పోతన్నా! మాప్రణుతి గైకొను మన్నా
భాగవత నిగమమున్ బహురమ్యముగ వ్రాసి
భవబంధముల ద్రెంచి, భాగవతులను జేసి
మముగమ్యమును జేర్చు మార్గమేర్పరచినా
వన్న, పోతన్న మా ప్రణుతి గైకొను మన్నా.
మెఱగుచెంగట నున్న మేఘముగ భావించి
ధరణిజన్ శ్రీరాము దర్శించి ముదలగొని
కరదీపికన్ బట్టి కైవల్యమున్ జూప
ఏకశిలనగరాని కెతెంచి నావన్న ........ //అన్న పోతన్న మా//
మందారసుమముల మకరందమిదియని
మాధవుని సంస్తుతిన్ మాటిమాటికి జేసి
మత్తెక్కగాజేసి మాయకావల జేర్చి
భక్తి లహరుల దేల్చి ముక్తి జూపితివన్న .....//అన్న పోతన్న మా//
ఇందునందేకాదు ఎందెందు చూచినన్
నిండియున్నట్టి యా నీలమేఘశ్యాము
పదిలముగ మా హృదయ భద్రపీఠమ్మున
కొలువుండజేసి మా కొఱత దీర్చితివన్న.......... .//అన్న పోతన్న మా//
విశ్వమోహనరూపు వేణుగానమ్మును
మా కర్ణరంద్రముల మారుమ్రోగగ జేసి
పరవశుల గావించి పరతత్త్వమెఱిగించి
హరిభక్తిలో మమ్ము కరిగించినావన్న....//అన్న పోతన్న మా//
***
Search : Pothana
No comments:
Post a Comment