శంఖం
శ్లో: శంఖం చంద్రార్క దైవతం
మధ్యే వరుణదేవతాం
పృష్టే ప్రజాపతిం వింద్యాత్
అగ్రే గంగా సరస్వతీమ్ //
క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితోపాటు ఉద్భవమైనది శంఖం. సముద్రంనుండి పుట్టిన పదునాలుగు రత్నములలో యిదీ ఒకటి. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి తోబుట్టువు గనుక సంపదకారిణి, అరిష్టనివారిణి, వాస్తుదోషపరిహారిణి. కనుకనే శంఖాన్ని కోవెలలలో, పూజాగదుల్లోను వుంచి పూజిస్తారు. యజ్ఞయాగాది క్రతువుల్లో, పర్వదినాల్లో, రాజ్యాభిషేకాల్లో యుద్ధారంభ సమయాల్లో శంఖనాదం చేస్తారు. జంగందేవరలు బిక్షాటనసమయాల్లో ప్రతియింటిముందు శంఖనాదం చేస్తారు. హైందవులు దీనిని నవనిధుల్లో ఒకటిగాను, శుభసూచకంగానూ భావిస్తారు. పితృతర్పణ సమయాల్లోనూ శఖనాదం చేయటం పరిపాటి. హరిహరాదులచేతుల్లోనూ శంఖం విరాజమానమై వుంటుంది. దుకాణాలల్లో, కర్మాగారాల్లో, కార్యాలయాల్లో కూడా శంఖపూజలు నిర్వర్తిస్తారు. అష్టసిద్ధులకై ప్రయత్నించేవారు శంఖనాదం విశేషంగా చేస్తారు. అందువల్ల షడ్చక్రాలు శుద్ధిగావింపబడి ఫలితం శీఘ్రగతిన ప్రాప్తిస్తుందని వారి విశ్వాసం.
బ్రహ్మవైవర్తపురాణంలో శంఖంపుట్టుక గురించి మరోవిధంగా చెప్పబడింది. తులసిభర్త తపస్సుచేసి బ్రహ్మదేవుని మెప్పించి కృష్ణకవచం వరంగా పొందుతాడు. దాంతో అతడజేయుడై స్వర్గాన్నీ జయిస్తాడు. ఇంద్రుడు శంకరుని ప్రార్ధిస్తాడు. శంకరుడు అతన్నేమీ చేయలేడు. విష్ణువు బ్రాహ్మణవేషంలో వెళ్ళి కృష్ణకవచాన్ని దానంగా స్వీకరిస్తాడు. ఇదేఅదనుగా శివుడు తులసిభర్తను వధించి సముద్రంలో పడేస్తాడు. తులసి తన పాతీవ్రత్యమహిమతో భర్తను శంఖంగా మార్చేసిందట. అతడు శంఖచూడుడుగా ప్రసిద్ధికెక్కాడు.
శంఖాలలో అనేకరకాలున్నాయి. అన్నింటిలో దక్షిణావృతశంఖం ప్రశస్తమైనది. దీన్నీ ఎడమచేత్తో పట్టుకొని వాయిస్తారు. దీన్ని ముఖ్యంగా పూజించడానికే ఉపయోగిస్తారు. అదే ఉత్తరావృతశంఖమైతే వాయించటానికి ఉపయోగిస్తారు. మధ్యావృతశంఖాలు కూడా వుంటాయి. వీటికి నోరు మధ్యలో వుంటుంది. ఇంకా ఆకారలనుబట్టి లక్ష్మీ, గోముఖ, వినాయక, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని ,రాహూ,కేతు, కూర్మ, వరాహశంఖాలుగా గుర్తిస్తారు. శనిశంఖానికి నోరుపెద్దది పొట్టచిన్నదిగా వుంటుంది. రాహుకేతుశంఖాలు సర్పాకారంలో వుంటాయి. రాక్షసశంఖంపైన ముళ్ళుంటాయి. వినాయకశంఖానికి తొండాలుంటాయి. ఈ వినాయకశంఖంలో నీరునింపి గర్భవతులకు తాపిస్తే అంగవైకల్యం లేని బిడ్డలు కలుగుతారు.
కూర్మపీఠంపై అరుణవర్ణపు వస్త్రం పరచి దానిపై దక్షిణావృతశంఖం వుంచి పూజించి, మరొక ఉత్తరావృతశంఖం పూరించి, శంఖంలో గంగాజలం, కపిలగోక్షీరం తేనే, నెయ్యి, బెల్లంకలిపిననీరు పోసి పూజానంతరం తీర్థంగా సేవించటం అత్యంతశ్రేయస్కరమని భావిస్తారు. శంఖంలో శుద్ధజలంపోసి, ఆనీళ్లు ఇల్లంతా చల్లితే, వాస్తుదోషలు పోతాయి. "శంఖంలో పోస్తేనే తీర్ఠం" అన్న నానుడి మనందరమెఱిగినదే. ఏకట్టడమైనా తొలుత కొంతమట్టిని తీసి పసుపునీళ్ళుచల్లి శంఖము నుంచి పూజచేసి పనిమొదలుపెడతారు. దీన్నే శంకుస్థాపన మంటారు. దీనివల్ల కట్టడం నిరాటంకంగా సాగి క్షేమకరంగ వుంటుందని హైందవుల నమ్మకం. పూరీజగన్నాథ రథయాత్రను శంఖక్షేత్రయాత్ర అనికూడ పిలుస్తారు, ఇది ఆ పవిత్రక్షేత్ర చిహ్నంగా భావిస్తారు.
మహాభారతయుద్ధారంభంలో శ్రీకృష్ణపరమాత్మతోసహా వీరాధివీరులందరూ వారివారి శంఖాలను పూరించారు. వారు పూరించిన శంఖాలకు వేరువేరు పేర్లున్నాయి. ఆ శంఖనాదాలకు శత్రువుల గుండెల్లో దడపుట్టేదట. శ్రీకృష్ణుడు పాంచజన్యం, ధర్మరాజు అనంతవిజయం, భీముడు పౌండ్రకం, అర్జునుడు దేవదత్తం, నకులుడు సుఘోషం, సహదేవుడు మణిపుష్పకం, కాశీరాజు శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటరాజు సాత్వికమనే శంఖాలతో రణభూమిని భయానకంగావించారట.
ఈశంఖాలు మనకెక్కువగా రామేశ్వరం, కలకత్తా, విశాఖపట్నం, చెన్నై, కన్యాకుమారి, ముంబాయ్, పూరి, మానససరోవర్, కోరమాండల్, శ్రీలంక, ప్రాంతాల్లో లభిస్తున్నాయి. శంఖం నత్తజాతికిచెందిన సముద్రప్రాణి రక్షణకవచం. ఈప్రాణి ముఖ్యంగా ఇసుకమేటవేసిన ఉష్ణప్రాంత సముద్రగర్భంలో జీవిస్తాయి. శంఖనాదానికి క్రిమికీటకాదులు నశిస్తాయని 1929 లో బెర్లిన్ యూనివర్సిటీ నిర్ధారించింది. 2600 అడుగుల దూరంలోగల క్రిములు శంఖనాదానికి స్పృహదప్పిపోయాయట. శంఖనాదంతో శుభశక్తిప్రకంపనలు (పాజిటివ్ ఎనర్జిటిక్ వేవ్స్) ప్రసారమౌతాయట. అసలు శంఖం (శం+ఖం) ఆంటే అర్థం ప్రశస్తజలం. శంఖంలో నింపినజలం త్రాగడం వల్లనూ, శరీరంపై రుద్దడం వల్లనూ చర్మవ్యాధులు బాగౌతాయి. శంఖం ముఖంపై సున్నితంగా రుద్దడం వల్ల ముడతలుపోయి అందంగా మారుతుంది. ఆయుర్వేదంలో శంఖభస్మం చాలా ఉపయోగకారికా చెప్పబడింది. ముఖ్యంగా కుక్షిశూలకు యిది మంచి మందు. శంఖంలో క్యాల్సియం మెగ్నీషియం సమృద్ధిగా వుంటాయి. అందువల్ల మందుల తయారీలో దీని ఉపయోగం మెండు.
వైజ్ఞానికశాస్త్రపరంగా
చూస్తే శంఖం ఒకరకమైన మొలస్కా జాతికి చెందిన జీవి. సముద్రజలాల్లో నివసించే
గాస్ట్రోపోడా తరగతికిచెందిన స్ట్రాంబిడే కుటుంబంలోని స్ట్రాంబస్‍ప్రజాతికిచెందిన
జీవియిది. స్ట్రాంబస్‍గిగాస్ శంఖాలనుండి ఖరీదైన ముత్యాలు లభిస్తాయి. శంఖం
చెవిదగ్గర పెట్టుకొని వింటే ఓంకారనాదం వినబడుతుంది. ప్రముఖ భారతీయశాస్త్రవేత్త
జగధీష్‍చంద్రబోస్ కూడా యీశంఖ విశిష్టతను తెలియజేయడం గమనార్హం. శంఖాలు మనకు
గోదుమగింజంత ప్రమాణంనుండి ఐదుకిలోల బరువుగల పెద్దపెద్ద ఆకారాలలోకూడా లభిస్తాయి.
శంఖం వల్లకలిగే శుభాలను దృష్టిలో వుంచుకొని చాలా సంస్థలు వాటి లోగోలలో
శంఖంగుర్తును చిత్రీకరించుకుంటున్నాయి. ఉదాహరణకు కేరళ ట్రావెంకోర్‍రాజుల
రాజముద్రికలో శంఖంచిహ్నముంది. ఒడిస్సారాష్ట్ర విషూజనతాదళ్ ఎన్నికలచిహ్నం శంఖం. ఈ
శంఖంలోని నత్తలను కొన్నిజాతులవారు ఆహారంగా వండుకొని తింటారు కూడా. మొత్తంమీద బహుళ
ప్రయోజనకారి యీ శంఖం.
సముద్రతనయాయ విద్మహే
శంఖరాజాయ ధీమహీ
తన్నో
శంఖ ప్రచోదయాత్ //
No comments:
Post a Comment