బిల్వం(మారేడు)
హిందూమతంలో శివపూజకు బిల్వపత్రం అత్యంతముఖ్యమైనది. సంస్కృతంలో దీనిని శ్రీఫలం, మాలూర, శైలూష, అనే నామాలుకూడా వున్నాయి. బిల్వవృక్షాన్ని శివస్వరూపంగా భావిస్తారు. మరికొందరు శివుడు బిల్వవృక్షంక్రింద నివాసముంటాడంటారు. సర్వసామాన్యమైన మారేడు ఆకులు ఒకేకాడకు మూడుంటాయి. కుడిఆకున విష్ణువు ఎడమఆకున బ్రహ్మ నడిమిఆకున శివుడు వుంటాడంటారు. మరికొందరు యీఆకులు శివుని త్రిశూలానికి ప్రతీకగా భావిస్తారు. ఇంకొందరు శివుని త్రినేత్రములకు ప్రతీక అంటారు. ఆకు ముందుబాగంలో అమృతము వెనుకభాగంలో యక్షులు వుంటారని కొందరు నమ్ముతారు. శివపురాణంలో ఒక కథవున్నది. శని ఒకనాడు కైలాసంవెల్లి శివునిదర్శించి స్తుతించాడు. శివుడు ప్రసన్నుడైనాడు. అయినా శనిని పరీక్షింపనెంచి శివుడు నన్ను పట్టగలవా? అన్నాడు. శని, స్వామీ మీరే అడిగితే కాదంటానా? రేపు ఉదయమునుండి సాయంత్రందాక పట్టివుంచుతానన్నాదు. శివుడు తప్పించుకోదలచి మారేడువృక్షంలో ఇమొడిపోయాడు. సాయంత్రం చెట్టునుండి బయటకువచ్చి, శనీ! నన్ను పట్టలేకపోయావుగదా? అన్నాడు. లేదుశివా! నేనుపట్టబట్టే ఆదిదేవులైన తమరు దినమంతా దాక్కోవలసి వచ్చింది అన్నాడు శని. శివుడు వాస్తవం గ్రహించి, శనియొక్క కర్తవ్యనిర్వహణను మెచ్చుకొని దినమంతా నాలోవుండి నన్నుపట్టివుంచితివి గనుక నేటినుండి నీవు శనీశ్వర నామంతో వెలుగొందుతావని వరమిచ్చిపంపాడు. ఆదినమునుండి బిల్వపత్రములతో నన్ను పూజించినవారికి శనిగ్రహదోషం పీడించదని హరుడు లోకములకు అభయమిచ్చినాడు. మరొకకథలో హరుడు సతీవియోగముతో విరాగియై, బిల్వవృక్షముక్రింద తపముచేయుచుండెను. పార్వతీదేవి శివునిపై ప్రేమతో ప్రతిదినం శివపూజచేయుచుండెను. ఒకరోజు ఆమె శివపూజకు పూలు మరచి వచ్చెను. అప్పుడామె అందుబాటులోనున్న బిల్వపత్రములతో శివుడు మునిగిపోవునట్లుగా అర్చించెను. శివుడందుకు సంతోషించెను. శివుడు పార్వతిని వివాహమాడుటకు యిదికూడా ఒక కారణమాయెను.
లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వముద్భవమైనదని నమ్మువారున్నారు. అందుకే లక్ష్మిని “బిల్వనిలయ”అంటారు. బ్రహ్మవర్చస్సు పొందాలనుకున్నవారు, సూర్యుని అనుగ్రహంకొరకు చేసే కామ్యయాగంలో మారేడుకొయ్యను యూపస్తంభంగా నాటుతారు. అశ్వమేధయాగంలో కూడా ఆరు బిల్వయూపస్తంభాలు నాటడం పరిపాటి. బిల్వదళాలను సోమ మంగళవారాల్లోను, ఆరుద్రనక్షత్రంలోనూ, గ్రహణ సమయాల్లోనూ, సంధ్యాసమయాల్లోనూ, రాత్రులందూ, అశౌచదినాల్లోనూ, శివరాత్రి, సంక్రాంతి వంటి పర్వదినాల్లోనూ కోయకూడదు. కనుక ముందురోజే కోసివుంచుకొని పూజకుపయోగించాలి. కాస్తావాడిన దళలైనా పూజకు పనికివస్తాయి. మారేడుదళాలు గాలిని నీటిని పరిశుభ్రపరుస్తాయి. ఇంటి ఆవరణలో బిల్వవృక్షం ఈశాన్యంలోవుంటే ఆపదలు దరిచేరవు. ఐశ్వర్యం వృద్ధియగును. తూర్పునవుంటే సుఖప్రాప్తి. పడమరవుంటే పుత్రసంతానప్రాప్తి. దక్షినానవుంటే యమబాధలుండవు. బిల్వవృక్షమూలాన్ని గంధము పుష్పాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. వృక్షంచుట్టూ దీపాలువెలిగించి నమస్కరిస్తే శివజ్ఞానం కలుగుతుంది. మారేడునీడన ఒకరికి అన్నంపెడితే, కోటిజనానికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది. శివభక్తునికి బిల్వవృక్షం క్రింద క్షీరాన్నం ఘృతసహితంగా సమర్పిస్తే, జన్మజన్మాంతరాలలో అన్నానికి కొదువుండదు. బిల్వాష్టకం పేరుతో ఎనిమిది శ్లోకాలున్నాయి. అవి శివునకు చాలా ఇష్టమని నమ్మి పూజలో భాగంగా పఠిస్తారు. అలా ఒక వృక్షంపేర అష్టకం వుండటం ఒక బిల్వానికే చెల్లింది. వినాయకపూజలో ఉపయోగించే, 21 పత్రాలలో మొదటిది మాచిపత్రి రెండవది బిల్వపత్రమే, తర్వాతవరుసగా దుర్వాయుగ్మం, దత్తూర( ఉమ్మెత్త) పత్రము, బదరీపత్రం, అపామార్గపత్రం, తులసిపత్రం, చూత(మామిడి)పత్రం, కరవీర(గన్నేరు)పత్రం, విష్ణుకాంతపత్రం, దాడిమపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రి, సిందువారపత్రి, జాజిపత్రి, గండకీపత్రి, శమీపత్రి, ఆశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం, బృహతీపత్రం వుంటాయి.
బిల్వములలో ఆకుస్వరూపాన్నిబట్టి చాలారకాలే వున్నాయి. 1, 3, 4 6 ,7, ఇంకా అనేకదళాలుగలవిగా వుంటాయి.
6 నుండి 21 రేకుల బిల్వపత్రాలతో పూజిస్తే అన్నికార్యాలలో అఖండవిజయం లభిస్తుంది. అలాగే ఏకపత్రబిల్వం సర్వశ్రేష్టమనిభావిస్తారు. వ్యాపారాభివృద్ధికి గల్లాపెట్టెలో బిల్వపత్రముంచుకోవడం ఒక ఆనవాయితీ. అట్లేకొందరు జేబులోకూడా బిల్వపత్రం వేసుకొని బయటకు వెళతారు. ఇంట్లో బిల్వపత్రాలతో పూజచేస్తే వాస్తుదోషాలు తొలగిపోతాయి. త్రిదళం ఉమ్మెత్తపూలు కలిపిపూజచేస్తే చతుర్విధ(ధర్మ,అర్థ,కామ,మోక్ష)పురుషార్థాలు లభిస్తాయి. ఆధ్యాత్మవిధులు సామాన్యముగాదొరికే మారేడు మూడుదళాలు త్రిగుణాలకు(సత్వ,రజస్,తమో గుణాలకు)ప్రతీకగాను, పూజకుడు, పూజ్యము, పూజగానూ స్తోత్రము,స్తుత్యము,స్తుతిగానూ జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానముగానూ భావిస్తారు.అంతేగాక బిల్వోపనిషత్తు అనుపేరున ఒక ఉపనిషత్తేవున్నది. జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు, బిల్వవృక్షంక్రింద తపమాచరించి మోక్షం పొందుటచేత, జైనమతస్తులుకూడా బిల్వాన్ని శుభప్రదంగా భావిస్తారు.
మారేడు వెలగజాతివృక్షం. 8 నుండి 10 మీటర్లవరకు పెరుగు తుంది. ఆశియాదేశాలన్నింటిలో అన్నికాలాలలో యిది వృద్ధిచెందుతుంది. ఆకులు, పండ్లగుజ్జు సువాసన గలిగివుంటాయి. కాయ వెలగకాయవలెనే గట్టిగావుంటుంది. పువ్వులు చిన్నవిగా ఆకుపచ్చ తెలుపుకలసిన రంగులో వుంటాయి. ఆయుర్వేదవైద్యంలో యీచెట్టు సర్వాంగాలూ ఉపయోగపడతాయి. సగంమాగిన పండ్లరసం జిగటవిరేచనాలకు, నీళ్ళవిరేచనాలకు మందుగా ఉపయోగిస్తారు. ఆకురసం మధుమేహాన్ని హరిస్తుంది. మారేడువేళ్ళు ఔషదగుణంగల దశమూలాలాలలో (మారేడు,తుందిలం, గుమ్మడి, కలిగట్టు, నెల్లి, ముయ్యాకుపొన్న, కోలపొన్న,వాకుడు, పెద్దములక, పల్లేరు) ఒకటిగా పరిగణిస్తారు. మారేడుగుజ్జు, పాలు, పంచదారకలిపి వేసవిపానీయంగా తయారుచేసుకుంటారు. దీనివల్ల వేసవితాపం తగ్గడమేగాకుండా ప్రేవులను శుభ్రపరచి, శక్తినిస్తుంది. పండినపండు విరేచనకారి. సగంపండినఫలం విరేచనాలను నిలుపుతుంది. పండులోని గుజ్జును ఎండబెట్టి పొదిచేసికుడా వాడుకొనవచ్చును. ఇది మొలలకుకూడా బాగా పనికివచ్చేమందు. ఆకుకషాయం పైత్యగుణాలను నయంచేస్తుంది. కడుపులోని గ్యాసును బయటికి పంపుతుంది. ఆకులచిక్కటి కషాయం లో నువ్వులనూనెపోసి నూనెమిగిలేట్లు కాచుకొని మారేడుతైలం తయారుచేసుకోవచ్చు. ఈనూనె తలకు బాగామర్ధనచేసి తలస్నానంచేస్తే, జలుబు,తుమ్ములు తగ్గిపోతాయి. ఆకుకషాయం సేవించడంవల్ల రక్తం శుద్ధిగావించబడుతుంది. తద్వార చర్మరోగాలు నయమౌతాయి. అంతేగాక శరీరానికి కావలసిన ఖనిజాలు, విటమిన్B,C, క్యాల్సియం, భాస్వరం, ఇనుము , కెరోటిన్, కూడా లభించి, ఆరోగ్యం మెఱుగుపడుతుంది. హోమియోవైద్యంలో కూడా మారేడు ఆకులనుండి, పండ్లగుజ్జునుండి రెండురకాల( Aegle Folia, Aegle Marmelos)మందులు తయారౌతున్నాయి. ఇవి మధుమేహం (చెక్కెర వ్యాధి), జిగటవిరేచనాలు, మొలలు వంటి దీర్ఘరోగాలను నయంచేయడానికి వాడుతున్నారు.
బిల్వాష్టకమ్
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం
అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం
బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం
No comments:
Post a Comment