ్రి. కుబేరునికి వినోదంకలిగించే, గంధర్వస్త్రీలు, అప్సరసలు నాసేవికలు. పంచమలోక పాలకుండనని నన్ను ముల్లోకములు కీర్తిస్తున్నవి. భక్ష్యబోజ్యవస్తువులు, దేవేంద్రునికున్నట్లు నావంటగదులలో అక్షయముగానున్నవి. నన్ను స్వీకరించి, నాకున్న యీవైభవమంతటినీ నీవుకూడా అనుభవించు. అంటూ ప్రేలుతున్న రావణునిపై క్రోధశోకవ్యాకులచిత్తయై వానిమొగముకూడా చూడకుండా, ఒకగడ్డిపోచను చేతబట్టుకొని రావణునికి చెప్పినట్లు సీత చెప్పసాగింది. నేను పరస్త్రీని. అబలను, పతివ్రతను, యికాచెప్పాలంటే మానవవనితను, నీవా రాక్షసుడవు, ప్రేమ యేమాత్రమూలేని నావలన నీకేమి సుఖం దక్కుతుంది? అంతేగాక ఆద్యుడైన బ్రహ్మపౌత్రుడవని, లోకపాలకులతో సమానుడవని, శివమిత్రుడైన కుబేరుని తమ్ముడవని నీఘనతను చెప్పుకున్నావు. అటువంటినీవు అన్నిధర్మాలుతెలిసి దుర్మార్గం విడవాలిగదా? సిగ్గుపడకుండా యీవిధమైన తుంటరిమాటలు పలకడం నీకేమైనా భావ్యమనిపిస్తున్నదా? అంటూ చీరకొంగున ముఖందాచుకొని, అతిదీనంగా యెదిరించింది సీత. రావణుడు మరికొన్ని దురూక్తులాడి అక్కడనుండి మాయమైపోయినాడు. సీత యధావిధిగా రక్షసవనితల కావలిలో వుండిపోయింది.

 రాముడు లక్ష్మణుని సుగ్రీవునొద్దకు బంపుట 

  మాల్యవంత పర్వతగుహలో వర్షాకాలమంతా రామలక్శ్మణులు కాలంగడిపారు. సీతావియోగ వ్యధతో శ్రీరాముడు కష్టంగా వర్షాకాలం గడపాల్సి వచ్చింది. వర్షంతో తడిసిననేలపై మొలకలు మొలిచి పచ్చగా కంటికింపుగొలుపుతున్నాయి. అవి శ్రీరామునకు కొంత ఉపశమనంగా వున్నాయి. శరత్కాలరాత్రులు విరహాన్ని హెచ్చిస్తున్నాయి. పగళ్ళు యీకాలంలో యెక్కువ, రాత్రిళ్ళు వెన్నెలలు విరగ్గాస్తాయి. ఆవెన్నెలస్నానం కలువపుప్పొడి పరిమళాలు, పిల్లగాలులచల్లదనాలు రాముని విరహబాధకు తోడయ్యాయి. వాటితాకిడికోర్వజాలక లక్ష్మణుని పిలిచి లక్ష్మణా చూచితివా! ఈసుగ్రీవుడు పనికిమాలినవాడు. వాలిని చంపించాడు. రాజ్యభిశిక్తుడయ్యాడు. ఇంద్రియసుఖములకు లోనై మనవైపు రావడమే మనేశాడు. మనకిచ్చినమాట నాతడు చెల్లించదలచినట్లులేడు. వెళ్ళు కిష్కిందవెళ్ళి ఆకృతఘ్నుని వాలిని పంపిన దారినే పంపిరా. ఇక వానిసహాయంకోసం యిక్కడవేచి వుండటం వృధా. అన్నాడు రాముడు. కొంతఆలోచించి  లక్ష్మణా! నీవతన్ని కలవకముందే మనకిచ్చిన మాటజ్ఞాపకముంచుకొని పనిప్రారంభించివుంటే, వాడినేమనక నావద్దకు పిలుచుకొనిరా అన్నాడు రాముడు. రామాజ్ఞ గైకొని లక్ష్మణుడు దనుర్బాణములు గైకొని సుగ్రీవునువద్దకు బయలుదేరాడు లక్ష్మణుడు. ఈవార్త తెలియగానే భయంతో సుగ్రీవుడు లక్ష్మణునికి యెదురేగి, నమస్కరించి స్వాగతమర్యాదలు చేసినాడు. లక్ష్మణుడు రామాజ్ఞ తెలిపాడు సుగ్రీవునకు. సుగ్రీవుడు చేతులుజోడించి లక్ష్మణా! నేనేల కృతఘ్నుడనయ్యెదను, సీతదేవిని వెదుకుటకు బలవంతులూ బుద్ధిమంతులునైన వానరవీరులను నలుదిశలకు పంపాను, వారు నెలదినములలో వనాలు, గిరులు, సముద్రాలు, నదులు, గ్రామాలు మొదలైన ప్రదేశాలన్ని గాలించి సీతమ్మజాడ కనుగొని వస్తామన్నారు. వారు రావడానికి యింకో అయిదుదినములు మాత్రమే మిగిలి యున్నవి. వారురాగానే స్వయంగావచ్చి రాములవారిని దర్శించుకున్నామనుకున్నాను. అని వినయంగా చెప్పాడు సుగ్రీవుడు. ఆమాటే వచ్చి శ్రీరాములవారికి చెప్పుమని లక్ష్మణుడు సుగ్రీవుని వెంటనిడుకొని రామునివద్దకు వచ్చాడు. సుగ్రీవుడుచెప్పిన విషయంవిని రాముడు సంతోషించాడు. నెలరోజులు గడవగనే తూర్పు, పడమర, ఉత్తరందిశకు వెళ్ళిన వానరులు తిరిగివచ్చి సీతమ్మజాడలెక్కడా గానరాలేదని శ్రీరామునకు విన్నవించారు. దక్షిణదిశ కెళ్ళిన వానరులేమైనా శుభవార్త తెస్తారేమోనన్న ఆశతో బాధతప్త హృదయులై వేచియున్నారు. ఇంతలో కొందరు వానరులు సుగీవునొద్దకు వచ్చి, మహారాజా! తమరు వాలిమహాశయులు ప్రీతితోపెంచిన మధువనంలో మన అంగదుడు, హనుమంతుడు మొదలైనవారు వచ్చిపడి, కావలియున్న మమ్ములను కొట్టి, ఫలాలన్నీపెరికితిని, పాడుచేశారని చెప్పారు. సుగ్రీవుడాలోచించి, వారు దక్షిణదిశకెళ్ళిన వానరులు. వారు సీతమ్మను వెదకి కనుగొన్నట్లున్నారు. ఆవిజయోత్సాహంతోనే, మధువనంలో భయంలేకుండ విహరించి వుంటారని తలచి శుభవార్తను రామునకెరిగించాడు. అక్కడ మధువనంలో హనుమదాదులు తేనెలుత్రాగి, తియ్యనిపండ్లుతిని, వృక్షాలనీడన విశ్రమించి, అక్కడి చల్లగాలులు, పూలసువాసనలతో ఆనందించి, తృప్తిజెంది, రామునివద్దకు వచ్చారు. అక్కడేవున్నసుగ్రీవుడు, వారిని శ్రీరామునికి పరిచయంచేసి రాముసన్నిధిన నిలిపాడు. కపులముఖాలపై వెలుగుతున్న కాంతిరేఖలనుగని శ్రీరాముడు సీతజాడ తెలుసుకొని వచ్చినారని గ్రహించాడు. హనుమంతుడు ముందుకువచ్చి, రామప్రభూ! చూచివచ్చితిని సీతమ్మనన్నాడు. తదనంతరం వారి ప్రయాణ విశేషాలన్ని చెప్పడం ప్రారంభించాడు. రామా! మేము కొండలుకోనలు అరణ్యాలునగరాలూ గాలిస్తూ సాగరముచే చుట్టబడియున్న భూమి దక్షిణభాగమంతా తిరిగాము.

 హనుమంతుడు రామునితో సీతను జూచిన వృతాంతంబు సెప్పుట

 కడకు సీతాదేవిని నేనుకనుగొనగలిగాను. దేవా! మేమందరము ఇక్కడాఅక్కడ అనక అన్నిచోట్ల గాలిస్తూ, ఒకచోట అద్భుతమైన నేలసొరంగాన్ని చూశాము. మేమా సొరంగమార్గంగుండా కొన్నియోజనాలు ప్రయాణించాము. అది క్రిమి కీటకాలుగలిగిన దారి. ఐనా లెక్కచేయకుండా ముందుకెళ్ళాము.  అక్కడ ఒక కాంతివంతమైన పురంకనిపించింది. ఆపురంలో ఒక తాపసాంగన కనిపించింది. తనపేరు ప్రభావతి యని, అది మయుని పట్టణమని తెలిపింది. మాకు తియ్యాని పదార్తాలు పెట్టి ఆకలితీర్చింది. ఎంతో ఆప్యాయతజూపి అక్కడనుండి బయటపడే దారిచూపింది. ఆదారిగుండా బయటకువచ్చి, మేము సహ్యగిరులను దద్దుర పర్వతశ్రేణిని దాటి మలయపర్వత శిఖరం చేరుకున్నాము. అక్కడనుండి చూస్తే మాకు సముద్రం కనిపించింది. సముద్రం భయంకరంగా అనంతమైనదిగా తోచింది. అందులోని పెద్దపెద్దచేపలు మొసళ్ళు పీతలు పెద్దపెద్ద అలలలో అగుపడి, మరలా సముద్రపులోతుల్లోకి పోవడం కనిపించింది. అక్కడనుండి పయనమై చిన్నచిన్న దీవులులకువెళ్ళి వెదికాం. సీతమ్మజాడమాత్రం తెలియలేదు. సముద్రపు అవతలిగట్టుకుచేరి వెదకాలనుకున్నాం. కానీ మాలోయెవ్వరికి ధైర్యం చాలలేదు. ఇక వెనుదిరిగివెళ్ళి రామునకు విషయం చెబుదామనుకున్నాం. కానీ అలాచేసి రామభూపాలుని మనస్సునొప్పించడంకంటే చావడం మేలనుకున్నాం. జలాన్నాలుమాని చచ్చిపోదాం, జటాయువు శ్రీరామునిసేవలో ప్రాణాలుపోగొట్టుకొని ఉత్తలోకాలకు వెళ్ళింది. మనకూ యికఅదేదారి, అని మట్లాడుకొంటుండగా, ఒకకొండంతపక్షి మాచెంతకువచ్చి అయ్యలారా! జటాయువని అంటున్నారు, అతడు నాతమ్ముడు. నాపేరు సంపాతి. మేము అరుణుని పుత్రులం, ఒకానొకనాడు మేమిద్దరం ఉత్సాహంగా సూర్యమండలంవైపు యెగురుతూవెళ్ళాం. నేను సూరునివేడికి తాళలేక రెక్కలుకాలి యిక్కడ పడ్డాను. నాతమ్ముడు జటాయువు మరెక్కడో యేఆపదా లేకుండా వాలిపోయాడు. నేను రెక్కలు కాలడంతో యెక్కడికివెళ్ళలేక యిక్కడే వుండిపోయాను. నాతమ్ముడు యెక్కడున్నాడో మీకు తెలుసా? అని మమ్ములనడిగాడు. మేము, జటాయువు రాముపత్నిని, రావణుని బారినుండి కాపాడనెంచి రావణునితో పోరాడి మరణించాడని చెప్పి, ప్రసుతంమేము సీతమ్మయెక్కడుందో తెలియక వెదుకుతున్నామని చెప్పాము. సంపాతి, తమ్ముని మరణవార్తవి దుఃఖించాడు. తదనంతరం  రామా! మీయోగక్షేమాలు అడిగితెలుసుకున్నాడు. అతడు రావణునిగురించి చెబుతూ, రావణుడు పరాక్రమదుస్సహుడు. ఇక్కడికి నూరుయోజనాల దూరంలో రావణుని లంకాపట్టణమున్నది. అక్కడమీకు సీతమ్మదొరరకవచ్చు, సాహసించి లంకకు వెళ్ళండని సలహాయిచ్చాడు. మేము సముద్రందాటి లంకకు యెలా వెళ్ళడమని ఆలోచనలో పడ్డాం. ఎవ్వరము సాహసించి యెగిరి లంకజేరడానికి సిద్ధంగాలేము. రామా! మీఆజ్ఞనెరవేర్చాలనే పట్టుదల, మాతండ్రివాయుదేవుని కృపతో నేను సాహచించాను. లోకులను ఆశ్చర్యపరచేపనియైనను, భయంకరమైన సముద్రాన్ని దాటగలిగాను. ఆఉప్పు సముద్రందాటి, అక్కడ మూడుశిఖరాలమద్య వెలుగొందుచున్న లంకాపట్టణాన్ని చూశాను. అందులో సువిశాలమైన కనకరత్నమయమైన యెత్తైన మేడలున్నాయి. అక్కడిసంపద నేనెక్కడా చూడలేదు. ఆపట్టణమంతా తిరిగి వెదికాను. వెదికివెదికి కడకు రావణుని అంతఃపుర ప్రాంతముననున్న, అశోకవనంలో ప్రవేశించాను. అక్కడ కన్నీరుకార్చికార్చి చారలేర్పడిన చెక్కిళ్ళతో, కృషించి బహీనమైన శరీరాన్ని చెట్టుకానించి, వేడినిట్టూర్పులు విడచివిడచి తత్కారణమున యెండిపోయిన పెదవులతో, హృదయవేదనతో శక్తిహీనయై తలవణుకుతున్నప్పటికీ సహజసౌదర్యముతో వెలుగొందుతున్న వనితను చూశాను. ఆమె "రఘువీర" "రామా రామా" యని విలపిస్తున్నందున ఆమెయె సీతమ్మయని గుర్తించాను. ఆమెదరిజేరి, రామలక్ష్మణులు క్షేమమనితెలిపి, నేను శ్రీరామదూతనని, వాయుపుత్రుడనని, మిమ్ములను వెదుకుతూ యిక్కడికి వచ్చిచేరితినని, కపిరాజు సుగ్రీవుడు, శ్రీరాములవారు స్నేహితులయ్యారని, వారు మిమ్ము రావణుని చెరనుండి విడిపించడానికి త్వరలో రానున్నారని భయపడకుమని ధైర్యం చెప్పాను. సీతమ్మకు నమ్మకంకలిగేట్లు అమ్మా! నేను నిజంగా వానరుడను, రాక్షసుడనుగాను, నన్ను నమ్మమని విన్నవించినంత, ఆమెలో ఉత్సంహం ధైర్యం కనిపించాయి. అన్నా! నిన్నునమ్ముతున్నాను, ఎందుకంటే అవింధ్యుడనే రామభక్తుడైన వృద్ధరాక్షసుడు అన్నివిషయాలు, త్రిజట అనే రక్షసస్త్రీద్వారా నాకు తెయజేసాడు.. అతడు చెప్పినవన్ని నిజాలే. నీకు జయమగుగాక! వెళ్ళి రామప్రభువును దోడ్కొనివచ్చి, నాకు ప్రీతినికలిగించు అన్నది సీతమ్మ. గుర్తుగా నాకొక శిరోరత్నమునిచ్చి పంపినది. మరింత విశ్వాసం గలిగేట్లు, మీరు చిత్రకూటపర్వతం మీదున్నప్పుడు జరిగిన మాయకాకి వృత్తాంతంకూడా నాకుచెప్పింది. న్నేను వస్తూవస్తూ లంకకు నిప్పుపెట్టి కాల్చి వచ్చాను. ఇదిగోప్రభూ! సీతమ్మశిరోరత్న మని రత్నాన్ని రామునకందించాడు హనుమంతుడు. ఆరత్నాన్ని సీతహృదయంగాభావించి శ్రీరాముడు హృదయానికి హత్తుకొని కన్నులుమూసికొని సీతాదేవిని కౌగిలిచుకున్నంతగా, భావోద్వేగానికి గురయ్యాడు రాముడు. కొంతసేపటికి తెరుకొని, సుగ్రీవా! దండయాత్రకు సిద్ధంకండని ఆజ్ఞపించాడు రామప్రభువు. మహాప్రసాదమని సుగ్రీవుడు నాల్గుదిక్కులనున్న వానరవీరులందరినీ వెంటనే యుద్ధానికి సిద్ధమై  రావలసిందిగా కబురంపాడు.

                  వానరవీరులు నానాదేశంబులనుండి సుగ్రీవునొద్దకు వచ్చుట 

సుగ్రీవునాజ్ఞవడసి గజుడు, గవయుడుఅనే వానరయోధులు రెందువందలకోట్ల వానరసైన్యంతో వచ్చి కిష్కిందలో వాలిపోయారు. కుముదుడనే వానరవీరుడు అరువదికోట్ల బలమైన వానరసైన్యంతో రామునిసాయమై వచ్చేశారు. సుసేణుడను వానరవీరుడు, వేయికోట్లబలగంతో విచ్చేశాడు. అతడు అజాతశత్రుడు. అతనిసైన్యము తోకలుపైకెత్తి ఉత్సాహంతో కేకలేస్తున్నాయి. దదిముఖుడనే వానరనేత లెక్కకుమిక్కుటమగా వానరసేన భూమిద్దరిల్లేటట్లుగా కదంత్రోక్కుతూ రామసేవకై విచ్చేశారు. శతసహస్రకోటి భల్లూకసేనతో యెలుగులరేడు జాంబవంతుడు నల్లని మేఘంవలె భయంగొల్పుతూ రామకార్యనిర్వహణకొఱకు వచ్చిచేరాడు. ఇంకావేనకువేలు కోతుల గుంపులతో వానరనాయకు లనేకులు కిష్కిందకు చేరుకున్నారు. వానరయోధలంతా వివిధఆకారాలుగలవారలై బలప్రదర్శనలిస్తూ విహరించసాగారు. ఎటుచూసినా కొండలపై చెట్లపై పెద్దపెద్దరాళ్ళపై వానరయోధులే కనబడుతున్నారు. లక్ష్మణుడు మహోత్సాహుడై సుగ్రీవాదులతో కలసి యుద్ధానికి సిద్ధంగావున్నారు. శ్రీరాముడొక శుభముహూర్తంలో వానరసైన్యాన్ని ముందుకు కదలమన్నాడు. శ్రీరాముడప్పుడు శత్రువులనే మంచును సులభంగా కరిగించే సూర్యునివలె ప్రకాశిస్తున్నాడు.

 హనుమంతుడు సర్వసైన్యాధ్యక్షుడై సైన్యానికి ముందునడుస్తున్నాడు. అంగదుడు, నీలుడు, నలుడు మున్నగుయోధులు, సైన్యాలకు నలుదిక్కుల నడుస్తూ రక్షణ గల్పిస్తున్నారు. ఎప్పుడెప్పుడు రావణునితో కలియబడదామా అన్నంత ఉత్సాహంతో వున్నారు కపివీరులంతా, దారిలోని వనఫలాలను తింటూ, నీటిచెఱువులు గలచోట్ల కొంతవిశ్రాంతి దీసుకొంటూ దక్షిణ సాగరతీరాన్ని చేరుకున్నారు. కపివీరులు గర్జిస్తూ, కేలలిడుతూ, సముద్రం గట్టున మరోసముద్రంవలె గన్పడుతున్నారు. ముందుకు వెళ్ళడమెలాగని ప్రముఖవీరులు ఆలోచిస్తున్నారు. ఆసమయంలో శ్రీరాముడు సుగ్రీవునిపిలచి, వానరరాజా! మనబలంబలగం అసామాన్యమైనది. సముద్రమా దాటనలవికానిది. ఇప్పుడేమిటి మనకర్తవ్యమ్మన్నాడు. అదివిన్న యితరవీరులు, తెప్పలసాయంతో సముద్రందాటుకున్నామన్నారు. మరికొందరు పడవలుసిద్ధం చేసుకొని సముద్రందాటుదామన్నారు. అందరుచెప్పిన మాటలువిని శ్రీరాముడు చిరునవ్వుతో యోధులారా! మనవిశాలసైన్యానికి తెప్పలు పడవలు సమకూర్చడం అసాధ్యం. ఒకవేళ సమకూర్చుకొని వెళ్ళినా, శతయోజన సుదీర్ఘ ప్రయాణంలో మనముండగా రాక్షససైన్యం చూస్తూ వూరకుంటుందా? దాడిచేస్తుంది. మనమేమైనా వ్యాపారంచేయబోతున్నామా? రణంచేయబోతునాంగదా? శత్రుసైన్యం మనల్ని సముద్రంలోనేచంపేస్తుంది. కనుక యీఉపాయం సమంజసంగాలేదు. నేనొకమాటచెబుతాను వినండి. నేను ఉపవాసదీక్షబూని సముద్రుని ప్రార్థిస్తాను, సముద్రుడు నాకు సహకరించి జలాలలో దారివిడిస్తే సరి. మంచిదే. ఇది సౌమ్యపద్ధతి. అలాకాని పక్షంలో రాజసవిధానంతో, అగ్నిబాణాన్ని సంధించి సముద్రాన్ని ఇంకింపజేస్తాను. సముద్రుని గడగడలడిస్తాను, అన్నాడు రాముడు.

                 రాముడు దర్భశయనుండై సముద్రుని బ్రార్థించుట 

శ్రీరాముడు, లక్ష్మణుడు ఉపవాసదీక్షలో దర్భశయనులై సముద్రుని ఉపాసించారు. సముద్రుడు సకలజలచరప్రకర పరివారుడైవచ్చి, రామా!నీవలన నేను ప్రీతుడనయ్యాను. నావలన నీకు జరుగవలసిన మేలేమని అడిగాడు. అప్పుడు రాముడు మేము లంకనుజేరడానికి దారివ్వమన్నాడు. ఇవ్వకపోతే రవిసమాన దివ్యాస్త్రంతో నిన్నుశోషింపక తప్పదన్నాడు. సముద్రుడు రఘువీరా! నేను నీమాటవినక నీకార్యానికి అడ్డుపడతానా? లేదంటే నేనొక్క మటచెబుతాను విను. ఇలా నీకుదారిస్తే, చులకనై తర్వాతివారు నన్ను వారి అస్త్రాలతో బెదిరించటానికి వస్తూనే వుంటారు. కనుక మీసైన్యంలో నలుడనే కపివీరుడున్నాడు. అతడు విశ్వకర్మ కుమారుడు. అతడుకూడా గొప్పశిల్పి, నిర్మాణదక్షత గలవాడు. అతడు నాపై తరులు గిరులు రాళ్ళు వేయించి సేతువు నిర్మింపగలడు. కపులువేసే తరులు గిరులను నేను భరించగలను. సేతువు నిర్మించి వెళ్ళి శత్రువిజయం సాధించుమని వేడుకున్నాడు సముద్రుడు. రాముడందుకు అంగీకరించి, నలుని పిలిచి సేతువు నిర్మిద్దాం అన్నాడు. నలుడు మీఆజ్ఞ అన్నదే తడవుగా, కపులు పెద్దపెద్ద చెట్లు, కొండరాళ్ళు తెచ్చి నలునిముందు వేయసాగారు. నలుడు తనవిద్యనంతటిని చూపెట్టి నూరుయోజనముల పొడవు పదియొజనముల వెడల్పుతో దిట్టమైన సేతువు నిర్మించాడు. ఇంతలో అన్నయైన రావణునితో విభేదించి విభీషణుడు తనఆప్తులైనవారితో కలసివచ్చి, రామప్రభువును భక్తితో శరణుజొచ్చాడు. రాముడు అతని ఆకారము, వినయశీలత జూచి మెచ్చుకొని, తనవానిగా గైకొన్నాడు. ఈవిభీషణునికి లంకారాజ్యంగెలిచి యిచ్చేస్తానని అందరిముందు ప్రతిజ్ఞ చేశాడు రాముడు. లక్ష్మణునితో స్నేహంకుదిర్చి, విభీషణుని మర్గదర్శిగా నియమించి, రాముడు సేతువుమీదుగా, సముద్రముదాటి సైన్యసమేతంగా లంకలో అడుగుపెట్టాడు శ్రీరాముడు. అక్కడి త్రికూటపర్వతమెక్కి పర్యవేక్షిస్తూ లంకాపట్టణంచుట్టూ తనసైన్యశిబిరాలను యెర్పాటు చేయించాడు. వానరసైన్యం శిబిరాలలో విడిసి, చుట్టూ తాటిచెట్లు, యేలకులతీగలు, మద్ది, తియ్యమామిడి, కానుగ, వేప, నిమ్మ వృక్షాలను చూసి ఆనందపడుతూ, తినదగినఫలాలను కోసుకొని ఆరగిస్తూ, హాయిగా విహరిస్తున్నాయి. ఆసమయంలో శుకసారణులను రాక్షసగూడచారులు వానరరూపధారులై వచ్చి, రామదండు రహస్యాలను తెలుసుకోజొచ్చారు. విభీషణుడు వారిని గుర్తించి, రామునకు పట్టిచ్చాడు. రాముడు వారినిజూచి నవ్వి, తీసుకెళ్ళి మనసైన్యానంతా చూపించి పంపండని ఆజ్ఞాపించాడు. వారు రామదండునంతా చూసివెళ్ళి రావణుని కలుసుకొని, రామలక్ష్మణుల తేజస్సును, అపారకపిసైన్యాన్ని, జయింపశక్యముగాని భల్లూకయోధులను గురించి వివరించి చెప్పారు. అవివిని రావణుడు యేమాత్రం బీతిల్లక సమరానికి సంసిద్ధుడయ్యాడు.

 లంకకోటబురుజులపై శిలలనురువ్వే యంత్రాలమర్చబడి యున్నాయి. ఎత్తైన సౌధాలున్నాయి. ఆసౌధాలపై ప్రత్యేకదిమ్మెలు నిర్మించబడి వాటిపై ధ్వజాలెగురుతున్నాయి. బలవంతులైన యొధులు తోమర, ముద్గర, ఆలాతక, ముసల, శూల, శర, శతఘ్నులతో యుద్ధసన్నద్ధులై యున్నారు. గుఱ్ఱాలు, యేనుగులు, రథాలపై యుద్ధవీరులు సిద్ధంగావున్నారు. ఏడుప్రాకారాలు, లోతైన అగడ్తలతో కోటదుర్భేద్యంగా వుంది. పశువులకు, సైన్యనికి కావలసి గడ్డి ధాన్యము మిక్కుటంగా లంకలో వుంది. రావణుడు యేమరపాటులేకుండా యుద్ధసన్నద్ధుడై వున్నాడు. ఇక్కడ రాముడు సుగ్రీవునితోకలిసి, సైన్యపర్యవేక్షణజేస్తూ, అంగదుని పిలిపించి అంగదా! రావణు వద్దకు రాయబారివైవెళ్ళి బుద్ధిచెప్పి సీతను మర్యాదగా వదలి పెట్టడం శ్రేయస్కరమని చెప్పమన్నడు రాముడు. అంగదుడు రామాజ్ఞను పాటించి లంకద్వారంవద్దకు చేరుకున్నాడు. ద్వారపాలకులు అంగదుని భీకరరూపాన్ని, తేజస్సును జూచి వెనక్కుతగ్గారు. సన్నిహితులతో గంభీరంగా చర్చలుజరుగుతున్న రావణకొలువుకూటం నేరుగా ప్రవేశించాడు అంగదుడు.

 అంగదు రయబారము

 ఇనకులతిలకుడు, విలువిద్యాపారంగతుడునైన శ్రీరాముని రాయబారి అంగదుడను, రావణా! మా రామప్రభువు చెప్పుమనిన పలుకులు వినుము. అనేకమంది పేదతాపసులను, యేఅపరధం చేయకున్నా నిష్కారణముగా చంపావు. దేవతాస్త్రీలను చెరబట్టి లోకాలను అల్లకల్లోలం చెసినావు. అదంతాఒకయెత్తు, ప్రత్యేకంగా నన్ను చెనకినావు, యిదిఒకెత్తు. సరే, నీవునిజంగా వీరునివైతే సమరానికి రా! అట్లుగాదంటే, నాకు శరణమని సీతను నాకజెప్పు. లెకుంటే నాశరాఘాతములకు నీప్రాణములర్పింపక తప్పదు. మనుజజాతియన్న నీకు చులకనగానున్నది. నేను రక్షసులనే మాటవినబడకుండా చేసిగాని విడువను. ఇవి రిత్తమాటలుగావు, త్వరగా తేల్చుకో, జాగ్రత్త. యని గర్జించి అంగదుదు పల్కగనే, ఆగ్రహించిన రావణుని కనుసైగతో నలుగురు రాక్షసులు వెంటనే పైబడి అంగదుని పట్టుకోజూచారు. అంగదుడు, గ్రక్కున హర్మ్యశిఖరమున కెగిరి, అటనుండి వానరశిబిరములకు దాటుకొని, వెళ్లి విషయమంతా రామునకెరిగించాడు.

            కొండంత శరీరాలుగల వానరులు పెక్కురంగులలో కనిపిస్తున్నారు. వారు తాటిచెట్లను, సాలవృక్షములను బెరికి తమఆయుధాలుగా జేసుకొని యున్నారు. కొందరైతె పెద్దపెద్దరాళ్ళను తమవద్దవుంచుకొని శత్రులపై విసరడానికి సిద్ధంగావున్నారు. వారుచుడ్డానికి ఒక్కొక్కరు ఒక యమునివలె గోచరిస్తున్నారు. తోకలకు రంగుకుచ్చులు కట్టుకొని ఉత్సహంతో గంతులువేస్తున్నారు. ఆవానరులు ఒకక్రమం ప్రకారం వరుసలు వరసులుగా కదులుతూ రకరకాలుగా అరుస్తున్నారు. చూడటానికి ఆవానరసైన్యం పొంగివస్తున్న సముద్రపు కెరటాలవలె కనిపిస్తున్నారు. పట్టశక్యంకాని రౌద్రులై వారు కొన్నిచోట్ల కోటగోడలను కూల్చేశారు. పురద్వారతోరణాలు, పతాకలు పెరికివేశారు. ద్వారపాలకులను కొట్టి తరిమేశారు. కోటప్రాకారాలపై నిలువయుంచిన గదలు, పరిఘలు, కుంతములను పురంమధ్యకు విసిరేశారు. దాంతో పురవాసులు ఆహాకారాలుచేస్తూ పరుగిడజొచ్చారు. రావణుడు విషయంతెలిసి అనేకకోట్ల రాక్షససైన్యాన్ని పంపి వానరులను అదుపుచేశారు. ప్రాకారాలపై తొలగించిన ఆయుధాలన్నిటిని, మరలా యధాస్థానంలో వుంచారు. లంకాపురదుర్గం కోతులదాడితో కపిల (పుల్లని) వర్ణంగా మరినదానిని మరలా ఘనమైనమబ్బు రంగులోనికి మార్చేశారు రాక్షసులు. వెనుదిరిగి వస్తున్న వానరసేనలకు రామలక్ష్మణులు తిరిగి ఉత్సాహంకల్పించి, వారుకూడా రణరంగంలోనికి దుమికారు. తిరిగి లంకాదుర్గం వనరసేనతో నిండిపోయింది. రాక్షసులు భయపడ్డారు. ప్రాకారరక్షకులైన రాక్షసులు మాత్రం ధైర్యంగా యెదురుతిరిగి ప్రాకారంపై తిరిగి అమర్చిన ఆయుధాలతో కపిసైన్యాన్ని అదుపుచేయ యత్నించారు. వానరులు మొండిగా రాక్షసులపై ఘనవృక్షాలతోను, బండరాళ్ళతోను యెదురుదాడిచేసి, కోటగోడలపైకి ప్రాకడం మొదలుపెట్టారు. ఆవిధంగా రాక్షసులు కపులు బాహబాహి తలపడ్డారు. పరిస్థితిని గమనించి రావణుడు రాక్షసయోధులైన పర్వతుడు , ప్రఘసుడు, ఖరుడు, కోధవశుడు, ప్రజుడు ననువారిని, వారికి తోడుగ రక్కసి పిశాచగణాలను పంపగా మాయలచేత అదృశ్యరూపులై వారు కపిసైన్యాలను ముప్పతిప్పలు పెట్టారు. విభీషణుడు ఆమాయలన్నీ తెలిసినవాడైనందున స్వతహగా యుద్ధభూమికివచ్చి, తనపరాక్రమంతో రాక్షసయోధుల నెందరినో హతమార్చాడు. చావగామిగిలిన రాక్షసులు రావణుని వద్దకువెళ్ళి రాక్షసుల పరాభవాన్ని చెప్పుకున్నారు. రావణుడు తనమంత్రులతో గూడుకొని యేనుగులు గుఱ్ఱాలపై రణరంగప్రవేశం చేశారు. వారిబలగాల పదఘట్టములకు భుమి అదిరిపోయింది. ఆవిధంగా రావణుడు బయలుదేరి, రాక్షసగురువు శుక్రచార్యుల సలహా మేరకు వ్యూహాన్నమలుజరిపి వానరసేనపై విరుచుకపడ్డాడు. వెంటనే శ్రీరాముడు దేవగురువు బృహస్పతి సలహాతో ప్రతివ్యూహాన్నిపన్ని యెదుర్కున్నాడు. ఇరువైపుసైన్యాలు అకాండక్షుభిత రెండు సాగరాలు ఒకదానితో ఒకటి డీకొన్నట్లైనది. అప్పుడు రాముడు రావణునితో తలపడ్డాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుతోను, సుగ్రీవుడు విరూపాక్షునితోనూ, దారుడు నిఖర్వునితోనూ యుద్ధం చేశారు. యుద్ధం దేవదానవుల యుద్ధంవలె భీకరంగా సాగింది. లక్ష్మణుడు రావణునికొడుకును పదునైన బాణాలతో నొప్పించాడు. వాడునూ, రణభూమిలో స్థిరంగానిలచి, లక్ష్మణునితో ధీటుగా పోరుసాగించాడు. రామరావణులు యెవరికి యెవరూ తీసిపోనివిధంగా ఒకరిపైఒకరు బాణవర్షాన్ని కురిపించారు. వారిద్దరూ సమవుజ్జీలుగా రణభూమిలో నిలచినప్పటికి, రాముడంతగా తనధాటినెదిరించి నిలవడం రావణునికి ఆశ్చరర్యమేసింది. రాముని యుద్ధంలో నిలువరించడం తనకసాధ్యమనిపించింది. యుద్ధంచాలించి పురానికి మరలిపోయడు రావణుడు. రాక్షసులు భయంతో వెనుదిరిగి పరిపోజొచ్చారు. నిర్భయుడై ప్రహస్తుడు చెదిరినసేనలకు ధైర్యంగల్పించి తిరిగీ భీకరపోరు సాగించాడు. అదేసమయంలో విభీషణుడు నాయకత్వంవహించి వారరసేనలను ముందుకునడిపి ప్రహస్తుని డీకొని ఘోరయుద్ధం చేశాడు.

ప్రహస్త ధూమ్రాక్షుల యుద్ధము 

యుద్ధవిద్యలో ఆరితేరిన ప్రహస్తుడు విభీషణునితో పోరుసలుపుచున్నాడు. మొనలు తెల్లని యెముకవలె నుండి వెనుక నెమలియీకలు కట్టిన బాణాల రాకపోకలతో ఇద్దరుయోధులు రంగురంగుల మబ్బులతో ఆవరించబడిన పర్వతాలవలె భాసిస్తున్నారు. ప్రహస్తుడు సింహనాదం చేస్తూ పరిఘను విసరాడు. అది యేనుగుతొండం గట్టిగా తాకినట్లు విభీషణుని తాకింది. విభీషణుడు హేమకూటపర్వతంవలె స్థిరంగానిలచి యేమాత్రం జంకక ఆగ్రహంతో శతఘంటాపరిభూషితమైన "శక్తి"ఆయుధాన్ని మంత్రించి వదిలాడు. అది ప్రళయకాల మహాగ్నిజ్వాలవలె నిప్పులుగ్రక్కుతూ వెళ్ళి ప్రహస్తుని రొమ్మునుచీల్చి ముక్కలుముక్కలు చేసింది. అంతటితో ప్రహస్తుడు నేలకొరిగి శివైక్యం జెందాడు. ప్రహస్తుడు పడిపోవడం చూసిన ధూమ్రాక్షుడు చెదిరిన సైన్యానికి ధైర్యంచెబుతూ విజృంభించాడు. వానిధాటికి వానరసైన్యం కకావికలమైంది. వెంటనే హనుమంతుడు మహాపరాక్రమంతో వానరసేనకు బాసటగా నిలచి పోరు ఉదృతంచేశాడు. హనుమంతుని అండతో వనరులదే పైచేయయ్యింది. వానరుల కాలితన్నులకు రథాలువిరిగిపడ్డాయి. కపులు విసిరిన బండరాళ్ళకు యేనుగులు ఘీంకారాలుచేస్తూ నేలకొరిగాయి. వృక్షాలను విసరడంవల్ల గుఱ్ఱాలు చచ్చిపడ్డాయి. కపులు గోర్లతోబరికి పళ్ళతోకొరికి రాక్షసులను తరిమితరిమి చంపారు. కొందరు పారిపోయారు. మరికొందరు ధూమ్రాక్షుని వెనక్కువెళ్ళి రక్షణబొందారు. ధూమ్రాక్షుడు చెలరేగిపోయాడు. ప్రళయకాల మేఘంవలె భీకరరవంజేస్తూ, వేలాదిబాణాలను వరుసగా ప్రయోగిస్తూ వానరసైన్యాన్ని నాశనంచేశాడు. పరిస్థితి గమనించి హనుమంతుడు వాయువేగంతోవచ్చి ధూమ్రాక్షునితాకి, భయంకరయుద్ధంచేశాడు. ఆయుద్ధం పూర్వం దేవేంద్రునికి ప్రహ్లాదునికి జరిగిన యుద్ధంవలె భయానకరూపం దాల్చింది. గదలు పరిఘలు ధూమ్రక్షుడు ప్రయోగిస్తే, హనుమంతుడు గండశిలలు, పెద్దపెద్దవృక్షాలు పెరికి ధ్రూమ్రాక్షునిపై విసిరాడు. ఈవిధంగ యుద్ధంసాగుతుండగా, హనుమంతుడు లాఘవంగా ధూమ్రాక్షుని సమీపించి, పెరికితెచ్చిన ఒకమహవృక్షంతో తలవ్రక్కలయెట్లు మోదాదు. బుగబుగమని రక్తంపొంగి నేలపైబడి బురదబురదయ్యింది. ధూమ్రాక్షునితల ఆబురదలో కూరుకపోయి గిలగిలకొట్టుకొని చచ్చాడు. కపిసైన్యం రెచ్చిపోయి హనుమంతుని కీర్తిస్తూ, రాక్షససేనపై విరుచుకపడ్డాయి. వారు నిలువలేక పారిపోయి రావణునిజేరి, ప్రహస్త ధూమ్రక్షుల మరణవార్త నెఱింగించారు. రావణుడు కన్నీరుకారుస్తూ, ఎఱ్ఱబడిననేత్రాలతో, వేడినిట్టూర్పులు విడుస్తూ, ఉన్నవారు మరణించారు. కుంభకర్ణుడు నిద్రలోవున్నాడు. ప్రస్తుతం అతడున్నా లేనట్లే, ఏమిచేయాలి వాడిని నిద్రలేపడమా? లేక నేను, నాపుత్రులూవెళ్ళి రామదండునెదుర్కోవడమా? అని వితర్కించి కుంభకర్ణుని లేపవలసిందేనని నిశ్చయించి, కుంభకర్ణుని పడకటింటికి భటులను పంపి లేపమన్నాడు. వారువెళ్ళి, భేరీ మృదంగ ములను గట్టిగా వాయించారు. బూరలు ఊదారు. గంటలుగొట్టారు. కలకలధ్వనులు చేశారు. సింహననాదాలుచేశారు. ఆశబ్దాలకు అటుయిటూ ద్రొల్లి, ఆవులించి, వళ్ళువిరుచుకొని, కళ్ళుతెరచి, నలువైపులజూశాడు కుంభకర్ణుడు. అప్పటికే రావణుడక్కటికి చేరుకొనియున్నాడు. రావణుడు మేల్కొన్న కుంభకర్ణునిజూచి, ప్రియతమ్ముడా! లోకంలో నీవంటి నిద్రాలోలుడున్నాడా? నీవేమో నిదపోతున్నావు. ఎవరికేఆపదగలిగినా నీకు తెలిసే అవకాశంలేదు. ఆవిధంగా నీవు అదృష్టవంతుడవే. మనకుగలిగిన ఆపదలేమిటో నీకు దెలియునా? దశరథమహారాజు కొడుకు రాముని భార్యను నేనపహరించాను. అందుకు ఆరాముడలిగి, కోతిమూకను వెంటబెట్టుకొని సముద్రముపై సేతువునిర్మించి దానిపైనుండి లంకకువచ్చి, లంకచుట్టూ కోతులనుదింపి మనపై యుద్ధంప్రకటించాడు. ఇప్పటికే ప్రహస్తాది మహవీరులను చంపేశాడు. ఇక నీవుదప్ప లంకను రక్షించగలవారు వేరెవ్వరూలేరు. లేచి రామదండు నెదుర్కొని మట్టుబెట్టు. నీకుతోడుగా దూషణునితమ్ములు ప్రవేగ, ప్రమాదులు నిలుస్తారు, వేగమె యుద్ధానికి సిద్ధంకా. అన్నాడు రావణుడు. కుంభకర్ణుడు, సరియని, వలసిన ఆయుధసంపత్తిని కూర్చుకొని, రాక్షసవీరులు వెంటనడువగా యుద్ధానికి బయలుదేరాడు.

                                 కుంభకర్ణుడు యుద్ధముసేయుట

 వానరులు కుంభకర్ణుని వికార, భయంకరరూపంజూచి జడుసుకున్నారు. వెంట్రుకలు అగ్నిశిఖలవలె యెఱ్ఱగావున్నాయి. శరీరం నల్లనిమేఘవర్ణంలో నున్నది. కోపంతో వాని కన్నులు యెఱ్ఱ బారి వున్నాయి. పండ్లు పటపటా కొరకడంవల్ల పెదవులుతెగి రక్తము స్రవిస్తున్నాయి. పొడవాటి వాని బాహువులూపినప్పుడు, దిక్కులకొసలు తగులుతున్నట్లనిపిస్తున్నది. ముల్లోకాలనూ వీడొక్కడే గెలువగల డనిపిస్తున్నది. కుంభకర్ణుడు వనరసేనను లెక్కసేయక రామలక్ష్మనులున్నచోటికి వేగంగా కదులుతున్నాడు. వానినడ్డగించడానికి పెద్దపెద్ద వృక్షాలు, గండశిలలు దారికడ్డంవేశారు. మీదబడి గోళ్ళతోగీకి, పళ్ళతోకొరికారు. దాంతో వాని నిద్రమగత కొంత వదిలింది. అడ్డువచ్చిన కోతుల్ని కుంభకర్ణుడు మింగేస్తున్నాడు. ప్రళయకాల యమునివలె అతడు కపులను నలిపేస్తున్నాడు. బలుడు, చండబలుడు మొదలైన వనరసేనాపతులనూ వేలకొలది కపిసైనికులను కుంభకర్ణుడు కబళించేశాడు. వానిరాకను నిలువరించలేక తారుడు మొదలైన కపినాయకులు చెదరి నలుదిక్కులకు పారిపోయారు. కుంభకర్ణుడు నిరటంకంగా ముందుకు వస్తుండటంతో, సుగ్రీవుడు ఒకపెద్ద సాలవృక్షాన్ని బెరికి వానితలపైమోదాడు. అంతటితో వాని మిగిలినమజ్జుకూడా వదలిపోయింది. సింహనాదంచేస్తూ కుంభకర్ణుడు, సుగ్రీవుని తనరెండుచేతులుచాచి పట్టుకున్నాడు. లక్ష్మణుడదిచూచి రగిలిపోతూ, పిడుగువంటి గొప్పబాణాన్ని కుంభకర్ణునిపై వదిలాడు. దాని తీవ్రమైనదెబ్బకు వాడు హడలిపోయి, రెట్టించిన కోపంతో సుగ్రీవునివదలి, ఒక గండశిలను చేతబూని లక్ష్మణునివైపు నడిచాడు. వెంటనే లక్ష్మణుడు వాడిబాణాలతో  వాని రెండుచేతులను ఖండించాడు. కుంభకర్ణుడు మాయలుజూపి నాలుగుచేతులతో కనిపించాడు. లక్ష్మణుడు వాటినికూడా నరికేశాడు. వాడు అనేక చేతులు కాళ్ళతో, తలలతో కనబడినాడు. ఇక ఆలస్యంచేయకూడదని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుని పడగొట్టేశాడు లక్ష్మణుడు. ఒకపెద్దపర్వతంవలె నేలకొరిగాడు కుంభకర్ణుడు. వెనువెంటనే దూషణుని తమ్ములు వజ్రవేగుడు, ప్రమాది లక్ష్మణునిపై విరుచుకపడ్డారు. లక్ష్మణుడు కూడా వారికేమాత్రం దీసిపోకుండా, వారినెదుర్కున్నాడు. వారిమధ్య జరిగినయుద్ధం చూచేవారికి వెంట్రుకలు నిక్కబొడుచుకునేట్లు చేశాయి. ఆసమయంలో హనుమంతుడు, నీలుడు కొండలంత రాళ్ళనుదెచ్చి వారిద్దరిపై విసరినారు. అంతటితో వారు ఆగండశిలలక్రిందబడి నలిగి కనుగొనలేనంతగా రూపములుచెడి చచ్చారు. ఆవీరరక్షసులు మరణించటంతో, వానరసేనలు ఉత్సాహంతో సింహనాదాలు చేశాయి. మిగిలిన రాక్షసులు కాకులవలె ఆహాకారాలుచేస్తూ, లంకాపట్టణంలోనికి పరుగులు తీశారు. వారినిజుచి లంకవాసులు భయకంపితులయ్యారు. వార్త రావణునికి చేరిపోయింది. తనప్రియతమ్ముడు, కుంభకర్ణుడు మరణించుటయు, దూషణుతమ్ములు నామరూపాలులేకుండా జచ్చుటయు వివి దుఃఖము పొంగిపొరలగా బిగ్గరగా విలపించాడు. అప్పుడక్కడకు కవచంధరించి, తూణీరం బాణాలతోనింపుకొని, ప్రచండమైన విల్లునుదాల్చి, ఖడ్గములు, గదలు మొదలైన ఆయుధములు రథంలోబెట్టుకొని, దేవేంద్రుని హృదయమనే సగరాన్ని మథించిన మంథరపర్వతంవలె భాసిల్లు మేఘనాథుడు తండ్రి  రావణునివద్దకువచ్చి, తండ్రీ! యేలనీకీ విచారము. నేనుండగా మీశత్రువుల శౌర్యం చెల్లుబాటౌతుందా? వృత్రాసురుని వధించిన దేవేంద్రునే గడగడలాడించిన మీముందు ఆకోతిమూకల బలమెంత? రామదండును ఓడించడం నాకత్యంతసులభం. ముందునన్ను యుద్ధమునకు వెళ్ళైనిమ్ము. శత్రువులను తృటిలో హతమారుస్తాను. గుంపుగూడిన ఆకోతులను, కొండముచ్చులను, నాకోపాగ్నికి బలిచేస్తాను. బాణపరంపరతో వీరవిహారంచేసి, ఆరామలక్ష్మణులతో వినోదవిలాసంగా యుద్ధంచేస్తాను. ఆఅన్నదమ్ములను బంధించి మీముందు పడేస్తాను, నామాటనమ్ముమంటూ వీరోక్తులాడాడు మేఘనాథుడు. కొడుకు మటలకు పొంగిపోతూ, మండోదరీనాథుడు, కుమారా! నీవెంతటి పరాక్రమవంతుడవో నేనెఱుగుదును. నీభుజబలంతోనే నాకూ మనలంకకూ గొప్పకీర్తిని, సంపదనూ ఆర్జించిపెట్టావు. నీవీరత్వంతో దేవేంద్రుని గెలిచి, తెచ్చి నాసేవకునిగా నియమించినావు. నీయంతటి మాయావిద్యానిపుణుడు మరొకడు లేడు. శత్రువులను భ్రాంతికి గురిచేసి ముప్పతిప్పలుపెట్టగల సమర్థుడవు. రణరంగమున నేవైపునుండి అస్త్రప్రయోగముచేయుచున్నావో కుడా శత్రువులు గుర్తించలేరు. నీధాటికారామలక్ష్మణులు తాళలేరుగాకతాళలేరు. వెళ్ళు, వెళ్ళి శత్రునాశనంగావించి, మనకోసం, మనయీ లంకగౌరవంకోసం, ప్రాణాలర్పించిన వీరుల ఋణందీర్చు. విజయీభవ! అంటూ రావణుడు కొడుకును కౌగలించుకొని వీడ్కోలుపలికాడు.  ఇంద్రజిత్తు రథమధిరోహించి వేగంగా రణరంగప్రవేశం చేశాడు. ఎదురుగా వచ్చిన వానర సేనలను సరకుచేయక మున్ముందుకు వెళ్ళి చెయ్యెత్తి లక్ష్మణుని యుద్ధానికాహ్వనించాడు.

                             ఇంద్రజిత్తు లక్ష్మణునితోడ యుద్ధము సేయుట 

లక్ష్మణుడు మేఘనాదుని పిలుపు విని, భూమ్యాకాశాలు మారుమోగేట్లు ధనువు అల్లెత్రాటిమ్రోతను వినిపించి, మత్తగజమును చూసి లంఘించే సింహంవలె యెగిరిదూకాడు లక్ష్మణుడు. ఇద్దరు యోధులూ సింహనాదాలుచేస్తూ, తలపడ్డారు. మేఘనాథుడు లక్ష్మణుని మించిపోవాలని చూస్తున్నాడు. ఆవిధంగానే లక్ష్మణుడు కూడా మేఘనాథుని అణచివేయజూస్తున్నాడు. తోమరములు మేఘనాథుడు లక్ష్మణునిపై ప్రయోగించాడు. వాటిని లక్ష్మణుడు తనశరములతో మధ్యలోనే తునాయునకలు చేశాడు. ఇంతలో అంగదుడు జొరబడి ఒకపెద్దవృక్షంతో మేఘనాథుని తలపైమోదాడు. అయినా మేఘనాథుడు యేమాత్రం చలించక, ఒకపదునైన ఈటెతో అంగదుని వేయజూచాడు. లక్ష్మణుడు దానిని తనబాణాలతో మధ్యనే విరిచేశాడు. మేఘనాథుడు తనగదతో దాడికి దిగాడు. అంగదుడు ఒకసాలవృక్షంతో వానినెదుర్కున్నాడు. ఆసాలవృక్షందెబ్బకు ఇంద్రజిత్తు రథంవిరిగిపోయి, సారథి మరణించాడు. వెంటనే మేఘనాథుడు మాయమై మేఘాలలో కనబడ్డాడు. అక్కడమాయమై మరోదిక్కున కనబడ్డాడు. ఆవిధంగా అంచనావేయడానికి వీలులేకుండా వానరసేనను గందరగోళానికి గురిచేశాడు. చిచ్చరపిడుగువంటి బాణాలతో కపిసేననేగాకుండా రామలక్ష్మణులను కూడా బాధించాడు. రామలక్ష్మణులు శబ్దవేదిఅస్త్రాలతో మాయాయుద్ధం చేస్తున్న మేఘనాథుని యెదుర్కున్నారు. సుగ్రీవాదులు  వృక్షశిలాప్రకరములతో ఆకాశాని కెగిరి మేఘనాథుని శిక్షించాలనిచుశారు, వారిఆటలు సాగలేదు. మాయలతో వారికి చిక్కలేదు మేఘనాథుడు. వారివల్లగాక భూమికిదిగారు వానరయోధులు. ఇంద్రజిత్తు తనవాడిబాణాలతోకపిసైన్యాన్ని కకావికలుజేసి, రామలక్ష్మణులపై ప్రయోగించిన బాణపరంపరకు రఘువీరులు మూర్చిల్లారు. వారప్పుడు ప్రళయకాలంలో డుల్లిపడిన సూర్యచంద్రులవలె నేలపై పడిపోయారు. ఇంద్రజిత్తు విజయగర్వంతో సింహనాదంచేశాడు. వెనువెంటనే నాగాస్త్రాన్ని ప్రయోగించి, రామలక్ష్మణులను బంధించాడు. అదిచూచి సుగ్రీవ సుషేణ జాంబవత్ప్రముఖులు దిక్కుతోచనివారై విలపించసాగారు. విభీషణుడు పరుపరుగునవచ్చి తనబ్రహ్మాస్త్రంతో రామలక్ష్మణుల నాగబంధాన్ని విడిపించాడు. సుగ్రీవుడు విశల్యకరణి యను ఓషదందెచ్చి వారిని స్వస్థపరిచాడు. రామలక్ష్మణులు తిరిగి యుద్ధంచేయబూనగా, విభీషణుడు నమస్కరించి రామా! కిన్నెరనాథుడైన శ్వేతుడు మీకొఱకు దివ్యమైనజలాన్ని పంపాడు. ఈజలంతో మీరుకళ్ళు కడగండి, మీకు అదృశ్యరూపంలోనున్న భూతచయమంతా తేటతెల్లంగా కనబడతాయి. దానితో మేఘనాథుని మాయలు మీముందు పనిజేయవు. వాడెక్కడున్నా మీకు స్పష్టంగా కనబడతాడు. అప్పుడు మీరు దాడిచేయండి అన్నాడు. విభీషణుని మాటప్రకారం రామలక్ష్మణులు ఆదివ్యజలంతో కళ్ళుకడుక్కొని యుద్ధానికి దిగారు. ఇంద్రజిత్తు తనమాయలు వృధాయని తెలిసికొని, వెంటనే హోమంచెయ్యటానికి బయలుదేరాడు. విభీషణుడు లక్ష్మణునితో లక్ష్మణా! ఇంద్రజిత్తు హొమంచేస్తే, అసాధ్యుడౌతాడు. ముదుకుబోనీకు, అడ్డుకొని చంపేయి, అన్నాడు. లక్ష్మణుడు ముందుకుబోనీక ఇంద్రజిత్తునడ్డుకున్నాడు. కోపంతో రగిలిపోతూ మేఘనాథుడు, ఉజ్వలమైనబాణాలతో లక్ష్మణుని బాధించాడు. లక్ష్మణుడు యేమాత్రం వానిదాడిని సరకుగొనక యెదిరించి నిలబడ్డాడు. వారియుద్ధం భీకరమైన రెండుయేనుగులవలె, రెండుబెబ్బులులవలె బలమైన రెండుసింహాలవలె పోరుసలిపారు. యుద్ధభూమిలో ఇరుపక్షాలవారు యుద్ధంమాని ఆశ్చర్యంతో మేఘనాథ లక్ష్మణయుద్ధాన్ని వీక్షింపదొడిగారు. ఇంద్రజిత్తుపై తీవ్రమైన బాణపరంపరను లక్ష్మణుడు ప్రయోగించాడు. ఇంద్రజిత్తు యెనిమిదిబాణాలను లక్ష్మణునిశరీరంపై నాటాడు. లక్ష్మణుడు కోపంతో మండిపడుతూ, ధనుష్టంకారంచేస్తూ, ఇంద్రజిత్తుతో భీకరయుద్ధంచేస్తున్నాడు. 

ఇంద్రజిత్తు లక్ష్మణునిచేత జచ్చుట

 వాడియైన రెండుభల్లాలతో లక్ష్మణుడు ఇంద్రజిత్తు రెండుచేతులను ఖండించాడు. వెనువెంటనే మరోవాడి భల్లంతో ఇంద్రజిత్తు శిరస్సును ఖండించాడు. ప్రకాశవంతమైన పసిడికుండలాలతో, మెఱుస్తున్న ఇంద్రజిత్తుతల నేలనుతాకింది. వజ్రాయుధందెబ్బకు నేలకొఱిగిన కులపర్వతశిఖరంవలె ఇంద్రజిత్తు శరీరం నేలపైబడింది. అదిచూచిన రక్షససేనలు భీతిల్లిపోయయి, కపిసేనలు సింహనాదాలు చేశాయి. తనయుని మరణవార్తవిని రావణుడు శోకవివశుడై బోరున రోదించాడు. కన్నీరొలుకగా, పదినోళ్ళూదెరచి భీకరరావంచేశాడు. కోపంపట్టలేక అశోకవనంవెళ్ళి సీతనుచంపడానికి చంద్రయుధంతీశాడు. అప్పుడక్కడున్న వృద్ధఅవింధ్యుడు అడ్డుపడి, దశాననా! మహేంద్రాది దేవతానికరాన్ని యుద్ధంలో ఓడించి, ముల్లోకములలో పేరుగడించిననీవు ఒక్క‍అబలనుజంపి అపకీర్తిని మూటగట్టుకుంటావా? వెళ్ళి రాముని దునుమాడు. అంతేగాని మగువనుజంపితివన్న చెడ్డపేరునీకెందుకు? అనిఅనినంతనే సీతనువదలి ఆగ్రహావేశముతో సమరసన్నాహంతో రథమెక్కి, రాక్షససైన్యంతో రణరంగంప్రవేశంచేశాడు. సుగ్రీవాది కపివీరులు మహోత్సాహులై గండశిలలు, మాకులు దీసుకొని రావణుని కెదురుగావచ్చి, రాక్షససేనతో తలపడ్డారు, అప్పుడు రావణుడు మాయలు ప్రయోగించి తనశరీరంనుండి ఆయుధధరులైన రాక్షసులు సహస్రసంఖ్యలుగా పుట్టుకొచ్చారు. వెంటనే రాముడు వారినందరినీ బాణవర్షంతో సులభంగా దునుమాడినాడు. రావణుడీసారి రామలక్ష్మణుల వలెనున్న అనేకమంది యోధులను సృష్టించాడు. అయినా రావణుని మాయలకు భ్రమపడక వారినిగూడా నేలగూల్చారు. దేవేంద్రుడు రాముడు రథంలేకుండా, రావణుడు రథంపై నుండటం గమనించి, ఉదయసూర్యతేజంతో వెలుగొందుతూ, బలమైన‍అశ్వాలుగూర్చబడి, వైజయంతి పతాకలతో విరాజిల్లుతున్న రథాన్ని మాతలిని సారథిగా నియమించి పంపాడు. మాతలి రథాన్ని యుద్ధభూమిలోనిలిపి, రామా! ఇది దేవేంద్రుని రథం. రాక్షసులనెందరినో యీరథమెక్కి దునుమాడినాడు ఇంద్రుడు. నాసారథ్యమమోఘం. వచ్చిరథమెక్కి రావణుని ఓడించమన్నాడు. రాముడు మాతలిమాటను మన్నించి, రథమెక్కి వింటినారినిమీటి భయంకరశబ్దంచేశాడు. రాక్షసులపై శరవర్షం కురిపించాడు. ఆసమయంలో రావణుడు, విలయానలదుస్సహమూర్తియై తనరథాన్ని రామునిపైకి నడిపించాడు. అమ్ములపరంపరలు ప్రయోగించి, దిక్కులుకానరాకుండా చేశాడు. ఆకాశంనుండి అదిచూస్తున్న దేవతలు ఆతురత, ఆవేదనలకు గురయ్యారు. రామరావణయుద్ధం రానురాను ఉగ్రరూపం దాలుస్తున్నది. రావణుడు నిబిడజ్వాలాకరాలంబైన శూలము రామునిమీద ప్రయోగించాడు. రాముడు దానిని తనదివ్యశరమున మద్యలోనే విరిచేశాడు. కొపోద్రిక్తుడై రావణుడు తిరిగీ శతసహస్ర శూలాలు పిండివాలములు, తోమరములు, శరములు ప్రయోగించి ఆకాశమంతా ఆయుధపంక్తులతో నింపేశాడు. దానితో సకలభూతములు ఆహాకారవ్యాకులములయ్యాయి. అసురసైన్యం భేరీప్రముఖతూర్యనాదములు, సింహనాదములు చేస్తూ ఉప్పొంగిపోయింది. కొంతసేపటికి, రావణుడు ప్రయోగించిన అస్త్రశస్త్రాగ్నులను, రామప్రయోగశరవృష్టిచే చల్లారి, రాముడనే మేఘుడు, అవక్రమవిక్రముడై విజృంభించాడు. శ్రీరాముని అత్యద్భుతపరాక్రమానికి వానరులు ఆనందంతో చేసిన కోలాహలం మిన్నుముట్టింది.

 శ్రీరాముడు రావణుని సంహరించుట.

 కమనీయకనకపుంఖప్రభాభాసినియు తీక్ష్ణముఖంబును, దేవయక్షమునిసిద్ధసాధ్య సంమ్మోదావహంబునైన బాణాన్ని రామప్రభువు గైకొని బ్రహ్మాస్త్రకలితమంత్రాభియుక్తముగా బాణాసనమున సంధించి, జగములు జయపెట్ట ఆకర్ణాంతము వెనక్కులాగి వదిలాడు. ఆబాణం ప్రళయకాలాగ్నివలె రావణునితాకి రథము సారథితోసహా క్షణకాలములో రావణుని భస్మపటల మొనర్చింది. ఆకాశం దివ్యతూర్యనాదములతో మారుమ్రోగిపోయింది. గధర్వులు గానంచేశారు. అప్సరలు నట్యమాడారు. ఇంద్రాదిదేవతలు ఆనందంతో రామప్రభువును ప్రస్తుతించారు. లోక కంటకుడైన రావణుడు మరణిచటంతో ముల్లోకాలు సంతోషంతో పండువచేసుకున్నాయి.

 శరణాగతరక్షకుడు అనంతయశోవిరాజితుడునైన రామప్రభువు తమ్మునితోగూడి సంతోషముతో రావణుని స్థానంలో పుణ్యముర్తియైన విభీషణుని నిల్పి, పట్టాభిషిక్తుని గావించాడు. తదనంతరం అవింధ్యుడు, విభీషణుడు కలసి సీతదేవిని సగౌరవముగా సముచితవాహనమున రామభూపాలుని కడకు దీసుకొనివచ్చి దేవా! సీతాదేవిని పరిగ్రహింపుమని విన్నవించారు. అప్పుడు శ్రీరాముడు, అధికదుష్టాచారుడైన దశకంఠుడింతకాలము తనయింటనుంచుకొన్న నిన్ను పరిగ్రహించిన, నాచరిత్రకు ధర్మహాని కలుగునుగదా! పరిభవమునకు ప్రతీకారముగా శత్రువును హతమార్చితిని. అంతేగానీ నీకొఱకుగాదు. నీచరిత మంచిదైనా కాకపోయినా, యేమైనను నిన్ను స్వీకరింపజాలను. కుక్కముట్టిన హోమద్రవ్యం పనికిరాదుగదా! కనుక నీవు నీయిష్టమొచ్చిన చోటికి వెళ్ళవచ్చును. అని సీతాదేవితో రాముడన్నాడు. ఆమాటలు విని సీతాదేవి తనచెవులలో కొరవిబెట్టినట్లై, ఓర్పుగోల్పోయి మొదలునరకిన అతటిచెట్టువలె ముర్చిల్లి నేలపై బడిపోయినది. అక్కడున్నవారందరికీ అప్పటివరకున్న ఆనందం ఆవిరైపోయింది. ముఖాలు వాడిపోయాయి. సీతమ్మ కొంతసేపటికి తెలివొంది, దీనురాలై కన్నీరు జాలువారుతుండగా చేతులుజోడించి, జీరవోయినగొంతుకతో, శ్రీరామునిజూచి, రామభూపాలా! నీకు అపకీర్తిరాని విధంగా నేను నాపాతీవ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశంచేస్తాను. కరుణతో అంగీకరించండి ప్రభూ! అని విన్నవించుకున్నది. ఇంకాచెబుతూ, నాబుద్ధిమీ చరణస్మరణతప్ప యితరమెఱుగదు. ఇందుకు పంచభూతములే సాక్షి. ఈభూమి, అగ్ని, వాయువు, చంద్రుడు, సూర్యుడు నాయందు దోషమున్న నన్నుదహింతురుగాక! దేవతలు చెడును సహింతురా? సహించరుగదా? అన్నంతనే పంచభూతాలైన భూమీ మున్నగునవి, తమతమనామములు చెప్పుకొని అక్కడున్నవారందరూ వినుచుండగా ఓరామప్రభూ! పంచభూతములైన మాకు తెలియకుండా జగతిలో యేమియు జరుగదు. మమ్మెవ్వరూ మోసగించలేరు. మామటవిను, జనకునికుమార్తెయైన యీసీతాదేవి పరమోత్తమురాలు, మహాపతీవ్రత. సందేహపడవలసిన అవసరమేమాత్రములేదు. అని పంచభూతములు సాక్షమిచ్చిన తర్వాతబ్రహ్మదేవుడు  దేవతలు, మునులతోగూడివచ్చి, శ్రీరామునిచేత సన్మానింపబడి, రామా! నీవు సకలభూతదుస్సుడైన రావణుని సంహరించి లోకములకు హితంచేకూర్చావు. వినుము, రావణుడు, నలకూబరుని శాపమున్నందువల్ల పరస్త్రీలను బలాత్కారము చేయజాలడు. కనుక నీభార్యసీతవల్ల యేతప్పు జరగలేదు. నీవు నిర్విచారుడవై పతివ్రతయైన సీతను పరిగ్రహించి, సంతోషముగా అయోధ్యకు తిరిగివెళ్ళుమనిచెప్పి, బమ్మదేవుడు శ్రీరాముని ప్రీత్యర్థం యుద్ధమున మరణించిన వానరభల్లూకములను బ్రతికించి, సత్యలోకానికి మరలిపోయాడు. రత్నాలుపొదగబడిన నూత్నపుష్పాలంకృతమైన పుష్పకవిమానమెక్కి శత్రుసంహారదక్షుడైన శ్రీరాముడు మహదానందముతో తమ్ముడులక్ష్మనితో, భార్యసీతతో గలసి సముద్రందాటి అయోధ్యజేరాడు. భరతాది బంధుజనములు, పరిజనములు, అభినందించగా, వసిష్ఠవమదేవులైన గురుజనంబులు నిర్ణయించిన శుభముహూర్తంబున శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యెను. సుగ్రీవ విభీషణాది సుహృజ్జనంబులను బహుమానములతో సత్కరించి వీడ్కొల్పి, శ్రీరాముడు అనేకవేలసంవత్సరంబులు భుమిపై శాంతిభద్రతలు నెలకొల్పి, త్యాగపూరితమైన దానధర్మాలు చేసి, పెక్కుయాగముల నిర్వహించి, సుఖసంతోషములతో రాజ్యమేలి, రామరాజ్యపరిపాలనమునకు గొప్పకీర్తి గడింపజేసి వర్ధిల్లినాడు.

 ఇదీ శ్రీరాముని చరిత్రమని మార్కండేయమహర్షి ధర్మరాజుకు తెలిపి, రాజా! విటివిగదా! శ్రీరాముడు బడిన వనవాసక్లేశములు. అంతటి కష్టములు బడినవారు నభూతోనభవిష్యతి. యని ధర్మరాజును ఓదర్చి, రాజా! నీవును అనతికాలములోనే, నీకష్టములగటెక్కి, సామ్రాజ్యాధిపతివై, సుఖసౌక్యములందగలవని దీవించాడు మార్కండేయమహర్షి. 

 

ఓమ్ తత్ సత్.

   

 

                    

                                                 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...