నవరత్నాలు
జ్యోతిషశాస్త్రానికి నవరత్నాలకు సంబంధం ఉందని వేలసంవత్సరాలనుండి
జనులు విశ్వసిస్తున్నారు. స్వచ్ఛమైనరత్నాలు సకారాత్మకశక్తి ప్రకంపనలు (పాజిటివ్
ఎనర్జి వేవ్స్) ఉత్పన్నంచేసి భౌతిక, మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు మనిషికి చేకూస్తాయని నమ్ముతున్నారు.
వైద్యశాస్త్రంలోగూడా వీటికి సముచిత స్థానమున్నది. నవరత్నాలను వేరువేరుగా
స్వచ్ఛమైనసారాయి (ప్యూర్ ఆల్కహాల్) లో వుంచి వాటిశక్తిని సారాయిలోనికి
ప్రవహింపజేస్తారు. ఆసారాయిని హోమియోవిధానంలో ఔషదాలుగా చక్కెరగుళిక (గ్లోబుల్స్)
లలో కలిపి వైద్యంచేయుచున్నారు. ఆయుర్వేదంలోనైతే పగడభస్మం, ముత్యభస్మం
వంటివి ఎప్పటినుంచోవాడుకలోఉన్నాయి. రత్నాలుధరించడంతోనే కొన్ని జబ్బులు నయమౌతాయని
నమ్ముచున్నారు. రత్నాలలో దైవికశక్తులున్నాయని జ్యోతిష్యుల నమ్మకం. ఆరోగ్యం, అదృష్టం,
ఐశ్వర్యం , ఉద్యోగం పొందటానికి వారివారి
గ్రహస్థితి, రాశి, నక్షత్రాన్నిబట్టి
రత్నశాస్త్రనిపుణత్వంగల జ్యోతిష్యులు నిర్ధారించి ధరింపజేస్తున్నారు. రత్నాలు
మానవజాతికందిన భూ మరియు జలసంపద. అందుకే భూమిని రత్నగర్భయని సముద్రాన్ని రత్నాకరమని
పిలుస్తున్నారు.
ఈనవరత్నాలకు
సంబంధించి ఒకపురాణగాథ వున్నది. అదేమంటే, ఇంద్రుడు
బాలాసురుడనే రాక్షసుని దేవతలక్షేమార్థం సంహరించాడు. ఆరాక్షసుడి శరీరం తునాతునకలై
వేర్వేరురంగులలో మెరుస్తూ నవగ్రహాలపై పడ్డాయి. ఆ ముక్కలే నవరత్నాలు. నవగ్రహాలు
రత్నాలవర్ణాన్ని గ్రహించాయి. రత్నాలు నవగ్రహాలశక్తిని గ్రహించాయి. గ్రహాలనుండి
వెలువడుతున్న విద్యుదయస్కాంతకాంతితరంగాలను నవరత్నాలు గ్రహించి తిరిగీ బయటికీ
కాతితరంగాలుగా నవరత్నాలు వెదజల్లుతూవుంటాయి. ఈకాంతితరంగాలు కనబడనంత సూక్షంగావుండి
రంగునుమార్చుకొని ప్రసారమౌతూవుంటాయి. ఇలా మార్చుకున్న రంగులనే "కాస్మిక్
కలర్స్" (అంతరీక్షవర్ణాలు) అంటారు. ఇవి మనిషిపై తమ అద్భుతప్రభావాన్ని
చూపిస్తాయి. పసుపుపచ్చ బంగారు రంగులోవుండే పుష్యరాగం కాశ్మిక్ వర్ణం నీలంగా వుంటుంది.
నీలంరత్నం యొక్క కాస్మిక్ వర్ణం వైలెట్. ఎఱుపుకాషాయం కలసియున్న పగడం కాస్మిక్ రంగు
నారింజ. గోదుమవర్ణంలోగల గోమేదికం కాస్మిక్ రంగు అతినీలలోహితం (ఆల్ట్రావైలెట్).
బూడిదరంగుగల వైడూర్యం కాస్మిక్ వర్ణం ఎఱుపు (ఇన్ఫ్రారెడ్). కెంపు (మాణిక్యం)
అసలురంగు కాస్మిక్ రంగు ఎఱుపే. అట్లే పచ్చరత్నం అసలురంగు కాశ్మిక్ రంగు పచ్చే.
ముత్యాలలో
స్వాతిముత్యం అత్యంతశ్రేష్ఠమైనదిగా భావిస్తారు. స్వాతికార్తెలో అంటే సూర్యుడు
స్వాతినక్షత్రంలో సంచరించేటప్పుడు ముడుచుకొనియున్న ముత్యపుచిప్పలు తెరుచుకుంటాయి.
ఆసమయంలో పడే వర్షపుచినుకులు ముత్యపుచిప్పలో పడగానే ముడుచుకుంటాయి. అలా
ముత్యపుచిప్పలో పడిన వర్షపుచినుకులే కొంతకాలానికి ఘనీభవించి
స్వాతిముత్యాలౌతాయంటారు.
మనశరీరం
సప్తధాతునిర్మితం. ఈధాతువులపై నవగ్రహాలప్రభావంవుంటుంది. ఆ గ్రహాలతో సంబంధంవున్న
రత్నాలు ధరించడంద్వార క్షీణదశలోనున్న ధతువులలో సతుల్యతను తీసుకవచ్చి శారీరక, మానశిక శక్తులకు పునర్జీవాన్నిస్తాయి. తద్వారా ఆరోగ్యం
పరిరక్షింపబడుతుంది. సప్తధాతువులలో చర్మానికి శుక్రుడు, నాడీమండలానికి
బుధుడు, క్రొవ్వుకు బృహస్పతి. కండరాలకు కుజుడు ఎముకలకు శని.
ఉపస్తుకు శుక్ర కుజులు. స్నాయువులు (సన్నని నరాలు) కు రవి చంద్రులు ప్రాతినిథ్యయం
వహిస్తారు. ఏరత్నం యేగ్రహానుకి సంబందించి దో క్రిందతెలుపబడింది. నవరత్నాలను శుద్ధిచేసి
ఆరత్నాల ప్రత్యేక మంత్రాలను నూటయెనిమిది సార్లుజపించి, పూజించి
ధరించడంవల్ల వాటిశక్తి అధికమై సత్వరఫలితాలనిస్తాయి. శుద్ధికి ఉపయోగించు పదార్తాలు,
మంత్రాలు, ఏరత్నాలు యేధాన్యంలోవుంచి పూజించాలో
కూడ క్రిందతెలుపబడింది. ఆప్రకారం శుచియై పూజించి ధరించుట క్షేమకరం. పూజానంతరం
ఉపయోగించిన ధాన్యాన్ని దానంచేయవచ్చును లేదా దేవాలయాలలోని నవగ్రహాలకు
సమర్పించవచ్చును.
1.
కెంపు (మాణిక్యం). సూర్యునకు ప్రతినిధ్యం వహిస్తుంది. బాలసూర్యునువంటి
ఎఱుపురంగులో వుంటుంది. రత్నాలలో యిది రాజు. ధరించునవారికి సమర్థప్రభులక్షణాలను
ప్రసాదిస్తుంది. ఆయుర్వృద్ధి, ధనలాభం, అధికారం, ఉత్తమస్థితి, రోగనివారణ,
మనోవికాసం కలుగజేస్తుంది. శుద్ధికి ఆవుపాలు, గంగాజలం
ఉపయోగించాలి. గోధుమధాన్యంలోవుంచి పూజించాలి. మంత్రం- ఓందృణిః సూర్యాయనమః. ఉంగరంలో
పొదిగించుకొని తొలుత అదివారం మధ్యవ్రేలికి ధరించడం మంచిది. సింహరాశివారికిది
మిక్కిలి శుభకరం.
2.
ముత్యం (మౌక్తికం). చంద్రునకు ప్రతీక. పాలవంటితెల్లనిమెరుపుగలిగి వుంటుంది.
రత్నాలలోయిది రాణివంటిది. వివాహయోగం, దాంపత్యానుకూలత,
స్త్రీసౌక్యం, ధనధాన్యాభివృద్ధి, మేహశాంతి, హృదయరోగనివారణ గావిస్తుంది. స్త్రీలపాలిటి
కామధేనువు. శుద్ధికి సైంధవలవణం, వరిపొట్టు ఉపయోగించాలి.
బియ్యంలోవుంచి పూజించాలి. మంత్రం ఓంసోమాయనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలిసారి
ఉంగరపువ్రేలికి సోమవార ధరించాలి. కర్కాటకరాశివారికిది మిక్కిలి శుభకరం.
3.
పగడం (ప్రవాళం). చిలుకముక్కు లేదా దొండపండురంగులో వుంటుంది.
కుజగ్రహానికి ప్రతినిధ్యం వహిస్తుంది. రత్నాలలో యిది సేనాపతి. నాయకత్వలక్షణాలను
ప్రసాదించి ఉద్యమాలను విజయవంతంగా నడిపింపగల శక్తినిస్తుంది. శత్రుసంహారంలో సహాయపడుతుంది.
సాహసం, ధైర్యం అధికారాన్నిస్తుంది. ఋణవిమోచనకారి. మాటకు గౌరవాన్నిచ్చి, చెల్లుబాటయ్యేట్లు చేస్తుంది. శుద్ధికి రక్తచందనగంధం కలిపిననీరు, ఆవుపాలు, కుంకుమపువ్వు కలిపిననీరు ఉపయోగించాలి.
కందులలోవుంచి పూజించాలి. మంత్రం- ఓం అం అంగారకాయనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలుత
గురువారంనాడు బొటనవ్రేలికి ధరించాలి. మేషరాశివారికిది మిక్కిలి శుభకరం.
4.
మరకతం (పచ్చ). గరికచిగుళ్ళు లేక నెమలిపింఛం వర్ణంలోవుండి బుధగ్రహానికి
ప్రతీకగావుంటుంది. వంశపారంపర్యంగావస్తున్న వ్యాపారంలో రాణింపునిస్తుంది.
విషాన్నిహరిస్తుంది. ఉన్మాదం, పిచ్చి, దృష్టిలోపాలనుతొలగిస్తుంది. నరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. శుద్ధికి
ఆవుమజ్జిగ, గోమూత్రం, పసుపుకలిపిననీరు
ఉపయోగించాలి. పెసలలోవుంచి పూజించాలి. మంత్రం- ఓం బుధాయ నమః. ఉంగరంలోపొదిగించుకొని
తొలుత బుధవారం ఉంగరంవ్రేలికి ధరించాలి. ఇది కన్య, మిథునరాసులవారికి
మిక్కిలి ప్రయోజనకరం.
5.
పుష్యరాగం. పసుపుపచ్చ బంగారువర్ణంలో వుంటుంది. గురుగ్రహానికి ప్రతీక మేధస్సును
పెంచుతుంది. ఆదర్శగుణాలను వృద్ధిచేస్తుంది. ఋణవిమోచనం గావిస్తుంది. శత్రులపై
విజయాన్నిస్తుంది. ఉద్రేకం, ఆందోళనలను తగ్గిస్తుంది. పుత్రసంతానం, వంశవృద్ధికి తోడ్పడుతుంది. శుద్ధికి ఉలవలు ఉడికించిననీరు, శనగలుఉడికించిననీరు ఉపయోగించాలి. శనగలలోవుంచి పూజించాలి. మంత్రం- ఓం
బృహస్పతయేనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలుత గురువారం బొటనవ్రేలికి ధరించాలి. ఇది
మీన, ధనుర్రాశి వారలకు మిక్కిలి శుభకరం.
6.
వజ్రం. తీర్చినకోణాలతో తెల్లగా స్వయంప్రకాశంతో మెరుస్తూవుంటూంది.
అన్నిటికంటే విలువైనది. శుక్రగ్రహానికి ప్రతీక. మేధస్సునుపెంచి స్వీయాభివృద్ధికి
తోడ్పడుతుంది. నూతనతేజస్సునిస్తుంది. కళాకరులకు రాణింపునిస్తుంది.
సంపదకలుగజేస్తుంది. సంసారజీవనం సాఫీగాసాగనిస్తుంది. సుఖాన్నిస్తుంది. స్త్రీలసుఖప్రసవాలకు
తోడ్పడుతుంది. కలరా, ప్లేగు వంటి వ్యాధులనరికడుతుంది. శుద్ధికి బొబ్బర్లు
(అలసందలు) ఉడికించిననీరు, బియ్యంకడిగిననీరు, ఆవుపాలు ఉపయోగించాలి. బొబ్బర్ల (అలసందలు) లోవుంచి పూజించాలి. మంత్రం- ఓం
శుక్రాయనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలుత శుక్రవారంనాడు మధ్యవ్రేలికి ధరించాలి.
వృషభరాశివారికిది అత్యంతశ్రేయస్కరం.
7.
నీలం. ఇది శనిగ్రహానికి ప్రతీక. ఇతరులఆలోచనలలోని మంచినిగ్రహించి
అమలుపరచగల సమర్థతనిస్తుంది. అపమృత్యువును అడ్డుకుంటుంది సంఘంలో గౌరవం, పలుకుబడి పెంచుతుంది. ధనలాభం కలిగిస్తుంది. శనిగ్రహదోషలను తొలగిస్తుంది. ఇందులో
ఇంద్రనీలం, మహానీలం, నీలమణి అని మూడు రకాలున్నాయి.
మొదటిది కాస్తానల్లగాను, రెండవది నీలిఆకురంగులోనూ, మూడవది నెమలికంఠంరంగులోనూ వుంటుంది. శుద్ధికి నల్లనువ్వులనూనె, నీలిచెట్టుఆకురసం, నల్లద్రాక్షరసం ఉపయోగించాలి.
నల్లనువ్వులోవుంచి పూజించాలి. మంత్రం- ఓం శం శనేశ్వరాయనమః. ఉంగరంలో పొదిగించుకొని
తొలుత శనివారం చూపుడువ్రేలికి ధరించాలి. కుంభ, మకరరాశులవారికిది
మిక్కిలి శుభకరం.
8.
గోమేదికం. సహజమైనగోమూత్రవర్ణంలో మెరుస్తూ వుంటుంది రాహుగ్రహానికిది ప్రతీక.
సంపాదించాలనేఉత్సాహానిస్తుంది. నష్టాలనురానివ్వదు. స్త్రీమూలంగాసహాయం
లభింపజేస్తుంది. వశీకరణ సిద్ధింపజేస్తుంది. ఆవేదనలను దరిచేరనివ్వదు. శుద్ధికి
మాదీఫలరసం, తేనె, గోమూత్రం ఉపయోగించాలి.
మంత్రం- ఓం ఐం హ్రీం రాహవేనమః. మినుములలోవుంచి పూజించాలి. ఉంగరంలో పొదిగించుకొని
తొలుత శనివారం చూపుడువ్రేలికి ధరించాలి. ఏరాశివారికైనా యిదిమంచిదే.
9.
వైడూర్యం. బూడిదరంగులో వుంటుంది. కేతుగ్రహానికిది ప్రతీక. దురాశనిది
దూరంచేస్తుంది. అమితంగాఆర్జించాలనే దురాశను తగ్గిస్తుంది. తమోగుణాన్నిది
అదుపులోపెడుతుంది. జ్ఞానం, మనోనిబ్బరాన్నిస్తుంది. సద్భావన, సజ్జనసాంగత్యం కలిగేట్లుచేస్తుంది. శుద్ధికి ఉలవలుఉడికించిననీరు, తేనె, పంచగవ్యాలు, పంచామృతాలు
ఉపయోగపడతాయి. ఉలవలలోవుంచి పూజించాలి. మంత్రం- ఓం ఐం హ్రీం కేతవేనమః. ఉంగరంలో
యీరత్నం పొదిగించుకొని తొలుత శనివారం చిటికెనవ్రేలికి ధరించాలి. ఏరాశివారికైనా
యిదిమంచిదే.
ఉంగరంలో
మొత్తం నవరత్నాలు పొదిగించుకోవడం కూడా చాలామంది చేస్తున్నారు. బంగారుతోచేయించుకొని
యీ నవరత్నఖచిత ఉంగరాలు ధరించవచ్చును. ఐతే రత్నాలన్నీ ఒకేసైజులోవుండాలి. కెంపు
(మాణిక్యం) అతిముఖ్యమైన సూర్యగ్రహప్రతీక గనుక మధ్యలోవుండితీరాలి. కెంపుకు తూర్పున
వజ్రం, పడమర నీలం, ఉత్తరాన వైడూర్యం,
దఖ్షిణాన పచ్చ, ఈశాన్యాన పగడం. ఆగ్నేయంలో
ముత్యం. నైరుతిన గోమేదికం. వాయువ్యమున పుష్యరాగం ఉండేటట్లు పొదిగించుకోవాలి.
బ్రాస్లైట్ లేక యితరనగలలోనైతే కెంపు మధ్యలో ఉండేట్లు చేయించుకోవాలి. దక్షిణాదివారు
హారంమధ్యలో నవరత్నాల దీర్ఘచతురస్రడాలర్ ఉండేట్లు ధరిస్తున్నారు. ఇందులో 12
వరుసల్లో నవరత్నాలు పొదిగించుకొనుచున్నారు. ప్రతివరుసమధ్యలో కెంపు వుండేట్లు
పొదిగించుకోవడం ముఖ్యం.
రత్నశాస్త్రం
తెలిసిన వారి సలహా మేరకే రత్నాలు కొనడం మంచిది. నకిలీరత్నాలను గుర్తించడం
సామాన్యులకు కష్టం. నకిలీరత్నాలు వాడటం శ్రేయస్కరంకాదు.
"యోగం"
అంటే కలయిక. ఇది భగవదైక్యాన్ని సూచిస్తుంది. నిష్కాములై యోగాభ్యాసం చేసేవారికి
ఇతరవస్తువులతో, వేరుప్రక్రియలతో పనిలేదు. భగద్శక్తి వారిలోనికి
కోరకనే ప్రసారమౌతూవుంటుంది. ఆశక్తి ముందు యితరశక్తులు నామమాత్రమే. ఇది మనందరం
జ్ఞాపకముంచుకోవలసిన ముఖ్య విషయం.
// ఓం తత్ సత్ //
No comments:
Post a Comment