Sunday, 1 August 2021

పూరీ జగన్నాథుడు

 పూరీ జగన్నాథుడు

హైందవులు అతిపవిత్రంగా భావించే చార్‍ధాం పుణ్యక్షేత్రాలుబద్రీనాథ్రామేశ్వరంద్వారకాపూరీ. వీటిలో పూరీజగన్నాథ క్షేత్రానికి ఒక ప్రత్యేకతపవిత్రతఐతిహాసిక నేపథ్యమూ వున్నది. విశేషమైన స్థలపురాణం గల్గినదీ జగన్నాథక్షేత్రం. గౌడీయ వైష్ణవవర్గీయులకిది ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ మతవ్యవస్థాపకుడైన  చైతన్యమహాప్రభువు యిక్కడే నివసించారు.

 

కౌరవమాత గాంధారి శాపం కారణంగా యదువంశం అంతఃకలహాలతో నాశనమయింది. కృష్ణపరమాత్మ అవతారం చాలించాల్సిన సమయమాసన్నమైనది. సముద్రతీరంలో మర్రిచెట్టునీడన కృష్ణుడు శయనించియుండగాఆయన కాలిబొటనవ్రేళ్ళను జింకచెవులుగా పొరబడి జరా అనే వేటగాడు పొదలచాటునుండి బాణంవదిలాడు. అది కృష్ణుని పాదాన్ని గాయపరచింది. దాంతో ఆయన ప్రాణాలను విడిచాడు. అర్జునుడు వెదకి కనుగొని కృష్ణపరమాత్మకు దహనసంస్కారాలు గావించాడు. శ్రీకృష్ణశరీరం దహింపబడిందిగానీ హృదయంమాత్రం అట్లేవుండిపోయింది. తదనంతరం సముద్రంపొంగి ద్వారకను ముంచేసింది. కృష్ణపరమాత్మ హృదయం సముద్రంలోకలిసి నీలపుమణిగా మారి పడమటి తీరమైన ద్వారకనుండి తూరుపుతీరం లోని పూరీగట్టుకు చేరింది. అది హరిభక్తుడైన గిరిజనరాజు విశ్వావసునకు దొరికింది. ఆయన ఆకాంతిమంతమైన నీలపుమణిని సాక్షాత్తూ హరిగా భావించిఆమణికాంతి సోకిన జీవికి భవబంధాలు తెగి సాయుజ్యము లభించునని గ్రహించిఒక రహస్య గుహలో వుంచినీలమాధవుడని పేరిడి పూజించుకొనుచుండెను.

 

మాల్వారాజ్యాధిపతి ఇంద్రద్యుమ్నుడు పరమభాగవతుడు. ఆయన పూరీప్రాంత గిరికధరములలో హరి విరాజమానుడై యున్నాడని తన హృదయస్పందనల ద్వారా గ్రహించిఒక బ్రాహ్మణయువకుని ఎంపికజేసుకొనిఅతన్ని అన్వేషించడానికి పంపాడు. ఆయువకుడుకొన్ని ఆనవాళ్ళఆధారంగా విశ్వావసుడున్న ప్రాంతంచేరుకొనికార్యం సానుకూలం గావించుకొనుటకు  ఆలోచించి విశ్వావసుని కూతురు లలితను ప్రేమించి విశ్వావసుని మెప్పించి ఆమెను వివాహమాడినాడు. స్వామికొలువైయున్న రహస్యప్రదేశం మామగారికి తెలుసునని ఎఱిగిస్వామిదర్శనం తనకూ చేయించమని విద్యాపతి మాటిమాటికీ వినయంగా వేడుకున్నాడు. కడకు అల్లునికోరికను తిరస్కరించలేక కళ్లకుగంతలుగట్టి స్వామిబిళం వద్దకు తీసుకపోయి దర్శనంచేయించాడు. విద్యాపతి తెలివిగా దారివెంబడి ఆవాలు విడుస్తూ వెళ్ళాడు. అవి కొన్నిరోజులకు మొలకెత్తి దారి స్ఫష్టంగా చూపాయి. విద్యాపతి విషయం ఇంద్రద్యుమ్నమహారాజుకు చేరవేశాడు. రాజు సరాసరి బిళంలోనికి ప్రవేశించి చూచేసరికి అక్కడి నీలమాధవుడు అంతర్ధానమయ్యాడు. రాజు బహుదా చింతించివెనుదిరిగివచ్చి  నిరాహారదీక్షలతో దైవారాధన చేయడమేగాక అశ్వమేధయాగంకూడా చేశాడు. నీలాచలంమీద నరసింహాలయం నిర్మించి పూజించాడు. ఆలయంలో నిద్రించిన ఒకనాటిరాత్రి రాజుకలలో స్వామికనిపించిరేపు సముద్రతీరప్రంతంలో చాంకీనదీమఖద్వారానికి వేపకొయ్యలు కొట్టుకవస్తాయి. వాటితో కృష్ణబలరామసుభద్రవిగ్రహాలు చేయించు. నీవు దర్శించలేకపోయిన నీలమాధావుడనైననేను కృష్ణహృదయస్థనంలో విరాజమానుడనై వుంటాను. మమ్ము సేవించి తరించు. అని ఆనతిచ్చి అంతర్థానమయ్యాడు. కలనిజమయ్యింది. వేపదుంగలు రాజుకు లభించాయి.

 

వేపదుంగలను విగ్రహాలుగా మలిపించే యత్నం చేస్తుండగా దేవశిల్పి విశ్వకర్మ ఒకవృద్ధ వికలాంగుడిరూపంలో వచ్చి విగ్రహాలను ౨౧ దినాలలో నేనునిర్మిస్తాను. దీక్షబూని నేను పనిప్రారంభిస్తాను. దీక్షాకాలంలో అన్నపానీయాలు ముట్టను. గదితలుపులు పొరపాటునకూడా తెరవకండిఅనిచెప్పి మూసిన గదిలో పనికిబూనుకొనెను. ౧౪ దినములు పనిజేయుచున్న శబ్దములు వినిపించినవి గానీ తర్వాత వినిపించలేదు. విషయముతెలిసి రాణిగుండీచాదేవి శిల్పికేమైనదోయేమోనని చింతించిగదితలుపులు తెరిపించినది. లోపల శిల్పిలేడు. విగ్రహాలు పూర్తికాలేదు. విగ్రహాల చేతులుకాళ్ళు నిర్మింపబడలేదు. విశాలమైన నేత్రములతో విగ్రహముల ముఖమడలములు ప్రకాశించుచుండెను. రాజు అసంపూర్ణవిగ్రహాలను చూచి చింతాక్రాంతుడయ్యెను. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమైరాజా! చింతిచకు. ఈరూపాలలోనే భగవానుడు పూజలందుకుంటాడు. నేనే యీరూపాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాననిచెప్పిపాణప్రతిష్ఠచేసి  బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. పూరీక్షేత్రం నాటినుండి పురుషోత్తమక్షేత్రంగానుశ్రీక్షేత్రంగాను ప్రసిద్ధికెక్కింది. తొలుత యీ క్షేత్రంలో ఇంద్రద్యుమ్నమహారాజు ఆలయనిర్మాణం మొదలుపెట్టాడు , ఆయన కుమారుడు యయాతికేసరి పూర్తిచేశాడు. ఈ ఐతిహసిక విషయాలు స్కందపురాణంలోనూ 15వ శతబ్దపు ఒడియాకవి సరళదాస రచనల్లోనూ మనకు కనిపిస్తాయి.

 

ఈ క్షేతంలో అనేకములైన వేడుకలు జరుగుతాయి. అందులో రథయాత్ర అత్యంత ముఖ్యమైనది. ఈ వేడుక చూడటానికి దేశంనలుమూలలనుండే గాక విదేశాలనుండికూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అన్నిదేవాలయాలలో ఊరేగింపుకు ఉత్సవమూర్తులు వేరుగావుంటాయి. కానీ యిక్కడ గర్భగుడిలోని అసలు దారు(చెక్క)మూర్తులనే ఊరేగిస్తారు. రథయాత్రకు రెండునెలలముందు వైశాఖబహుళ విదియనాడు పూరీసంస్థానాధీశుని ఆదేశంమేరకు పనులు ప్రారంభమౌతాయి. ఎన్నుకోబడిన వృక్షాలను పూజించి 1072 ముక్కలుగాచేసుకొని పూరీ తీసుకవస్తారు. ప్రథానపూజారి, 9 మంది ముఖ్యశిల్పులువారిసహాయకులు మొత్తం 125 మంది అక్షయతృతీయనాడు రథనిర్మాణం మొదలుపెడతారు. తెచ్చిన 1072 చెక్కముక్కలను 2188 గాచేస్తారు. అందులోనుండి 832 జగన్నాథరథం, 763 బలరామరథం, 593 సుభద్రారథాలకు ఉపయోగించి ఆషాడశుద్ధపాడ్యమినాటికి నిర్మాణాలు పూర్తిచేస్తారు. జగన్నాథరథంపేరు నందిఘోష. ఇది 45 అడుగుల ఎత్తుతో 16 చక్రాలతో నిర్మితమై ఎఱ్ఱటి చారలున్న పసుపువస్త్రంతో అలంకృతమై వుంటుంది. బలదేవులరథంపేరు తాళద్వజం 44 అడుగుల ఎత్తుండి 14 చక్రాలుగలిగి ఎఱ్ఱటిచారలుగల నీలివస్త్రంతో అలంకరింపబడి వుంటుంది. ఇక సుభద్రరథంపేరు పద్మద్వజం. ఇది 43 అడుగులఎత్తుండి 12 చక్రాలుగలిగి ఎఱ్ఱటిచారలుగల నల్లనివస్త్రంతో అలంకరింపబడి వుంటుంది. ఈ రథాలకు 250 అడుగుల పొడవు 8 అంగుళాల మందంగల తాళ్ళుగట్టిసింహద్వరం ఎదురుగా ఉత్తరముఖంగా రథాలను నిలుపుతారు. ఈ రథాలను ప్రతిసంవత్సరం క్రొత్తగా నిర్మిస్తుంటారు.   

       

పాండాలు అనబడే పూజారులు ఆషాడ శుద్ధపాడ్యమినాడు ఉదయం పూజలుచేసి శుభముహూర్తాన "మానియా" (జగన్నాథా) అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ ఆలయంలోని రత్నపీఠంమీదనుండి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయప్రాంగణంలోని ఆనందబజారు అరుణస్థంభం మీదుగా విగ్రహాలను ఊరేగిస్తూ బయటికి తెస్తారు. ఈక్రమంలో ముందుగా  5 అడుగుల 6  అంగుళాల ఎత్తున్న బలభద్రుని విగ్రహం "జై బలదేవా" అన్న నినాదాలతో రథం ఎక్కిస్తారు. తర్వాత ఆస్వామి ధరించిన తలపాగాయితర అలంకరణలు తీసి భక్తులకు పంచుతారు. తర్వాత సుభద్రాదేవిని రథంయెక్కిస్తారు. ఆతర్వాత 5 అడుగులా 7 అంగుళాల ఎత్తున్న జగన్నాథుని "జయహో జగన్నాథా" అన్న నినాదాలతో రథంపైకి చేరుస్తారు. ఈవేడుకను "పహండీ" అంటారు. ఈదశలో కులమతాలకతీతంగా అందరూ జగన్నాథుని తాకవచ్చు. అందుకే సర్వంజగన్నాథం అంటారు. ఈ విగ్రహాలను తీసుకవచ్చి రథం ఎక్కించేవారిని దైత్యులంటారు. వీరు ఇంద్రద్యుమ్నమహారాజు కంటే ముందు నీలమాధవుణ్ని ఆరాధించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. రథంపై మూర్తులను చేర్చే హక్కుదారులు వీరు. రథారోహణం తర్వాత పూరీసంస్థానాధీశులు వచ్చి మొదట జగన్నాథ రథమెక్కి స్వామికిమ్రొక్కిస్వామిముందర బంగారుచీపురుతో ఊడ్చి గంధంనీళ్ళు చల్లి రథందిగిఅదేమాదిరి మిగిలిన రెండు రథములపై కూడాచేసి ఆతర్వాత రథాలకు ప్రదక్షిణచేసిరథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. జగన్నాథరథంమీది పాండా సూచనమేరకు కస్తూరికళ్ళాపిజల్లి హారతిచ్చి జైజగన్నాథా అంటూ రథాన్ని భక్తులు లాగుతారు. స్వాములవారి యీ యాత్రను ఘోషయత్ర ఆంటారు. ఇది సుమారు 3 మైళ్ళదూరంలోగల గుండీచా ఆలయంవరకు మందగమనంతో 12 గంటలు సాగుతుంది. ఆరాత్రికి రథాల్లోనే స్వాములవారికి విశ్రాంతినిచ్చి మరునాడు ఆలయంలోనికి ప్రవేశపెడతారు. వారంరోలులు స్వాములవారు గుండీచాదేవిఆలయ ఆతిథ్యం తర్వాత దశమినాడు తిరుగుప్రయణంచేసి గుడిబయట రథాలు నిలుస్తాయి. మరునాడు అనగా ఏకాదశినాడు బంగారు ఆభరణాలతో స్వాములవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ద్వాదశిరోజున తిరిగి రత్నపీఠిపై స్వాములను నిలుపుతారు. అంటే 10  దినాలు ఆలయంలో స్వాములు ఉండరన్నమాట.

 

ఈఆలయంలోని దారు(చెక్క)దేవతామూర్తులను 812  లేదా 19 సంవత్సరములకొకసారి మారుస్తారు. ఇవి ఆషాడంఅధికఆషాడం వచ్చే సంవత్సరాలన్నమాట. ఇలా మార్చే ఉత్సవాన్ని నవకళేబరోత్సవమంటారు. పాతవిగ్రహాలనుండి క్రొత్తవిగ్రహాలలోనికి పూజారులు బ్రహ్మపదార్తాన్ని ప్రవేశపెడతారు. శ్రీకృష్ణపరమాత్మహృదయం యీసందర్భంలో నూతనవిగ్రహంలో ప్రవేశిస్తుంది. పూజారి కళ్ళకు గంతలుకట్టుకొని చేతులకు వస్త్రంచుట్టుకొని ఊరంతా ఆరాత్రిసమయంలో దీపాలు ఆర్పి చీకటిలో యీ కార్యక్రమం పూర్తిచేస్తారు.

 

 ఇతరమతాలవారు సైతం యీక్షేత్రం తమదిగా భావిస్తారు. గౌరవిస్తారు. ఈఆలయంలో గౌతమబుద్ధుని దంతం పూజలందుకొంటూ ఉండిందనీఅది శ్రీలంకలోని క్యాండీ అనే ప్రదేశంలోగల స్థూపం లోనికి చేర్చబడిందంటారు. ఇది ఒడిషా సోమవంశపురాజుల హయాంలో అనగా 10 వ శతాబ్దంలో జరిగిందంటారు.

 

అమృత్‍సర్ స్వర్ణాలయమునకు యిచ్చినదానికంటే ఎక్కువగా బంగారం మహరాజ్‍రంజిత్‍సింగ్ యీఆలయానికిచ్చారట. కోహినూర్‍వజ్రం కూడా యీఆలయానికివ్వాలని ఆయన చివరి కోరికట. కానీ అది బ్రిటిష్ వారి పరమైంది.

 

జైనులు మోక్షదాయినులైన త్రిరథాలుగా భావించే సమ్యక్‍దర్శన్సమ్యక్‍జ్ఞానానంద్సమ్యక్‍చరిత్ర(శీలం) లకు ప్రతీకలే యిక్కడి మూడురథాలుదేవతావిగ్రహాలని విశ్వసిస్తారు.

 

శైవులు యీక్షేత్రాన్ని భైరవశివవిమలభైరవ(ప్రకృతి) శక్తి స్థానాలుగా భావిస్తారు. ఇలా యీక్షేత్రం అనేకమత సమ్మతం. 

 

ఇక చరిత్రవిషయానికొస్తే గంగరాజవంశీయుల తామ్రశాసనాల ప్రకారం ప్రస్తుతాలయనిర్మాణంకళింగపాలకుడైన అనంతచోడగంగదేవ్ క్రీ.శ 1078 -1148  మధ్య  ప్రారంభించగా ఆయన మనుమడైన అనంగభీమ్‍దేవ్ క్రీ.శ 1174 లో ఒడిశాను పాలిస్తూ నిర్మాణాలను పూర్తిచేశాడు. క్రీ.శ 1558 లో ఒడిషాపై అఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడిచేయకముందు వరకు జగన్నాథుడు భక్తుల పూజలందుకున్నాడు. తర్వాత రామచంద్రదేవ్ "ఖుర్దా" అనబడే స్వతంత్రరాజ్యాన్ని ఒడిషాలో యేర్పరచుకొన్నతర్వాత ఆలయాన్ని పవిత్రంచేసి విగ్రహాలను పునఃప్రతిష్టింపజేసి పూజించారు. కీ.శ. 1997లో పూర్వదేవాలయాల ప్రక్కనే నూతననిర్మాణాలుచేసిఆలయప్రతిష్ఠనుపెంచి ఉత్సవాలను వైభవోపేతంగా శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తూ హైందవధర్మపరిరక్షణ గావిస్తున్నారు.

 

ఈక్షేత్రం ఒడిషారాజధాని భువనేశ్వర్‍కు సుమారు 60 కి.మీ దూరంలో ఉంది. భువనేశ్వర్‍లో బిజూపత్నాయక్ విమానాశ్రయముంది. అక్కడివరకు విమానంలో వెళ్లవచ్చు. కోల్‍కత్తా-చెన్నై రైలుమార్గంలోని ఖుర్దారోడ్ స్టేషన్ నుండి పూరీకి 44  కి.మీ బస్సుమార్గమున్నది.  విశాఖపట్నం నుండి నేరుగా పూరీకి బస్సులో వెళ్ళవచ్చును. అంతేగాకుండా దేశంలోని వివిధప్రాంతాలనుండి రైలు మరియు బస్సు సర్వీసులు పూరీ వరకు మిక్కుటంగానేవున్నాయి.

 

పూరీకి వెళ్ళే భక్తులు జగన్నథక్షేత్రమహిమలు ముఖ్యంగా గమనిస్తారు. ఈమహిమలు యిప్పటికీ శాస్త్రజ్ఞానానికతీతమైనవిగనే భాసిల్లుతున్నాయి. అవి—

1.      ఊరేగింపు గుండీచా ఆలయానికి రాగానే రథాలు వాటంతట అవే ఆగిపోతాయి. తిరుగు ప్రయాణంలో కుడా  స్వ్వామిఆలయం దగ్గరకు రాగానే రథాలు ఆగిపోతాయు.  ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు.

2.     ఆలయ ప్రధాన ద్వార గోపురం నీడ యే సమయంలోనూ యేవైపు   కనిపించదు

3.     ఆలయ గోపురం పైన ఉండే జండా గాలి వాటాన్ని బట్టి కాకుండా వ్యతిరేక    దిశలో ఎగురుతూవుంటుంది.

4.      గోపురం పైనున్న సుదర్శన చక్రం ఎటువైపు నుండి చూసినా అది మనవైపు   చూస్తున్నట్లే ఉంటుంది.

5.     ఆలయం పై యే పక్షులు ఎగరవు.

6.      ఆలయ సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్ర హోరు వినిపించదు.  సింహద్వారం దాటిన తర్వాత తిరిగి వినిపిస్తుంది.

7.     . పూరి జగన్నాధ స్వామి కి 50 రకాలకుపైగా ప్రసాదాలు నైవేద్యం పెడతారు. వీటిని మట్టి కుండల్లో నే వండుతారు. ఆ నైవేద్యాలు స్వామికి నివేదించక ముందు ఎటువంటి రుచి,సువాసన వుండవు. స్వామికి నివేదించిన తర్వాత  ప్రసాదాలు ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లుతూ ఎంతో రుచిగా వుంటాయి.

 

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...